East asia
-
తూర్పు ఆసియాలో కొత్త సమీకరణాలు
నాలుగున్నర ఏళ్ళ తర్వాత సియోల్ వేదికగా చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాల మధ్య జరిగిన త్రైపాక్షిక సమావేశం ప్రపంచ రాజకీయ నాయకులు, విశ్లేషకుల్లో ఆసక్తిని రేపుతోంది. తూర్పు ఆసియాలో భౌగోళిక రాజకీయాల్లో కొత్త సమీకరణాల దిశగా అడుగులు పడనున్నాయా అన్న చర్చ మొదలయ్యింది. ఒకరిపై ఒకరికి ఉన్న అనుమానాలు, ఉద్రిక్తతలు పక్కన పెట్టి స్నేహ సంబంధాల బలోపేతానికి జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని భారత దేశం కూడా నిశితంగా గమనించాల్సిందే. వాస్తవంగా 2008లోనే చైనా, జపాన్, దక్షిణ కొరియా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. చివరిసారిగా 2019లో త్రైపాక్షిక సమావేశం జరిగింది. వాస్తవంగా ఈ మూడు దేశాల మధ్య త్రిముఖ కోణాల్లో సంఘర్షణలు ఉన్నాయి. జపాన్–దక్షిణ కొరియా దేశాల మధ్య శత్రుత్వానికి చారిత్రక నేపథ్యమే ఉంది. 1910 నుంచి 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకు జపాన్ వలస పాలనలో దక్షిణ కొరియా మగ్గింది. అందుకే ఆ దేశం ఇప్పటికీ జపాన్ చేసిన గాయాలను మర్చిపోలేదు. అటు చైనా– జపాన్ మధ్య కూడా గత ఏడాది ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుకుషిమా న్యూక్లియర్ రియాక్టర్ నుంచి వ్యర్థ జలాలను శుద్ధి చేసి పసిఫిక్ సముద్రంలో జపాన్ విడుదల చేయటాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగానే జపాన్ నీటిని విడుదల చేస్తోందని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసినా చైనా మాత్రం వెనక్కి తగ్గలేదు. జపాన్ నుంచి చేపల దిగుమతిపై చైనా, దక్షిణ కొరియాలు ఆంక్షలు విధించాయి. చైనా–జపాన్ దేశాల మధ్య ఉన్న డియాయు ద్వీపం ప్రాదేశిక జలాల్లో నాలుగు నెలల కిందట చైనా గస్తీ నిర్వహించటంతో ఇరు దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు తలెత్తాయి. తూర్పు చైనా సముద్రంలోని సెంకాకు ద్వీపాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య వివాదం చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. వాస్తవంగా రెండో ప్రపంచ యుద్ధ సమయం అంటే 1939–1945 మధ్య కాలంలో దక్షిణ చైనా సముద్ర ప్రాంతం జపాన్ అధీనంలోనే ఉండేది. యుద్ధంలో జపాన్ ఓటమితో ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరిగింది. మరోవైపు అమెరికాతో తమ సంబంధాల బలోపేతానికి దక్షిణ కొరియా కృషి చేస్తుండటాన్ని చైనా జీర్ణించుకులేకపోతోంది. ఇక దక్షిణ చైనా సముద్రం, ఇండో పసిఫిక్ జలాల్లో చైనా దూకుడు పెంచటంతో జపాన్, దక్షిణ కొరియాల్లో ఆందోళన ఉంది. ఇలా మూడు దేశాల మధ్య వివిధ అంశాల్లో తీవ్ర విభేదాలు, అపనమ్మకాలు, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా... ప్రస్తుతం అన్నింటినీ పక్కన పెట్టి ఒకే తాటిపైకి రావటం ఆసియా ఖండంలో కీలక పరిణామం. చైనా అధ్యక్షుడి తర్వాత నంబర్ టూ గా పరిగణించే ప్రిమీర్... లీ కియాంగ్ అన్నట్లు ఇది మరో శుభారంభం. ఈ సమావేశంలో మూడు దేశాలు పరస్పర సహకారం, భద్రత, వాణిజ్యం, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ, పెరుగుతున్న వృద్ధ జనాభా సమస్య వంటి కీలక అంశాలపై చర్చతో పాటు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దిశగా అడుగులు వడిగా వేయటం మరో ప్రధాన విషయం. ఈ మూడు తూర్పు ఆసియా దేశాల మధ్య సంబంధాల ప్రభావం ప్రపంచంపై కూడా ఉంటుంది అనటానికి వీరి గ్లోబల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వాల్యూమ్ ఒక ప్రామాణికం. గ్లోబల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్‌లో 25 శాతం వాటా ఈ మూడు దేశాలదే. అంతే కాదు జపాన్, సౌత్ కొరియాలకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇక్కడే మరో ఈక్వేషన్ కూడా ఉంది. ఆసియా ఖండంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారి తనకు సవాలు విసురుతున్న చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవటానికి అమెరికాకు ఆసియాలో బలమైన స్నేహితులు కావాలి. అందుకే దక్షిణ కొరియా, జపాన్‌లతో కలిసి అగ్రరాజ్యం మిలటరీ డ్రిల్స్‌ను విస్తరిస్తోంది. అదే సమయంలో ఈ రెండు దేశాలకూ, అమెరికాకు మధ్య దూరం పెరగాలని ఆకాంక్షిస్తోంది చైనా. ఆసియా ఖండంలో శాంతి సామరస్యాలు పెరగటాన్ని ఆహ్వానించాల్సిందే. అయితే అదే సమయంలో ఈ భౌగోళిక రాజకీయ పరిణామాలు, మరింత బలపడేందుకు డ్రాగన్ చేస్తున్న ప్రయత్నాల పట్ల మన దేశం అప్రమత్తంగా ఉండాలి. రెహానా వ్యాసకర్త ఏపీ సమాచార కమిషనర్, ఆంధ్రప్రదేశ్ -
2027 నాటికి మూడో స్థానానికి భారత్
ముంబై: భారత్ 2027 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకేల్ డీ పాత్ర అంచనా వేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 3.3 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉండడం గమనార్హం. నేషనల్ బ్యాంక్ ఆఫ్ కంబోడియా నిర్వహించిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాత్రా ప్రసంగించారు. వచ్చే రెండు దశాబ్దాల్లో అంతర్జాతీయ ఆర్థిక కేంద్రం తూర్పు ఆసియావైపు మళ్లుతుందన్నారు. 2023లో ప్రపంచ వృద్ధిలో ఈ ప్రాంతం మూడింట రెండొంతులు ఆక్రమించిందని, ప్రపంచ ఉత్పత్తిలో భారత్ 16.66 శాతం వాటా పోషించినట్టు చెప్పారు. ‘‘మార్కెట్ ఎక్సే్ఛంజ్ రేట్ల పరంగా భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా, కొనుగోలు శక్తి పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ప్రపంచంలో 140 కోట్లతో అతిపెద్ద జనాభా కలిగిన దేశం భారత్. 28 ఏళ్లలోపు యువ జనాభా ఎక్కువ. భారత పురోగతికి ఇతర ముఖ్య ప్రేరణ ఏమిటంటే ఫైనాన్షియల్ రంగం నాణ్యత పెరగడం’’అని పాత్రా వివరించారు. భారత్ వృద్ధి ఆకాంక్షలకు కావాల్సిన వనరులు సమకూర్చుకునేందుకు వీలుగా ఆధునికంగా, సమర్థవంతంగా, బలంగా పనిచేసే ఆర్థిక రంగం అవసరమని అభిప్రాయపడ్డారు. -
వచ్చే వారం ఇండోనేషియాకు మోదీ
న్యూఢిల్లీ: ఏషియాన్, ఈస్ట్ ఆసియా సదస్సుల్లో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6, 7 తేదీల్లో ఇండోనేషియాకు వెళ్లనున్నారు. రాజధాని జకార్తాలో జరిగే ఈ సమావేశాలకు ఏషియాన్ చైర్ హోదాలో ఇండోనేషియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఏషియాన్లోని సభ్యదేశాలతో వ్యాపార, భద్రతా సంబంధాల బలోపేతంపై మోదీ దృష్టి సారించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహా్వనం మేరకు ప్రధాని మోదీ 6, 7వ తేదీల్లో జకార్తాకు వెళుతున్నారని విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లలో జోష్..
ముంబై : అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో బేజారైన స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా పుంజుకున్నాయి. ఇరాన్ క్షిపణి దాడుల్లో అమెరికా బలగాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ట్రంప్ పేర్కొనడంతో పాటు శాంతి మంత్రం జపించడంతో ఈక్విటీ మార్కెట్లు ఊపిరిపీల్చుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ల ఊతంతో మదుపుదారులు కొనుగోళ్లకు దిగడంతో కీలక సూచీలన్నీ లాభాల బాట పట్టాయి. ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్టెల్ లాభపడుతుండగా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టపోతున్నాయి. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 448 పాయింట్ల లాభంతో 41,264 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 136 పాయింట్లు పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 12,161 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. -
‘లుక్ ఈస్ట్’ నుంచి ‘యాక్ట్ ఈస్ట్’కు!
తూర్పు దేశాల దౌత్యాధికారులకు సుష్మాస్వరాజ్ పిలుపు హనోయ్: ‘లుక్ ఈస్ట్’ విధానం నుంచి మెరుగైన కార్యాచరణతో కూడిన ‘యాక్ట్ ఈస్ట్’ పాలసీ వైపుగా ముందుకెళ్లాలని ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాల్లోని భారత దౌత్య ప్రధానాధికారులకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సూచించారు. 15 దేశాల దౌత్యాధికారులతో ఆమె మంగళవారం ఇక్కడ ఒక సమావేశం నిర్వహించారు. నూతన ప్రభుత్వ విదేశాంగ విధానంలోని కీలకాంశాలను సుష్మా వారికి వివరిస్తూ.. రెండు దశాబ్దాల క్రితం నాటి లుక్ ఈస్ట్ పాలసీ స్థానంలో ‘యాక్ట్ ఈస్ట్’ విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని వారికి స్పష్టం చేశారు. వ్యూహాత్మకంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతంలో భద్రత వ్యవస్థ, చైనా ప్రభావం, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం, ఈ ప్రాంతంపై అమెరికా వైఖరి, భారత్‌కున్న వాణిజ్యాభివృద్ధి అవకాశాలు.. మొదలైన అంశాలపై దాదాపు రోజంతా జరిగిన ఆ భేటీలో సునిశిత చర్చలు జరిపారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలోని దేశాలతో సాంస్కృతిక, మైత్రీపూర్వక సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని మోడీ ప్రభుత్వం భావిస్తోందని సుష్మాస్వరాజ్ వారికి వివరించారు. మధ్య ప్రాచ్య దేశాల దౌత్యాధికారులతో మే నెలలో ఢిల్లీలో ఇదే తరహా సమావేశాన్ని సుష్మా స్వరాజ్ నిర్వహించిన విషయం తెలిసిందే.