ధరల పెంపుకు కేంద్రం ఆమోదం!
న్యూఢిల్లీ: కేన్సర్, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల చికిత్సలో వాడే ఔషధాల ధరలు మరింత పెరిగే అవకాశముంది. వాటిని దాదాపు 1.7 శాతం పెంచే ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసినట్టు విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి. కొత్త ధరలు మూడు నెలల తర్వాత వర్తింవచ్చని ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్ (ఏఐఓసీడీ) ప్రధాన కార్యదర్శి రాజీవ్ సింఘాల్ చెప్పారు.
ఫార్మా కంపెనీలు ప్రభుత్వం సూచించిన దానికంటే చాలా ఎక్కువకు ఔషధాలను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడం తెలిసిందే. రసాయనాలు, ఎరువుల సంబంధ పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికలోనూ దీన్ని ప్రస్తావించింది. నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ గణాంకాలు కూడా అదే చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి 307 ఘటనలు నమోదయ్యాయి.
అధిక ధరల వల్ల రోగులు ఔషధాలు కొనలేక అవస్థలు పడుతున్నారని, ఆర్థికంగా చితికిపోతున్నారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పేర్కొంది. జాతీయ అత్యయిక ఔషధాల జాబితా–2022లోని మందుల ధరలను సవరించిన/తగ్గించిన తర్వాత దేశవ్యాప్తంగా రోగుల జేబుకు చిల్లు పడటం తగ్గిందని, రూ.3,788 కోట్ల సొమ్ము ఆదా అయిందని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ మూడు వారాల క్రితం ప్రకటించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment