
ప్రపంచీకరణతో మన దేశానికి ఏస్థాయిలో మేలు జరిగిందో అదే స్థాయిలో కీడూ జరుగుతోంది. ఇప్పటి వరకూ పాశ్చాత్యదేశాలను మాత్రమే పట్టి పీడిస్తూ వచ్చిన అధిక బరువు, ఊబకాయం(Obesity) లాంటి సమస్య అభివృద్ధి చెందుతున్న భారత్‌కు సైతం తలనొప్పిగా మారింది. ప్రధానంగా చిన్నారులలో అధిక బరువు, ఊబకాయాలు... ఫ్యాటీ లివర్ (Fatty Liver) వ్యాధికి దారి తీయడం ఆందోళన కలిగిస్తోంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనూహ్యంగా మార్పులకు లోనుకావటం, ఆడుకునే అవకాశం లేకపోవడం పిల్లల ఈ స్థితికి కారణమని నిపుణులు అంటున్నారు.
పాఠశాల స్థాయి నుంచే ఆటలకు దూరమవుతున్న చిన్నారులు టీవీలకు, సెల్ ఫోన్లకు బానిసలవుతున్నారు. బాల్యంలో ఓ ప్రధాన భాగమైన సంప్రదాయ (కోతి కొమ్మచ్చి, తొక్కుడు బిళ్ల, కర్రాబిళ్ళా, బెచ్చాలు, గోళీలాంటి) ఆటలకు సైతం నోచుకోలేక పోతున్నారు. విద్యారంగంలో ప్రభుత్వ భాగస్వామ్యం తగ్గి ప్రైవేటు భాగస్వామ్యం రాను రాను పెరిగిపోవడంతో ఆటలు అటకెక్కాయి. చదువే ప్రధాన వ్యాపకంగా మారిపోయింది. విద్య ప్రభుత్వ బాధ్యతగా ఉన్నంతకాలం ప్రాథమిక, ఉన్నత పాఠశాలల స్థాయిలో క్రీడలకు తగిన సదు పాయాలు ఉండేవి.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలకు సువిశాలమైన ఆటస్థలాలతో పాటు తగిన సంఖ్యలో వ్యాయామ ఉపాధ్యాయులు సైతం ఉండటం ఒకప్పుడు సాధారణ విషయమైతే ఇప్పుడు అసాధారణ విషయంగా మారిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు నగరాలలోసింగిల్ బెడ్ రూమ్ పాఠశాలలు, డబుల్ బెడ్ రూమ్ కళాశాలలు మనకు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో క్రీడా సదుపాయాలు, మైదానాలు మచ్చుకైనా కనిపించవు. ఇలాంటి విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు ఆటలంటే ఏమిటో తెలియకుండా అమూల్యమైన తమ బాల్యాన్నీ, విద్యార్థి దశనూ ముగించడాన్ని మించిన విషాదం (Tragedy) మరొకటి లేదు.
చదవండి: ఇరాన్ బీచ్‌లో‘బ్లడ్ రెయిన్’ : నెటిజన్లు షాక్, వైరల్ వీడియో
పాఠశాల దశ నుంచే ఆటలకు, క్రీడాసంస్కృతికి దూరమైన చిన్నారులు ఆ తరువాతి కాలంలో శారీరకంగా, మానసికంగా పలు రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తోంది. మన దేశంలో ఈమధ్య కాలంలో నిర్వహించిన పలు అధ్యయనాల ప్రకారం ఆటపాటలకు దూరమైన చిన్నారులు అధిక బరు వుతో పాటు ఫ్యాటీ లివర్ (నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్) వ్యాధి బారిన పడుతున్నట్లు తేలింది. పిల్లలు బాల్యంలో ఆటలకు దూరం కావడం అంటే శారీరకంగా, మానసికంగా ఎదుగు దలకు దూరంకావటమేనని నిపుణులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనాల ప్రకారం దేశ జనాభాలో 60 శాతం మంది అధిక బరువు సమస్య ఎదుర్కొంటుంటే... అందులో 30 శాతం మంది ఊబకాయం సమస్యతో నానాపాట్లు పడుతున్నారు. బాలల్లో 40 శాతం మంది ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి సైతం హెచ్చరిస్తున్నారు. తమ పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో బాల్యంలో ఆటలూ అంతే ముఖ్యమని తల్లిదండ్రులూ... ఆరోగ్యవంతమైన, ఆహ్లాదభరితమైన బాల్యాన్ని అందించాల్సిన బాధ్యత తమపైనే ఉందని పాలకులూ, పాఠశాలల యాజమాన్యాలు గ్రహించిన రోజే బాల్యం అమూల్యంగా, అపు రూపంగా మిగిలిపోగలుగుతుంది.
– కృష్ణారావు చొప్పరపు
సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment