
సరికొత్త ఫ్యూచర్ కారు ‘మోడల్ జీరో’ను అభివృద్ధి చేస్తున్న అమెరికా సంస్థ
నిట్టనిలువుగా టేకాఫ్ అయి ఎగురుతూ వెళ్లగలగడం ప్రత్యేకత
కాలిఫోర్నియాలో ఓ రోడ్డుపై చేపట్టిన ప్రయోగం విజయవంతం
ఇప్పటికే ప్రీ బుకింగ్‌లు మొదలు.. ధర రూ. 2.57 కోట్లు
భవిష్యత్తులో ఉత్పత్తి పెంచి రూ. 27 లక్షలకే అందిస్తామంటున్న అలెఫ్ ఏరోనాటిక్స్
ట్రాఫిక్‌జామ్‌లకు భయపడి కారును బయటకు తీయాలంటేనే భయపడుతున్నారా? అయితే మీ లాంటి వారి కోసమే ఓ ఎగిరే కారు సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ అనే ఆటోమోటివ్, ఏవియేషన్ సంస్థ సరికొత్త ఫ్యూచర్ కారును అభివృద్ధి చేస్తోంది. రోడ్డుపై రయ్యిమని దూసుకెళ్లగలగడంతోపాటు అవసరమైనప్పుడు అమాంతం పైకి ఎగిరి వెళ్లగల కారును సిద్ధం చేస్తోంది.
తాజాగా మోడల్ జీరో అనే కారును ప్రయోగాత్మకంగా కాలిఫోర్నియాలోని ఓ రోడ్డుపై విజయవంతంగా పరీక్షించింది. అందుకు సంబంధించిన వీడియోను సంస్థ నెటిజన్లతో పంచుకుంది. ఆ వీడియోలో మోడల్ జీరో కారు రోడ్డుపై కాస్త దూరం ప్రయాణించి ఆపై నిట్టనిలువుగా టేకాఫ్ అయి ముందున్న కారు పైనుంచి ఎగురుతూ ముందుకు సాగింది. అనంతరం మళ్లీ రోడ్డుపై దిగి ముందుకు కదిలింది. –సాక్షి, సెంట్రల్ డెస్క్
ఎలా సాధ్యమైంది?
సాధారణ కార్లలో బానెట్‌లో ఇంజన్ ఉంటే మోడల్ జీరో కారులో మాత్రం నాలుగు చిన్న ఇంజన్లను వాటి చక్రాల వద్ద కంపెనీ అమర్చింది. వాటి సాయంతో సాధారణ ఎలక్ట్రిక్ కారులాగానే ఈ కారు రోడ్డుపై దుసుకెళ్తోంది. ఇక ఖాళీగా ఉన్న బానెట్, డిక్కీలలో మొత్తం ఎనిమిది ప్రొపెల్లర్లను సంస్థ ఏర్పాటు చేసింది.
వేర్వేరు వేగములతో వేటికవే విడివిడిగా పరిభ్రమించగలగడం ఈ ప్రొపెల్లర్ల్ల ప్రత్యేకత. ఫలితంగా కారు ఏ దిశలో అయినా ఎగరడం సాధ్యం అవుతోంది. ఇందుకోసం డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెక్నాలజీని కంపెనీ ఉపయోగించింది. కారు ఫ్రేమ్ కోసం కార్బన్ ఫైబర్ వాడటంతో బరువు 385 కిలోలకే పరిమితమైంది.
ప్రస్తుత నమూనా గాల్లో సుమారు 177 కి.మీ. దూరం ప్రయాణించగలదని.. రోడ్డుపై మాత్రం 56 కి.మీ. దూరం వెళ్లగలదని అలెఫ్ ఏరోనాటిక్స్ వివరించింది. రెండు సీట్లుగల మోడల్ ఏ రకం కారు రోడ్డుపై సుమారు 320 కి.మీ. దూరం ప్రయాణించగలదని.. గాల్లో 177 కి.మీ. దూరం వెళ్లగలదని తెలిపింది.
ఫ్లయింగ్ కార్లకన్నా భిన్నమైనది..
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అభివృద్ధి దశలో ఉన్న ఫ్లయింగ్ కార్లకన్నా తాము రూపొందిస్తున్న కారు భిన్నమైనదని అలెఫ్ ఏరోనాటిక్స్ తెలిపింది. ఈవీటాల్ ఫ్లయింగ్ ట్యాక్సీల వంటి కార్లు టేకాఫ్ కోసం రోడ్డును రన్ వేలాగా ఉపయోగిస్తాయని.. కానీ తాము అభివృద్ధి చేస్తున్న కారు మాత్రం రోడ్డుపై నిట్టనిలువుగా టేకాఫ్ తీసుకోగలదని పేర్కొంది.
సాధారణ ప్రజలు ఈ కారును వాడటం ఎంతో సులువని.. కేవలం 15 నిమిషాల్లో కారులోని కంట్రోల్స్‌పై పట్టు సాధించొచ్చని కంపెనీ సీఈఓ జిమ్ డకోవ్నీ పేర్కొన్నారు. ‘రైట్ బ్రదర్స్ విమాన వీడియో తరహాలో మా కారు ప్రయోగ వీడియో మానవాళికి సరికొత్త రవాణా సాధ్యమని నిరూపిస్తుందని భావిస్తున్నా’అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ధర ఎక్కువే..
మోడల్ ఏ రకం కారుపై కంపెనీ ఇప్పటికే ప్రీ ఆర్డర్లు తీసుకుంటోంది. రోల్స్ రాయిస్, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్ వంటి లగ్జరీ కార్ల తరహాలోనే ఈ కారు ధరను సుమారు రూ. 2.57 కోట్లుగా కంపెనీ ఖరారు చేసింది. అయితే భవిష్యత్తులో భారీ స్థాయిలో ఉత్పత్తి చేపట్టి సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేలా సుమారు రూ. 27.35 లక్షలకు కారును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment