
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ భాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా యూఎస్‌ఏలో ఉంటున్న విదేశీయులపై ట్రంప్ సర్కారు(Trump administration) ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. గ్రీన్‌కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వత నివాసితులు కాలేరని అమెరికా దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో భారతీయ సంతతికి చెందిన లక్షలాది మంది వలసదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని వారాలుగా యూఎస్ ఇమ్మిగ్రేషన్ నియమాలను మరింత కఠినతరం చేశారు.
సహనానికి పరీక్ష
ఈ నేపధ్యంలో అమెరికాలోకి ప్రవేశించే, నిష్క్రమించే హెచ్-1బీ, ఎఫ్-1, గ్రీన్‌కార్డు వీసాదారులను(H-1B, F-1, and Green Card visa holders) అమెరికా ఏజెన్సీలు గమనిస్తున్నాయి. ఆ వీసాలతో వారి చదువు, ఉద్యోగాల వివరాలను తనిఖీ చేస్తున్నాయి. ఇది వీసాదారుల సహనానికి పరీక్షగా మారుతున్నదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇమ్మిగ్రేషన్ అధికారులు గ్రీన్ కార్డ్, హెచ్-1బీ హోల్డర్లకు ప్రయాణ సమయంలో వారి ఆధారాలను అందుబాటులో ఉంచుకోవాని సూచించారు. యుఎస్‌లో నివసిస్తున్నలక్షలాది మంది భారతీయులు గ్రీన్ కార్డ్ లేదా హెచ్-1బి లేదా ఎఫ్-1 వీసాలను కలిగి ఉన్నారు. వీరు అమెరికాకు తిరిగి వచ్చే సమయంలో ఎంట్రీ పోర్ట్‌లో వారి ఆధారాలను చూపించాల్సి ఉంటుంది.
తనిఖీలు ముమ్మరం
శాశ్వత నివాసితులు, చట్టపరమైన వీసాదారులు వారి నివాస స్థితి లేదా పని చెల్లుబాటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ, ఈ తనిఖీలు వారికి ఇబ్బందికరంగా మారాయి. ప్రపంచంలోని 43 దేశాలకు చెందిన ప్రజలు అమెరికాలోకి ప్రవేశించకుండా ఉందేందుకు లేదా వారి రాకను పరిమితం చేయడానికి డొనాల్డ్ ట్రంప్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసిన తరువాత ఈ విధమైన తనిఖీలు ముమ్మరమయ్యాయి. అమెరికాలో చట్టాన్ని గౌరవిస్తూ, పన్ను చెల్లించే భారతీయులకు ఎటువంటి ప్రయాణ నిషేధం లేదా పరిమితులు లేనప్పటికీ వారు మరింత జాగ్రత్తగా ఉండాలని ఇమ్మిగ్రేషన్ అధికారులు సూచించారు.
దరఖాస్తుల ప్రాసెస్‌లో జాప్యం
గత కొన్ని వారాలుగా ఎంట్రీ పోర్ట్‌లో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు(American Embassies), కాన్సులేట్‌లలో ముమ్మర తనిఖీల కారణంగా ప్రయాణికులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎన్‌డీటీవీ ఒక కథనంలో పేర్కొంది. అమెరికాకు వెళ్లేవారి డాక్యుమెంటేషన్ పరిశీలన ఇప్పుడు పలు దశలుగా సాగుతోంది. దీంతో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఫలితంగా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి సమయాన్ని అధికారులు పొడిగిస్తున్నారు. గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాసితులు), హెచ్-1B (అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు), ఎఫ్-1 (విద్యార్థులు) వీసా హోల్డర్లు ప్రయాణ సమయంలో తమ చెక్-లిస్ట్‌ను అందుబాటులో ఉంచుకోవాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: చట్టం అందరికీ సమానమేనా?: స్టూడియో విధ్వంసంపై కునాల్ కమ్రా
Comments
Please login to add a commentAdd a comment