వాటర్‌ స్పోర్ట్‌.. కయాకింగ్‌.. | Yacht Club of Hyderabad at the Sanjeevaiah Park | Sakshi
Sakshi News home page

వాటర్‌ స్పోర్ట్‌.. కయాకింగ్‌..

Published Wed, Aug 28 2024 7:36 AM | Last Updated on Wed, Aug 28 2024 7:36 AM

Yacht Club of Hyderabad at the Sanjeevaiah Park

పర్యాటక క్రీడగా దేశంలో ప్రసిద్ధి

ఎంజాయ్‌ చేస్తున్న సాహస ప్రేమికులు

భాగ్యనగరంలోనూ పలుచోట్ల అందుబాటులోకి

జలక్రీడను ఆస్వాదిస్తున్న నగరవాసులు 

తక్కువ వెడల్పు కాస్త ఎక్కువ పొడవు ఉండే కయాక్‌ లేదా పడవను రెండు వైపుల ప్యాడ్స్‌ ఉన్న ఒక తెడ్డును ఉపయోగించి నీటిపై కదిలించడమే కయాకింగ్‌. సాధారణంగా ఈ పడవపై ఒకేసారి ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు కలిసి పడవను నడిపించడమే ఈ క్రీడలోని ప్రత్యేకత. ముఖ్యంగా ఇది పర్యాటక క్రీడగా దేశంలో గుర్తింపు పొందింది. సాహస ప్రేమికులు, అడ్వెంచర్‌ టూరిజాన్ని ఇష్టపడేవారు ఈ కయాకింగ్‌కు ఆకర్షితులవుతుంటారు. సరస్సులు లేదా పెద్ద చెరువుల్లో  వినోదించడానికి ఇదో చక్కని మార్గంగా చెప్పొచ్చు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ కయాకింగ్‌ అందుబాటులో ఉంది. దీంతో ఈ జలక్రీడను నగర వాసులు ఆస్వాదిస్తున్నారు.   

ఇది చాలా కాలంగా నీటి క్రీడగా ఉంటూ వస్తున్నప్పటికీ గత దశాబ్ద కాలంగా ప్రధాన పర్యాటక క్రీడగా కూడా దేశంలో ప్రసిద్ధి చెందింది. సాహస ప్రేమికులైన పర్యాటకుల్లో చాలా మంది ఈ కయాకింగ్‌ను అనేక సార్లు ఎంజాయ్‌ చేసి ఉంటారు. అయితే నిన్నా మొన్నటి వరకూ దేశంలోనే ప్రధాన పర్యాటక ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాత్రమే వారికి ఈ అవకాశం దక్కేది. ఇటీవల నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా కొన్ని çచోట్ల కయాకింగ్‌ అందుబాటులోకి వచి్చంది. ఆయా చోట్ల ఇప్పటికే నగరవాసులు ఈ జలక్రీడను ఆస్వాదిస్తున్నారు.

కోట్‌పల్లి అటవీ ప్రాంతంలో..
తెడ్డు చేతపట్టి జలాశయంలో నీటిని వెనక్కి నెట్టుకుంటూ ముందుకు సాగిపోతుంటే.. కయాకింగ్స్‌ ఈ అనుభూతి పొందాలంటే మాత్రం వికారాబాద్‌ జిల్లా కోట్‌పల్లి ప్రాజెక్టుకు పోవాల్సిందే. అటవీ ప్రాంతం మధ్యలో కనుచూపు మేరలో నీటి అలలపై తేలియాడే పడవలు కనువిందు చేస్తాయి. నిత్యం 300 నుంచి 400 మంది పర్యాటకులు ఇక్కడ బోటింగ్‌ చేస్తుంటారు. వారాంతాలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. గత పదేళ్లుగా ఇక్కడ బోటింగ్‌ కార్యకలాపాలు నడిపిస్తున్నారు. సుమారు 20 మంది లైఫ్‌ గార్డ్స్‌ అందుబాటులో ఉంటారు. లైఫ్‌ జాకెట్స్, ఇతర ప్రమాణాలు పాటిస్తుంటారు. ఒక్కరు ప్రయాణించే బోటుకు గంటకు రూ.250 ఫీజు వసూలు చేస్తారు. ఇద్దరు ప్రయాణించే బోటుకు రూ.400 వరకూ వసూలు చేస్తారు. ఈ రిజర్వాయర్‌ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ తెరిచి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ బుకింగ్‌ చేసుకోవడానికి వివరాలు అందుబాటులో ఉంటాయి. వికారాబాద్‌ పర్యాటక రంగంలో కోట్‌పల్లి బోటింగ్‌ పాత్ర కీలకమనే చెప్పాలి.  

ప్రయాణం ఇలా..
నగరం నుంచి సుమారు 80 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి వికారాబాద్, తాండూరుకు ఆర్టీసీ బస్సు సరీ్వసులు ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి నుంచి రైలు సదుపాయం కూడా ఉంది. సొంత వాహనాల్లో వచ్చేవారు హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారి చేవెళ్ల మీదుగా రావచ్చు. దీంతోపాటు శంకర్‌పల్లి మీదుగానూ రావచ్చు. ఇక్కడకు వచ్చే వారు అనంతగిరి కొండల్లో కొలువైన శ్రీ అనంత పధ్మనాభస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతగిరుల అందాలను ఆస్వాదిస్తారు.

నగరంలోనూ పలు చోట్ల.. 
ఈ వాటర్‌ స్పోర్ట్స్‌కు సంబంధించి నగరంలోని దుర్గం చెరువు కేంద్ర బింధువుగా మారింది. ఇక్కడ సూర్యాస్తమయ సమయాల్లో హుషారుగా సాగే కయాకింగ్‌ ఈవెంట్‌లో ఔత్సాహికులు పాల్గొనవచ్చు. పడవలను తిప్పుతూ సరదాగా కాసేపు గడపాలనుకునే వారికి రూ.700 రుసుముతో ఆ అవకాశం అందుబాటులో ఉంది. అలా కాకుండా ప్రొఫెషన్‌గా తీసుకుని సీరియస్‌గా కయాకింగ్‌ నేర్చుకోవాలనుకుంటే కూడా ఇక్కడి వాటర్‌ స్కూల్‌లో ప్రత్యేక కోర్సు అందుబాటులో ఉంది. ఒక్క సోమవారం మినహా వారంలోని అన్ని రోజుల్లో ఈ క్రీడ అందుబాటులో ఉంటుంది.

మరిన్ని ప్రాంతాల్లో...  
అదే విధంగా నగరంలోని హుస్సేన్‌ సాగర్‌ దగ్గర ఉన్న యాచ్‌ క్లబ్‌ కూడా కయాకింగ్‌ ప్రియుల కోసం పడవలను అందుబాటులో ఉంచుతోంది.  

లక్నవరం సరస్సులో కాయక్‌ని అద్దెకు తీసుకుని, చుట్టూ నిర్మలమైన కొండలు ఉన్న సరస్సులో విహరించే అవకాశం ఉంది. అక్కడ కొన్ని క్యాంపింగ్‌ గ్రూపులు, స్థానికులు గంటల ప్రాతిపదికన కయాక్‌లను అద్దెకు ఇస్తారు. సాధారణంగా ఉదయం వేళలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

కయాకింగ్‌కు ఆదరణ పెరిగింది.. 
నాకు అడ్వెంచర్స్‌ అంటే చాలా ఇష్టం. గత 30 ఏళ్లుగా ట్రెక్కింగ్, బోటింగ్‌ చేస్తున్నాను. మన దగ్గర ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే ఎక్కువగా సినిమాల వరకే ఉంటాయి. అయితే ఎంతో మంచి వినోదాన్ని అందించే పర్యావరణ వింతలు, ట్రెక్కింగ్, బోటింగ్‌ వంటివి చాలా ఉన్నాయి. వీటిని ప్రోత్సహించేందుకు ప్రొగ్రసివ్‌ తెలంగాణ సొసైటీ ఆధ్వర్యంలో కోట్‌పల్లిలో బోటింగ్‌ ఏర్పాటు చేశాం. దీని కోసం నా సొంత ఖర్చుతో బోట్లను కొనుగోలు చేసి ఇచ్చాను. దీని ద్వారా ఇప్పుడు కొంత మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించాయి. అంతే కాకుండా పరోక్షంగా వందలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఇప్పుడు ఇక్కడకు నిత్యం వేలాది మంది బోటింగ్‌కు వస్తున్నారు.  
– విశ్వేశ్వరరెడ్డి, చేవెళ్ల బీజేపీ ఎంపీ

ఆరోగ్యలాభాలెన్నో.. 
కయాకింగ్‌ వల్ల అనేక రకాల ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రీడ మజిల్‌ స్ట్రెంగ్త్‌ పెంచుతుంది. ముఖ్యంగా అప్పర్‌ బ్యాక్, చేతులు, భుజాలు, ఛాతీ భాగంలో కండరాలు బలోపేతం అవుతాయి. ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుస్తుంది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement