caution
-
అతిగా కాఫీ తాగడం కూడా ఒక వ్యసనమేనని మీకు తెలుసా!?
రవికుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. 29 సంవత్సరాలు. కాలేజీ రోజుల్లో అర్ధరాత్రి చదువుల కోసం కాఫీ తాగడం మొదలుపెట్టాడు. క్రమంగా అది అలవాటుగా మారింది. ఉద్యోగంలో చేరాక పనిలో ఒత్తిడి తట్టుకోవడానికి కాఫీ తీసుకోవడం ఎక్కువైంది. మొదట్లో రోజూ ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగేవాడు. కొన్ని సంవత్సరాలుగా అది రోజుకు ఐదారు కప్పులకు పెరిగింది.ప్రతి కప్పులో సుమారు 100–150 మి. గ్రా. కెఫీన్ ఉంటుంది. కాఫీతో పాటు కోలా, ఎనర్జీ డ్రింక్స్ కూడా తాగడం వల్ల అతను రోజూ 600 మి. గ్రా. కంటే ఎక్కువ కెఫీన్ తీసుకుంటున్నాడు. ఇది రోజువారీ పరిమితి కంటే 400 మి. గ్రా. ఎక్కువ. ఇప్పుడు కాఫీ లేదా సాఫ్ట్ డ్రింక్ తాగకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాడు. మానాలని ప్రయత్నించినా సాధ్యంకావట్లేదు. కాఫీ మానేస్తే విపరీతంగా తలనొప్పి. నిద్ర పట్టట్లేదు. డాక్టర్‌ను కలిశాడు. అతను కాఫీకి అడిక్ట్ అయ్యాడని, మానేయమని చెప్పాడు. మానేశాడు. మళ్లీ తలనొప్పి, నిద్ర పట్టకపోవడం మామూలయ్యాయి. దాంతో డాక్టర్ సలహా మేరకు సైకాలజిస్ట్‌ని సంప్రదించాడు. సైకాలజీ అనగానే ఆశ్చర్యపోయాడు రవికుమార్. ‘ఏంటి సర్, కాఫీ తాగడమేమైనా మెంటల్ ఇల్నెసా? దానికి కూడా సైకాలజిస్ట్‌ను కలవాలా?’ అని అడిగాడు.‘అతిగా ఏ పని చేసినా అది వ్యసనమే. కాఫీ వ్యసనంగా మారడం, దాన్నుంచి బయటపడలేకపోవడం కూడా ఒక మానసిక సమస్యే. ఒక పద్ధతి ప్రకారం దాన్నుంచి బయటపడాలి. అందుకు సైకోథెరపీ అవసరం’ అని డాక్టర్ చెప్పారు. దాంతో సైకాలజిస్ట్‌ని సంప్రదించాడు రవికుమార్.మూడు నెలల చికిత్స తర్వాత, రవి విజయవంతంగా రోజుకు ఒక కప్పు కాఫీకి మాత్రమే పరిమితమయ్యాడు. విత్ డ్రాయల్ లక్షణాలేవీ కనిపించలేదు. కెఫీన్ పై ఆధారపడకుండానే పని చేయగలుగుతున్నాడు. ఇప్పుడు మరింత ఎనర్జిటిక్‌గా, కంట్రోల్డ్‌గా ఉంటున్నాడు.కెఫీన్ వ్యసనం లక్షణాలు..– కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్ తాగనప్పుడు తలనొప్పి.– పని ముగించుకుని అలసిపోయినప్పటికీ, రాత్రి నిద్ర పట్టకపోవడం, దీర్ఘకాలిక నిద్ర లేమి.– తక్కువ వ్యవధిలో ఎక్కువ కాఫీ తాగినప్పుడు విశ్రాంతి లేకపోవడం, ఆత్రుత, చికాకు. – స్ట్రాంగ్ కప్ కాఫీ లేకుండా దినచర్య మొదలుపెట్టలేకపోవడం. పని, మీటింగ్స్ అన్నీ కెఫీన్పై ఆధారపడటం. – కెఫీన్ తీసుకోవడం తగ్గించడానికి ప్రయత్నించినప్పుడు, పనితీరు పేలవంగా మారడం. – ఉద్యోగంలో పని ఒత్తిడిని, డిమాండ్స్‌ను ఎదుర్కోవడానికి ఎక్కువ కెఫీన్ తీసుకోవడం. – సరైన ఆహారం, వ్యాయామం వంటి వాటిని వదిలేయడం. శక్తి కోసం కెఫీన్ పై మాత్రమే ఆధారపడటం.విత్ డ్రాయల్ లక్షణాలు..– కాఫీ మానేసిన 24 గంటల్లో తీవ్రమైన తలనొప్పి.– విపరీతమైన అలసట, మామూలు పనులు కూడా చేయలేకపోవడం.– ఆందోళన, కుంగుబాటు.. ఏదో కోల్పోయిన ఫీలింగ్, ఏదో జరుగుతుందన్న భయం. – పనిపై ఏమాత్రం దృష్టి పెట్టలేకపోవడం, గడువులోపు పూర్తి చేయలేకపోవడం, చేసిన పనిలో తప్పులు.నిదానంగా, పద్ధతిగా..హఠాత్తుగా కాఫీ మానేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని గుర్తించిన రవి, వైద్యుని సలహా మేరకు మొదట రోజుకు నాలుగు కప్పులు మాత్రమే తీసుకున్నాడు. ఆ తర్వాత మూడు, ఆ తర్వాత రెండు కప్పులకు పరిమితమయ్యాడు. – నెమ్మదిగా కెఫీన్ లేని కాఫీ, హెర్బల్ టీలకు మారాడు. ఒత్తిడిని తట్టుకునేందుకు కాఫీపై ఆధారపడకుండా ఉండటానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) చికిత్స తీసుకున్నాడు. – కెఫీన్ పై ఆధారపడకుండా పని సంబంధిత ఒత్తిడిని నిర్వహించడానికి మెలకువలను నేర్చుకున్నాడు. – మైండ్‌ఫుల్‌నెస్, శ్వాస వ్యాయామాలు, పని సమయంలో విరామాల ద్వారా ఒత్తిడిని అధిగమించాడు. సమతుల ఆహారం, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, స్థిరమైన నిద్రతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాడు. కెఫీన్ నుంచి వచ్చే శక్తిని సరైన పోషకాహారం, శారీరక శ్రమ ద్వారా వచ్చే సహజ శక్తితో భర్తీ చేశాడు.– అతను కాఫీ లేదా సాఫ్ట్ డ్రింక్ వైపు వెళ్లినప్పుడు వారిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా మద్దతుగా నిలిచారు.– సైకాలజిస్ట్ విశేష్ -
భయపెడుతున్న ఎండలు: వడదెబ్బతో ఎంత ప్రమాదమో తెలుసా?
ప్రతీచోట 44 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బయటకు వెళ్తే వడదెబ్బ తగలడం ఖాయం. జాగ్రత్తలు పాటించకుండా ఎండలో తిరిగితే శరీర ఉష్ణోగ్రతలు అదుపు తప్పుతాయి. దానిని నియంత్రించే వ్యవస్థ బలహీనపడి వడదెబ్బకు గురవుతారు. ఈ నేపథ్యంలో ఎండలో వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎండదెబ్బ తగలకుండా చూసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ పలు అంశాలు వెల్లడించారు. ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.సాక్షి: ఎండలో వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో వేడిని నియంత్రించే వ్యవస్థ విఫలమవుతుంది. ఎండకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్తే గొడుగు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. టోపీ, తలపాగానైనా తప్పకుండా ధరించాలి.సాక్షి: వడదెబ్బకు గురైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: వడదెబ్బకు గురైన వ్యక్తిని త్వరగా నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి. కొబ్బరినీరు, గ్లూకోజ్, సల్ల, ఓఆర్ఎస్ నీటిని తాగించాలి. ఫ్యాన్ గాలి బాగా తగిలేలా చూడాలి. దుస్తులను వదులుగా చేసి తడిగుడ్డతో ఒళ్లంతా తుడవాలి. మనిషికి తగినంత గాలి ఆడేలా చేయాలి. చుట్టూరా మంది గుమిగూడకూడదు. ఉప్పు కలిపిన ద్రవాలు, ఓఆర్ఎస్ ద్రావణం తాగించాలి. కీరదోస ముక్కలు ఎక్కువగా తినిపించాలి.సాక్షి: వడదెబ్బకు ఎలా గురవుతారు.. లక్షణాలేంటి..?డీఎంహెచ్‌వో: తీవ్రమైన వడగాలులు వీచినప్పుడు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. వడదెబ్బకు గురైన వ్యక్తి నాడి వేగంగా కొట్టుకోవడం, నాలుక ఎండిపోవడం, శరీరంలో నీటిని కోల్పోవడం, తీవ్రమైన తలనొప్పితో అపస్మారక స్థితిలోకి చేరుకుంటారు.సాక్షి: వడదెబ్బకు గురైన వ్యక్తిలో కలిగే మార్పులేంటి.. ఆ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: వేడికి శరీరం ఎక్కువసేపు గురికావడం వల్ల సోడియంక్లోరైడ్, నీటి నిష్పత్తి తగ్గిపోతుంది. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల్లో పనిచేసినప్పుడు ప్రతి గంటకు 3 నుంచి 4 లీటర్ల నీటిని చెమట రూపంలో కోల్పోతుంటారు. ఇలాంటి సమయంలో నీరు బాగా తీసుకోవాలి.సాక్షి: వడదెబ్బ ప్రమాదకరమేనా? అత్యవసర సమయంలో వెళ్లాల్సి వస్తే ఎలా?డీఎంహెచ్‌వో: వడదెబ్బ చాలా ప్రమాదకరం. మెదడులోని ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రం హైపోతలామస్ దెబ్బతిని వడదెబ్బకు గురవుతారు. దీనినే సన్‌స్ట్రోక్, హీట్‌స్ట్రోక్ అంటారు. బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ పడకుండా చూసుకోవాలి. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట తిరగకూడదు.సాక్షి: ప్రథమ చికిత్స ఏంటి? ఎలా ఇవ్వాలి?డీఎంహెచ్‌వో: వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకోవాలి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లను తాగించడంతో పాటు చల్లని ప్రాంతంలో పడుకోబెట్టాలి. ముఖ్యంగా 65ఏళ్లు పైబడిన వారు బయటకు వెళ్లరాదు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పసిపిల్లలు, ఏదైనా అనారోగ్య సమస్యలున్నవారు, ముఖ్యంగా గుండెజబ్బులు, బీపీ ఉన్న వారు వెళ్లవద్దు.సాక్షి: వైద్యశాఖ ఆధ్వర్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?డీఎంహెచ్‌వో: ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కువ సమయం చల్లని ప్రదేశాల్లో ఉండాలి. అంతేకాకుండా ప్రతి ఆరోగ్య కేంద్రంలో వడదెబ్బకు సంబంధించిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. ఆస్పత్రికి వెళ్తే చికిత్స అందిస్తారు. తీవ్రత ఎక్కువగా ఉంటే పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలి.సాక్షి: ఎండలో వెళ్లాల్సి వస్తే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: ముఖ్యంగా ఎండకాలంలో వేడి కలిగించే పదార్థాలు తినకూడదు. కూల్‌డ్రింక్స్ అసలే తాగొద్దు. కూల్‌డ్రింక్స్ ప్రమాదకరం. మజ్జిగ, కొబ్బరినీరు మాత్రమే తీసుకోవాలి. వీలైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగాలి. జీలకర్ర దోరగా వేయించి పొడిగా చేసి అరస్పూన్ పొడిని గ్లాస్ నిమ్మరసంలో కలిపి ఉప్పు, చక్కెర వేసుకుని తాగితే ఎనర్జీగా ఉంటుంది.- పుప్పాల శ్రీధర్, జిల్లా వైద్యాధికారిఇవి చదవండి: Dovely Bike Taxi మహిళల కోసం మహిళలే... హైదరాబాదీ అక్కాచెల్లెళ్లు -
తప్పుడు ప్లాట్‌ఫామ్స్‌తో జాగ్రత్త
తప్పుదారి పట్టించే ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్‌పట్ల జాగ్రత్త వహించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఇన్వెస్టర్లను హెచ్చరించింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) మార్గంలో దేశీ ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ అవకాశాలను కల్పించనున్నట్లు పేర్కొనే ప్లాట్‌ఫామ్స్‌పట్ల అప్రమత్తతను ప్రదర్శించవలసిందిగా సూచించింది. మోసగాళ్లు స్టాక్ మార్కెట్ పేరుతో ఆన్లైన్ ట్రేడింగ్ కోర్సులు, సెమినార్లు, మెంటార్íÙప్ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా ఇన్వెస్టర్లను బురిడీ కొట్టిస్తున్నట్లు వివరించింది. ఇందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ తదితర లైవ్ బ్రాడ్క్యాస్ట్లను వినియోగించుకుంటున్నట్లు పేర్కొంది. సెబీ వద్ద రిజిస్టరైన ఎఫ్‌పీఐలు లేదా ఉద్యోగులులా మభ్యపెడుతూ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకునేలా వ్యక్తిగత ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు వెల్లడించింది. సంస్థాగత ఖాతాల లబ్దిని అందుకోమని ప్రోత్సహిస్తూ షేర్ల కొనుగోలు, ఐపీవోలకు దరఖాస్తు తదితరాలను ఆఫర్ చేస్తున్నట్లు తెలియజేసింది. ఇందుకు ఎలాంటి ట్రేడింగ్ లేదా డీమ్యాట్ ఖాతా అవసరంలేదంటూ తప్పుదారి పట్టిస్తున్నట్లు వివరించింది. ఈ పథకాలకు తప్పుడు పేర్లతో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్లను సైతం వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. -
స్ట్రిప్డ్ ఫ్లై మాల్వేర్తో జాగ్రత్త
ఫుకెట్ (థాయిల్యాండ్): సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్స్కీ.. స్ట్రిప్డ్ ఫ్లై అనే మాల్వేర్ విషయమై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. గత ఆరేళ్లలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ మాల్వేర్ బారిన పడినట్టు తెలిపింది. ఆరంభంలో ఇది క్రిప్టోకరెన్సీ మాదిరిగా నటించి, ఆ తర్వాత మొండి మాల్వేర్గా మారిపోయినట్టు పేర్కొంది. ఈ మాల్వేర్ బహుళ మాడ్యూల్‌ను కలిగి ఉండడం, క్రిప్టో మైనర్‌గా, రామ్సమ్వేర్ సమూహంగా వ్యవహరించి.. ఆర్థిక లాభం నుంచి గూఢచర్యం వరకు కార్యకలాపాలు విస్తరించగలదని కాస్పర్స్కీ హెచ్చరించింది. బాధితులపై విస్తృతంగా నిఘా పెట్టే సామర్థ్యాలను ఈ మాల్వేర్ వెనుకనున్న వ్యక్తులు సంపాదించినట్టుగా తెలిపింది. యూజర్‌కు తెలియకుండానే, వారి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ షాట్లు ఈ మాల్వేర్ తీసుకోగలదని, స్మార్ట్‌ఫోన్‌పై గణనీయమైన నియంత్రణ పొందగలదని వివరించింది. స్టిప్డ్ ఫ్లై మాల్వేర్ బారిన పడకుండా కొన్ని చర్యలు సాయపడతాయని తెలిపింది. ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేసుకోవడం, అప్లికేషన్లు, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. అనుమానిత లింక్‌లపై క్లిక్ చేసే ముందు, వ్యక్తిగత వివరాలు షేర్ చేసే ముందు పంపించిన వారి ఐడెంటిటీని పరిశీలించాలని పేర్కొంది. -
రంధ్రాలున్నాయ్ జాగ్రత్త!
సాధారణంగా ఏ ఊరెళ్లినా.. కుక్కలు ఉన్నాయ్ జాగ్రత్త అనో..దొంగలున్నారు జాగ్రత్త అనో బోర్డులు చూస్తుంటాం.కానీ దక్షిణ ఆస్ట్రేలియాలోని కూబర్ పెడీ పట్టణానికి వెళ్తే.. రంధ్రాలున్నాయ్ జాగ్రత్త అనే బోర్డులు దర్శనమిస్తాయ్. ఇంతకీ అక్కడ రంధ్రాలు ఎందుకు ఉన్నాయ్? లోపల ఏం జరుగుతోంది? ఆ పట్టణ కథాకమామీషు ఏమిటి తెలుసుకోవాలని ఉందా? అయితే చలో కూబర్ పెడీ.. మైనింగ్ నుంచి మొదలై.. కూబర్ పెడీ.. దక్షిణ ఆ్రస్టేలియాలోని ఓ మైనింగ్ క్షేత్రం. ఒపాల్ (రత్నం వంటి విలువైన రాయి) గనులకు నిలయంగా పేరొందిన ఈ ప్రదేశం అడిలైడ్‌కు వాయువ్యంగా 590 మైళ్ల దూరంలో స్టువర్ట్ హైవేపై ఉంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఒపాల్స్లో ఎక్కువ భాగం ఈ గ్రేట్ విక్టోరియా ఎడారి అంచున ఉన్న స్టువర్ట్ శ్రేణిలోని మైనింగ్ సైట్ నుంచే వస్తుంది. అసలు ఇక్కడ ఒపాల్ను కనుక్కోవడం కూడా చాలా విచిత్రంగా జరిగింది. 1915లో విల్లీ హచిసన్ అనే బాలుడు తన తండ్రి జేమ్స్‌తో కలిసి గోల్ఫ్ ప్రాక్టీసింగ్ కోసం ఈ ప్రాంతానికి వచ్చాడు. గోల్ఫ్ ఆడే క్రమంలో ఓ చోట ఒపాల్ను చూశాడు. అంతే.. అప్పటివరకు నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతం క్రమంగా పెద్ద పట్టణంగా మారిపోయింది. 1920లో ఈ ప్రాంతానికి కూబర్ పెడీ అని పేరు పెట్టారు. 1960లో దీనిని పట్టణంగా గుర్తించారు. అప్పటి నుంచి ఇది బాగా అభివృద్ధి చెందింది. స్థానికులు అక్కడే ఉంటూ మైనింగ్ చేసేవారు. వేడి నుంచి తప్పించు కోవడానికి.. ఎడారి ప్రాంతం కావడంతో అక్కడ వేసవికాలం ఉండే నాలుగు నెలల కాలం భగభగా మండిపోయేది. ఆ నాలుగు నెలలు ఏకంగా 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి అక్కడివారంతా మైనింగ్ గనుల్లో ఉండేవారు. అనంతరం ఆ భూగర్భంలోనే తాము ఉండటానికి వీలుగా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇళ్లంటే ఏదో సాదాసీదా నిర్మాణాలనుకుంటే పొరపడినట్టే. కోటలను తలపించేలా విలాసవంతమైన ఇళ్లు కట్టుకున్నారు. అంతేకాదు.. హోటళ్లు, స్టోర్లు, లైబ్రరీలు, షాపింగ్ సెంటర్లు, క్రీడా ప్రదేశాలు, ఈత కొలనులు, విశాలమైన స్నానపు గదులు, చర్చిలు.. ఇలా ఒకటేమిటి? భూమిపై పెద్ద పెద్ద నగరాల్లో ఉండే వసతులన్నీ అక్కడ ఉన్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం, నీటి వసతి, డ్రైవ్ ఇన్ మూవీ థియేటర్, గడ్డి లేని గోల్ఫ్ కోర్సు కూడా ఏర్పాటు చేసుకున్నారు. సూర్యకాంతి మినహా సమస్తమూ భూమిపై ఉన్నట్టే ఉంటుంది. కూబర్ పెడీని పై నుంచి చూస్తే.. బోలెడు రంధ్రాలు కనిపిస్తాయి. వీధులన్నీ దుమ్ముతో ఉంటాయ్. రంధ్రాలున్నాయ్ జాగ్రత్త.. అనే హెచ్చరిక బోర్డులు కనిపిస్తాయి. కానీ ఆ రంధ్రాల లోపల ఓ భూగర్భ స్వర్గం ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. అక్కడ భూమిపై 52 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే.. లోపల 23 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక లోపల కరెంటు అవసరాలను సొంతంగానే తీర్చుకుంటున్నారు. 70 శాతం కరెంటును గాలి, సౌరశక్తి ద్వారా సమకూర్చుకుంటున్నారు. ఈ భూగర్భ పట్టణ జనాభా దాదాపు 2500 మంది. నాలుగు మీటర్ల లోతులో.. కూబర్ పెడీలో భూగర్భ భవనాలు తప్పనిసరిగా నాలుగు మీటర్లు (13 అడుగులు) లోతులో ఉండాలి. పైకప్పులు కూలిపోకుండా చూసుకునేందుకే ఈ నాలుగు మీటర్ల నిబంధన విధించారు. ఈ రాతి కింద ఎల్లప్పుడూ 23 డిగ్రీల ఉష్ణోగ్రతతో తేమగా ఉంటుంది. అక్కడ నేలపై వేసవిలో విపరీతమైన వేడి.. శీతాకాలంలో భరించలేని చలి ఉంటుంది. ఒక్కోసారి రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. కానీ భూగర్భ గృహాలు కచి్చతమైన గది ఉష్ణోగ్రత వద్ద సంవత్సరం పొడవునా ఉంటాయి. పైగా ఇందులో ఇళ్లు చాలా సరసమైన ధరకే లభిస్తాయండోయ్. మూడు పడక గదుల ఇల్లు దాదాపు 26వేల అమెరికా డాలర్లకు వచ్చేస్తుంది. మన రూపాయల్లో చెప్పాలంటే... దాదాపు రూ.21.62 లక్షలు. అదే సమీపంలోని అడిలైడ్‌లో సగటు ఇంటి ధర 4.57 లక్షల అమెరికా డాలర్లు(దాదాపు రూ.3.80 కోట్లు). చూశారా ఎంత వ్యత్యాసం ఉందో? – సాక్షి సెంట్రల్ డెస్క్ ప్రయోజనాలివీ.. భూగర్భ పట్టణంలో నివసించడం వల్ల భూకంపాల నుంచి కొంత వరకు రక్షణ లభిస్తుంది. ఈగలు, దోమల, ఇతరత్రా కీటకాల బెడద ఉండదని స్థానిక నివాసి రైట్ వెల్లడించారు.అవి చీకటి, చలిలోకి రావడానికి ఇష్టపడవని వివరించారు. మనం కూడా ప్రస్తుతం అటు వేడితోనూ.. ఇటు దోమలతోనూ చాలా ఇబ్బందులు పడుతున్నాం.. ఇలాంటి భూగర్భ ఇళ్లేవో ఇక్కడ కూడా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందేమో కదా? -
ఆల్గో ప్లాట్‌ఫామ్స్‌తో జాగ్రత్త
న్యూఢిల్లీ: అల్గోరిథమిక్ ట్రేడింగ్‌ను ఆఫర్ చేసే అనియంత్రిత ప్లాట్‌ఫామ్‌లతో లావాదేవీలు జరిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హెచ్చరించింది. కీలకమైన వ్యక్తిగత వివరాల్లాంటివి వాటికి ఇవ్వొద్దని సూచించింది. ‘ఇలాంటి ప్లాట్‌ఫామ్‌లు నియంత్రణ పరిధిలో లేవు. కాబట్టి వాటిపై ఫిర్యాదుల పరిష్కారానికి ఎటువంటి వ్యవస్థ లేదు. అందుకే ఆయా ప్లాట్‌ఫామ్‌లతో లావాదేవీల విషయంలో ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి‘ అని ఒక ప్రకటనలో సెబీ పేర్కొంది. ట్రేడింగ్ లావాదేవీలను ఆటోమేటిక్‌గా నిర్వహించే ఆల్గో సర్వీసులతో అధిక లాభాలు ఆర్జించవచ్చంటూ ఇటీవలి కాలంలో జోరుగా ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో సెబీ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది. -
15 ఏళ్ల నుంచి తవ్వకాలు.. విలువైన వజ్రం లభ్యం
భోపాల్: రత్నాలు కోసం తవ్వకాలు జరుపుతున్న నలుగురు మైనింగ్ కార్మికులకు వజ్రం లభ్యమైంది. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో గత కొన్నేళ్లుగా రత్నాల కోసం పలు ప్రాంతాల్లో గనుల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అయితే హీరాపూర్ తపారియన్ ప్రాంతంలో రతన్ లాల్ ప్రజాపతి లీజుకు తీసుకున్న భూమిలో 8.22 క్యారెట్స్ వజ్రం దొరికినట్లు పన్నా కలెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. అదే విధంగా లభ్యమైన వజ్రాన్ని, మరికొన్ని రత్నాలను ఈ నెలలో వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. వజ్రం వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ పన్నులు మినహాయించిన తర్వాత సదరు గనులు లీజ్‌కు తీసుకున్నవారికి ఇస్తామని అధికారులు తెలిపారు. చదవండి: దారుణం: కూతురు ప్రేమించిన యువకునిపై సుత్తితో దాడి సెప్టెంబర్ 21 లభ్యమైన వజ్రం, కొన్ని రత్నాలను వేలం వేయనున్నట్లు తెలిపారు. తాజాగా లభ్యమైన వజ్రానికి సుమారు రూ. 40 లక్షలు వేలం పలుకుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ‘గత 15 ఏళ్ల నుంచి పలు గనుల్లో తవ్వకాలు జరుపుతున్నామని కానీ, ఎక్కడా వజ్రాలు లభ్యం కాలేదు. అయితే హిరాపూర్‌లో ఆరు నెలల క్రితం లీజుకు తీసుకున్న గనిలో తమకు వజ్రం లభ్యమైంది’ అని మైనింగ్ కార్మికల్లో ఒకరైన రాఘువీర్ ప్రజాపతి తెలిపారు. గని భాగస్వాములతో కలిసి వేలంలో వచ్చిన డబ్బును తమ పిల్లల చదువులకు ఉపయోగిస్తామని తెలిపారు. చదవండి: రైతుల ఆందోళన: కేంద్రానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు -
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తు నిర్వహణ శాఖ
కృష్ణా: కృష్ణా నది వరద ప్రవాహం పెరుగుతున్నందున.. లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. విజయవాడలో 24 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. కాగా ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 2.57 లక్షలు, ఔట్ ఫ్లో 2.57 లక్షల క్యూసెక్కులుగా ఉంది. రేపు(మంగళవారం) సాయంత్రానికి వరద ఉద్ధృతి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ఇక శ్రీశైలం ఇన్ ఫ్లో 4.35 లక్షలు, ఔట్ ఫ్లో 4.68 లక్షల క్యూసెక్కులు. అలాగే సాగర్ ఇన్ ఫ్లో 3.72 లక్షలు, ఔట్ ఫ్లో 3.55 లక్షల క్యూసెక్కులు. కాగా పులిచింతల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. -
ఈత.. జాగ్రత్త సుమా
సాక్షి,తలమడుగు(బోథ్): వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఒంటి పూట బడులు సైతం ప్రారంభమయ్యాయి. వేడిమి నుంచి ఉపశమనం కోసం పిల్లలు ఈత కొట్టేందుకు మొగ్గుచూపుతుంటారు. ఈ సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఏటా వేసవిలో ఈత కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతున్నాయి. ప్రాణం తీసే సరదా.. సెలవు రోజులతో పాటు మధ్యాహ్న సమయంలో పిల్లలు సమీపంలోని వ్యవసాయ బావులు, చెరువులు, కాలువల్లో సరదాగా ఈతకు వెళుతుంటా రు. నీళ్లను చూడగానే ఉత్సాహంతో అందులోకి దిగుతుంటారు. తీరా దిగాక లోతు ఎక్కువగా ఉండి ఊపిరాడక మృతి చెందుతున్నారు. గతేడాది తలమడుగు మండలం దేవపూర్‌లో ముగ్గురు వి ద్యార్థులు సమీపంలోని క్వారీలో ఈత కోసం వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులు అప్ర మత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీటిలో మునుగుతున్నప్పుడు.. ఈత తెలిసిన వ్యక్తి మాత్రమే నీట మునిగిన వ్యక్తిని రక్షించి బయటకు తీసుకురావాలి. ఈత రానివారు బయటకి తెచ్చే ప్రయత్నం చేయవద్దు. ఇద్దరి ప్రాణాలకు ముప్పే. నీట మునుగుతున్న వ్యక్తికి తాను రక్షిస్తానని చెబుతూ, దగ్గరికి వచ్చినపుడు తనను మాత్రం పట్టుకోవద్దని చెప్పాలి. లేదంటే రక్షించబోయిన వ్యక్తి ప్రమాదంలో చిక్కుకుంటాడు. నీటి మునుగుతున్న వ్యక్తి వద్దకు వెనక నుంచి వెళ్లాలి. బాధితుడు సహకరించకపోతే అతడి వెంట్రుకలు పట్టుకొని ఒడ్డుకు చేర్చాలి. నీటిలో మునుగుతున్న వ్యక్తి ఒడ్డుకు దగ్గరలో ఉంటే టవల్, చీర, ప్యాంట్ వంటివి అందించి పైకి లాగాలి. నీట మునిగితే చేయాల్సిన ప్రథమ చికిత్స నీట మునిగిన వ్యక్తి నీటిని మిండం వలన శ్వాస తీసుకోలేడు. కొన్ని సార్లు బురద శ్వాసావయవాలకు అడ్డుపడవచ్చు. అలాంటప్పుడు ఆ వ్యక్తి నోరును బలవంతంగా తెరిచి వేలితో నోటిలో చేరిన మట్టిని తీసివేయాలి. అనంతరం బాధితుడిని బోర్లా పడుకోబెట్టి తలను ఒక వైపు తిప్పి ఉంచి వీపు బాగాన్ని చేతులతో నొక్కి నీటిని బయటకు పంపాలి. ఇలా తనంతట తాను శ్వాస తీసుకునేంత వరకు నిమిషానికి 16 నుంచి 18 సార్లు నొక్కాలి. తడిసిన బట్టలు మార్చి స్పృహలోకి రాగానే కాఫీ, టీ వంటి వేడి పదార్థాలు ఇవ్వాలి. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. నిపుణుల సూచనలు, జాగ్రత్తలు.. పిల్లలు ఈతకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పెద్దలు(ఈత వచ్చిన వారు) వెంట ఉండాలి. కోచ్‌ల సమక్షంలోనే నేర్చుకోవడం శ్రేయస్కరం. లేదంటే ఈతలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి పర్యవేక్షణలో గాలి నింపిన ట్యూబ్ సాయంతో నేర్చుకోవచ్చు. తోటి పిల్లలు తుంటరి చేష్టలతో ఈతరాని వారిని బావులు, చెరువులు, కాలువల్లోని నీళ్లలోకి తోస్తుంటారు. అలాగే ఒడ్డు, అడుగుబాగం పాకురు (పాచి) పట్టి ఉండటం వల్ల ప్రమాదవశాత్తు జారే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు పిల్లలను ఇలాంటి చోటుకు ఒంటరిగా పంపకపోవడం మంచిది. ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులతో పాటు రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలి. -
ఒంటరిగా తిరగొద్దు.. చిరుత సంచరిస్తోంది
సాక్షి, యాచారం: అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుంది. జాగ్రత్తగా ఉండాలని ఇబ్రహీంపట్నం డివిజన్ అటవీ శాఖ రేంజ్ అధికారి సత్యనారాయణ ప్రజలకు సూచించారు. కొత్తపల్లి గ్రామంలో పక్షం రోజుల క్రితం చిరుత దాడిలో మృతిచెందిన ఆవుదూడకు సంబంధించి రూ. 6 వేల పరిహారాన్ని రైతు ఈగ శ్రీనువాస్‌రెడ్డికి అధికారి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యాచారం, మాడ్గుల, ఆమనగల్లు, కడ్తాల్ మండలాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు తెలిపారు. అటవీ ప్రాంతం సమీప గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని, పగలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అటవీ ప్రాంతంలో పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో చిరుతను పట్టుకుంటామన్నారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ జగన్, గ్రామస్తులు గుండాలు తదితరులు పాల్గొన్నారు. -
మృత్యు పిలుపు.. ఆ మూలమలుపు!
సాక్షి,మోత్కూరు:మండలంలోని పాటిమట్ల గ్రామం శివారులో ఉన్న మూలమలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇక్కడ తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మోత్కూరు నుంచి పాటిమట్ల చెరువుకట్ట వరకు రూ.10 కోట్లతో డబుల్ బీటీ రోడ్డును నిర్మించారు. పాటిమట్ల బృందావన్ కల్వర్టుపై నిర్మించిన రక్షణ గోడలు సరైన ఎత్తులో లేకపోవడం, ప్రమాదాల హెచ్చరికల బోర్డులు లేక తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కల్వర్టు వద్దే మూలమలుపు ఉండటంతో వేగంగా వచ్చే వాహనాలు అదుపుతప్పి పల్టీ కొడుతున్నాయి. ఇటీవల డీసీఎం అదుపుతప్పి కాల్వలోకి పల్టీకొట్టింది. డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. రెండు నెలల్లో పది ప్రమాదాలు.. రెండునెలల క్రితం పూర్తయిన డబుల్ బీటీ రోడ్డుపై ఇప్పటికి పది ప్రమాదాలు జరిగాయి. అయినప్పటికీ అర్అండ్బీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. రోడ్డుపై ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు, ప్రజలు విమర్శిస్తున్నారు. నిబంధనల ప్రకారం కాల్వర్టు నిర్మించకపోకపోవడం అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 4న మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం మోత్యాతండకు చెందిన ఇస్లావత్ సతీష్ అనే కారుడ్రైవర్ మూలమలుపు వద్ద కారు పల్టీకొట్టి అక్కడిక్కకడే మృతిచెందాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇలా రెండునెలల కాలంలో వాహనాలు అదుపుతప్పి సుమారు 50 మందికి పై చిలుకు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదాలు జరగకుండా రక్షణగోడలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. కల్వర్టు పక్కన కాల్వలో పల్టీకొట్టిన కారు. డీఈ వివరణ... ఈ విషయమై డీఈ షహనాజీని వివరణ కోరగా.. రహదారిపై మూలమలుపు వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటుకు టెండర్లు పిలిచామని తెలిపారు. ఎన్నికల అనంతరం పనులను పూర్తిచేస్తామన్నారు. రెండు నెలల్లో పది ప్రమాదాలు మూలమలుపు కల్వర్టు వద్ద, సమీపంలో సుమారు పది ప్రమాదాలు జరిగాయి. కార్లు, బైక్‌లు, ఆటోలు, డీసీఎంలు అదుపుతప్పి పలువురు గాయపడ్డారు. మా గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీనర్సింహారెడ్డి రెండు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. – బండ సంజీవరెడ్డి, పాటిమట్ల కల్వర్టు గోడ ఎత్తు పెంచాలి మూలమలుపు వద్ద బృందావన్ కాల్వపై నిర్మించిన కల్వర్టు గోడలకు ఇరువైపులా ఎత్తు పెంచాలి. సుమారు వందమీటర్ల దూరం ఇరువైపులా రక్షణ గోడ నిర్మించాలి. దీంతో ప్రమదాలను నివారించవచ్చు. –కుర్మెటి యాదయ్య , పాటిమట్ల -
అద్దె గదులన్నింటికీ కాషన్ డిపాజిట్ రద్దు
తిరుమల భక్తులకు ఈనెల 24 నుండి అమలు సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిదర్శనం కోసం వచ్చే భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గదుల కాషన్ డిపాజిట్‌ను ఈ నెల 24 తేదీనుంచి టీటీడీ రద్దు చేయనుంది. రూ. 50 నుంచి ఆపై అద్దె గల అన్ని రకాల అద్దె గదులకు ఇది వర్తిస్తుంది. భక్తులపై పూర్తి విశ్వాసంతో అన్ని రకాల అద్దె గదులకు కాషన్ డిపాజిట్ పద్ధతిని రద్దు చేయాలని టీటీడీ ఈవో సాంబశివరావు నిర్ణయం తీసుకున్నారు. తిరుమల పుణ్యక్షేత్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు త్వరలో బ్యాటరీ ద్వారా నడిచే బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ఈవో వెల్లడించారు. కాగా, శ్రీవారి దర్శనాన్ని ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక సుపథం ద్వారా కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు. 30న దీపావళి ఆస్థానం: శ్రీవారి ఆలయంలో 30న దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఏటా అమావాస్య (దీపావళి) రోజున ఆలయంలో సుప్రభాతం నుంచి మొదటి గంట నివేదన నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 నుండి 9 మధ్య బంగారు వాకిలి ఘంటామండపంలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు. -
'నితీశ్‌ను బాంబుపెట్టి లేపేస్తా'
పట్నా: బిహార్ ఎన్నికల్లో తన సత్తా చాటి మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న జేడీయూ నేత నితీశ్ కుమార్‌ను బాంబు పెట్టి హతమారుస్తానని ఓ గుర్తు తెలియని వ్యక్తి హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల వివరాల ప్రకారం పలు హిందీ వార్తా పత్రికలకు, టీవీ న్యూస్ చానెళ్లకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. త్వరలోనే భారీ స్థాయిలో బాంబులు పెట్టి జేడీయూ నేత ముఖ్యమంత్రి నితీశ్‌ను హత్య చేస్తానని హెచ్చరించాడు. ఈ విషయం సదరు చానెళ్లు పోలీసులకు చెప్పడంతో పోలీసులు విచారణ ప్రారంభించి ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఇకపైనా ఫలితాలే కీలకం
న్యూఢిల్లీ: ఇప్పటికే ద్రవ్యోల్బణం, ఐఐపీ వంటి ఆర్థిక గణాంకాలతోపాటు, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఆర్ఐఎల్ వంటి బ్లూచిప్స్ ఫలితాలు వెలువడ్డ నేపథ్యంలో ఇకపై మార్కెట్లను క్యూ3 ఫలితాలే నడిపిస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అక్టోబర్-డిసెంబర్ కాలానికి(క్యూ3) మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ, క్యాపిటల్ గూడ్స్ దిగ్గజం ఎల్అండ్టీ పనితీరు ఈ వారంలో వెల్లడికానుంది. కాగా, ఈ నెల 28న రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పరపతి సమీక్షను చేపట్టనుంది. ఈ అంశాల కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తతతో వ్యవహరించే అవకాశమున్నదని నిపుణులు పేర్కొన్నారు. గత వారం మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ గత నాలుగు వారాల్లోలేని విధంగా 305 పాయింట్లు(1.5%) ఎగసి 21,064 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం కొంతమేర లాభాల స్వీకరణ కోసం ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టే అవకాశాలున్నాయనేది కొందరు నిపుణుల అభిప్రాయం. 6,350 వద్ద అమ్మకాలు! విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు ఈ వారం కీలకంగా నిలవనున్నాయని పలువురు నిపుణులు పేర్కొన్నారు. వీటికితోడు అంతర్జాతీయ సంకేతాలు కూడా సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. ఇకపై ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు, బ్యాంకింగ్, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్ రంగాల పనితీరును నిశితంగా గమనించాల్సి ఉన్నదని రెలిగేర్ సెక్యూరిటీస్‌కు చెందిన రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ వివరించారు. మార్కెట్లు స్థిరీకరణ దిశలో కదులుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 6,350 పాయింట్ల వద్ద అమ్మకాల ఒత్తిడి(రెసిస్టెన్స్) ఎదురుకావచ్చునని అభిప్రాయపడ్డారు. అయితే 6,150-6,100 పాయింట్ల స్థాయిలో నిఫ్టీకి పటిష్ట మద్దతు లభించవచ్చునని తెలిపారు. ఈ స్థాయిలో కొనుగోళ్లు పుంజుకుంటాయని చెప్పారు. సాంకేతికంగా నిఫ్టీ బుల్లిష్ ధోరణిని కనబరుస్తున్నదని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు. 6,360 స్థాయి వద్ద ఎదురయ్యే అమ్మకాల ఒత్తిడి(రెసిస్టెన్స్)ని తట్టుకుని ముందుకెళ్తే మరింత ఊపందుకుంటుందని అంచనా వేశారు. ఈ నెలాఖరున ఆర్బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో మార్కెట్లలో అప్రమత్తత కనిపిస్తుందని వెరాసిటీ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి చెప్పారు. గత పాలసీ సమీక్షలో రెపో రేటును యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ ద్రవ్యోల్బణం ఉపశమనంతో ఇదే స్థితిని కొనసాగించే అవకాశమున్నదని అభిప్రాయపడ్డారు. ఈ నెల 28 నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్వహించనున్న రెండు రోజుల సమావేశంపై ట్రేడర్లు దృష్టి పెడతారని నిపుణులు పేర్కొన్నారు. ఈ వారంలో ప్రధాన ఫలితాలు హెచ్డీఎఫ్సీ ఎల్ అండ్ టీ అల్ట్రాటెక్ సిమెంట్ కెయిర్న్ ఇండియా గ్లెన్‌మార్క్ ఫార్మా అశోక్ లేలాండ్ సెన్సెక్స్ షేర్లలో ఎఫ్ఐఐల జోరు మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌కు ప్రాతినిధ్యం వహించే అత్యధిక శాతం కంపెనీలలో ఎఫ్ఐఐల పెట్టుబడులు పుంజుకున్నాయి. క్యూ3లో 21 సెన్సెక్స్ షేర్లలో విదేశీ పెట్టుబడుల జోరు పెరిగింది. సెన్సెక్స్‌లో 30 బ్లూచిప్ కంపెనీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, బజాజ్ ఆటో, భెల్, ఓఎన్జీసీ, గెయిల్, టాటా పవర్, సెసా స్టెరిలైట్, హీరో మోటో, టాటా మోటార్స్, మారుతీ, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, విప్రో, డాక్టర్ రెడ్డీస్, ఎంఅండ్ఎం తదితరాల్లో ఎఫ్ఐఐల వాటా పెరిగింది. పెట్టుబడులు తగ్గిన వాటిలో హెచ్‌యూఎల్, ఐటీసీ, కోల్ ఇండియా, ఎస్బీఐ, ఎయిర్టెల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. కాగా, కొత్త ఏడాదిలో ఎఫ్ఐఐలు డెట్ మార్కెట్లకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. జనవరి 1-17 మధ్య నికరంగా రూ. 16,152 కోట్ల(260 కోట్ల డాలర్లు) విలువైన రుణ సెక్యూరిటీలను కొన్నారు. షేర్లలో రూ. 2,148 కోట్ల(34.8 కోట్ల డాలర్లు) నికర పెట్టుబడులు పెట్టారు. -
లెహర్ వర్రీ
అమలాపురం, న్యూస్‌లైన్ :జిల్లావాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ‘లెహర్’ గండం తప్పించమని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. బుధవారం ఎక్కడ చూసినా తాజా తుపాను హెచ్చరికలపైనే చర్చించుకోవడం కనిపించింది. బుధవారం ఉదయం ఎండ కాయగా, మధ్యాహ్నం నుంచి ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యమధ్యలో గాలులు వీస్తుండడం, సముద్రం 30 నుంచి 40 మీటర్లు వెనక్కు వెళ్లిపోవడం లెహర్ రాకకు సంకేతాలుగా భావిస్తున్నారు. తుపాను దిశమార్చుకుందని, ముందుగా చెప్పినట్టు కాకినాడ వద్ద కాక మచిలీపట్నం సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. అయితే జిల్లాపై తీవ్రత ఉంటుందని, పెనుగాలుల ప్రభావం తప్పదని చెప్పడంతో జిల్లావాసులను భయం వీడడం లేదు. కోనసీమవాసుల్లో ఆందోళన మరింత ఎక్కువగా ఉంది. హెలెన్ తుపాను వల్ల ఇప్పటికే చావుదెబ్బ తిన్న ఈ ప్రాంత వాసులు.. లెహర్ తీరం దాటే సమయంలో గంటలకు 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశముందన్న అంచనా ఈ ప్రాంత వాసులను మరింత కలవరానికి గురి చేస్తోంది. పునరావాస కేంద్రాల్లో కొరవడ్డ సదుపాయాలు తీరంలోని మత్స్యకార గ్రామాల్లో కర్ఫ్యూవాతావరణం నెలకొని.. ‘తుపాను ముందరి ప్రశాంతత’ రాజ్యమేలుతోంది. వందలాది కుటుంబాలు పెట్టేబేడా సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతుండడంతో గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. 1996 తుపానును దృష్టిలో పెట్టుకుని పోలీసులు, రెవెన్యూ అధికారులు మత్స్యకారులను పెద్ద ఎత్తున పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తొలుత ఇళ్లు విడిచేందుకు వీరు నిరాకరించినా జేసీ ఎం.ముత్యాలరాజుతోపాటు పలువురు అధికారులు పట్టుబట్టి తరలిస్తున్నారు. తీరంలోని 15 మండలాల్లోని 57 గ్రామాలపై లెహర్ తీవ్ర ప్రభావం చూపుతుందన్న అంచనాతో ఇంత వరకు 29,865 మందిని తరలించారు. వీరి కోసం 73 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా సముద్రతీరాన్ని ఆనుకుని ఉండే వలస మత్స్యకారులను ముందుగా తరలించారు. కోనసీమలో అత్యధికంగా కాట్రేనికోన మండలంలోని మగసానితిప్ప, నీళ్లరేవు, చిర్రయానానికి చెందిన సుమారు ఐదు వేల మందిని కాట్రేనికోన తరలించారు. పల్లం, కొత్తపాలెం, మొల్లేటిమొగ, బలుసుతిప్పకు చెందిన మరికొంతమంది మత్స్యకారులను రాత్రి సమయంలో తరలించనున్నారు. ఐ.పోలవరం మండలంలో భైరవపాలెం నుంచి 3000 మందిని గాడిమొగలోని రిలయన్స్ సంస్థ భవనానికి తరలించారు. గోగుల్లంక, భైరవలంక, జి.మూలపొలం గ్రామాలకు చెందిన సుమారు 1,500 మందిని, ముమ్మిడివరం మండలం సలాదివారిపాలానికి చెందిన 200 మందిని, తాళ్లరేవు పిల్లలంక పంచాయతీ పరిధిలో కొత్తలంకకు చెందిన 150 మందిని, హోప్ ఐలాండ్‌కు చెందిన 200 మందిని, తాళ్లరేవు మండలం గాడిమొగకు చెందిన 500 మందిని, సఖినేటిపల్లి మండలం పల్లిపాలానికి చెందిన 150 మందిని, మలికిపురం మండలంలో తీరప్రాంత గ్రామాల నుంచి 500 మందిని, యానాంలో ఫ్రాన్స్తిప్పకు చెందిన 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే పునరావాస కేంద్రాల్లో కనీస సదుపాయాలు లేక, సరిపడా భోజనం కూడా పెట్టక బాధితులు అవస్థలు పడాల్సి వస్తోంది. యానానికి చెందిన వేటబోట్లు సముద్రంలో చిక్కుకున్నట్టు సమాచారం అందడం అధికారులను పరుగులు పెట్టించింది. అయితే ఈ బోట్లు కోల్‌కతాకు చేరుకున్నట్టు సమాచారం అందడంతో అధికారులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తం లెహర్ తుపానును ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తమవుతున్నారు. లెహర్ ప్రభావం తీవ్రంగా ఉండగలదని భావిస్తున్న ప్రాంతాలకు జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన పదవ బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్బెహరా నేతృత్వంలో 16 బృందాలు, ఆర్మీకి చెందిన మరో రెండు బృందాలు చేరుకున్నాయి. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారికి తుపానును ఎలా ఎదుర్కొనాలో సూచలు చేస్తున్నారు. తీరంలో పదుల సంఖ్యలో తుపాను షెల్టర్లు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉండడంతో వాటికి బదులు ఆయా ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే వందలాదిగా తరలిరావడంతో అవి కూడా కిక్కిరిసిపోతున్నారు. బాధితులకు కిరోసిన్ లాంతర్లు పంపిణీ చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు తహశీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఆదేశించారు. ఆమెతో పాటు జిల్లా ప్రత్యేకాధికారి ఎం.రవిచంద్ర కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్‌లో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మత్స్యకారులెవరైనా సముద్రంలో చిక్కుకుంటే రక్షించేందుకు ఓఎన్జీసీ, రిలయన్స్ వంటి సంస్థల సహకారాన్ని తీసుకోవాలని వారు స్థానికాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏటీఎంల వద్ద క్యూలు లెహర్ తీవ్రత 1996 నాటి తుపానును మించి ఉండగలదన్న హెచ్చరికల నేపథ్యంలో కోనసీమ ప్రజలు నిత్యావసర వస్తువులను ముందస్తుగా నిల్వ చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. వారానికి సరిపడా బియ్యం, పప్పు, ఉప్పులు, కిరోసిన్, కూరగాయలు, తాగునీరు నిల్వ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తుపాను అనివార్యమైతే విద్యుత్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉండడంతో ఏటీఎంలు పనిచేయకపోవచ్చన్న ఆలోచనతో బ్యాంకుల ఖాతాదారులందరూ ముందస్తుగానే కొంత సొమ్మును డ్రా చేసుకుంటున్నారు. కోనసీమలో బుధవారం ఏ ఏటీఎం వద్ద చూసినా జనం క్యూ కట్టి కనిపించారు. పెట్రోల్ బంక్‌లు మూతపడే అవకాశం ఉండడంతో తమ వాహనాల్లో వారానికి సరిపడా పెట్రోల్, డీజిల్ నింపుకొంటున్నారు. పాల సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పాలపొడి ప్యాకెట్లను కూడా సిద్ధం చేసుకుంటున్నారు.