ప్రతీకాత్మక చిత్రం
లండన్ : మహిళలతో పోలిస్తే గుండె జబ్బులతో మరణించే అవకాశాలు పురుషుల్లో 64 శాతం అధికమని తాజా అథ్యయనం పేర్కొంది. డిలేటెడ్ కార్డియోమయోపతి కారణంగా మహిళల్లో మరణాలు అతితక్కువగా ఉన్నాయని, పురుషుల్లో ఈ ముప్పు అధికమని ఆ అథ్యయనం వెల్లడించింది. గుండె కండరాలు పెళుసుబారి శరీరానికి రక్తసరఫరా చేసే సామర్థ్యం కోల్పోయే ప్రమాదం కూడా పురుషుల్లో అధికమని ఈ సర్వే పేర్కొంది. గుండె కండరాలు పెళుసుగా మారి శరీరానికి అవసరమైన రక్తాన్ని సరఫరా చేసే సామర్థ్యం తగ్గడాన్ని మహిళల హార్మోన్లు సమర్థంగా నివారిస్తాయని పరిశోధకులు చెప్పారు. తమ పరిశోధనలో వెల్లడైన అంశాలు నూతన చికిత్సా పద్ధతులకు దారితీస్తాయని వారు పేర్కొన్నారు.
డిలేటెడ్ కార్డియోమయోపతి వ్యాధి ఇటీవల ప్రబలంగా ఎదురవుతూ ఏటా వేలాదిమంది మృత్యువాతకు గురవుతున్నారని ఈ అథ్యయనం వెల్లడించింది. ఈ వ్యాధితో ఐదేళ్లుగా బాధపడుతున్న 591 మంది పురుషులు, 290 మంది స్ర్తీల వైద్య రికార్డులను ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధకులు విశ్లేషించారు. ఈ వ్యాధితో బాధపడే వారిలో మహిళా హార్మోన్లు వ్యాధి తీవ్రత నుంచి రోగులను కాపాడటంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయనే దానిపైనా పరిశోధకులు దృష్టిసారించారు.
మహిళలతో పోలిస్తే కార్డియోమయోపతితో బాధపడే పురుషుల్లో మరణాల రేటు అధికంగా ఉందని తమ పరిశోధనలో వెల్లడైనట్టు అథ్యయన రచయిత డాక్టర్ సంజయ్ ప్రసాద్ పేర్కొన్నారు. మహిళలను హృద్రోగాల నుంచి ఏయే అంశాలు కాపాడుతున్నాయనే దానిపై తాము నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment