
జీర్ణక్రియ, పోషకాల శోషణకు నమలడం ప్రయోజనకరమని చాలామందికి తెలుసు. కానీ నమలడం వల్ల మెదడుపై కూడా ఆశ్చర్యకరమైన ప్రభావం ఉంటుందని తెలుసా? అదీ కలప వంటి గట్టి ఆహారాలను నమలడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఒక కొత్త అధ్యయనం ద్వారా తెలుస్తోంది.
ఫ్రాంటియర్స్ ఇన్ సిస్టమ్స్ న్యూరోసైన్స్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం మృదువైన ఆహారాలను నమలడంతో పోలిస్తే , గట్టి ఆహారాలను నమలడం అనేది మెదడుకి, జ్ఞాపకశక్తికి చాలా మంచిదని తేలింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం గట్టి పదార్థాలను నమలడం వల్ల మెదడులో కీలకమైన గ్లూటాథయోన్ (GSH) లెవల్స్ గణనీయంగా పెరిగాయి.
ఈ అధ్యయనం ఎలా జరిగింది
మెదడు తనను తాను రక్షించుకోవడానికి కొన్ని యాంటీఆక్సిడెంట్లను ఉపయోగిస్తుంది. వాటిలో ఒకటి గ్లూటాథయోన్. ఈ అధ్యయనంలో పరిశోధకులు దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు 52 మంది ఆరోగ్యవంతమైన విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక సమూహానికి చెందిన వారికి పారాఫిన్ వాక్స్ గమ్ నమలమని, చెక్కతో చేసిన టంగ్ డిప్రెసర్‌లను నమలాలని మరో గ్రూపునకు చెప్పారు. ముప్పై సెకన్లు నమలడం, స్వల్ప విరామం, మళ్లీ నమలడం ఇలా ఐదు నిమిషాల పాటు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. మాగ్నెటిక్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించి నమలడానికి ముందు, ఆ తర్వాత అంటీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్ (అభిజ్ఞాన నియంత్రణకు ముఖ్యమైన మెదడు ప్రాంతం)లో గ్లూటాథయోన్ స్థాయిని, అభిజ్ఞాన పనితీరును అంచనా వేశారు. దీని ప్రకారం చెక్కను నమిలిన గ్రూపులో గ్లూటాథయోన్ స్థాయిలు గణనీయంగా పెరిగాయి. చూయింగ్ గమ్ నమిలిన గ్రూపులో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇది ఒక రకంగా మెదడు కణాలకు రక్షక కవచంగా, మెరుగైన జ్ఞాపకశక్తి పనితీరుకు పనిచేస్తుందట.
మొత్తంగా ఈ అధ్యయనం రెండు ప్రధాన ఫలితాలను ఇచ్చిందనీ మొదటిది కలప నమలడం సమూహం మెదడు గ్లూటాథియోన్ స్థాయిలు పెరగడం, రెండోది మెదడు పనితీరుతో మెరుగుపడటం జరిగిందన్నారు. మెదడు GSH స్థాయిలను పెంచడానికి ప్రస్తుతం మందులు లేదా నిర్దేశిత పద్ధతులేవీ లేనందున, గట్టి పదార్థాన్నినమలడం అనేది ప్రభావవంతమైన సాధనంగా ఉపయోగ పడుతుందనిపరిశోధనలు భావిస్తున్నారు.
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, వృద్ధులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి, అభిజ్ఞా పనితీరును కాపాడుకోవడానికి బాగా నమలగలగడం చాలా ముఖ్యం. నిజానికి, దంతాల నష్టం అల్జీమర్స్ వ్యాధికి ఒక ప్రధాన ప్రమాద కారకం. బయోమెడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ ప్రకారం, నమలడం అనేది హిప్పోకాంపస్, ప్రిఫ్రంటల్ కార్టెక్స్‌తో సహా అభిజ్ఞా ప్రక్రియకు అవసరమైన అనేక మెదడు ప్రాంతాలను సక్రియం చేస్తుంది. నమలడం వల్ల మెదడు కార్యకలాపాలను, రక్తప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. మెదడుకు చక్కటి ఆక్సిజన్, పోషకాల సరఫరాను మెరుగుపరుస్తుంది.
నోట్ : ఇది పరిమితంగా నిర్వహించిన పరిశోధన మాత్రమే అని గమనించగలరు. బలపాలు, సున్నం,బియ్య లాంటి వాటిని అసాధారణంగా తినడాన్ని అనారోగ్యానికి చిహ్నం. ఆహార పోషకాలు లోపాలు, ఒత్తిడి కారణంగా ఇలాంటి అలవాట్లు వస్తాయి. అలాగే చెక్కను నమలడం, లిగ్నోఫాగియా అని కూడా పిలుస్తారు. చెక్కను నమలడం వల్ల దంతాలు దెబ్బతింటాయి . ఇది బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఎక్కువ. పైగా కొన్నిమొక్కలు విషపూరితంగా కూడా ఉంటాయి.
ఇదీ చదవండి: ‘వస్తానని చెప్పావు కదా బేబీ’! : భోరున విలపించిన పైలట్ భార్య