Sunita Williams: మళ్లీ స్టార్‌ లైనర్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్తారా? | NASA astronauts Sunita Williams Butch Wilmore Full interview Check Details Here | Sakshi
Sakshi News home page

Sunita Williams: మళ్లీ స్టార్‌ లైనర్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్తారా?

Published Tue, Apr 1 2025 6:52 AM | Last Updated on Tue, Apr 1 2025 7:08 AM

NASA astronauts Sunita Williams Butch Wilmore Full interview Check Details Here

నాసా వ్యోమగాములు  సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌లు ఆరోగ్యంగానే ఉన్నారు. దాదాపు 9 నెలల అనంతరం మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమ్మీదకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇన్నాళ్లపాటు పరిశీలనలో ఉన్న వీళ్లు తాజాగా మీడియా ముందుకు వచ్చారు. ఐఎస్‌ఎస్‌ అనుభవాలతో పాటు.. వాళ్లు అక్కడ ఉన్న సమయంలో భూమ్మీద జరిగిన చర్చలు, ఆందోళనలు, విమర్శలు తదితర అంశాలపైనా స్పందించారు.  

అవకాశం వస్తే మళ్లీ బోయింగ్‌ స్టార్‌ లైనర్‌( Boeing Starliner) స్పేస్‌క్రాఫ్ట్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్తారా? అని ఫాక్స్‌ న్యూస్‌ జరిపిన ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు అవుననే సమాధానం ఇచ్చారు. అది చాలా సామర్థ్యం గల వాహకనౌక అని భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌(Sunita Williams) అన్నారు. అయితే స్టార్‌ లైనర్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని.. వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మరో వ్యోమగామి విల్మోర్‌ మాట్లాడుతూ.. భవిష్యత్తులో స్టార్‌లైనర్‌లో ఏర్పడ్డ సమస్యలను పరిష్కస్తామని పేర్కొన్నారు.

నిర్లక్ష్యం వల్లే ఇరుక్కుపోయారనే విమర్శలకూ ఇద్దరూ స్పందించారు. తామెప్పుడు అలా భావించలేదని అన్నారు. ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టే ఉద్దేశమూ తమకు లేదని అన్నారు. అనుకున్న ప్రకారం తాము భూమ్మీదకు రాలేకపోయామని.. ఒకరకంగా ఇరుక్కుపోయామనే భావించాల్సి ఉంటుందని, మరోరకంగా అక్కడ ఉండాల్సి వచ్చిందని.. అయినప్పటికీ తాము తీసుకున్న కఠోర శిక్షణ ఆ పరిస్థితులను తట్టుకోగలిగే సామర్థ్యం ఇచ్చిందని ఇద్దరూ అన్నారు. 

తమ మిషన్‌ విజయవంతం కావడంలో నాసా కృషిని, తాను సాధారణ స్థితికి రావడానికి సాయం చేసిన శిక్షకులకు  సునీత ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఇలాన్‌ మస్క్‌(Elon Musk)లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో తీసుకున్న శిక్షణ వల్లే.. ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్లడం, అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా గడపడం, తిరిగి భూమిపైకి రావడంలో, అలాగే పునరావాసం, కొత్త సవాళ్లకు సిద్ధకావడానికి ఎంతో సహాయం చేశాయన్నారు. భూమిపైకి వచ్చాక ఇప్పటికే తాను మూడు మైళ్లు పరుగెత్తానని సునీత అన్నారు. ఐఎస్‌ఎస్‌లో ఉన్న సమయంలో తమ టాస్క్‌ల్లో భాగంగా ఎన్నో సైన్స్‌ ప్రయోగాలు చేపట్టామని, శిక్షణ పొందామని విల్మోర్‌ పేర్కొన్నారు.

ఇక ఐఎస్‌ఎస్‌లో ఉన్నప్పుడు తన ఆరోగ్యం గురించి చాలా మంది ఆందోళనకు గురైన విషయం తనకు తెలుసని సునీతా విలియమ్స్‌ అన్నారు. అయితే తాము ఒక పెద్ద టీమ్‌ ప్రయత్నంలో భాగమై ఉన్నట్లు తెలిపారు. విల్మోర్‌ మాట్లాడుతూ.. మానవ అంతరిక్ష యానం దేశాలను ఒక్కతాటిపైకి తెస్తుందని అన్నారు. ఇక స్టార్‌లైనర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు, హీలియం లీకేజీల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్న నాసా, బోయింగ్‌ టీమ్స్‌ నిబద్ధతను ఆయన కొనియాడారు. తమకు నాసాపై ఎంతో నమ్మకముందన్నారు. తాము సురక్షితంగా భూమిపైకి చేరడంలో నాసా నిబద్ధతకు సంబంధించి ఇదొక మైలురాయిగా వారు అభివర్ణించారు.

సునీత విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌తో పాటు ఇదే ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న మరో వ్యోమగామి, క్రూ-9 కమాండర్‌ నిక్‌ హేగ్‌ మాట్లాడుతూ.. మిషన్‌ చుట్టూ రాజకీయం నడిచిందన్న వాదనను తోసిపుచ్చారు. 

గతేడాది జూన్‌ 5న ప్రయోగించిన బోయింగ్‌ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్‌’లో సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. షెడ్యూల్‌ ప్రకారం.. వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు 286 రోజులపాటు అక్కడే చిక్కుకుపోయారు. ఇక వ్యోమగాములు లేకుండానే స్టార్‌లైనర్‌ కొన్నిరోజులకు భూమిపైకి తిరిగొచ్చింది. నాటినుంచి సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌లోనే ఉండిపోయారు. అనేక ప్రయత్నాల అనంతరం.. ఈ ఏడాది మార్చిలో స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్‌లో వారు ఐఎస్‌ఎస్‌ నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు సైతం వాహకనౌకలో వచ్చారు. దీంతో హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌కు వీళ్లను తరలించి పరిశీలనలో ఉంచారు. అనంతరం.. 12 రోజుల అనంతరం తొలిసారి ఇప్పుడు బయటి ప్రపంచం ముందుకు వచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement