
కారంచేడు: సూక్ష్మకళపై మక్కువతో సీస లేఖినిలపై (పెన్సిళ్లపై) మహాభారతాన్ని లిఖించింది ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత. మహాభారతంలోని 18 పర్వాలను.. 700 శ్లోకాలను సంస్కృత భాషలో అవలీలగా లిఖించగలిగింది. ఇందుకు ఆమె 810 పెన్సిళ్లను ఉపయోగించింది. వాటిపై 67,230 అక్షరాలను, 7,238 పదాలను లిఖించింది. ఇందుకోసం పెన్సిళ్లను ముందుగా బద్దగా చీల్చి అందులోని లిడ్ 2 మిల్లీమీటర్ల మందం ఉండేలా చూసుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకోవడం లక్ష్యమని మహిత చెబుతోంది.
బియ్యపు గింజలపై సూక్ష్మ కళాకృతులు
మహిత మొదట్లో బియ్యపు గింజలపై సూక్ష్మ కళాకృతులను చెక్కడం ప్రారంభించింది. గింజలపై జాతీయ జెండా, తాళం, బాణం, వినాయకుడు, కొంగ, మినప్పప్పుపైన కూడా వినాయకుడు వంటి ఆకృతులను చక్కగా చెక్కి శభాష్ అనిపించుకుంది. ఆ తరువాత పెన్సిల్‌పై మహాభారతాన్ని చెక్కాలనే ఆలోచనకు పదునుపెట్టింది.
సూక్ష్మ కళలను ప్రోత్సహించాలి
కళలలో సూక్ష్మకళ ఒకటి. అధికారులు, ప్రభుత్వం, ప్రజలు ఇలాంటి సూక్ష్మకళను ప్రోత్సహించాలి. నాలాంటి వారెందరో ఉన్నా.. ప్రతిభను కనబర్చుకునే వీలు లేక ఇలాంటి కళలు మరుగున పడుతున్నాయి. ఆర్థికం, శిక్షణ పరంగా ఈ కళలను ప్రోత్సహించాలి.
– అన్నం మహిత
(చదవండి: సరికొత్త శకం)