Fox News interview
-
Sunita Williams: మళ్లీ స్టార్ లైనర్‌లో ఐఎస్ఎస్కు వెళ్తారా?
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఆరోగ్యంగానే ఉన్నారు. దాదాపు 9 నెలల అనంతరం మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమ్మీదకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇన్నాళ్లపాటు పరిశీలనలో ఉన్న వీళ్లు తాజాగా మీడియా ముందుకు వచ్చారు. ఐఎస్ఎస్ అనుభవాలతో పాటు.. వాళ్లు అక్కడ ఉన్న సమయంలో భూమ్మీద జరిగిన చర్చలు, ఆందోళనలు, విమర్శలు తదితర అంశాలపైనా స్పందించారు. అవకాశం వస్తే మళ్లీ బోయింగ్ స్టార్ లైనర్( Boeing Starliner) స్పేస్‌క్రాఫ్ట్‌లో ఐఎస్ఎస్కు వెళ్తారా? అని ఫాక్స్ న్యూస్ జరిపిన ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు అవుననే సమాధానం ఇచ్చారు. అది చాలా సామర్థ్యం గల వాహకనౌక అని భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్(Sunita Williams) అన్నారు. అయితే స్టార్ లైనర్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని.. వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మరో వ్యోమగామి విల్మోర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో స్టార్‌లైనర్‌లో ఏర్పడ్డ సమస్యలను పరిష్కస్తామని పేర్కొన్నారు.నిర్లక్ష్యం వల్లే ఇరుక్కుపోయారనే విమర్శలకూ ఇద్దరూ స్పందించారు. తామెప్పుడు అలా భావించలేదని అన్నారు. ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టే ఉద్దేశమూ తమకు లేదని అన్నారు. అనుకున్న ప్రకారం తాము భూమ్మీదకు రాలేకపోయామని.. ఒకరకంగా ఇరుక్కుపోయామనే భావించాల్సి ఉంటుందని, మరోరకంగా అక్కడ ఉండాల్సి వచ్చిందని.. అయినప్పటికీ తాము తీసుకున్న కఠోర శిక్షణ ఆ పరిస్థితులను తట్టుకోగలిగే సామర్థ్యం ఇచ్చిందని ఇద్దరూ అన్నారు. తమ మిషన్ విజయవంతం కావడంలో నాసా కృషిని, తాను సాధారణ స్థితికి రావడానికి సాయం చేసిన శిక్షకులకు సునీత ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్(Elon Musk)లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో తీసుకున్న శిక్షణ వల్లే.. ఐఎస్ఎస్కు తీసుకెళ్లడం, అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా గడపడం, తిరిగి భూమిపైకి రావడంలో, అలాగే పునరావాసం, కొత్త సవాళ్లకు సిద్ధకావడానికి ఎంతో సహాయం చేశాయన్నారు. భూమిపైకి వచ్చాక ఇప్పటికే తాను మూడు మైళ్లు పరుగెత్తానని సునీత అన్నారు. ఐఎస్ఎస్లో ఉన్న సమయంలో తమ టాస్క్‌ల్లో భాగంగా ఎన్నో సైన్స్ ప్రయోగాలు చేపట్టామని, శిక్షణ పొందామని విల్మోర్ పేర్కొన్నారు.ఇక ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు తన ఆరోగ్యం గురించి చాలా మంది ఆందోళనకు గురైన విషయం తనకు తెలుసని సునీతా విలియమ్స్ అన్నారు. అయితే తాము ఒక పెద్ద టీమ్ ప్రయత్నంలో భాగమై ఉన్నట్లు తెలిపారు. విల్మోర్ మాట్లాడుతూ.. మానవ అంతరిక్ష యానం దేశాలను ఒక్కతాటిపైకి తెస్తుందని అన్నారు. ఇక స్టార్‌లైనర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు, హీలియం లీకేజీల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్న నాసా, బోయింగ్ టీమ్స్ నిబద్ధతను ఆయన కొనియాడారు. తమకు నాసాపై ఎంతో నమ్మకముందన్నారు. తాము సురక్షితంగా భూమిపైకి చేరడంలో నాసా నిబద్ధతకు సంబంధించి ఇదొక మైలురాయిగా వారు అభివర్ణించారు.Astronauts Butch Wilmore & Sunita Williams express their views, carefully, with deliberate wording. Positive rather than negative or unhelpful.#ButchWilmore #SunitaWilliams #Trump https://t.co/qTYEdAbUMN— I can see Ireland from here. Gerry (@gtp_58) March 31, 2025సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటు ఇదే ప్రెస్మీట్లో పాల్గొన్న మరో వ్యోమగామి, క్రూ-9 కమాండర్ నిక్ హేగ్ మాట్లాడుతూ.. మిషన్ చుట్టూ రాజకీయం నడిచిందన్న వాదనను తోసిపుచ్చారు. గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం.. వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు 286 రోజులపాటు అక్కడే చిక్కుకుపోయారు. ఇక వ్యోమగాములు లేకుండానే స్టార్‌లైనర్ కొన్నిరోజులకు భూమిపైకి తిరిగొచ్చింది. నాటినుంచి సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. అనేక ప్రయత్నాల అనంతరం.. ఈ ఏడాది మార్చిలో స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్‌లో వారు ఐఎస్ఎస్ నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు సైతం వాహకనౌకలో వచ్చారు. దీంతో హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు వీళ్లను తరలించి పరిశీలనలో ఉంచారు. అనంతరం.. 12 రోజుల అనంతరం తొలిసారి ఇప్పుడు బయటి ప్రపంచం ముందుకు వచ్చారు. -
గ్రీన్ కార్డు శాశ్వత నివాసానికి... హక్కు కాదు: వాన్స్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా వలస విధానంపై ఇప్పటికే ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆందోళనలను మరింతగా పెంచే పరిణామం చోటుచేసుకుంది. డాలర్ డ్రీమ్స్‌ను నిజం చేసుకోవడానికి రాచబాటగా భావించే అమెరికా గ్రీన్‌కార్డుపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌కార్డు ఉన్నంతమాత్రాన అమెరికాలో నివాసానికి, పని చేయడానికి శాశ్వత హక్కులు దఖలు పడ్డట్టు కాదని స్పష్టం చేశారు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ విద్యార్థి మహ్మద్ ఖలీల్ యూదు విద్వేష ఆరోపణలపై ఇటీవలే అరెస్టవడం తెలిసిందే. అతను గ్రీన్‌కార్డు హోల్డరే కావడాన్ని ప్రస్తావిస్తూ వాన్స్ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇదేమీ వాక్ స్వాతంత్య్రానికి సంబంధించిన అంశం కాదు. జాతీయ భద్రతకు సంబంధించిన అతి కీలకమైన విషయం. అంతకుమించి, అమెరికాలో శాశ్వత నివాసులుగా మాతోపాటు ఎవరుండాలన్న దానికి సంబంధించిన అంశం. దీన్ని నిర్ణయించేది అమెరికన్లు మాత్రమే’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా, ముఖ్యంగా భారత్‌లో దుమారం రేపుతున్నాయి. ఏటా భారీ సంఖ్యలో అమెరికా బాట పట్టే భారత విద్యార్థులందరికీ గ్రీన్‌కార్డు ఒక బంగారు కల. అది చిక్కిందంటే అమెరికాలో శాశ్వత నివాసం దక్కినట్టేనని భావిస్తారు. వాన్స్ వ్యాఖ్యలు వారినేగాక అమెరికాలో గ్రీన్‌కార్డు హోల్డర్లయిన లక్షలాది మంది భారతీయులను కూడా కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గురువారం ఫాక్స్ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా వలస విధానాలకు సంబంధించి వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కొలంబియా వర్సిటీలో హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న విద్యార్థి ఖలీల్ కూడా గ్రీన్‌కార్డు హోల్డరే. అందుకే చెబుతున్నా, గ్రీన్‌కార్డు హోల్డర్‌కు అమెరికాలో శాశ్వతంగా ఉండిపోయే హక్కు లేదు’’ అని స్పష్టం చేశారు. గ్రీన్‌కార్డు హోల్డర్లయినా సరే, అమెరికా భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు అనుమానిస్తున్న విద్యార్థులు తదితరులపై కఠిన చర్యలకు ట్రంప్ సర్కారు సిద్ధమవుతోందని ఉపాధ్యక్షుడు ప్రకటించారు. ‘‘వారి ఉనికి అమెరికాకు ముప్పని తేలిన పలువురిని త్వరలో తిప్పి పంపుతున్నాం. ఈ జాబితాలో విద్యార్థులతో పాటు ఇతరులు కూడా ఉన్నారు’’ అని వివరించారు. ట్రంప్ రాకతో అమెరికాలోకి అక్రమ వలసలు 95 శాతానికి పైగా తగ్గిపోయాయన్నారు.ఏమిటీ గ్రీన్‌కార్డు? పర్మనెంట్ రెసిడెంట్ (శాశ్వస నివాస) కార్డు. గ్రీన్కార్డుగా భారత్‌లో దాదాపు ఇంటింటికీ పరిచయం. ఇది విదేశీ పౌరులకు అమెరికాలో నివసించేందుకు, పని చేసుకునేందుకు హక్కు కల్పిస్తుంది. అంతేగాక కోరుకున్న కంపెనీలో పని చేయవచ్చు. సొంత వ్యాపారం వంటివీ చేసుకోవచ్చు. గ్రీన్‌కార్డు పొందిన మూడు నుంచి ఐదేళ్లకు పౌరసత్వం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నిజానికిది పేరుకే శాశ్వత నివాస కార్డు. వాన్స్ చెప్పినట్టుగా అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు హక్కు కల్పించదు. దీన్ని పదేళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు. కొన్ని పరిస్థితుల్లో గ్రీన్‌కార్డును రద్దు చేయవచ్చు. నేర కార్యకలాపాల్లో పాల్గొన్నా, చాలాకాలం పాటు అమెరికాకు దూరంగా ఉన్నా, వలస నిబంధనలను ఉల్లంఘించినా గ్రీన్‌కార్డును కోల్పోతారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు దశాబ్దాలుగా గ్రీన్‌కార్డుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారిలో చాలామందికి కార్డు దక్కాలంటే 50 ఏళ్ల దాకా పట్టొచ్చట. కొన్ని కేటగిరీల వాళ్లకైతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి గ్రీన్‌కార్డు రావాలంటే 134 సంవత్సరాలు పడుతుంది! 3.4 కోట్ల మందికి పైగా గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తుండగా వారిలో 11 లక్షల మందికి పైగా భారతీయులే! వీరిలో 4 లక్షల మంది తమ జీవితకాలంలో కార్డును కళ్లజూడలేరన్నది ఇమిగ్రేషన్ నిపుణుల మాట. అమెరికా ఏటా గరిష్టంగా 6.75 లక్షల గ్రీన్‌కార్డులు మాత్రమే జారీ చేస్తుంది. వాటిలో ఏ దేశానికీ 7 శాతానికి మించి ఇవ్వరాదన్న నిబంధన ఉంది. ఇదే భారతీయులకు పెద్ద అడ్డంకిగా మారింది. ప్రస్తుతం అమెరికాలో గ్రీన్కార్డున్న భారతీయుల సంఖ్య 3 లక్షలకు పైగా ఉంటుంది. గోల్డ్ కార్డు రాకతో... అమెరికాలో శాశ్వత నివాసానికి ట్రంప్ ఇటీవల కొత్తగా గోల్డ్ కార్డు స్కీమును ప్రకటించిన నేపథ్యంలో గ్రీన్‌కార్డు ప్రాధాన్యతను తగ్గించేలా వాన్స్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘ఇప్పటిదాకా గ్రీన్కార్డుంది. ఇకపై గోల్డ్‌కార్డు తెస్తున్నాం. గ్రీన్‌కార్డు ఇచ్చే సదుపాయాలన్నింటినీ ఇదీ ఇస్తుంది. వాటితో అదనంగా అమెరికాలో శాశ్వత నివాసానికి, పౌరసత్వానికి కూడా గోల్డ్‌కార్డు రాచమార్గం’’ అని ట్రంప్ చెప్పు కొచ్చారు. అమెరికాలోని అత్యున్నత వర్సిటీల్లో చదివే ప్రతిభావంతులు, భారతీయ విద్యా ర్థులు దేశం దాటకుండా ఆపడంలో తమ వలస విధానం విఫలమైందని ఆయన ఆక్షేపించారు. గోల్డ్కార్డుకు 50 లక్షల డాలర్లు (రూ.43.54 కోట్లు) ఫీజుగా నిర్ణయించారు. ‘‘కనీసం కోటి గోల్డ్‌కార్డులు అమ్మాలన్నది మా లక్ష్యం. తద్వారా వచ్చే ఆదాయంతో అమెరికా అప్పు తీరుస్తాం’’ అని ట్రంప్ ప్రకటించారు. 1990 నుంచి అమల్లో ఉన్న ఈబీ–5 వీసాలను గోల్డకార్డు భర్తీ చేసింది. -
ఫాక్స్‌న్యూస్ ఇంటర్వ్యూలో హారిస్.. సారీలు.. హామీలు
వాషింగ్టన్: మూడు వారాల్లోపు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ప్రచార జోరు పెంచారు. ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు పలుకుతూ ఆయనను తరచూ ఇంటర్వ్యూచేసే ‘ఫాక్స్ న్యూస్’వార్తాసంస్థకు బుధవారం హారిస్ ఇంటర్వ్యూ ఇచ్చారు. లక్షలాది మంది రిపబ్లికన్ మహిళా ఓటర్ల మనసునూ గెల్చుకునే ప్రయత్నంచేశారు. యాంకర్ బ్రెట్ బేయర్ అడుగడుగునా అడ్డుతగిలి ప్రశ్నలబాణాలు సంధిస్తుంటే హారిస్ వాటికి దీటుగా ఎదుర్కొని ఇంటర్వ్యూను రక్తికట్టించారు. హోరాహోరీగా సాగిన ఈ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు కొన్ని.. వలస బిల్లుపై తొలి సంతకం అమెరికాలోకి అక్రమంగా వలసవచి్చన వ్యక్తి చేతిలో హత్యకు గురైన 12 ఏళ్ల జాస్లిన్ నంగరే తల్లి పడే ఆవేదన వీడియోను యాంకర్ తొలుత హారిస్‌కు చూపించారు. అక్రమ వలసదారుల చేతుల్లో చనిపోతున్న అమెరికన్ల కుటుంబాలను క్షమాపణ కోరాలని మీకెప్పుడూ అనిపించలేదా? అని యాంకర్ ప్రశ్నించగా.. ‘చిన్నారిని కోల్పోయాం. ఈ విషయంలో నన్ను క్షమించండి’అని హారిస్ సారీ బేషరతుగా సారీ చెప్పారు. అక్రమ వలసలకు మద్దతు పలుకుతూ, వారిపై క్రిమినల్ కేసులను ఎత్తేయాలంటూ హారిస్ గతంలో చేసిన వ్యాఖ్యలను యాంకర్ వినిపించారు. ఈ అంశంలో మాట మార్చారని దెబ్బిపొడిచారు. దీంతో హారిస్ ‘సరిహద్దు దాటి అక్రమ చొరబాట్లపై నేరాలను మోపాల్సిందే. నాటి అభిప్రాయాలు ఉపాధ్యక్షురాలిగా చేసినవి కాదు. ఇకమీదట అధ్యక్షురాలినైతే అలా చేయను. అస్తవ్యస్తంగా ఉన్న వలస విధానాన్ని సంస్కరిస్తా. నేను దేశాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసల కట్టడిపైనే చట్టం తెస్తా. ఆ బిల్లుపైనే తొలి సంతకం చేస్తా’అని హారిస్ అన్నారు. ఖైదీల లింగమార్పిడి సర్జరీలపై.. ఖైదీల లింగ మార్పిడి శస్త్రచికిత్సల కోసం ప్రజాధనాన్ని ఖర్చుచేస్తారా ? అని యాంకర్ ప్రశ్నించగా చట్టప్రకారమే వెళ్తామని హారిస్ సమాధానమిచ్చారు. ట్రంప్ హయాంలో కూడా ఇలాంటి సర్జరీలు జరిగాయని హారిస్ అన్నారు. అయితే ట్రంప్ హయాంలో కొందరు ఖైదీలకు హార్మోన్ థెరపీ చేశారుగానీ ఇలాంటి ఆపరేషన్లు జరగకపోవడం గమనార్హం. బైడెన్ హయాంలోనే ఇలాంటి ఆపరేషన్లు జరగడం విశేషం. వారసత్వ పాలన కాబోదు బైడెన్‌తో పోలిస్తే ఉపాధ్యక్షురాలిగా మీరేమైనా చేశారా? అని గతంలో ‘ది వ్యూ’టాక్‌షోలో అడిగిన ప్రశ్నకు ‘నాకేం గుర్తురావట్లేవు’అని హారిస్ చెప్పిన సమాధానాన్ని యాంకర్ ప్లే చేసి హారిస్‌ను ఇరకాటంతో పెట్టారు. అధికారంలో ఉన్న సొంత పార్టీ నేత బైడెన్ అనుసరిస్తున్న విధానాలను అధ్యక్షురాలిగా కొనసాగిస్తారా? అని ప్రశ్నించగా ‘నా పరిపాలన అనేది బైడెన్ పాలనకు కొనసాగింపుగా ఉండబోదు. నా జీవితపాఠాల సారాన్ని, ప్రాసిక్యూటర్‌గా, జిల్లా అటారీ్నగా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా వృత్తి అనుభవాన్ని, ఉపాధ్యక్షురాలిగా పరిపాలనా దక్షతను జోడించి ప్రజారంజకంగా పరిపాలిస్తా ’అని హారిస్ హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఓడిన ట్రంప్‌కు ఇంకా మద్దతు ఇస్తున్న వాళ్లను తెలివితక్కువ వాళ్లుగా, విషయపరిజ్ఞానం లేని వాళ్లుగా పరిగణిస్తారా? అని ప్రశ్నించగా ‘అమెరికా ప్రజలను అంతమాట నేను ఎప్పుడూ అనలేదు’అని హారిస్ స్పష్టంచేశారు. బైడెన్ మానసిక స్థితిపై.. ‘‘మా పార్టీ నేత జో బైడెన్ నిర్ణయాలు ఏనాడూ తప్పుకాలేదు. అమెరికా ప్రజల కోసం అధ్యక్షుడిగా ఆయన ఎన్నో కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయనతో పోలిస్తే ట్రంప్ అసమర్థుడు. అధ్యక్ష పీఠంపై కూర్చునే అర్హత ఆయనకు లేదు. ట్రంప్ అమెరికా ప్రజాస్వామ్యానికి ప్రమాదకారి. అయినా బైడెన్ గురించి ఇక్కడ ప్రస్తావన అనవసరం. ఎందుకంటే ఇప్పుడు బైడెన్ రేసులో లేరు. ట్రంప్ గురించే మాట్లాడదాం’’అని హారిస్ అన్నారు. మహిళల అబార్షన్ వంటి కీలక అంశం ఇంటర్వ్యూలో అస్సలు చర్చకురాలేదు. ప్రధానంగా సరిహద్దు భద్రత, వలసలపైనే ఎక్కువ సేపు ఇంటర్వ్యూ సాగింది. -
USA Presidential Elections 2024: ఫాక్స్ డిబేట్‌కు రాను: కమల
వాషింగ్టన్: ఫాక్స్ న్యూస్ చానెల్లో డిబేట్‌కు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తోసిపుచ్చారు. నిజానికి అధ్యక్షుడు జో బైడెన్ ఆ పార్టీ అభ్యర్థిగా ఉండగా ఆయనతో సెప్టెంబర్ 10న ఏబీసీ చానల్లో రెండో డిబేట్‌కు ట్రంప్ అంగీకరించారు. అనంతరం బైడెన్ బదులు హారిస్ అభ్యర్థి అవడం తెలిసిందే. ఏబీసీ బదులు ఫాక్స్ న్యూస్ చానల్లో సెప్టెంబర్ 4న డిబేట్‌కు సిద్ధమని ట్రంప్ శనివారం ప్రకటించారు. దీన్ని హారిస్ తప్పుబట్టారు. ‘‘ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్న ట్రంప్ ఇప్పుడేమో ఫలానా సమయంలో, ఫలానా చోటే అనడం ఆశ్చర్యకరం. అంగీకరించిన మేరకు సెప్టెంబర్ 10న ఏబీసీ న్యూస్‌లో చర్చకు నేను సిద్ధం. ఆయన పాల్గొంటారని ఆశిస్తున్నా’’ అన్నారు. డిబేట్‌కు ట్రంప్ భయపడుతున్నారని హారస్ ప్రచార బృందం వ్యాఖ్యానించింది. ఆయన తమాషాలు మానుకోవాలని హితవు పలికింది. -
Donald Trump: ‘ఫాక్స్’లో అయితేనే డిబేట్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులైన డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. సెపె్టంబర్ 10న ఏబీసీ చానల్లో హారిస్‌తో జరగాల్సిన డిబేట్ నుంచి తప్పుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ‘‘నిజానికది జో బైడెన్‌తో జరగాల్సిన డిబేట్. ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకున్నందున ఆ డిబేట్ కూడా రద్దయినట్టే’’ అని వాదించారు. ఈ మేరకు సొంత సోషల్ మీడియా హాండిల్ ‘ట్రూత్’లో తాజాగా ట్రంప్ పలు పోస్టులు పెట్టారు. ఫాక్స్ న్యూస్ చానల్లో అయితేనే డిబేట్‌కు వస్తానంటూ మెలిక పెట్టారు. ‘‘సెప్టెంబర్ 4న పెన్సిల్వేనియాలో ఫాక్స్ స్టూడియోలో హారిస్ చర్చకు రావాలి. ఖాళీ స్టూడియోలో కాకుండా కిక్కిరిసిన ప్రేక్షకుల నడుమ డిబేట్ చేద్దాం’’ అని సవాలు విసిరారు. దీనిపై హారిస్ వర్గం మండిపడింది. పిరికితనంతో డిబేట్ నుంచి ట్రంప్ పారిపోతున్నారంటూ ఎద్దేవా చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ రాకపోయినా కేవలం హారిస్‌తో ఏబీసీ డిబేట్ కొనసాగుతుందా అన్నది చూడాల్సి ఉంది. డెమొక్రాట్ల తరఫున అధ్యక్షుడు బైడెన్‌కు బదులు హారిస్ అధ్యక్ష రేసులో అడుగు పెట్టినప్పటి నుంచీ ఆమెతో డిబేట్‌కు ట్రంప్ వెనకా ముందాడుతూ వస్తున్నారు. తామిద్దరి గురించీ అమెరికన్లకు ఇప్పటికే అంతా తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ తనతో డిబేట్‌కు రావాల్సిందేనని హారిస్ పట్టుబడుతున్నారు. గూగుల్‌పై ట్రంప్ మండిపాటుతన వార్తలను, ఫొటోలను గూగుల్ సెన్సార్ చేస్తోందని, ప్రజలకు వాస్తవాలు చేరనివ్వడం లేదని ట్రంప్ మండిపడ్డారు. తనకు సంబంధించిన వార్తలను, సమాచారాన్ని ఫేసుబుక్‌లో సెన్సార్ చేసినందుకు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తనకు క్షమాపణ చెప్పారన్నారు. -
ట్రంప్ నోట మళ్లీ భారత్‌పై పన్ను మాట
వాషింగ్టన్: భారత్‌లో కొన్ని ఉత్పత్తులపై టారిఫ్‌లు అధికంగా ఉన్నాయంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అధ్యక్ష పగ్గాలు మళ్లీ చేపడితే భారత్‌పై ప్రతీకార పన్ను విధిస్తాననని పేర్కొన్నారు. తాజాగా ఆయన ఫాక్స్ బిజినెస్ న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘భారత్‌లో ట్యాక్సులు మరీ ఎక్కువ. హార్లీ డేవిడ్ సన్లాంటి అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా పన్నులు వేస్తోంది. అక్కడ 100 శాతం, 150, 200 శాతం వరకు పన్నులున్నాయి. మనం మాత్రం వారి ఉత్పత్తులకు ఎలాంటి పన్నులు విధించకూడదా? అది సరికాదు. మనం కూడా పన్నులు వసూలు చేయాల్సిందే. 2024 అధ్యక్ష ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే భారత్‌పై పరస్పర సమానమైన ప్రతీకార పన్ను విధిస్తా’అని ఆయన హెచ్చరించారు. -
రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులో ఆపేవాణ్ని: ట్రంప్
వాషింగ్టన్: 2020 ఎన్నికల్లో మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా–ఉక్రెయిన్ల యుద్ధం జరిగి ఉండేదే కాదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తనకున్న మంచి సంబంధాల దృష్ట్యా, అసలు ఈ యుద్ధం మొదలయ్యేదే కాదన్నారు. ఇటీవల ఫాక్స్ న్యూస్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా రష్యా–ఉక్రెయిన్ సంక్షోభానికి 24 గంటల్లోనే ముగింపు పలికి ఉండేవాడినని చెప్పుకున్నారు. ‘‘2024 దాకా యుద్ధం కొనసాగితే, నేను మళ్లీ అధ్యక్షుడినైతే ఒక్క రోజులోనే శాంతి ఒప్పందం కుదురుస్తా. నాకు, పుతిన్‌కు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య శాంతి చర్చలు చాలా ఈజీ వ్యవహారం. సంక్షోభం ఇలాగే కొనసాగితే, అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటికి మూడో ప్రపంచయుద్దానికి దారితీసి, అణుయుద్ధంగా మారే ప్రమాదముంది. రెండు ప్రపంచ యుద్ధాలు మూర్ఖుల కారణంగా స్వల్ప కారణాలతోనే జరిగాయి’’ అన్నారు. -
ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్: ట్విటర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ట్విటర్ లేకపోతే నేను ఇక్కడ ఉండేవాణ్ని కాదేమోన’ని అన్నారు. మీడియా అసత్యపు ప్రచారాలను దాటి ప్రజల్లోకి వెళ్లడానికి సామాజిక మాధ్యమం ట్విటర్ తనకు ఉపయోగపడుతోందని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు. ‘నాకు ఒక నకిలీ, నిజాయితీ లేని మీడియా లభించింది’అని అమెరికాలో మూడు ప్రధాన మీడియా సంస్థలైన ఏబీసీ, సీబీఎస్, ఎన్బీసీలను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మూడు మీడియా సంస్థలు తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని వాపోయారు. ఫాక్స్ న్యూస్ మాత్రం తనకు అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే ఎన్నికలకు ముందు ట్రంప్ టవర్స్‌లోని తన ఫోన్లను నాటి అధ్యక్షుడు ఒబామా ట్యాప్ చేశారని ట్రంప్ మార్చి 4న ట్విటర్ ద్వారా ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఏ ఆధారాలూ లభించలేదని పేర్కొనగా, ఆధారాలను కమిటీకి త్వరలోనే సమర్పిస్తామని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు.