చైనా సహా ఆసియా దేశాలకు సవాలు
ఇటు జనాభా క్షీణిస్తోంది. అటు వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చైనా సహా అనేక దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లివి. పెళ్లికి, పిల్లలను కనేందుకు యువతరం పెద్దగా ఇష్టపడటం లేదు. కాస్త అటూ ఇటుగా ప్రపంచమంతటా ఇదే ధోరణి పెరుగుతోంది. దాంతో ఏ దేశంలో చూసి నా జనాభా క్రమంగా తగ్గుతోంది. 2024లో చైనా జనాభా 10.4 లక్షలు తగ్గింది. అక్కడ జనాభా తగ్గడం వరుసగా ఇది మూడో ఏడాది. జపాన్‌లోనైతే 15 ఏళ్లుగా జనాభా వరుసగా తగ్గుము ఖం పడుతోంది.
దక్షిణ కొరియాలో 2023లో కాస్త పుంజుకున్న జనాభా ఈ ఏడాది మళ్లీ తగ్గింది. ఇటలీలో జననాల సంఖ్య 19వ శతాబ్దం తరవాత తొలిసారి 4 లక్షల కంటే తక్కువకు పడిపోయింది. 63 దేశాలు, భూభాగాల్లో జనాభా ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరిందని ఐరాస అంచనా. వచ్చే 30 ఏళ్లలో మరో 48 దేశాలు ఆ స్థాయికి చేరతాయని సంస్థ పేర్కొంది. 60 ఏళ్లలో ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుతుందని, అక్కడినుంచి క్షీణించడం మొదలవుతుందని అభిప్రాయపడింది.
చైనాలో రిటైర్మెంట్ వయసు పెంపు
మరోవైపు ఆరోగ్య సంరక్షణ, మెరుగైన జీవనశైలి, ఆయుర్దాయం పెరుగుదల తదితరాలతో చాలా దేశాల్లో వృద్ధుల జనాభా నానాటికీ పెరిగిపోతోంది. చైనాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దాంతో ఆర్థిక వృద్ధి దెబ్బ తింటోంది. ఈ సమస్యను అధిగమించేందుకు చైనా నానా ప్రయత్నాలు చేస్తోంది. పురుషుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 63 ఏళ్లకు పెంచింది.
ఫ్యాక్టరీ, బ్లూ కాలర్ ఉద్యోగాల్లో మహిళలకు 50 నుంచి 55కు, వైట్–కాలర్ ఉద్యోగాల్లో 55 నుంచి 58కు పెంచింది. 2022 నుంచి చైనాలో జనాభా తగ్గుముఖం పట్టడం మొదలైంది. దాంతో అత్యధిక జనాభా రికార్డును 2023లోనే భారత్‌కు కోల్పోయింది. ఒకే సంతానం నిబంధనను సడలించి ముగ్గురిని కనేందుకు అనుమతించినా లాభం లేకపోయింది. 140 కోట్లున్న చైనా జనాభా 2050 నాటికి 130 కోట్లకు తగ్గుతుందని అంచనా.
ఇటలీదీ అదే వ్యథ...
ఇటలీలో కూడా జనాభా నానాటికీ తగ్గిపోతోంది. 2023లో 5.94 కోట్లుండగా 2024 చివరికి 5.93 లక్షలకు తగ్గింది. 2008లో 5.77 లక్షలున్న వార్షిక జననాల సంఖ్య 2023 నాటికి ఏకంగా 3.8 లక్షలకు పడిపోయింది! ఇటలీ ఏకీకరణ తరువాత జననాల సంఖ్య క్షీణించడం అదే తొలిసారి! పిల్లల సంరక్షణ ఖరీదైన వ్యవహారంగా మారడం, తక్కువ జీతాలు, వృద్ధ తల్లిదండ్రులను చూసుకునే సంప్రదాయం వంటివి ఇటాలియన్లకు భారంగా మారుతు న్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎక్కువ మంది పిల్లలను కనాల్సిందిగా పోప్ కూడా ఇటీవలే ఇటాలియన్లకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా 2033 కల్లా ఏటా కనీసం 5 లక్షల జననాలే లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా నిరోధించడానికి జనాభా అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. దక్షిణ కొరియాలో విదేశీయుల రాక పుణ్యమా అని 2023లో జనాభా పుంజుకుంది.
నిజానికి అధిక పోటీ విద్యా విధానంలో పిల్లలను పెంచడానికి అధిక ఖర్చు, మహిళలే శిశు సంరక్షణ చేపట్టా లనే ధోరణి వల్ల అక్కడ కొన్నేళ్లుగా జనాభా తగ్గుతోంది. వర్కింగ్ వీసా ప్రోగ్రాం పొడిగింపు వల్ల విదేశీ నివాసి తుల సంఖ్య 10% పెరిగి 10.9 లక్షలకు చేరింది. ఫలితంగా జనాభాలో కాస్త పెరుగుదల నమోదై 5.18 కోట్లకు చేరింది. కానీ వీరిలో ఏకంగా 90.5 లక్షల మంది 65, అంతకు మించిన వయసువారే! వృద్ధుల జనాభా పెరగడం కార్మికుల కొరతకు దారి తీస్తోంది.
జపాన్‌లో అలా..
జపాన్ అయితే జనాభా సంక్షోభమే ఎదుర్కొంటోంది! 2008లో 12.8 కోట్లుండగా ప్రస్తుతం 12.5 కోట్లకు పడిపోయింది. జననాల సంఖ్య కూడా బాగా తగ్గుతోంది. యువత పెళ్లి, పిల్లలను కనడంపై తీవ్ర విముఖత చూపుతుండటం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. ఉద్యోగావకాశాల లేమి, జీవన వ్యయానికి తగ్గ వేతనాలు లేకపోవడం, కార్పొరేట్ సంస్కృతి పనిచేసే మహిళలు పని చేసేందుకు అనుకూలంగా లేకపోవడం వంటివి సమస్యను మరింత పెంచుతున్నాయి. 2070 నాటికి జపాన్ జనాభా 8.7 కోట్లకు పడిపోతుందని అంచనా. జనాభా సమస్యకు తోడు వృద్ధుల సంఖ్య కూడా జపాన్‌ను కలవరపరుస్తోంది. అక్కడ ప్రతి 10 మందిలో నలుగురు వృద్ధులే!
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment