ఒళ్లు బరువు?కళ్లు తెరువు! | Rock weight? Open the eyes! | Sakshi
Sakshi News home page

ఒళ్లు బరువు?కళ్లు తెరువు!

Published Mon, Oct 20 2014 11:02 PM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM

Rock weight? Open the eyes!

స్థూలకాయం సమస్య తీవ్రంగా మారింది. ప్రజల జీవనశైలిపై దాని ప్రభావాలు విపరీతంగా ఉంటూ ఇటీవలి కాలంలో ఆరోగ్య సమస్యలకు అది కారణమవుతోంది. ఉదాహరణకు స్థూలకాయం చాలామందిలో డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, క్యాన్సర్లు, శ్వాససంబంధమైన వ్యాధులకు దారితీస్తుంది. ఈ శతాబ్దానికి అదో పెద్ద విపత్తుగా మారిందనడం అతిశయోక్తి కాదు. భారత్‌లో కనీసం ఆరు శాతం ప్రజలు స్థూలకాయం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిత్రం ఏమిటంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ స్థూలకాయం సమస్య ఎంత విపరీతంగా పెరుగుతోందో, భారత్‌లోనూ అదే తరహాలో అధికమవుతోంది. దేశంలోనే కాదు... తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లూ ఈ తరహా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాయి. ఇక ఈ రెండు రాష్ట్రాల్లోనూ 18 శాతం పురుషుల్లో, 23 శాతం మహిళల్లో ఈ సమస్య కనిపిస్తోంది. ఈ నెల 26న ప్రపంచ స్థూలకాయం దినం సందర్భంగా ఈ సమస్య తీవ్రతనూ, అది తెచ్చే ఆరోగ్యఅనర్థాలపై అవగాహన కోసం ఈ కథనం.
 
స్థూలకాయం అంటే...?

ఆరోగ్యకరమైన శరీరంలో జీవక్రియల కోసం నిత్యం అనేక పోషకాలు దహనం అవుతూ ఉంటాయి. ఇలా జీవక్రియల కోసం దహనం కాని పోషకాలు కొవ్వు రూపాన్ని సంతరించుకుని శరీరంలోని వేర్వేరు భాగాల్లో పోగుపడుతుంటాయి. ఇలా శరీరంలోని వేర్వేరు భాగాలు కొవ్వులను అనారోగ్యకరమైన రీతిలో నింపుకోవడం వల్ల శరీరం లావుగా మారి, బరువు పెరుగుతుంది. స్థూలకాయాన్ని కొలవడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎంఐ) అనే కొలమానం ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ అంటే... ఒకరి బరువును కిలోల్లో తీసుకుని, దాన్ని ఆ వ్యక్తి తాలూకు ఎత్తును మీటర్లలో తీసుకుని దాన్ని రెట్టింపు చేసి భాగించడం. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 70 కిలోలు, ఎత్తు 1.7 మీటర్లు అనుకోండి. అప్పుడతడి బీఎంఐ = 70 కిలోలు / 1.7 మీ.x 1.7 మీ. ఇలా వచ్చిన కొలతను ఈకింద ఉన్న ప్రమాణాలతో పోల్చి చూసి, అతడు స్థూలకాయుడా, కాదా అన్నది నిర్ణయిస్తారు. ఈ ప్రమాణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించింది. పై విధంగా వేసిన లెక్కలో వచ్చిన విలువను బట్టి ఓ వ్యక్తి ఏ మేరకు స్థూలకాయుడు అన్నది నిర్ణయిస్తారు. ఇది ఇలా...
 
 వర్గీకరణ    బీఎంఐ (కిలోలు / మీ. స్క్వేర్)    
 -------------------------------------------------------
 తక్కువ బరువు    18.5 కంటే తక్కువ      
 సాధారణ బరువు    18.5 నుంచి 22.9 వరకు
 అధిక బరువు    23  నుంచి  24.9 వరకు
 స్థూలకాయానికి ముందు    25 నుంచి 29.9 వరకు
 ఒబేస్ క్లాస్ 1    30.0 నుంచి 34.9 వరకు
 ఒబేస్ క్లాస్ 2    35.0 నుంచి 39.9 వరకు
 ఒబేస్ క్లాస్ 3    40 కంటే ఎక్కువ
 ------------------------------------------------------
 
స్థూలకాయానికి కారణాలు

జన్యుపరమైనవి : కొందరిలో జన్యుపరమైన కారణాలతో హార్మోన్ల పనితీరు అధికమై అవసరమైన దాని కంటే ఎక్కువ క్యాలరీలను తీసుకుంటుంది.. ఈ క్యాలరీల వల్ల కొవ్వు పేరుకుపోవచ్చు.

తగినంత శారీరక శ్రమ లేకపోవడం : తగినంత శరీరక శ్రమ లేపోవడం వల్ల శరీరం తగినన్ని క్యాలరీలను కోల్పోక వాటిని నిత్యం నిల్వ చేసుకోవడం జరుగుతుంటుంది. దీనివల్ల స్థూలకాయం పెరుగుతుంది.
 
అనారోగ్యకరమైన తినే అలవాట్లు : ఈ రోజుల్లో మనలో చాలామంది అత్యధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని రాత్రి వేళల్లో తీసుకోవడం, అత్యధిక క్యాలరీలు ఉన్న పానీయాలను తాగడం వల్ల బరువు పెరుగుతున్నారు.  
 
మహిళల విషయంలో గర్భధారణ కూడా : గర్భధారణ జరిగిన మహిళ కొద్దిగా బరువు పెరగడం సాధారణం. అయితే కొందరు బిడ్డ పుట్టాక కూడా తాము పెరిగిన బరువును కోల్పోరు. ఇది అనర్థాలకు కారణం కావచ్చు.
 
నిద్రలేమి : సాధారణంగా ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో హార్మోన్లలో మార్పులు వచ్చి వారి ఆకలి తీరుతెన్నుల్లోనూ మార్పులు వస్తాయి. దీనివల్ల వారు కార్బోహైడ్రేట్ ఆహారాలకు అలవాటు పడి, క్రమంగా అది బరువు పెరగడానికి దోహదం చేస్తుంటుంది.
 
కొన్ని రకాల మందులు : యాంటీడిప్రెసెంట్  మందులు, ఫిట్స్ మందులు, డయాబెటిస్ నియంత్రణకు వాడే మందులు, మానసిక వ్యాధులకు వాడే మందులు, స్టెరాయిడ్స్, బీటాబ్లాకర్స్ స్థూలకాయానికి దారితీయవచ్చు.
 
కొన్ని రకాల వ్యాధులు : ఒక్కోసారి కొన్ని రకాల వ్యాధులు కూడా స్థూలకాయానికి కారణం కావచ్చు. ఉదాహరణకు ప్రెడర్-విల్లీ సిండ్రోమ్, కుషింగ్స్ సిండ్రోమ్, పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ వంటి వ్యాధుల్లో అది స్థూలకాయానికి దారితీయవచ్చు.  
 
బరువు తగ్గడానికి అనువైన మార్గాలు


ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి అనేక మార్గాలున్నాయి. అవి...
 
ఆరోగ్యకరమైన జీవన శైలి : మనం నిత్యజీవితంలో ఆచరించే ఆహార, వ్యాయామ విధానాల ద్వారానే బరువు తగ్గే ప్రణాళికలు రూపొందించుకోవడం. వాటిని ఆచరిస్తూ మన మీద మనకు ఉన్న నమ్మకంతో ‘మనం చేయగలం’ అనుకుంటూ బరువు తగ్గడం.
 
మందులతో/వైద్య ప్రక్రియలతో...

ఆరోగ్యకరమైన రీతిలో మనం రోజూ అనుసరించే మామూలు మార్గాల్లోనే అధిక బరువు సమస్యను అధిగమించకపోతే... ఒక్కోసారి పేషెంట్ కండిషన్‌ను బట్టి మందులు, డాక్టర్ల సాయంతో బరువును నియంత్రించాల్సి ఉంటుంది. అది రెండు రకాలుగా జరగవచ్చు. అవి...
 
1. అధిక బరువు తగ్గడానికి అవసరమైన వైద్య విధానాలు ఆచరించడం / మందులను వాడటం
 
2. స్థూలకాయం వల్ల వచ్చిన ఆరోగ్యసమస్యలకు మందులు వాడటం.  
 
అధిక బరువు / స్థూలకాయం ఉన్నవారికి వైద్యపరమైన జాగ్రత్తలతో మందులు వాడుతున్నప్పుడు  వైద్యప్రక్రియ మూడు రకాలుగా ఉంటుంది. అది...
 
అధికబరువు / స్థూలకాయం ద్వారా వచ్చిన ఆరోగ్య సమస్యను తగ్గించేందుకు మందులు వాడటం.
 
ఆ సమస్యను అధిగమించే రీతిలో రోగి ఆహారంలో మార్పులు చేస్తూ, రోగికి తగినంత శారీరక శ్రమ ఉండేలా వ్యాయామాలను నిర్ణయించడం.
 
ఏవైనా తినడానికి సంబంధించిన సమస్య (ఈటింగ్ డిజార్డర్) ఉంటే దాన్ని తగ్గించడానికి అవసరమైన మందులు వాడటం. ఇలా ఈ మూడు మార్గాలను కలగలపిన ఆరోగ్య ప్రణాళిక ద్వారా పేషెంట్ బరువును నియంత్రిస్తూ ఉండటం వంటివి చేస్తారు.
 
స్థూలకాయాన్ని తగ్గించడానికి అవసరమైన శస్త్రచికిత్స మార్గాలు :

స్థూలకాయం వల్ల కలిగే అనర్థాలు ఒక్కోసారి రోగికి ప్రాణాపాయానికి దారితీసేలా ఉంటే అప్పుడు సంప్రదాయ విధానాల ద్వారా బరువు తగ్గించడానికి బదులు డాక్టర్లు శస్త్రచికిత్స ప్రక్రియలను అనుసరించడానికి మొగ్గుచూపువచ్చు. అయితే ఇది అందరి విషయంలోనూ జరగదు. ఇలా ఒక లావుగా ఉన్న వ్యక్తి బరువు తగ్గించడానికి శస్త్రచికిత్సను సూచించడం కొన్ని పరిస్థితుల్లోనే జరుగుతుంది. ఆ పరిస్థితులేమిటంటే...  
     
రోగి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 40 కంటే ఎక్కువగా ఉండటం.
     
ఒక వ్యక్తి ఉండాల్సిన ఆరోగ్యకరమైన బరువు కంటే... రోగి పురుషుడైతే అతడి బరువు 45 కిలోల కంటే ఎక్కువ ఉండటం / అదే స్త్రీ అయితే ఆమె బరువు సాధారణ బరువు కంటే 35 కిలోలు అధికంగా ఉండటం.
 
ఒక వ్యక్తికి తన బీఎంఐ విలువ 35 - 40 మధ్యన ఉంటే అతడికి స్థూలకాయం వల్ల వచ్చే అనర్థాలైన టైప్-2 డయాబెటిస్, నిద్రలో గురకపెట్టడం (స్లీప్ ఆప్నియా), గుండెజబ్బులు వంటి ఇతర సమస్యలు కలిగి ఉండటం.
 
స్థూలకాయం వల్ల రోగికి ప్రాణాపాయం ఉంటే... అతడి స్థూలకాయాన్ని తగ్గించేందుకు చేసే శస్త్రచికిత్స వల్ల అతడికి, బరువు పెరగడం వల్ల వచ్చే ఇతర సమస్యలనుంచే కొంత ఉపశమనం కలగవచ్చు. అవి... రక్తంలోని చక్కెర పాళ్లు తగ్గించడం, రక్తపోటును నియంత్రించడం, గురకను తగ్గించడం, గుండెపై పడే అదనపు ఒత్తిడిని తగ్గించడం, రక్తంలోని ఒక రకం కొవ్వులైన కొలెస్ట్రాల్ పాళ్లనూ తగ్గించడం వంటివి. అయితే అంతమాత్రాన ప్రాణాపాయం కలిగించేటంతగా పెరిగిన బరువును తగ్గించుకోవడానికి ప్రతి సందర్భంలోనూ శస్త్రచికిత్స ఒక్కటే మార్గం కాకపోవచ్చు. రోగి వ్యక్తిగత పరిస్థితితో పాటు అనేక అంశాలను గమనించి ఈ తరహా శస్త్రచికిత్సను చేయాల్సి ఉంటుంది. రోగి బరువు తగ్గించడానికి చేసే శస్త్రచికిత్సను ‘బేరియాట్రిక్ సర్జరీ’ అంటారు. ఇలా చేసే శస్త్రచికిత్సలు మూడు రకాలుగా ఉంటాయి. అవి...
 
1. మాల్ అబ్సార్ప్‌టివ్ 2. రెస్ట్రిక్టివ్ 3. పై రెండు అంశాలనూ కలగలిపిన శస్త్రచికిత్సలు.
 
1. మాల్ ఆబ్సార్ప్‌టివ్ తరహా శస్త్రచికిత్స : ఈ తరహా శస్త్రచికిత్స వల్ల రెస్ట్రిక్టివ్ తరహా కంటే ఎక్కువగా బరువు తగ్గుతారు.  ఈ తరహా శస్త్రచికిత్సలో భోజనం స్వతహాగా  జీర్ణమయ్యే మార్గం నుంచి ఆ ఆహారాన్ని ఇతర మార్గానికి మళ్లిస్తారు. అందువల్ల ఆహారం జీర్ణమయ్యే క్రమంలో కడుపు, చిన్నపేగుల్లోని మార్గంలో చాలా తక్కువగా ప్రయాణిస్తుంది. అందుకే ఈ తరహా చికిత్సను ‘‘గ్యాస్ట్రిక్ బైపాస్’’ అని కూడా వ్యవహరిస్తారు.
 
2. రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్ : ఇందులో ఆహారం ప్రయణించే మార్గాన్ని బై-పాస్ చేయకుండా పేగుల్లో జీర్ణమయ్యే ఆహారపు మార్గాన్ని శస్త్రచికిత్స మార్గాల ద్వారా కుదిస్తారు. ఉదా: కడుపు సైజును గణనీయంగా తగ్గించడం. దీని వల్ల కడుపులో పట్టే ఆహారపు పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. దీన్నే ‘స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ’ ప్రక్రియ అంటారు.
 
రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్లు ఎంతో కొంత మేరకు కడుపు కుదించడం జరుగుతుంది కాబట్టి బేరియాట్రిక్ సర్జరీలలోని ఈ ప్రక్రియ అన్నిట్లోనూ ఎక్కువగా చోటుచేసుకుంటుంది. అదే మెటబాలిక్ తరహా సిండ్రోమ్‌లు ఉన్నవారి పరిస్థితిని మెరుగుపరచడానికి మాల్ అబ్సార్ప్‌టివ్ ప్రొసీజర్లను అనుసరిస్తూ ఉంటారు.
 
రకరకాల గ్యాస్ట్రిక్ బైపాస్ శస్త్రచికిత్సలు

రూక్స్ ఎన్-వై గ్యాస్ట్రిక్ బైపాస్ (ఆర్‌జీబీ) :
ఇది గ్యాస్ట్రిక్ బై-పాస్ ప్రక్రియలన్నింటిలోనూ చాలా సాధారణంగా చేసే శస్త్రచికిత్స. ఇందులో రెస్ట్రిక్టివ్, మాల్‌అబ్సార్ప్‌టివ్... కలగలసి ఉంటాయి. ఈ శస్త్రచికిత్స తర్వాత రోగి తన బరువులో మూడింట రెండు వంతుల బరువును తగ్గించవచ్చు. ఈ శస్త్రచికిత్స ప్రక్రియతో ఆహారాన్ని అన్నవాహిక నుంచి స్టమక్‌లోకి కాకుండా నేరుగా పేగులకు వెళ్లేలా కలుపుతారు. అంటే... అన్నకోశాన్ని (స్టమక్‌ని) బై-పాస్ చేస్తూ నేరుగా అన్నవాహికను పేగులతో అనుసంధానిస్తారు. అన్నవాహిక దగ్గర ఒక చిన్న సంచి రూపొందేలా ఈ సర్జరీ చేస్తారు. మళ్లీ ఈ సంచి నుంచి పేగుల్లోకి ఆహారం వెళ్లేలా దారి ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియలో చిన్నపేగుల ఆకృతి ‘వై’ అక్షరంలా ఉంటుంది. ఇలా చేసే శస్త్ర చికిత్సలో జీర్ణమయ్యే ఆహారం చిన్న పేగుల్లోని మొదటి భాగమైన ‘డియోడినమ్’లోకి కాకుండా నేరుగా రెండో భాగమైన జిజినమ్ అనే చోట పేగుల్లోకి ప్రవేశిస్తుంది. దాంతో జీర్ణమయ్యే భాగాల్లో ఆహారం ఇంకకుండా పోతుంది. ఫలితంగా ఆహారంలోని అదనపు క్యాలరీలు శరీరంలోకి రావు.
 
గ్యాస్ట్రిక్ బైపాస్ శస్త్రచికిత్స వల్ల వచ్చే రిస్క్‌లు

అయితే గ్యాస్ట్రిక్ బైపాస్ వల్ల కొన్ని రిస్క్‌లు కూడా ఉంటాయి. ఆహారం జీర్ణమయ్యే నిడివిని తగ్గించడం వల్ల తగినంత ఆహారం, పోషకాలు రక్తంలోకి ఇంకవు. ఫలితంగా అనీమియా (రక్తహీనత) రావచ్చు. అంతేకాదు... కీలకమైన ఐరన్, విటమిన్ బి12 వంటివి శరీరానికి తగినంతగా అందకపోవచ్చు. ఫలితంగా ఒక్కోసారి ఈ శస్త్రచికిత్స తర్వాత ఆస్టియోపోరోసిస్ వంటి పరిస్థితులూ రావచ్చు. డంపింగ్ సిండ్రోమ్ అనే మరో కండిషన్ కూడా వచ్చేందుకు అవకాశం ఉన్న ప్రొసిజర్ ఇది. ఇందులో రోగికి వికారం, చెమటలు పట్టడం, స్పృహతప్పిపడిపోవడం, బలహీనంగా మారడం, నీళ్లవిరేచనాలు కావడం వంటివి కనిపిస్తాయి. ఇలాంటి రిస్క్‌లు ఉన్నప్పుడు మరో అదనపు శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు.
 
స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ : ఈ ప్రక్రియలో కడుపును మూడింట రెండు వంతుల కుదిస్తారు. సంచి లాంటి కడుపు భాగాన్ని ఒక అరటిపండు ఆకృతికి పరిమితమయ్యేలా తగ్గిస్తారు. ఒకసారి ఈ ప్రక్రియను అనుసరిస్తే మళ్లీ కోల్పోయిన కడుపు భాగాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదు. ఈ ప్రక్రియ తర్వాత స్థూలకాయంతో బాధపడే రోగి 6 నుంచి 12 నెలల వ్యవధిలోనే తన బరువులో 70 శాతాన్ని కోల్పోయేందుకు అవకాశం ఉంది. ఇంతగా కడుపును కుదించడం వల్ల... ఆహారాన్ని చాలా చిన్న మోతాదుకు తగ్గించాల్సి ఉంటుంది.
 
బేరియాట్రిక్ సర్జరీపై అపోహలు

బరువును తగ్గించడానికి చేసే బేరియాట్రిక్ సర్జరీలపై ప్రజల్లో ఎన్నో అపోహలూ... వివాదాలూ ఉన్నాయి. వాటిలో మొదటిది... బరువును తగ్గించేందుకు ఉపయోగపడే  కొన్ని సులభమైన మందులు ఉండగా రోగికి శస్త్రచికిత్స అనవసరం. కానీ వాస్తవం ఏమిటంటే... రోగి బరువును ఠక్కున తగ్గించే మ్యాజిక్ మందు అంటూ ఏదీ లేదు. ఇలా ఉందని ఎవరైనా చెప్పినా నమ్మవద్దు.
 
రెండో అపోహ : బేరియాట్రిక్ సర్జరీ తర్వాత రోగికి చాలా రకాల సమస్యలు వస్తాయి. ఒక్కోసారి ఈ తరహా సర్జరీ మృత్యువుకూ దారి తీయవచ్చు. అయితే ఇది పూర్తిగా తప్పు. నిజానికి సర్జరీ చేయకపోవడం వల్లనే అతడి బరువు అతడిని కబళించే పరిస్థితుల్లోనే డాక్టర్లు రోగులకు ఈ తరహా సర్జరీలను సిఫార్సు చేస్తారు.
 
మూడో అపోహ : బేరియాట్రిక్ సర్జరీ తర్వాత రోగి తన మామూలు ఆహారాన్ని తీసుకోలేడు. వాస్తవం ఏమిటంటే... సర్జరీ తర్వాత కూడా రోగి తన సాధారణ ఆహారాన్నే తీసుకుంటూ ఉంటాడు. కాకపోతే తక్కువ మోతాదుల్లో డాక్టర్లు సూచించిన విధంగా. తక్షణ ప్రాణాపాయ ప్రమాదం ఉన్న రోగులు మినహా మిగతా వారు ఆరోగ్యకరమైన జీవనశైలి మార్గాలతో బరువు తగ్గడం ఎంతో మేలు.
 
- నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి
 
బేరియాట్రిక్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన ఆహారం...
శస్త్రచికిత్స తర్వాత రోగి ఘనాహారం తీసుకోవడం ప్రారంభించాక... ఆహారాన్ని బాగా, చాలాసేపు, నింపాదిగా నమిలాకే మింగాలి. ఎందుకంటే కడుపులో ఆహారం జీర్ణమయ్యే పరిస్థితిని శస్త్రచికిత్స ద్వారా తగ్గిస్తారు కాబట్టే ఈ జాగ్రత్త.
     
 ఆహారం తీసుకునే సమయంలో ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవద్దు. ఇలా చేస్తే ఒక్కోసారి అది వెంటనే వాంతి అయ్యేందుకు దోహదపడవచ్చు. లేదా డంపింగ్ సిండ్రోమ్‌కు దారితీయవచ్చు / తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలిగా అనిపించవచ్చు.
     
 చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు, అన్నం తర్వాత తీసుకునే పాయసం వంటి వాటిని ఎక్కువగా తీసుకోవద్దు. చాలా కొద్ది పరిమాణంలోనే వాటిని తీసుకోవాలి.
     
 కూల్‌డ్రింక్స్ లేదా హైక్యాలరీ సప్లిమెంట్స్ ఉండే పానీయాలు, మిల్క్‌షేక్‌లు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను పూర్తిగా మానేయాలి.
     
 మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లను పూర్తిగా మానేయాలి.
     
 ఆహారానికి, ఆహారానికి మధ్య తీసుకునే చిరుతిండ్లను గణనీయంగా తగ్గించాలి.
 
స్థూలకాయం వల్ల అనర్థాలు
 స్థూలకాయం ఒక పరిమితికి మించి పెరిగితే, దాని వల్ల ఎన్నో అనర్థాలు ఏర్పడతాయి. నడుస్తున్నప్పుడు తమ భారాన్ని తమ శరీరమే భరించలేకపోవచ్చు. తమ శరీర బరువు వల్ల సరిగా శ్వాసతీసుకోలేకపోవచ్చు.  స్థూలకాయం డయాబెటిస్, అధిక రక్తపోటు, స్లీప్ ఆప్నియా, గుండెజబ్బులు, గాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్‌డీ), గాల్‌స్టోన్స్, ఆస్టియో ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులకు కారణం కావచ్చు.
 
బేరియా ట్రిక్ శస్త్రచికిత్స తర్వాత జీవితంఎలా ఉంటుంది?
మన జీవనంలోని నాణ్యతను గణనీయంగా మెరుగుపరచడానికే ఈ తరహా శస్త్రచికిత్సలు. ఒంటి బరువు తగ్గడం వల్ల రోగి కదలికలు చురుగ్గా ఉండటం, ఆరోగ్యకరంగా అనిపించడం చాలా సాధారణం. అయితే రోగి కూడా సానుకూల దృక్పథంతో వ్యవహరించడం అవసరం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement