
ట్రంప్ వచ్చాక అంతర్జాతీయ పర్యాటకుల్లో గుబులు
పర్యాటక రంగం ఈ ఏడాది 5.5 శాతం పతనమయ్యే అవకాశం
అమెరికా ట్రిప్పులను రద్దు చేసుకుంటున్న విదేశీయులు
ట్రంప్ విధానాలతో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం
లీడ్స్ (యూకే): ప్రపంచంలో అత్యుత్తమ పర్యాటక దేశాల జాబితాలో అమెరికా టాప్–3లో ఉండడం పరిపాటి. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, షికాగో వంటి నగరాలు, అక్కడున్న జాతీయ పార్కులు, వినోద కేంద్రాలు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్శిస్తుంటాయి. 2023లో 66.5 మిలియన్ల మంది అమెరికాను సందర్శించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2024లో ఈ సంఖ్య మరింత ఎక్కువేనని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఏడాది పరిస్థితి మారిపోయింది.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇతర దేశాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. విదేశీ ఉత్పత్తులపై ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. అక్రమ వలసదార్ల పేరిట వేలాది మందిని బలవంతంగా బయటకు తరిమేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో పర్యటించాలని నిర్ణయించుకున్నవారు సైతం పునరాలోచన చేస్తున్నారు. అమెరికా పట్ల ప్రపంచ దేశాల దృక్పథంలో మార్పు కనిపిస్తోంది.
→ అమెరికా పర్యాటక రంగం ఈ ఏడాది కనీసం 5.5 శాతం పతనమయ్యే అవకాశం ఉన్నట్లు పరిశోధక సంస్థ ‘టూరిజం ఎకనామిక్స్’ అంచనా వేసింది. ఈ మేరకు ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. పర్యాటక రంగం ఈ ఏడాది 9 శాతం వృద్ధి చెందనున్నట్లు ఇదే సంస్థ గతంలో అంచనా వేయడం గమనార్హం.
→ ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన టారిఫ్‌లు, వాణిజ్య యుద్ధంతో పర్యాటకానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ఏడాది టూరిజంపై జనం చేసే ఖర్చు 18 బిలియన్ డాలర్లు తగ్గనున్నట్లు అంచనా.
→ అమెరికా పర్యాటకానికి కెనడా ప్రజలే అతిపెద్ద వనరు. కెనడా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలను ట్రంప్ విధించడం కెనడా పర్యాటకులకు నచ్చడం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కెనడా నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్యలో భారీగా తగ్గుదల నమోదవుతోంది. కొన్నిసార్లు ఇది 45 శాతంగా ఉంటోంది.
→ అమెరికా ప్రయాణాలకు డిమాండ్ తగ్గడంతో విమానాల సంఖ్యను తగ్గించాల్సి వచ్చిందని ఎయిర్ కెనడా ప్రకటించింది. అమెరికాకు వెళ్లడానికి జనం ఆసక్తి చూపడం లేదని వెల్లడించింది.
→ అమెరికాకు ఇప్పటికే ట్రిప్పులు ప్లాన్ చేసుకున్నవారిలో 36 శాతం మంది వాటిని రద్దు చేసుకున్నారని కెనడియన్ మార్కెట్ రీసెర్చర్ ‘లెగర్’ తెలియజేసింది.
→ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కెనడా నుంచి అమెరికాకు ప్యాసింజర్ బుకింగ్‌లు 70 శాతం పడిపోయాయని ఏవియేషన్ అనలిటిక్స్ కంపెనీ ‘ఓఏజీ’ ప్రకటించింది.
→ పర్యాటకుల రాక తగ్గుతుండడం పట్ల యూఎస్ ట్రావెల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది. కెనడా నుంచి పర్యాటకుల సంఖ్య 10 శాతం తగ్గినా 2.1 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని స్పష్టంచేసింది. 1.40 లక్షలు ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది.
→ అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ వాతావరణం మారిపోయిందని, పర్యాటకులకు అది అనువుగా లేదని విదేశీయులు అభిప్రాయపడుతున్నారు. విదేశీయులు, వలసదార్లతోపాటు స్వలింగ వివాహాల పట్ల ట్రంప్ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. అందుకే ఇప్పుడు అక్కడికి వెళ్లడం క్షేమకరం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
→ పశ్చిమ యూరప్ ప్రజల్లో ట్రంప్ ప్రభుత్వంపై స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటీవల ఒక సర్వేలో బ్రిటన్‌లో 53 శాతం, జర్మనీలో 56 శాతం, స్వీడన్‌లో 63 శాతం, డెన్మార్క్‌లో 74 శాతం మంది ట్రంప్ సర్కారుపై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాపై ఈ స్థాయిలో వ్యతిరేకత కనిపించడం 2016 తర్వాత ఇదే మొదటిసారి.
→ అమెరికాకు పొరుగు దేశం మెక్సికో నుంచి కూడా అధికంగా టూరిస్టులు వస్తుంటారు. ట్రంప్ తొలి హయాంలో మెక్సికో టూరిస్టుల సంఖ్య బాగా తగ్గడం గమనార్హం. అప్పుడు మెక్సికో నుంచి విమాన ప్రయాణాలు 3 శాతం తగ్గాయి. 2025లో కూడా 2024తో పోలిస్తే ఇప్పటికే 6 శాతం తగ్గాయి.
→ అమెరికాకు వెళ్తే అరెస్టయ్యే, నిర్బంధానికి గురయ్యే ప్రమాదముందని చాలా దేశాలు తమ పౌరులను అప్రమత్తం చేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి.
→ అమెరికాలో పర్యటన కష్టంగా మారుతోందనే ఉద్దేశంతో అంతర్జాతీయ టూరిస్టులు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. బెర్ముడా హోటళ్లలో బుకింగ్‌ల కోసం ఆరా తీస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. అమెరికా పర్యటనలు రద్దు చేసుకుంటున్నవారు యూరప్ దేశాలను డెస్టినేషన్‌గా ఎంచుకున్నారు.
→ 2026లో ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ అమెరికా, కెనడా, మెక్సికోల్లో జరుగనుంది. 2028 ఒలింపిక్స్ అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ పర్యాటకుల్లో భయాందోళనను తొలగించడానికి అమెరికా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.