అభిప్రాయం
నాలుగున్నర ఏళ్ళ తర్వాత సియోల్ వేదికగా చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాల మధ్య జరిగిన త్రైపాక్షిక సమావేశం ప్రపంచ రాజకీయ నాయకులు, విశ్లేషకుల్లో ఆసక్తిని రేపుతోంది. తూర్పు ఆసియాలో భౌగోళిక రాజకీయాల్లో కొత్త సమీకరణాల దిశగా అడుగులు పడనున్నాయా అన్న చర్చ మొదలయ్యింది. ఒకరిపై ఒకరికి ఉన్న అనుమానాలు, ఉద్రిక్తతలు పక్కన పెట్టి స్నేహ సంబంధాల బలోపేతానికి జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని భారత దేశం కూడా నిశితంగా గమనించాల్సిందే.
వాస్తవంగా 2008లోనే చైనా, జపాన్, దక్షిణ కొరియా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. చివరిసారిగా 2019లో త్రైపాక్షిక సమావేశం జరిగింది. వాస్తవంగా ఈ మూడు దేశాల మధ్య త్రిముఖ కోణాల్లో సంఘర్షణలు ఉన్నాయి. జపాన్–దక్షిణ కొరియా దేశాల మధ్య శత్రుత్వానికి చారిత్రక నేపథ్యమే ఉంది. 1910 నుంచి 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకు జపాన్ వలస పాలనలో దక్షిణ కొరియా మగ్గింది. అందుకే ఆ దేశం ఇప్పటికీ జపాన్ చేసిన గాయాలను మర్చిపోలేదు. అటు చైనా– జపాన్ మధ్య కూడా గత ఏడాది ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పుకుషిమా న్యూక్లియర్ రియాక్టర్ నుంచి వ్యర్థ జలాలను శుద్ధి చేసి పసిఫిక్ సముద్రంలో జపాన్ విడుదల చేయటాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగానే జపాన్ నీటిని విడుదల చేస్తోందని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసినా చైనా మాత్రం వెనక్కి తగ్గలేదు. జపాన్ నుంచి చేపల దిగుమతిపై చైనా, దక్షిణ కొరియాలు ఆంక్షలు విధించాయి. చైనా–జపాన్ దేశాల మధ్య ఉన్న డియాయు ద్వీపం ప్రాదేశిక జలాల్లో నాలుగు నెలల కిందట చైనా గస్తీ నిర్వహించటంతో ఇరు దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు తలెత్తాయి.
తూర్పు చైనా సముద్రంలోని సెంకాకు ద్వీపాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య వివాదం చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. వాస్తవంగా రెండో ప్రపంచ యుద్ధ సమయం అంటే 1939–1945 మధ్య కాలంలో దక్షిణ చైనా సముద్ర ప్రాంతం జపాన్ అధీనంలోనే ఉండేది. యుద్ధంలో జపాన్ ఓటమితో ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరిగింది. మరోవైపు అమెరికాతో తమ సంబంధాల బలోపేతానికి దక్షిణ కొరియా కృషి చేస్తుండటాన్ని చైనా జీర్ణించుకులేకపోతోంది.
ఇక దక్షిణ చైనా సముద్రం, ఇండో పసిఫిక్ జలాల్లో చైనా దూకుడు పెంచటంతో జపాన్, దక్షిణ కొరియాల్లో ఆందోళన ఉంది. ఇలా మూడు దేశాల మధ్య వివిధ అంశాల్లో తీవ్ర విభేదాలు, అపనమ్మకాలు, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా... ప్రస్తుతం అన్నింటినీ పక్కన పెట్టి ఒకే తాటిపైకి రావటం ఆసియా ఖండంలో కీలక పరిణామం. చైనా అధ్యక్షుడి తర్వాత నంబర్ టూ గా పరిగణించే ప్రిమీర్... లీ కియాంగ్ అన్నట్లు ఇది మరో శుభారంభం. ఈ సమావేశంలో మూడు దేశాలు పరస్పర సహకారం, భద్రత, వాణిజ్యం, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ, పెరుగుతున్న వృద్ధ జనాభా సమస్య వంటి కీలక అంశాలపై చర్చతో పాటు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దిశగా అడుగులు వడిగా వేయటం మరో ప్రధాన విషయం.
ఈ మూడు తూర్పు ఆసియా దేశాల మధ్య సంబంధాల ప్రభావం ప్రపంచంపై కూడా ఉంటుంది అనటానికి వీరి గ్లోబల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వాల్యూమ్ ఒక ప్రామాణికం. గ్లోబల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్‌లో 25 శాతం వాటా ఈ మూడు దేశాలదే. అంతే కాదు జపాన్, సౌత్ కొరియాలకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇక్కడే మరో ఈక్వేషన్ కూడా ఉంది. ఆసియా ఖండంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారి తనకు సవాలు విసురుతున్న చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవటానికి అమెరికాకు ఆసియాలో బలమైన స్నేహితులు కావాలి. అందుకే దక్షిణ కొరియా, జపాన్‌లతో కలిసి అగ్రరాజ్యం మిలటరీ డ్రిల్స్‌ను విస్తరిస్తోంది.
అదే సమయంలో ఈ రెండు దేశాలకూ, అమెరికాకు మధ్య దూరం పెరగాలని ఆకాంక్షిస్తోంది చైనా. ఆసియా ఖండంలో శాంతి సామరస్యాలు పెరగటాన్ని ఆహ్వానించాల్సిందే. అయితే అదే సమయంలో ఈ భౌగోళిక రాజకీయ పరిణామాలు, మరింత బలపడేందుకు డ్రాగన్ చేస్తున్న ప్రయత్నాల పట్ల మన దేశం అప్రమత్తంగా ఉండాలి.
రెహానా
వ్యాసకర్త ఏపీ సమాచార కమిషనర్, ఆంధ్రప్రదేశ్
Comments
Please login to add a commentAdd a comment