బరువుగా పెంచకండి | Easy Tips In Telugu To Prevent Obesity In Childhood | Sakshi
Sakshi News home page

బరువుగా పెంచకండి

Apr 30 2022 8:22 PM | Updated on Apr 30 2022 9:22 PM

Easy Tips In Telugu To Prevent Obesity In Childhood - Sakshi

కొంతమంది తల్లులు పిల్లల మీద ప్రేమతో వారు వద్దంటున్నా వినకుండా కొసరి కొసరి తినిపిస్తారు. తల్లులతోపాటు నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యల వంటి వారు కూడా లేకలేక పుట్టారనో, బోలెడంత మంది ఆడపిల్లల్లో ఒక్కగానొక్క మగపిల్లాడని లేదా అందరు మగపిల్లల మధ్య మహాలక్ష్మి లా ఒకే ఆడపిల్ల అనో అతిగా గారం చేసి వారికి అతిగా తినిపిస్తారు. దాంతో పిల్లలు విపరీతంగా బరువు పెరిగిపోతారు.

బొద్దుగా ఉంటే ముద్దుగానే ఉంటారు కానీ, క్రమేణా ఆ బొద్దుతనం కాస్తా ఊబకాయంగా మారిపోతుంది. ఫలితంగా పెద్దయ్యేకొద్దీ రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. దేనినైనా చేతులు దాటకముందే పరిష్కరించుకోవాలి లేదంటే డాక్టర్ల దాకా వెళ్లాల్సి వస్తుంది. పిల్లలు బొద్దుగా ఉండటం కాదు... ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. లావుగా ఉండే పిల్లల ఆహారపుటలవాట్లలో, జీవనశైలి లో చిన్నచిన్న మార్పులు చేస్తే వారు ఆరోగ్యంగా పెరుగుతారు. దీనిపై అవగాహన కోసం...

కొంతమంది పిల్లలు లావుగా ఉన్నప్పటికీ, టీనేజీకొచ్చేసరికి సన్నబడిపోతారు. కానీ ఒక్కోసారి అలా జరగకపోవచ్చు. ఒక పరిశోధన ప్రకారం 5.5 ఏళ్ల వయసులో బరువు ఎక్కువ ఉన్న పిల్లలలో 60 శాతం మంది 20 ఏళ్ల వయస్సులో కూడా బరువు ఎక్కువే ఉన్నారు. రెండున్నర ఏళ్ల వయసులో బరువు ఎక్కువ ఉన్న పిల్లలలో 44 శాతం మంది 16 ఏళ్ల వయస్సులో కూడా ఎక్కువ బరువే ఉన్నారు. ఎందుకంటే, వయసు పెరిగిన కొద్దీ, కాస్తో కూస్తో లావెక్కడం సహజం. అలాగని చిన్నప్పుడు సన్నగా ఉన్నవారు పెద్దయ్యాక లావెక్కరని కాదు. చిన్నప్పటినుంచి ఉన్న బరువు అలాగే కొనసాగడం వల్ల వారు రకరకాలయిన ఇబ్బందులు పడతారు. స్కూల్‌లో, కాలేజీలో తోటిపిల్లలు వారికి పేర్లు పెడతారు. అదేవిధంగా తమకు నచ్చిన దుస్తులు ధరించలేరు. 

పిల్లలు టీనేజీలోకి వచ్చాక సామాజికంగా వారే తెలుసుకుని తాము తగ్గాలో పెరగాలో అనేది వారే డిసైడ్‌ చేసుకుంటే అది ఒక రకం కానీ, పెద్దల గారం మూలంగా బరువు పెరిగిన పిల్లలు పెద్దయ్యాక స్థూలకాయులుగా తయారు కాకుండా ఏం చేయాలో చూద్దాం. 

జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉంచాలి: చాక్లెట్లు, స్వీట్లు, పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్‌ఫుడ్స్‌ వంటివి అలవాటు చెయ్యకుండా ఉండడం అత్యవసరం. బరువు పెంచే లక్షణాలు వాటిలోనే అధికంగా ఉంటాయి. పైగా ఆయా పదార్థాల రుచిని పెంచడం కొరకు అజీనమోటో వంటి హానికర రసాయన పదార్థాలు కలుపుతారు. అవి పిల్లల శారీరక ఎదుగుదలతోపాటు మెదడులోని నరాల ఎదుగుదలను దెబ్బతీస్తాయి కాబట్టి అటువంటి వాటిని అతిగా ఇవ్వకుండా అప్పుడప్పుడు మాత్రమే తినిపించాలి. 

ఇక ఇంట్లో చేసిన ఆహారపదార్థాలలో కూడా రుచి కోసం విపరీతంగా నూనెపోసి చేసే వేపుడు కూరలు, మసాలాలు, నెయ్యితో తయారు చేసిన స్వీట్లు కూడా పరిమితికి మించి తినిపించకూడదు. అవి తినకుండా ఉండలేని స్థితికి తీసుకుని రాకూడదు. అంత అతిగా అలవాటు చెయ్యకూడదు. 

పిల్లలు స్కూల్‌కు వెళ్ళే సమయంలో స్నాక్స్‌ కావాలని మారాం చెయ్యడం సహజం. అటువంటి సందర్భాల్లో చాక్లెట్లు, చిప్స్‌ వంటి వాటి బదులు ఇంటిలో చేసిన పల్లీపట్టీలు, బెల్లం వేరుశనగ ఉండలు, మినప సున్నిఉండలు, నువ్వుల ఉండలు, ఇంట్లోనే చేసిన బూందీ, కారా వంటివి ఇవ్వడం ఉత్తమం.

పిల్లలు ఏం తినాలి? ఎంత తినాలి? ఎలా తినాలి? జంక్‌ ఫుడ్‌ నుండి పిల్లలను ఎలా రక్షించుకోవాలి?
బిడ్డకు ఊబకాయం వచ్చేసిన తరవాత తల్లిదండ్రులు చెయ్యగలింగింది ఎక్కువ ఉండదు. అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 
ఆత్మన్యూనతాభావం: బిడ్డ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే పనులు, మాటలకు దూరంగా ఉండటం ఉత్తమం. 

పొట్టమాడ్చకూడదు:  పిల్లలు లావు అవుతున్నారు కదా అని ఒక్కసారిగా తిండి తగ్గించడానికి ప్రయత్నం చెయ్యకండి. ఆలా చేస్తే వారి పసిమనసుకు తప్పుడు సంకేతాలు వెళతాయి. మెల్లి మెల్లిగా తగ్గించాలి. తక్కువ క్యాలరీలుండే మరమరాలు, అటుకులు, పుచ్చకాయ, బొప్పాయి ముక్కలు వంటి వాటిని ఎక్కువ అలవాటు చెయ్యాలి.

వ్యాయామం: శారీరక శ్రమను ప్రోత్సహించండి. వారి చేత గార్డెనింగ్‌ చేయించడం, చిన్న చిన్న దూరాలు నడిపించడం, లిఫ్ట్‌కు బదులుగా మెట్లెక్కేలా చేయడం వంటివి. 

మానసిక ఆరోగ్యం: బిడ్డ ఎక్కువ తినటానికి కారణం వత్తిడి, ఆందోళన, అభద్రతా భావం కావచ్చును. సందర్భాన్ని బట్టి నిపుణులను సంప్రదించండి.

జీవనశైలి: ఏవైనా మార్పులు ఎల్లకాలం పాటించగలిగేలా ఉండాలి. రోజూ స్నానం చేసినట్లు, లేదా పళ్ళు తోముకున్నట్లు. మార్పులు జీవనశైలిలో భాగం కావాలి. అంతేకానీ, జబ్బుకన్నా మందు కష్టం కాకూడదు. నిరంతరం బరువు తగ్గటం లేదన్న భావనతో బాధ పడటం కన్నా ఊబకాయంతో బాధపడటం కొంతలో కొంత మేలు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement