Cardiovascular disease
-
Cardiovascular Disease: కోలుకున్న క్లిష్టమైన సమస్యల రోగి
తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగి అద్భుతమైన రీతిలో ఆరోగ్యవంతుడయ్యాడు. క్లిష్టమైన హృద్రోగ సమస్యతో పాటు శరీరంలోని పలు అవయవాల ఆరోగ్యం నశించి విషమ స్థితిలో బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చేరిన ప్రవాస భారతీయునికి ఆస్పత్రి వైద్యులు అవసరమైన శస్త్ర చికిత్సలు నిర్వహించి, మూడు నెలల పాటు శ్రమించి రోగిని ఆరోగ్యవంతుడిని చేశారు. కేర్ ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యులు వివరాలు వెల్లడించారు. భారత సంతతికి చెందిన భాస్కర్ పొనుగంటి (43) ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. ఇతను కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శ్వాస ఆడక పోవడంతో పాటు తీవ్రమైన హద్రోగ సమస్యతో దాదాపు మూడు నెలల క్రితం బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో భాస్కర్ చేరారు. రోగికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆ రోగి ‘ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్‘ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల రోగికి మూత్రపిండాల వైఫల్యం, ఎడమవైపు పక్షవాతం కలిగించే మెదడు పోటు బ్రెయిన్ స్ట్రోక్ కలిగి రోగి ఆరోగ్యం క్షీణించింది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న ఆ రోగి వెంటిలేటర్ పై ఉన్నప్పటికీ అత్యవసర శస్త్ర చికిత్స చేయడమే సరైన మార్గమని ఆస్పత్రి క్లినికల్ డైరెక్టర్, కార్డియాలజీ విభాగాధిపతి డా. వి.సూర్యప్రకాశరావు నేతత్వంలోని వైద్య బందం నిర్ధారించింది. క్లిష్టమైన శస్త్ర చికిత్సను (హై రిస్క్ సర్జరీ) నిర్వహించి రోగిని సాధారణ స్థాయికి తీసుకొచ్చారు. సీనియర్ కార్డియోథొరాసిక్, హార్ట్ ట్రా ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డా. నగేష్ ఆధ్వర్యంలో వైద్య బందం ‘మెకానికల్ వాల్వ్‘ వైద్యవిధానం ద్వారా రోగి బహద్దమని కవాట మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. దీంతో రోగి ఆరోగ్యం కుదుటపడింది. తరువాత రోగి అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ క్రమంలో రోగిని మెడికల్ ఐసీయూలో ఉంచి.. ఆస్పత్రి అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్, క్రిటికల్ కేర్ విభాగాధిపతి డా. జి.భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య సాయం అందించారు. న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఇంటెన్సివిటీ, కార్డియాక్ విభాగాలు.. సమన్వయంతో నిరంతర పర్యవేక్షణలో కఠినమైన ఫిజియోథెరపీతో కూడిన బహుళ వైద్య చికిత్స విధానాలను రోగికి అందించాయి. అధునాతన వైద్య సంరక్షణతో ఏం సాధించవచ్చో ఈ కేసు ద్వారా వైద్య బందం నిరూపించిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. -
మినోకా!..రక్తనాళాలు బ్లాక్ కాకుండానే హార్ట్ అటాక్!
గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలు మూసుకుపోయాయనీ, అందుకే హార్ట్ అటాక్ వచ్చిందనే మాట తరచూ వినేదే. కానీ కొన్ని హార్ట్ అటాక్స్... ప్రధాన ధమనులు మూసుకుపోనప్పటికీ, అంటే అవి నార్మల్‌గా ఉన్నప్పటికీ వస్తుంటాయి. అలాంటి హార్ట్ అటాక్స్నే మినోకా (మయో కార్డియల్ ఇన్ఫార్క్షన్ విత్ నాన్ అబ్స్ట్రక్టివ్ కరొనరీ ఆర్టరీస్) అంటారు. ఈమధ్య వస్తున్న గుండెపోట్లలో మినోకా తరహావి పెరుగుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ‘మినోకా’ హార్ట్ అటాక్స్ గురించి అవగాహన కల్పించేదే ఈ కథనం. వయసు పెరుగుతున్న కొద్దీ గుండెకు రక్తాన్ని అందించే ప్రధాన రక్తనాళాల (ధమనుల)లో కొవ్వులు (ప్లాక్స్) పేరుకుపోవడం సహజం. ఈ ప్లాక్స్ క్రమంగా పెరుగుతూ బ్లాక్స్‌లా గుండెపోటుకు దారితీస్తాయి. అయితే సుమారు 6 నుంచి 10 శాతం మంది గుండెపోటు వచ్చిన వారి యాంజియోగ్రామ్‌లో బ్లాక్స్ ఏవీ కనిపించకపోవడం కార్డియాలజిస్టులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి వాళ్లకు గుండెపోటు ఎందుకు వస్తోందనే విషయాన్ని మరింత లోతుగా పరిశీలించినప్పుడు అబ్బురం కలిగించే విషయాలు తెలిశాయి. గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ప్లాక్స్ లేనప్పటికీ కొన్నిసార్లు గుండె కండరం దెబ్బతినవచ్చు. ఇలా గుండెకండరం దెబ్బ తినడం వల్ల, రక్తనాళాల బ్లాక్స్‌తో సంబంధం లేకుండా వచ్చే గుండెపోటునే ‘మినోకా’ అంటారు. మినోకాకు కారణాలు... మినోకాకు అనేక అంశాలు దోహదపడుతుంటాయి. వాటిల్లో ప్రధానమైనవి... 1. గుండె రక్తనాళాలు తాత్కాలికంగా కుంచించుకుపోవడం: ఈ కండిషన్‌ను ‘కరోనరి స్పాసమ్’ అని పిలుస్తారు. సిరల గోడల్లో కండరం ఉండదు. కానీ ధమనుల గోడలు కండరంతో నిర్మితమై ఉంటాయి. ధమని కండరం సంకోచించి అలాగే ఉండిపోతే గుండె కండరం దెబ్బ తింటుంది. మహిళల్లో కరోనరీ స్పాసమ్ ఎక్కువ. అందుకే ఈ గుండెపోటుకు అవకాశాలూ ఎక్కువే. 2. ప్లాకులలో పగుళ్ల (ఎరోషన్స్)తో: వయసు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాల్లో ప్లాకులేర్పడుతూ ఉంటాయి. ఈ ప్లాకులపై ఎరోషన్స్) వల్ల కూడా కొన్నిసార్లు గుండెపోటు రావచ్చు. 3. మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్: గుండె తాలూకు మూడు ప్రధాన రక్తనాళాలు... పోను పోను మరింత చిన్న రక్తనాళాలుగా మారి గుండె కండరానికి రక్తాన్ని సరఫరా చేస్తాయి. వీటిల్లో అడ్డంకులతో వచ్చిన గుండెపోటునూ ‘మినోకా’గానే పరిగణిస్తారు. ఇలా సూక్ష్మ రక్తనాళాల్లో వచ్చే జబ్బునే మైక్రో వాస్కులర్ డిస్ ఫంక్షన్ అంటారు. 4. కరోనరీ ఎంబాలిజం: దేహంలో వేరేచోట ఏర్పడిన రక్తం గడ్డలు గుండె రక్తనాళాల్లో అడ్డంకిగా మారి గుండెపోటుని కలిగించవచ్చు. దీన్ని కరోనరీ ఎంబాలిజం అంటారు. 