ఒబెసిటీ.. అధిక బరువే కాదు అంతకు మించి | The causes of obesity are not as simple as you might think | Sakshi
Sakshi News home page

ఒబెసిటీ.. అధిక బరువే కాదు అంతకు మించి

Published Wed, Mar 17 2021 6:55 PM | Last Updated on Wed, Mar 17 2021 7:43 PM

The causes of obesity are not as simple as you might think - Sakshi

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సమస్య ఒబెసిటీ. వ్యక్తుల ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం వంటి అనేక కారణాలతో ఇప్పుడు ఇదొక జీవనశైలికి సంబంధించిన అంశంగా మారింది.  అందరూ దీనిని కేవలం అధిక బరువుతోనే కొలుస్తుంటారు. అయితే ఇది అంతకు మించిన తీవ్రమైన పరిస్థితిగా పరిగణించి పూర్తి స్థాయి చికిత్స చేయాలి అంటున్నారు కేర్‌ ఆసుపత్రికి చెందిన డా.బిపిన్‌ సేథీ. రోజువారీ జీవనం మీద ఒబెసిటీ ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. హృద్రోగం, డయాబెటిస్, హై బ్లడ్‌ ప్రెషర్, కీళ్ల నొప్పులు.. ఇంకా అనేక ఇతర తీవ్రమైన అనారోగ్యాలతో  పాటు కొన్ని రకాల కేన్సర్‌లకూ  కారణమవుతుంది. కేవలం శారీరకమైనవే కాకుండా డిప్రెషన్, న్యూనతాభావం తదితర మానసిక సమస్యలకూ ఇది దోహదం చేస్తుంది. 

సరైన కారణం గుర్తించాలి
ఒబెసిటీ విషయంలో వ్యక్తిగత బాధ్యతా రాహిత్యం, విల్‌పవర్‌ లోపించడం.. వంటివి చూపిస్తూ బాధితులపైనే పూర్తిగా నెపం వేస్తుంటారు. అలాగే కేవలం ఎక్కువ తినడం, వ్యాయామం లేకపోవడం వంటివి మాత్రమే ఒబెసిటీకి కారణం కావనేది అర్ధం చేసుకోవాలి. దీనికి జన్యుపరమైన సమస్యలతో పాటు పరిసరాలు, వాతావరణం, ప్రవర్తన... ఇవన్నీ కూడా కారణాల్లో ఉండొచ్చు.. ఒబెసిటీ కారణాల గురించి మనకు తక్కువ అవగాహన ఉంది. హార్మోనల్‌ కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఏదేమైనా దీనిని సరైన రీతిలో అర్ధం చేసుకునే దశలోనే మనం ఉన్నాం. కాబట్టి త్వరపడి ఏదోఒక కారణాన్ని నిర్ధారించుకుని చికిత్స సరికాదు. 

చికిత్సకు నిర్ణీత వ్యవధి
ఒబెసిటీ బాధితులు కూడా తామేదో హార్మోనల్‌ సమస్య అని భావిస్తూ సరైన క్రమపద్ధతిలో కాకుండా త్వరితంగా సమస్య నుంచి బయటపడే మార్గాలు వెతుకుతుంటారు. అది సరైంది కాదు ఈ సమస్య నుంచి కోలుకోవడానికి జీవిత కాలపు ఆరోగ్య నిపుణుల అవసరం ఉంటుంది. వ్యక్తులకు సంబంధించిన డైట్‌ మాత్రమే కాకుండా తినే ఆహారం, అలాగే వ్యాయామాలను పరిశీలించాల్సి ఉంది. నెగిటివ్‌ కేలరీ బ్యాలెన్స్‌తో పాటు ఇదొక దీర్ఘకాలికం కొనసాగాల్సిన ప్రక్రియ, అంతే తప్ప శరవేగంగా ఫలితాలను ఆశించడం, వెంటనే బరువు తగ్గాలని కోరుకోవడం, పెళ్లి వంటి వేడుకల కోసం హడావుడిగా సర్జరీ ప్లాన్స్‌ ఎంచుకోవడం వల్ల సరైన ఫలితం రాదు. 

తీవ్రతకు తగ్గ చికిత్స
వ్యక్తిగత ఒబెసిటీ తీవ్రతపై ఆధారపడి దీనికి చికిత్స ఉండాలి. అలాగే వ్యక్తిగత ఆరోగ్య ప్రమాదాలు, మానసిక ప్రవర్తన శైలులు, మెటబాలిక్‌ క్యారెక్టరిస్టిక్స్‌లతో పాటు గతంలోని అధిక బరువు తగ్గించుకునే యత్నాలు వాటి ఫలితాలు కూడా దీనిలో పరిగణనలోకి తీసుకోవాలి. వ్యక్తిగత చికిత్సా పద్ధతులు అనుసరిస్తూ మల్టీ లెవల్‌ ఒబెసిటీ మేనేజ్‌మెంట్‌ నెట్‌వర్క్‌తో సమన్వయంతో పనిచేస్తే లక్ష్యం చేరుకోవడానికి  వీలవుతుంది. ఒబెసిటీ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యం కలిగిన బృందం పనిచేయాలి.

చికిత్సలో  భాగంగా అన్ని రకాల ప్రోగ్రామ్స్‌ నిర్వహించాలి. రోగి జీవనశైలికి, ప్రాధామ్యాలకు నప్పేలా దీనిని డిజైన్‌ చేస్తారు. మందుల వాడకాన్ని సమీక్షించడం, మార్పు చేర్పులు, పోషకాల సహకారం, శారీరక కార్యకలాపాలు పెంచడం, కౌన్సిలింగ్, రోగికి నప్పేదైతే బేరియాట్రిక్‌ సర్జరీ.. వంటివన్నీ ఇందులో భాగంగా ఉంటాయి. పలువురు భావిస్తున్నట్టు ఇది ఒంటరిగా పోరాడే పరిస్థితి కాదు. వైద్య నిపుణుల పర్యవేక్షణ సహకారం అవసరం. 

- డాక్టర్‌ బిపిన్‌సేథీ, కన్సల్టెంట్‌ ఎండోక్రైనాలజిస్ట్, కేర్‌ హాస్పిటల్స్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement