సాక్షి, చెన్నై: స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ఆసియా పురుషుల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ సాధించడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగనుంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీకి గురువారం ఎగ్మూర్‌లోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో తెర లేవనుంది.
భారత్‌తోపాటు పాకిస్తాన్, చైనా, మలేసియా, జపాన్, దక్షిణ కొరియా జట్లు ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. తొలి రోజు కొరియాతో జపాన్ (సాయంత్రం గం. 4 నుంచి); మలేసియాతో పాకిస్తాన్ (సాయంత్రం గం. 6:15 నుంచి); చైనాతో భారత్ (రాత్రి గం. 8:30 నుంచి) పోటీపడతాయి.
భారత్, పాక్ మ్యాచ్ ఆగస్టు 9న జరుగుతుంది. ఆరు జట్ల మధ్య ముందుగా రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. సెమీఫైనల్స్‌లో నెగ్గిన జట్లు ఆగస్టు 12న ఫైనల్లో తలపడతాయి. మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment