
విదేశాల్లో చిక్కుకుపోయిన వ్యక్తి నాలుగు దశాబ్దాల తరువాత తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. చక్కటి ఉద్యోగం,మంచి జీతం సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనలో పొట్టచేత పట్టుకొని వెళ్లాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుని ఒకటీ రెండూ కాదు ఏకంగా 42 ఏళ్లు అక్కడే ఉండిపోయాడు. చివరికి అక్కడినుంచి ఎలా బైటపడ్డాడు? కుటుంబాన్ని ఎలా కలుసుకున్నాడు? ఈ హృదయ విదారక గాథకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం రండి!
కేరళలోని త్రివేండ్రంలోని పౌడికోణం సమీపంలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న గోపాలన్ గల్ఫ్ దేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించి, కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కన్నాడు. ఎంతో మంది వలస కార్మికుల మాదిరిగానే ఎన్నో ఆశలతో ఇల్లు వదిలాడు. 1983 ఆగస్టు 16న బహ్రెయిన్‌కు వెళ్లాడు. కానీ విధి రాత మరోలా ఉంది.
ఏమైందంటే..
గోపాలన్ బహ్రెయిన్‌కు చేరుకున్నాడో లేదో, అతని యజమాని అకాల మరణం చెందాడు. గోపాలన్ పాస్‌పోర్ట్ పోయింది. దీంతో గోపాలన్ అయోమయంలో పడిపోయాడు. ఇమ్మిగ్రేషన్ చిక్కులతో బహ్రెయిన్‌లో చిక్కుకు పోయాడు. నాలుగు గోడల మధ్య మౌనంగా రోదిస్తూ ఉండిపోయాడు.
అయితే భారతదేశం, విదేశాలలో అన్యాయాన్నిఎదుర్కొంటున్న భారతీయుల కోసం పోరాడే రిటైర్డ్ న్యాయ మూర్తులు, న్యాయవాదులు , జర్నలిస్టులతో కూడిన ప్రవాసీ లీగల్ సెల్ (PLC) అనే NGO ద్వారా అతని పాలిట వరంగా అవతరించింది. గోపాలన్ విషయం తెలుసుకుని అతనికి సాయపడింది. పీఎల్‌సీ బహ్రెయిన్ చాప్టర్ ప్రెసిడెంట్ సుధీర్ తిరునిలత్, తన బృందంతో కలిసి బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం, అక్కడి ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌తో సమన్వయం చేసుకుని, అష్టకష్టాలు పడి చివరికి 74 ఏళ్ల వయసులో గోపాలన్ తిరిగి వచ్చేలా చేశారు.
ఫలించిన తల్లి ఎదురు చూపులు
గోపాలన్ చివరకు 95 ఏళ్ల తల్లిని చూడటానికి ఇంటికి తిరిగి వచ్చాడు. అలా కొడుకు కోసం ఆమె చూసిన ఎదురు చూపులు ఫలించాయి. ఒట్టి చేతులతో కేవలం ఎన్నో జ్ఞాపకాలు, మరెంతో కన్నీళ్లభారంతో స్వదేశానికి పయనమయ్యాడు. కుటుంబంతో తిరిగి కలవాలనే కలతో విమాన మెక్కిన రోజు అతని జీవితంలో మరపురాని రోజుగా మిగిలిపోయింది. కాసింత దయ, మానవత్వం, న్యాయం, అవిశ్రాంత పోరాటం ఫలితంగా వచ్చిన ఫలితమిది. ఎంతోమంది వలసదారులకు ఆశలకు ప్రాణంపోసిన ఉదంతమిది. ‘స్వాగతం గోపాలన్, ఇంటికి స్వాగతం’ అంటూ పీఎల్‌సీ తన ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొంది.