south korea
-
ద.కొరియా విమాన ప్రమాదం..వెలుగులోకి కీలక విషయాలు
సియోల్:దక్షిణ కొరియాలో ఇటీవల జరిగిన భారీ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తులో కీలక విషయం బయటపడింది. జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం డిసెంబర్ 29న మయూన్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతూ రన్‌వే పక్కనున్న గోడను ఢీకొట్టింది. విమానం బ్యాంకాక్ నుంచి మయూన్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పలు రకాలుగా ప్రచారం జరుగుతోంది. ప్రమాదం జరగడానికి నాలుగు నిమిషాల ముందు నుంచి విమానంలోని బ్లాక్‌బాక్స్ పని చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రమాద కారణాలపై జరుగుతున్న దర్యాప్తులో తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ విమానం రెండు ఇంజిన్లలో పక్షి ఈకలు, రక్తం ఉన్నట్లు దర్యాప్తు బృందం గుర్తించినట్లు సమాచారం. విమానాన్ని పక్షి ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందన్న వాదనకు బలం చేకూరుతోంది. అయితే ఈ విషయాన్ని దర్యాప్తు బృందం అధికారికంగా ధృవీకరించలేదు. దర్యాప్తులో అధికారులు యాంత్రిక, నిబంధనల ఉల్లంఘన సమస్యలను గుర్తించినట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించినట్లు కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా విమానం థ్రస్ట్ రివర్సర్స్, ఫ్లాప్స్, స్పీడ్బ్రేక్స్ వంటివి పూర్తిస్థాయిలో పని చేయలేదని తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది పూర్తిస్థాయిలో సన్నద్ధంగా లేకుండానే విమానం నేల పైకి దిగడానికి అనుమతించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విమానం రన్‌వేపై అత్యవసరంగా దిగే సమయంలో ల్యాండింగ్ గేర్ పని చేయకపోవడంతో అది బాడీ పైనే బెల్లీ ల్యాండింగ్ చేసిందని ప్రమాద సమయంలో అధికారులు తెలిపారు.అప్పటికే ఒక ఇంజిన్‌ను పక్షి ఢీకొనడంతో దానిలో శక్తి కూడా గణనీయంగా తగ్గిందని అందువల్లే ల్యాండ్ అయ్యాక అదుపుతప్పి గోడను ఢీకొట్టిందని చెప్పారు. ద.కొరియా విమాన ప్రమాదం జరిగే కొద్ది రోజుల ముందే అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కజకిస్తాన్‌లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలోనూ భారీ సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి తోడు 2024 సంవత్సరాంతంలో వరుస విమాన ప్రమాదాలు జరగడంతో విమాన ప్రయాణికులు కలవరపాటుకు గురయ్యారు. ఇదీ చదవండి: నల్లపెట్టె మౌనరాగం -
ద.కొరియా అధ్యక్షుడి అరెస్ట్
సియోల్: ప్రజాపాలనకు వ్యతిరేకంగా డిసెంబర్లో అత్యయిక స్థితి(మార్షల్ లా) విధించిన దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను దర్యాప్తు అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దీంతో కొద్దిరోజులుగా యూన్ అరెస్ట్ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అధ్యక్ష కార్యాలయం భద్రతా సిబ్బంది నుంచి తొలుత తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురైనా సరే దర్యాప్తు అధికారులు చిట్టచివరకు అధ్యక్షభవనం లోపలికి వెళ్లి యూన్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తొలుత బుధవారం తెల్లవారుజామున అవినీతినిరోధక దర్యాప్తు అధికారులు, పోలీసులు, సైన్యం సంయుక్తంగా సెంట్రల్సియోల్లోని అధ్యక్షుడి నివాస భవనానికి చేరుకున్నారు. వీరి రాకను ముందే పసిగట్టిన అధ్యక్షుడి భద్రతాబలగాలు ముందువైపు బస్సులను, చుట్టూతా బ్యారికేడ్లను, ముళ్ల కంచెలను ఏర్పాటుచేశాయి. తొలుత బస్సులను దర్యాప్తు అధికారులు నిచ్చెనల సాయంతో ఎక్కి వాటిని దాచేశారు. తర్వాత గోడలను ఇలాగే నిచ్చెనల సాయంతో ఎక్కిదిగారు. అడ్డుగా ఉంచిన పెద్ద బ్యారికేడ్లనూ ఇలాగే దాటేశారు. తర్వాత ముళ్ల కంచెలను కత్తిరించి ముందుకుసాగారు. ఇలా దాదాపు 1,000 మందితో కూడిన బృందం ముందుకు దూసుకువచ్చినా భద్రతాబలగాలు అడ్డుపడి ఈ బృందాన్ని ముందుకెళ్లకుండా నిలువరించాయి. దీంతో అధ్యక్షభవన బలగాలకు, దర్యాప్తు బలగాలకు మధ్య కొద్దిసేపు ఘర్షణ జరిగింది. ఎట్టకేలకు దర్యాప్తు బృందం ఎలాగోలా నివాసంలో లోపలికి వెళ్లి అధ్యక్షుడిని అరెస్ట్‌చేసింది. ముందు జాగ్రత్తగా ఇంకో దర్యాప్తు బృందం అధ్యక్షభవనం వెనుక వైపు ఉన్న ఎత్తయిన ప్రదేశాన్ని ట్రెక్కింగ్త రహాలో ఎక్కి వచ్చింది. మార్షల్‌లా కారణంగా దేశంలో అస్థిరతకు కార ణమయ్యారంటూ యూన్‌పై విపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టి నెగ్గించుకోవడం తెల్సిందే. అభిశంసన నేపథ్యంలో ఆయన తన అధికారాలను కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత ఎన్నికైన తాత్కాలిక అధ్యక్షుడినీ విపక్షాలు అభిశంసించాయి. 🇰🇷BREAKING NEWS:South Korea's ousted President Yoon has been arrested on charges of treason. pic.twitter.com/IX3hXCfPJe— Update NEWS (@UpdateNews724) January 15, 2025మార్షల్ లా విధించడానికి గల కారణాలపై సంజాయిషీ ఇచ్చుకునేందుకు దర్యాప్తు అధికారులు యూన్‌కు అవకాశం ఇవ్వడం ఆయన స్పందించకపోవడంతో అరెస్ట్‌కు కోర్టు నుంచి గతంలోనే అనుమతి తెచ్చుకున్నారు. ఇటీవల అరెస్ట్‌కు ప్రయత్నించి విఫలమైన దర్యాప్తు అధికారులు బుధవారం మరోసారి ప్రయత్నించి సఫలమయ్యారు. ‘‘ చట్టబద్ధపాలన దేశంలో కుప్పకూలింది’’ అని అరెస్ట్‌కు ముందు రికార్డ్ చేసిన ఒక వీడియో సందేశంలో అధ్యక్షుడు యూన్ వ్యాఖ్యానించారు. At 4 a.m., the Corruption Investigation Office and the Special Investigations Unit are attempting to execute a second arrest warrant for the president, mobilizing over 1,000 police officers. In response, citizens in South Korea have gathered in front of the presidential residence… pic.twitter.com/jTGjxkGV9z— 김정현 (Alfred J Kim) (@AJKim38836296) January 14, 2025 పదవిలో ఉండి అరెస్ట్ అయిన తొలి దక్షిణకొరియా అధ్యక్షుడిగా యూన్ చరిత్రలో నిలిచిపోయారు. వచ్చే కొన్ని వారాలపాటు ఆయన కస్టడీలనే ఉండిపోనున్నారు. దేశంలో తిరుగుబాటు తెచ్చేందుకు ప్రయత్నించారన్న అభియోగాలపై ఆయనను అరెస్ట్చేయదలిస్తే 48 గంటల్లోపు ఆమేరకు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలి. లేదంటే ఆయనను మళ్లీ విడుదలచేయాల్సి ఉంటుంది. ఒకవేళ సాధారణ అరెస్ట్‌గా ఆయనను అదుపులోకి తీసుకుని ఉంటే నేరాభియోగాలు మోపేలోపు మరో 20 రోజులపాటు ఆయనను తమ కస్టడీలోనే ఉంచుకోవచ్చు. ఆయన అరెస్ట్‌ను ఆయన తరఫు లాయర్లు తప్పుబట్టారు. దేశద్రోహం సెక్షన్ల కింద నమోదైన కేసులను అవినీతినిరోధక శాఖ అధికారులు దర్యాప్తు చేయలేరని, అరెస్ట్ అన్యాయమని వాదించారు. BREAKING : Update South KoreaPolice & Officials begin moving barriers in new attempt to arrest President Yoonsupporters of Yoon are gathered to stop them pic.twitter.com/ULsGjZnm3t— Gio DeBatta 🍸 (@GDebatta) January 14, 2025 -
వాన చినుకులలో వడ్డన..!
ఒకవైపు వాన చినుకులు పడుతుంటే, మరోవైపు పక్కనే వేడి వేడి టీ, పకోడీలాంటివి ఉంటే ఎంత బాగుంటుంది! ‘అయితే, అలా తినాలంటే రోజూ కుదరదు కదా!’ అని బాధపడేవారికి ఒక చక్కని వార్త. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలోని సియోంగ్ ప్రాంతంలో ఉన్న ‘రెయిన్ రిపోర్ట్ క్రాయిసెంట్’ హోటల్లో ప్రతిరోజూ వానాకాలాన్ని ఆస్వాదించొచ్చు. రెస్టారెంట్ ఇంటీరియర్ మొత్తం వాతావరణ వార్తలు, వర్షం పడే దృశ్యాలతో నిండి ఉంటుంది. హోటల్లో మొత్తం నిరంతరం వాన తుంపరలు పడేలా సెట్ చేశారు. వెదురు చెట్ల చుట్టూ కుర్చీలు, బల్లలు వేసి, పాదాలకు నీటి ప్రవాహం తగిలేలా అక్కడి ఫ్లోర్‌ను సెటప్ చేశారు. ఇక పక్కనే ప్రవహించే నీటిలో నేలపై కుర్చునే వీలుంది. అంతేకాదు, కుటుంబమంతా కలసి ఎంజాయ్ చేయడానికి రెండో అంతస్తులో ఒక మినీ సినీ థియేటర్ కూడా ఉంది.సౌకర్యవంతమైన కుషన్స్‌లో పడుకొని సినిమా చూడొచ్చు. అక్కడ దొరికే మెన్యూ ఐటమ్స్‌లోని పానీయాలు, వంటకాల పేర్లన్నీ కూడా రెయిన్ రిపోర్ట్ స్టయిల్లోనే ఉంటాయి. ఉదాహరణకు ‘సన్ షైన్’, ‘క్లౌడ్’, ‘రెయిన్ డ్రాప్’ ఇలా వివిధ వాతవరణ సూచనల పేర్లతో ఉండే క్రాయిసెంట్స్, ‘రెయిన్బో మిల్క్’, ‘సెసేమ్ క్లౌడ్’, ‘వెట్ క్లౌడ్’, ‘వైట్ లాట్టే’ వంటి పానీయాలు ఉన్నాయి. బాగుంది కదా! వానాకాలాన్ని ఆస్వాదించాలంటే వెంటనే ఈ రెయిన్ రిపోర్ట్ రెస్టరెంట్‌కి వెళ్లాల్సిందే మరి. (చదవండి: ఘోస్ట్ కోసం బీస్ట్ పిరమిడ్ వాసం) -
South Korea: బ్లాక్‌బాక్స్ సైలెన్స్!!
దక్షిణ కొరియా ఘోర విమాన ప్రమాదంపై ఆ దేశ రవాణా శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రమాదానికి సరిగ్గా నాలుగు నిమిషాల ముందే విమానంలో బ్లాక్ బాక్సు పని చేయకుండా పోయిందని ప్రకటించింది. దీంతో కేసు దర్యాప్తు మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.179 మంది ప్రాణాలను బలిగొన్న జెజు విమానం శకలాల నుంచి బాక్ బాక్స్‌ను సేకరించి అధికారులు విశ్లేషించారు. అయితే అందులో ఎలాంటి సమాచారం లేకపోయేసరికి అధికారులు ఆశ్చర్యపోయారు. దీంతో.. అమెరికాలోని ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ల్యాబోరేటరీకి పంపించారు. యూఎస్ సేఫ్టీ రెగ్యులేటరీ సహకారంతో డాటా రికార్డర్‌ను విశ్లేషిస్తున్నట్లు దక్షిణ కొరియా ప్రకటించింది.‘‘రక్షణగోడను ఢీకొట్టి ప్రమాదం జరగడానికి నాలుగు నిమిషాల ముందే విమానంలో ఉండే బ్లాక్ బాక్సుల్లో ఎలాంటి డేటా రికార్డు కాలేదని దర్యాప్తులో భాగంగా వెల్లడైంది. అసలు ఆ డేటా పోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నాం ’’ అని మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే దర్యాప్తులో కీలకమైన ఈ సమాచారం కోల్పోవడంతో ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలుసుకోవడం కష్టంగా మారే అవకాశం లేకపోలేదు. అయితే ఇది అత్యంత అరుదైన ఘటన అని మాజీ అధికారి సిమ్ జై డోంగ్ అంటున్నారు. ఇలా బ్లాక్‌బాక్స్‌లు మూగబోయిన సందర్భాలు గతంలోనూ నమోదయ్యాయని చెబుతున్నారాయన.ఇటీవల జెజు ఎయిర్ విమానం థాయ్‌లాండ్ నుంచి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో దక్షిణ కొరియా ముయాన్కు బయలుదేరింది. మరో అయిదు నిమిషాల్లో క్షేమంగా దిగుతామనుకుంటుండగా.. విమానం రన్‌వేపై జారుతూ.. నిప్పురవ్వలు రాజేస్తూ రక్షణగోడ వైపు దూసుకెళ్లి, గోడను ఢీకొట్టి, పేలిపోయింది. విమాన వెనుక భాగంలో కూర్చున్న ఇద్దరు మినహా మిగతా వాళ్లంతా ప్రాణాలు కోల్పోయారు.Death toll from the crash of a Jeju Air passenger plane during landing in South Korea has risen to 96▪️ The plane failed to deploy its landing gear on the first attempt and crashed during an emergency landing on the second attempt▪️ The aircraft veered off the runway and… pic.twitter.com/8uDMwRcIpn— Anadolu English (@anadoluagency) December 29, 2024అనుమానాలెన్నో..విమానాన్ని పక్షి ఢీ కొట్టిందనే సమాచారాన్ని పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. అయితే అత్యవసర ల్యాండింగ్‌కు విమానం ఒకసారి ప్రయత్నించి విఫలమైంది. ఈ క్రమంలో రెండోసారి సింగిల్ రన్‌వేపై దిగగా ల్యాండింగ్ గేర్ సమస్యతో దూసుకెళ్లి అక్కడున్న గోడను ఢీ కొట్టింది. అయితే విమాన ప్రమాదం జరిగిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవై దర్యాప్తు జరుగుతున్న తీరుపైనా బాధిత కుటుంబాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే.. లోకలైజర్‌ను రన్‌వే చివర.. అదీ అంతటి గట్టి పదార్థంతో నిర్మించాల్సిన అవసరం ఏంటనే కోణంలో దర్యాప్తు జరగాల్సి ఉంది. -
దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్ విఫలం
సియోల్: అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ (Yoon Suk Yeol) అరెస్టు విఫలమైంది. కోర్టు నుంచి అంగీకారపత్రంతో శుక్రవారం తెల్లవారుఝామునే కరప్షన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(CIO) అధికారులు సియోల్‌లోని అధ్యక్ష భవనానికి చేరుకున్నారు. అయితే అక్కడ వాళ్లకు చాలా సమయం అడ్డగింత ఎదురైంది. దీంతో చేసేది లేక అధ్యక్ష నివాసం నుంచి అధికారులు వెనుదిరిగారు. ఎమర్జెన్సీ మార్షల్ లా(Martial Law)ను ప్రకటించిన కేసులో విచారణకు సహకరించకపోవడంతో యూన్ సుక్ యోల్‌పై అరెస్టు వారెంటు జారీ అయింది. అయితే విచారణాధికారులు యూన్ నివాసంలోకి వెళ్లకుండా సైన్య బృందంతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఒకానొక టైంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు.. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఐవో చీఫ్ ఓహ్ డోంగ్ వున్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే అన్నివైపులా ప్రతిఘటన ఎదురుకావడంతో సుమారు ఆరు గంటలపాటు హైడ్రామా నడిచింది. చివరకు.. సీఐవో అధికారులు అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది .ఇక.. మార్షల్ లా ప్రకటించిన కేసులో.. అధ్యక్ష భవనంలో సోదాలకు విచారణ అధికారులు ప్రయత్నించినప్పుడు కూడా ఇలాంటి ప్రతిఘటనే ఎదురైంది. అయినప్పటికీ అధికారులు పోలీసుల సాయంతో బలవంతంగా లోపలికి వెళ్లి తనిఖీలు జరిపారు. మరోవైపు ఈ కేసులో మూడుసార్లు విచారణకు పిలిచినా ఆయన హాజరుకాకపోవడంతో అధికారులు అరెస్ట్ వారెంట్ కోరుతూ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అంగీకరించింది. అదే జరిగితే దక్షిణ కొరియా చరిత్రలో అరెస్ట్ అయిన తొలి అధ్యక్షుడిగా నిలుస్తారు.అరెస్ట్ జరిగితే.. కోర్టు 6వ తేదీ వరకూ గడువిచ్చిందని, ఆలోపే యూన్‌ను అరెస్టు చేస్తామని సీఐవో మరోమారు స్పష్టం చేశారాయన. యూన్ గనుక అరెస్ట్ అయితే.. ఆయన్ని గవాచియాన్‌లోని సీఐవో కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. మార్షల్ లా విధింపు కేసులో అక్కడ ఆయన్ని విచారణ జరపనున్నారు. అరెస్ట్ వారెంట్ నేపథ్యంతో.. 48 గంటలపాటు ఆయన్ని అదుపులో ఉంచుకునే అధికారం సీఐవోకు ఉంటుంది. అయితే అటుపై కస్టడీ కోసం కోర్టును అభ్యర్థించాల్సి ఉంటుంది.విఫలయత్నాలే..దక్షిణ కొరియాలో ఇలాంటి పరిణామాలు కొత్తేం కాదు. 2000, 2004 సంవత్సరాల్లో చట్ట సభ్యులను అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు. అయితే.. రెండు సందర్భాల్లోనూ అరెస్ట్ వారెంట్ గడువు ముగిసేదాకా(ఏడురోజులపాటు) వాళ్ల పార్టీ సభ్యులు, మద్దతుదారులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో అది సాధ్యపడలేదు. హైటెన్షన్సెంట్రల్ సియోల్‌లో ఎటు చూసిన భారీగా బలగాలు కనిపిస్తున్నాయి. యూన్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో ఆయన అనుచరులు భారీగా అధ్యక్ష భవనం వద్దకు చేరి మోహరించారు. గురువారం యూన్ వ్యతిరేకులకు, మద్దతుదారులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో భద్రతా బలగాలు కొందరిని అదుపులోకి తీసుకున్నాయి. మరోవైపు.. యూన్ మద్దతుదారులు అమెరికా జెండాలతో నినాదాలు చేస్తూ కనిపించడం కొసమెరుపు. యూన్ అరెస్ట్ నేపథ్యంలో.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2,700 మంది పోలీసులు మోహరింపజేసినట్లు సమాచారం.మార్షల్ లాతో చిక్కుల్లో..ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ.. యూన్ ఇటీవల ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్షాలు ‘మార్షల్ లా’ అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో యూన్ తన అధ్యక్ష అధికారాలు, విధులకు తాత్కాలికంగా దూరమయ్యారు. యూన్‌ను పదవి నుంచి తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని కోర్టు 180 రోజుల్లోగా తేల్చనుంది.మరోవైపు యూన్ మద్దతుదారులు సియోల్‌లోని ఆయన నివాసం ఎదుట భారీగా మోహరించారు. వారిని ఉద్దేశిస్తూ యూన్ మాట్లాడారు. తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించి దేశాన్ని ప్రమాదంలో పడేసేందుకు పనిచేస్తున్న శక్తులపై చివరివరకు పోరాడతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు యూన్‌ను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన తరఫు న్యాయబృందం హెచ్చరించింది. ఇంకోవైపు.. దక్షిణ కొరియాను మరో ఉత్తర కొరియాగా మార్చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఆయన అరెస్టును అడ్డుకుని తీరతామంటూ నివాసం ఎదుట భారీగా మోహరించారు. అభిశంసన ఇలా.. మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్(జాతీయ అసెంబ్లీ)లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా.. 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన తన అధ్యక్ష అధికారాలను, విధులను ప్రధానమంత్రి హన్ డక్ సూకీకి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానప్రతులను రాజ్యాంగ న్యాయస్థానానికి పార్లమెంటు పంపుతుంది. యూన్‌ను తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని ఈ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది. మరోవైపు యూన్ స్వచ్ఛందంగా దక్షిణ కొరియా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు ఆయన సీనియర్ సలహాదారులు, కార్యదర్శులు చెబుతున్నారు. చదవండి👉🏻: కరోనా ప్యాటర్న్‌లోనే.. చైనా నుంచి మరో వైరస్ -
యూన్‌కు అరెస్ట్ వారెంట్
సియోల్: దక్షిణ కొరియా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు సియోల్‌లోని జిల్లా కోర్టు సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయన ఆఫీసు, నివాసాల్లో సోదాలు చేపట్టాలని ఆదేశించిందని అవినీతి నిరోధక విభాగం వెల్లడించింది.. అయితే, అధికారికంగా యూన్‌ను పదవి నుంచి తొలగిస్తేనే తప్ప ఆయన నివాసం, కార్యాలయంలో తనిఖీలు చేపట్టేందుకు అవకాశాలు చాలా తక్కువని నిపుణులు అంటున్నారు. యూన్ ఈ సమన్లను పట్టించుకోరని చెబుతున్నారు.ఇప్పటికే విచారణకు రావాలంటూ అందిన సమన్లను ఆయన పక్కనబెట్టేశారని, అధ్యక్షునికి ఉన్న రాజ్యాంగపరమైన రక్షణలను చూపుతూ భద్రతా సిబ్బంది ఇతర దర్యాప్తు అధికారులెవరినీ ఆయన నివాసంలోకి గానీ ఆఫీసులోకి గానీ రానివ్వడం లేదని సమాచారం. యూన్ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం తిరుగుబాటు కిందికి వస్తుందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు అవినీతి వ్యతిరేక విభాగం తెలపడాన్ని ఆయన లాయర్లు తప్పుబడుతున్నారు. ఈ విభాగం సోమవారం జారీ చేసిన సమన్లకు ఎలాంటి చట్టబద్ధతా లేదని కొట్టిపారేస్తున్నారు. అరెస్ట్‌కు యూన్ అంగీకరిస్తే తప్ప తామేమీ చేయలేమని అవినీతి నిరోధక విభాగం సైతం అంగీకరించింది. అప్పటి వరకు తమ తదుపరి కార్యాచరణ ఏమిటనేది ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపింది.అయితే, విచారణకు సహకరించేలా ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లుగా నిపుణులు చెబుతున్నారు. గతంలో, అవినీతి ఆరోపణలెదుర్కొన్న 2017లో మాజీ అధ్యక్షుడు పార్క్ గుయెన్ హే కూడా ఇదే విధంగా విచారణ అధికారులకు సహకరించలేదని గుర్తు చేస్తున్నారు. అవినీతి నిరోధక విభాగం తిరుగుబాటు ఆరోపణలను రుజువు చేయగలిగిన పక్షంలో యూన్‌కు మరణ శిక్ష లేదా జీవితకాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇతర నేరారోపణలైతే ఆయనకు అధ్యక్ష హోదా కారణంగా మినహాయింపులు వర్తిస్తాయి. తిరుగుబాటు, దేశద్రోహం వంటి ఆరోపణలు రుజువైతే మాత్రం అధ్యక్షుడికి ఎలాంటి రక్షణలు, మినహాయింపులు ఉండవు.మార్షల్ లా విధించిన ఆరోపణలపై ప్రతిపక్షం మెజారిటీ ఉన్న పార్లమెంట్ డిసెంబర్ 14వ తేదీన యూన్‌ను అభిశంసించింది. అయితే, ఉత్తర కొరియాకు ప్రతిపక్షం అనుకూలంగా మారిందని యూన్ ఆరోపిస్తున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ, తరచూ ఉన్నతస్థాయి నేతలపై అభిశంసన తీర్మానాలను ప్రవేశపెడుతూ అడ్డుతగులుతోందని ఆయన విమర్శిస్తున్నారు. ఇటువంటి దేశ వ్యతిరేక శక్తులను అదుపు చేసేందుకే మార్షల్ లా పెట్టినట్లు యూన్ వాదనలు వినిపిస్తున్నారు. యూన్ అభిశంసన సరైనదా కాదా అనే అంశంపై దేశ రాజ్యాంగ కోర్టు విచారణ జరుపుతోంది. -
ద.కొరియా అధ్యక్షుడికి కోర్టు షాక్
సియోల్:సౌత్‌కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు అక్కడి కోర్టు షాక్ ఇచ్చింది. ఎమర్జెన్సీ విధించిన కేసులో యోల్‌ను అరెస్టు చేసేందుకు వారెంట్ జారీ చేసింది. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు వారెంట్ జారీ చేయాల్సిందిగా దర్యాప్తు అధికారులు తాజాగా కోర్టును కోరారు.పోలీసుల విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. దీంతో యోల్‌ను త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యోల్ డిసెంబర్3న దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ కేసులో అధ్యక్షుడిని పోలీసులు,రక్షణ మంత్రిత్వశాఖ,అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన సంయుక్త బృందం విచారిస్తోంది.ఇప్పటికే ఈ కేసులో మూడుసార్లు పిలిచినప్పటికీ యోల్ విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు కోర్టును అరెస్ట్ వారెంట్ కోరారని సమాచారం. విచారణలో నేరం రుజువైతే ఆయనకు జీవిత ఖైదు లేదా మరణశిక్షవిధించే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో మార్షల్‌లా విధించినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి.తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో యోల్ తన అధ్యక్ష అధికారాలను, ప్రధానమంత్రికి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానం కాపీని పార్లమెంట్ రాజ్యాంగ కోర్టుకు పంపుతుంది. యోల్ భవితవ్యాన్ని రాజ్యాంగ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది. -
విమానంలో ఏ సీటు భద్రం?
ఆదివారం దక్షిణకొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో వెనకవైపు సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ఇద్దరు ప్రాణాలతో బయటపడినట్లు వార్తలొచ్చాయి. దీంతో విమానంలో ముందువైపు లేదంటే వెనుకవైపు అసలు ఏ నంబర్ సీటులో కూర్చుంటే ప్రమాదం జరిగినా బయటపడొచ్చనే అంశంపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. తరచూ విమానప్రయాణాలు చేసే అంతర్జాతీయ ప్రయాణికులు ఈ చర్చలను తీక్షణంగా గమనిస్తున్నట్లు వార్తలొచ్చాయి. నిజంగానే వెనుకవైపు సీట్లు భద్రమా? అనే ప్రశ్న ఇప్పుడు ప్యాసింజర్లను తొలచేస్తోంది. మిగతా ప్రయాణాలతో చూస్తే భద్రమే ఎక్కడ కూర్చుంటే క్షేమంగా ఉంటామనే ప్రశ్న కంటే అసలు విమానంలో ప్రయాణమే అత్యంత భద్రమని మరో వాదన మొదలైంది. నిర్లక్ష్య డ్రైవింగ్, గతుకుల రోడ్డు, ఎత్తుఒంపులు ఉన్న చోట్ల సాంకేతిక ప్రమానాలు పాటించకుండా నిర్మించిన రోడ్లు, సరైన సూచికల వ్యవస్థ లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రయాణంతో పోలిస్తే విమాన ప్ర యాణం ఎంతో క్షేమదాయకమని వారు చెబుతున్నారు. విమానంలో ఎక్కడ కూర్చున్నా భద్ర మేనని, ఎప్పటికప్పుడు మొత్తం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీచేసి సుశిక్షుతులైన పైలట్ల పర్యవేక్షణలో విమానం ప్రయాణిస్తుందని, అ త్యంత అరుదుగా మాత్రమే, అసాధారణ వాతావరణ పరిస్థితుల్లోనే వి మా నం ప్రమాదంబారిన పడుతుంద ని విశ్లేషకులు చెబుతు న్నారు. అమెరికాలో ఎలా? ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం అమెరికా రోడ్లపై ప్రతి 10 కోట్ల వాహన ప్రయాణాల్లో కేవలం 1.18 మరణాలు సంభవిస్తున్నాయి. అదే 10 కోట్ల మైళ్ల రైలు ప్రయాణంలో 0.04 మరణాలు సంభవిస్తున్నాయి. ఇక 10 కోట్ల మైళ్ల విమాన ప్రయాణాల్లో అత్యంత స్వల్పంగా కేవలం 0.003 మరణాలు సంభవిస్తున్నాయి. అంతర్జాతీయ పౌర విమానయాన రంగ గణాంకాల ప్రకారం 2023లో ప్రతి వంద కోట్ల మంది ప్రయాణికులకు కేవలం 17 మంది మాత్రమే విమాన ప్రమాదాల్లో చనిపోయారు. 2022 ఏడాదిలో ఈ సంఖ్య 50గా ఉంది. అత్యాధునిక విమానాల్లో ఆధునిక భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నా అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగానే అత్యల్ప స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. తోక క్షేమమే విమానం ద్రవరూప ఇంధనం(ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్)తో నడుస్తుంది. చిన్న జెట్ విమానాలను మినహాయిస్తే అంతర్జాతీయ సర్వీస్‌లకు వాడే భారీ పౌరవిమానాల్లో రెక్కల కింద ఈ ఇంధనాన్ని నిల్వచేస్తారు. ఏదైనా ప్రమాదం జరిగి నిప్పురవ్వులు రాజుకుంటే రెక్కల కింద ఇంధనం భగ్గున మండి రెక్కల సమీప సీట్లలోని ప్రయాణికులు బుగ్గిపాలుకావడం ఖాయం. ఈ కోణంలో చూస్తే రెక్కల సమీపంలోని సీట్లు ప్రమాదసందర్భాల్లో అంత క్షేమదాయకం కాదని గత ప్రమాదరికార్డులు తేటతెల్లంచేస్తున్నాయి. ఈ విషయమై అమెరికాలో పాపులర్ మెకానిక్స్ అనే మేగజైన్ 1971 నుంచి 2005 వరకు జరిగిన విమాన ప్రమాదాలను విశ్లేíÙస్తూ ఒక నివేదిక సిద్ధంచేసింది. దీని ప్రకారం తోకభాగంలో కూర్చుంటే ప్రమాదాల్లో బతికే అవకాశాలు మిగతా సీట్లతో పోలిస్తే 40 శాతం అధికంగా ఉంటాయి. ముందు సీట్లతో ముప్పే ప్రమాదంలో ఇంధనం అంటుకుని మంటలు చుట్టుముట్టకపోయినా ముందు సీట్లు ఒకరకంగా ప్రమాదకరమని నివేదించారు. ఎదురుగా ఏదైనా కొండను ఢీకొట్టినా, నేలపై కుప్పకూలినా, వేరే విమానాన్ని ఢీకొట్టినా, రన్‌వే చివరన గోడలాంటి నిర్మాణాన్ని ఢీకొట్టినా, రన్‌వే దాటి లోయ లేదంటే సముద్రం, సరస్సు వంటి జలాశయంలోకి దూసుకెళ్లినా ప్రమాద ప్రభావం ముందు సీట్లపైనే అధికంగా ఉంటుంది. మధ్య సీట్ల పరిస్థితి విచిత్రం మధ్య సీట్లలో కూర్చుంటే రెక్కలకు సమీపంలో ఉండటం వల్ల ఇంధనంలో మంటలొస్తే ప్రమాదమే. కానీ మంటలు చెలరేగని పక్షంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గం వీళ్లకే దగ్గరగా ఉంటుంది. తప్పించుకునే అవకాశాలు వీళ్లకే ఎక్కువ. ఏదేమైనా విమానం ప్రమాదంలో పడిన తీరు, వేగం, దిశను బట్టి విమానంలోని ముందు, వెనుక, పక్క భాగాలు దెబ్బతింటాయి. భారత్‌లో గంటకొకటి చొప్పున జరిగే రోడ్డు ప్రమాదాలు, ఇటీవల సర్వసాధారణమైన పట్టాలు తప్పడం వంటి రైలు ప్రమాదాలతో పోలిస్తే అత్యంత అరుదుగా జరిగే విమాన ప్రమాదాలను భూతద్దంలో చూడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చే వాళ్లు ఈ ‘సీటు క్షేమం’చర్చలో పాల్గొన్నారు. బతికే అవకాశాలు 60 శాతం అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డ్ నివేదికను విశ్లేíÙస్తూ బ్రిటన్ పాత్రికేయుడు మ్యాక్స్ ఫాస్టర్ తాజాగా ఒక విషయాన్ని బయటపెట్టారు. ‘‘విమానం నేలపై కూలినా, నీటిలో పడినా, గాల్లోనే పేలిపోయినా ముందు సీట్లలో కూర్చునే ప్రయాణికులు 49 శాతం వరకు బతికే అవకాశాలు ఉన్నాయి. రెండు రెక్కల మధ్యభాగంలోని సీట్లలో కూర్చుంటే 59 శాతం వరకు బతికే అవకాశాలు ఉన్నాయి. ఇక వెనుకవైపు అంటే తోక సమీప సీట్లలో కూర్చుంటే 69 శాతం బతికే అవకాశాలు ఉన్నాయి’’అని అన్నారు. అయితే ఇక్కడో ఘటనను తప్పక గుర్తుచేసుకోవాలని ఆయన చెబుతున్నారు. ‘1989లో అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదానికి గురైనప్పుడు 269 మంది ప్రయాణికుల్లో 184 మంది బతికారు. వీరిలో చాలా మంది ముందు సీట్లలో కూర్చున్నారు’’అని ఆయన గుర్తుచేశారు. ప్రఖ్యాత ‘టైమ్’మేగజైన్ నివేదిక సైతం వెనుక సీట్లు క్షేమమని తెలిపింది. మిగతా సీట్లతో పోలిస్తే వెనుకవైపు సీట్లలో మధ్య వాటిల్లో కూర్చుంటే మరింత క్షేమమని పేర్కొంది. ఇక్కడ కూర్చుంటే మరణించే అవకాశం కేవలం 28 శాతమని, అదే విమానం మధ్యలో కూర్చుంటే ముప్పు శాతం 44 శాతంగా ఉంటుందని వెల్లడించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ద.కొరియా: మరో విమానానికి తప్పిన ప్రమాదం
సియోల్:సౌత్‌కొరియాలో ఘోర విమాన ప్రమాదం మరువకముందే మరో విమానానికి పెద్ద గండం తప్పింది. ఈ విమానం కూడా ఆదివారం 179 మంది ప్రాణాలను బలిగొన్న జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందినదే కావడం గమనార్హం. జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందిన సోమవారం(డిసెంబర్30) ఉదయం సియోల్‌లోని గింపో ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయింది.టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని పైలట్ వెంటనే గుర్తించాడు. దీంతో విమానాన్ని తిరిగి గింపో విమానాశ్రయంలో సురక్షితంగా దించాడు. అయితే ఈ విమానానికి కూడా ల్యాండింగ్ గేర్ సమస్యనే వచ్చినట్లు తెలుస్తోంది.కాగా, ఆదివారం సౌత్కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతో విమానం క్రాష్ ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 181 మందిలో ఇద్దరు తప్ప అందరూ దుర్మరణం పాలయ్యారు. జెజు ఎయిర్‌లైన్స్‌కు సామాన్యులకు అందుబాటు ధరల్లో విమానాలు నడిపే బడ్జెట్ ఎయిర్‌లైన్ కంపెనీగా పేరుంది.ఇదీ చదవండి: గాలిలో ప్రాణాలు -
త్వరలో ద.కొరియా అధ్యక్షుడి అరెస్టు..?
సియోల్:ఎమర్జెన్సీ వివాదం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను వెంటాడుతోంది. ఇప్పటికే అభిశంసనను ఎదుర్కొంటున్న యోల్‌కు అరెస్టు ముప్పు పొంచి ఉంది. యోల్‌ను అదుపులోకి తీసుకునేందుకు అనుమతివ్వాలని పోలీసులు ఇప్పటికే కోర్టును కోరినట్లు సమాచారం.కోర్టు అంగీకరిస్తే త్వరలోనే యోల్‌ను అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. యోల్ ఇటీవల దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించడం వివాదాస్పదమైంది. ప్రస్తుతం ఈ కేసులో అధ్యక్షుడిని పోలీసులు,రక్షణ మంత్రిత్వశాఖ,అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన సంయుక్త బృందం విచారిస్తోంది. ఇప్పటికే మూడుసార్లు పిలిచినప్పటికీ యోల్ విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు కోర్టును అరెస్ట్ వారెంట్ కోరారని సమాచారం. విచారణలో నేరం రుజువైతే ఆయనకు జీవిత ఖైదు లేదా మరణశిక్షవిధించే అవకాశం ఉంది. కాగా, ఇటీవల అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో మార్షల్‌లా విధించినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో యోల్ తన అధ్యక్ష అధికారాలను, ప్రధానమంత్రికి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానం కాపీని పార్లమెంట్ రాజ్యాంగ కోర్టుకు పంపుతుంది. యూన్ భవితవ్యాన్ని రాజ్యాంగ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది.ఇదీ చదవండి: నెతన్యాహుకు శస్త్ర చికిత్స..డాక్టర్ల కీలక ప్రకటన -
గాలిలో ప్రాణాలు
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో వైమానిక భద్రత మరోసారి చర్చనీయాంశమైంది. గత ఐదారేళ్లుగా అత్యంత ఘోరమైన ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది... టేకాఫ్ అయిన కాసేపటికే... గత ఐదేళ్లలో అత్యంత విషాదకరమైన, చర్చనీయమైన విమాన ప్రమాదం లయన్ ఎయిర్ ఫ్లైట్ 610. 2018 అక్టోబర్ 29న ఇండోనేసియాలోని జకార్తా నుంచి పాంగ్‌కల్ పినాంగ్‌కు బయలుదేరిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే జావా సముద్రంలో కూలిపోయింది. 189 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది చనిపోయారు. విమానంలోని ఆగ్మెంటేషన్ సిస్టమ్ (ఎంసీఏఎస్)లో లోపమే ప్రమాదానికి కారణమని తేలింది. బోయింగ్ విమానాల రూపకల్పన, ఏవియేషన్ రెగ్యులేటర్లు, ముఖ్యంగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్ (ఎఫ్ఏఏ) పర్యవేక్షణలో తీవ్ర లోపాలను ఈ దుర్ఘటన ఎత్తిచూపింది. ఐదు నెలలకే మరోటి... లయన్ ఎయిర్ ప్రమాదం జరిగిన ఐదు నెలలకే మరో బోయింగ్ 737 మ్యాక్స్ కూలిపోయింది. 2019 మార్చి 10న ఇథియోపియా ఎయిర్‌లైన్స్ విమానం 302 అడిస్ అబాబా నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 157 మంది చనిపోయారు. దీనికీ ఎంసీఏఎస్ వ్యవస్థే కారణమని తెలిసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన అధికారులు మాక్స్‌ను నిలిపివేశారు. బోయింగ్ చట్టపరమైన, ఆర్థికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంది. సముద్రంలో కూలిన విమానం... 2021 జనవరి 9న ఇండోనేషియాలోని జకార్తాలో విమాన ప్రమాదం జరిగింది. సోకర్నో–హట్టాలో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పాంటియానాక్కు బయలుదేరిన బోయింగ్ 737–500 విమానం సముద్రంలో కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సముద్రంలో కూలిపోవడంతో అందులో ఉన్న 62 మంది చనిపోయారు. ఇండోనేషియాలో ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఇది. యాంత్రిక వైఫల్యం, మానవ తప్పిదం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. విమానంలోని ఆటోథ్రోటిల్ సిస్టమ్‌లో లోపం వల్ల విమానం ఇంజన్లు అసమతుల్యం కావడంతో అదుపు తప్పి కూలిపోయింది. పైలట్ పరిస్థితికి తగిన విధంగా స్పందించడంలో విఫలమయ్యారని తేలింది. ఈ ప్రమాదం పాత విమానాల నిర్వహణలో అప్రమత్తతను, విమానాల అప్‌గ్రేడేషన్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పింది. యాంత్రిక వైఫల్యాలు తలెత్తినప్పుడు ప్రతిస్పందించడానికి విమానయాన సిబ్బంది అందరికీ శిక్షణ ఇవ్వాలని ఉద్ఘాటించింది.ఇళ్లపైనే కూలిన విమానం.. 2020 మే 22న పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఫ్లైట్ 8303, ఎయిర్‌బస్ ఎ 320 కరాచీలోని ఇళ్లపై కూలిపోయింది. లాహోర్ నుంచి బయలుదేరిన ఈ విమానంలో 99 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 41 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ల్యాండింగ్ సమయంలో పైలట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ల్యాండింగ్ గేర్‌లో తలెత్తిన సమస్యల కారణంగా విమానం రన్ వేపైకి దూసుకెళ్లడంతో ఇంజన్లు ధ్వంసమయ్యాయి. చివరకు అదుపు తప్పిన విమానం నివాస ప్రాంతంలోకి దూసుకెళ్లింది. పైలట్లుప్రామాణిక అత్యవసర విధానాలను పాటించలేదని విమానం బ్లాక్ బాక్స్ వెల్లడించింది. ఈ ప్రమాదం పైలట్ల శిక్షణ, నియంత్రణ పర్యవేక్షణలో లోతైన లోపాలను బహిర్గతం చేసింది. పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీలో శిక్షణ నాణ్యతపై విచారణకు దారితీసింది, రన్‌వే నుంచి జారి లోయలో పడి... గత ఐదేళ్లలో భారత్‌లో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం 1344ది. దుబాయ్ నుంచి వచి్చన ఈ విమానం 2020 ఆగస్టు 7న కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా కూలిపోయింది. ప్రయాణికులు, సిబ్బంది మొత్తం 165 మంది ఉండగా.. 21 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా రన్‌వే తడిసిపోయి ఉంది. ఇక్కడ రన్‌వే పొడవు కూడా తక్కువగా ఉండటంతో ల్యాండ్ అయిన విమానం జారి లోయలో పడిపోయింది. వాతావరణ పరిస్థితులు, మానవ తప్పిదం, రన్ వే మౌలిక సదుపాయాల సరిగా లేకపోవడం వల్ల జరిగిందని దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదం తరువాత దేశంలోని విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను సమీక్షించారు. రన్‌వే నుంచి జారి..నేపాన్‌లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పొఖారాకు బయల్దేరిన విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో సిబ్బందితో సహా 19 మంది ఉన్నారు. 18 మంది మృతి చెందగా, పైలట్ కెపె్టన్ ఎంఆర్ షాక్యా తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. రన్‌వే దక్షిణం వైపు నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా, రెక్కల కొన భూమిని తాకడంతో ఒక్కసారిగా పలీ్టలు కొట్టింది. దీంతో వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి.మంచు కారణంగా... ఈ సంవత్సరం బ్రెజిల్ విమానయాన సంస్థకు చెందిన వోపాస్ 2283, ఏటీఆర్ 72 ట్విన్ఇంజన్ టర్బోప్రాప్ ఆగస్టు 9న కూలిపోయింది. 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సావోపాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన విమానం.. సావోపావో సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారంతా మరణించారు. విమాన ప్రమాదానికి మంచు కారణమని తేలింది. పండుగ రోజున ప్రమాదం.. ఇటీవలే.. క్రిస్మస్ పర్వదినాన అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి ప్రమాదం జరిగింది. అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బాకు నుంచి రష్యాలోని గ్రోజీ్నకి వెళ్తుండగా కాస్పియన్ సముద్ర సమీపంలో కూలిపోయింది. విమానంలో 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉండగా 38 మంది మరణించారు. ఉక్రెయిన్ వరుస డ్రోన్ దాడులను తిప్పికొడుతున్న రష్యా వైమానిక రక్షణ దళాలు విమానాన్ని కూలి్చవేశాయని రష్యా అంగీకరించింది. దాడి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్ క్షమాపణ చెప్పారు. వీడని మిస్టరీ.. చైనాలో జరిగిన అత్యంత విషాద ఘటనల్లో ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎంయూ 5735 కుప్పకూలడం ఒకటి. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737–800.. 2022 మార్చి 21న దక్షిణ చైనాలోని పర్వతాల్లో కూలిపోయింది. ప్రయాణికులు, సిబ్బంది సహా విమానంలో ఉన్న 132 మంది మరణించారు. విమానం ఎత్తునుంచి కిందికి దించే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తాత్కాలిక దర్యాప్తులో తేల్చారు. విమానం వేగంగా, ఉద్దేశపూర్వకంగా ల్యాండ్ చేసినట్లు బ్లాక్ బాక్స్ డేటా వెల్లడించింది. ఈ ప్రమాదం యాంత్రిక వైఫల్యమా, మానవ తప్పిదమా అనే విషయంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఈ విపత్తుకు అసలు కారణం మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సౌత్ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి
-
సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదం
-
179 ప్రాణాలు బుగ్గిపాలు
సియోల్: దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఏకంగా 179 మంది ప్రయాణికులు నిస్సహాయంగా మంటల్లో చిక్కి మాంసపు ముద్దలుగా మారిపోయారు. ఆదివారం ఉదయం 9.03 గంటలకు థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుంచి వచ్చిన జెజూ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737–800 విమానం ముయాన్ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై దిగుతూ అదుపు తప్పింది. విమానాశ్రయ రక్షణ గోడను ఢీకొట్టి పేలిపోయింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా ఇద్దరు మినహా అంతా దుర్మరణం పాలయ్యారు. ఇప్పటిదాకా గుర్తించిన మృతుల్లో 85 మంది మహిళలు కాగా 84 మంది పురుషులు. మరో 10 మందిని గుర్తించాల్సి ఉంది. మహిళలో, పురుషులో కూడా గుర్తించలేనంతగా మృతదేహాలు కాలిపోయాయని సహాయక సిబ్బంది చెప్పారు. విమానం మంటల్లో చిక్కగానే సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నించారు. ప్రాణాలతో ఉన్న ఇద్దరిని బయటకు లాగారు. వారిని విమాన సిబ్బందిగా గుర్తించారు. మిగతా ప్రయాణికులంతా ప్రమాదంలోనే కన్నుమూశారు. వారిలో అత్యధికులు దక్షిణకొరియా పౌరులే. ఇద్దరు మాత్రం థాయ్‌లాండ్ జాతీయులని తేలింది. రాజధాని సియోల్‌కు దక్షిణంగా 290 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం బారిన పడ్డ బోయింగ్ 737–800 విమానం 15 ఏళ్ల నాటిది. ల్యాండింగ్ గేర్ వైఫల్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఇదొకటి. తెరుచుకోని ల్యాండింగ్ గేర్ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ సమయంలో విమానం ల్యాండింగ్ గేర్ మూసే ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో వేగంగా దూసుకొచి్చన విమానం రన్‌వేపై దిగుతూనే అదుపు తప్పింది. అడ్డంగా దూసుకెళ్లి విమానం ముందుభాగం రక్షణ గోడను ఢీకొంది. అప్పటికీ వేగం పూర్తిగా తగ్గక మరికొంత ముందుకు దూసుకెళ్లింది. ఆ ఒత్తిడికి ఇంధనానికి మంటలు అంటుకుని ఉవ్వెతున ఎగిశాయి. చూస్తుండగానే విమానం పేలిపోయి భారీగా మంటలు, దట్టమైన పొగ వెలువడ్డాయి. విమానం పూర్తిగా ధ్వంసమైందని, కేవలం తోక భాగం మాత్రమే గుర్తించగల స్థితిలో ఉందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. 32 అగ్నిమాపక యంత్రాలు, హెలికాప్టర్ల సాయంతో 1,570 మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, సైనికులు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంపై పోప్ ఫ్రాన్సిస్, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, థాయ్‌లాండ్ ప్రధాని పెటాంగ్‌తర్న్ షినవత్ర తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు జెజూ ఎయిర్ సంస్థ క్షమాపణ తెలిపింది. పక్షి వల్లే ప్రమాదమా? ల్యాండింగ్‌కు కాసేపటి ముందు పైలట్‌కు టవర్ సిబ్బంది బర్డ్ స్ట్రైక్ వార్నింగ్ ఇచ్చారని దక్షిణ కొరియా రవాణా శాఖ వెల్లడించింది. ‘‘ప్రమాదానికి ముందు విమాన పైలట్, ఎయిర్‌పోర్టు కంట్రోల్ టవర్ మధ్య సంభాషణను విశ్లేషించాం. విమానాన్ని పక్షి ఢీకొట్టేలా ఉండటంతో మరో రన్‌వేపై దిగడానికి అనుమతిచ్చారు. అక్కడ దిగలేని పరిస్థితి ఉందంటూ పైలట్ సిగ్నల్ ఇచ్చాడు. తర్వాత క్షణాల వ్యవధిలోనే విమానం రన్‌వే చివరి భాగంలో దిగి అదుపు తప్పింది’’ అని తెలియజేసింది. ప్రమాదానికి అసలు కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. బ్లాక్ బాక్స్ డేటాను సేకరించి విశ్లేషణకు పంపారు. దర్యాప్తు పూర్తవడానికి కొన్ని నెలలు పడుతుందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన రన్‌వేను జనవరి 1వ తేదీ దాకా మూసేశారు.త్రుటిలో తప్పిన మరో మూడు ప్రమాదాలు కెనడాలో విమానానికి మంటలు నార్వేలో అదుపు తప్పిన విమానం నేపాల్‌లో హెలికాప్టర్‌ను ఢీకొన్న పక్షి ఒట్టావా/ఓస్లో/కఠ్మాండు: దక్షిణ కొరియా ప్రమాదం జరిగిన కాసేపటికే ఆదివారం మరో రెండు భారీ విమాన ప్రమాదాలు త్రుటిలో తప్పాయి. కెనడాలో సెయింట్ జాన్స్ నుంచి వస్తున్న ఎయిర్ కెనడా 2259 విమానం హలిఫాక్స్ విమానాశ్రయంలో రన్‌వేపై దిగుతూ అదుపు తప్పింది. దాంతో విమానానికి మంటలంటుకున్నాయి! అదృష్టవశాత్తూ ప్రాణనష్టం వాటిల్లలేదు. ఒక టైర్ పూర్తిగా తెరుచుకోకపోవడంతో రన్‌వేపై దిగగానే విమానం అదుపు తప్పి 20 డిగ్రీల కోణంలో ఎడమకు వాలి అలాగే దూసుకెళ్లింది. దాంతో మంటలు అంటుకుని విమానం ఎడమ భాగం కాలిపోయింది. పెద్ద శబ్దం వినిపించింది. పైలట్ చాకచాక్యంగా విమానాన్ని ఆపగలిగాడు. వెంటనే సహాయక సిబ్బంది ప్రయాణికులను హుటాహుటిన బయటకు తీసుకొచ్చారు. నార్వేలో కూడా ఓ విమానం అత్యవసరంగా ల్యాండవుతూ అదుపు తప్పింది. ఓస్లో నుంచి నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డామ్కు బయల్దేరిన కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737–800 టేకాఫయిన కాసేపటికే హైడ్రాలిక్ విఫలమైంది. దాంతో ఓస్లోకు 110 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా అదుపు తప్పి రన్‌వేను తాకి దట్టమైన గడ్డిలోకి వెళ్లి ఆగింది. విమానంలోని 182 మందినీ వెంటనే భద్రంగా బయటకు తీసుకొచ్చారు. నేపాల్‌లో ఎవరెస్ట్ శిఖరం సమీపంలోని బేస్ లుక్లా నుంచి ఆదివారం ఐదుగురు అమెరికన్లతో బయల్దేరిన హెలికాప్టర్‌ను పక్షి ఢీకొంది. దాంతో సురక్షితంగా బనెపాలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. -
తాత్కాలిక అధ్యక్షుడికీ తప్పని అభిశంసన
సియోల్: దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. దేశ తాత్కాలిక అధ్యక్షుడు హన్ డక్–సూపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని ప్రతిపక్షం మెజారిటీ కలిగిన నేషనల్ అసెంబ్లీ శుక్రవారం ఆమోదించింది. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో అనూహ్యంగా మార్షల్ లా విధించడం, అనంతర పరిణామాల్లో ఆయన్ను నేషనల్ అసెంబ్లీ అభిశంసించడం తెలిసిందే. తాజాగా తాత్కాలిక అధ్యక్షుడు హన్ను నేషనల్ అసెంబ్లీ అభిశంసించిన నేపథ్యంలో ఆయనకు ఇకపై ఎలాంటి అధికారాలు, విధులు ఉండవు. పదవిలో కొనసాగించాలా లేదా దించేయాలా అనే విషయాన్ని రాజ్యాంగ న్యాయస్థానం తేల్చేదాకా ఇదే పరిస్థితి కొనసాగనుంది. యూన్ అభిశంసన అంశం ఇప్పటికే రాజ్యాంగ న్యాయస్థానం పరిశీలనలో ఉండటం తెలిసిందే. అధ్యక్షుడు, తాత్కాలిక అధ్యక్షుడి అభిశంసనలు దేశంలో రాజకీయపరమైన అయోమయాన్ని మరింత పెంచాయి. ఆర్థిక అనిశ్చితి ఫలితంగా అంతర్జాతీయంగా దక్షిణ కొరియా ప్రతిష్ట దెబ్బతిననుంది. -
దక్షిణ కొరియా అధ్యక్షుని అభిశంసన
సియోల్: ఎమర్జెన్సీ ప్రకటించినందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పర్యవసానాన్ని అనుభవించారు. ఆయనపై విపక్షాలు ప్రవేశపెట్టిన రెండో అభిశంసన తీర్మానం శనివారం పార్లమెంటు అమోదం పొందింది. 300 మంది సభ్యుల్లో అభిశంసన తీర్మానం నెగ్గాలంటే 200 ఓట్లు రావాల్సి ఉండగా 204 మంది ఓటేశారు. 85 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో యోల్ పదవీచ్యుతుడయ్యారు. ప్రధాని హాన్ డక్ సో తాత్కాలిక దేశాధినేతగా వ్యవహరించనున్నారు. యోల్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలా, పూర్తిగా తొలగించాలా అన్నది రాజ్యాంగ న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఇందుకు ఆర్నెల్లు పట్టవచ్చు. తొలగించే పక్షంలో 60 రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. పీపుల్ పవర్ పార్టీ సభ్యుల గైర్హాజరీతో గత శనివారం తొలి అభిశంసన తీర్మానం నుంచి ఆయన గట్టెక్కారు. ఈసారి మాత్రం ఆయన సొంత పార్టీ సభ్యుల్లో పలువురు అభిశంసన తీర్మానం ఆమోదం పొందడానికి సహకరించారు. ఇది దక్షిణ కొరియా ప్రజలకు, ప్రజాస్వామ్యానికి దక్కిన విజయమని విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఫ్లోర్ లీడర్ పార్క్ చాన్ డే అన్నారు. ఫలితాలపై యోల్ స్పందించలేదు. పాలనపై కోల్పోతున్న పట్టును నిలుపుకునేందుకు ఆయన ఇటీవల అనూహ్యంగా ‘మార్షల్ లా’ ప్రకటించడం, గంటల్లోనే పార్లమెంటు దాన్ని ఎత్తేయడం తెలిసిందే. యోల్, ఆయన భార్య, కుటుంబీకులు, సన్నిహితులపై భారీ అవినీతి ఆరోపణలున్నాయి. తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ప్రధాని హాన్ డక్–సో సాంకేతిక నిపుణుడు. పారీ్టలకతీతంగా వైవిధ్యమైన కెరీర్ ఆయనది. పాలనాపరంగా విస్తృతమైన అనుభవముంది. ఐదుగురు వేర్వేరు అధ్యక్షుల ఆధ్వర్యంలో మూడు దశాబ్దాలకు పైగా నాయకత్వ పదవుల్లో పనిచేశారు. -
దక్షిణ కొరియాలో రోజురోజుకూ ముదురుతున్న సంక్షోభం
-
అండర్‌వేర్‌తో మాజీమంత్రి ఆత్మహత్యాయత్నం!
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పోలీసుల సోదాలు కొనసాగుతున్నవేళ.. రక్షణ శాఖ మాజీ మంత్రి కిమ్ యోంగ్ హైయున్ అండర్‌వేర్‌తో ఆత్మహత్యాయత్నం చేశారు. విచారణ అధికారుల అదుపులో ఉన్న ఆయన.. కారాగారంలోనే ఈ ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.కిమ్ యోంగ్ హైయున్.. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు అత్యంత సన్నిహితుడు. సైనిక పాలన విధింపు ప్రకటన వెనుక ఈయన ప్రమేయమే ఉందనేది ప్రధాన ఆరోపణ. ఈ అభియోగంపై ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే సరిగ్గా అరెస్ట్‌కు ముందు బాత్రూంకు వెళ్లిన ఆయన.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో అధికారులు తలుపులు బద్ధలు కొట్టి చూశారు.అండర్‌వేర్‌తో ఆయన ఉరివేసుకునే ప్రయత్నం చేయగా.. అధికారులు నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని న్యాయ శాఖ తాజాగా పార్లమెంట్‌కు నివేదించింది.South Korean ex-defense minister Kim Yong-hyun Wednesday attempted suicide at detention facility, Yonhap news agency reported, citing a correction official. #SouthKorea https://t.co/QbHxSw64PA https://t.co/3Mat8pNHh2— 贺亮 (@HeLiang74893) December 11, 2024సైనిక పాలనపై నిర్వహించిన ఓటింగ్‌కు చట్ట సభ్యులు హాజరుకాకుండా వాళ్ల మీదకు భద్రతా బలగాలను ప్రయోగించాడనే అభియోగమూ ఉంది.దక్షిణ కొరియా డిసెంబర్ 3వ తేదీన ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ హఠాత్తుగా టీవీ ఛానెల్స్ ముందు ప్రత్యక్షమై.. అత్యవసర సైనిక పాలన ప్రకటన చేశారు. ప్రతిపక్షాలు దాయాది దేశం ఉత్తర కొరియాతో చేతులు కలిపి కుట్రలకు తెర తీశాయని, అందుకే పరిస్థితి అదుపు తప్పకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే దేశంలో అలజడి రేగింది. మరోపక్క.. ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షంలోని చట్ట సభ్యులూ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సంక్షోభం తలెత్తే ప్రమాదంతో.. చేసేది లేక కొన్నిగంటల తర్వాత ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంటూ ఆయన దేశానికి క్షమాపణలు చెప్పారు.అయితే ఈ అంశంపై ప్రత్యేక మండలి విచారణ జరపనుంది. ఈ మేరకు మంగళవారం చట్ట సభ్యులంతా ఆ కౌన్సిల్‌కు అనుమతులు జారీ చేశారు. సైనిక పాలన విధింపు ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడనేది యూన్‌పై అభియోగం. అది గనుక రుజువైతే.. ఆయనకు మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: తప్పైంది.. నన్ను క్షమించండి -
దక్షిణ కొరియాలో ట్విస్ట్.. అధ్యక్ష ఆఫీసులో పోలీసుల సోదాలు
సియోల్: దక్షిణ కొరియాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి సంబంధించిన విషయాలను సేకరించేందుకు పోలీసులు తనిఖీలు చేపట్టినట్టు కొరియన్ టైమ్స్ తెలిపింది.వివరాల ప్రకారం.. ఇటీవల దక్షిణ కొరియాలో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. అనంతరం, దేశవ్యాప్తంగా రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలో ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్టు యూన్ మరో ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు యూన్‌పై దక్షిణ కొరియా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే అధ్యక్ష కార్యాలయంలో.. నేడు సియోల్ మెట్రోపాలిటన్ పోలీసులు, నేషనల్ అసెంబ్లీ పోలీస్ గార్డ్స్ సోదాలు చేశారు. అయితే, అధ్యక్ష కార్యాలయంపై పోలీసులు సోదాలు చేసిన సమయంలో యూన్ ఆఫీసులో లేరని కొరియన్ టైమ్స్ వెల్లడించింది.ఇక, అంతకుముందు.. అంతకుముందు డిసెంబర్ 9న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించారు. ఆయనపై దర్యాప్తు ప్రారంభించినందుకు గానూ అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. మరోవైపు.. ఎమర్జెన్సీ ప్రకటనలో మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ పాత్ర ఉందనే ఆనుమానంతో ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ఐసిస్ ఉగ్రభూతం మళ్లీ విజృంభిస్తుందా?ఇక, మార్షల్ లా ప్రకటన నేపథ్యంలో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, కిమ్ యోంగ్ హ్యూన్లను పదవుల నుంచి తప్పించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలోనే హ్యూన్‌ను పదవి నుంచి తప్పిస్తున్నట్లు దేశాధ్యక్షుడే ప్రకటించారు. ఆయన స్థానంలో చోయ్ బ్యూంగ్ హ్యూక్‌ను నియమించారు. South Korean police raided President Yoon Suk Yeol's office and police headquarters on Wednesday as part of an investigation into the brief imposition of martial law, the Yonhap news agency reported.Raids were also carried out at the offices of the Seoul Metropolitan Police. pic.twitter.com/G5yLytJWJy— VIVERO del bosque (@viverodelbosque) December 11, 2024 -
దక్షిణ కొరియాలో ‘మార్షల్ లా’ అంశం.. మాజీ రక్షణ మంత్రి అరెస్ట్
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు దేశంలో ఎమర్జెన్సీ విధించాలంటూ సిఫారసు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఆయన్ను ప్రశ్నించిన అధికారులు గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, కిమ్ తనకుతానుగానే సియోల్ విచారణాధికారి కార్యాలయానికి వెళ్లారని, ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు అరెస్ట్ చేశారని మీడియా అంటోంది. కిమ్ కార్యాలయంతోపాటు నివాసంలోనూ తనిఖీలు చేపట్టారని చెబుతున్నారు. ఎమర్జెన్సీ విధింపునకు దారి తీసిన పరిస్థితులపై కిమ్‌పై విచారణ కోసం 62 మంది సభ్యుల దర్యాప్తు బృందం ఏర్పాటైందని సీనియర్ ప్రాసిక్యూటర్ పార్క్ సె–హ్యూన్ వెల్లడించారు. గత వారం స్వల్ప కాల ఎమర్జెన్సీని, ఆ తర్వాత పార్లమెంట్ తొలగించడం తెలిసిందే. ఈ పరిణామానికి సంబంధించిన తొలి అరెస్ట్ ఇది. అధ్యక్షుడు యూన్‌పై శనివారం ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం అధికార పక్ష సభ్యుల గైర్హాజరుతో వీగిపోయింది. అయినప్పటికీ, త్వరలోనే మరోసారి అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్షాలు అంటున్నాయి. మొత్తం పరిణామాలకు కేంద్ర బిందువుగా భావిస్తున్న కిమ్ మంత్రి పదవికి గురువారమే రాజీనామా చేశారు.ఇదీ చదవండి: దక్షిణ కొరియా అధ్యక్షుడికి ఉపశమనం -
నన్ను క్షమించండి: సౌత్‌కొరియా అధ్యక్షుడు
సియోల్:దేశంలో ఎమర్జెన్సీ విధించినందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు పశ్చాత్తాపపడ్డారు. ‘తల వంచి అడుగుతున్నాను. నన్ను క్షమించండి..మరోసారి దేశంలో ఎమర్జెన్సీ విధించను’అని యూన్ సుక్ యోల్ దేశ ప్రజలను విజ్ఞప్తి చేశారు. మార్షల్ లా విధించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించానని యోల్ తన తప్పు ఒప్పుకున్నారు.ప్రభుత్వ పెద్దగా ఉన్న బాధ్యతతోనే ఎమర్జెన్సీ విధించానని వివరణ ఇచ్చుకున్నారు. ఎమర్జెన్సీ విధించినందుకు న్యాయపరమైన విచారణ ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇక నుంచి దేశ భవిష్యత్తు, తన భవిష్యత్తు తన పార్టీ నిర్ణయానికి వదిలేస్తున్నాన్నారు. దేశాన్ని పాలన విషయాన్ని తనపార్టీ, ప్రభుత్వం చూసుకుంటాయని తెలిపారు. ఇలాంటి తప్పు మరోసారి చేయనని యోల్ స్పష్టం చేశారు. యోల్‌పై మోపిన అభిశంసన తీర్మానంపై శనివారం దక్షిణ కొరియా పార్లమెంట్లో ఓటింగ్ జరగనుంది. ఈ ఓటింగ్‌కు ముందు శనివారం(డిసెంబర్ 7) ఓ టెలివిజన్ ఛానల్లో ప్రసంగిస్తూ బహిరంగ క్షమాపణ కోరడం గమనార్హం. ఇదీ చదవండి: నియంతకు పరాభవం -
అభిశంసనలు.. ఆత్మహత్య... జైలు శిక్షలు!
దక్షిణ కొరియాలో తాజాగా ఎమర్జెన్సీ విధింపు తీవ్ర దుమారానికే దారితీసింది. విపక్షాల్లోని ఉత్తర కొరియా అనుకూల దేశద్రోహ శక్తుల ఏరివేత కోసమంటూ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తీసుకున్న నిర్ణయం దేశమంతటా అలజడి రేపింది. విపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచీ దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. విపక్షాలన్నీ కలిసి కొన్ని గంటల్లోనే పార్లమెంటు ఓటింగ్ ద్వారా మార్షల్ లాను ఎత్తేశాయి. దేశంపై సైనిక పాలనను రుద్దజూశారంటూ విపక్ష డెమొక్రటిక్ పార్టీ యూన్‌పై అభిశంసన తీర్మానమూ ప్రవేశపెట్టింది. దాంతో దేశం పెను రాజకీయ సంక్షోభంలో పడింది. అభిశంసనలు, జైలు, హత్యల వంటి మరకలు దక్షిణ కొరియా అధ్యక్ష చరిత్రలో పరిపాటే. నిజానికి ఆ దేశ రాజకీయ చరిత్రంతా తిరుగుబాట్లమయమే!విద్యార్థుల తిరుగుబాటు దక్షిణ కొరియా తొలి అధ్యక్షుడు సింగ్మన్ రీ 1960లో విద్యార్థుల భారీ తిరుగుబాటు దెబ్బకు రాజీనామా చేసి తప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడటంతో యువతలో ఆయనపై ఆగ్రహం పెల్లుబుకింది. దిగిపోవ్సాఇందేనంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. రాజీనామా అనంతరం రీ దేశ బహిష్కరణకు గురయ్యారు. హవాయికి వెళ్లిపోయి 1965లో మరణించేదాకా అక్కడే గడిపాల్సి వచి్చంది.సైనిక తిరుగుబాటు మరో అధ్యక్షుడు యున్ పో సన్ 1961లో సైనికాధికారి పార్క్ చుంగ్ హీ సైనిక తిరుగుబాటు వల్ల పదవీచ్యుతుడయ్యాడు. అయినా యున్‌కు కొంతకాలం పదవిలో కొనసాగేందుకు పార్క్ అనుమతించినా నెమ్మదిగా ప్రభుత్వాన్ని తన అ«దీనంలోకి తెచ్చుకున్నారు. తరవాత 1963 ఎన్నికల్లో నెగ్గి అధికారాన్ని యున్ స్థానంలో అధ్యక్షుడయ్యారు.రాజద్రోహం, జైలు గ్వాంగ్జు తిరుగుబాటును క్రూరంగా అణచివేసిన చున్ డూ హ్వాన్ 1987లో పదవి నుంచి వైదొలిగారు. భారీ నిరసనల ఫలితంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నారు. కొరియా యుద్ధ సమయంలో తన అనుచరుడు రోహ్ టే వూకు అధికారం అప్పగించారు. అనంతరం అవినీతి, హింసతో దేశం కుదేలైంది. దాంతో తిరుగుబాటు ఇతర నేరాల కింద చున్, రోహ్ రాజద్రోహం అభియోగాలను ఎదుర్కొన్నారు. చున్‌కు మరణశిక్ష విధించానా తరవాత జీవిత ఖైదుగా మార్చారు. రోహ్కు ఇరవై రెండున్నరేళ్లు జైలు శిక్ష విధించారు. రెండేళ్ల జైలు శిక్ష నంతరం ఇద్దరికీ 1998లో క్షమాభిక్ష లభించింది.అవినీతి, ఆత్మహత్య 2003 నుంచి 2008 వరకు దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఉన్న రో మూ హ్యూన్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2009లో కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సంపన్న షూ తయారీదారు కంపెనీ నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలు విచారణలో ఉండగానే జీవితాన్ని అంతం చేసుకున్నారు. 15 ఏళ్ల జైలు శిక్ష 2008 నుంచి 2013 దాకా అధ్యక్షునిగా ఉన్న లీ మ్యూంగ్ బాక్కు అవినీతి కేసులో జైలు శిక్ష పడింది. పన్ను ఎగవేత కేసులో దోషిగా తేలిన సామ్సంగ్ సంస్థ చైర్మన్ నుంచి లంచాలు తీసుకున్నట్టు రుజువైంది. దాంతో 2018లో ఆయనకు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ 2022 డిసెంబర్లో ప్రస్తుత అధ్యక్షుడు యూన్ ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించారు! అధ్యక్షురాలికి అభిశంసన, జైలు దక్షిణ కొరియా తొలి అధ్యక్షురాలు పార్క్ గ్యూన్ హై 2016లో అభిశంసన ఎదుర్కొన్నారు. తరవాత జైలు శిక్ష అనుభవించారు. ఆమె మాజీ నియంత పార్క్ చుంగ్ హీ కుమార్తె. 2013 నుంచి పదవిలో ఉన్నారు. సామ్సంగ్ వంటి సంస్థల నుంచి భారీగా లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. రహస్య పత్రాలను లీకేజీ, తనను విమర్శించే కళాకారులను బ్లాక్‌లిస్టులో పెట్టడం, వ్యతిరేకించిన అధికారులను తొలగించడం వంటి ఆరోపణలూ ఉన్నాయి. దాంతో 2017లో పార్క్ అభిశంసనకు గురయ్యారు. అభియోగాలు నిర్ధారణవడంతో 2021లో 20 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా పడ్డాయి. కానీ అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఆమెకు క్షమాభిక్ష పెట్టారు. ఆ సమయంలో సియోల్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నది ప్రస్తుత అధ్యక్షుడు యూన్ కావడం విశేషం. పార్క్ తొలగింపు, జైలు శిక్ష విధింపులో ఆయనదే కీలక పాత్ర. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నియంతకు పరాభవం
‘ప్రభుత్వం ప్రజలకు భయపడినంతకాలం స్వేచ్ఛ ఉంటుంది...ప్రజలు ప్రభుత్వానికి భయపడితే నియంతృత్వం తప్పదు’ అని ఒక రాజనీతిజ్ఞుడు అంటాడు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సెక్–యోల్ మంగళవారం హఠాత్తుగా దేశంలో విధించిన సైనికపాలన కాస్తా జనం తిరగబడేసరికి కేవలం ఆరు గంటల్లో తోకముడిచిన తీరు దాన్ని మరోసారి అందరికీ గుర్తుచేసింది. వచ్చే నెలనుంచి డోనాల్డ్ ట్రంప్ ఏలుబడిని చవిచూడబోతున్న అమెరికా ప్రజానీకం మొదలు దేశదేశాల పౌరులూ ఈ ప్రహసనం నుంచి చాలా నేర్చుకోవచ్చు. ‘రాజ్య వ్యతిరేక శక్తుల్ని సాధ్యమైనంత త్వరగా ఏరిపారేసి దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి’ ఎమర్జెన్సీ విధింపు, సైనిక పాలన తప్పనిసరయినట్టు రాత్రి పొద్దుపోయాక యూన్ ప్రకటించారు. పొరుగునున్న శత్రు దేశం ఉత్తరకొరియాకు చెందిన కమ్యూనిస్టు పాలకులతో కుమ్మక్కయిన విపక్షాలు దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నాయని ఆరోపించారు. కానీ రోడ్లపైకొచ్చిన సైనికులకు దేశమంతా ప్రతిఘటన ఎదురవుతున్నట్టు, నిరసనోద్యమాలు తారస్థాయికి చేరినట్టు అందిన సమాచారంతో బెంబేలెత్తిన ఆయన సైనికపాలనను ఎత్తేస్తున్నట్టు తెల్లారుజామున నాలుగుగంటలప్రాంతంలో తెలియజేయాల్సివచ్చింది. పార్లమెంటు భవనంలోకి ప్రవేశించటానికి ప్రయత్నించిన సైనికులను జనం తరిమికొట్టడంతో ఆయనకు తత్వం బోధపడింది. విపక్షం తీసుకురాబోతున్న అవిశ్వాస తీర్మానంతో తనకు పదవీభ్రష్టత్వం తప్పదనుకుని హడావిడిగా వేసిన సైనిక పాలన ఎత్తుగడ కాస్తా వికటించి ఆయన రాజకీయ భవిష్యత్తుకు పూర్తిగా తలుపులు మూసేసింది. 2027 వరకూ ఉండాల్సిన అధ్యక్షపదవి మరికొన్ని రోజుల్లో ఊడటం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మితవాద పీపుల్ పవర్ పార్టీ (పీపీపీ) తరఫున 2022 ఎన్నికల్లో పోటీచేసేనాటికి యూన్ అనామకుడు. అప్పటికి హద్దులు దాటిన ద్రవ్యోల్బణం, ప్రజల్లో ప్రభుత్వంపై ఏర్పడ్డ తీవ్ర అసంతృప్తి ఆసరాగా చేసుకుని ఆయన అధ్యక్షుడిగా విజయం సాధించాడు. అయితే ప్రత్యర్థి డెమాక్రటిక్ పార్టీ అభ్యర్థి లీ జే–మ్యుంగ్ కన్నా ఆయనకు కేవలం ఒక శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. మ్యుంగ్ సఫాయి కార్మికుడి కుమారుడు.సంపన్నవంతమైన దక్షిణ కొరియాకు అసలు సమస్యలేమిటన్న సందేహం అందరికీ వస్తుంది. దాని తలసరి ఆదాయం 36,000 డాలర్లు. పొరుగునున్న చైనాతో పోల్చినా ఇది మూడు రెట్లు అధికం. అంతర్జాతీయ మార్కెట్లో మెరిసిపోయే బ్రాండ్లకు అది పుట్టినిల్లు. శామ్సంగ్, హ్యుందయ్, కియా, పోక్సో, ఎల్జీ, ఎస్కే... ఒకటేమిటి రకరకాల సంస్థల స్థావరం ఆ దేశం. వీటిలో 600 కంపెనీల వరకూ మన దేశంతోసహా చాలా దేశాల్లో వ్యాపారాలు సాగిస్తున్నాయి. దక్షిణ కొరియా ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఎగుమతిదారు. ఆసియాలో అది నాలుగో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ. 2009నాటి ఆర్థికమాంద్యాన్ని దక్షిణకొరియా తన దరిదాపులకు రానీయలేదు. అయినా ఏదో తెలియని వెలితి ప్రజలను నిరాశానిస్పృహల్లో ముంచింది. వృద్ధుల శాతం క్రమేపీ పెరగటం, జననాల సంఖ్య పడిపోవటం సమస్యగా మారింది. అధిక పనిగంటల వల్ల మానసిక ఒత్తిళ్లు అధికం కావటం, పెళ్లిళ్లు వాయిదా వేసుకోవటం, దంపతులు సైతం కలిసుండే గంటలు తగ్గిపోవటం వంటివి ఇందుకు కారణాలు. కానీ యూన్ దీన్ని మరో కోణంలో చూశారు. ఫెమినిస్టు ఉద్యమాలే ఈ స్థితికి కారణమంటున్న ఉద్యమాలను వెనకేసుకొచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా స్త్రీ ద్వేషాన్ని చాటుకున్నారు. అధికారం చేతికి రాగానే లింగ సమానత్వాన్ని పర్యవేక్షించే సంస్థను రద్దుచేశారు. మహిళలకుండే వెసులుబాట్లు కొన్ని రద్దుచేశారు. పైగా వారానికి 52 గంటల పనిని కాస్తా పెంచే ప్రయత్నం చేశారు. వైద్యరంగ ప్రక్షాళన పేరిట దాన్ని అస్తవ్యçస్తం చేశారు. పర్యవసానంగా దేశం సమ్మెలతో హోరెత్తింది. దీనికితోడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎడాపెడా అవినీతికి పాల్పడ్డారు. కనుకనే మొన్న ఏప్రిల్‌లో 300 స్థానాలుగల నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిపినప్పుడు భారీ స్థాయిలో 67 శాతంమంది పోలింగ్‌లో పాల్గొన్నారు. విపక్షమైన డెమాక్రటిక్ పార్టీకి 180 స్థానాలు రాగా, అధికారపక్షం 108 స్థానాలకు పరిమితమైంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై కూడా గత సైనిక పాలకుల్ని కీర్తించటం యూన్ ఒక అలవాటుగా చేసుకున్నారు. వారివల్లే దేశ ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉన్నదని ఆయన నిశ్చితాభిప్రాయం. ఇందుకు భిన్నంగా ప్రజలంతా ఆనాటి నియంతృత్వాన్ని మరిచిపోలేకపోయారు. 1987కు ముందున్న సైనిక పాలన తెచ్చిన అగచాట్లు గుర్తుండబట్టే యూన్ ప్రకటన వెలువడిన వెంటనే జనం వరదలై పోటెత్తారు. ప్రజల మద్దతు గమనించినందు వల్లే అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంటుకు బారులు తీరారు. ప్రధానద్వారాన్ని సైనికులు మూసేయగా జనం సాయంతో స్పీకర్‌తో సహా అందరూ గోడలు దూకి, కిటికీలు బద్దలుకొట్టి భవనంలోకి ప్రవేశించారు. సైనిక పాలన వెనక్కు తీసుకోవాలంటూ అధ్యక్షుణ్ణి కోరే తీర్మానాన్ని హాజరైన 190మంది ఎంపీలు ఏకగ్రీవంగా ఆమోదించారు. శత్రు దేశాలను చూపించి, కమ్యూనిస్టుల పేరు చెప్పి ఇష్టారాజ్యంగా ప్రవర్తించే శకం ముగిసిందని దక్షిణ కొరియా ఉదంతం చెబుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలుండటం తప్పనిసరి. కానీ వాటిని సాకుగా చూపి అందరినీ మభ్యపెట్టి అధికారంలోకొచ్చాక నియంతృత్వ పోకడలకు పోతే చెల్లదని జనం చాటారు. యూన్ ఏలుబడి ఎప్పుడు ముగుస్తుందన్న సంగతి అలావుంచితే, ప్రజలు ఇదే చైతన్యాన్ని కొనసాగించగలిగితే భవిష్యత్తులో అక్కడ ఏ పాలకుడూ నియంతగా మారే ప్రమాదం ఉండదు. -
పాక్ పరువు తీసిన ‘మార్షల్ లా’కు అంత పవర్ ఉందా?
రాజకీయాలపై ఆసక్తి కలిగినవారికి ప్రపంచ రాజకీయ చిత్రం ప్రతిరోజూ కొత్తగా కనిపిస్తుంది. తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్ ఉన్నట్టుండి ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రపంచమంతా ఉలిక్కిపడింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కలకలం చెలరేగింది. అయితే ఇంతలోనే అక్కడి పార్లమెంట్లో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో దానిని రద్దు చేయాల్సి వచ్చింది.చర్చనీయాంశంగా మారి..1980 తర్వాత దక్షిణ కొరియాలో మార్షల్ లా(సైనిక పాలన) విధించడం ఇదే తొలిసారి. ఈ నేపధ్యంలో మరోసారి మార్షల్ లా చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ ఈ మార్షల్ లా చట్టాన్ని తరచూ అమలు చేసి, అపఖ్యాతి పాలయ్యింది. ఇంతకీ మార్షల్ లా అంటే ఏమిటి? అ చట్టాన్ని అమలు చేసినప్పుడు దేశంలోని పరిస్థితులు ఎలా ఉంటాయి?శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించినప్పుడు..నిజానికి మార్షల్ లా అంటే దేశ అధికారమంతా సైన్యం చేతుల్లోకి వెళ్లడం. దేశంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించినప్పుడు దీనిని అమలు చేస్తారు. ఇది దేశంలోని ఒక నిర్దిష్ట ప్రాంతానికి లేదా దేశమంతటికీ వర్తించవచ్చు. ఇది అమలైనప్పుడు పౌర పరిపాలన ముగుస్తుంది. శాంతి భద్రతల నుండి న్యాయ వ్యవస్థ వరకు సర్వం సైన్యం నియంత్రణలోకి వస్తుంది. అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్న సైన్యం అవసరమని భావించిన పక్షంలో ప్రధానిని ఉరితీసే దిశగా కూడా యోచించేందుకు ఈ చట్టంలో అవకాశాలున్నాయి. ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ పర్యవేక్షణలో..ప్రజలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైన పరిస్థితుల్లో మార్షల్ లా వర్తిస్తుంది. ఇది యుద్ధం, తిరుగుబాటు లేదా పెద్ద ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో సంభవించవచ్చు. మార్షల్ లా అమలైనప్పుడు సైన్యం ఒక ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది న్యాయపరమైన నిర్ణయాలను తీసుకుంటుంది. పాకిస్తాన్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు మార్షల్ లా ప్రయోగించడం ఆనవాయితీగా మారింది.పాక్‌లో నాలుగు సార్లు మార్షల్ లా పాకిస్తాన్లో ఇప్పటి వరకు ఇక్కడ నాలుగు సార్లు మార్షల్ లా విధించారు. 1958లో మొదటిసారిగా, దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పటినప్పుడు నాటి అధ్యక్షుడు ఇస్కందర్ మీర్జా మార్షల్ లా విధించారు. అనంతరం మిలటరీ జనరల్ అయూబ్ ఖాన్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. తదనంతర కాలంలో దేశంలో సైనిక, రాజకీయ శక్తుల మధ్య విభేదాలు మొదలయ్యాయి.అడుగంటిన సామాన్యుల స్వేచ్ఛ1977, జూలై 5 న జనరల్ జియా-ఉల్-హక్ పాకిస్తాన్లో మార్షల్ లా విధించి, అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వాన్ని పడగొట్టాడు. జియా దేశ జాతీయ అసెంబ్లీని రద్దు చేసి, తనను తాను అత్యున్నత పాలకునిగా ప్రకటించుకున్నాడు. రాజకీయ అస్థిరతతో పాటు సామాన్యుల స్వేచ్ఛ కూడా అడుగంటిపోవడంతో నాడు పాకిస్తాన్ గడ్డు రోజులను ఎదుర్కొంది. 1999లో పాకిస్తాన్లో మరోమారు మార్షల్ లా విధించారు. అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను తొలగించి, జనరల్ పర్వేజ్ ముషారఫ్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈసారి కూడా రాజకీయ అస్థిరతను నెపంగా చూపారు. ఇతని పాలనలో సైనిక నియంతృత్వ పోకడ చాలా కాలం పాటు దేశంపై కొనసాగింది.జర్మన్, జపాన్లలో..మరికొన్ని దేశాలలోనూ మార్షల్ లా అమలయ్యింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, జర్మన్, జపాన్లలో సైన్యం పాలనను చేపట్టింది. ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో శ్రీలంకలో, యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో మార్షల్ లా విధించారు. అయితే పదే పదే మార్షల్ లా అమలు చేస్తూ పాకిస్తాన్ అపఖ్యాతి పాలైంది. ఈ చట్టం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంతగా నిర్వీర్యం చేస్తుందో పదే పదే మార్షల్ లా విధించడం చూస్తే అర్థమవుతుంది. మార్షల్ లా అమలు చేసేముందు పర్యవసానంగా వచ్చే దీర్ఘకాలిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఇటీవల దక్షిణ కొరియా నిర్ణయం ద్వారా స్పష్టమైంది.ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే.. -
దక్షిణ కొరియాలో పొలిటికల్ ట్విస్ట్.. కీలక మంత్రి రాజీనామా
సియోల్: దక్షిణ కొరియా రాజకీయంలో కొత్త ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్న ప్రకటించి.. అనంతరం విరమించుకోవడంతో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇక, దక్షిణ కొరియా రక్షణ మంత్రి కిమ్ యోంగ్-హ్యూన్ తాజాగా రాజీనామా చేశారు. అనంతరం, అధ్యక్షుడు.. కిమ్ రాజీనామాను ఆమోదించారు. వెంటనే.. సౌదీ అరేబియాలోని రాయబారి చోయ్ బ్యూంగ్-హ్యూక్‌ను కొత్త మంత్రి అభ్యర్థిగా నామినేట్ చేశారు. ఈ మేరకు అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగానే ఆయన రాజీనామా చేసినట్టు చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన వెంటనే అక్కడ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై ఆ దేశ పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఇది గట్టెక్కాలంటే పార్లమెంటులో మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం. కనీసం ఆరుగురు రాజ్యాంగ న్యాయమూర్తులు దీనికి అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. దక్షిణకొరియా పార్లమెంట్లో 300 మంది సభ్యులు ఉన్నారు. ఒకవేళ అధ్యక్షుడు అభిశంసనను గట్టెక్కాలంటే 200 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ తీర్మానాన్ని శుక్రవారం లోపు ఓటింగ్‌కు తీసుకురావచ్చని డెమోక్రటిక్ పార్టీ శాసనసభ్యుడు కిమ్ యోంగ్-మిన్ పేర్కొన్నారు.