5. రక్తనాళాల్లో ఎలాంటి తేడాలూ లేకుండా గుండె కండరం దెబ్బ తినటం: కొన్నిసారు గుండె రక్తనాళాల్లో ఏమాత్రం తేడాలు లేకపోయినా మినోకా రావచ్చు. అవసరమైన వైద్య పరీక్షలు... గుండెపోటు లక్షణాలు కనిపించగానే తొలుత ఈసీజీ, ఎకో, ఆ తర్వాత ట్రోపొనిన్ అనే పరీక్షలు చేస్తారు. లక్షణాలతో పాటు ఈ పరీక్షల ఫలితాలను బట్టి గుండెపోటును నిర్ధారణ చేస్తారు. నిజానికి గుండెపోటు నిర్ధారణకు యాంజియోగ్రామ్ అవసరం ఉండదు. కానీ ఏ తరహా చికిత్స అవలంబించాలనే అంశానికి యాంజియోగ్రామ్ సహాయపడుతుంది. మినోకా ఉన్న వారిలో గుండెపోటు వచ్చినట్లు అన్ని ఆధారాలూ ఉంటాయి కానీ, యాంజియోగ్రామ్ చేసినప్పుడు అందులో బ్లాక్స్ కనిపించవు. కాబట్టి వీళ్లలో స్టెంట్ వేసే అవకాశం ఉండదు. మినోకా నివారణ ఎలా? మినోకా నివారణకు ప్రత్యేకమైన చర్యలేమీ లేనప్పటికీ మామూలు గుండెజబ్బు నివారణ తీసుకునే జాగ్రత్తలే మినోకానూ నివారిస్తాయి. సమతులాహారం, వ్యాయామం, పొగాకు, మద్యానికి దూరంగా ఉండటం, స్ట్రెస్ తగ్గించుకోవడం, మంచి నిద్ర, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవడం. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఉంటే... మిగతా గుండె జబ్బులు లాగానే మినోకానూ నివారించేందుకూ, కొంతమేర ముందుగా పసికట్టేందుకు అవకాశం ఉంటుంది. ఎవరిలో ఎక్కువ? పురుషులతో పోలిస్తే మినోకా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే కాస్త వయసు తక్కువ వాళ్లలోనూ మినోకా వచ్చే అవకాశం ఎక్కువ. పొగతాగే అలవాటు ఉన్నవారిలోనూ మినోకా వచ్చే అవకాశాలెక్కువ. లక్షణాలు : సాధారణ గుండెపోటు లక్షణాలే ఇందులోనూ కనిపిస్తాయి. అంటే శ్వాస అందకపోవడం, ఆయాసపడటం, ఛాతీపై నొప్పి, ఎడమ భుజం, వీపులో ఎడమవైపు నొప్పి, ఎడమ దవడలోనూ నొప్పి కనిపించడం, చెమటలు పట్టడం వంటివి. సాధారణ గుండెపోటుకి, మినోకా గుండెపోటుకీ తేడా ఏమిటి? మినోకా వచ్చిన వారిలో యాంజియోగ్రామ్ చేశాక... డాక్టర్లకు బాధితుల్లో బ్లాక్స్ ఏవీ పెద్దగా కనిపించవు. ఈ విషయాన్ని వాళ్లకు చెప్పినప్పుడు వారు సంతోషిస్తారు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే... మినోకా కూడా గుండెపోటే. గుండెపోటులో ఏ దుష్పరిణామాలు ఉంటాయో మినోకాలోనూ అవే ఉంటాయి. అంటే... గుండె పంపింగ్ తగ్గడం, ఆకస్మికంగా మరణం సంభవించడం వంటివి. మినోకాని గుర్తించాక...? మినోకాని గుర్తించాక దానికి కారణాలని అన్వేషించడం తప్పనిసరి. ఇందుకు ఇంట్రా–కరోనరీ ఇమేజింగ్ ప్రధాన భూమిక నిర్వర్తిస్తుంది. ఇంట్రాకరోనరీ ఇమేజింగ్ అంటే గుండె రక్తనాళాల్లోనికి చిన్న కెమెరా వంటి సాధనాన్ని పంపి గుండె రక్తనాళం గోడని నిశితంగా పరిశీలించటం. ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ , ఆప్టికల్ కోహరె¯Œ ్స టోమోగ్రఫి అనే రెండు రకాల పరీక్షల్లో దేని ద్వారానైనా మినోకాకు కారణాన్ని కొంతమేరకు తెలుసుకోవచ్చు. మినోకా వచ్చాక చేయాల్సిన పరీక్షల్లో కార్డియాక్ ఎమ్మారై కూడా ముఖ్యమైనది. చికిత్స... మినోకాకు నిర్దిష్టంగా ఒక ప్రత్యేకమైన కారణం లేనందున చికిత్స కూడా నిర్దిష్టంగా ఉండదు. మినోకాకి రకరకాల వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. కరోనరి స్పాసమ్ వల్ల వచ్చే మినోకాలో క్యాల్షియం ఛానల్ బ్లాకర్స్, నైట్రేట్స్ అనే మందులు వాడటం ముఖ్యం. అన్ని రకాల మినోకాలలోనూ రక్తాన్ని పలుచబార్చే మందులు వాడటం తప్పనిసరి అయినప్పటికీ కరోనరీ ఎంబాలిజం వల్ల వచ్చే మినోకాలో బాగా ఎక్కువ శక్తివంతమైన బ్లడ్ థిన్నర్స్ వాడాల్సి ఉంటుంది. మినోకాలోనూ... సాధారణ గుండెపోటు వచ్చిన వాళ్లలోలాగే గుండె పంపింగ్ బలహీనపడే అవకాశం ఉంటుంది. అప్పుడు గుండెలో బలం నింపడానికి ఔషధాల్ని వాడాలి. వీటిలో బీటా బ్లాకర్లు, ఏస్ ఇన్హిబిటార్స్, స్టాటిన్సు వంటివీ ఉంటాయి. డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ సీనియర్ కార్డియాలజిస్ట్ -
World Anti Obesity Day: ఈ ఏడు సూత్రాలు పాటించండి చాలు!
సాక్షి,హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఊబకాయుల సంఖ్య 1980 నుండి రెట్టింపు అవుతూ వస్తుంది. 2014లో, 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 1.9 బిలియన్ల కంటే ఎక్కువ మంది పెద్దలు అధిక బరువుతో ఉన్నారు. వీరిలో 600 మిలియన్లకు పైగా స్థూలకాయులు ఉన్నారు. 2014లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 41 మిలియన్ల మంది పిల్లలు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. 'CRAP': కు దూరంగా ఉండండి. అంటే కార్బోనేటేడ్ పానీయాలు,శుద్ధి చేసిన చక్కెరలు, కృత్రిమ స్వీటెనర్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. స్థూలకాయానికి దూరంగా ఉండాలంటే ఈ పదార్థాలకు కచ్చితంగా నో చెప్పాల్సిందే. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేద్దామా? అల్పాహారాన్ని ఎప్పుడూ దాటవేయవద్దు అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. కింగ్‌లాగా బ్రేక్ ఫాస్ట్ ఉండాలి అలా ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే ఆహారంతో రోజు ప్రారంభించాలి. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసే ఆకలి ఎక్కువై ఫాస్ట్ ఫుడ్ వైపు మళ్లే అవకాశం ఉంది. మనం ఏం తాగుతున్నాం: ఈ మధ్య కాలంలో లెమన్ టీ, గ్రీన్ టీ పై అవగాహన బాగా పెరిగింది. గ్రీన్ టీ, దాల్చిన చెక్క టీ, అల్లం టీ, తులసి, పుదీనా టీ ఇలాంటి సహజ మూలికల టీ తాగడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు క్రమేపీ కరుగుతాయి. అలాగే సాధ్యమైనంత ఎక్కువ నీరుతాగడం వల్ల జీర్ణవ్యవస్థ నియంత్రణలో ఉంటుంది. నీరు మన శరీరంలోని మలినాలను కూడా శుభ్రపరుస్తుంది. వంటింట్లో డైట్ మేక్-ఓవర్ : వంటగదిలో "జంక్" ఫుడ్‌ని పూర్తిగా తొలగించేద్దాం. దీనికి బదులు వంట గదిలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను కనిపించేలా పెట్టుకోండి. ఫ్రూట్ లేదా వెజిటబుల్ సలాడ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వండి. రుచికోసం కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుంటే..రుచికి రుచితోపాటు జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. మోర్ ఎక్సర్సైజ్: ఆరోగ్యంగా ఉండాలంటే నిరంతరం చురుగ్గా ఉండటం. ఎక్కువ సేపు కుర్చీలకు, సోఫాలకు అతుక్కుపోకుండా ఉండటం చాలా ముఖ్యం. లిఫ్ట్‌కు కాకుండా సాధ్యమైన ప్పుడల్లా మెట్లు ఎక్కడం. అలాగే మన రోజువారీ షెడ్యూల్లో సైక్లింగ్, నడక, స్కిప్కింగ్ లేదా స్విమ్మింగ్‌తోపాటు, పెంపుడు జంతువుతో షికారు చేస్తే మనసుకి హాయిగా ఉంటుంది. మింగేయకండి.. నమలండి: తిన్నది ఎంతైనాగానీ ఆహారాన్ని బాగా నమలండి. తిన్న ప్రతిసారీ మీ పోర్షన్ పరిమాణాన్ని తగ్గించుకుంటే..తక్కువ కేలరీలు తగ్గుతాయి. ప్రతీ ముద్దా ఎంత ఎక్కువ నమిలితే అంత మంచిది. తద్వారా కేలరీల మోతాదు తగ్గుతాయి. పోషకాలు పెరుగుతాయి. ఇంటి భోజనమే అమృతం: ఆర్డర్ చేసుకున్న ఫుడ్ వేస్ట్ అయిపోతోందనో, టేస్టీగా ఉందనో ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో..సాధ్యమైనంతవరకు ఇంటిలో తయారు చేసిన ఫుడ్ తినడం ఉత్తమం. లేదంటే ఆ తరువాత అద్దం ముందు నిలబడి, ఏం తిన్నా.. ఇక్కడికే వస్తోంది అనుకోవాలి పెరుగుతున్న నడుమును చూసి. -
నుదిటి మీద ముడతలు చెప్పే రహస్యం
పారిస్ : సాధారణంగా నుదిటి మీద ముడతలు ఎక్కువవుతుంటే ఏమనిపిస్తుంది?.. వయస్సు పెరుగుతోంది కదా! ముడతలు సహజమే.. అనుకుంటాం. కానీ నుదిటి మీద ముడతలకు కేవలం వయస్సుతోనే కాకుండా గుండె జబ్బులకు కూడా సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు. నుదిటి మీద ముడతలు గుండె జబ్బులకు సూచనలుగా భావించవచ్చంటున్నారు. ఎక్కువ ముడతలు ఉన్నవారు కార్డియోవాస్క్యులర్ డిసీస్‌తో మరణించే అవకాశాలు ఎక్కువని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన ‘‘హాస్పిటల్ యూనివర్సరీ డే టౌలౌస్’’ ప్రోఫెసర్ ‘యోలాండ్ ఎస్క్విరోల్’ జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జీవనశైలిలో మార్పులు చేయటం ద్వారా కార్డియోవాస్క్యులర్ను నియంత్రించవచ్చని యోలాండ్ తెలిపారు. వయసు పెరిగేకొద్ది గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నా ఆహారపు అలవాట్లు, సరైన మందులను వాడటం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చని అన్నారు. యోలాండ్ ఎస్క్విరోల్ బృందం వివిధ వయస్సులకు చెందిన 3200 మందిపై 20 ఏళ్ల పాటు పరిశోధనలు జరిపింది. వారిలో ఇప్పటి వరకు 244 మంది వివిధ కారణాలతో చనిపోయారు. అయితే వారిలో నుదిటిపై ముడతలు లేని వారి కంటే ఉన్నవారు ఎక్కుగా గుండె సంబంధ జబ్బులతో చనిపోయినట్లు తేలింది. రెండు అంతకంటే ఎక్కువ ముడతలు ఉన్నవారు ముడతలు లేని వారికంటే పదిరెట్లు తొందరగా చనిపోయినట్లు వెల్లడైంది. -
పురుషులకే ఆ ముప్పు అధికం
లండన్ : మహిళలతో పోలిస్తే గుండె జబ్బులతో మరణించే అవకాశాలు పురుషుల్లో 64 శాతం అధికమని తాజా అథ్యయనం పేర్కొంది. డిలేటెడ్ కార్డియోమయోపతి కారణంగా మహిళల్లో మరణాలు అతితక్కువగా ఉన్నాయని, పురుషుల్లో ఈ ముప్పు అధికమని ఆ అథ్యయనం వెల్లడించింది. గుండె కండరాలు పెళుసుబారి శరీరానికి రక్తసరఫరా చేసే సామర్థ్యం కోల్పోయే ప్రమాదం కూడా పురుషుల్లో అధికమని ఈ సర్వే పేర్కొంది. గుండె కండరాలు పెళుసుగా మారి శరీరానికి అవసరమైన రక్తాన్ని సరఫరా చేసే సామర్థ్యం తగ్గడాన్ని మహిళల హార్మోన్లు సమర్థంగా నివారిస్తాయని పరిశోధకులు చెప్పారు. తమ పరిశోధనలో వెల్లడైన అంశాలు నూతన చికిత్సా పద్ధతులకు దారితీస్తాయని వారు పేర్కొన్నారు. డిలేటెడ్ కార్డియోమయోపతి వ్యాధి ఇటీవల ప్రబలంగా ఎదురవుతూ ఏటా వేలాదిమంది మృత్యువాతకు గురవుతున్నారని ఈ అథ్యయనం వెల్లడించింది. ఈ వ్యాధితో ఐదేళ్లుగా బాధపడుతున్న 591 మంది పురుషులు, 290 మంది స్ర్తీల వైద్య రికార్డులను ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధకులు విశ్లేషించారు. ఈ వ్యాధితో బాధపడే వారిలో మహిళా హార్మోన్లు వ్యాధి తీవ్రత నుంచి రోగులను కాపాడటంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయనే దానిపైనా పరిశోధకులు దృష్టిసారించారు. మహిళలతో పోలిస్తే కార్డియోమయోపతితో బాధపడే పురుషుల్లో మరణాల రేటు అధికంగా ఉందని తమ పరిశోధనలో వెల్లడైనట్టు అథ్యయన రచయిత డాక్టర్ సంజయ్ ప్రసాద్ పేర్కొన్నారు. మహిళలను హృద్రోగాల నుంచి ఏయే అంశాలు కాపాడుతున్నాయనే దానిపై తాము నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. -
ఉప్పుతో భారతీయులకు పెనుముప్పే!
శరీరానికి ఉప్పు చేసే మేలు గొప్పదే. కానీ ఉప్పు మోతాదుకు మించి తింటే ముప్పు తప్పదు అంటున్నాయి పరిశోధనలు. మరీముఖ్యంగా ఉప్పు విషయంలో భారతీయులు పెద్ద తప్పు చేస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచించిన దాని కన్నా రెట్టింపు మొత్తంలో భారతీయులు తమ ఆహారంలో ఉప్పు తీసుకుంటున్నారని, దీనివల్ల గుండె సంబంధిత జబ్బుల ముప్పు పెరగడమే కాకుండా.. హఠాన్మరణాలు కూడా సంభవిస్తున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్‌వో ప్రతిరోజు ఐదుగ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలని సిఫారసు చేయగా.. 19 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు కలిగిన భారతీయులు ప్రతిరోజూ 10.98 గ్రాముల మేర ఉప్పు తమ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారని జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో ఉప్పును మరీ అధికంగా తీసుకుంటున్నారని తెలిపింది. ఉప్పును తీసుకునే విషయంలో త్రిపుర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని, ఇక్కడ రోజుకు ఏకంగా 14గ్రాముల వరకు ఉప్పు తీసుకుంటున్నారని, ఇది డబ్ల్యూహెచ్‌వో సిఫారసు చేసిన దానికన్నా మూడు రెట్లు అధికమని తెలిపింది. ‘గత 30 ఏళ్లలో భారతీయుల సగటు ఆహార అలవాట్లు మారిపోయాయి. వారు పప్పులు, కూరగాయలు, పండ్లు తీసుకోవడం తగ్గిపోయి.. ప్రాసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకుంటున్నారు. దీనివల్ల వారి ఆహారంలో పూర్తిస్థాయిలో ఉప్పు, చక్కెర, హానిచేసే కొవ్వు పదార్థాలు ఉంటున్నాయి. దీనివల్ల అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె సంబంధిత జబ్బుల బారిన పడుతున్నారు. గుండెపోటు, స్ట్రోక్‌లు ఎక్కువగా సంభవిస్తున్నాయి’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన క్లైర్ జాన్సన్ తెలిపారు. ఉప్పు అధికంగా తీసుకోవడం అధిక రక్తపోటు (హై బ్లడ్‌ప్రెషర్)కు దారితీస్తున్నదని, ఇది గుండె జబ్బులకు కారణంగా మారుతున్నదని అధ్యయనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఉప్పు తీసుకోవడం తగ్గించడానికి సత్వరమే చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. ఉప్పును తీసుకొనే విషయంలో పట్టణ ప్రాంతాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎలాంటి తేడా లేదని, అయితే, పట్టణప్రాంత ప్రజలు తక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నప్పటికీ పచ్చళ్లరూపంలో అధికమొత్తం ఉప్పును స్వీకర్తిస్తున్నారని అధ్యయనం స్పష్టం చేసింది. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక మరణాలకు గుండెజబ్బులే కారణంగా నిలుస్తున్నాయి. ప్రతి ఏడాది గుండెజబ్బుల కారణంగా 23 లక్షలమంది ప్రాణాలు విడుస్తున్నారు. 2030నాటికి ఏకంగా అధిక రక్తపోటు బారిన పడే వారి సంఖ్య రెట్టింపు అయి.. దేశ జనాభాలో 21.3 కోట్లమందికి చేరుకుంటుందని ఈ అధ్యయనం ఆందోళనపరిచే విషయాలు తెలిపింది. ‘భారత్ ఎదుర్కొంటున్న ఈ పెను సంక్షోభం గురించి ఆలోచిస్తేనే కష్టంగా ఉంది. అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, జీవనశైలి కారణంగా లక్షలాది మంది ప్రతి ఏడాది ప్రాణాలు విడుస్తున్నారు’ అని జాన్సన్ పేర్కొన్నారు. జాతీయంగా ఉప్పు తినడం తగ్గించేందుకు సెంటర్ ఫర్ క్రోనిక్ డిసీజ్ కంట్రోల్ (సీసీడీసీ)తో జార్జ్ ఇన్స్టిట్యూ్ట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పనిచేస్తోంది. 2025నాటికైనా డబ్ల్యూహెచ్‌వో లక్ష్యం మేరకు దేశవ్యాప్తంగా ఉప్పు తీసుకోవడాన్ని 30శాతం మేర తగ్గించడానికి భారత్ ఇప్పటినుంచే సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరముందని జార్జ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివేక్ ఝా తెలిపారు. -
సంగీత కళానిధి కేవీ రెడ్డి కన్నుమూత
విజయవాడ, ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు కేవీ రెడ్డి(89) హృదయ సంబంధిత వ్యాధితో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జన్మించిన ఈయన విజయనగరం మహరాజా కళాశాలలో ద్వారం వెంకటస్వామినాయుడు, ద్వారం నరసింగరావు వద్ద వయోలిన్‌లో మెళకువలు నేర్చుకున్నారు. విజయవాడ, విజయనగరాల్లో సంగీత అధ్యాపకునిగా పనిచేశారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, చిత్తూరు బాలసుబ్రహ్మణ్యం పిళ్ళే, నేదునూరి కృష్ణమూర్తి, నూకల చినసత్యనారాయణ వంటి ప్రముఖులకు వాద్య సహకారాన్ని అందించారు. ఆకాశవాణిలో పలు సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. సలహా సంఘ సభ్యునిగా పనిచేశారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సంగీత అభిమానుల అశృనయనాల మధ్య మంగళవారం కేవీ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు.