Fatty liver
-
ఫ్యాటీ లివర్ ఉంటే గుండెపోటు వస్తుందా?
టీవీ నటుడు మొహ్సిన్ ఖాన్ తాను నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) కారణంగా గుండెపోటుకి గురైనట్లు వెల్లడించాడు. అది చాలా సివియర్‌గా వచ్చిందని, రెండు మూడు ఆస్పత్రుల మారినట్లు తెలిపారు. ప్రస్తుతం అంతా బాగానే ఉందని చెప్పుకొచ్చారు. బహుశా నిద్ర లేకపోవడం వల్ల ఇలా వచ్చి ఉండొచ్చని అన్నారు. అసలు ఆల్కహాల్ తాగకుండా ఎలా ఫ్యాటీ లివర్ వస్తుంది?. దీనికి గుండెపోటుకి సంబంధం ఏంటీ..?నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే..?నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌ని NAFLD అని పిలుస్తారు. ఇది ఆల్కహాల్ తక్కువగా తాగే వ్యక్తులను ప్రభావితం చేసే కాలేయ సమస్య. NAFLDలో కాలేయంలో చాలా కొవ్వు పేరుకుపోతుంది. NAFLD తరచుగా లక్షణరహితంగా ఉంటుంది. అయితే ఇది నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH), ఫైబ్రోసిస్, సిర్రోసిస్‌తో సహా మరింత తీవ్రమైన పరిస్థితులకు పురోగమిస్తుంది.ఇది గుండెపోటుకి దారితీస్తుందా..?"కాలేయ సమస్యలు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. గుండెపోటు ముప్పు తీవ్రమవుతుంది. కొవ్వుల జీవక్రియ ప్రక్రియలో అవసరమైన ప్రోటీన్లను ఉత్పత్తి చేయడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సమతుల్య హృదయనాళ వ్యవస్థను నిర్వహించడానికి చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల వల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లేదా క్రానిక్ లివర్ డిసీజ్ లిపిడ్ మెటబాలిజానికి అంతరాయం కలిగిస్తుంది. ఫలితంగా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరిగేందుకు దారితీస్తుంది. ఈ లిపిడ్ అసమతుల్యత అథెరోస్ల్కెరోసిస్‌ను ప్రేరేపిస్తుంది. ధమనులు సంకోచిస్తాయి. తద్వారా గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది."ని చెబుతున్నారు వైద్యలు. ఒత్తిడి, నిద్ర లేకపోవడం, ధూమపానం తదితరాలు జీవక్రియకు అంతరాయం కలిగించి ఫ్యాటీలివర్ బారినపడేలా చేస్తుంది. ఇది హృదయనాళ సమస్యలకు దారితీసి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడించారు వైద్యులు.అలాగే గుండె సమస్యలు ఉన్న రోగులలో కాలేయ వ్యాధి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాలేయానికి తగినంత రక్త ప్రసరణ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. దీనిని కార్డియోజెనిక్ అంటారు. ఇస్కీమిక్ హెపటైటిస్, సిరల పీడనం కారణంగా దీర్ఘకాలిక గుండె వైఫల్య స్థితి ఏర్పడుతుంది. దీనిని కార్డియాక్ సిరోసిస్ అంటారు. కాబట్టి, కాలేయం, గుండె జబ్బుల మధ్య సహసంబంధం ఉంది నివారించడం ఎలా..చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహాదాని దూరంగా ఉండాలి. పుష్కలంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లను కలిగి ఉన్న సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలిరెగ్యులర్ వ్యాయామం తోపాటు రోజులో కనీసం 30 నిమిషాలు శారీరక శ్రమతో కూడిన వర్కౌట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.ఒత్తిడిని నిర్వహించడం, తగినంత నిద్ర పొందడం అత్యంత ముఖ్యంముఖ్యంగా ధూమపానానికి దూరంగా ఉండి హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.(చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద వంకాయ..గిన్నిస్ రికార్డు!) -
బావుంది కదా అని, రోజూ సోడా తాగేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
సుష్టిగా భోంచేసినపుడో, కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడో మనకు వెంటనే గుర్తు వచ్చేది సోడా. సోడా తాగిన బ్రేవ్ మని త్రేన్పు వచ్చి రిలాక్స్ అనిపిస్తుంది చాలామందికి కదా. కానీ అప్పుడపుడు సోడా వాటర్ తాగితే పరవాలేదు. కానీ ఇది ఒక అలవాటుగా మారిపోతే మాత్రం ముప్పు తప్పదు అంటున్నారు నిపుణులు. సోడా తాగితే తప్ప తిన్నది అరగదు అన్న భావనతోపాటు, మార్కెట్లో రకరకాల ఫ్లావర్లలో ఆకర్షిస్తుంటాయి. కానీ సోడా రోజూ తీసుకుంటే ప్రమాదంలో పడినట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.సోడాతో ముప్పురోజూ సోడా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్ మూత్రపిండ వ్యాధి, కాలేయ వ్యాధి, దంత క్షయం, కావిటీస్, గౌట్తోపాటు శరీరంలోని ఎముకలు కూడా బలహీనపడతాయి. ఇంకా శరీరానికి తీవ్రమైన హానికలుగుతుంది. లాలాజలం, దంత సమస్యలు: సోడాలోని చక్కెర, యాసిడ్ చిగుర్లను, దంతాలను దెబ్బతీస్తుంది.నోటి పరిశుభ్రతను పలు విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే సోడా తాగడం వల్ల లాలాజల ఉత్పత్తి తగ్గిపోతుంది. లాలాజలం నోటి ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా నోటిలోని ఆమ్లాలను, ఆహార కణాలు , బ్యాక్టీరియాను కడిగివేయడానికి సహాయ పడుతుంది. సోడాతో లాలాజలం తగ్గి, చిగుళ్ల వ్యాధికి దారి తీస్తుంది. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.సోడా చాలా కార్బోనేటేడ్గా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా పొట్టలో పుండ్లు, పుండ్లు, యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవారికి ఇది ప్రమాదంకరం. అలాగే ఆస్తమా ఉంటే సోడాకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆస్తమాలో ఉండే ప్రిజర్వేటివ్ సోడియం బెంజోయేట్ ఆస్తమాను ప్రేరేపిస్తుంది. దాని వల్ల సమస్యలు మరిన్ని పెరుగుతాయి.ఎముకలు బలహీనంసోడాలో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ శరీరంలోని కాల్షియంను తొలగిస్తుంది. దీంతో రోజూ సోడా తాగే వారి ఎముకలు బలహీనమవుతాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదం: కొంతమంది ఆరోగ్య స్పృహతో డైట్ సోడా తాగడానికి ఇష్టపడతారు. అది తమ ఆరోగ్యానికి మంచిదని వారు భావిస్తారు. కానీ.. డైట్ సోడాలో ఆర్టిఫిషియల్ స్వీటెనర్ వాడటం వల్ల స్థూలకాయానికి గురవుతారు. అంతే కాదు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన కూడా పడవచ్చు. మెటబాలిక్ సిండ్రోరమ్ దెబ్బతిని షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలను 67 శాతం పెంచుతుంది.చర్మంపై దురదలుసోడాలో బ్రామినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కలుపుతారు. ఈ కెమికల్ కారణంగా చర్మంపై దురదలు రావచ్చే. నరాల బలహీనత కూడా వచ్చే అవకాశం ఉంది. గుండె జబ్బుల ప్రమాదం: రోజూ సోడా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడవచ్చు.అలాగే గుండెలోని ధమనులను దెబ్బతీస్తాయి. సోడాలోని ఫాస్పేట్స్, ఫాస్పారిక్ యాసిడ్ వల్ల తొందరగా వృద్ధాప్యం వచ్చే ప్రమాదం ఉంది.షుగర్వ్యాధి: దీని వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.సోడా తాగడం, ట్రైగ్లిజరైడ్స్ 30 శాతం పెరుగుతాయి. మంచి (HDL) కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు. మెదడుకు చేటు: డైట్ సోడాల్లో తక్కువ కేలరీలు ఉన్నప్పటికీ, కృత్రిమ స్వీటెనర్లు మెదడు కణాలను కూడా దెబ్బతీస్తాయి. -
కాలేయం కోసం కాస్త శ్రద్ధ ఇలా...
మధ్యవయసు దాటాక వయసుతో పాటు దేహంలో కొవ్వు కూడా పెరుగుతుంది. ఇదే కొవ్వు కాలేయంలోని నార్మల్ కణాల్లో కూడా పెరుగుతూ, పేరుకుపోతూ ఉండవచ్చు. అదే ఫ్యాటీలివర్. కొన్నిసార్లు అది రక్తప్రవాహానికీ అడ్డురావచ్చు. అప్పుడు కాలేయం ఆకృతి, దాని స్వాభావికమైన రంగు దెబ్బతినవచ్చు. కాస్త గట్టిగా లేదా జిగురు జిగురుగా, పచ్చరంగుకు మారవచ్చు. ఆ కండిషన్‌నే సిర్రోసిస్ అంటారు. కొన్నిసార్లు దేహంలోకి చాలా ప్రమాదకరమైన విషాలు ప్రవేశించడం వల్ల గానీ, కొన్ని వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల, తగినంత ఆహారం తీసుకోకుండా, మితిమీరిన ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా సిర్రోసిస్ రావచ్చు. అలాంటి సమయంల్లో దేహంపైన సాలీడు ఆకృతిలో రక్తనాళాలు బయటకు కనిపించవచ్చు. ఆకలి లేకపోవడం, నీరసం, నిస్సత్తువ, పొట్టలో విపరీతంగా గ్యాస్ పేరుకుపోవడం, కళ్లు పసుపు రంగులో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాలి. అప్పుడు డాక్టర్లు లివర్ ఫంక్షన్ టెస్ట్ వంటి కొన్ని పరీక్షలు చేసి కాలేయం పనితీరు తెలుసుకుంటారు. కాలేయం పనితీరు బాగుంటే ఫరవాలేదు. ఒకవేళ ఫ్యాటీలివర్ ప్రాథమిక దశలో ఉన్నా అంతగా ప్రమాదం ఉండదు. బరువు పెరగడాన్ని నియంత్రించుకోవాలి. మద్యం పూర్తిగా మానేయాలి. అన్నిరకాల పోషకాలు అందేలా... ముఖ్యంగా విటమిన్ బి లాంటివి అందేలా మంచి ఆహార నియమాలు పాటించాలి. రోజూ కొద్దిగా వ్యాయామం చేయాలి. ఇలా ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తూ ఉంటే కొద్దిపాటి మందులతోనే కాలేయం బాగుపడుతుంది, బాగుంటుంది. సాధారణంగా కాలేయం తాను దెబ్బతిన్న భాగాన్ని తనంతట తానే బాగుచేసుకుంటుంది. అలా ఒకసారి అది తనను రిపేర్ చేసుకోలేనంతగా దెబ్బతింటే మాత్రం కాలేయ మార్పిడి తప్ప మరొక ప్రత్యామ్నాయం ఉండనందున... ఒక వయసుదాటాక కాలేయంపై శ్రద్ధ అవసరం. -
ఫ్యాటీ లివర్.. పారా హుషార్...
కరోనాతో మారిన పరిస్థితులు, జీవనశైలుల కారణంగా శారీరక శ్రమ ఆహారపు అలవాట్లలో తీవ్రమైన మార్పుల వల్ల కొన్ని అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయి. వాటిలో ఒకటి ఫ్యాటీ లివర్. ప్రపంచవ్యాప్తంగా యువతలో ఫ్యాటీ లివర్ సమస్య బాగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న అపోలో స్పెక్ట్రా ఆసుపత్రికి చెందిన వైద్యులు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డా. జగన్మోహన్రెడ్డి అందిస్తున్న విశేషాలు, సూచనల సమాహారం... కీలకం...కాలేయం.. మానవ శరీరంలోని అతిపెద్ద అంతర్గత అవయవం కాలేయం. ఈ ఒక్క అవయవం మన ఆరోగ్యంపై ఎన్నో రకాలుగా ప్రభావం చూపిస్తుంది. కుడివైపు దిగువన పక్కటెముకల కిందుగా ఉండే ఈ అవయవం...అనేక ప్రధాన విధులు నిర్వర్తిస్తుంది. శరీరంలో తయారయే హానికారక రసాయనాలను తొలగించడంతో పాటు బైల్ అనే లిక్విడ్‌ను అది తయారు చేస్తుంది. అలాగే ఆహారంలోని కొవ్వును కరిగించడంలో సహకరిస్తుంది. అవసరమైనప్పుడు వెంటనే శక్తిని అందించేందుకు వీలుగా గ్లూకోజ్ నిల్వలను ఉంచుతుంది. ఇన్ని కీలక విధులు నిర్వర్తిస్తున్నా వైద్య పరమైన జాగ్రత్తల విషయంలో దీన్ని మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేస్తుంటాం. అలాంటి నిర్లక్ష్యాల వల్ల వచ్చే సమస్యల్లో ఫ్యాటీ లివర్ ఒకటి. ఆల్కహాలిక్/నాన్ ఆల్కహాలిక్లకూ... హాని కలిగించే స్థాయిలో ఆల్కహాల్ సేవించేవారిలో ఎక్కువగా ఫ్యాటీ లివర్ సమస్య కనిపిస్తుంది. అయితే ఫ్యాటీ లివర్ సమస్య నాన్ ఆల్కహాలిక్ లకూ వస్తుంది. ఎవరికైతే బాడీ ఇండెక్స్ మాస్ ఎక్కువగా ఉంటుందో అలాగే సరైన శారీరక శ్రమ లేని వారిలో కూడా ఇది కనిపిస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే తగిన విధమైన చికిత్స అందించకపోతే అది ఫైబ్రోసిస్‌కి దారి తీస్తుంది. తద్వారా ఇది కాలేయాన్ని మచ్చలు పడేలా చేస్తుంది. మరింత ముదిరితే ఇది సిర్రోసిస్ అనే పరిస్థితికి దారి తీసి ఆరోగ్యాన్ని కోలుకోలేని విధంగా దిగజారుస్తుంది. ఈ సమస్య ఉన్నవారిలో చాలా మంది అది ఉన్నట్టుగా తెలియదు. లక్షణాలు ఉన్నప్పటికీ... దాన్ని గుర్తించలేం. అయితే అన్నీ కనిపించాలని కూడా లేదు. క్రమబద్ధమైన రక్త పరీక్షల ద్వారా దాన్ని ముందస్తుగానే గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది. లక్షణాలు... స్వల్పంగా నొప్పి లేదా కుడివైపు పొట్ట ప్రాంతంలో నిండుగా ఉన్నట్టు అనిపించడం. ఎఎస్‌టి, ఎఎల్‌టి వంటి లివర్ ఎంజైమ్స్ స్థాయిల్లో పెరుగుదల ఇన్సులిన్ స్థాయిలు బాగా పెరగడం ట్రైగ్లిజరైడ్స్ స్థాయిల పెరుగుదల నాన్ ఆల్కహాలిక్లో ఫ్యాటీ లివర్ పెరిగితే.. స్టీటోహెపటైటిస్ అనే పరిస్థితికి దారి తీస్తుంది. ఇది ఫ్యాటీ లివర్ తర్వాత దశ. అధికంగా కొవ్వు పేరుకోవడం వల్ల కాలేయ మంట వస్తుంది. దీని లక్షణాలు ఇలా ఉంటాయి. ఆకలి మందగించడం వాంతి లేదా వికారంగా ఉండడం పొట్టలో భరించలేని నొప్పి చర్మం, కళ్లు పచ్చ బడడం కడుపులో ఇబ్బంది (ద్రవాలు పేరుకుపోవడం వల్ల) ఆరోగ్యకరమైన రీతిలో శరీరపు బరువు మెయిన్‌టెయిన్ చేసే వారిలో కూడా నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు కూడా ఫ్యాటీ లీవర్‌కు కారణమవుతుంది. అలాగే ఆరోగ్యకరమైన రీతిలో బాడీ మాస్ ఇండెక్స్ మెయిన్‌టెయిన్ చేసేవారిలో కూడా మొత్తంగా ఆరోగ్యాన్ని మెయిన్‌టెయిన్ చేయడం ముఖ్యం. శరీరపు బరువు తగ్గితే లివర్ ఫ్యాట్ కూడా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆహారపు క్రమశిక్షణ ద్వారా వ్యాయామం ద్వారా దీన్ని సాధించవచ్చు. ఫ్యాటీ లివర్ రాకుండా... ప్రతి రోజూ ఏదో ఒక రకమైన వ్యాయామం చేయడం అనేది లివర్ ఫ్యాట్‌ని నివారించేందుకు ఉత్తమ మార్గం. వ్యాయామం, రెసిస్టెన్స్ ట్రైనింగ్ లు లివర్ సెల్స్‌లో పేరుకున్న కొవ్వుల్ని తగ్గించగలవు. రోజులో కనీసం 30 నిమిషాల పాటు ఏదో ఒక రకమైన శారీరక శ్రమ చేసినట్లయితే లివర్‌లోని కొవ్వు నిల్వలు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే రిఫైన్డ్ కార్బొహైడ్రేట్స్ అతిగా తీసుకోవడం ప్రస్తుతం యువతో బాగా పెరిగింది. ఈ రిఫైన్డ్ కార్బొహైడ్రేట్స్ లివర్‌లో ఫ్యాట్‌ని పెంచుతాయి. అధిక బరువున్న వారు, ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారు ఇవి తీసుకుంటే అది మరింతగా లివర్ని డ్యామేజ్ చేస్తుంది. వీటిని తగ్గిస్తే ఆ మేరకు ఫ్యాటీ లివర్ పెరిగే అవకాశాలు తగ్గిపోతాయి. తీయని ద్రవపదార్ధాలు కూడా కాలేయంపై ప్రభావం చూపుతాయి. సోడా తదితర గ్యాస్ నింపిన పానీయాలు పెద్ద పరిమాణంలో ఫ్రక్టోజ్‌ను కలిగి ఉంటాయి. ఫ్రక్టోజ్‌ను ఎక్కువగా తీసుకుంటే అది కాలేయం చుట్టూ కొవ్వు పేరుకునేలా చేస్తుంది. ఈ పరిస్థితి పెద్దలతో పాటు చిన్నారుల్లో కూడా కనిపిస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన కాలేయాన్ని కలిగి ఉండడం అనేది అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా శరీరంలోని ప్రతి అవయవం పనితీరును గమనిస్తూ దాని ఆరోగ్యంగా ఉంచేందుకు వీలుగా ప్రతి వ్యక్తి మంచి ఆహారం/నిద్ర అలవాట్లతో తమ దినచర్యను దీర్చిదిద్దుకోవడం అవసరం. డా.జగన్మోహన్రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి, కొండాపూర్, హైదరాబాద్ -
ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది?
ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 59 ఏళ్లు. నాకు విరేచనం సాఫీగా కావడం లేదు. బీపీ, షుగర్ వ్యాధులకు మందులు వాడుతున్నాను. నియంత్రణలోనే ఉన్నాయి. విరేచనం కోసం ఆయుర్వేద మందులు తెలియజేయగలరు. - వి.కె. రమణారావు, విశాఖపట్నం నిత్యవిరేచనం అవటంలో సమస్యలుంటే, దానిని ‘మలబంధం’ అనే పేరుతో వివరించింది ఆయుర్వేదం. జీర్ణకోశవ్యవస్థను ‘మహాకోష్ఠం’ అని చెప్పింది. ఇది పిత్తప్రధానంగా ఉండే ‘మృదుకోష్ఠం’. వాత ప్రధానంగా ఉంటే క్రూరకోష్ఠం. జీర్ణాశయ కర్మలన్నీ సజావుగా సాగిపోతే ‘సమకోష్ఠం’ మలబంధం వాతప్రకోపం వల్ల కలుగుతుంది. ఆహారంలో తీపి, పులుపు, ఉప్పు తగినంత ప్రమాణంలో లేకపోవడం, స్నిగ్ధాహారం లోపించడం (అంటే జిడ్డుగా మృదువుగా ఉండే పాయసాల వంటి ఆహారం), తాజా పండ్లు తినకపోవడం, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పచ్చిగా ఉండేవీ, ఎండుఫలాలూ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోకపోవడం వంటివి దీనికి కారణాలు. దానికి తోడు కనీసం రోజూ 3 లీటర్ల నీరు తాగడం అవసరం. ప్రతిరోజూ 45 నిమిషాలపాటు ఏదో ఒక రూపంలో వ్యాయామం చేయాలి. ముఖ్యంగా పొట్టని కదిలించే ‘కపాలభాతి’ వంటి యోగప్రక్రియలు, ఇతర యోగాసనాలు విరేచనం సాఫీగా కావడానికి ఉపకరిస్తాయి. రాత్రిపూట జాగారం చేయడం, తగినంత నిద్ర లేకపోవడం, మద్యం, పొగతాగే అలవాటు వంటివి కూడా మలబంధానికి దారితీస్తాయి. మానసిక ఒత్తిడి వల్ల కూడా పొట్ట ఉబ్బరించడం, మలబంధం సంభవించవచ్చు. చికిత్స: మంచి ఆహార, విహారాలను పాటించడం అత్యవసరం షుగరు, బీపీల వంటి వ్యాధులైనా ఉంటే వాటిని నియంత్రించడం ఆహారంలో ఆకుకూరలు, పొట్లకాయ, బీరకాయ, పనసపొట్టు, చిక్కుడు జాతి కూరలు, అరటిదవ్వ తీసుకోవడం, బార్లీ ద్రవాలు ఎక్కువగా తాగడం రోజూ ఉదయం లేవగానే ఒక లీటరు నీళ్లను తాగడం (గమనిక : గుండె, మూత్రపిండాల జబ్బులు ఉన్నవారు నీళ్లు అధికంగా తాగకూడదు). ఔషధాలు: మృదువుగా మల విసర్జన అయ్యేలా చూసేవి... కరక్కాయ చూర్ణం (హరీతకీ) : 3 నుంచి 5 గ్రాములు నీళ్లతో రాత్రి సేవించాలి. త్రిఫలాచూర్ణ (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ): 5 నుంచి 10 గ్రాములు వరకు నీళ్లతో కషాయం కాచుకొని 30 మి.లీ. రాత్రిపూట తాగాలి. ఆరగ్వధ (రేల) గుజ్జు; సునాముఖి ఆకు కూడా విరేచనం మృదువుగా అయ్యేలా చూసేవే. వీటిని వాడాలంటే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి. తీక్ష్ణరేచకాలు : హేరండ (ఆముదం), దంతి (నేపాళం)... వీటిని కూడా వైద్యల పర్యవేక్షణలోనే వాడాలి. ‘అభయాదిమోదక’ మాత్రలు బజారులో లభిస్తాయి. వీటిని 1 మాత్ర రాత్రి నీళ్లతో తీసుకోవాలి. స్నిగ్ధం ఉండటం రేచకాలు (మలవిసర్జన మృదువుగా, సాఫీగా అయ్యేవి... ధాత్రీతైలం, హింగుత్రిగుణతైలం (మోతాదు 2 చెంచాలు, పాలతో రాత్రి). సూచన: మృదురేచకాలలో ఏదైనా ఒక్కటి తగిన మోతాదులో వాడుకోవచ్చు. అయితే విరేచనం కోసం కేవలం ఔషధాలపైన ఆధారపడటం శాస్త్రీయం కాదు. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్ హుమాయూన్‌నగర్, హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. ఇటీవల నా బరువు అధికంగా పెరిగింది. దాంతో డాక్టర్ దగ్గరికి వెళ్లి కొన్ని పరీక్షలు చేయించుకున్నాను. వీటిల్లో ఫ్యాటీలివర్ అని తేలింది. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? దీని గురించి వివరించండి. - రామస్వామి, ఖమ్మం కాలేయం కొవ్వుకు కోశాగారం లాంటిది. ఇది కొవ్వు పదార్థాలను గ్రహించి, వాటిని శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంది. ఇది ఒక సంక్లిష్టమైన చర్య. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా... కాలేయంలోని కొవ్వు వినియోగం కాకుండా, అందులోనే చేరుతూ ఉంటుంది. ఇదే క్రమంగా ఫ్యాటీలివర్‌కు దారితీస్తుంది. ఇది రెండు కారణాల వల్ల వస్తుంది. మొదటిది మద్యం ఎక్కువగా తీసుకోవడం, రెండోది మద్యం అలవాటుకు సంబంధించని కారణాలు. ఇందులో స్థూలకాయం, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, హైపోథైరాయిడిజమ్ వంటివీ వస్తాయి. సాధారణంగా ఫ్యాటీలివర్ సమస్య ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు. కేవలం అల్ట్రాసౌండ్ స్కానింగ్ (కడుపు భాగం), కాలేయ సంబంధ పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ సమస్య బయటపడుతుంది. ఇలా ఆ పరీక్షల ద్వారా కాలేయ కణాల్లో కొవ్వు చేరిందని తెలుసుకున్నప్పుడు దాన్ని ఫ్యాటీలివర్‌గా గుర్తిస్తారు. సాధారణంగా ఫ్యాటీలివర్ సమస్యవల్ల 80 శాతం మందిలో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. అయితే 20 శాతం మందిలో అది రెండో దశకు చేరుకోవచ్చు. ప్రధానంగా ఇది మెటబాలిక్ సిండ్రోమ్ అనే సమస్యకు కారణమై... గుండెకు, మెదడుకు సంబంధించిన ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉంది. మీకు ఫ్యాటీలివర్ ఉందని నిర్ధారణ అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకొని, దానికి కారణాలను కనుగొని, తగిన మందులు వాడాల్సి ఉంటుంది. కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి. మామూలుగా మధ్యవయసులో ఉన్నవారికి చాలా పరిమితమైన కొవ్వులు సరిపోతాయి. ఇక జంతుసంబంధమైన కొవ్వులను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. మీరు ఒకసారి మీకు దగ్గరలోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను ఒకసారి కలవండి. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ న్యూరో కౌన్సెలింగ్ మా బాబు వయసు 12 ఏళ్లు. వాడు మూడేళ్ల వయసున్నప్పుడు ఆటలాడుతూ ఒకసారి కిందపడ్డాడు. అప్పుడు వాడికి తలమీద గాయం తగిలింది. కానీ అప్పుడు ఏమీ కాలేదు. బొడిపెలాగ వాపు వచ్చి కొన్ని రోజుల తర్వాత అదే తగ్గిపోయింది. అయితే ఈమధ్య మా బాబు ఒకసారి స్కూల్లో ఫిట్స్ వచ్చి కళ్లు తిరిగి పడిపోయాడు. అప్పటినుంచీ అప్పుడప్పుడూ అలా వస్తూనే ఉంది. మా ఇంటి దగ్గర్లోకి డాక్టర్‌కి చూపెట్టాం. ఆయన కొన్ని మందులు రాసిచ్చారు. అప్పటికి తగ్గిపోయింది గానీ మాకు భయంగా ఉంది. వాడికేమీ గుర్తుండడం లేదు. చిన్నప్పుడు తలకు తగిలిన గాయం వల్ల మా బాబు మెదడుకు ఏమైనా హాని జరిగిందేమోనని మాకు భయంగా ఉంది. దయచేసి మా బాబు సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - లక్ష్మి, తిరుపతి సాధారణంగా చిన్నవయసులో ఆటలాడుతున్నప్పుడు అందరూ కింద పడుతూనే ఉంటాం. శరీరానికి చాలా చోట్ల దెబ్బలు తగలడం, తగ్గిపోవడం జరుగుతుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే పైకి కనిపించని దెబ్బలు శరీరంలో చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా తలకు చిన్నతనంలో ఎప్పుడైనా గాయం తగలితే ఎంతమాత్రమూ అశ్రద్ధ చేయకూడదు. వయసు పెరుగుతున్నకొద్దీ తలలో గాయం కూడా పెరుగుతుంటుంది. మీరు వివరించినట్లు మీ అబ్బాయికి చిన్నప్పడు ఆటల సందర్భంలో తగిలిన గాయం వల్లనే ఫిట్స్ రావడం, కళ్లు తిరిగి పడిపోవడం జరుగుతుండవచ్చు. మెదడులోని విద్యుత్ ప్రభావం వల్ల ఫిట్స్‌లా వచ్చి బయటపడుతుండవచ్చు. అయితే అది ఏస్థాయిలో ఉంది, దాని పరిమాణం ఎంత అనేది సీటీ స్కాన్, ఎమ్మారై లాంటి కొత్తగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్యపరిజ్ఞానంతో కనిపెట్టగలం. ఆ పరీక్షల తర్వాతనే చికిత్సా ప్రక్రియ కొనసాగుతుంది. అయితే నిష్ణాతులైన వైద్యులతో మీ బాబు సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. కాబట్టి అతడి విషయంలో ఎలాంటి భయాందోళనలు చెందవలసిన అవసరం లేదు. కానీ మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే మీ బాబుకి తగిన పరీక్షలు నిర్వహించి తగిన చికిత్సను అందించండి. అతడు పూర్తిగా కోలుకుంటాడు. డాక్టర్ పి. రంగనాథమ్ సీనియర్ న్యూరోసర్జన్ యశోద హాస్పిటల్స్ సోమాజీగూడ హైదరాబాద్