లండన్: ఈ ఏడాది జరగనున్న జీ–7 దేశాల శిఖరాగ్ర సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించినట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదివారం వెల్లడించారు. బ్రిటన్ అధ్యక్షతన ఈ ఏడాది జూన్ 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న అభివృద్ధి చెందిన దేశాల సమావేశాలకు తీర ప్రాంతమైన కార్న్‌వాల్ వేదికగా మారనుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిఖరాగ్ర భేటీకి భారత్‌తోపాటు దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లను ఆతిథ్య హోదాలో ఆహ్వానిం చామన్నారు. గత ఏడాది భారత ప్రధాని మోదీతో ఫోన్ కాల్ సంభాషణ సమయంలోనే ఈ విషయం తెలిపానన్నారు. జనవరి 26వ తేదీన భారత గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వెళ్లాల్సి ఉండగా దేశంలో కరోనా సంక్షోభం కారణంగా ఆ పర్యటన రద్దయిందని ఆయన చెప్పారు.
త్వరలోనే, జీ–7 భేటీలకు ముందే భారత్ సందర్శించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. జూన్‌లో జీ7 భేటీకి హాజరయ్యే 10 మంది నేతలు ప్రపంచంలోని ప్రజాస్వామ్యదేశాల్లోని 60% ప్రజలకు ప్రాతినిధ్యం వహించనున్నారని బోరిస్ జాన్సన్ తెలిపారు. తగరం, రాగి గనులతో 200 ఏళ్ల క్రితం బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవానికి కీలకంగా నిలిచిన కార్న్‌వాల్‌లో జీ7 భేటీ జరుగుతుందన్నారు. జీ 7 (గ్రూప్ ఆఫ్ సెవెన్)బృందంలో ప్రపంచంలో పలుకుబడి కలిగిన అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలున్నాయి. ఈ ఏడాది ఈ దేశాల మధ్య కోవిడ్ మహమ్మారిపైనే ప్రధాన చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. దాదాపు రెండేళ్లకు ముఖాముఖి జరగనున్న ఈ భేటీకి ముందుగా బ్రిటన్ వర్చువల్‌గా, నేరుగా వివిధ దేశాలతో మంత్రుల స్థాయిలో విస్తృతంగా చర్చలు జరపనుంది. యూకే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది.
ప్రపంచ ఔషధాగారం భారత్
ప్రపంచ వ్యాక్సిన్ అవసరాల్లో 50% వరకు సరఫరాచేసిన భారత్ ప్రపంచ ఔషధాగారంగా మారిందని యూకే విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ మహమ్మారి విషయంలో యూకే, భారత్ కలిసికట్టుగా పనిచేస్తున్నాయని తెలిపింది. భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతిచ్చిన పీ–5 దేశాల్లో యూకే మొట్టమొదటిదని పేర్కొంది. 2005లో భారత్‌ను జీ–7 సమ్మిట్‌కు యూకే మొదటగా ఆహ్వానం పంపింది. త్వరలో బ్రిక్స్ అధ్యక్ష హోదాతోపాటు, 2023లో జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టనుందంది.
Comments
Please login to add a commentAdd a comment