లండన్ : కరోనా వైరస్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూ ప్రపంచ దేశాలను వణికిస్తుండగా తాజా సర్వేలో ఈ మహమ్మారితో ముందుగా అంచనా వేసిన స్ధాయిలో ప్రాణాలకు ముప్పు ఉండదని వెల్లడైంది. కరోనా వైరస్ మరణాల రేటు ఇప్పటివరకూ వేసిన అంచనాల కంటే చాలా తక్కువగా ఉంటుందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అథ్యయనం పేర్కొంది. చైనాలో కరోనా వైరస్ బారిన పడిన వారితో పాటు ఈ మహమ్మారికి కేంద్ర బిందువుగా మారిన వుహాన్‌లో రాకపోకలు సాగించిన వారిపై బ్రిటిష్ పరిశోధకులు ఈ అథ్యయనం చేపట్టారు. చైనాలో కరోనా వైరస్ కేసులను సమగ్రంగా విశ్లేషించిన మీదట పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు.
కరోనా వైరస్ నిర్ధారణ అయిన, నిర్ధారణ కాని కేసులన్నింటిలో మరణాల రేటు కేవలం 0.66 శాతంగా ఈ అథ్యయనం గుర్తించింది. నిర్ధారణైన కోవిడ్-19 కేసుల్లో మరణాల రేటు 1.38 శాతంగా పేర్కొంది. అయితే కరోనా వైరస్ నిర్ధారించిన కేసుల్లో మరణాల రేటును గతంలో అధికారులు 2 నుంచి 8 శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేయడం గమనార్హం. ఇక మొత్తం కేసుల్లో మరణాల రేటును 0.2 నుంచి 1.6 శాతంగా అంచనా వేయగా తాజా సర్వేలో ఇది 1.38 శాతంగా వెల్లడైంది.
ఇక వయసుల వారీగా చూస్తే 80 ఏళ్ల పైబడిన వారిలో వైరస్ నిర్ధారణ అయితే వారిలో 20 శాతం మందికి ఆస్పత్రిలో చికిత్స అవసరమని, అదే 30 ఏళ్లలోపు వైరస్ రోగుల్లో కేవలం 1 శాతం మందికే ఆస్పత్రుల్లో చికిత్స అవసరమని తాజా సర్వే పేర్కొంది. వయసుమళ్లిన వారు అధికంగా ఉండే దేశాలకు కరోనా వైరస్ కారణంగా ముప్పు అధికంగా ఉంటుందని ఈ అథ్యయనం వెల్లడించింది. గత అంచనాల కన్నా కోవిడ్-19తో మరణాల రేటు తాజా అథ్యయనంలో తక్కువగా ఉన్నా ఈ వైరస్ గతంలో వచ్చిన వాటికంటే పలు రెట్లు ప్రాణాంతకమేనని ఈ అథ్యయనం హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment