సాధారణంగా ఏ ఊరెళ్లినా.. కుక్కలు ఉన్నాయ్ జాగ్రత్త అనో..దొంగలున్నారు జాగ్రత్త అనో బోర్డులు చూస్తుంటాం.కానీ దక్షిణ ఆస్ట్రేలియాలోని కూబర్ పెడీ పట్టణానికి వెళ్తే.. రంధ్రాలున్నాయ్ జాగ్రత్త అనే బోర్డులు దర్శనమిస్తాయ్. ఇంతకీ అక్కడ రంధ్రాలు ఎందుకు ఉన్నాయ్? లోపల ఏం జరుగుతోంది? ఆ పట్టణ కథాకమామీషు ఏమిటి తెలుసుకోవాలని ఉందా? అయితే చలో కూబర్ పెడీ..
మైనింగ్ నుంచి మొదలై..
కూబర్ పెడీ.. దక్షిణ ఆ్రస్టేలియాలోని ఓ మైనింగ్ క్షేత్రం. ఒపాల్ (రత్నం వంటి విలువైన రాయి) గనులకు నిలయంగా పేరొందిన ఈ ప్రదేశం అడిలైడ్‌కు వాయువ్యంగా 590 మైళ్ల దూరంలో స్టువర్ట్ హైవేపై ఉంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఒపాల్స్‌లో ఎక్కువ భాగం ఈ గ్రేట్ విక్టోరియా ఎడారి అంచున ఉన్న స్టువర్ట్ శ్రేణిలోని మైనింగ్ సైట్ నుంచే వస్తుంది.
అసలు ఇక్కడ ఒపాల్‌ను కనుక్కోవడం కూడా చాలా విచిత్రంగా జరిగింది. 1915లో విల్లీ హచిసన్ అనే బాలుడు తన తండ్రి జేమ్స్‌తో కలిసి గోల్ఫ్ ప్రాక్టీసింగ్ కోసం ఈ ప్రాంతానికి వచ్చాడు. గోల్ఫ్ ఆడే క్రమంలో ఓ చోట ఒపాల్‌ను చూశాడు. అంతే.. అప్పటివరకు నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతం క్రమంగా పెద్ద పట్టణంగా మారిపోయింది. 1920లో ఈ ప్రాంతానికి కూబర్ పెడీ అని పేరు పెట్టారు. 1960లో దీనిని పట్టణంగా గుర్తించారు. అప్పటి నుంచి ఇది బాగా అభివృద్ధి చెందింది. స్థానికులు అక్కడే ఉంటూ మైనింగ్ చేసేవారు.
వేడి నుంచి తప్పించు కోవడానికి..
ఎడారి ప్రాంతం కావడంతో అక్కడ వేసవికాలం ఉండే నాలుగు నెలల కాలం భగభగా మండిపోయేది. ఆ నాలుగు నెలలు ఏకంగా 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి అక్కడివారంతా మైనింగ్ గనుల్లో ఉండేవారు. అనంతరం ఆ భూగర్భంలోనే తాము ఉండటానికి వీలుగా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇళ్లంటే ఏదో సాదాసీదా నిర్మాణాలనుకుంటే పొరపడినట్టే. కోటలను తలపించేలా విలాసవంతమైన ఇళ్లు కట్టుకున్నారు.
అంతేకాదు.. హోటళ్లు, స్టోర్లు, లైబ్రరీలు, షాపింగ్ సెంటర్లు, క్రీడా ప్రదేశాలు, ఈత కొలనులు, విశాలమైన స్నానపు గదులు, చర్చిలు.. ఇలా ఒకటేమిటి? భూమిపై పెద్ద పెద్ద నగరాల్లో ఉండే వసతులన్నీ అక్కడ ఉన్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం, నీటి వసతి, డ్రైవ్ ఇన్ మూవీ థియేటర్, గడ్డి లేని గోల్ఫ్ కోర్సు కూడా ఏర్పాటు చేసుకున్నారు. సూర్యకాంతి మినహా సమస్తమూ భూమిపై ఉన్నట్టే ఉంటుంది. కూబర్ పెడీని పై నుంచి చూస్తే.. బోలెడు రంధ్రాలు కనిపిస్తాయి. వీధులన్నీ దుమ్ముతో ఉంటాయ్. రంధ్రాలున్నాయ్ జాగ్రత్త.. అనే హెచ్చరిక బోర్డులు కనిపిస్తాయి.
కానీ ఆ రంధ్రాల లోపల ఓ భూగర్భ స్వర్గం ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. అక్కడ భూమిపై 52 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే.. లోపల 23 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక లోపల కరెంటు అవసరాలను సొంతంగానే తీర్చుకుంటున్నారు. 70 శాతం కరెంటును గాలి, సౌరశక్తి ద్వారా సమకూర్చుకుంటున్నారు. ఈ భూగర్భ పట్టణ జనాభా దాదాపు 2500 మంది.
నాలుగు మీటర్ల లోతులో..
కూబర్ పెడీలో భూగర్భ భవనాలు తప్పనిసరిగా నాలుగు మీటర్లు (13 అడుగులు) లోతులో ఉండాలి. పైకప్పులు కూలిపోకుండా చూసుకునేందుకే ఈ నాలుగు మీటర్ల నిబంధన విధించారు. ఈ రాతి కింద ఎల్లప్పుడూ 23 డిగ్రీల ఉష్ణోగ్రతతో తేమగా ఉంటుంది. అక్కడ నేలపై వేసవిలో విపరీతమైన వేడి.. శీతాకాలంలో భరించలేని చలి ఉంటుంది. ఒక్కోసారి రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి.
కానీ భూగర్భ గృహాలు కచి్చతమైన గది ఉష్ణోగ్రత వద్ద సంవత్సరం పొడవునా ఉంటాయి. పైగా ఇందులో ఇళ్లు చాలా సరసమైన ధరకే లభిస్తాయండోయ్. మూడు పడక గదుల ఇల్లు దాదాపు 26వేల అమెరికా డాలర్లకు వచ్చేస్తుంది. మన రూపాయల్లో చెప్పాలంటే... దాదాపు రూ.21.62 లక్షలు. అదే సమీపంలోని అడిలైడ్‌లో సగటు ఇంటి ధర 4.57 లక్షల అమెరికా డాలర్లు(దాదాపు రూ.3.80 కోట్లు). చూశారా ఎంత వ్యత్యాసం ఉందో? – సాక్షి సెంట్రల్ డెస్క్
ప్రయోజనాలివీ.. భూగర్భ పట్టణంలో నివసించడం వల్ల భూకంపాల నుంచి కొంత వరకు రక్షణ లభిస్తుంది. ఈగలు, దోమల, ఇతరత్రా కీటకాల బెడద ఉండదని స్థానిక నివాసి రైట్ వెల్లడించారు.అవి చీకటి, చలిలోకి రావడానికి ఇష్టపడవని వివరించారు. మనం కూడా ప్రస్తుతం అటు వేడితోనూ.. ఇటు దోమలతోనూ చాలా ఇబ్బందులు పడుతున్నాం.. ఇలాంటి భూగర్భ ఇళ్లేవో ఇక్కడ కూడా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందేమో కదా?
Comments
Please login to add a commentAdd a comment