Bahrain
-
మరో ముస్లిం దేశంలో హిందూ దేవాలయం.. త్వరలోనే నిర్మాణం!
యూఏఈలోని అబుదాబిలో నిర్మితమైన మొదటి హిందూ దేవాలయం బుధవారం (ఫిబ్రవరి 14)నాడు ప్రారంభమయ్యింది. బీఏపీఎస్ నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇప్పుడు అబుదాబి తర్వాత మరో ముస్లిం దేశంలోనూ హిందూ దేవాలయం నిర్మితం కాబోతోంది. ఇందుకోసం ఆ దేశ రాజు నుంచి భూమిని విరాళంగా అందించారు. ఆలయ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. యూఏఈ తర్వాత మరో ముస్లిం దేశమైన బహ్రెయిన్‌లో హిందూ దేవాలయాన్ని నిర్మించనున్నారు. ఈ ఆలయం కూడా అబుదాబిలో నిర్మితమైన దేవాలయం మాదిరిగానే ఉండనుంది. ఈ ఆలయాన్ని బోచాసన్ నివాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ(బీఏపీఎస్) నిర్మించబోతోంది. ఈ నేపధ్యంలో బీఏపీఎస్ ప్రతినిధి బృందం బహ్రెయిన్ పాలకునితో సమావేశమైంది. ఆలయం కోసం బహ్రెయిన్ ప్రభుత్వం భూమిని కేటాయించింది. దీంతో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడానికి సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి భూమిని కేటాయించినట్లు స్వయంగా ప్రకటించారు. దీనికి ముందు స్వామి అక్షరతి దాస్, డాక్టర్ ప్రఫుల్ల వైద్య, రమేష్ పాటిదార్, మహేష్ దేవ్‌జీ తదితరులు ఆలయ నిర్మాణం విషయమై చర్చించేందుకు బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్‌ను కలిశారు. అన్ని మతాల ప్రజలను స్వాగతించడం, వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రోత్సహించడం తమ ఉద్దేశమని బీఏపీఎస్ పేర్కొంది. బహ్రెయిన్‌లోని హిందూ ఆలయ నిర్మాణానికి భూమిని ఇచ్చినందుకు భారత ప్రధాని మోదీ.. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు, మత సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. -
భారత వాలీబాల్ జట్టుకు నిరాశ
మనామా (బహ్రెయిన్): ప్రపంచ అండర్–21 పురుషుల వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. గ్రూప్ లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు పరాజయం చవిచూసింది. తద్వారా నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. పూల్ ‘సి’లో ఉన్న భారత జట్టు తొలి మ్యాచ్‌లో 17–25, 14–25, 25–20, 19–25తో పోలాండ్ చేతిలో... రెండో మ్యాచ్‌లో 19–25, 25–22, 27–29, 13–25తో బల్గేరియా చేతిలో... మూడో మ్యాచ్‌లో 25–18, 27–29, 20–25, 22–25తో కెనడా చేతిలో ఓడిపోయింది. పదేళ్ల తర్వాత మళ్లీ ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించిన భారత జట్టు తదుపరి 9 నుంచి 16 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు ఆడుతుంది. -
ఇక్కడ పార్లమెంట్ ఉన్నా అధికారం రాజరికానిదే!
బహ్రెయిన్ నేను సందర్శించడానికి ఎంపిక చేసుకున్న గమ్యస్థానం కాదు. దాన్ని ఎమిరేట్స్, ఖతర్‌కు చెందిన పేద బంధువులాగా భావించేవాడిని. కానీ నాకు తెలిసిన వాస్తవం ఏమిటంటే ఆ ప్రాంతం గురించి నాకు ఏమీ తెలీదు. నా అభిప్రాయం నా అజ్ఞానానికి ప్రతిబింబంగా ఉండేది. గత వారాంతంలో నాదెంత తప్పుడు అభిప్రాయమో నేను కనిపెట్టాను. బహ్రెయిన్ వెచ్చని, సంతోషకరమైన, ఆకర్షణీయమైన దేశం. నమ్మలేనంత శుభ్రంగానూ, దుబాయ్, అబుదాబీ, ఖతార్ లాగే ఆధునికంగానూ ఉంది. కానీ బహ్రెయిన్ చాలా చిన్నదేశం. కేవలం 800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉన్న దేశం. వాస్తవానికి ‘బహ్రెయిన్ ద్వీపం’ అనే పేరు కలిగి ఉన్న ద్వీప సమూహం. కొద్ది కాలం క్రితం ఈ ద్వీపం 40 కిలోమీటర్ల పొడవు, 16 కిలోమీటర్ల వెడల్పు ఉన్న భూభాగంగా మాత్రమే ఉండేది. సముద్రం నుంచి ఏర్పడుతూ వచ్చిన ఈ దేశం (ఇప్పటికీ అలా జరుగుతూనే ఉంది) తన సైజును బహుశా రెట్టింపు చేసుకోగలిగింది. కానీ మాల్దీవులు, సింగపూర్ తర్వాత ఇది ఇప్పటికీ ఆసియాలో మూడో అతి చిన్న దేశంగా ఉంది. బహ్రెయిన్ జనాభా 16 లక్షలు మాత్రమే. భారత దేశం నుంచే 4 లక్షల మంది ప్రవాసులు ఈ దేశానికి వచ్చారు. వీరిలో నాలుగింట మూడొంతుల మంది కేరళకు చెందిన వారే. ఈ దేశ జనాభాలో 43 శాతం మంది అరబ్ యేతర ఆసియన్లే అని వికీపీడియా పేర్కొంటోంది. వీరంతా ప్రవాసం వచ్చిన కార్మికులే అని నా అంచనా. స్థానిక జనాభా 47 శాతం మాత్రమే. ఈ చిన్న ద్వీపం గురించిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం. అరబ్ ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావి 1931లో ఇక్కడే బయటపడింది. ఈరోజు బహ్రెయిన్ ప్రముఖ చమురు ఉత్పత్తిదారు కాదు. కానీ ఈ చమురు బావి నిరుపయోగకరంగా ఉన్నప్పటికీ పర్యాటకులకు మాత్రం గర్వంగా తన్ను తాను ప్రదర్శించుకుంటోంది. బహ్రెయిన్ దీనార్ ప్రపంచంలోనే రెండో అతి శక్తిమంతమైన కరెన్సీ. ఒక దీనార్కి మీరు 2.65 అమెరికన్ డాలర్లు పొందవచ్చు. కాబట్టి బహ్రెయిన్ మరీ అల్లాటప్పా దేశం కాక పోవచ్చు. బహ్రెయిన్‌లోని కేరళీయ సమాజం ఆహ్వానం మేరకు నేను ఆ దేశాన్ని సందర్శించాను. ఇది ఉజ్జ్వలమైన, అంకిత భావం కలిగిన సామాజిక సంస్థ. అలాగే డీసీ బుక్స్‌కి కూడా ఇది పేరుపొందింది. ద్వీపంలో జరిగే బుక్ ఫెస్టివల్లో కేరళీయులు ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. ఈ పుస్తక ప్రదర్శనశాల జాతీయ ఎన్నికలతో ముడిపడి ఉండటం నాకు ఆశ్చర్యాన్నీ, సంతోషాన్నీ కలిగించింది. మనదేశంతో పోలిస్తే ఇక్కడి ఎన్నికలు చాలా చాలా చిన్నవే కావచ్చు కానీ వాటిని వీరు నిర్వహించే తీరు మాత్రం నన్ను పరవశింపజేసింది. బహ్రెయిన్‌లో ఉన్నది రాచరిక వ్యవస్థే. అది స్వభావ రీత్యా రాజ్యాంగబద్ధమైనదే కావచ్చు కానీ అధికారం మాత్రం రాజు హమీద్, అల్ ఖలీఫా రాజకుటుంబం చేతిలో మాత్రమే ఉంటుంది. అయితే 2002 నుంచి ప్రతి అయిదేళ్ల కోసారి పార్లమెంటును ఎన్నుకుంటూ ఉన్నారు. ఇది 40 సీట్ల సింగిల్ ఛాంబర్ హౌస్. ఎగువ, దిగువ సభల్లాంటివి ఉండవు. బహ్రెయిన్ రాజ్యంలో రాజకీయ పార్టీలు లేవు. పార్లమెంటుకు అభ్యర్థులు స్వతంత్రులుగానే పోటీ చేయాల్సి ఉంటుంది. ఫ్రాన్స్లాగే, ఇక్కడా ఎన్నికలు రెండు దశలలో ఉంటాయి. తొలివిడత ఎన్నికలు నేను రావడానికి ముందే నవంబర్ 12న జరిగాయి. 40 పోలింగ్ బూత్‌లలో 344 మంది అభ్యర్థులకు ఓటు వేయడానికి 3,44,713 మంది బహ్రెయిన్ పౌరులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరంతా ఈ 344 మంది అభ్యర్థుల్లో 40 మందిని ఎన్ను కోవడానికి ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇక్కడ విస్తరించి ఉన్న సీఫ్ మాల్లో విహారయాత్ర అత్యంత ప్రజాదరణ పొందింది. నేను ఈ దేశాన్ని సందర్శించినప్పుడు ఓటు వేయడానికి తమ వంతు సమయం కోసం ఎదురు చూస్తున్న ఓటర్లు స్టార్‌బక్స్ కాఫీలు సేవిస్తూ, హాగెన్–దాస్ ఐస్‌క్రీములను లాగించేస్తూ కనిపించారు. ఇక్కడ అన్నీ ఎయిర్ కండిషన్‌తో సౌకర్యవంతంగా ఉంటాయి! ప్రవాసం వచ్చినవారు, గల్ఫ్ సహకార దేశాలకు చెందిన పౌరులు దేశంలో సొంత ఆస్తులను కలిగి ఉండి ఇక్కడే జీవిస్తూ ఉన్నట్లయితే వారు ఓటు వేసేందుకు బహ్రెయిన్ అనుమతిస్తుంది. నేను ఇక్కడ పర్యటించిన ప్పుడు జరిగిన ఎన్నికల్లో 73 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది చాలా అధిక శాతమట. ఇక రెండో విడత పోలింగ్ 13వ తేదీన ముగిసింది తొలి రౌండ్ ఓటింగ్ తర్వాత, ‘ది వాయిస్ ఆఫ్ బహ్రెయిన్’ అని తనను తాను పిలుచుకునే గల్ఫ్ డైలీ న్యూస్ పత్రిక, పోలింగ్‌ను విజయవంతం చేసినందుకు ఓటర్లకు రాజు అభినందనలు తెలిపారని రాసింది. ఇది 16 పేజీల ట్యాబ్లాయిడ్. రాజు తన సంతోషాన్ని రాజరికపు హుందా తనంతో ప్రకటించారు. ‘మన ప్రియతమ రాజరికం కోసం సాధించిన ఈ ఘన విజయం పట్ల మమ్ము మేమూ, మా విశ్వసనీయ ప్రజలనూ అభినందించుకుంటున్నాము’ అని రాజు పేర్కొన్నారు. యువరాజు, ప్రధానమంత్రి రాజును అభినందనలతో ముంచెత్తారని పత్రికలు నివేదించాయి. అంటే సముద్ర మట్టానికి సమాంతరంగా ఉండే ఈ ద్వీపంలో సామరస్యం పొంగిపొరలుతోందన్న మాట. బహ్రెయిన్‌లో రెండు అమెరికా స్థావరాలు ఉన్నాయి. పైగా ఇది ‘నాటో’ కూటమిలో ప్రముఖ మిత్ర దేశం కూడా! అయితే ఎంత గాలించినా ఒక్కరంటే ఒక్క అమెరికన్ సైనికుడు కూడా కనిపించలేదు. సౌదీ అరేబియన్లు తరచుగా కనిపిస్తుంటారు. 1980లలో చిత్తడినేలపై నిర్మించిన దారిలో అరగంట ప్రయాణిస్తే చాలు సౌదీ పౌరులు ఇక్కడికి చేరు కోవచ్చు. వారాంతపు సందర్శకులుగా వారు తరచూ ఇక్క డికి వస్తుంటారు. సౌదీ రాజరికం తమకు నిరాకరించిన ఆల్కహాల్‌ని బహ్రెయిన్ రాజు అనుమతించారు మరి! చివరగా, ఫోర్ సీజన్స్ షాపులో నేను గత కొన్ని సంవత్సరాలుగా దొరకని చక్కటి బర్గర్‌ని రుచి చూశాను. గతంలో మీరు ఎమిరేట్స్ని సందర్శించి ఉన్నప్పటికీ షాపింగ్, సముద్ర క్రీడలు, ఎడారి, ఆధునిక నగరం వంటి వాటిని ఇంకా ఇష్టపడుతున్నట్లయితే మీ తదుపరి వారాం తపు సెలవుల్లో బహ్రెయిన్ రావడానికి ఎందుకు ప్రయత్నిం చకూడదు? కరణ్ థాపర్ సీనియర్ జర్నలిస్ట్ (బహ్రెయిన్ నుంచి రాసిన వ్యాసం) -
వలస కార్మికులకు బహ్రెయిన్ షాక్
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన కొట్టూరి శ్రీకాంత్ రెండు నెలల కిందట విజిట్ వీసాపై బహ్రెయిన్ వెళ్లాడు. అక్కడ ఏదో ఒక కంపెనీలో పని చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ విజిట్ వీసాపై వచ్చిన వారికి పని ఇవ్వడానికి కంపెనీలు నిరాకరించాయి. ఫలితంగా విజిట్ వీసా గడువు ముగిసేలోపు శ్రీకాంత్ ఇంటికి చేరుకున్నాడు. బహ్రెయిన్‌కు వెళ్లడానికి రూ.లక్ష వరకు ఖర్చు చేయగా ఈ డబ్బును శ్రీకాంత్ నష్టపోవాల్సి వచ్చింది. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన ఎండీ ఇబ్రహీం కొన్నేళ్ల నుంచి బహ్రెయిన్‌లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల కిందట ఇంటికి వచ్చి మళ్లీ బహ్రెయిన్ వెళ్లాడు. అతనికి మరో రెండేళ్ల వరకు అక్కడ పనిచేయడానికి అవకాశం ఉంది. కానీ అక్కడి ప్రభుత్వ ఆధీనంలోని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఏ) అనేక మంది వలస కార్మికుల వీసాలను అర్ధంతరంగా రద్దు చేసింది. ఫలితంగా ఇబ్రహీం ఇంటికి వచ్చేశాడు. విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బహ్రెయిన్‌లో పర్యాటక రంగం వృద్ధి చెందడంతో ఆ దేశానికి వెళితే ఏదో ఒక పని చేసుకోవచ్చని వలస కార్మికులు ఆశిస్తున్నారు. అదే ఆశతో విజిట్ వీసాపై వెళ్లిన శ్రీకాంత్ ఇంటి దారి పట్టగా, వర్క్ వీసాకు గడువున్నా ఇబ్రహీం కూడా బలవంతంగా ఇంటికి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం వందలాది మంది ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. మోర్తాడ్ (బాల్కొండ): బహ్రెయిన్‌లో ఉపాధి పొందవచ్చని భావిస్తున్న ఎంతో మంది వలస కార్మికులకు అక్కడి ప్రభుత్వం షాకిస్తోంది. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, ఒమాన్‌ల మాదిరిగానే బహ్రెయిన్ కూడా ఎంతో మంది తెలుగువారికి ఉపాధి అవకాశాలు కల్పించింది. అయితే ఇకనుంచి అది చరిత్రగానే మిగిలిపోనుంది. బహ్రెయిన్ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు, వలస కార్మికుల వీసాలను పర్యవేక్షించే లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ అనుసరిస్తున్న విధానాలతో బహ్రెయిన్‌లో ఉపాధి మార్గాలు మూసుకుపోతున్నాయి. వారం, పది రోజుల వ్యవధిలోనే తెలంగాణ జిల్లాలకు చెందిన వలస కార్మికులు దాదాపు రెండు వేలమంది బహ్రెయిన్ నుంచి ఇంటిదారి పట్టారని అంచనా. వర్క్ వీసాలను రద్దు చేయడం, విజిట్ వీసాలపై వెళ్లి పని వెతుక్కునేవారికి ఎల్ఎంఆర్ఏ ఇచ్చిన ఆదేశాలతో కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించడంతో ఉపాధి కరువైంది. బహ్రెయిన్ ప్రభుత్వం పునరాలోచన చేస్తే తప్పా ఆ దేశంలో వలస కార్మికుల ఉపాధికి అవరోధాలు తప్పవని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బహ్రెయిన్‌కు వెళ్లే ఆలోచన మానుకోవాలని వలస కార్మికుల సంఘాలు సూచిస్తున్నాయి. -
గన్ పార్క్ వద్ద గల్ఫ్ కార్మికుని మృతదేహానికి నివాళి
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన జనగామ నర్సయ్య ఇటీవల బహ్రెయిన్‌లో మరణించారు. శనివారం బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మృతదేహాన్ని గల్ఫ్ జేఏసీ నాయకులు, మృతుని కుటుంబ సభ్యులు కలిసి హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం, గన్ పార్క్ వద్ద ఉంచి నివాళులు అర్పించారు. గల్ఫ్ అమరులకు నివాళులు అర్పిస్తూ అరుణోదయ సాంస్కృతిక బృందం పాటలు పాడారు. గల్ఫ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గుగ్గిల్ల రవిగౌడ్, తెలంగాణ బీజేపీ గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు, తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుల మురళీధర్ రెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన గల్ఫ్ జేఏసీ నాయకులు రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్‌తో గల్ఫ్ బోర్డుతో కూడిన సమగ్ర ప్రవాసీ విధానం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఎనిమిది ఏళ్లలో 1,600 మంది తెలంగాణ కార్మికులు గల్ఫ్ దేశాలలో మృతి చెందారని, కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి గల్ఫ్ మృతుని కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు -
బహ్రెయిన్ విజిట్ వీసా నిబంధనలు కఠినతరం
మోర్తాడ్ (బాల్కొండ): బహ్రెయిన్ దేశం విజిట్ వీసాల నిబంధనలను కఠినతరం చేసింది. తమ దేశానికి విజిట్ వీసాలపై వచ్చిన వారు గడువు ముగిసిపోయినా ఇంకా ఉండిపోతున్నారని బహ్రెయిన్ ప్రభుత్వం గుర్తించింది. గతంలో విజిట్ వీసాలపై బహ్రెయిన్‌కు వెళ్లేవారు డమ్మీ రిటర్న్ టికెట్‌ను చూపేవారు. రిటర్న్ టికెట్ విషయంలో ఇప్పటివరకు బహ్రెయిన్ ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజా నిబంధనల ప్రకారం ఇప్పుడు పక్కాగా కొనుగోలు చేసిన రిటర్న్ టికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. అంటే విజట్ వీసాపై వచ్చినవారు కచ్చితంగా వెనక్కు వెళ్లిపోవాలి. విజిట్ వీసాలపై వచ్చిన వారు ఏ హోటల్లో బస చేస్తున్నారో ఆ హోటల్లో గదులను ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఇవేమీ పట్టించుకునేవారు కాదు. విజిట్ వీసాలపై బహ్రెయిన్‌కు వెళ్లేవారు మన కరెన్సీలో రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు దినార్లుగా మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు కనీసం 50 దినార్లు ఖర్చు చేయాలి. విజిట్ వీసాలపై వచ్చినవారు కేవలం పర్యాటక ప్రాంతాలను చూసి తిరుగు ప్రయాణం కావాలి. ఇప్పటివరకు అనేక మంది విజిట్ వీసాలపై బహ్రెయిన్‌కు వెళ్లి గడువు ముగిసినా అక్కడే ఉంటూ ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం దక్కించుకుంటూ ఉండిపోతున్నారు. ఇలా అక్రమంగా ఉంటున్నవారి సంఖ్య పెరిగిపోవడంతో వారి సంఖ్యను తగ్గించడానికి అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. దీంతో తొలుత విజిట్ వీసాల నిబంధనల్లో మార్పులు చేసింది. (క్లిక్ చేయండి: యాదాద్రి ప్లాంట్‌కు ‘పర్యావరణ’ కష్టాలు!) -
బహ్రెయిన్ ఆర్థిక శాఖ మంత్రి సల్మాన్ అల్ ఖలీఫాతో సీఎం జగన్ భేటీ
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు మూడో రోజు కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ సెంటర్లో బహ్రెయిన్ ఆర్థిక శాఖ మంత్రి సల్మాన్ అల్ ఖలీఫాతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై ఇరువురు చర్చించుకున్నారు. చదవండి: దావోస్‌లో ఏపీ ధగధగ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి విజేత లెక్లెర్క్
క్వాలిఫయింగ్ సెషన్లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించాడు ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్. ఆదివారం జరిగిన ఫార్ములావన్ సీజన్ తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో అతడు విజేతగా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్‌లను లెక్లెర్క్ ఒక గంట 37 నిమిషాల 33.584 సెకన్లలో పూర్తి చేసి కెరీర్లో మూడో విజయాన్ని అందుకున్నాడు. ఫెరారీకే చెందిన కార్లోస్ సెయింజ్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ 54వ ల్యాప్‌లో వైదొలిగాడు. These two put on one heck of a show!@Charles_Leclerc ⚔️ @Max33Verstappen #BahrainGP #F1 pic.twitter.com/Zl5Szg0qDv — Formula 1 (@F1) March 20, 2022 They've waited a long time for this!@ScuderiaFerrari let the emotion out after their first 1-2 since 2019 🎉#BahrainGP #F1 pic.twitter.com/ap5vFbWI26 — Formula 1 (@F1) March 20, 2022 -
బహ్రెయిన్ నుంచి క్షేమంగా తిరిగొస్తున్న వలస కార్మికులు
సాక్షి, అమరావతి: బహ్రెయిన్‌లో ఎన్హెచ్ఎస్ సంస్థలో పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను ప్రభుత్వం క్షేమంగా స్వస్థలాలకు చేరుస్తోంది. ఇప్పటి వరకు 33 మందిని బహ్రెయిన్ నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చినట్టు ఏపీఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ వెంకట్ ఎస్.మేడపాటి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్మికులకు భోజనం, వసతి, స్వస్థలాలకు రవాణా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది కార్మికులను వెనక్కి తీసుకురానున్నట్టు తెలిపారు. ఎన్హెచ్ఎస్ సంస్థ దాష్టీకాలు భరించలేక ఇబ్బందులు పడుతూ అక్కడ ఇరుక్కుపోయిన కార్మికుల విషయం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి వెళ్లగానే.. ఆయన తక్షణం స్పందించినట్టు తెలిపారు. వారిని క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సెప్టెంబర్ 13న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాసినట్టు తెలిపారు. దీనిపై విదేశాంగ శాఖ తక్షణం స్పందించడంతో కార్మికులను స్వదేశానికి తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి సీదిరి అప్పలరాజుకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. -
యూఏఈ, బహ్రెయిన్ పర్యటనకు సౌమ్య..
Soumya Guguloth: వచ్చే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్లలో పర్యటించే భారత మహిళల సీనియర్ ఫుట్‌బాల్ జట్టును సోమవారం ప్రకటించారు. 23 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. టీమిండియా వచ్చే నెల 2న యూఏఈతో, 4న ట్యూనిషియాతో, 10న బహ్రెయిన్‌తో, 13న చైనీస్ తైపీతో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: David Warner: మళ్లీ కనిపించకపోవచ్చు.. కానీ సపోర్టు చేయండి.. అన్నా అలా అనొద్దు! -
ఫార్ములా వన్ చాంపియన్ హామిల్టన్‌కు కరోనా
మనమ: కరోనా వైరస్ సామాన్యుల నుంచి సెలబ్రిలను సైతం వదలడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది దేశాధినేతలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు, బడా వ్యాపావేత్తలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఆదివారం బహ్రెయిన్‌లో జరిగిన 11వ గ్రాండ్ ప్రిని సొంతం చేసుకున్న హామిల్టన్‌కు కరోనా సోకడంతో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆయనలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హామిల్టన్ ఆరోగ్యం బాగానే ఉందని మెర్సిడెజ్ ఏఎంసీ పెట్రొనాస్ టీం తెలిపింది. అయితే త్వరలో జరిగే సాఖిర్ గ్రాండ్ ప్రికి హామిల్టన్ దూరమవుతున్నట్లు టీమ్ వెల్లడించింది. కాగా 7 సార్లు ఫార్ములా వన్ చాంపియన్‌గా నిలిచిన హామిల్టన్ రేసింగ్‌లో చరిత్ర సృష్టించాడు. అయితే ఆయనకు గత వారంలో మూడు సార్లు పరీక్షలు నిర్వహించగా ప్రతిసారి నెగెటివ్ వచ్చింది. ఈ తరుణంలో ఆదివారం కూడా ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా తెలింది. దీంతో హామిల్టన్ ప్రస్తుతం బహ్రెయిన్‌లోనే ఐసొలేషన్‌లో ఉన్నాడు. కాగా ఆయనలో స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని, ఎలాంటి ఇబ్బంది లేదని టీమ్ సభ్యులు తెలిపారు. -
బహ్రెయిన్ రాజు ఖలీఫా కన్నుమూత
దుబాయ్: ప్రపంచంలోనే సుదీర్ఘకాలం ప్రధాన మంత్రిగా కొనసాగిన 84 ఏళ్ళ బహ్రెయిన్ రాజు షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా బుధవారం మరణించారు. గత కొంతకాలంగా అనా రోగ్యంతో బాధపడుతోన్న ఖలీఫా అమెరికాలోని మేయో క్లినిక్‌లో చికిత్సపొందుతూ మరణిం చినట్లు బహ్రెయిన్ ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఖలీఫా దేశ విదేశాల్లో అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని షియాలు 2011లో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. ఈ ఉద్యమకారులను ఖలీఫా తీవ్రంగా అణచివేసి, తన పదవిని కాపాడుకోవడంలో కృతకృత్యులయ్యారు. ఈయన అత్యంత సంపన్నవంతుడు. విదేశీ ప్రతినిధులను కలవడానికి, ప్రత్యేకంగా తన సొంత దీవిలో సమావేశాలు నిర్వహించేవారు. బహ్రెయిన్‌ను 200 ఏళ్ల కు పైగా పరిపాలించిన అల్ ఖలీఫా వంశంలో ఈయన జన్మించారు. -
బహ్రెయిన్‌లో మహిళ దుశ్చర్య
మనామా: బహ్రెయిన్ సూపర్ మార్కెట్లో వినాయకుడి విగ్రహాలు ఉంచడం పట్ల ఇద్దరు ముస్లిం ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాలను ధ్వంసం చేయడమే కాక సూపర్‌మార్కెట్ సిబ్బందితో గొడవపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నివేదికల ప్రకారం ఈ సంఘటన బహ్రెయిన్ రాజధాని మనమా పక్కనే ఉన్న జుఫైర్ ప్రాంతంలోని ఒక సూపర్ మార్కెట్లో జరిగింది. వివరాలు.. వినాయక చవితిని దృష్టిలో పెట్టుకుని బహ్రెయిన్ జుఫైర్ సూపర్మార్కెట్లో గణేషుడి విగ్రహాలు అమ్మకం కోసం ఉంచారు. ఇది చూసిన ఇద్దరు ముస్లిం మహిళలు వినాయక విగ్రహాలను దూషించడమే కాక సూపర్‌మార్కెట్ సిబ్బందితో గొడవపడ్డారు. అంతేకాక వారిలో ఓ మహిళ విగ్రహాలను ఒక్కొక్కటిగా నేలపై పడేసి ధ్వంసం చేసింది. ‘ఇది మహ్మద్ బెన్ ఇస్సా దేశం. అతను ఇతర మతస్తుల దేవుళ్లను అనుమతించాడని మీరు భావిస్తున్నారా. ఇది ముస్లిం దేశం.. ఇలా చేయడం సరియైనదేనా’ అంటూ ప్రశ్నించింది. మరొక మహిళ ‘పోలీసులను పిలవండి. ఈ విగ్రహాలను ఎవరు ఆరాధిస్తారో చూద్దాం’ అంటూ అవరడం వీడియోలో చూడవచ్చు. (ముంబైలో లాల్బగ్చా గణేశ్ ఉత్సవాలు రద్దు) This video is from #Bahrain "Lady destroying the idols of Lord Ganesha " No religion teaches to disrespect someone's faith and belief's. #Bahrain pic.twitter.com/IGrtS1k12E — Amit (@amy_official7) August 16, 2020 ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో బహ్రెయిన్ ప్రభుత్వం సదరు మహిళ మీద చర్యలు తీసుకుంది. ఈ మేరకు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ‘జుఫైర్లోని ఒక దుకాణంలో విగ్రహాలను ధ్వంసం చేసినందుకు.. ఒక సామాజిక వర్గాన్ని.. దాని ఆచారాలను అవమానించినందుకు 54 ఏళ్ల మహిళపై రాజధాని పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు’ అంటూ ట్వీట్ చేసింది. రాయల్ సలహాదారు ఖలీద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా ఈ చర్యను ఖండించారు. దీనిని ‘ద్వేషపూరిత నేరం’గా వర్ణించారు. ‘మతపరమైన చిహ్నాలను నాశనం చేయడం బహ్రెయిన్ ప్రజల స్వభావంలో భాగం కాదు. ఇది ద్వేషాన్ని బహిర్గతం చేసే నేరం’ అంటూ అల్ ఖలీఫా ఒక ట్వీట్లో పేర్కొన్నారు. Capital Police took legal steps against a woman, 54, for damaging a shop in Juffair and defaming a sect and its rituals, in order to refer her to the Public Prosecution. — Ministry of Interior (@moi_bahrain) August 16, 2020 -
అమ్మా.. నన్ను క్షమించు!
సాక్షి, కోరుట్ల: ‘అమ్మా..మంచిగుండుండ్రి..ఏం టెన్షన్ తీసుకోకు..సరేనా.? నేను పనిచేయలేక సచ్చిపోతలే..అమ్మా .. నా గుండెలో మొత్తం మంచిగ అనిపిస్తలేదు..చచ్చిపోవాలనిపిస్తుంది.. నన్ను ఇక్కడే కాలెస్తరో ఏమో నాకు తెల్వదు. నా కోసం ఎవ్వరు ఏడ్వకుండ్రి..సరేనా.. మంచిగుండుండ్రి.. అక్కలను మంచిగా చూసుకో.. అ మ్మా.. నన్ను క్షమించు అంటూ ఫోన్లో వాయిస్ రికా ర్డు చేసిన జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు ఉపాధి కోసం వెళ్లిన బహ్రెయిన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్‌కు చెందిన విట్టల వెంకటి–లక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు నవీన్(22) ఆరు నెలల కిందట ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లాడు. అక్కడ లేబర్‌గా పనిచేస్తూ కొన్నాళ్లు బాగానే ఉన్నాడు. సోమవారం రాత్రి 7 గంటలకు అకస్మాత్తుగా తన గదిలో తాడుతో ఉరేసుకున్నాడు. ఆత్మహత్య కు ముందు తను మాట్లాడింది ఫోన్లో రికార్డు చేసి, దాన్ని తన తల్లికి పంపమని స్నేహితున్ని కోరాడు. అందులో తాను పనిచేయలేక ఆత్మహత్య చేసుకోవడం లేదని, మనసులో ఏదో బా ధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. విషాద స్వరంతో అక్కలను.. నాన్నను మంచిగ చూసుకోవాలని.. ఏడవొద్దని కోరాడు. తన అంత్యక్రియలు బహ్రెయిన్‌లోనే చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేయడంతో నవీన్‌కు కరోనా సోకిందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ భయంతోనే మానసిక ఆందోళనకు గురై, ఆత్మహత్య చేసుకున్నాడేమోననే చర్చ స్థానికంగా జరుగుతోంది. నవీన్ మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అతని మృతదేహాన్ని స్వగ్రామం రప్పించాలని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను కోరి నట్లు కోరుట్ల ఎంపీపీ తోట నారాయణ, సర్పంచ్ తోట శారద తెలిపారు. -
బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి మృతి
జగిత్యాల: బతుకుదెరువు కోసం అరబ్ దేశం బహ్రెయిన్‌కి వెళ్లిన ఓ తెలంగాణ వ్యక్తి అక్కడే గుండెపోటుతో మృతి చెందారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్ గ్రామానికి చెందిన ఎడ్ల గంగరాజం మూడేళ్ల క్రితం బహ్రెయిన్ వెళ్లాడు. దురదృష్టవశాత్తు ఏప్రిల్ 14వ తేదీన గుండెపోటుతో అతను నివాసం ఉంటున్న ఇంట్లోనే మృతి చెందాడు. గంగరాజంకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద దేశం కాని దేశంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం ఆధారం కోల్పోయింది. అయితే సాధారణ పరిస్థితుల్లోనే అరబ్ దేశాల్లో చనిపోయిన వారి డెడ్ బాడీ తరలింపు ఎంతో కష్టం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. లాక్‌డౌన్‌తో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడం మరింత కష్టమైంది. దీంతో బహ్రెయిన్‌లోని తోటి సన్నిహితులు మగ్గిడి రాజేందర్ ఎన్నారై శాఖకు సమాచారం అందించటంతో వెంటనే స్పందించిన ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి మృతుడి కంపెనీ యజమాని, అధికారులతో మాట్లాడారు. కంపెనీ సహకారంతో వారు మృతదేహాన్ని ఎమిరేట్స్ కార్గో ప్లయిట్లో బహ్రెయిన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి స్వగ్రామం రాఘవపేట్ వరకు ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ వారి అధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించడం జరిగింది. మృతదేహం స్వదేశానికి తీసుకురావడానికి కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగల, ఎన్నారై శాఖ అధికారి చిట్టిబాబు అన్ని విధాల కృషి చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్ బొలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రటరీ పుప్పాల లింబాద్రి, మగ్గిడి రాజేందర్, సెక్రటరీ చెన్నమనేని రాజేందర్ రావు, బాల్కొండ దేవన్న, ఉత్కం కిరణ్ కుమార్, ఆకుల సుధాకర్, బొలిశెట్టి ప్రమోద్, తమ్మళ్ల వెంకటేష్, కొత్తూరు సాయన్న, కుమ్మరి రాజుకుమార్, నల్ల శంకర్, చిన్నవేన బాజన్న, కోట నడిపి సాయన్న, ఆకులన చిన్న బుచ్చయ్య, సొన్న గంగాధర్, తప్పి చిన్న గంగారాం, మొహమ్మద్ తదితరులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
కరోనా వ్యాప్తి: అక్కడ తొలి మరణం
మనామా: గల్ఫ్ దేశం బహ్రెయిన్‌లో సోమవారం తొలి కోవిడ్-19(కరోనా వైరస్) మరణం నమోదైంది. ఇరాన్ నుంచి వచ్చిన 65 ఏళ్ల మహిళ ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా మృతి చెందారని ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఆమె ప్రయాణం తర్వాత ఎవరినీ నేరుగా కలవలేదని.. ఐసోలేషన్ వార్డులోనే ఉన్నారు కాబట్టి.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. అదే విధంగా ఇప్పటిదాకా దేశంలో 214 కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడించింది. కరోనా అనుమానితుల ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభయమిచ్చింది. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లో తొలి కరోనా మృతిని నమోదు చేసిన దేశంగా బహ్రెయిన్ నిలిచింది. ఈ నేపథ్యంలో... ‘‘ మనం అతికష్టమైన సవాలును ఎదుర్కొంటున్నాం. కాబట్టి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా’’ అని బహ్రెయిన్ ఆరోగ్య శాఖా మంత్రి తాఫిక్ అల్ రాబియా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. దీంతో... ‘‘ మేమంతా ఇంట్లోనే ఉంటాం అందరి శ్రేయస్సు కోసం’’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌లతో నెటిజన్లు తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారు. (కరోనా అప్డేట్: 118కి చేరిన కేసుల సంఖ్య) కాగా మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో సౌదీ అరేబియా, కువైట్ దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలన్నింటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదే విధంగా జిమ్ములు, పబ్లిక్ పార్కులు, స్పాలు మూసివేస్తున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరలు దిగివస్తున్న వేళ తమ మార్కెట్‌కు అండగా నిలిచేందుకు అబుదాబి సోమవారం భారీగా నిధులు కేటాయించింది. క్యాపిటల్ మార్కెట్ లిక్విడిటీని పెంచేందుకు1 బిలియన్ దీరాంలు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఇక కరోనా కారణంగా నష్టపోతున్న చిన్న, మధ్య తరహా వ్యాపారులను ఆదుకునేందుకు సౌదీ అరేబియా 50 బిలియన్ రియాల్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఖతార్ సైతం కరోనాను ఎదుర్కొనేందుకు 20.5 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. -
బహ్రెయిన్‌లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
బహ్రెయిన్: బహ్రెయిన్‌లోని ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) 66వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి.. పబ్లిక్ గార్డెన్లో మొక్కలు నాటారు. అనంతరం ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీని స్థాపించి కోట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారని గుర్తుచేశారు. తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆరున్నర సంవత్సరాలు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని వర్గాల అభివృద్ధికై అహార్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా ఆయన ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను మన వంతు పాత్ర పోషించి సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేకులకు పథకాలతోనే సరైన సమాధానం ఇవ్వాలని, గల్ఫ్ దేశాలలో ఉన్న కూడా సీఎం కేసీఆర్ పుట్టినరోజు జరుపుకోవడం అనందంగా ఉందన్నారు. తమ కుటుంబాలను వదిలి ఉపాధికోసం గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలుగు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు త్వరలో సీఎం కేసీఆర్ గల్ఫ్‌లో పర్యటించనున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలతో చర్చించి తదితర వివరాలు కనుకుని, గల్ఫ్‌లో భారత రాయబారితో మాట్లాడి వారి సమస్యలను పరిష్కారించనున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటి వరకు ఏ రాష్ట్ర సీఎంలు కూడా గల్ఫ్‌లో పర్యటించిన దాఖలు లేవన్నారు. దీంతో ఎన్నారైల పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న బాధ్యతను తెలియజేస్తుందని సతీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. జనరల్ సెక్రెటరీలు లింబాద్రి పుప్పల మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం తాము ఒక అదృష్టంగా భావిస్తుమన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి భారీ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం కష్టపడిన ప్రతి టీఆర్ఎస్ నాయకులకు అభినందనలు తెలియజేశారు. అలాగే ఎన్నారై టిఆర్ఎస్ బహ్రెయిరెన్లకు సలహాలు సూచనలు అందిస్తు సెల్‌ను ప్రోత్సహిస్తున్న మాజీ ఎంపీ, ఎన్నారై టీఆర్ఎప్ సలహాదారు కల్వకుంట్ల కవితకి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి, టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలకు పార్టీ నాయకులందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో పాల్గొని విజయవంత చేసిన అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి పుప్పల, రాజేందర్ మగ్గిడి, సెక్రెటరీలు చెన్నమనేని రాజేందర్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. -
31న బహ్రెయిన్‌లో ఓపెన్ హౌస్
గల్ఫ్ డెస్క్: బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఈ నెల 31న ఓపెన్ హౌస్ నిర్వహించనున్నారు. సీఫ్‌లోనిఇండియన్ కాంప్లెక్స్‌లో ఉన్న రాయబార కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. బహ్రెయిన్‌లో ఉపాధి పొందుతున్న ప్రవాస భారతీయులు తమకు ఇమిగ్రేషన్‌కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకుని హాజరుకావాలని రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. -
బహ్రెయిన్‌కు మీ కోసం వచ్చా
మనామా: బహ్రెయిన్ అభివృద్ధికి ప్రవాస భారతీయులు చేసిన కృషిపై అభినందనలను వింటే తన మనసు సంతోషంతో పొంగిపోతుందని ప్రధాని మోదీ అన్నారు. బహ్రెయిన్‌లోని ప్రవాస భారతీయుల శ్రమను మోదీ ప్రశంసించారు. బహ్రెయిన్‌లో పనిచేస్తున్న భారతీయులను ఉద్దేశించి మోదీ బహ్రెయిన్ జాతీయ స్టేడియంలో ప్రసంగించారు. ‘నేను భారత ప్రధానిగానే ఇక్కడకు వచ్చాను. కానీ ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులను కలిసి వారితో మాట్లాడటమే’ అని అన్నారు. బహ్రెయిన్ మొత్తం జనాభా దాదాపు 12 లక్షలు కాగా, అక్కడ పనిచేస్తున్న ప్రవాస భారతీయుల సంఖ్యే 3.5 లక్షలు. వీరిలోనూ ఎక్కువ మంది కేరళీయులే. బహ్రెయిన్‌లో పర్యటిస్తున్న తొట్టతొలి భారత ప్రధాని మోదీయే. రూపే కార్డును ఉపయోగించి త్వరలోనే బహ్రెయిన్లోనూ చెల్లింపులు చేసే అవకాశం కల్పిస్తున్నామనీ, ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఇప్పటికే ఇరు దేశాలు సంతకాలు చేశాయని ఆయన తెలిపారు. మోదీకి కింగ్ హమద్ ఆర్డర్ అవార్డు.. బహ్రెయిన్‌తో భారత సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నందుకు మోదీకి ‘కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రినైజన్స్’ అవార్డును బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ప్రదానం చేశారు. మోదీ పర్యటన సందర్భంగా 250 మంది భారతీయ ఖైదీలను ఆదివారం విడుదల చేసి బహ్రెయిన్ మానవత్వాన్ని చాటుకుంది. బహ్రెయిన్‌లో 200 ఏళ్ల పురాతనమైన శ్రీనాథ్జీ శ్రీకృష్ణుడి ఆలయాన్ని పునరభివృద్ధి చేసేందుకు రూ. 30 కోట్ల విలువైన పనులను మోదీ ఆదివారం ప్రారంభించారు. ఖలీఫాతో మోదీ చర్చలు జరిపిన అనంతరం ఓ సంయుక్త ప్రకటనను రెండు దేశాలు విడుదల చేశాయి. ద్వైపాక్షిక, ప్రాంతీయ, బహుముఖ అంశాలపై వారు చర్చించారు. ఉగ్రవాదంపై నిఘా సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఫ్రాన్స్ చేరుకున్న మోదీ బియారిట్జ్: బహ్రెయిన్ పర్యటనను మోదీ ఆదివారం ముగించుకుని, జీ–7 సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం ఫ్రాన్స్‌లోని బియారిట్జ్‌కు చేరుకున్నారు. పర్యావరణం తదితర సమకాలీన అంశాలపై మోదీ ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. పలువురు అంతర్జాతీయ స్థాయి నేతలతో ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొంటారు. జీ–7 కూటమి దేశాల్లో భారత్ లేకపోయినప్పటికీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ వ్యక్తిగత ఆహ్వానం మేరకు మోదీ ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. జాన్సన్‌తో భేటీ అయిన మోదీ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో మోదీ ఆదివారం బియారిట్జ్‌లో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ఇరు ప్రధానులు చర్చలు జరిపారని భారత ప్రధానమంత్రి కార్యాలయం తెలిపిం ది. బ్రిటన్ ప్రధానిగా జాన్సన్ ఎన్నికయ్యాక ఆయనతో మోదీ తొలి భేటీ ఇది. -
ఆఖరి క్షణాల్లో ఆశలు ఆవిరి
షార్జా: మరో నాలుగు నిమిషాలు గడిస్తే... భారత ఫుట్‌బాల్ జట్టుకు ఆసియా కప్‌లో నాకౌట్ బెర్త్ ఖాయమయ్యేది. కానీ ఇంజ్యూరీ సమయంలో ‘డి’ ఏరియాలో ప్రణయ్ హల్డర్ చేసిన తప్పిదంతో భారత్ భారీ మూల్యమే చెల్లించుకుంది. బహ్రెయిన్ ప్లేయర్‌ను ప్రణయ్ మొరటుగా అడ్డుకోవడంతో రిఫరీ ప్రత్యర్థి జట్టుకు పెనాల్టీ కిక్‌ను ప్రకటించారు. జమాల్ రషీద్ భారత గోల్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బంతిని లక్ష్యానికి చేర్చాడు. దాంతో బహ్రెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంజ్యూరీ సమయంలోని మిగతా మూడు నిమిషాలు ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న బహ్రెయిన్ తుదకు 1–0తో భారత్‌పై విజయాన్ని ఖాయం చేసుకుంది. దాంతో గ్రూప్ ‘ఎ’ నుంచి ఆతిథ్య యూఏఈ (5 పాయింట్లు), థాయ్‌లాండ్ (4 పాయింట్లు), బహ్రెయిన్ (4 పాయింట్లు) జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించాయి. 3 పాయింట్లతో భారత్ చివరి స్థానంలో నిలిచి నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో 4–1తో థాయ్‌లాండ్‌ను ఓడించిన భారత్... రెండో మ్యాచ్‌లో 0–2తో యూఏఈ చేతిలో... మూడో మ్యాచ్‌లో 0–1తో బహ్రెయిన్ చేతిలో ఓడింది. గ్రూప్ ‘ఎ’లో సోమవారమే జరిగిన యూఏఈ–థాయ్‌లాండ్ మ్యాచ్ 1–1తో ‘డ్రా’ కావడం భారత్ నాకౌట్ ఆశలను దెబ్బ తీసింది. ఒకవేళ యూఏఈ గెలిచి ఉంటే భారత్‌కు నాకౌట్ అవకాశాలు మిగిలి ఉండేవి. ఓటమి తర్వాత భారత కోచ్ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు కాన్స్టంటైన్ ప్రకటించారు. -
భారత్Xబహ్రెయిన్
షార్జా: ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత్ నాకౌట్ బెర్తే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గ్రూప్ ‘ఎ’లో సోమవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో బహ్రెయిన్‌తో సునీల్ ఛెత్రి సేన తలపడుతుంది. కెప్టెన్‌గా ఛెత్రికిది 107వ మ్యాచ్. మాజీ సారథి బైచుంగ్ భూటియా (107) రికార్డును సమం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కనీసం ‘డ్రా’ చేసుకున్నా టీమిండియా నాకౌట్ దశకు చేరుతుంది. బహ్రెయిన్‌తో ఒకవేళ ఓడినా భారత్‌కు నాకౌట్ అవకాశాలున్నాయి. మొత్తం ఆరు గ్రూపుల్లో నాలుగు జట్లు అత్యుత్తమ మూడో స్థానం ద్వారా నాకౌట్ చేరొచ్చు. ఇప్పటివరకు బహ్రెయిన్‌తో ఏడు సార్లు ముఖాముఖీగా తలపడిన భారత్ కేవలం ఒక్కసారి (1979లో) మాత్రమే గెలిచింది. బహ్రెయిన్ ఐదింట గెలుపొందగా... మరో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. -
నగరంలో దారుణం.. ప్రేమను నిరాకరించిందనీ!
-
ప్రాణాలమీదికొచ్చిన ఫేస్బుక్ పరిచయం..!
సాక్షి, హైదదాబాద్ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించిందనీ యువతికి ఓ వ్యక్తి నిప్పుపెట్టాడు. తను కూడా నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో యువతితో పాటు ఆమె వదిన కూడా తీవ్ర గాయాలపాలైంది. 90 శాతం కాలిన గాయాలతో ఇద్దరూ ఉస్మానియా ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. యువకుడికి 40 శాతం గాయాలయ్యాయి. టప్పచబుత్రలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాలు.. బహ్రెయిన్‌కు చెందిన ఇబ్రహీం గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. టప్పచబుత్రకు చెందిన అజీనా బేగంతో అతనికి ఫేస్బుక్లో పరిచయమేర్పడింది. తనను ప్రేమించాలంటూ ఇబ్రహీం కొన్ని రోజులుగా ఆమెను వేధిస్తున్నాడు. అందుకు యువతి నిరాకరించడంతో ఇటీవల ఇండియాకి వచ్చి ఆమెను కలవడానికి ప్రయత్నించాడు. అయితే, ఇబ్రహీంకు ఇదివరకే పెళ్లై, ఇద్దరు పిల్లలు కూడా ఉండడంతో అజీనా అతనికి లొంగలేదు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు.. తన వెంటపడొద్దని వేడుకుంది. అయినా, కనికరించిన ఆ రాక్షసుడు శనివారం ఉదయం పెట్రోల్ క్యాన్‌తో యువతి ఇంటికి వెళ్లాడు. అజీనాపై పెట్రోల్ పోసి, తను కూడా నిప్పించుకున్నాడు. అజీనా వదిన ఘటనలో తీవ్రంగా గాయపడింది. ఊహించని పరిణామంతో ఆ కాలనీ వాసులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఘటనలో బాధితుల ఇళ్లు పూర్తిగా కాలిపోయింది. చికిత్స పొందుతూ షబానా బేగం మృతి ఇబ్రహీం దాడిలో 90శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరిన బాధితురాలు చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందింది. షబానా మృతి చెందటంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఉపాధి కోసం వెళ్లి..
పెదపట్నం (మామిడికుదురు): జీవనోపాధి కోసం బెహరైన్ వెళ్లిన పెదపట్నం అగ్రహారానికి చెందిన అవివాహిత బత్తుల వరలక్ష్మి(27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గత ఏడాది డిసెంబర్ 18న వరలక్ష్మి మృతి చెందినా కుటుంబ సభ్యులకు ఈ సమాచారం మంగళవారం అందడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. బెహరైన్‌లో పని చేస్తున్న విజయవాడకు చెందిన మహిళ ఫోన్ చేసి వరలక్ష్మి మరణ సమాచారాన్ని ఆమె కుటుంబం సభ్యులకు తెలిపింది. తమతో చివరి సారిగా డిసెంబర్ 8న ఫోన్లో మాట్లాడిందని తరువాత ఆమె నుంచి తమకు ఏవిధమైన సమాచారం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. రాజోలు మండలం చింతలపల్లికి చెందిన ఏజంట్ గుబ్బల లక్ష్మి అలియాస్ బండారు లక్ష్మి ఆమెను బెహరైన్ తీసుకు వెళ్లిందని చెబుతున్నారు. వరలక్ష్మి నుంచి ఏవిధమైన సమాచారం లేకపోవడంతో ఏజెంట్‌ను సంప్రదించగా తమకు తప్పుడు సమాచారం చెబుతూ వచ్చిందని వాపోతున్నారు. వరలక్ష్మి మరణించిందన్న సమాచారం తెలిసిన తర్వాత ఆమెను నిలదీయగా వరలక్ష్మి మృతి చెందిందని ధ్రువీకరించిందన్నారు. వరలక్ష్మి తండ్రి సత్యనారాయణమూర్తి, తల్లి పెద్దిలక్ష్మి ఇద్దరూ కూలీలే. వీరికి ముగ్గురు కుమార్తెలు. కుటుంబ పోషణ భారాన్ని తనపై వేసుకున్న పెద్ద కుమార్తె వరలక్ష్మి గత ఏడాది ఏప్రిల్ 3న బెహరైన్ వెళ్లింది. ఆమె చెల్లెళ్లు శ్రీవాణి, శ్రీవేణి. వీరిలో శ్రీవేణికి గత ఏడాది జూలై 6న వివాహం జరిపించారు. తండ్రి సత్యనారాయణ మూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వరలక్ష్మి చనిపోయిందన్న సమాచారం తెలిసిన వెంటనే నేషనల్ వర్క్స్ వెల్ఫేర్ ట్రస్టు సభ్యుడు నల్లి శంకర్ ద్వారా ఇండియన్ ఎంబసీని సంప్రదించామని వరలక్ష్మి చిన్నాన్న బత్తుల అశోక్‌కుమార్ తెలిపారు. వరలక్ష్మి మృతదేహాన్ని స్వగ్రామం పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇండియన్ ఎంబసీ ద్వారా దీనికి ప్రతిగా తమకు సమాచారం వచ్చిందని అశోక్‌కుమార్ చెప్పారు. బెహరైన్ పంపించేందుకు ఏజెంట్ రూ.రెండు లక్షలు తీసుకుందని, ఇంకా నగదు ఇవ్వాలని ఇబ్బంది పెడుతోందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఏజంట్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
నేను కూడా కొన్ని తప్పులు చేశా: రాహుల్
మనామా : గతంలో తమ పార్టీలో కొన్ని తప్పిదాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తాను కూడా కొన్ని తప్పులు చేసినట్లు చెప్పారు. తాను కూడా అందరిలాగే మనిషినని, అప్పుడప్పుడు తప్పులు చేయడం సహజమేనన్న ఆయన భవిష్యత్‌లో మాత్రం అలాంటివి జరగబోవని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కూడా తప్పులు జరగకుండా చూస్తానని, మున్మందు అందరు కొత్త కాంగ్రెస్ పార్టీని చూస్తారని, ఈ విషయంలో హామీ ఇస్తున్నానని చెప్పారు. గొప్ప దార్శనీకతతో ఉండే కాంగ్రెస్‌ను అంతా చూస్తారని చెప్పారు. 'కాంగ్రెస్ పార్టీ తన తప్పులను అంగీకరించిందని మీరు చెప్పారు. అలాగే నేను కూడా ఓ మనిషినే కాబట్టి తప్పు చేసినట్లు ఈ సందర్భంగా చెబుతున్నాను. మనందరం మనుషులం కాబట్టి తప్పులు చేస్తుంటాం. మీరు కొంత గ్యాంప్ ఉందని అన్నారు. ఆ గ్యాప్ ఉన్నది మీడియాలో మాత్రమే. మీడియాలో ఒకవైపు ప్రచారం మాత్రమే జరుగుతోంది. గుజరాత్లో బీజేపీ గతంలో ఎంత బలంగా ఉందో మీ అందరికీ తెలుసు. కానీ, ఈసారి ఆ పార్టీ విజయాన్ని అందుకునేందుకు ముప్పుతిప్పలుపడి అపజయం నుంచి బయటపడింది. కాంగ్రెస్ పార్టీ వారిని అక్కడ ప్రశ్నించింది. భారత్‌కు ఓ కొత్త దార్శనీకతను ఇవ్వాలని అనుకుంటున్నాం. ప్రజలకు ఓ కొత్త కాంగ్రెస్ పార్టీని ఇవ్వాలని భావిస్తున్నాను. కొత్త కాంగ్రెస్ పార్టీని మీకు మీరు ఇచ్చుకుంటే బీజేపీని ఓడించడం పెద్ద కష్టమేం కాదు. గతంలో మనం ఎన్నో తప్పిదాలు చేశాం. పార్టీని బలపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించినప్పుడు దేశ జీడీపీ 2శాతం పడిపోయినట్లు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో గొప్ప అనుభవం కలిగిన వారు, అదే స్థాయిలో యువత కూడా ఉంది. ఇది మంచి విషయం. మీరు ఊహించని విధంగా నాటకీయ ఫక్కీలో కాంగ్రెస్ పార్టీ మార్పులు కచ్చితంగా చూస్తారు' అని రాహుల్ గాంధీ బహ్రెయిన్‌లో ఎన్ఆర్ఐలతో భేటీ అయిన సందర్భంగా చెప్పారు. -
బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్‌తో రాహుల్ భేటీ
మనామ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి విదేశాల్లో పర్యటిస్తోన్న రాహుల్ గాంధీ సోమవారం బహ్రైన్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాతో భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై వారిద్దరూ చర్చించారు. ప్రభుత్వ అతిథిగా ఆ దేశంలో పర్యటిస్తోన్న రాహుల్.. రాజు హమాస్ బిన్ అల్ ఖలీఫాను కూడా కలవనున్నారు. క్రౌన్ ప్రిన్స్‌తో భేటీ అనంతరం రాహుల్ ట్వీట్ చేస్తూ.. ‘భారత్, బహ్రైన్లకు సంబంధించి పరస్పర ఆసక్తులపై ఇద్దరం చర్చించాం’ అని పేర్కొన్నారు. ’గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్’ (గోపియో) నిర్వహించిన ప్రవాసీ సమ్మేళన్‌లోనూ పాల్గొన్నారు. గల్ఫ్‌లో 10 లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలంగాణ పీసీసీ గల్ఫ్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు నంగి దేవేందర్ రెడ్డి రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ గల్ఫ్ వలసలపై నివేదికను అందజేశారు. ఎన్ఆర్ఐలతో రాహుల్ మాట్లాడుతూ.. ‘నేను కూడా తప్పులు చేశా.. అయితే నేనూ మానవ మాత్రుడినే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అనుభవం, యువతరం మధ్య మంచి సమన్వయం ఉంది. కొత్త కాంగ్రెస్ పార్టీని మీకు అందిస్తాం’ అని పేర్కొన్నారు. -
6 నుంచి బహ్రెయిన్‌లో ప్రవాసీ సమ్మేళన్
హైదరాబాద్: గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (గోపియో) రెండేళ్లకోసారి నిర్వహించే ప్రవాసీ సమ్మేళన్ సదస్సును ఈసారి బహ్రెయిన్‌లో నిర్వహిస్తోంది. జనవరి 6 నుంచి 8 వరకు బహ్రెయిన్‌లోని మనామ లో గల్ఫ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 40 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకి హాజరవనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర మంత్రి కేటీఆర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు ఈ సదస్సులో పాల్గొననున్నారు. 6న జరిగే ‘ఇండియన్ విమెన్ అచీవర్స్’ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రులు వీకే సింగ్, అల్ఫోన్స్ కన్నతానం పాల్గొననున్నారు. 7న జరిగే కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, మహారాష్ట్ర చీఫ్ విప్ రాజ్ పురోహిత్, మంత్రి కేటీఆర్ çహాజరవనున్నారు. 8న ముగింపు సమావేశంలో రాహుల్ గాంధీ, టెలికం నిపుణుడు శ్యామ్ పిట్రోడా పాల్గొననున్నారు. -
ఆసియా చాంప్ బహ్రెయిన్
హైదరాబాద్: ఆసియా క్లబ్ లీగ్ పురుషుల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో బహ్రెయిన్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వేదికగా జరిగిన ఈ అంతర్జాతీయ టోర్నీలో బహ్రెయిన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో బహ్రెయిన్ 21–16తో ఖతర్ క్లబ్‌పై విజయం సాధించింది. మొత్తం 9 దేశాలకు చెందిన 10 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో ఖతర్‌కే చెందిన అల్ అహిల్ క్లబ్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. యూఏఈకి చెందిన షార్జా జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ఫైనల్ అనంతరం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జె. సంతోష్ కుమార్, ఆసియా హ్యాండ్‌బాల్ సమాఖ్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహ్మద్ బాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి బహ్రెయిన్ జట్టుకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, క్రీడా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, భారత హ్యాండ్ బాల్ సమాఖ్య అధ్యక్షులు రామ సుబ్రమణి, కార్యదర్శి ఆనందేశ్వర్ పాల్గొన్నారు. -
బహ్రెయిన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
బహ్రెయిన్: తెలంగాణ జాగృతి బహ్రెయిన్ శాఖ ఆధ్వర్యంలో మహా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ ఆడపడుచుల అతిపెద్ద పండుగగా పేరొందిన బతుకమ్మను కొలుచుకొంటూ వేల సంఖ్యలో మహిళలు, హాజరయ్యారు. ఈసందర్భంగా మహిళలు, పిల్లలు బతుకమ్మ కోలాటం, ఆటపాటలతో అలరించారు. రకరకాల పువ్వులతో పేర్చుకొని తెచ్చిన బతుకమ్మలు అందరిని ఎంతో ఆకర్షించాయి. ఈ సందర్బంగా గల్ఫ్ దేశాల జాగృతి అధ్యక్షులు సిహెచ్. హరిప్రసాద్ మాట్లాడుతూ.. తాము తెలంగాణ సంస్కృతిని ఖండాంతరాల్లో చాటిచెప్పేందుకు ఈ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి కృషి చేస్తున్న తన కమిటీ సభ్యులందరినీ ఆయన అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం చాలా గర్వంగా ఉందని అందుకు సహకరించిన సభ్యులకు హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను బహ్రెయిన్‌లో విస్తరింప చేయడానికి తమవంతు కృషి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో గల్ఫ్ దేశాల జాగృతి అధ్యక్షులు సిహెచ్. హరిప్రసాద్, బహ్రెయిన్ జాగృతి అధ్యక్షులు బరుకుంట్ల బాబురావు, ఉపాధ్యక్షులు మామిడాల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శులు విజయ వర్ధన్, శ్రీనివాస్, సభ్యులు రవి, సుమన్, రాము, విజయసిందె, మహేష్, రాజేష్‌లు పాల్గొన్నారు. -
బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి మృతి
► మృతదేహం తరలింపుకు సహకరించిన ఎన్నారై సెల్ సాక్షి, కామారెడ్డి: విదేశాల్లో మరో తెలంగాణ వాసి దుర్మరణం పాలయ్యాడు. కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, పోతంగల్ కలాన్ గ్రామానికి చెందిన మార్కంటి బాబు ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లాడు. ఓప్రైవేటు కంపెనీలో పదేళ్ల నుండి కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 8న డ్యూటికి వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి ఇబ్బందులు ఎదురౌతుండటంతో బాబు స్నేహితులు సాయన్న, ఆంజనేయులు టీఆర్ఎస్ ఎన్నారై సెల్‌కు సమాచారం అందించారు. ఎన్నారై సెల్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టిలు కంపెనీ అధికారులతో మాట్లాడి బాబు మృతదేహాన్ని భారత్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి స్వగ్రామం పోతంగల్ కలాన్‌కు తీసుకెళ్లడానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జాగృతి రాష్ట ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, బాబు రావులు ఉచిత అంబులెన్సు ఏర్పాటు చేశారు. బాబు కుటుంబ సభ్యులకు ఎన్నారై టీఆరెస్ సెల్ బహ్రెయిన్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీలు, డాక్టర్ రవి, సెక్రెటరీలు రవిపటేల్, సుమన్, జాయింట్ సెక్రెటరీలు రాజేందర్, గంగాధర్, విజయ్, సంజీవ్, దేవన్న, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సుధాకర్, రాజేష్, రాజు, నర్సయ్య, సాయన్నలు సానుభూతి తెలిపారు. -
బహ్రయిన్లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
రాఖీ పౌర్ణమి వేడుకలు టీఆర్ఎస్ ఎన్నారై సెల్ బహ్రయిన్లో ఘనంగా నిర్వహించింది. మనామా కృష్ణ మందిర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన బహ్రయిన్ టీఆర్ఎస్ ఎన్నారై సెల్ అధ్యక్షుడు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్‌లు మాట్లాడుతూ.. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధమే రక్షాబంధన్ అని అన్నారు. రాఖీతో పాటు సోదరులకు హెల్మెట్లను గిఫ్ట్‌గా ఇచ్చి వారికి రక్షణగా నిలవాలనే 'సిస్టర్స్ 4 ఛేంజ్' గొప్ప కార్యక్రమమని అన్నారు. ఈ కార్యక్రమానికి నాంది పలికిన నిజామాబాద్ ఎంపీ కవిత ప్రయత్నానికి తాము మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ లింబాద్రి పుప్పల, సెక్రెటరీలు సుమన్ అన్నారం, రవి పటేల్ దెశెట్టి, జాయింట్ సెక్రెటరీలు గంగాధర్ గుమ్ముల, రాజేందర్ మగ్గిడి, విజయ్, కిరణ్, నర్సయ్య, దేవ్ యాదవ్‌లు తదితరులు పాల్గొన్నారు. -
స్వగ్రామం చేరిన మృతదేహం
లోకేశ్వరం(ముథోల్): కుటుంబాన్ని పోషించుకునేందుకు విదేశాలకు వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించుకు వస్తానని చెప్పి బహ్రెయిన్‌కు వెళ్లిన మండల కేంద్రానికి చెందిన ఈదన్న (35) గత నెల 26న గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామంలో పాలేరుగా పనిచేస్తున్న సాకలి ఈదన్న గతేడాది రూ.3 లక్షలు అప్పుచేసి బహ్రెయిన్‌కు వెళ్లాడు. గత నెల26న బహ్రెయిన్‌లో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు ఫోన్‌ద్వారా సమాచారం వచ్చింది. అప్పటినుంచి మృతుని కుటుంబసభ్యులు 11రోజులుగా మృతదేహంకోసం రోదిస్తూ ఎదురుచూస్తూ ఉన్నారు. కాగా బుధవారం శవపేటిక ఇంటికి చేరింది. ఈదన్నకు భార్య గంగామణి, ఇద్దరు కుమార్తెలు దీపిక, దివ్య ఉన్నారు. -
ఖతార్‌కు దిమ్మతిరిగే షాక్
గల్ఫ్ అరబ్ దేశాలతో పూర్తిగా సంబంధాలు కట్ రియాద్: ఖతార్‌కు సహచర అరబ్ దేశాలు దిమ్మతిరిగే షాక్‌నిచ్చాయి. ఖతార్ ఉగ్రవాదాన్ని, అతివాదాన్ని ప్రోత్సహిస్తున్నదంటూ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఈజిప్ట్, బ్రహెయిన్ ఆ దేశంతో సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకున్నాయి. దౌత్యసంబంధాలతోపాటు భూ, గగనతల, సముద్ర సంబంధాలను సైతం కట్ చేసుకుంటున్నట్టు తేల్చిచెప్పాయి. ఖతార్ ఉగ్రవాదాన్ని, అతివాదానికి మద్దతుగా నిలుస్తున్నదని సౌదీ ఆరోపిస్తుండగా.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నదని బ్రహెయిన్ మండిపడుతోంది. ఉగ్రవాదం నుంచి తమ రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ తెలిపింది. రానున్న 48 గంటల్లో దోహాలోని తమ దౌత్యకార్యాలయాన్ని ఉపసంహరించుకుంటామని, అదే గడువులోగా తమ దేశంలో ఉన్న ఖతార్ దౌత్యవేత్తలు దేశాన్ని విడిచి వెళ్లాలని హుకుం జారీచేసింది. తమ దేశంలోని ఖతార్ పౌరులు కూడా రెండువారాల్లోగా దేశాన్ని విడిచివెళ్లాలని ఆదేశించింది. -
బహ్రెయిన్ రాజు తలుచుకుంటే..
దుబాయ్: సుదీర్ఘ కాలంగా కొనసాగుతోన్న తమ పరిపాలనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తోన్న వారిపై బహ్రెయిన్ రాజు హమద్ బిన్ అల్ ఖలీఫా ఉక్కుపాదం మోపాడు. సాధారణ పౌరులను సైతం మిలటరీ కోర్టుల్లో విచారించేలా కొత్తగా రూపొందించిన కఠిన చట్టానికి రాజముద్ర వేశాడు. ఈ విషయాన్ని బహ్రెయిన్ అధికారిక వార్తా సంస్థ సోమవారం వెల్లడించింది. ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం సైతం పొందిన ఈ చట్టం ద్వారా ఆందోళనకారులను తీవ్రంగా దండించే వీలుంటుంది. చిన్నపాటి నిరసనలకు సైతం పెద్దపెద్ద శిక్షలు అమలయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం పనితీరును విమర్శింస్తూ, దేశంలో సంస్కరణలు తీసుకరావాలని డిమాండ్‌తో మూడేళ్లుగా జనం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. బెహ్రెయిన్‌లో ప్రధాన ప్రతిపక్షమైన అల్వెఫాక్ నేషనల్ ఇస్లామిక్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న నిరసన కార్యక్రమాల్లో సాధారణ ప్రజలు సైతం విశేషంగా భాగం పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకే ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చామని ప్రభు వర్గాలు పేర్కొన్నప్పటికీ, ఇలాంటి చట్టాలు ముమ్మాటికీ పౌరహక్కుల ఉల్లంఘన కిందికే వస్తాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. అటు ఐక్యరాజ్యసమితి కూడా బెహ్రెయిన్ పాలకుడి కఠిన విధానాలను తప్పుపడుతూనేఉంది. నిరసన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రతిపక్ష నాయకుడు షేక్ అలీ సల్మాన్‌కు బహ్రెయిన్ కోర్టు గత ఏడాది తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. కొత్తగా అమలయ్యే చట్టంలో శిక్షలు ఇంకా తీవ్రంగా ఉండనున్నాయి. -
హమ్మయ్య.. భారత చిన్నారి దొరికింది
మనామా: బహ్రెయిన్ లో భారత బాలిక కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. ఐదేళ్ల సారా ను కిడ్నాపర్ల చెర నుంచి పోలీసులు విడిపించడంతో 24 గంటల ఉత్కంఠకు తెరపడింది. మంగళవారం రాత్రి హూరా ప్రాంతంలో చిన్నారిని కిడ్నాప్ చేశారు. సారాను కారులో ఉంచి తల్లి మంచినీళ్ల బాటిల్ కొనుక్కురావడానికి వెళ్లగా దుండగులు కారుతో పాటు చిన్నారిని ఎత్తుకుపోయారు. సారా తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు కిడ్నాపర్లను అరెస్ట్ చేసి పాపను విడిపించారు. నిందితులు బహ్రెయిన్ వ్యక్తి(38), ఆసియా మహిళ(37)గా వెల్లడించారు. వారి పేర్లు చెప్పలేదు. ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు ప్రారంభిచామని, 25 పహారా వాహనాలను రంగంలోకి దింపి కిడ్నాపర్లను పట్టుకున్నామని కాపిటల్ గవర్నేట్ పోలీసు జనరల్ డైరెక్టర్ కలోనియల్ ఖలీద్ ఆల్ థవాది తెలిపారు. హూరా ప్రాంతంలో నిందితురాలి ఇంట్లో పాపను గుర్తించామని చెప్పారు. సారాకు ఎటువంటి ముప్పు తలపెట్టలేదని, ఆమె ఆరోగ్యంగా ఉందని ఆమె మేనమామ అనిశ్ చార్లెస్ తెలిపాడు. హూరా పోలీస్ స్టేషన్ లో బుధవారం రాత్రి పాపను తమకు అప్పగించారని చెప్పారు. తల్లిని చూడగానే సారా పరిగెత్తుకుని వెళ్లి ఆమెను అమాంతంగా కౌగిలించుకుంది. కూతుర్ని తల్లి గుండెలకు హత్తుకున్న దృశ్యాలు అక్కడున్న వారిని కదిలించాయి. సారా కిడ్నాప్ వెనుక ఆమె తండ్రి హస్తం ఉందని అనీశ్ చార్లెస్ అనుమానం వ్యక్తం చేశాడు. మూడేళ్ల క్రితం భార్య నుంచి విడాకులు తీసుకున్న సారా తండ్రి ప్రస్తుతం ఇండియాలో ఉన్నాడు. వీరిద్దరికీ సారా ఒక్కతే సంతానం. కాగా, సారా కిడ్నాప్ ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో స్పందించారు. చిన్నారిని సురక్షితంగా విడిపించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
వీసా ఫీజులో 80 శాతం కోత
భారత్ నుంచే వచ్చే భారీ పర్యాటక ఆదాయంపై కన్నేసిన మరో గల్ఫ్ దేశం బహ్రెయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ ఆదాయాన్ని కొల్లగొట్టే వ్యూహంలో భాగంగా బహ్రెయిన్ సందర్శించాలనుకునే పర్యాటకుల వీసా ఫీజులో భారీ కోత విధించింది. 80 శాతం వీసా ఫీజును తగ్గించినట్టు బహ్రెయిన్ టూరిజం బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెరాడ్ బచ్చర్ ప్రకటించారు. ప్రస్తుతం 25 దినార్లుగా ఉన్న ఈ ఫీజును కేవలం 5 దినార్లకు పరిమితం చేసింది. ఈ తాజా నిర్ణయం ప్రకారం ఇప్పటివరకూ రూ. 4,446 లుగా ఉండగా, ప్రస్తుతం అయిదు దినార్లు అంటే కేవలం 889 రూ. మాత్రమే. 25 దినార్లుగా ఉన్న ఈ ఫీజును కేవలం 5 దినార్లకు పరిమితం చేసింది. ఈ తాజా నిర్ణయం ప్రకారం ఇప్పటివరకూ రూ. 4,446 లుగా ఉన్న ఈ ఫీజు, ప్రస్తుతం అయిదు దినార్లు అంటే కేవలం రూ. 889 మాత్రమే. అలాగే ఇండియానుంచి తక్కువ సమయంలోతమ దేశానికి చేరేలా చర్యలు చేపడుతున్నామని జెరాడ్ చెప్పారు. ముంబై ఢిల్లీ మధ్య ప్రయాణంకంటే తక్కువగా, సమానంగా ముంబై, బహ్రెయిన్ ప్రయాణం ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ప్రస్తుతం ఒక వారంలో 75 విమాన సర్వీసులున్నాయని.. భారతదేశం మధ్య అద్భుతమైన వాయుమార్గ నిర్మాణ లక్ష్యంతో ఒక బిలియన్ డాలర్ల వ్యయంతో విమానాశ్రయ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టామని అది పూర్తయితే ప్రస్తుతం తొమ్మిది మిలియన్లుగా ఉన్న పర్యాటకుల సంఖ్య 14 మిలియన్లకు చేరుతుందని అంచనా వేశారు. బిలియన్ల డాలర్ల ఆదాయంపై గురిపెట్టిన బహ్రెయిన్ భారతీయ పర్యాటకును ఆకర్షించేందుకు వీలుగా భారీ ప్రణాళికలే రచిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఇండియాలో మొట్టమొదటి బహ్రెయిన్ పర్యాటక కార్యాలయాన్ని కూడా త్వరలోనే ప్రారంభించనుంది. దీన్ని బట్టే దేశం నుంచి బహ్రెయిన్ ఆశిస్తున్న పర్యాటక రంగం డిమాండ్ ను మనం అంచనా వేయవచ్చు. 2015 ఆర్థిక సంవత్సరంలో 69కోట్లను వెచ్చించగా, అదే ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 4 వేల కోట్లు ఖర్చుపెట్టినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు చెబుతున్నాయి. కాగా గల్ఫ్ దేశం అనగానే విలాసవంతమైన అరబ్ షేకులు..ఆయిల్ నిక్షేపాలు.. ఉపాధికోసం పరుగులు పెట్టే కార్మికులు.. వేలమంది పర్యాటకులు మనకు గుర్తుకు వస్తారు. గల్ఫ్ దేశాలకు కువైట్, బహ్రయిన్, ఇరాక్, ఒమన్,ఖతర్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు ఇండియానుంచి వచ్చే పర్యాటక ఆదాయంకూడా భారీగానే ఉంది. దీంట్లో అగ్ర భాగం దుబాయ్ దే. ఆ తరువాత, ఓమన్, అబుదాభి నిలుస్తాయి. -
అక్కడ నోరు విప్పితే జైలే
మనామా: పర్షియన్ గల్ఫ్ దేశమైన బహ్రెయిన్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. ప్రభుత్వం పనితీరును విమర్శించినందుకు, దేశంలో సంస్కరణలు తీసుకరావాలని కోరినందుకు ప్రతిపక్ష నాయకుడు షేక్ అలీ సల్మాన్‌కు బహ్రెయిన్ కోర్టు ఆదివారం నాడు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రధాన ప్రతిపక్షమైన అల్వెఫాక్ నేషనల్ ఇస్లామిక్ సొసైటీ జనరల్ సెక్రటరీ షేక్ అలీ సల్మాన్‌ను వాస్తవానికి గతేడాది జూన్ 15వ తేదీనే అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. ఎలాంటి విచారణ లేకుండానే ఆయనకు నాలుగే ళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని అప్పీళ్ల కోర్టుల్లో అప్పీల్ చేసిన పాపానికి ఆదివారం నాడు కోర్టు అంతకుముందు విధించిన నాలుగేళ్ల జైలు శిక్షను తొమ్మిదేళ్లకు పెంచుతూ తీర్పు చెప్పింది. 2012, 2014లలో దేశ హోంశాఖను విమర్శించినందుకు, చట్టాన్ని ఉల్లంఘించాల్సిందిగా ప్రజలను ప్రోత్సహించారనే ఆరోపణలపైనే కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పిన ఎంతో మంది ప్రతిపక్ష నాయకులను బహ్రెయిన్ రాజు హమెద్ బిన్ ఇసా అల్ ఖలీఫా జైల్లో పెట్టించారు. షియాలు ఎక్కువగావున్న ఈ దేశంలో రాజు సున్నీ తెగకు చెందిన వ్యక్తి. సైనిక, కోర్టు పదవుల్లో రాజు కుటుంబీకులే ఉన్నారు. -
సమీర్ వర్మకు టైటిల్
న్యూఢిల్లీ: బహ్రెయిన్ చాలెంజ్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ సమీర్ వర్మ విజేతగా నిలిచాడు. బహ్రెయిన్‌లోని ఇసా టౌన్లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈ మధ్యప్రదేశ్ కుర్రాడు 21-14, 21-10తో నాలుగో సీడ్, ప్రపంచ 47వ ర్యాంకర్ జీ లియాంగ్ డెరెక్ వోంగ్ (సింగపూర్)పై సంచలన విజయం సాధించాడు. వారం రోజుల వ్యవధిలో సమీర్ వర్మ రెండో సింగిల్స్ టైటిల్ సాధించడం విశేషం. గతవారం ఇదే వేదికపై జరిగిన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సిరీస్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన సమీర్ అదే జోరును చాలెంజ్ టోర్నీలోనూ కొనసాగించాడు. మరోవైపు భారత్‌కే చెందిన శైలి రాణే వరుసగా రెండో టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో శైలి రాణే 22-24, 10-21తో నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. -
బహ్రెయిన్‌లో క్షమాభిక్ష అమలు
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారికి ఊరట సాక్షి, మోర్తాడ్ (నిజామాబాద్): బహ్రెయిన్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష అమలు చేస్తోంది. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు క్షమాభిక్షకు గడువు విధించింది. బహ్రెయిన్‌కు విజిట్ లేదా కంపెనీ వీసాలపై వెళ్లి గడువు ముగిసినా అక్కడే ఉన్న కార్మికులకు అక్కడి ప్రభుత్వం ఇచ్చిన క్షమా భిక్షతో ఊరట లభించనుంది. కంపెనీ వీసాలపై వెళ్లి పని నచ్చకపోవడంతో ఎంతో మంది కార్మికులు ఇతర కంపెనీల్లో చట్ట విరుద్ధంగా పని చేస్తున్నారు. బహ్రెయిన్‌లో అలాంటి తెలంగాణ కార్మికులు ఆరు వేల మందికి పైగా ఉంటారని అంచనా. ప్రభుత్వం అమలు చేయనున్న క్షమాభిక్షతో కార్మికులకు తమ చేతిలో పాస్‌పోర్టు లేకపోతే లేబర్ మానిటరింగ్ రిక్రూట్మెంట్ అథారిటీ(ఎల్ఎంఆర్ఏ)కి దరఖాస్తు చేసుకోవాలి. వారు కొత్త పాస్‌పోర్టును మన దేశ విదేశాంగ శాఖ ద్వారా జారీ చేయించి కంపెనీ ల్లో పని కల్పిస్తారు. ఒక వేళ పని చేయడం ఇష్టం లేకపోతే, జరిమానా చెల్లించాల్సిన అవసరం లేకుండా జైలుకు పోకుండా ఇంటికి చేరుకోవచ్చు. చేతిలో పాస్‌పోర్టు ఉం డి వీసా గడువు ముగిసినవారికి ఎల్ఎంఆర్ఏ కొత్త వీసాలను జారీ చేయిస్తుంది. ఆరు నెలల కాలంలో వారు పట్టుబడినా జైలు శిక్ష ఉండదు. బహ్రెయిన్ ప్రభుత్వానికి జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒక వేళ ఆరు నెలల కాలం దాటితే మాత్రం అక్కడి ప్రభుత్వం కఠిన శిక్షలను అమలు చేయనుంది. క్షమాభిక్షతో చట్ట విరుద్ధంగా ఉంటున్న కార్మికులు క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం దొరికిందని అక్క డి స్టార్ హోటల్లో పని చేస్తున్న తిమ్మాపూర్‌కు చెందిన రామ్మోహన్ తెలిపారు. -
కార్మికులను ఆదుకోని లేబర్ అథారిటీ
మోర్తాడ్: ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన తెలుగు కార్మికులను అక్కడి కంపెనీలు మోసం చేయడంతో లేబర్ మానిటరింగ్ రిక్రూట్మెంట్ అథారిటీ (ఎల్ఎంఆర్ఏ)ని ఆశ్రయించారు. అయితే ఏడాది సీనియార్టీ ఉన్న కార్మికులకు మాత్రమే తాము ఇతర కంపెనీల్లో పని చూపగలమని, తక్కువ సీనియార్టీ ఉన్న కార్మికుల విషయంలో ఏమీ చేయలేమని ఎల్ఎంఆర్ఏ ప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో కార్మికులు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. ఇప్పటికే లక్షలు వెచ్చించి బహ్రెయిన్ వచ్చిన తాము మళ్లీ కోర్టులో కేసు వేయాలంటే మరింత అప్పు చేయాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, కడప, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన దాదాపు 126 మంది కార్మికులు 4 నెలల క్రితం బహ్రెయిన్ వెళ్లారు. అక్కడి అట్లాస్, టీఎంఎస్ కన్స్ట్రక్షన్ కంపెనీల్లో పని చేస్తున్నారు. అయితే బండెడు చాకిరీ చేయించుకున్న కంపెనీ యాజమాన్యం వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేసింది. బహ్రెయిన్‌లో ఒక కంపెనీలో పని చేస్తూ మరో కంపెనీకి మారాలంటే ఎల్‌ఎంఆర్‌ఏను ఆశ్రయిస్తేనే మార్గం దొరుకుతుంది. కాగా బహ్రెయిన్ కార్మిక చట్టాల ప్రకారం ఏడాది సర్వీసు ఉన్న కార్మికులకే మరో కంపెనీలో పని చూపించడానికి ఎల్ఎంఆర్ఏ చర్యలు తీసుకుంటుంది. ఏడాది కంటే తక్కువ సర్వీసు ఉన్న కార్మికులు కోర్టును ఆశ్రయించాల్సిందే. ఒకవేళ కోర్టుకు వెళ్లకుండా సొంతంగా పనిచూసుకుంటే చట్టరీత్యా నేరం అవుతుంది. అలా చేస్తే జైలు పాలు కావాల్సిందే. కాగా, అట్లాస్, టీఎంఎస్ కంపెనీల్లో పని చేస్తున్న కార్మికులను ఎల్‌ఆర్‌ఎంఏ ఆదరించకపోవడం, కోర్టును ఆశ్రయించాలంటే సొంతంగా లాయర్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి రావడంతో వారిపై ఆర్థిక భారం పడుతోంది. ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. -
బహ్రెయిన్‌లో తెలుగు కార్మికుల కష్టాలు
మోర్తాడ్: పొట్ట చేత పట్టుకుని దేశం కాని దేశానికి వెళ్లిన తెలుగు రాష్ట్రాల వారిని అక్క డి కంపెనీ యాజమాన్యాలు వంచిస్తున్నాయి. ఏజెంట్ల మోసానికి కంపెనీ యాజమాన్యం వంచన కూడా తోడు కావడంతో తెలుగు కార్మికులకుది దిక్కుతోచని పరిస్థితి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాలల్లోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, కడప, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన సుమారు 126 మంది కార్మికులు నాలుగు నెలల క్రితం ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లారు. అక్కడి కన్స్ట్రక్షన్ కంపెనీలైన అట్లాస్, టీఎంఎస్లలో పనికి కుదిరారు. హైదరాబాద్‌కు చెందిన రావు అలియాస్ రెడ్డి, తమిళనాడుకు చెందిన ఖాదర్‌సాహెబ్, నిజామాబాద్‌కు చెందిన శేఖర్ అనే ఏజెంట్ల ద్వారా వీరు బహ్రెయిన్‌కు వెళ్లారు. ఒక్కో కార్మికుడు వీసా కోసం రూ. 65 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు చెల్లించారు. రోజు ఎనిమిది గంటల పాటు డ్యూటీ, ఇండియన్ కరెన్సీలో నెలకు రూ.20 వేల వరకు వేతనం చెల్లించడానికి కంపెనీ యాజమాన్యం కార్మికులతో ఒప్పందం కుదుర్చుకుంది.కార్మికులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలను కల్పిస్తున్నట్లు ఒప్పందంలో పేర్కొన్నారు. బహ్రె యిన్ వెళ్లిన తరువాత వసతి, భోజనం కల్పించినా, చేసిన పనికి యాజమాన్యం మాత్రం వేతనం చెల్లించడం లేదని జిల్లాకు చెందిన పలువురు కార్మికులు ‘సాక్షి’కి ఫోన్లో సమాచారం అందించారు. కార్మికులకు మూడు నెలల వేతనాన్ని యాజమాన్యాలు చెల్లించాల్సి ఉంది. భారత రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని కార్మికులు తెలిపారు. ఇటీవల బహ్రెయిన్‌లో పర్యటించిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు తాము ఫిర్యాదు చేసినట్లు కార్మికులు తెలిపారు. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కార్మికులు వివరించారు. -
దశాబ్దం తరువాత తండ్రి చెంతకు..
మనామా: ఓ దశాబ్దం తరువాత బహ్రెయిన్ లో ఉంటున్న ఓ భారతీయ యువకుడు తండ్రి వద్దకు చేరుకోబోతున్నాడు. బాల్యంలోనే తల్లి దండ్రులకు దూరమైన రవి ప్రసాద్ (18) అనే యువకుడు తాజాగా తిరిగి తండ్రి ఆత్మీయ స్వర్శకు దగ్గర కాబోతున్నాడు. వివరాల్లోకి వెళితే.. గత కొన్నేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ కు చెందిన థానే ప్రసాద్ శ్రీలంలకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకుని బహ్రెయిన్ లో స్థిరపడ్డాడు. వారికి రవి అనే కొడుకు జన్మించాడు. అయితే ఆ యువకునికి సరిగ్గా రెండేళ్లప్పుడు కుటుంబంలో చోటు చేసుకున్న విభేదాల కారణంగా అతని తల్లి దండ్రులు వేరుపడ్డారు. అనంతరం 2006లో ధానే ప్రసాద్ బహ్రెయిన్ నుంచి తిరిగి భారత్ కు వచ్చేశాడు. కాగా, ఆ తదుపరి తల్లికి కూడా దూరమైన ఆ యువకుడు వలస కార్మికుల రక్షణ సొసైటీలో ఉంటూ లాండ్రీ కార్మికునిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తండ్రి.. కుమారుని కోసం తిరిగి వేట ప్రారంభించాడు. అందులో భాగంగా తండ్రి మళ్లీ బహ్రెయిన్ కు చేరుకున్నాడు. తన కుమారుని గుర్తింపుకు సంబంధించిన తగిన ఆధారాలను సంపాదించాడు. ప్రస్తుతం లాండ్రీ కార్మికునిగా పని చేస్తూనే కొంతమంది సాయంతో బహ్రెయిన్ లో తన చదువు కుంటున్న ఆ యువకునికి భారత అంబాసీ నుంచి క్లియరెన్స్ వచ్చింది. త్వరలోనే అతను సంతోషంగా తండ్రి స్వస్థలం భారత్ కు వెళుతున్నాడని సోషల్ వర్కర్ మెహ్రూ వేశువాలా తెలిపాడు. -
హైదరాబాద్-బహ్రెయిన్ మధ్య నేరుగా ఫ్లైట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ గల్ఫ్ ఎయిర్.. హైదరాబాద్-బహ్రెయిన్ మధ్య డెరైక్ట్ సర్వీసులను తిరిగి ప్రారంభించింది. స్థానిక కాలమానం ప్రకారం హైదరాబాద్ నుంచి బహ్రెయిన్‌కు విమానం సోమ, శుక్ర, ఆదివారాల్లో ఉదయం 10:25లకు, మంగళ, శనివారాల్లో తెల్లవారుజామున 2:40లకు బయల్దేరుతుంది. బహ్రెయిన్ నుంచి హైదరాబాద్‌కు విమానం సోమ, శుక్ర, ఆదివారాల్లో తెల్లవారుజామున 2:55లకు, మంగళ, శనివారాల్లో మధ్యాహ్నం 2.10లకు బయల్దేరుతుంది. రెండు నగరాల మధ్య ఎయిర్‌బస్ ఏ321 విమానాలు నడవనున్నాయి. ఫాల్కన్ గోల్డ్ క్లాస్ ఫుల్ ఫ్లాట్ బెడ్ సీట్లు 8, ఎకానమీ క్లాస్‌లో 161 సీట్లు ఉన్నాయి. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, కొచ్చి, తిరువనంతపురం నుంచి గల్ఫ్ ఎయిర్ సర్వీసులు అందిస్తోంది. -
ఫేస్బుక్ అమ్మ... ఎందుకమ్మా?
ఫేస్బుక్ మాయలో పడి యువతీ యువకులు మోసపోతున్న ఉదంతాలు మన తెలుసు. అయితే ఓ యువకుడు ఫేస్బుక్ లో కొత్త అమ్మను వెతుక్కుని కన్న తల్లిని వదిలేసిన విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో జరిగింది. బరేలీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న విజయ్ మౌర్య అనే 20 ఏళ్ల విద్యార్థి- ఫేస్బుక్ మమ్మీ కోసం కన్నవారిని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. పొద్దస్తమాను ఫేస్బుక్ కు అతుక్కుపోతే అందరి యువకుల్లాగే తన కొడుకు కూడా అన్ని విషయాలు తమ స్నేహితులతో షేర్ చేసుకుంటున్నాడని విజయ్ మౌర్య అనుకున్నారు. అదేపనిగా 'ముఖ పుస్తకం'కు అంటుకుపోవడాన్ని విజయ్ తండ్రి బ్రిజేష్ అప్పట్లో గమనించినా పెద్దగా పట్టించుకోలేదు. గత నెల విజయ్ కనిపించకుండా పోయాడు. అతడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది. విజయ్- 'ఫేస్బుక్ మమ్మీ' సుకన్య(పేరు మార్చారు)ని కలుసుకోవడానికి వెళ్లాడని తెలుసుకుని వారంతా అవాక్కయ్యారు. కేరళకు చెందిన ఆమెనే విజయ్ తన తల్లిగా చెప్పుపోవడంతో కన్నవాళ్లు కన్నీరుమున్నీరయ్యారు. త్రివేండ్రంకు చెందిన సుకన్య బహ్రెయిన్ లో నర్సుగా పనిచేస్తుంది. విజయ్ బ్యాంకు ఖాతాలోకి ఆమె రూ. 22 వేలు బదిలీ కూడా చేసింది. అంతేకాదు 'తన ఫేస్బుక్ కొడుకు' ఈనెల 12న ఏకంగా బరేలీకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పి సుకన్య, విజయ్ ఇక్కడి నుంచి వెళ్లిపోకుండా ఆపగలిగారు. ఇక వివాదంపై నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. విజయ్ కుటుంబానికి బీజేపీ నాయకులు బాసటగా నిలవడం గమనార్హం. దీన్ని 'ప్రణాళికబద్దమైన కుట్ర'గా వర్ణించారు. హిందూ యువకుడిని క్రిస్టియన్ గా మార్చేందుకు ఈ కుట్ర చేశారని కమలనాథులు ఆరోపించారు. అయితే అసలు తల్లిదండ్రులను వదిలేసి ఫేస్బుక్ మమ్మీ కోసం పాకులాడుతున్న విజయ్ గురించి వింతగా చెప్పుకుంటున్నారు. ఈ కథ మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. -
బహ్రెయిన్ గ్రాండ్‌ప్రికి సచిన్
దుబాయ్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ కెరీర్ ఆసాంతం బిజీ బిజీ... ఊపిరి సలపని షెడ్యూలుతో ఇంటా బయట 24 ఏళ్లు ఆటను ఆస్వాదించిన ఈ ‘భారతరత్న’ం... ఇప్పుడు రిటైర్మెంట్తో బాధ్యతల నుంచి బంధవిముక్తుడవడంతో ఎంచక్కా కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. భార్యాపిల్లలతో కలిసి అడవుల్ని, ఆలయాల్ని చుట్టివస్తున్నాడు. మొన్న గుజరాత్‌లోని గిర్ అడవుల్ని, నిన్నేమో సుప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన సచిన్ తనకెంతో ఇష్టమైన ఫార్ములావన్‌ను కూడా ప్రత్యక్షంగా చూసేందుకు ఫ్యామిలీ, బ్యాగేజ్‌తో సిద్ధమయ్యాడు. బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిని చూసేందుకు మనామాకు వెళ్లనున్నాడు. వచ్చేనెల 4 నుంచి 6వ తేదీ వరకు జరిగే ప్రాక్టీస్, క్వాలిఫయింగ్, ప్రధాన రేసుల్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు రావాలని ఆ దేశ రాజు ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించిన సచిన్ త్వరలోనే తమ దేశానికి వస్తున్నాడని బహ్రెయిన్‌కు చెందిన వ్యాపారవేత్త, ‘మాస్టర్’ మిత్రుడైన మహ్మద్ దాదాభాయ్ వెల్లడించారు. అతని రాక తమ గ్రాండ్ప్రికే ప్రత్యేక ఆకర్షణ కానుందని ఆయన తెలిపార. -
శ్రీశ్రీ చెప్పిన జోక్...
శ్రీశ్రీ చెప్పిన జోక్... ప్రముఖుల హాస్యం శ్రీశ్రీ అనగానే పోటెత్తిన ఆవేశం గుర్తుకు వస్తుంది. పిడికిలి బిగిసిన చప్పుడు వినిపిస్తుంది. కవిత్వం త్రినేత్రమైన సందర్భాలు గుర్తుకు వస్తాయి. కవిత్వంలో సరే, వ్యక్తిగతంగా శ్రీశ్రీ ఎలా ఉండేవారు? రగులుతున్న అగ్నిపర్వతంలా ఉండేవారు! అని అనిపిస్తుంది గానీ ఆయనలో చల్లని చమత్కారం ఎక్కువ. సందర్భానుసారంగా హాస్యాన్ని పుట్టించడంలో శ్రీశ్రీ దిట్ట. ఒక ప్రసంగంలో శ్రీశ్రీ చెప్పిన జోక్... ‘‘ఇక్కడ చాలామంది డాక్టర్లు ఉన్నారనుకుంటాను. డాక్టర్ల మీద ఒక జోక్ ఉంది. ఇది నా జోక్ కూడా కాదు. కృష్ణశాస్త్రిగారిది. జోక్స్ అంటే నిజానికి హర్ట్ కాకూడదు. న్యాయంగా తీసుకోవాల్సిన విధంగా తీసుకోవాలి. కాబట్టి..ఐ వుడ్ జస్ట్ లైక్ టు రీ టెల్ ఏ జోక్. ఆయన ఏమన్నారంటే - ‘ఏవండీ ఈమధ్య మీరు వైద్యం మానేసి కవిత్వం మొదలుపెట్టారట నిజమేనా?’ అని ఒక డాక్టర్ని అడిగితే- ‘అవునండీ నిజమే. వైద్యం మానేశాను. కవిత్వం రాస్తున్నాను’ అన్నాడట. ఆయన ‘సరే ఏదైతేనేంలెండి మనుషులను చంపడానికి’ అన్నాడట!’’ మంత్రతంత్రాలపై నియంత్రణ కొత్త చట్టం మంత్రాలకు చింతకాయలు రాలతాయనే ఆశావహులు ప్రతి దేశంలోనూ ఉంటారు. బహ్రెయిన్‌లో మాత్రం వారి సంఖ్య ఎక్కువ. మంత్రాలకు చింతకాయలేమి ఖర్మ... ఆకాశంలో చుక్కలు కూడా రాలతాయనేది వారి గట్టి నమ్మకం. ఆ నమ్మకమే ప్రభుత్వానికి లేనిపోని తలనొప్పులు తెచ్చి పెడుతోంది. రాజ్యంలో హత్యలు, ఆత్మహత్యలు పెరిగి శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. ఒకావిడ మాంత్రికుడి దగ్గరికి వెళ్లి ‘‘నేనంటే నా భర్త గడగడ వణికి పోవాలి. నా మాటకు ఎదురు చెప్పకూడదు’’ అంది. ‘‘భర్తకు పెట్టే భోజనంలో నీ రక్తాన్ని కలుపు’’ అని టెర్రిఫిక్ సలహా ఇచ్చాడు మాంత్రికుడు. ఆమె అలాగే చేసింది. ఆ తరువాత ఏమైంది? ఆమె పిచ్చాసుపత్రిలో ఉంది. మాంత్రికుడు జైల్లో ఉన్నాడు! ‘‘మూఢనమ్మకాల గురించి అవగాహన కలిగించంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది’’ అని నిప్పులు చెరుగుతున్నాడు పార్లమెంట్ సభ్యుడు బుకైస్. నష్టనివారణ చర్యల్లో భాగంగా చేతబడులపై ఉక్కుపాదం మోపడానికి ఇటీవల కఠినచట్టం అమల్లోకి తెచ్చింది బహ్రెయిన్ ప్రభుత్వం. ఫ్రైడ్ ఫుడ్‌ను ముట్టను ఫుడ్ ఫిలాసఫీ తిండి కలిగితే కండ కలదోయ్... అంటారు. మరి కండలవీరుడు హృతిక్‌రోషన్‌కు ‘తిండి’ గురించి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? ఆయన ‘ఫుడ్ ఫిలాసఫీ’ ఆయన మాటల్లోనే... ఏం తింటున్నాను... అనేదాని మీద స్పష్టమైన అవగాహన పెంచుకుంటాను. వాటిలో ఉండే పోషకాలను గురించి తెలుసుకుంటాను. ఎప్పుడు పడితే అప్పుడు తినడం కాకుండా ‘టైమ్ టేబుల్’ను అనుసరిస్తాను. {ఫైడ్ ఫుడ్‌ను ముట్టను. ఎన్నో దేశాల్లో ఎన్నోరకాల వంటకాలు తిన్నా... భారతీయ వంటకాలు అంటేనే ఇష్టం. ఇండియన్ స్టయిల్లో తయారు చేసిన దాల్, చావల్, మటన్, చికెన్, కూరగాయలతో చేసిన వంటకాలు అంటే ఇష్టం. ఇండియన్ కాకుండా నేను ఇష్టపడే ఇతర దేశాల వంటకాలు... ఇటాలియన్, మెక్సికన్, చైనీస్. రెస్టారెంట్లకు ఎక్కువగా వెళ్లను. మనకు బాగా ఇష్టమైన వంటకాల్లో ఆరోగ్యానికి సరిపడనివి ఉండవచ్చు. వాటిని వదులు కోవడం అంటే త్యాగం చేసినట్లు కాదు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లు. బుజ బుజ నెల్లూరు ఊరు-పేరు పూర్వం ఉదయగిరిని రాజధానిగా చేసుకుని నెల్లూరు జిల్లాను ఆర్కాట్ నవాబు పరిపాలించేవారు. ఆ సమయంలో నెల్లూరుకు చెందిన ఓ పండితుడు దివాణానికి చేరుకుని తన పాండిత్యంతో నవాబును మెప్పిస్తాడు. ‘ఏం వరం కావాలో కోరుకో’ అనడంతో ఆ పండితుడు నెల్లూరును రాసివ్వమని కోరుకుంటాడు. సరే అంటాడు నవాబు. ఆ సమయంలో మహామంత్రి దేశపర్యటన నిమిత్తం వెళ్లి ఉంటారు. తిరిగి వచ్చిన మహామంత్రికి విషయం తెలుస్తుంది. అత్యంత ఆదాయం వచ్చే నెల్లూరును పండితుడికి రాసిస్తే ఖజానాకు గండిపడుతుందని చెప్తాడు. మంత్రి ఆలోచనతో నెల్లూరుకు కూత వేటు దూరంలో ఓ పది గుడిసెలు నిర్మించి ఆ ప్రాంతానికి ‘బుజ్జి నెల్లూరు’ అని పేరు పెట్టి పండితుడికి రాసిస్తాడు. కాలక్రమేణా బుజ్జినెల్లూరు బుజబుజనెల్లూరుగా మారిందని చెబుతారు. - కారణి మురళీకృష్ణ , నెల్లూరు గమనిక: కొన్ని ఊర్ల పేర్లు, వాడల పేర్లు విచిత్రంగా ఉంటాయి. అయితే వాటి వెనుక ఏదో ఒక ఆసక్తికరమైన కథ ఉంటుంది. మీకు తెలిసిన అలాంటి ఊరు వాడల పేరు వెనక కథలను రాసి పంపండి. -
బహ్రెయిన్‌లో తెలుగు యువతి తెగువ
దుబాయి: వేధింపులకు గురిచేసిన బహ్రెయిన్ యజమాని నుంచి ఒక తెలుగు యువతి తప్పించుకుంది. మరో ఇద్దరు ఇండోనేసియన్ యువతులు కూడా ఆమె తరహాలోనే తమ యజమానుల నుంచి తప్పించుకున్నారు. తప్పించుకునే ప్రయత్నంలో గాయపడ్డ ఈ ముగ్గురు యువతులూ ప్రస్తుతం బహ్రెయిన్ రాజ దాని మనామాలోని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో చికిత్స పొందుతున్నట్లు ‘గల్ఫ్ న్యూస్’ దినపత్రిక మంగళవారం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి గతనెల బహ్రెయిన్‌లోని ఒక కుటుంబం వద్ద పనికి కుదిరిన అనూష అనే యువతి ఏజెంట్ల ద్వారా ఫోర్జరీ వీసాతో ఇక్కడకు చేరుకున్నట్లు అధికారులు చెప్పారు. తన వయసు 35 ఏళ్లు అని చెప్పుకొని ఆమె ఇక్కడకు వచ్చినా, ఆమె అసలు వయసు 19 ఏళ్లేనని దర్యాప్తులో తేలినట్లు తెలిపారు. తమ యజమానులు గొడ్డుచాకిరీ చేయించడంతో పాటు శారీరకంగా వేధించడంతో తాళలేక వారి నుంచి తప్పించుకున్నట్లు అనూషతో పాటు మిగిలిన ఇద్దరు ఇండోనేసియన్ యువతులు చెప్పారన్నారు. అనూషకు చెయ్యి, కాళ్లు ఫ్రాక్చర్ కావడంతో శస్త్రచికిత్స నిర్వహించినట్లు వలస కార్మికుల రక్షణ సంఘం అధ్యక్షురాలు డయాస్ చెప్పారు.