ప్రధాని మోదీతో మాట్లాడుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
మనామా: బహ్రెయిన్ అభివృద్ధికి ప్రవాస భారతీయులు చేసిన కృషిపై అభినందనలను వింటే తన మనసు సంతోషంతో పొంగిపోతుందని ప్రధాని మోదీ అన్నారు. బహ్రెయిన్‌లోని ప్రవాస భారతీయుల శ్రమను మోదీ ప్రశంసించారు. బహ్రెయిన్‌లో పనిచేస్తున్న భారతీయులను ఉద్దేశించి మోదీ బహ్రెయిన్ జాతీయ స్టేడియంలో ప్రసంగించారు. ‘నేను భారత ప్రధానిగానే ఇక్కడకు వచ్చాను. కానీ ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులను కలిసి వారితో మాట్లాడటమే’ అని అన్నారు.
బహ్రెయిన్ మొత్తం జనాభా దాదాపు 12 లక్షలు కాగా, అక్కడ పనిచేస్తున్న ప్రవాస భారతీయుల సంఖ్యే 3.5 లక్షలు. వీరిలోనూ ఎక్కువ మంది కేరళీయులే. బహ్రెయిన్‌లో పర్యటిస్తున్న తొట్టతొలి భారత ప్రధాని మోదీయే. రూపే కార్డును ఉపయోగించి త్వరలోనే బహ్రెయిన్‌లోనూ చెల్లింపులు చేసే అవకాశం కల్పిస్తున్నామనీ, ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఇప్పటికే ఇరు దేశాలు సంతకాలు చేశాయని ఆయన తెలిపారు.
మోదీకి కింగ్ హమద్ ఆర్డర్ అవార్డు..
బహ్రెయిన్‌తో భారత సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నందుకు మోదీకి ‘కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రినైజన్స్’ అవార్డును బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ప్రదానం చేశారు. మోదీ పర్యటన సందర్భంగా 250 మంది భారతీయ ఖైదీలను ఆదివారం విడుదల చేసి బహ్రెయిన్ మానవత్వాన్ని చాటుకుంది. బహ్రెయిన్‌లో 200 ఏళ్ల పురాతనమైన శ్రీనాథ్‌జీ శ్రీకృష్ణుడి ఆలయాన్ని పునరభివృద్ధి చేసేందుకు రూ. 30 కోట్ల విలువైన పనులను మోదీ ఆదివారం ప్రారంభించారు. ఖలీఫాతో మోదీ చర్చలు జరిపిన అనంతరం ఓ సంయుక్త ప్రకటనను రెండు దేశాలు విడుదల చేశాయి. ద్వైపాక్షిక, ప్రాంతీయ, బహుముఖ అంశాలపై వారు చర్చించారు. ఉగ్రవాదంపై నిఘా సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.
ఫ్రాన్స్ చేరుకున్న మోదీ
బియారిట్జ్: బహ్రెయిన్ పర్యటనను మోదీ ఆదివారం ముగించుకుని, జీ–7 సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం ఫ్రాన్స్‌లోని బియారిట్జ్‌కు చేరుకున్నారు. పర్యావరణం తదితర సమకాలీన అంశాలపై మోదీ ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. పలువురు అంతర్జాతీయ స్థాయి నేతలతో ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొంటారు. జీ–7 కూటమి దేశాల్లో భారత్ లేకపోయినప్పటికీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ వ్యక్తిగత ఆహ్వానం మేరకు మోదీ ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు.
జాన్సన్‌తో భేటీ అయిన మోదీ
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో మోదీ ఆదివారం బియారిట్జ్‌లో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ఇరు ప్రధానులు చర్చలు జరిపారని భారత ప్రధానమంత్రి కార్యాలయం తెలిపిం ది. బ్రిటన్ ప్రధానిగా జాన్సన్ ఎన్నికయ్యాక ఆయనతో మోదీ తొలి భేటీ ఇది.
Comments
Please login to add a commentAdd a comment