fine arts
-
ఫైన్ టూ షైన్..
ఫైన్ ఆర్ట్స్ కోర్సులు చదివితే ఉపాధి ఉంటుందో లేదోనన్న అనుమానాలు గతంలో చాలామందికి ఉండేవి. అయితే హైదరాబాద్‌లోని జవహర్లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఏటా ప్రవేశాల కోసం వచ్చే దరఖాస్తులు చూస్తుంటే ఈ కోర్సులకు ఉన్న డిమాండ్ అర్థం అవుతుంది. ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్‌లో కోర్సు చేసి, బయటకు వస్తే మంచి గుర్తింపు, గౌరవంతో పాటు ఉపాధి కూడా ఉంటుందని అనేక మంది విద్యార్థులు నిరూపిస్తున్నారు. కల్చరల్ ఎంట్రప్రెన్యూర్షిప్లో భాగంగా ఫైన్ ఆర్ట్స్ చేసిన విద్యార్థులు కలిసి చిన్నపాటి వ్యాపారం ప్రారంభిస్తున్నారు. ఇలాంటి వారికి పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. పైగా, చాలా పాఠశాలల్లో చిన్నప్పటి నుంచే చదువుతో పాటు పిల్లలకు ఫైన్ ఆర్ట్స్ నేరి్పంచేందుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైన్ ఆర్ట్స్ చేసిన వారిని టీచర్లుగా నియమించుకుంటున్నారు. దీంతో పిల్లల్లో సృజనాత్మకత పెంపొందడంతో పాటు మానసిక ఎదుగుదల కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.మారిన నగరవాసి అభిరుచి..మారుతున్న కాలానికి అనుగుణంగా సగటు నగరవాసి అభిరుచి కూడా మారుతోంది. దీంతో ఇంటి ఆవరణతో పాటు ఇంట్లో ప్రతి మూలనూ వినూత్నంగా, ఆహ్లాదకరంగా మలుచుకోవాలని చూస్తున్నారు. అందుకోసం అందమైన పెయింటింగ్స్, మంచి ఫొటోలతో పాటు చిన్నపాటి శిల్పాలను ఇంట్లో అలంకరణకు పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఫైన్ ఆర్ట్స్ వ్యాపారం నగరంలో అభివృద్ధి చెందుతోంది. కళలకు కాస్త టెక్నాలజీని జోడించి ముందుకు వెళ్తే ఈ రంగంలో ఎంతో ఎత్తుకు ఎదగొచ్చని పేర్కొంటున్నారు.కూడళ్ల వద్ద ఆకర్షణగా..భాగ్యనగరంతో పాటు రాష్ట్రంలోని పలు నగరాల్లోని కూడళ్ల వద్ద ఆకర్షణీయంగా ఉండేలా శిల్పాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నగరంలోని అనేక కూడళ్ల వద్ద ఆలోచింపజేసేలా శిల్పాలను రూపొందించారు. కేవలం శిలలతోనే కాకుండా వివిధ రకాల వ్యర్థాలతో వాటిని రూపొందించి పర్యావరణహితాన్ని సమాజానికి చాటుతున్నారు. జేఎన్ఏఎఫ్టీయూకు చెందిన పలువురు నగరాన్ని అందంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. శిల్పకారుడు బుద్ధి సంతో‹Ù, స్ట్రీట్ ఆర్టిస్ట్ కిరీట్ రాజ్, స్ట్రీట్ ఆరి్టస్ట్ రెహమాన్, మురళి, మహేశ్ తదితరులు కలిసి నగరానికి కొత్త సొబగులు దిద్దేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రారంభించిన నగర సుందరీకరణ కార్యక్రమాల్లో వీరు అనేకసార్లు భాగస్వాములయ్యారు.ప్రయోగాలు చేయడం ఇష్టం.. చిన్నప్పుడు డ్రాయింగ్స్, స్కెచ్‌లు వేస్తుండేవాడిని. ఇంటర్ తర్వాత జేఎన్ఏఎఫ్టీయూలో డిగ్రీ పూర్తి చేశాను. ఇక్కడికి వచ్చాక స్కల్ప్చరింగ్పై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాను. కొత్తకొత్త మెటీరియల్స్‌తో శిల్పాలు చేయాలని కోరికగా ఉండేది. అందుకే రాళ్లతో పాటు ఈ–వేస్ట్, జాలీలు, పేపర్ గుజ్జు, రాళ్లు, నట్స్, బోల్ట్స్ వంటి వాటితో అనేక శిల్పాలను రూపొందించేవాడిని. లక్డీకాపూల్‌లోని నిరంకారి భవన్ వద్ద ఏర్పాటు చేసిన పుస్తక శిల్పం, బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్ వద్ద ఏర్పాటు చేసిన శిల్పం, వరంగల్‌లోని ములుగురోడ్డు వద్ద ఏర్పాటు చేసిన గుర్రం శిల్పం, జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన పాలపిట్ట విగ్రహం నేను తయారు చేసినవే. చాలా మంది తమ ఇళ్లల్లో పెట్టుకునేందుకు అడిగి మరీ.. వారికి కావాల్సిన విధంగా తయారు చేయించుకుంటారు. – బుద్ధి సంతోష్ కుమార్, శిల్పకారుడునాన్నే నాకు స్ఫూర్తి.. మా నాన్న లారీ బాడీలు తయారు చేస్తుంటారు. ఆ ట్రక్కులపై పెయింటర్స్ వేసే పెయింటింగ్స్ చూస్తూ పెరిగాను. అప్పటి నుంచి వాటిని గీసేందుకు ప్రయత్నించేవాడిని ఆ క్రమంలోనే పెయింటింగ్స్‌పై ఆసక్తి పెరిగింది. అయితే నా స్కిల్స్‌ను మరింత పెంచుకునేందుకు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలోచేరాను. ఆయిల్, ఆక్రెలిక్, వాటర్ కలర్స్, భిన్నమైన పెన్సిల్స్‌తో స్కెచ్‌లు వేయడం నేర్చుకున్నాను. పెయింటింగ్‌లో నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం నా లక్ష్యం. – అబ్దుల్ రెహమాన్, స్ట్రీట్ ఆర్టిస్ట్ఆర్ట్ డైరెక్టర్‌గా చేస్తున్నా.. చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం ఇష్టంగా ఉండేది. మా అన్నయ్య ఫణితేజ బొమ్మలను చూసి నేర్చకునేవాడిని. అదే ఇష్టంతో పెయింటింగ్‌లో బీఎఫ్ఏ, ఎంఎఫ్ఏ పూర్తి చేశాను. ఈ కోర్సుల ద్వారా ఆర్ట్‌లో నైపుణ్యం నేర్చుకున్నాను. ఆర్ట్ హిస్టరీలో పట్టు సాధించాను. ఆర్ట్ షోలు, గ్యాలరీల్లో పనిచేశాను. ఫైన్ ఆర్ట్స్‌లో వచి్చన అనుభవంతో సినిమా రంగంలో అడుగుపెట్టాను. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. – కిరీటి రాజ్ మూసి, ఆర్టిస్ట్. -
కుంచె గీసిన చిత్రం..
నగరంలోని పలు కూడళ్లు రంగులద్దుకుంటున్నాయి. విభిన్న కళాకృతులతో ఫ్లై ఓవర్ పిల్లర్లు, అండర్ పాస్ గోడలు కలర్ ఫుల్ పెయింటింగ్స్‌తో కళకళలాడుతున్నాయి. ఒక్కో సెంటర్‌కు ఒక్కో రకమైన థీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గత రెండు నెలలుగా కళాకారులు తమ ప్రతిభతో ఎంతో అందమైన కళాఖండాలను తీర్చిదిద్దుతున్నారు. ఆ దారిన పోయే ప్రయాణికులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణం, ఆరోగ్యం, నగర, గ్రామీణ ప్రజల జీవన శైలి, జంతువులు, పక్షులు, క్రీడలు ఇలా విభిన్న రంగాలకు చెందిన చిత్రాలు నడయాడినట్లు దర్శనమిస్తున్నాయి. ఇందులో కళాకారులతో పాటు, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు సైతం పాలుపంచుకుంటున్నారు. ఎల్బీనగర్ నుంచి లింగంపల్లి వరకూ.. మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ వరకూ.. హైటెక్ సిటీ నుంచి ఉప్పల్ సచివాలయం వరకూ.. ఇలా ఎటు చూసినా వంతెనల పిల్లలర్ల మీద, వంతెనల గోడలపైనా ఇటీవల కాలంలో కొత్త సొబగులద్దుకుంటున్నాయి. రేవంత్ సర్కార్ వచ్చిన తరువాత వాల్ పెయింటింగ్స్‌తో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కార్యాచరణలోకి దిగారు. ప్రతి ఫ్లై ఓవర్ వంతెన, అండర్ పాస్ గోడలు, పిల్లర్లకు అందమైన ఆకృతుల్లో చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. ఒక్కో సెంటర్లో ఒక్కో రకమైన థీమ్‌తో చిత్రాలు వేస్తున్నారు. ఎల్బీ నగర్ కూడలిలో వంతెన పిల్లర్లకు ఓ వైపు సంప్రదాయ నృత్యాలు, మైరో వైపు పాప్ డ్యాన్సర్స్ చిత్రాలు తీర్చిదిద్దారు. ఫ్లెక్సీ ప్రింటింగ్‌తో ముప్పు..ఒకప్పుడు ఆర్టిస్టులకు చేతినిండా పని ఉండేది. దీంతో బ్యానర్లపై రాతలు రాయడం, గోడలపై చిత్రాలు వేయడం, రాజకీయ, సినీ ప్రముఖుల కటౌట్లను సిద్ధం చేయడం, వివిధ సందర్భాల్లో ఆరి్టస్టులకు చేతినిండా పని దొరికేది. దీంతో గతంలో ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే ఆలోచన ఎక్కువ మందిలో కనిపించేది. అయితే ఇటీవలి కాలంలో మార్కెట్లోకి డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ అందుబాటులోకి రావడంతో తక్కువ ఖర్చు, వేగంగా పని పూర్తవుతుండడంతో పలువురు దీనిపై మక్కువ చూపుతున్నారు. దీంతో పెయింటింగ్ ఆరి్టస్టులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని పలువురు కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం, ఉపాధి మార్గాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాపోతున్నారు.36 ఏళ్లుగా ఇదే వృత్తి..1988లో ఆరి్టస్టుగా ప్రయాణం మొదలు పెట్టాను. ప్రభుత్వం వాల్ పెయింటింగ్స్‌కు అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. కళాకారులకు పని దొరుకుతుంది. రోజుకు రూ.2 వేలు ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఏ రకమైన పెయింటింగ్స్ వేయాలని సూచిస్తే వాటినే చిత్రిస్తున్నాం. ఈ పని ఎన్నాళ్లు ఉంటుందో తెలీదు. పదేళ్ల క్రితం వరకూ చేతినిండా పని ఉండేది. ఫ్లెక్సీ ప్రింటింగ్ వచ్చిన తరువాత నెలలో కొన్ని రోజులు పనిలేక ఖాళీగా ఉండాల్సి వస్తోంది. – అశోక్, కళాకారుడు, హయత్నగర్ఆరు నెలలు పని కలి్పంచాలి.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పని కల్పించినట్లు సంవత్సరంలో కళాకారులకు కనీసం ఆరు నెలలు పనికల్పించే విధంగా చట్టం చేయాలి. ఒకప్పుడు ఫైన్ ఆర్ట్స్ అంటే సమాజంలో డిమాండ్ ఉండేది. ఫ్లెక్సీలు వచ్చాక క్రమంగా పని తగ్గుతోంది. పదో తరగతి చదివి ఆరి్టస్టుగా స్థిరపడ్డాను. ఇప్పుడు నెలలో 20 రోజులు పని ఉంటే పది రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వమే కళాకారులను ఆదుకుని జీవనోపాధి చూపించాలి. – సత్యం, కళాకారుడు, హయత్‌నగర్ -
కలాపోసన
‘ఆ.. మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాలయ్యా! ఉత్తికే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది?’– ‘ముత్యాలముగ్గు’ సినిమాలో కాంట్రాక్టరు పాత్రధారి రావు గోపాలరావు పలికిన అమృతవాక్కులివి. ముళ్లపూడి వెంకటరమణ కలం నుంచి తూటాల్లా వెలువడిన మాటలివి. తెలుగునాట అమిత జనాదరణ పొందిన పది సినిమా డైలాగుల జాబితాను ఎవరైనా రూపొందిస్తే, ఈ డైలాగుకు అందులో తప్పకుండా చోటు దక్కి తీరుతుంది. నిజమే! ఊరకే తిని తొంగున్నట్లయితే, మనిషికీ గొడ్డుకూ ఏమాత్రం తేడా ఉండదు. గొడ్డుకు లేని బుద్ధి మనిషికి ఉంది. మనిషిని ఇతర జంతుతతి నుంచి వేరు చేసేది ఆలోచనా శక్తి మాత్రమే! ఆలోచనకు పదునుపెట్టే సాధనం సృజనాత్మకత. మనిషిలోని సృజనాత్మకతకు ఫలితాలే కళలు.కొందరికి జన్మతః కళాభినివేశం ఉంటుంది. అలాంటివారు సునాయాసంగా కళలను కైవసం చేసుకోగలుగుతారు. ఇంకొందరు అభిరుచితో సాధన చేసి కళల్లో రాణిస్తారు. అభినివేశం, సాధన లేకున్నా, చాలామంది కళలను ఆస్వాదిస్తారు. కలిగిన ఆసాములు కళలను ఆదరిస్తారు. కళలు అరవై నాలుగు అని వాత్సా్యయనుడు చెప్పాడు. వీటిలో చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, నృత్యం, కవిత్వం అనే అయిదు కళలూ లలితకళలుగా గుర్తింపు పొందాయి.లలితకళలు మనుషుల భావోద్వేగాల అభివ్యక్తికి అందమైన సాధనాలు. మనుషులు తమ ఆలోచనలను, ఆనంద విషాదాది భావోద్వేగాలను; తమ కాల్పనిక ఊహాజగత్తులోని విశేషాలను, తమ సృజనాత్మకతను ఇతరులతో పంచుకోవడానికి కళలను ప్రదర్శిస్తారు. పురాతన నాగరికతలు ఊపిరి పోసుకోక మునుపటి నుంచే మనుషులు కళల ద్వారా తమ ఉద్వేగాలను చాటుకోవడం మొదలుపెట్టారు. మాటలాడటం ఇంకా నేర్చుకోని ఆనాటి మానవులు బొమ్మల ద్వారా తమ ఆలోచనలను వెల్లడించేవారు. పాతరాతి యుగం మానవులు రాతిగుహల గోడల మీద చిత్రించిన చిత్రాలే ఇందుకు ఆనవాళ్లు. నాగరికతలు మొదలైన నాటి నుంచి నేటి వరకు కళలకు– ముఖ్యంగా లలితకళలకు జనాదరణ ఉంది. కళలు ఏవైనా సరే, వాటి ప్రయోజనం ఒక్కటే – ఆత్మప్రక్షాళన. ‘దైనందిన జీవితంలో మన ఆత్మలపై పేరుకున్న ధూళిని శుభ్రం చేయడమే కళ ప్రయోజనం’ అంటాడు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో. కళలు భావోద్వేగాల ప్రసారమాధ్యమాలు మాత్రమే కాదు, ఆత్మప్రక్షాళనకు ఉపకరించే సాధనాలు కూడా! కళలు మనుషుల జీవితాలను సౌందర్యభరితం చేస్తాయి. కళలు విలువలు నేర్పుతాయి. దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లతో అలజడికి గురైన మనసుకు సాంత్వన నిస్తాయి. కళలు జీవితాన్ని చైతన్యవంతం చేస్తాయి. ఇంతేకాదు, కళలు సామాజిక అన్యాయాలను ఎత్తి చూపుతాయి. ఆలోచన రేకెత్తిస్తాయి. ఆత్మవిమర్శ దిశగా మనుషులను ప్రేరేపి స్తాయి. కళలు సమాజాన్ని మరింత నాగరికంగా, ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. సమాజంలోని రకరకాల సంస్కృతులకు చెందిన సమూహాల గుండెచప్పుడును వినిపిస్తాయి. కళలు సామాజిక మార్పులకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి.‘కళ చాలా విశాలమైనది. మనుషుల తెలివి చాలా ఇరుకైనది’ అంటాడు ఇంగ్లిష్ కవి అలెగ్జాండర్ పోప్. ప్రపంచం తీరుతెన్నులను చూస్తుంటే, ఆయన మాట నిజమేననిపిస్తుంది. సామాజిక మార్పులకు ఉత్ప్రేరకాలుగా పనికొచ్చే లక్షణం కళలకు ఎంతో కొంత ఉన్నమాట వాస్తవమే అయినా, ప్రపంచవ్యాప్తంగా కళాకారులు అసంఖ్యాకంగా కళాసృజన కొనసాగిస్తూ వస్తున్నా, ఈ ప్రపంచం మారాల్సిన పద్ధతిలో ఇంకా మారలేదు. మనుషుల కురచ బుద్ధులు కూడా మారలేదు. బహుశా, జనాభాలోని అత్యధికులు కళలను ఒంటబట్టించుకోకపోవడమే ఇందుకు కారణం కావచ్చు. కళలకు ఆదరణలేని దేశాలు నిరంతరం అలజడులు, అశాంతితో అలమటించే పరిస్థితులను చూస్తూనే ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ నాయకులు సంగీత ప్రదర్శనలపై నిషేధాజ్ఞలు విధించారు. అక్కడి పరిస్థితులు మనకు తెలియనివి కావు. చిత్రకళా ప్రదర్శనలపై నానా రకాల ఆంక్షలు ఉన్న ఉత్తర కొరియా పరిస్థితులు కూడా మనకు తెలిసినవే! స్వేచ్ఛ లేనిచోట కళలకు ఊపిరాడదు. ఇక స్వేచ్ఛే ఊపిరిగా బతికే కళాకారుల పరిస్థితి ఆంక్షలున్న చోట ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. నియంతృత్వ దేశాల్లో మాత్రమే కాదు, ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకుంటున్న చాలా దేశాల్లోనూ కళాకారులు పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తున్న పరిస్థితులు లేవు.కళలన్నీ కళాకారుల ఆత్మావిష్కరణలే! అందుకే, ‘అన్ని కళలూ కళాకారుల ఆత్మకథలే! ముత్యం ఆల్చిప్ప ఆత్మకథ’ అంటాడు ఇటాలియన్ దర్శకుడు ఫెడెరికో ఫెలినీ. ఆంక్షలు లేనిచోట మాత్రమే కళాకారుల ఆత్మావిష్కరణకు అవకాశాలు అపరిమితంగా ఉంటాయి. కాల ప్రవాహంలో ప్రపంచంలోని మిగిలిన మార్పులతో పాటే కళలు కూడా మారుతూ వస్తున్నాయి. కళల్లో ప్రాచీన కళ, ఆధునిక కళ అనేవి కాలానికి సంబంధించిన కొండగుర్తులు మాత్రమే! కళల అస్తిత్వం నిరంతరం.స్వేచ్ఛలేని పరిస్థితుల వల్ల కొన్నిచోట్ల, ఆధునిక జీవనశైలిలోని తీరిక దొరకని పరిస్థితుల వల్ల కొన్నిచోట్ల మనుషులు కళలకు దూరమవుతున్నారు. దొరికే కొద్దిపాటి తీరిక సమయాన్ని టీవీ, స్మార్ట్‌ఫోన్ వంటివి అందించే యాంత్రిక వినోదంతో సరిపెట్టుకుంటున్నారు. ఫలితంగా మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే, కళాస్వాదన, కళా సాధనల వల్ల మనుషుల్లో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇటీవల బ్రిటిష్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. మరందుకే మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాల! లేకపోతే బతుకులు గొడ్డుదేరిపోవూ! -
Sanket Jadia: సంకేత చిత్రం
‘నరజాతి చరిత్ర సమస్తం – రణరక్త ప్రవాహసిక్తం’ అంటూ నిట్టూర్పుకే పరిమితం కాలేదు ఈ యంగ్ ఆర్టిస్ట్. చరిత్రలోని రణరంగాలను కాగడా పెట్టి వెదికాడు. సంక్లిష్టమైన చారిత్రక సందర్భాలను తన చిత్రాల్లోకి తర్జుమా చేశాడు సంకేత్ జాడియ.... సంకేత్ జాడియ తల్లి బొమ్మలు గీసేది. ఆమెకు ఆ విద్య ఎవరు నేర్పించారో తెలియదుగానీ ‘అద్భుతం’ అనిపించేలా గీసేది. అలా బొమ్మలపై చిన్నప్పటి నుంచే సంకేత్‌కు అభిమానం ఏర్పడింది. అమ్మ చనిపోయింది. అయితే సంకేత్ బొమ్మలు వేస్తున్నప్పుడు ఆమె లేని లోటు కనిపించదు. పక్కన కూర్చొని సలహాలు చెబుతున్నట్లుగానే ఉంటుంది. అందుకే తనకు బొమ్మలు వేయడం అంటే ఇష్టం. అమ్మ తనతో పాటు ఉంటుంది కదా! ‘పెద్దయ్యాక ఆర్టిస్ట్ కావాలి’ అని చిన్నప్పుడే బలంగా అనుకున్నాడు సంకేత్. పెద్దయ్యాక...కుమారుడి ఛాయిస్ ఆఫ్ కెరీర్ తండ్రికి నచ్చలేదు. అలా అని అడ్డుకోలేదు. ఒక ఆర్టిస్ట్ సక్సెస్‌ను ఏ ప్రమాణాలతో చూడాలనే విషయంలో గందరగోళ పడే ఎంతోమందిలో అతను కూడా ఒకరు. సూరత్‌లోని ‘సౌత్ గుజరాత్ యూనివర్శిటీ’లో ఫైన్ ఆర్ట్స్ చదువుకున్నాడు సంకేత్. దిల్లీ అంబేడ్కర్ యూనివర్శిటీలో విజువల్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తయిన రోజుల్లో ఒక సంచలన ఘటన జరిగింది. ఫ్రెంచ్ సెటైరికల్ న్యూస్‌పేపర్ ‘చార్లీ హెబ్డో’పై దాడి జరిగింది. పన్నెండు మందిని చంపేశారు. ఇది తనను బాగా కదిలించింది. ‘ఎందుకు ఇలా?’ అని తీవ్రంగా ఆలోచించేలా చేసింది. ఆర్టిస్ట్‌లకు ఉన్న అదృష్టం ఏమిటంటే గుండె బరువును తమ సృజనాత్మక రూపాల ద్వారా దించుకోవచ్చు. సంకేత్ అదే చేశాడు. ‘చరిత్ర అనేది కథల్లో కాదు చిత్రాల్లో కనిపించాలి’ అనే ప్రసిద్ధ మాట తనకు ఇష్టం. అందుకే చిత్రం కోసం చరిత్రను ఇష్టపడ్డాడు. హింస మూలాల్లోకి వెళ్లాడు. స్వాతంత్య్రానంతర భారత్‌లోని హింసాత్మకమైన చారిత్రక ఘటనలకు తన కుంచెతో రూపు ఇవ్వాలనుకున్నాడు. నెరటీవ్స్, కౌంటర్ నెరటీవ్స్పై ఆసక్తి పెంచుకొని, చరిత్రకు సంబంధించిన సంక్లిష్టమైన సందర్భాలను చిత్రాల్లోకి ఎలా అనువాదం చేయాలనే విషయంలో రకరకాల కసరత్తులు చేసి సక్సెస్ అయ్యాడు. తనదైన నిర్మాణాన్ని సృష్టించుకున్నాడు. ఖాళీ బుర్రతో చూస్తే సంకేత్ చిత్రాలు అర్థం కాకపోవచ్చు. సమాజ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలను నిశితంగా గమనించేవారికి మాత్రం అవి సులభంగా అర్థం అవుతాయి. లోతైన ఆలోచన చేసేలా చేస్తాయి. ‘లోతైన భావాల సమ్మేళనం సంకేత్ చిత్రాలు. కనిపించని రాజకీయాలు కూడా అందులో కనిపిస్తాయి’ అంటాడు ముంబైలోని ఛటర్జీ అండ్ లాల్ ఆర్ట్స్ గ్యాలరీ కో–ఫౌండర్ ఛటర్జీ. ఏ ఫ్యూచర్ అండర్ కన్స్ట్రక్షన్, ది ఆర్ట్ డికేడ్, ఇండియన్ సమ్మర్ ఫెస్టివల్... మొదలైన గ్రూప్ షోలలో సంకేత్ చిత్రాలకు మంచి పేరు వచ్చింది. శిల్పాల రూపకల్పనలోనూ తనదైన ప్రతిభ చూపుతున్న సంకేత్ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించాడు. ఒకప్పుడు జీవిక కోసం గ్రాఫిక్ డిజైనర్, ఆర్ట్ టీచర్‌గా పనిచేసిన సంకేత్‌కు ఇప్పుడు ఆర్టే జీవితం. ఆనందం. సమస్తం. -
కల కళలాడే.. కెరీర్
ఊహలకందని భావాలను ఆవిష్కరించే నైపుణ్యం.. ఎల్లలు లేని సృజనాత్మకత, కళలపై ఆసక్తి ఉన్నవారు చదవదగ్గ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. యోగివేమన విశ్వవిద్యాలయంలోఈ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తు, ఆప్షన్స్ ఇచ్చేందుకు ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉందని, ఆసక్తి గల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని లలితకళల విభాగం అధ్యాపకులు కోరుతున్నారు. వైవీయూ(కడప): చిత్రలేఖనంలో రాణించాలనుకునే వారికి యోగివేమన విశ్వవిద్యాలయంలోని ఫైన్ఆర్ట్స్ విభాగం వేదికగా నిలుస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలతో పాటు అభిరుచులకు ప్రాధాన్యత ఇస్తూ పెద్దపెద్ద నగరాలకే పరిమితమైన బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్ (బీఎఫ్ఏ) యోగివేమన విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉండటం ఇక్కడి కళాకారులకు ఊతమిస్తోంది. ఆసక్తి, అభిరుచి కలిగిన విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు గడువు ఈనెల 31వ తేదీ వరకు ఉండటంతో విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధ్యాపకులు కోరుతున్నారు. 2010లో యోగివేమన విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన ఈ కోర్సులో ఎందరో విద్యార్థులు చేరడంతో పాటు, కోర్సు పూర్తి చేసుకున్నవారంతా తమ అభిరుచికి తగ్గ రంగాల్లో స్థిరపడటం విశేషం. కోర్సు ద్వారా లభించే అవకాశాలు.. ఈ కోర్సులు చేయడం ద్వారా యానిమేషన్, ఫ్యాషన్, జ్యువెలరీ డిజైనింగ్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా అడ్వర్టయిజింగ్‌కు ఉన్న డిమాండ్‌ను బట్టి ఆయా ఏజన్సీల్లో సైతం ఉపాధి పొందవచ్చు. ఇంటీరియర్ డిజైనింగ్, ఫర్నిచర్ డిజైనింగ్, పిల్లల బొమ్మల తయారీ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. కార్పొరేట్ స్కూల్స్, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా, ప్రొఫెషనల్ ఆర్టిస్టుల్లా రాణించే అవకాశం ఉంది. అర్హతలు.. ప్రవేశం కోర్సు కాల వ్యవధి నాలుగు సంవత్సరాలు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. 90 శాతం ప్రాక్టికల్స్‌తో కూడిన కోర్సు. ఎటువంటి ఒత్తిడిలేని వాతావరణంలో విద్యను సాగించే వీలున్న కోర్సు. ప్రవేశాల కోసం ఎస్సీహెచ్ఈఏపీ.జీఓవి.ఇన్‌లో ఈ నెల 30వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ఆప్షన్స్ ద్వారా యోగివేమన విశ్వవిద్యాలయం లలితకళల విభాగాన్ని ఎంపిక చేసుకోవచ్చు. సాధించిన విజయాలు.. 2022లో నేషనల్ ట్రెడిషనల్ అండ్ ట్రైబల్ పెయింటింగ్ వర్క్‌షాపు ద్వారా వివిధ రాష్ట్రాల ట్రైబల్, ట్రెడిషనల్ ఆర్టిస్టులు వైవీయూకు విచ్చేసి వర్క్‌షాపులో పాల్గొన్నారు. 2020లో వైవీయూ, లలితకళా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పెయింటింగ్ వర్క్‌షాపులో 7 రాష్ట్రాల ఆర్టిస్టులు విచ్చేసి వారి ప్రతిభను కనబరిచారు. అదే యేడాది విజయవాడలో నిర్వహించిన ఆర్ట్స్ ఎగ్జిబిషన్లో ఎల్దరడో పెయింటింగ్ ఎగ్జిబిషన్లో వైవీయూ విద్యార్థులు 10 మంది పాల్గొని తమ పెయింటింగ్స్ ప్రదర్శించారు. 2020లో న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ యూత్ ఫెస్టివల్లో పోస్టర్ మేకింగ్, ఇన్స్టలేషన్ విభాగంలో వైవీయూ విద్యార్థులు రెండోస్థానంలో నిలిచారు. 2019లో అలగప్ప విశ్వవిద్యాలయంలో నిర్వహించిన దక్షిణభారత యువజనోత్సవాల్లో ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించారు. 2018 మార్చినెలలో విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళా చిత్రకారిణిల వర్క్‌షాపునకు బీఎఫ్ఏ విద్యార్థులు ఎన్.రేఖ, పి.గాయత్రి పాల్గొన్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకుల చేతుల మీదుగా నగదు పురస్కారం, ఘన సన్మానం అందుకున్నారు. 2018 ఏప్రిల్ నెలలో విజయవాడ–అమరావతి కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్యాలరీలో వైవీయూ ఫైన్ఆర్ట్స్ ఫైనలియర్ విద్యార్థులు చిత్రం, శిల్పకళాఖండాలు ప్రదర్శించారు. విద్యార్థుల ప్రతిభను మెచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10వేలు నగదు ప్రోత్సాహం అందించారు. విజయవాడ ఆంధ్ర లయోల కళాశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చిత్ర సంతలో విద్యార్థుల ప్రదర్శన, అమ్మకాలు నిర్వహించారు. 2018 ఫిబ్రవరిలో ‘ఇంటాగ్లియో’ ప్రింట్ మేకింగ్ విధానంపై వారంరోజుల వర్క్‌షాపు నిర్వహణ. 2018 అక్టోబర్‌లో 34వ సౌత్‌జోన్ యూత్ ఫెస్టివల్లో శిల్పం విభాగంలో బి.ఎఫ్.ఎ విద్యార్థి జి.సోమశేఖర్‌కు ప్రథమస్థానం. 2017లో ప్రపంచ పర్యాటక దినోత్సవం –2017లో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం. 2015లో మధ్యభారతదేశ కళలు అన్న అంశంపై లలితకళా అకాడమీ న్యూఢిల్లీ వారి ఆర్థిక సహకారంతో తొలి జాతీయ సెమినార్ నిర్వహణ. 2013లో న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో ద్వితీయ బహుమతి రూ.10వేలు కైవసం చేసుకున్న వైవీయూ లలిత కళల విద్యార్థి వెంకటేశ్వర్లు. వీసీ, రిజిస్ట్రార్ల ప్రోత్సాహంతో.. యోగివేమన విశ్వవిద్యాలయంలో ఫైన్ఆర్ట్స్ కోర్సు దినదినాభావృద్ధి జరుగడానికి కారణం విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్ల సంపూర్ణ సహకారమే. రాయలసీమలో తొలుత వైవీయూలోనే ఈ కోర్సు ప్రారంభించారు. ఇంటర్ తర్వాత కాస్త సృజనాత్మకంగా ఆలోచించేవారికి చక్కటి కోర్సు. ఆధునిక కాలపు ఒత్తిడిని దూరం చేసే విధంగా కోర్సు రూపకల్పన, బోధన జరుగుతోంది. చదువుకుంటూనే సంపాదించుకునే మంచి అవకాశం కూడా ఉంది. – డా. మూల మల్లికార్జునరెడ్డి, లలితకళల విభాగాధిపతి, వైవీయూ -
పెన్సిళ్ల పై మహాభారతాన్ని లిఖించింది!
కారంచేడు: సూక్ష్మకళపై మక్కువతో సీస లేఖినిలపై (పెన్సిళ్లపై) మహాభారతాన్ని లిఖించింది ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత. మహాభారతంలోని 18 పర్వాలను.. 700 శ్లోకాలను సంస్కృత భాషలో అవలీలగా లిఖించగలిగింది. ఇందుకు ఆమె 810 పెన్సిళ్లను ఉపయోగించింది. వాటిపై 67,230 అక్షరాలను, 7,238 పదాలను లిఖించింది. ఇందుకోసం పెన్సిళ్లను ముందుగా బద్దగా చీల్చి అందులోని లిడ్ 2 మిల్లీమీటర్ల మందం ఉండేలా చూసుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకోవడం లక్ష్యమని మహిత చెబుతోంది. బియ్యపు గింజలపై సూక్ష్మ కళాకృతులు మహిత మొదట్లో బియ్యపు గింజలపై సూక్ష్మ కళాకృతులను చెక్కడం ప్రారంభించింది. గింజలపై జాతీయ జెండా, తాళం, బాణం, వినాయకుడు, కొంగ, మినప్పప్పుపైన కూడా వినాయకుడు వంటి ఆకృతులను చక్కగా చెక్కి శభాష్ అనిపించుకుంది. ఆ తరువాత పెన్సిల్‌పై మహాభారతాన్ని చెక్కాలనే ఆలోచనకు పదునుపెట్టింది. సూక్ష్మ కళలను ప్రోత్సహించాలి కళలలో సూక్ష్మకళ ఒకటి. అధికారులు, ప్రభుత్వం, ప్రజలు ఇలాంటి సూక్ష్మకళను ప్రోత్సహించాలి. నాలాంటి వారెందరో ఉన్నా.. ప్రతిభను కనబర్చుకునే వీలు లేక ఇలాంటి కళలు మరుగున పడుతున్నాయి. ఆర్థికం, శిక్షణ పరంగా ఈ కళలను ప్రోత్సహించాలి. – అన్నం మహిత (చదవండి: సరికొత్త శకం) -
20 వరకు వైఎస్సార్ఏఎఫ్యూ పీజీసెట్ దరఖాస్తు గడువు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కడపలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో 6 కోర్సుల్లో ప్రవేశాల కోసం రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీసెట్)కు దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు నిర్ణయించారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఈసీ సురేంద్రనాథరెడ్డి శనివారం ప్రకటన విడుదల చేశారు. రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ ప్లానింగ్, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (పెయింటింగ్), మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (అప్లయిడ్ ఆర్ట్స్), పీజీ డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ కోర్సుల్లో 2021–22 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హతలు, ఇతర వివరాలకు www.ysrafu.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు. ఈ కోర్సుల్లో చేరాలనుకొనే వారు డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ నిర్వహిస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2021 రాయవలసి ఉంటుంది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 20 చివరి తేదీ. ఆలస్య రుసుముతో ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు 8790571779 నంబర్లో సంప్రదించవచ్చు. ఆయా కోర్సుల్లో సీట్లు ఇలా.. ♦మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్: 20 సీట్లు ♦మాస్టర్ ఆఫ్ ప్లానింగ్: 20 సీట్లు ♦మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (పెయింటింగ్): 20 సీట్లు ♦మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (అప్లయిడ్ ఆర్ట్స్): 20 సీట్లు ♦పీజీ డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ: 20 సీట్లు ♦పీజీ డిప్లొమా ఇన్ సైంటిఫిక్ వాస్తు శాస్త్ర: 20 సీట్లు -
నగరానికి అందం తెస్తున్న ‘ఆ నలుగురు’!
సాక్షి, బంజారాహిల్స్: రంగురంగుల శిల్పాలు.. ఆలోచనాత్మక పెయింటింగ్స్‌తో వీధులు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా బాటసారులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలతో పాటు ప్రధాన కూడళ్లలో ఆకట్టుకునే శిల్పాలను ఏర్పాటు చేస్తూ నగరానికి మరింత వన్నె చేకూరుస్తున్నారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధి కిందకు వచ్చే పలు ప్రాంతాల్లో జేఎన్టీయూకి చెందిన నలుగురు విద్యార్థులు ఈ కళాత్మక ఆకృతులను తీర్చిదిద్దుతూ ఆయా ప్రాంతాలకు కొత్త ఆకర్షణ తీసుకొస్తున్నారు. జేఎన్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి చెందిన సంతోష్ బుద్ది, అబ్దుల్ రహ్మాన్, మహేష్‌కుమార్ గంగనపల్లి, మురళీకృష్ణ కంపెల్లిలు గత కొద్ది రోజులుగా పలు ప్రహరీలకు కొత్త నగషిలు చెక్కుతున్నారు. కేవలం రంగులు పూసి చేతులు దులుపుకోకుండా ఆ ఆకృతులకు ఆలోచనల రూపురేఖలు తీసుకొస్తున్నారు. జీహెచ్ఎంసీ సౌజన్యంతో ఈ నలుగురు యువకులు ప్రధాన కూడళ్లతో పాటు పలు ప్రహరీలకు కొత్త రూపును సంతరించుకునేలా పెయింటింగ్స్ వేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం ఈ విషయంలో తమకు సంపూర్ణ సహకారం అందిస్తూ మరింతగా ప్రోత్సహిస్తున్నాయని, ఈ పెయింటింగ్స్, శిల్పాలు తమకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతున్నాయని ఈ సందర్భంగా వారు పేర్కొంటున్నారు. ముందుగా తాము పెయింటింగ్ వేసే ప్రాంతాన్ని లేదా శిల్పాలు తీర్చిదిద్దే చౌరస్తాలను పరిశీలించి ఆ ప్రాంతాల్లో ఏ రకమైన శిల్పాలు, పెయింటింగ్స్ ఉంటే బాగుంటుందో డిజైన్లు రూపొందించుకొని ఆ మేరకు తీర్చిదిద్దుతున్నామని అంటున్నారు. విద్య, పచ్చదనం, పూలు ఇలా వివిధ రకాల ఆలోచనలతో ఈ ఆర్ట్ వర్క్స్ ఉంటాయని వారు తెలిపారు. ఆకట్టుకునే శిల్పాలివే.. ► ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్.70 అశ్విని లేఅవుట్ చౌరస్తాలో రాష్ట్ర పక్షి పాలపిట్ట శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ►బంజారాహిల్స్‌రోడ్ నెంబర్.1/5 జీవీకే వన్ చౌరస్తాలో గులకరాళ్ల శిల్పాన్ని తీర్చిదిద్దారు. ► బంజారాహిల్స్ రోడ్ నెంబర్.45 జంక్షన్లో వాల్ ఆర్ట్‌ను వేశారు. ►లక్డీకాపూల్ రైల్వేస్టేషన్ వద్ద కూడా ఈ వాల్ ఆర్ట్ కనువిందు చేస్తున్నాయి. ►బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1/12 పెన్షన్ కార్యాలయం చౌరస్తాలో బస్టాప్‌ను వాల్ ఆర్ట్‌తో సుందరంగా తీర్చిదిద్దారు. ► ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైన చిన్నారులకు విద్య తప్పనిసరి అనే కాన్సెప్ట్‌తో వాల్ ఆర్ట్ ఆకట్టుకుంటున్నది. ► ఫిలింనగర్ సీవీఆర్ న్యూస్ చౌరస్తాలో వాల్ ఆర్ట్ పాదచారులు, వాహనదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ►ఇలా ప్రధానమైన చౌరస్తాలో ఈ నలుగురు విద్యార్థులు తమలోని ప్రతిభతో నగరంలోని పలు ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దుతూ చూపరులను కట్టిపడేస్తున్నారు. -
ఉన్నత విలువలకు కళలే సోపానం
భారతీయ లలిత కళలను పరిరక్షిం చడానికి కొత్త ప్రణాళికలు వేయవల సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజంలో కళలకు మనుగడ లేకపోతే మానవీయ ప్రవర్తన క్రమంగా దిగ జారి పోతుంది. కళా సాహిత్య సంస్కృతులకు చేయూత నీయడం మనందరి బాధ్యత. కళా పరిరక్షణకు రెండు దారులున్నాయి. తాత్కాలిక ప్రోత్సాహం, దీర్ఘకాలిక కార్యాచరణ. కళ మానవ సమాజంలో అనివార్య అంతర్భాగం. మనుషులు మసిలే సంఘంలో కళలు సర్వదా అలరిస్తూ ఉండాలి. మానవులందరూ ఐక్యతగా, సంతోషంగా లేకపోతే ఎంత గొప్ప కళ అయినా దాని ప్రయో జనం నెరవేరదు. ప్రస్తుత పరిస్థితుల్లో కళాకారుడు బతికి బట్ట కట్టకపోతే కళ కనుమరుగయే ప్రమాదం ఉంది. అందుకే కళాకారులకు అండదండలు అందించేందుకు ఆలోచనలు చేయవలసిన అవసరముంది. నిర్మల్, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలను కాపాడుకోవాలి. అయితే వీరు బొమ్మల తయారీకి విని యోగించే ‘పొనికి’ కర్ర లభ్యత తగ్గిపోతోంది. వేలాది మంది కళాకారుల, శ్రామికుల బతుకుదెరువు ఈ కర్రపై ఆధారపడి ఉంది. కర్ర కోసమై ప్రత్యేకంగా కొన్ని ఎకరాల్లో ఈ చెట్లను పెంపు చేయాలి. అట్లాగే అవిభక్త అదిలాబాద్ జిల్లాలో నివసించే రెండు లక్షల అరవై వేల గోండు తదితర ఆదివాసీల కోసం సంప్ర దాయ సిద్ధంగా తయారు చేసే ‘డోక్రా’ లోహ కళాకృతుల తయారీకి ఉపయోగించే ఇత్తడి, కలప ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అందువల్ల ఈ కళను వృత్తిగా గల ‘ఓజా’ అనే ఉపజాతివారు ఆ సంప్రదాయ వృత్తికి దూరమవుతు న్నారు. కానీ, ప్రాచీన కళలను పోగొట్టు కోవడంతో మనం గొప్ప సాంస్కృతి వైభవాన్ని కోల్పోతాం. వీటి పునఃప్రతిష్ట కోసం నవంబర్ 1 నుండి జరుగనున్న ఆరో ‘కారా’ ఉత్స వాలలో ఈ సంగీతవాద్యాలు, కళాకృతులు ప్రదర్శనకు ఏర్పాట్లు జరిగాయి. భారతదేశంలో కళాభివ్యక్తీకరణకు అనేక రూపాలు, విధానాలు ఉన్నాయి. అలాగే ప్రజల అభిరుచి, అవసరాలు కూడా అంతే వైవిధ్యంగా ఉన్నాయి. ఒక నాటి పంచాణం వారు తయారు చేసిన పనిముట్లు, కొలత పాత్రలు, విగ్రహాలు, దైవరూపాలు, కులం, తెగల సంకేతాల వంటివి ఈనాడు అపురూప కళాఖండాలుగా పరిగణించడం చూస్తున్నాం. ఆదిమ మానవుడు ఆనాడు ఆయా పరిసరాలలోగల అటవీ జంతువుల బొమ్మలు గుహలలో చిత్రించారు. ఈనాడు అవి ఎంతో కొత్త శైలిలో కనిపిస్తాయి. ఆధునిక చిత్రరంగానికి వారసత్వపు ఊపిరినిస్తున్నాయి. అలాగే లోహ చిత్రాకృతులు, పంట పండించేప్పుడు వాడే పరికరాలు, వస్తువులు, ధాన్యం కుండలు, పూజాసామగ్రి అన్నింటిలోనూ ఆనాటి కళాత్మక వ్యక్తీకరణలు దర్శనమిస్తాయి. ఆదిలాబాద్‌లోని గోండు గిరి జనుల కోసం ‘ఓజా’ అనే చిన్న తెగదారు ‘డోక్రా’ శైలిలో ఇత్తడిని కరిగించి, మైనం సాంచాలు తీసి బొమ్మలు, విగ్ర హాలు తయారు చేస్తారు. నాలుగువేల ఏళ్ల క్రితంనాటి ఈ సంప్రదాయిక శైలి ఇప్పుడు అంతరించిపోయే ప్రమాదంలో పడింది. మన దేశంలో బెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో తయారయ్యే ఈ కళారూపాల గురించి ఎక్కువగా తెలియదు. ఈ ప్రదర్శనలో వీటితోపాటు తాళపత్ర గ్రంథాలు, రెండు వందల ఏళ్లనాటి చుట్టలు, విలక్షణ రాతప్రతులను కూడా ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే శుష్కించిపోయిన రాతప్రతులను సరిచేయించడం జరిగింది. విభిన్న రూపాలలో, కళాత్మక తయారీలో ఉన్న గ్రంథాలను చూపించడానికిగాను ఒక ప్రత్యేక ప్రదర్శన స్థలాన్ని ఏర్పాటు చేయబడింది. గతంలోని మన లేఖన సంప్రదాయ తీరుతెన్నులను కళ్లకు కట్టినట్టు చూపే ప్రయత్నాలు సైతం జరిగాయి. తాళపత్ర గ్రంథాలు తదితర లేఖన సామగ్రి ఎంత చూడముచ్చటగా తయారు చేసేవారో తెలుసుకోవచ్చు. వీటికి తోడుగా ఏనాడూ కనీవినీ ఎరుగని మనం కోల్పోయిన లేదా అంతరించే దశలో ఉన్న ఆదివాసీ, జానపద సంగీతవాద్యాల ఆది ధ్వనులకు మూల మైన వాద్యాల ప్రదర్శన ఉంటుంది. మన దేశంలో వాద్యం ఒక్కటే విడిగా మనలేదు. సంగీత కళాకారుడనేవాడు గురువుగా, వైద్యుడిగా, కుల సమూహ పెద్దగా చదువు వచ్చినవాడై ఉంటాడు. సంగీత వాద్యం ప్రదర్శనగా, వీరగాథగా, మౌఖిక సాహిత్యగనిగా ఉంటుంది. ఇలాంటి ఎన్నోరకాల అంశాలని చేర్చి ఒక విభాగంగా వాద్యాల ప్రదర్శన ఏర్పాటు చేయడమైనది. వీటితోపాటు సుదీర్ఘకాలం వ్యయప్రయాసలకోర్చి సుప్రసిద్ధ పరిశోధకులు ఆచార్య జయధీర్ తిరుమలరావు సేకరించిన ఎన్నో సాంస్కృ తిక, సాహిత్య అంశాలను ఇక్కడ చూడవచ్చు. బి. నర్సన్ వ్యాసకర్త కవి, విమర్శకులు ‘ 94401 28169 (నవంబర్ 1 నుండి 8 వరకు సప్తపర్ణి, హైదరాబాద్‌లో ‘కారా’ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాల సందర్భంగా) -
కళాఖ్యాతి.. గడప దాటి
యోగివేమన విశ్వవిద్యాలయం లలితకళల విభాగం విద్యార్థి గుడిపల్లి సోమశేఖర్ తాను అభ్యసించిన లలిత‘కళ’ను సమాజ హితానికి వినియోగిస్తున్నాడు.. కరోనా సమయంలో ప్రజల్లో కోవిడ్–19 నియంత్రణ పట్ల అవగాహన పెంపొందించాల నుకున్నాడు. అనుకున్నట్లే తన కుంచెకు ప్రాణం పోశాడు. అనంతపురం జిల్లాలో తన పెయింటింగ్స్ ద్వారా కరోనాపై అవగాహన కల్పించేలా మాస్క్ ధరించాలంటూ చిత్రాలతో సందేశం ప్రారంభించాడు. ఈయనకు కలిగిన ఆలోచనకు విశ్వవిద్యాలయ అధికారులు ప్రోత్సాహం అందించడంతో తన కుంచెతో కర్నాటక రాష్ట్రం వరకు చైతన్య కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు.. ఈయన సేవలను గుర్తించిన కేంద్ర క్రీడలు, యువజనశాఖ మంత్రి కిరణ్ రిజీజు సోషల్‌మీడియా వేదికగా సోమశేఖర్‌ను అభినందించాడు. వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయంలో లలితకళల విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్ ఫైనలియర్ చదువుతున్న గుడిపల్లి సోమశేఖర్ లలితకళల్లో రాణిస్తున్నాడు. గతంలో పలు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ఎన్నో బహుమతులు, పతకాలు సాధించాడు. కరోనా మహమ్మారి విజృంభించడంతో ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో విశ్వవిద్యాలయం నుంచి తన స్వగ్రామం అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం వేపులపర్తి గ్రామానికి వెళ్లాడు. ప్రజల్లో కరోనా పట్ల అవగాహన పెంపొందించాలన్న ఆలోచన మెదిలింది. దీంతో తన సొంత ఖర్చులతో తొలుత గ్రామాల్లోకి వెళ్లి మాస్క్ ధరించాలని చెబుతూ అక్కడి గ్రామస్తులు మాస్క్ ధరించి ఉన్న చిత్రాలను వేస్తూ వారిలో చైతన్యం తీసుకువచ్చారు. ఇలా ఏప్రిల్ నెలలో ప్రారంభించిన ఈ చైతన్య కార్యక్రమం నేటికీ కొనసాగుతుండటం విశేషం. వైవీయూ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎ. మధుసూదన్‌రెడ్డి ‘‘నీవు చేస్తున్న సేవలను విస్తరించమని’’చెబుతూ ప్రోత్సహించారు. దీంతో అనంతపురం జిల్లాలోని పలు గ్రామాలకు తన బైక్‌పైన వెళ్లడం ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే చిత్రాలు వేస్తూ అక్కడి ప్రజల్లో కోవిడ్–19పై అవగాహన కలి్పస్తూ వచ్చారు. ఇలా ఒక్కో గ్రామం దాటుకుంటూ కర్నాటక రాష్ట్రంలో సైతం ఇదే చైతన్య ప్రక్రియను కొనసాగించారు. ఈయన చిత్రాలు అందరినీ ఆలోచింపచేస్తుండటంతో పలువురు గ్రామప్రజలు మా గ్రామాలకు వచ్చి వేయాలంటూ ఆహ్వానించడం విశేషం. ఇలా ఇప్పటి వరకు కర్నాటక రాష్ట్రంలో 48 గ్రామాల్లో చిత్రాలు వేశాడు. ప్రశంసల వర్షం సోమశేఖర్ సేవలను ఎన్ఎస్ఎస్ అధికారులు కొనియాడారు. వైవీయూ విద్యార్థి తన కళ ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ విశ్వవిద్యాలయ ఖ్యాతిని చాటిచెప్పడం పట్ల విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజి్రస్టార్ ఆచార్య డి. విజయరాఘవప్రసాద్, ప్రిన్సిపాల్ ఆచార్య జి. సాంబశివారెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎ. మధుసూధన్‌రెడ్డి, లలితకళల విభాగం అధ్యాపకులు డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి, కోట మృత్యుంజయరావు తదితరులు అభినందనలు తెలిపారు. -
ఉల్లంఘిస్తే ఉతుకుడే!
సాక్షి, హైదరాబాద్: పంచాయతీల్లో కొత్త పాలకమండళ్లు ఏర్పడిన నేపథ్యంలో గ్రామాల్లో నూతన మార్పులకు శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం కార్యాచరణ ప్రణాళిక అమలుకు నడుం బిగించింది. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా ప్రజల రోజువారీ జీవనవిధానం, శైలిలో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గతంలోని చట్టాల్లో వివిధ అంశాలకు సంబంధించి నిబంధనలున్నా వాటిని పెద్దగా పట్టించుకున్న, కచ్చితంగా అమలుచేసిన సందర్భాలు తక్కువే. ఈ నేపథ్యంలో కొత్త చట్టం ద్వారా తీసుకొచ్చిన వివిధ అంశాలను ఆచరణాత్మకంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. పరిసరాల పరిశుభ్రత కొనసాగేలా చూడటంతోపాటు వివిధ రూపాలు, చర్యల ద్వారా ఉల్లంఘనలకు పాల్పడే వారినుంచి జరిమానా వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా వారిలో పరివర్తన తీసుకురావడంతో పాటు ఆయా నిబంధనలు పటిష్టంగా అమలుచేసే దిశగా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయంతో ఉంది. కొత్త చట్టంలోని అంశాల గురించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాక నియమ నిబంధనలు అమలు చేయడం మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉల్లంఘనులను ఉపేక్షించరు.. కొత్తగా నిర్దేశించిన నిబంధనలు కచ్చితంగా అమల్లోకి వస్తే పల్లెల్లో జరిమానాల మోత మోగనుంది. గ్రామాల పరిధిలో వివిధ అంశాలకు సంబంధించి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కొరడా ఝళిపించే అవకాశాలున్నాయి. గ్రామపంచాయతీలు రూపొందించిన నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వ్యక్తి నుంచి పంచాయతీ ఖరారు చేసిన మేర జరిమానా (రూ.ఐదు వేలు మించకుండా) వసూలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఉల్లంఘనలు అదే రీతిలో కొనసాగించిన పక్షంలో రోజుకు రూ.వంద చొప్పున జరిమానా విధిస్తారు. రోడ్లపై అశుద్ధం పారితే రూ. 5వేలు. ►పబ్లిక్ రోడ్లపై మురుగు, అశుద్ధం ప్రవహింపజేస్తే రూ.ఐదువేలు జరిమానా ►నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ మార్కెట్‌ను తెరిచి ఉంచితే రూ.ఐదు వేలు ►మురుగునీటి కాల్వ పూడ్చి, దానిపై అనధికార భవన నిర్మాణం చేపడితే రూ.2 వేలు ►ఆక్రమణలు తొలగించడంలో, మార్పుచేయడంలో విఫలమైతే రూ.రెండు వేలు ►రోడ్లపై, గ్రామ పంచాయతీ పరిధిలోని ఇతర చోట్ల అనుమతి లేకుండా మొక్కలు నాటితే రూ. 2 వేలు ►పంచాయతీ పరిధి, క్రమబద్ధీకరించిన భూమి లేదా పోరంబోకు భూమిలో చెట్లు అనుమతి లేకుండా నరికితే రూ. రెండు వేలు ►గ్రామపంచాయతీ ఆస్తులు ఆక్రమించుకున్నా లేదా అనధికారికంగా కలిగి ఉన్నా రూ.2 వేలు ►లైసెన్స్ లేకుండా లేదా ఇచ్చిన లైసెన్స్‌లకు విరుద్ధంగా రోడ్డును ఆనుకుని ఉన్న స్థలాన్ని వాహనాలు నిలిపి ఉంచే ప్రదేశంగా వాడుకుంటే రూ. 2వేలు ► లైసెన్స్ లేకుండా ఇచ్చిన లైసెన్స్‌లకు విరుద్ధంగా కొత్త ప్రైవేట్ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినా, ప్రైవేట్ పార్కింగ్ స్థలాన్ని కొనసాగిస్తే రూ. 2వేలు ►వధశాలకు వెలుపల పశువులను వధించినా, చర్మం వలిచినా రూ. 2 వేలు ► రిజిస్ట్రేషన్ లేకుండా అనధికార శ్మశానాలు తెరవడం, శవాల ఖననం చేస్తే రూ.వెయ్యి ► తాగునీటి సరఫరా వనరుకు లేదా నివాస ప్రాంతాలకు 200 మీటర్ల పరిధిలో శవాల ఖననం, దహనం వంటివి చేస్తే రూ.వెయ్యి ►నిషేధిత స్థలంలో శవాలు పాతిపెట్టినా, దహనం చేసి, ఇతర పద్ధతులు పాటించినా రూ.వెయ్యి ►పబ్లిక్ రోడ్డుపై లేదా రోడ్డు మీదుగా అనధికారికంగా గోడ లేదా ఫెన్స్ నిర్మిస్తే రూ.వెయ్యి ►నీటిని వృథా చేయకుండా నిషేధిస్తూ ఇచ్చిన నోటీసును పట్టించుకోకపోతే రూ.500 ►తాగునీటికోసం ఏర్పాటుచేసిన స్థలంలో బట్టలు ఉతికితే రూ.500 ►తాగునీటి ఉపయోగం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో స్నానం, ఇతర చర్యలకు పాల్పడితే రూ.500 ►మంచినీటి ఉపయోగం కోసం ఏర్పాటు చేసిన చోట్ల హానికరమైన వస్తువులను ఉంచితే రూ.500 ►తాగునీరు, స్నానం చేయడానికి లేదా బట్టలు ఉతకడానికి ఏర్పాటు చేసిన స్థలంలో మురుగునీటిని, మురుగు కాల్వలు మొదలైన వాటిని అనుమతిస్తే రూ.500 జరిమానా విధించనున్నారు. -
సిత్రాలు సూడరో..!
ప్రకృతి చాలా అందమైనది. ప్రకృతిలో స్వతసిద్ధంగా ఏర్పడ్డవి.. పలు సందర్భాల్లో కృత్రిక సృష్టికి దగ్గరగా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో అచ్చుగుద్దినట్లు ఒకేలా అనిపిస్తాయి. చూసిన వ్యక్తులు కూడా తమ కళ్లను తామే నమ్మలేనంతగా.. కనిపించడం మరీ ఆశ్చర్యకరం. అటువంటి ఆశ్చర్యం కలిగించే ఫొటోలు మీకోసం.. -
12న ఆర్కిటెక్చర్ కోర్సులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఆర్కిటెక్చర్, ఫైనార్ట్స్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 12వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ కోర్సులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కేవలం అయిదు కాలేజీలే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ కాలేజీలు కాకినాడ జేఎన్టీయూ అఫిలియేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ (జేఎన్‌యూఏఎఫ్) పరిధిలో వీటికి అఫిలియేషన్ ఉండేది. రాష్ట్ర విభజనతో ఈ వర్సిటీ పదో షెడ్యూల్లో చే రడంతో తెలంగాణ ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకొంది. పదో షెడ్యూల్లోని సంస్థలు ఉమ్మడి ప్రవేశాలు నిర్వహించాల్సి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం అందుకు అంగీకరించకపోవడంతో ఏపీలోని ఆర్కిటెక్చర్ కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జేఎన్‌యూఏఎఫ్ ఇటీవల ప్రవేశాల ప్రకటన విడుదల చేసినా అందులో ఏపీలోని కాలేజీలను చేర్చలేదు. కేవలం తెలంగాణలోని కాలేజీలకు మాత్రమే ప్రవేశాలుంటాయని స్పష్టంచేసింది. దీంతో ఏపీలోని కాలేజీలకు వేరుగా ప్రవేశాలు నిర్వహించాలని ఉన్నతవిద్యామండలి నిర్ణయించింది. ఈమేరకు సోమవారం మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలోని ఆర్కిటెక్చర్ కాలేజీలు కాకినాడ జేఎన్టీయూ అఫిలియేషన్‌ను తీసుకోవాలి. అప్పుడే ప్రవేశాలకు అనుమతి ఇవ్వనున్నారు. కొన్ని కాలేజీలు ఏయూ నుంచి అఫిలియేషన్‌ను తీసుకుంటామని పేర్కొనడంతో అందుకు మండలి అంగీకరించింది. ఈనెల 12న ఈ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నామని సెట్ల అడ్మిషన్ల ప్రత్యేకాధికారి రఘునాథ్ తెలిపారు. ఈ నెల 30వ తేదీనుంచి తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. -
ఫైన్ ఆర్ట్స్
కాలుష్యం, ఉగ్రవాదం, శిశుహత్యలు... సామాజిక అంశాలను కళాఖండాల్లో ప్రతిబింబించారు మాసబ్‌ట్యాంక్ జేఎన్ఏఎఫ్ఏయూ ఫైనలియర్ విద్యార్థులు. పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా గురువారం వర్సిటీలో ఏర్పాటు చేసిన ఈ విభిన్న ప్రదర్శనలోని కళారూపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సమాజం పట్ల విద్యార్థుల్లో ఉన్న లోతైన అవగాహనకు అద్దం పడుతున్నాయి. మొత్తం 12 మంది ఎమ్ఎఫ్ఏ విద్యార్థులు రూపొందించిన కళాఖండాలను ప్రముఖ దర్శకుడు బి.నర్సింగరావు ఆసక్తిగా తిలకించారు. దేనికదే ప్రత్యేకం... ‘హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేసేవారిని చాలామందిని చూస్తుంటాం. నిబంధనలున్నా వాటిని ఎవరూ పాటించరు. అలాగే చె ట్లను విచక్షణార హితంగా నరికేస్తున్నారు. చెట్లు లేకపోతే మనం కూడా ఉండం. అది చెప్పడానికే చెట్లకు హెల్మెట్లు పెట్టి కళారూపం సృష్టించా’ అంటూ చెప్పుకొచ్చాడు విద్యార్థి రమేష్. కెరీర్లో కన్ఫ్యూజన్, లైఫ్ పార్ట్నర్ విషయంలో కన్ఫ్యూజన్, చివరికి చిన్న చిన్న యాక్ససరీస్ ఎంపికలోనూ కన్ఫ్యూజన్. సాఫీగా లైఫ్ సాగిపోవాలంటే కన్ఫ్యూజన్ ఉండకూడదంటూ భవ్య గీసిన ఆర్ట్ ఆకట్టుకుంది. అలాగే హరిత్ పూరమ్... సోషల్ సైట్స్, మొబైల్ నెట్‌వర్క్‌ల వల్ల ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమలో పడిపోతున్నారు నేటి యువత. ఈ దాగుడుమూతల జాడ్యం వదిలించాలంటూ చేసిన ప్రయత్నం వినూత్నంగా ఉంది. పుట్టిన శిశువును పురిట్లోనే వదిలేస్తున్న సంఘటనలెన్నో. లెక్కకు మించి భ్రూణ హత్యలు. ఆడ శిశువును గర్భంలోనే చిదిమేస్తున్న దుష్టాంతాలు. ఈ పరిస్థితులు మారాలంటూ ఫర్జాన్‌ఖానూన్ కమలంలో పురిటి శిశువును పెట్టి చేసిన కళాకృతి ఎగ్జిబిషన్‌కే హైలైట్. - శ్రావణ్‌జయ -
సింహళ మయూరం
గౌతమిలో తెలుగుదనం ఉట్టిపడడానికి రెండు కారణాలు. ఒకటి ఆమె పేరు. ఇంకొకటి ఆమె అభిరుచి. శ్రీలంకకు చెందిన ఈ సింహళ జాతీయురాలికి కూచిపూడిలో చక్కటి ప్రావీణ్యం ఉందని చెప్పడం కన్నా, కూచిపూడి అంటే ఆమెకు ప్రాణం అని చెప్పడం సముచితంగా ఉంటుంది. ఆమెకు మన భాష తెలీదు. మన భావం తెలీదు. అయినప్పటికీ కీర్తనలను అర్థం చేసుకుంటూ కూచిపూడిని అభినయిస్తున్నారు. ప్రశంసలూ అందుకుంటున్నారు. భర్త ఉద్యోగరీత్యా రెండేళ్లుగా విశాఖ జిల్లా అచ్యుతాపురంలో ఉంటున్న గౌతమి ఇటీవలే శ్రీలంకలో కూడా కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చి వచ్చారు. గౌతమి పూర్తి పేరు గౌతమి నిరంజల గమాగే. శ్రీలంకలో ఫైన్ఆర్ట్స్లో డిగ్రీ చేశారు. కొంతకాలం ప్రభుత్వ పాఠశాలలో డ్యాన్స్ టీచర్‌గా ఉన్నారు. పదేళ్ల క్రితం టీవీలో ఎవరిదో కూచిపూడి ప్రదర్శన చూసి ఆమె ఆ నాట్యం వైపు ఆకర్షితురాలయ్యారు. నృత్య భంగిమలు, అభినయమే గాక అందులోని అలంకరణ కూడా ఆ ఆకర్షణకు ఒక కారణమని గౌతమి అంటారు. గౌతమి భర్త కపిల్ సంజీవర్ ఒక కంపెనీలో ఉన్నతోద్యోగి. ‘‘మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి. అబ్బాయి. వైజాగ్ ప్రకృతి అందంతో పాటు ఇక్కడి మనుషుల ఆత్మీయత నాకెంతో నచ్చింది. ఇక్కడికొచ్చిన రెండు నెలల్లోనే సాయినాథ కళాసమితిలో కూచిపూడి శిక్షణకు చేరా. వీకెండ్స్‌ని పూర్తిగా కూచిపూడి నేర్చుకోవడానికి కేటాయించా. నాట్యాచార్యులైన అరుణ్ సాయికుమార్, పేరిణికుమారి దంపతులు సంకీర్తనల్లో భావాన్ని ఇంగ్లిషులో వివరిస్తూ నాకు కూచిపూడి నేర్పించారు. అలా నేర్చుకునే వైజాగ్‌లోని దేవాలయాల్లో ఇప్పటి వరకు పది ప్రదర్శనలు ఇచ్చా. అందరూ నన్ను ప్రశంసిస్తూ ఉంటే ఆ ఆనందంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇంత స్పందన వస్తుందని నేను ఊహించలేదు’’ అని చెప్పారు గౌతమి. అంతేకాదు, తన స్వదేశం తిరిగివెళ్లిన తర్వాత పూర్తి సమయాన్ని కూచిపూడి శిక్షణ ఇవ్వడానికే వినియోగించే ఉద్దేశంలో ఉన్నారామె. ‘‘దీన్నో దైవకార్యంగా భావిస్తా. మా అమ్మాయి రసంధికీ కూచిపూడిలో శిక్షణ ఇప్పిస్తున్నా. ఆమెను అంతర్జాతీయ స్థాయి నృత్యకారిణిగా చూడాలనేది నా కోరిక’’’ అని గౌతమి అంటున్నారు. - అల్లు సూరిబాబు, సాక్షి, విశాఖపట్నం -
కళారంగానికి పెద్దపీట
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి సాక్షి: హైదరాబాద్: తెలంగాణలో కళారంగానికి పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తెలిపారు. కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న సందర్భంగా బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఇన్నాళ్లు నిరాదరణకు గురైన కళలకు పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు. సాంస్కృతిక శాఖకు ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులను కేటాయించిందని తెలిపా రు. కళలకు జీవం పోయడానికి ప్రత్యేకంగా సాంస్కృతిక సారథి అనే విప్లవాత్మకమైన విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇలాంటి వ్యవస్థను ఏ రాష్ట్రం అమలు చేయలేదని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణలోని కళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే తమ భవిషత్తు లక్ష్యమని చెప్పారు. కొత్త రాష్ట్రంలో.. కొత్త సంవత్సరంలో సరికొత్త విధానాలతో ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో పుట్టిన పేరిణి నృత్యానికి జవజీవాలు పోసి అద్భుతమైన కళగా ప్రాచుర్యంలోకి తీసుకువస్తామని తెలిపారు. ఏడు సూత్రాల పథకాన్ని అమలు చేస్తాం: మామిడి హరికృష్ణ నూతన సంవత్సరంలో ఏడు సూత్రాల పథ కం తో సాంస్కృతిక శాఖ ముందుకు వెళ్లనున్నట్లు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఎం.హరికృష్ణ తెలిపారు. తెలంగాణలోని కళల ను ఆదరించడంతో పాటు గ్రామీణ, జాన పద, ప్రజా కళారూపాలు, కళాకారులకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. పేద కళాకారుల సంక్షేమానికి పింఛన్ల మొత్తాన్ని రూ.1500 పెంచినట్లు గుర్తుచేశారు. తెలంగాణ కళారూపాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి ‘తానా’ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటామన్నారు. -
స్పందోలిక మన్‌డోలిక
ఆటపాటలు తప్ప అన్యం ఎరుగని బాల్యం.. జీవితాంతం ఏదో రూపంలో తొంగి చూస్తూనే ఉంటుంది. చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలో.. బుజ్జాయిగా అమ్మతో దిగిన ఫొటోనో కనిపిస్తే మనసు కాసేపు ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోతుంది. ఆనాటి గుర్తులను తడిమి వర్తమానంలోకి వచ్చిన మనుషులు కాసేపు అవే జ్ఞాపకాలల్లో సేదతీరుతారు. కానీ కళను ఒంటబట్టించుకున్న ఈ మనిషి మాత్రం.. ఆనాటి జ్ఞాపకాలను అంతే ఫ్రెష్‌గా మళ్లీ ఆవిష్కరిస్తున్నాడు. రవికాంత్ ఫైన్ ఆర్ట్స్‌లో మాస్టర్ డిగ్రీ సాధించాడు. బొమ్మలు గీస్తాడు.. తయారు చేస్తాడు కూడా. తన జ్ఞాపకానికి కళను మేళవించి.. ఆ కళకు చరిత్రను రంగరించి బొమ్మల రూపంలో ప్రజెంట్ చేస్తున్నాడు. ఒక్కోసారి ఒక్కో థీమ్ తీసుకుని.. దాన్ని అన్ని కోణాల్లో నేటి తరానికి చూపుతున్నాడు. రవికాంత్ తండ్రి టీచర్, ఆర్టిస్ట్, ఫొటోగ్రాఫర్. ఆయన స్టూడియోలో పిల్లలు ఫొటో దిగడానికి ఊగే కీలుగుర్రం ఒకటి ఉండేది. చిన్నప్పుడు దానిపై సరదాగా స్వారీ చేసిన రవికాంత్‌కు ఈ మధ్య ఆ రోజులు గుర్తొచ్చాయి. వింతగా తోచిన ఆనాటి జ్ఞాపకాన్ని.. గొప్పగా చూపాలనుకున్నాడు. కీలుగుర్రాల పుట్టపూర్వోత్తరాల కోసం చరిత్రలోకి తొంగి చూశాడు. వాటి పుట్టిల్లు బెంగళూరు, మైసూర్ మధ్య ఉన్న చెన్నపట్న అని తెలుసకున్నాడు. అక్కడికి వెళ్లి వాటి గురించి తెలుసుకుని రకరకాల కీలుగుర్రాల మినియేచర్ పెయింటింగ్స్ వేశాడు. కొయ్యలతో కీలుగుర్రాల నమూనాలు తీర్చిదిద్దాడు. వీటన్నింటినీ వాటి చరిత్రతో సహా.. స్పందోలిక (ద రాకింగ్ హార్సెస్) పేరుతో బంజారాహిల్స్‌లోని ట్రైడెంట్ హోటల్లో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశాడు. గుర్రాల ఐతిహాసక విశిష్టతను, చారిత్రాత్మక ప్రశస్తిని తెలియజేస్తూ కాన్వాస్‌పై రంగులద్దాడు. పోస్ట్ మాడర్నిజంతో గుర్రాల నేపథ్యాన్ని ఆవిష్కరించాడు. గురువారంతో ఈ ప్రదర్శన ముగుస్తుంది. ఫొటోలు.. ఫోజులు.. తన మదిలో మెదిలిన ఆ పాత గుర్తులను కమనీయంగా చూపడం రవికాంత్‌కు కొత్తకాదు. 90వ దశకంలో ఫొటో స్టూడియోకు వెళ్లి ఫొటోలు దిగడం అంటే చాలామంది ఓ పండుగలా ఫీలయ్యేవాళ్లు. సెల్ఫీలు, రిల్ఫీలు దిగుతున్న ఈ స్మార్ట్ జమానాకు నాటి ఫొటో ఫోజుల సంగతి తెలియజేసేందుకు రవికాంత్ విభిన్న ప్రయోగం చేశాడు. ఆనాటి ఫొటోలు.. ఫోజులు ఎలా ఉండేవో.. తనకొచ్చిన కళతో కళ్లముందుంచాడు. ఆ తర్వాత మహారాజులకు రాచఠీవి తెచ్చే కాస్ట్యూమ్స్ గురించి ఆలోచన రాగానే.. ఆ థీమ్‌ను ఎంచుకుని వారి గెటప్స్పై ఓ ప్రదర్శన నిర్వహించాడు. -
లలిత కళలు.. కళాత్మక కొలువులు
సౌందర్య విలువలను నిండా నింపుకున్న లలితకళలు.. నేడు కుర్రకారుకు కొత్త కొలువులను అందించేందుకు వేదికలు అవుతున్నాయి. శిల్ప కళ, చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, ఫొటోగ్రఫీ.. ఇప్పుడు హైటెక్ హంగులతో కాసుల వర్షం కురిపించే ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే విశ్వవిద్యాలయాలు ఫైన్ ఆర్ట్స్ కోర్సులకు ప్రాధాన్యమిస్తుండగా.. భాగ్యనగరం విద్యార్థులు వీటివైపు ఆకర్షితులవుతున్నారు. కళాత్మక కెరీర్ దిశగా అడుగులేస్తున్నారు..! ప్రపంచీకరణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుండటం,మార్కెట్ అవసరాల కారణంగా ప్రస్తుతం లలితకళలు (ఫైన్ ఆర్ట్స్) కోర్సులు పూర్తిచేసిన వారికి అవకాశాలు బాగా పెరిగాయి. వ్యవస్థీకృత రంగంతో పాటు అవ్యవస్థీకృత రంగంలోనూ ఉద్యోగావకాశాలు విస్తృతమయ్యాయి. ఫిక్కీ, కేపీఎంజీ నివేదిక ప్రకారం- 2013లో దేశంలో ప్రసారమాధ్యమాలు, వినోద రంగం మార్కెట్ విలువ రూ.91,800 కోట్లకు చేరింది. మరో నాలుగేళ్లలో ఇది లక్షా 78 వేల కోట్ల రూపాయలకు చేరనుంది. ఇలాంటి పరిస్థితుల్లో శిల్పకళ, చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, ఫొటోగ్రఫీ తదితర కోర్సులు పూర్తిచేసిన వారికి అవకాశాలు పెరుగుతున్నాయి. సృజనాత్మకత, వ్యక్తిగత ఆసక్తి: ఫైన్ ఆర్ట్స కోర్సులను అభ్యసిస్తే లభించే ఉద్యోగాలు.. విజువలైజింగ్ ప్రొఫెషనల్, ఇలస్ట్రేటర్, ఆర్ట్ క్రిటిక్, ఆర్టిస్టు, ఆర్ట్ ప్రొఫెషనల్, డిజైన్ ట్రైనర్ వంటివి. లలితకళా రంగంలో కెరీర్లో రాణించడమనేది సృజనాత్మకత, వ్యక్తిగత ఆసక్తి స్థాయి, అనుభవం, మార్కెట్‌పై అవగాహన, స్వయం ప్రేరణ తదితరాలపై ఆధారపడి ఉంటుంది. కోర్సులు..: * పెయింటింగ్, డ్రాయింగ్ * ఇలస్ట్రేషన్ * డ్యాన్స్ * కామిక్స్ * ప్రింట్ మేకింగ్, ఇమేజింగ్ * ఫొటోగ్రఫీ * అప్లైడ్ ఆర్ట్ * థియేటర్ * ఆర్కిటెక్చర్ * స్కల్ప్చర్. పెయింటింగ్: మార్కెట్ అధ్యయనాల ప్రకారం- అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ చిత్రకారుల కుంచె నుంచి జాలువారిని చిత్రరాజాలకు మంచి డిమాండ్ ఉంది. ఇవి వేలంలో అధిక మొత్తాలకు అమ్ముడుపోతున్నాయి. దేశంలో పెయింటింగ్ మార్కెట్ 2005తో పోల్చితే 90 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ఉద్యోగాల్లో చేరాలనుకునే వారు పత్రికలు, మ్యాగజైన్లు వంటి ప్రచురణ రంగంలో ఇలస్ట్రేటర్‌గా; చిత్ర రంగంలో ఆర్ట్ డెరైక్టర్‌గా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఆర్ట్ క్రిటిక్, కార్టూనిస్టు, యానిమేటర్, టెక్స్టైల్ డిజైనర్ వంటి ఉద్యోగాలు కూడా ఉంటాయి. సొంతంగా ఆర్ట్ స్టూడియోలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఫొటోగ్రఫీ: ఫొటోగ్రఫీ కోర్సులు పూర్తిచేసిన వారికి పత్రికా సంస్థలు, జర్నళ్లు, టీవీ చానెళ్లలో అవకాశాలుంటాయి. ప్రకటనల సంస్థలు, ఫ్యాషన్హౌస్ల్లోనూ ఉద్యోగాలను అందిపుచ్చుకోవచ్చు. ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేయొచ్చు. యానిమేషన్: యానిమేషన్ కోర్సులు పూర్తిచేసిన వారికి వినోద, ప్రకటనల పరిశ్రమలో ఎక్కువ ఉద్యోగావకాశాలుంటాయి. ఇంజనీరింగ్, మెకానికల్ డిజైనింగ్, గేమింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ల్యాండ్ స్కేపింగ్, ఫోరెన్సిక్ సైన్స్ తదితర విభాగాల్లో ఉద్యోగాలను అందిపుచ్చుకోవచ్చు. ప్రస్తుతం అన్ని రంగాల్లో యానిమేటర్ల అవసరం పెరగడంతో మంచి అవకాశాలు తలుపుతడుతున్నాయి. నైపుణ్యాలు: లలిత కళా రంగంలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలను పరిశీలిస్తే.. * ఉన్నతస్థార ుు సృజనాత్మకత * రంగులు, ఆకారాలపై అవగాహన * స్వయం ప్రేరణ ఊ బృంద స్ఫూర్తి. ఒంటరిగా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. * మార్కెటింగ్ నైపుణ్యం * మారుతున్న పరిస్థితులకు తగినట్లు పనితీరును మార్చుకోవడం * సాంకేతిక నైపుణ్యాలు ఫైన్ ఆర్ట్స కోర్సులు ఎన్నో.. శిల్పం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ వంటివి లలితకళలు(ఫైన్ఆర్ట్స్)గా చెప్పొచ్చు. హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ), ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఫైన్ఆర్ట్స్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో సర్టిఫికెట్ స్థాయి నుంచి పీజీ వరకు కోర్సులున్నాయి. అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్ప్చర్, ఫొటోగ్రఫీ, యానిమేషన్ వంటివాటిలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్(బీఎఫ్ఏ), మాస్టర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్(ఎంఎఫ్ఏ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ అర్హతతో బీఎఫ్‌ఏలో ప్రవేశించవచ్చు. అవకాశాలకు వేదికలు: ఫైన్ ఆర్ట్స్ కోర్సులు పూర్తిచేసిన వారికి అవకాశాలు కల్పించే వేదికలు.. యానిమేషన్, అడ్వర్టైజింగ్ కంపెనీలు, ఆర్ట్ స్టూడియోలు, టెక్స్టైల్ పరిశ్రమ, డ్యాన్స్ స్టూడియోలు, డిజిటల్ మీడియా, ఫ్యాషన్ సంస్థలు, పత్రికలు-టీవీ ఛానళ్లు-ఆన్లైన్ సంస్థలు. డ్యాన్స్/కొరియోగ్రఫీ: కొన్నేళ్ల కిందటి వరకు డ్యాన్సర్లకు అవకాశాలు పరిమితంగా ఉండేవి. ప్రస్తుతం స్టేజ్ ప్రదర్శనలు, సినిమాల్లో కొరియోగ్రఫీకి సంబంధించి అవకాశాలు పెరిగాయి. సంప్రదాయ నృత్య రీతులు మొదలు సల్సా, బాల్రూమ్, లాటిన్ డ్యాన్స్ వంటి అధునాతన నృత్య రీతుల కళాకారులకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో వివిధ అంశాల్లో కోర్సులు పూర్తిచేసిన వారు డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్లుగా అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. విద్యా సంస్థల్లోనూ మంచి అవకాశాలుంటాయి. ప్రారంభంలోనే నెలకు రూ.25 వేల వరకు ఆర్జించవచ్చు. అందుబాటులో వేలాది ఉద్యోగాలు శ్రీఫైన్ ఆర్ట్స్ కోర్సులు పూర్తి చేసిన వారికి విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఫైన్ ఆర్ట్స్ అంటే కేవలం బొమ్మలు గీసి ఉపాధి పొందడమని చాలా మంది భావిస్తారు. వాస్తవానికి శిల్ప కళ, పెయింటింగ్, అప్లయిడ్ ఆర్ట్, ఫొటోగ్రఫీ, యానిమేషన్ తదితర ఆర్ట్స్ పరిశ్రమల్లో ఏటా వేలాది ఉద్యోగాలు లభిస్తున్నాయి. యానిమేషన్.. ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమగా దూసుకెళ్తోంది. ఏదైనా పరిశ్రమ స్థాపన నుంచి దాని ఉత్పత్తులు వినియోగదారుడికి చేరే వరకు లోగో డిజైన్, పబ్లిసిటీ, మార్కెటింగ్ తదితర అన్ని దశల్లోనూ ఆర్టిస్ట్ అవసరం ఉంటుంది. ఫొటోగ్రఫీ, యానిమేషన్, అప్లయిడ్ ఆర్ట్ విభాగాల్లో నిపుణులకు విపరీతమైన డిమాండ్ ఉంది. కాబట్టి ఫైన్ ఆర్ట్స్‌లో నైపుణ్యం సాధిస్తే ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. ఆసక్తితోపాటు డ్రాయింగ్, సృజనాత్మక నైపుణ్యాలున్న అభ్యర్థులు ఈ కోర్సులను ఎంచుకోవచ్చు. ఫైన్ఆర్ట్స్ కోర్సుల్లో భాగంగా సిలబస్‌కు సంబంధించిన స్కిల్స్‌లో ప్రావీణ్యం పొందుతారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేలా, సరికొత్త ఆలోచనా నైపుణ్యాలు వృద్ధి చెందేలా సిలబస్‌ను రూపొందించాం. కేవలం వృత్తి నైపుణ్యాలమీదే దృష్టి సారించకుండా.. అన్ని విభాగాల్లో రాణించేందుకు వీలుగా విద్యార్థులను తీర్చిదిద్దుతాం. సిలబస్‌లోని అంశాలన్నీ పుస్తకాల్లో లభించవు. వాటిని స్వీయ అనుభవాలతో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్‌లో వివిధ విభాగాల్లో బ్యాచిలర్తోపాటు మాస్టర్స్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. కోర్సును అభ్యసిస్తున్న సమయంలోనే ఏదైనా సంస్థలో పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. తద్వారా కోర్సు పూర్తయ్యేనాటికి పూర్తిస్థాయి నైపుణ్యాలు సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్ అభ్యర్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతోపాటు పలు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. జేఎన్ఏఎఫ్ఏయూలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్ఏ) అభ్యర్థులకు ఏడాది పొడవునా ప్లేస్‌మెంట్స్ జరుగుతుంటాయి. - ప్రొఫెసర్ బి.శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపాల్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ), హైదరాబాద్ -
పండ్లతో అద్భుత శిల్పాలు
-
ఫైన్ ఆర్ట్‌కు గల అవకాశాలు
-
సప్తపర్ణి: చిత్రకళకు విలువైన చేర్పు
తాజా పుస్తకం ‘కాదేది కవితకనర్హం’ అని శ్రీశ్రీ అంటే ‘కాదేదీ కుంచెకనర్హం’ అంటాడు చిత్రకారుడు. కాని కవనాన్నీ కుంచెనూ సమపాళ్లలోనే వొదిగించ వచ్చునన్నది శ్రీనాథుడి విశ్వాసం. సూర్యుడు కుంచెగా సూర్యకిరణాలు ఏడు వర్ణాలుగా తనకు ఎలా కనిపించాయో శ్రీనాథ మహాకవి చూపించాడు. ఎలా? నిండు వెన్నెలలోని తెల్లదనాన్ని కొంత వేరు చేసి దాన్ని సున్నపునీరుగాను, అతి సుకుమారమైన లేత చీకటి వన్నెను ఒక పాలుగా కలిపి బురదరంగుగాను, అప్పుడప్పుడే విచ్చుకుంటున్న తామర మొగ్గలలోని పుప్పొడి పరాగాలను పసుపచ్చని దినుసుగాను, ఎర్రని వన్నెగల లేత ఉదయ సంధ్యలోని అందమైన అరుణ వర్ణాన్ని జేగురురాయి రంగుగాను కలిపి- ఈ రంగులన్నీ ఒకే సమయంలో సమకూరి రాత్రి తెల్లవారిపోయిం తర్వాత మనకు కన్పించే దృశ్యమేమిటట? ‘మెడలో మాణిక్యాలు పొదిగిన హారంతో తూర్పు దిక్కు అనే అందమైన అమ్మాయి’! అంటే ఇక్కడ కవి చిత్రకారుడిగా మారాడు. కాని బొమ్మ కట్టలేకపోయాడు. ఆ భావానికి పరిపూర్ణ రూపం ఇవ్వగలిగేవాడు చిత్రకారుడు మాత్రమే. అలాంటి చిత్రకారులకు కిరీటం పెట్టిన పుస్తకమే ఈ ‘సప్తపర్ణి’. ప్రపంచ చిత్రకళారంగంలో ఎందరో మహానుభావులున్నారు. మహర్షులున్నారు. అయితే వీరిలో చాలామంది పేర్లు వినడమూ చెదురుమదురుగా కొన్ని వివరాలు చదవడం తప్ప వీరందరి గురించి సమగ్రమైన వ్యాసాలను ఒకచోట చదివే అవకాశం తెలుగు పాఠకులకు అంతగా దక్కలేదు. ఆ లోటు తీర్చే పుస్తకం ఇది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులైన చిత్రకారులను, వారి కళాసృష్టిని రసమయ వ్యాఖ్యానంతో, వర్ణచిత్ర సంచయంతో గుది గుచ్చి కళావిమర్శకుడు కాండ్రేగుల నాగేశ్వరరావు రూపొందించిన గ్రంథం ఇది. నేత్రపర్వంగా ఉన్న గ్రంథం. నేడొక విశ్రాంత ఉన్నతాధికారిగా ఉన్న నాగేశ్వరరావు దేశవ్యాప్తంగా అనేక చిత్రకళా ప్రదర్శనలను, మ్యూజియంలను సందర్శిస్తూ, స్వీయ అధ్యయనం ద్వారా గడించిన పరిజ్ఞానాన్ని సవివరంగా, తులనాత్మకంగా, స్థూలంగా దఫదఫాలుగా ‘మిసిమి’ పత్రికలో రాస్తూ వచ్చారు. ఇప్పుడు వాటన్నింటిని కలిపి ఈ పుస్తకంగా తీసుకొచ్చారు. ఇందులో పికాసో (గుయెర్నికా చిత్రం), లియోనార్డో దావించి (మొనాలిసా), డచ్ చిత్రకారుడు వెర్మీర్, డాలీ, మైఖెలాంజిలో, రింబ్రాండ్, నికొలస్ రోరిక్ తదితర చిత్రకారుల కళాసృష్టిలోని ఔన్నత్యాన్ని వివరించడంతోపాటు రెండవ ప్రపంచ యుద్ధానికి కాల్దువ్విన యూదుజాతి విద్వేషి, ఫాసిజానికి మార్గం తీసిన జర్మన్ నియంత హిట్లర్ చిత్రకారుడుగా ఎలా అవతరించిందీ సోదాహరణంగా వివరిస్తాడు గ్రంథకర్త. అలాగే రెండు ప్రపంచయుద్ధా ల మధ్య కకావికలమైపోయిన సామాన్య ప్రజాబాహుళ్యం జీవితాలను, కష్టాలను ప్రతిబింబిస్తూ, అగ్రరాజ్య ఆధిపత్యపు రాక్షసత్వంపైన తమ చిత్రకళ ద్వారా విరుచుకుపడిన మహా కళాకారుల నిరసన చిత్రాలూ ఇందులో ఉన్నాయి. ఈ నిరసన కళల నుంచి విధ్వంసక, తిరుగుబాటు ఉద్యమాలు చిత్ర విచిత్ర పేర్లతో, సిద్ధాంతాలతో దూసుకువచ్చాయి. అధివాస్తవికతా, ప్రతీకవాద కళారూపాలు వెలశాయి. గందరగోళానికి మారుపేరుగా నిలిచాయి. అరాచక ప్రక్రియ కొన్నాళ్లు ఆదర్శ కళారూపమయింది. ఇదే దశలో నిరాశావాదానికి ప్రతిబింబంగా రూపంతో నిమితంలేని నైరూప్య (ముక్కు ముఖం లేని, చిత్రకారుడు వచ్చి వివరిస్తే గాని) చిత్రకళ రంగంలోకి వచ్చింది. ఈ అరాచక రూపాలు అనేకం ఆదర్శవాదం, వాస్తవికవాదం, కాల్పనిక వాదనానంతర దశలో పుట్టుకొచ్చినవి- అనుభవవాదం (ఇంప్రెషనిజం), అసంప్రదాయ వర్ణచిత్రణవాదం లేదా హేళనకళావాదం (ఫావిజం), స్థూలతావాదం (క్యూబిజం), కాలాన్ని, కాలగతినీ ప్రేక్షకుడి, అనుభూతికి తెచ్చిన అనాగతావాదం (ఫ్యూచరిజం), అభివ్యక్తివాదం (ఎక్స్ప్రెషనిజం), అధివాస్తవికవాదం (సర్రియలిజం), నైరూప్య చిత్రకళ (ఆబ్స్ట్రాక్ట్), నిరాశతో కూడిన గందరగోళ వాదం (డాడాయిజం), అతుకు చిత్రకళావాదం (కొల్లేజి) వగైరా వాదాలు! వీటన్నింటి చర్చ ఈ గ్రంథంలో కనిపించి పాఠకుడి, చిత్రకళా ప్రేమికుడి అవగాహనను ఇనుమడింప చేస్తుంది. అలాగే మన భారతీయ చిత్రకారులు సత్వల్కర్, రాజా రవివర్మ, మంజిత్బావా, శక్తి బర్మన్, నందలాల్ బోస్, అమృత షేర్గిల్, ఎంఎఫ్ హుస్సేన్... ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధ చిత్రకారులు, ఛాయాగ్రాహకులు కొండపల్లి శేషగిరిరావు, ఆచార్య పట్నాయక్, రాజన్‌బాబు, చీమకుర్తి శేషగిరిరావు, కాపు రాజయ్య, ఏలే లక్ష్మణ్, వైకుంఠం, జగదీష్, పిలకా నరసింహమూర్తి, భరత్ భూషణ్ తదితరులపై వ్యాసాలున్నాయి. కేవలం చిత్రకారులే కాక కేశవరెడ్డి, రావిశాస్త్రి వంటి రచయితల గురించి సిటిజన్ కేన్, బైజు బావరా వంటి సినిమాల గురించి... ఒకటనేమిటి మానసిక ప్రపంచంలో తేజస్సును నింపే అనేకానేక విలువైన వివరాల సంకలనం- సప్తవర్ణాల కాంతి- ఈ పుస్తకం. చిత్రకళను ఇష్టపడే ప్రతి ఒక్కరూ దీనిని పరిశీలించాలి. చిత్రకళ పట్ల అభిరుచిని వర్తమానంలో ఉన్నవారికీ, భావితరాల వారికీ చేరువ చేసే ఇలాంటి మంచి ప్రయత్నం కన్నుల పండువగా చేసిన నాగేశ్వరరావు అభినందనీయులు. - ఎ.బి.కె. ప్రసాద్ సప్తపర్ణి- కాండ్రేగుల నాగేశ్వరరావు; చిత్రకళ, చిత్రకారుల పరిచయ వ్యాసాలు (వర్ణ చిత్రాలతో); అన్ని పేజీలూ రంగుల్లో ఉన్న హార్డ్ బౌండ్ పుస్తకం; 334 పేజీలు. రూ. 777; ప్రతులకు: 99480 83387