ఫాక్స్‌న్యూస్‌ ఇంటర్వ్యూలో హారిస్‌.. సారీలు.. హామీలు | USA Presidential Elections 2024: Kamala Harris interview with Fox News | Sakshi
Sakshi News home page

USA Presidential Elections 2024: ఫాక్స్‌న్యూస్‌ ఇంటర్వ్యూలో హారిస్‌.. సారీలు.. హామీలు

Published Fri, Oct 18 2024 5:03 AM | Last Updated on Fri, Oct 18 2024 11:02 AM

USA Presidential Elections 2024: Kamala Harris interview with Fox News

వాషింగ్టన్‌: మూడు వారాల్లోపు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ ప్రచార జోరు పెంచారు. ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు పలుకుతూ ఆయనను తరచూ ఇంటర్వ్యూచేసే ‘ఫాక్స్‌ న్యూస్‌’వార్తాసంస్థకు బుధవారం హారిస్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. లక్షలాది మంది రిపబ్లికన్‌ మహిళా ఓటర్ల మనసునూ గెల్చుకునే ప్రయత్నంచేశారు. యాంకర్‌ బ్రెట్‌ బేయర్‌ అడుగడుగునా అడ్డుతగిలి ప్రశ్నలబాణాలు సంధిస్తుంటే హారిస్‌ వాటికి దీటుగా ఎదుర్కొని ఇంటర్వ్యూను రక్తికట్టించారు. హోరాహోరీగా సాగిన ఈ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు కొన్ని.. 

వలస బిల్లుపై తొలి సంతకం 
అమెరికాలోకి అక్రమంగా వలసవచి్చన వ్యక్తి చేతిలో హత్యకు గురైన 12 ఏళ్ల జాస్లిన్‌ నంగరే తల్లి పడే ఆవేదన వీడియోను యాంకర్‌ తొలుత హారిస్‌కు చూపించారు. అక్రమ వలసదారుల చేతుల్లో చనిపోతున్న అమెరికన్ల కుటుంబాలను క్షమాపణ కోరాలని మీకెప్పుడూ అనిపించలేదా? అని యాంకర్‌ ప్రశ్నించగా.. ‘చిన్నారిని కోల్పోయాం. ఈ విషయంలో నన్ను క్షమించండి’అని హారిస్‌ సారీ బేషరతుగా సారీ చెప్పారు. అక్రమ వలసలకు మద్దతు పలుకుతూ, వారిపై క్రిమినల్‌ కేసులను ఎత్తేయాలంటూ హారిస్‌ గతంలో చేసిన వ్యాఖ్యలను యాంకర్‌ వినిపించారు. ఈ అంశంలో మాట మార్చారని దెబ్బిపొడిచారు. దీంతో హారిస్‌ ‘సరిహద్దు దాటి అక్రమ చొరబాట్లపై నేరాలను మోపాల్సిందే. నాటి అభిప్రాయాలు ఉపాధ్యక్షురాలిగా చేసినవి కాదు. ఇకమీదట అధ్యక్షురాలినైతే అలా చేయను. అస్తవ్యస్తంగా ఉన్న వలస విధానాన్ని సంస్కరిస్తా. నేను దేశాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసల కట్టడిపైనే చట్టం తెస్తా. ఆ బిల్లుపైనే తొలి సంతకం చేస్తా’అని హారిస్‌ అన్నారు. 

ఖైదీల లింగమార్పిడి సర్జరీలపై.. 
ఖైదీల లింగ మార్పిడి శస్త్రచికిత్సల కోసం ప్రజాధనాన్ని ఖర్చుచేస్తారా ? అని యాంకర్‌ ప్రశ్నించగా చట్టప్రకారమే వెళ్తామని హారిస్‌ సమాధానమిచ్చారు. ట్రంప్‌ హయాంలో కూడా ఇలాంటి సర్జరీలు జరిగాయని హారిస్‌ అన్నారు. అయితే ట్రంప్‌ హయాంలో కొందరు ఖైదీలకు హార్మోన్‌ థెరపీ చేశారుగానీ ఇలాంటి ఆపరేషన్లు జరగకపోవడం గమనార్హం. బైడెన్‌ హయాంలోనే ఇలాంటి ఆపరేషన్లు జరగడం విశేషం.  

వారసత్వ పాలన కాబోదు 
బైడెన్‌తో పోలిస్తే ఉపాధ్యక్షురాలిగా మీరేమైనా చేశారా? అని గతంలో ‘ది వ్యూ’టాక్‌షోలో అడిగిన ప్రశ్నకు ‘నాకేం గుర్తురావట్లేవు’అని హారిస్‌ చెప్పిన సమాధానాన్ని యాంకర్‌ ప్లే చేసి హారిస్‌ను ఇరకాటంతో పెట్టారు. అధికారంలో ఉన్న సొంత పార్టీ నేత బైడెన్‌ అనుసరిస్తున్న విధానాలను అధ్యక్షురాలిగా కొనసాగిస్తారా? అని ప్రశ్నించగా ‘నా పరిపాలన అనేది బైడెన్‌ పాలనకు కొనసాగింపుగా ఉండబోదు. నా జీవితపాఠాల సారాన్ని, ప్రాసిక్యూటర్‌గా, జిల్లా అటారీ్నగా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా వృత్తి అనుభవాన్ని, ఉపాధ్యక్షురాలిగా పరిపాలనా దక్షతను జోడించి ప్రజారంజకంగా పరిపాలిస్తా ’అని హారిస్‌ హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఓడిన ట్రంప్‌కు ఇంకా మద్దతు ఇస్తున్న వాళ్లను తెలివితక్కువ వాళ్లుగా, విషయపరిజ్ఞానం లేని వాళ్లుగా పరిగణిస్తారా? అని ప్రశ్నించగా ‘అమెరికా ప్రజలను అంతమాట నేను ఎప్పుడూ అనలేదు’అని హారిస్‌ స్పష్టంచేశారు. 

బైడెన్‌ మానసిక స్థితిపై.. 
‘‘మా పార్టీ నేత జో బైడెన్‌ నిర్ణయాలు ఏనాడూ తప్పుకాలేదు. అమెరికా ప్రజల కోసం అధ్యక్షుడిగా ఆయన ఎన్నో కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయనతో పోలిస్తే ట్రంప్‌ అసమర్థుడు. అధ్యక్ష పీఠంపై కూర్చునే అర్హత ఆయనకు లేదు. ట్రంప్‌ అమెరికా ప్రజాస్వామ్యానికి ప్రమాదకారి. అయినా బైడెన్‌ గురించి ఇక్కడ ప్రస్తావన అనవసరం. ఎందుకంటే ఇప్పుడు బైడెన్‌ రేసులో లేరు. ట్రంప్‌ గురించే మాట్లాడదాం’’అని హారిస్‌ అన్నారు. 

మహిళల అబార్షన్‌ వంటి కీలక అంశం ఇంటర్వ్యూలో అస్సలు చర్చకురాలేదు. ప్రధానంగా సరిహద్దు భద్రత, వలసలపైనే ఎక్కువ సేపు ఇంటర్వ్యూ సాగింది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement