
బాంబు పేల్చిన అమెరికా ఉపాధ్యక్షుడు
గ్రీన్‌కార్డున్నా తిప్పి పంపుతామని వ్యాఖ్యలు
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా వలస విధానంపై ఇప్పటికే ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆందోళనలను మరింతగా పెంచే పరిణామం చోటుచేసుకుంది. డాలర్ డ్రీమ్స్‌ను నిజం చేసుకోవడానికి రాచబాటగా భావించే అమెరికా గ్రీన్‌కార్డుపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌కార్డు ఉన్నంతమాత్రాన అమెరికాలో నివాసానికి, పని చేయడానికి శాశ్వత హక్కులు దఖలు పడ్డట్టు కాదని స్పష్టం చేశారు.
న్యూయార్క్‌లోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ విద్యార్థి మహ్మద్ ఖలీల్ యూదు విద్వేష ఆరోపణలపై ఇటీవలే అరెస్టవడం తెలిసిందే. అతను గ్రీన్‌కార్డు హోల్డరే కావడాన్ని ప్రస్తావిస్తూ వాన్స్ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇదేమీ వాక్ స్వాతంత్య్రానికి సంబంధించిన అంశం కాదు. జాతీయ భద్రతకు సంబంధించిన అతి కీలకమైన విషయం. అంతకుమించి, అమెరికాలో శాశ్వత నివాసులుగా మాతోపాటు ఎవరుండాలన్న దానికి సంబంధించిన అంశం. దీన్ని నిర్ణయించేది అమెరికన్లు మాత్రమే’’ అంటూ కుండబద్దలు కొట్టారు.
ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా, ముఖ్యంగా భారత్‌లో దుమారం రేపుతున్నాయి. ఏటా భారీ సంఖ్యలో అమెరికా బాట పట్టే భారత విద్యార్థులందరికీ గ్రీన్‌కార్డు ఒక బంగారు కల. అది చిక్కిందంటే అమెరికాలో శాశ్వత నివాసం దక్కినట్టేనని భావిస్తారు. వాన్స్ వ్యాఖ్యలు వారినేగాక అమెరికాలో గ్రీన్‌కార్డు హోల్డర్లయిన లక్షలాది మంది భారతీయులను కూడా కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
గురువారం ఫాక్స్ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా వలస విధానాలకు సంబంధించి వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కొలంబియా వర్సిటీలో హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న విద్యార్థి ఖలీల్ కూడా గ్రీన్‌కార్డు హోల్డరే. అందుకే చెబుతున్నా, గ్రీన్‌కార్డు హోల్డర్‌కు అమెరికాలో శాశ్వతంగా ఉండిపోయే హక్కు లేదు’’ అని స్పష్టం చేశారు.
గ్రీన్‌కార్డు హోల్డర్లయినా సరే, అమెరికా భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు అనుమానిస్తున్న విద్యార్థులు తదితరులపై కఠిన చర్యలకు ట్రంప్ సర్కారు సిద్ధమవుతోందని ఉపాధ్యక్షుడు ప్రకటించారు. ‘‘వారి ఉనికి అమెరికాకు ముప్పని తేలిన పలువురిని త్వరలో తిప్పి పంపుతున్నాం. ఈ జాబితాలో విద్యార్థులతో పాటు ఇతరులు కూడా ఉన్నారు’’ అని వివరించారు. ట్రంప్ రాకతో అమెరికాలోకి అక్రమ వలసలు 95 శాతానికి పైగా తగ్గిపోయాయన్నారు.
ఏమిటీ గ్రీన్‌కార్డు?
పర్మనెంట్ రెసిడెంట్ (శాశ్వస నివాస) కార్డు. గ్రీన్‌కార్డుగా భారత్‌లో దాదాపు ఇంటింటికీ పరిచయం. ఇది విదేశీ పౌరులకు అమెరికాలో నివసించేందుకు, పని చేసుకునేందుకు హక్కు కల్పిస్తుంది. అంతేగాక కోరుకున్న కంపెనీలో పని చేయవచ్చు. సొంత వ్యాపారం వంటివీ చేసుకోవచ్చు. గ్రీన్‌కార్డు పొందిన మూడు నుంచి ఐదేళ్లకు పౌరసత్వం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నిజానికిది పేరుకే శాశ్వత నివాస కార్డు.
వాన్స్ చెప్పినట్టుగా అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు హక్కు కల్పించదు. దీన్ని పదేళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు. కొన్ని పరిస్థితుల్లో గ్రీన్‌కార్డును రద్దు చేయవచ్చు. నేర కార్యకలాపాల్లో పాల్గొన్నా, చాలాకాలం పాటు అమెరికాకు దూరంగా ఉన్నా, వలస నిబంధనలను ఉల్లంఘించినా గ్రీన్‌కార్డును కోల్పోతారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు దశాబ్దాలుగా గ్రీన్‌కార్డుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారిలో చాలామందికి కార్డు దక్కాలంటే 50 ఏళ్ల దాకా పట్టొచ్చట.
కొన్ని కేటగిరీల వాళ్లకైతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి గ్రీన్‌కార్డు రావాలంటే 134 సంవత్సరాలు పడుతుంది! 3.4 కోట్ల మందికి పైగా గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తుండగా వారిలో 11 లక్షల మందికి పైగా భారతీయులే! వీరిలో 4 లక్షల మంది తమ జీవితకాలంలో కార్డును కళ్లజూడలేరన్నది ఇమిగ్రేషన్ నిపుణుల మాట. అమెరికా ఏటా గరిష్టంగా 6.75 లక్షల గ్రీన్‌కార్డులు మాత్రమే జారీ చేస్తుంది. వాటిలో ఏ దేశానికీ 7 శాతానికి మించి ఇవ్వరాదన్న నిబంధన ఉంది. ఇదే భారతీయులకు పెద్ద అడ్డంకిగా మారింది. ప్రస్తుతం అమెరికాలో గ్రీన్‌కార్డున్న భారతీయుల సంఖ్య 3 లక్షలకు పైగా ఉంటుంది.
గోల్డ్ కార్డు రాకతో...
అమెరికాలో శాశ్వత నివాసానికి ట్రంప్ ఇటీవల కొత్తగా గోల్డ్ కార్డు స్కీమును ప్రకటించిన నేపథ్యంలో గ్రీన్‌కార్డు ప్రాధాన్యతను తగ్గించేలా వాన్స్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘ఇప్పటిదాకా గ్రీన్‌కార్డుంది. ఇకపై గోల్డ్‌కార్డు తెస్తున్నాం. గ్రీన్‌కార్డు ఇచ్చే సదుపాయాలన్నింటినీ ఇదీ ఇస్తుంది. వాటితో అదనంగా అమెరికాలో శాశ్వత నివాసానికి, పౌరసత్వానికి కూడా గోల్డ్‌కార్డు రాచమార్గం’’ అని ట్రంప్ చెప్పు కొచ్చారు.
అమెరికాలోని అత్యున్నత వర్సిటీల్లో చదివే ప్రతిభావంతులు, భారతీయ విద్యా ర్థులు దేశం దాటకుండా ఆపడంలో తమ వలస విధానం విఫలమైందని ఆయన ఆక్షేపించారు. గోల్డ్‌కార్డుకు 50 లక్షల డాలర్లు (రూ.43.54 కోట్లు) ఫీజుగా నిర్ణయించారు. ‘‘కనీసం కోటి గోల్డ్‌కార్డులు అమ్మాలన్నది మా లక్ష్యం. తద్వారా వచ్చే ఆదాయంతో అమెరికా అప్పు తీరుస్తాం’’ అని ట్రంప్ ప్రకటించారు. 1990 నుంచి అమల్లో ఉన్న ఈబీ–5 వీసాలను గోల్డకార్డు భర్తీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment