కప్పం కడితేనే మైనింగ్‌ | Mines Department revenue drops by more than 50 percent in TDP Govt | Sakshi
Sakshi News home page

కప్పం కడితేనే మైనింగ్‌ ‘గ్రానైట్‌’పై టీడీపీ నేతల పెత్తనం

Published Sun, Feb 16 2025 2:39 AM | Last Updated on Sun, Feb 16 2025 3:08 PM

Mines Department revenue drops by more than 50 percent in TDP Govt

నిబంధనలకు పాతర.. కూటమి నేతల జాతర

రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల నిలిచిపోయిన గనుల తవ్వకాలు

50 శాతానికిపైగా తగ్గిన గనుల శాఖ ఆదాయం

బినామీలకు ఖనిజాన్ని విక్రయిస్తామంటేనే లీజులు.. లేకపోతే ఎంతగా బతిమాలినా అనుమతి నిరాకరణ

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మైనింగ్‌ ఫెడరేషన్‌.. కోర్టు ఆదేశించినా లీజులు మంజూరు చేయని కూటమి ప్రభుత్వం

టీడీపీ అక్రమార్కులకు మాత్రం పచ్చ జెండా.. నెల్లూరులో అడ్డగోలుగా క్వార్ట్‌జ్, మైకా దోపిడీ

‘ముఖ్య’ నేత అండతో చక్రం తిప్పుతున్న ఓ ఎంపీ.. ‘ముఖ్య’ నేతకు ఏటా రూ.600 కోట్లు ఇచ్చేలా ఒప్పందం 

అదే తరహాలో సైదాపురం వద్ద పరిశ్రమ ఏర్పాటుకు యత్నం

ఇందులోనూ ‘ముఖ్య’ నేతకు 50 శాతం వాటా!

ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ‘గ్రానైట్‌’పై టీడీపీ నేతల పెత్తనం

రాష్ట్రంలోని గనులన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ‘ముఖ్య’ నేత సూచన మేరకు అధికారులు టీడీపీ నేతలకు పూర్తిగా సహకరిస్తున్నారు. పెద్దలు అడిగినంత వాటా ఇచ్చారా సరే.. లేదంటే గనులను బంద్‌ చేసుకోవాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ నీకింత.. నాకింత.. అని పంపకాలు జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఆదాయం గురించి పైనుంచి కింది దాకా పట్టించుకునే నాథుడే లేడు. సగానికి సగం గనుల ఆదాయం పడిపోయిందంటే దోపిడీ ఏ స్థాయిలో జరుగుతోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్‌: ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయినా సరే తమ ఆదాయం మాత్రం బాగుండాలనే కూటమి పెద్దల తీరుతో రాష్ట్రంలో మైనింగ్‌ రంగం అస్తవ్యస్థంగా తయారైంది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు అన్ని జిల్లాల్లోనూ గనుల తవ్వకాలు స్తంభించిపోయాయి. తమకు కప్పం కట్టిన వారికి మాత్రమే మైనింగ్‌ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. కప్పం కట్టని గనుల యజమానులపై పది రెట్లకు పైగా జరిమానాలు విధిస్తుండడంతో వారు విలవిల్లాడిపోతున్నారు. దీంతో మైనింగ్‌ ఆదాయం సగానికి సగం పడిపోయింది. 

మరోవైపు కూటమి నేతలు మాత్రం ఎక్కడికక్కడ గనులను స్వాధీనం చేసుకుని అక్రమంగా తవ్వకాలు సాగిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఇదంతా కూటమి ముఖ్య నేత, ఆయన కుమారుడి నేతృత్వంలోనే జరుగుతుండడం గమనార్హం. ఎనిమిది నెలలుగా కూటమి నేతలు జిల్లాల వారీగా క్వార్ట్‌జ్, సిలికా శాండ్, గ్రానైట్, రోడ్‌ మెటల్, బీచ్‌ శాండ్, లేటరైట్, బెరైటీస్‌ వంటి అన్ని ఖనిజాలను తమ బినామీల పరం చేయాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లోనూ మైనింగ్‌ కార్యకలాపాలను నిలిపివేశారు. దీనివల్ల ఇప్పటికే రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. 

నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో అత్యంత డిమాండ్‌ ఉన్న క్వార్ట్‌జ్, మైకా తవ్వకాలను ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన నాయకుడికి అప్పగించారు. ఆ నేత ప్రతి నెలా రూ.50 కోట్లు చొప్పున ఏటా రూ.600 కోట్లు ‘ముఖ్య’ నేతకు కప్పం కట్టాలనే ఒప్పందంతో మొత్తం క్వార్ట్‌జ్‌ మైనింగ్‌ అంతా ఆయన చేతిలో పెట్టారు. ఆయన నెల్లూరు జిల్లాలోని క్వార్ట్‌జ్‌ ఆధారిత పరిశ్రమలను పరిశీలించి, అదే తరహాలో తిరుపతి జిల్లా సైదాపురంలో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ‘ముఖ్య’ నేతకు 50 శాతం వాటా ఇచ్చేందుకు చీకటి ఒప్పందం జరిగినట్లు తెలిసింది.

రూ.50 వేల ఖనిజాన్ని రూ.10 వేలకివ్వాలట!
ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో దాదాపు 140 ఓపెన్‌ కాస్ట్, 7 అండర్‌ గ్రౌండ్‌ క్వార్ట్‌జ్‌ గనులు ఉన్నాయి. వాటిలో తవ్వే ఖనిజాన్ని ఎంపీ చెప్పిన మనుషులకు.. అది కూడా వారు నిర్ణయించిన రేటుకు విక్రయిస్తేనే లీజులను కొనసాగిస్తామంటూ ప్రభుత్వ ‘ముఖ్య’ నేత స్పష్టం చేయడంతో వారు అంగీకరించలేదు. దీంతో తవ్వకాలు నిలిచిపోయి ప్రభుత్వానికి వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం తగ్గిపోయింది. అయినా సరే ప్రభుత్వ పెద్దలు తమ బినామీలకు ఖనిజాన్ని విక్రయించే వారికి మాత్రమే అనుమతులు జారీ చేస్తూ, మిగిలిన క్వారీలను నిలిపివేశారు. 

రూ.వేల కోట్ల ఆదాయం సమకూరే క్వార్ట్‌జ్‌ గనులను చేజిక్కించుకునేందుకు కూటమి పెద్దలు చేస్తున్న ప్రయత్నాలతో మైనింగ్‌ వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కువగా చైనాకు ఎగుమతి అయ్యే ఈ ఖనిజానికి టన్నుకు కేవలం రూ.10 వేలు మాత్రమే చెల్లిస్తానని ఆ ఎంపీ చెబుతుండటంతో మైనింగ్‌ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే ఖనిజాన్ని చైనాలో టన్ను రూ.50 వేలకు విక్రయించుకుంటూ, తమకు మాత్రం కనీసం మైనింగ్‌ ఖర్చులు కూడా గిట్టుబాటు కాని రేటును ఇస్తున్నారంటూ పలువురు మైనింగ్‌ వ్యాపారులు వాపోతున్నారు.

కోర్టు ఉత్తర్వులూ బేఖాతరు
రాజకీయ దురుద్దేశంతో మైనింగ్‌ అనుమతులు నిలిపి వేయడంపై రాష్ట్రంలోని ఫెడరేషన్‌ ఆఫ్‌ మైనర్‌ మినరల్‌ ఇండస్ట్రీ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. వారి వాదనను సమర్థించిన కోర్టు నెల రోజుల్లో అన్ని అనుమతులు ఉన్న క్వారీలకు రవాణా ఫారాలను జారీ చేయాలని, పోర్టర్స్‌ను అన్‌ బ్లాక్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలని గత నెల 6వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ముఖ్య నేత సూచనలతో మైనింగ్‌ ఉన్నతాధికారులు కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారు.

రెండు పోర్టుల నుంచి అక్రమంగా ఖనిజ రవాణా
మరోవైపు లీజులను నిలిపి వేయడంతో క్వార్ట్‌జ్, మైకా, సిలికా శాండ్‌కు డిమాండ్‌ పెరగడంతో కూటమి నేతలు యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఇప్పటికే తవ్విన ఖనిజాన్ని క్వారీ నిర్వాహకులతో మాట్లాడుకుని రాత్రి సమయాల్లో అక్రమంగా తరలిస్తున్నారు. గట్టిగా ప్రశ్నించిన క్వారీ నిర్వాహకులపై అక్రమ మైనింగ్‌ చేశారని పది రెట్లు జరిమానాలు విధిస్తామని బెదిరిస్తున్నారు. కృష్ణపట్నం, చెన్నై పోర్టులకు నిత్యం నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి వందల సంఖ్యలో క్వార్ట్‌జ్, మైకా, సిలికా శాండ్‌ లారీలు పెద్ద ఎత్తున అక్రమ ఖనిజాన్ని చేరవేస్తున్నాయి. 

చీమకుర్తి తదితర ప్రాంతాల నుంచి గ్రానైట్‌ను నిబంధనలకు విరుద్ధంగా పోర్టులకు తరలిస్తున్నారు. అద్దంకి, ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురం ఎమ్మెల్యేల కనుసన్నల్లో పని చేస్తున్న పోలీసులు, మైనింగ్‌ అధికారులు ఈ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారు. ఇందులో ముఖ్య నేత తనయుడి పాత్ర కూడా ఉందని చెబుతున్నారు. వీటి వైపు కన్నెత్తి చూడకూడదంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఆదేశాలు అందడంతో అధికారులు మిన్నకుండిపోతున్నారు.

నిఘా నిర్వీర్యం.. యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌ 
వైఎస్‌ జగన్‌ హయాంలో ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేయడంతో అక్రమ మైనింగ్‌ యథేచ్ఛగా సాగుతోంది. చెక్‌పోస్ట్‌ల వద్ద అక్రమ మైనింగ్‌ రవాణాను అడ్డుకుంటున్న దాఖలాలే లేవు. విజిలెన్స్‌ బృందాలను తమ బినామీలకు ఖనిజాన్ని కారుచౌకగా ఇచ్చేందుకు నిరాకరించే వారి పని పట్టడానికే ఉపయోగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన క్వారీ యజమానులపై తప్పుడు కేసులు పెట్టడం, పది రెట్లు అధికంగా జరిమానాలు విధించడానికే ఈ బృందాలను వాడుకుంటున్నారు. 

రోడ్‌ మెటల్, గ్రావెల్, గ్రానైట్, బాల్‌ క్లే తదితర ఖనిజాల రవాణాపై ఎన్ని ఫిర్యాదులు అందినా.. ఏ మాత్రం పట్టించుకోవద్దని జిల్లాల్లోని అధికారులకు ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో కూటమి పార్టీల నేతలే అక్రమ మైనింగ్‌ దందా నిర్వహిస్తున్నారు. ఈ అక్రమ సంపాదన విషయంలో పార్టీ నేతల మధ్యే విభేదాలు వచ్చి, బజారునపడి రచ్చ చేసుకుంటున్నారు. నూజివీడులో మైనింగ్‌ దందాపై తెలుగుదేశం పార్టీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బహిరంగంగా మంత్రి కొలుసు పార్థసారథిపై ఆరోపణలు చేశారు.

వైఎస్‌ జగన్‌ హయాంలో పెరిగిన ఆదాయం
వైఎస్‌ జగన్‌ హయాంలో గనుల శాఖలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేయడంతో ఆదాయం భారీగా పెరిగింది. పారదర్శక విధానాలు, లీజుల జారీలో జాప్యాన్ని నివారించడంతో పాటు ఔత్సాహికులు మైనింగ్‌ రంగంలోకి ప్రవేశించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. గతంలో మొదట వచ్చిన వారికే మొదటి అవకాశం (ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌) విధానం ద్వారా మైనింగ్‌ లీజులు జారీ చేసేవారు. దీనివల్ల దరఖాస్తులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉండడంతో లీజులున్నా, మైనింగ్‌ చేయకుండా జాప్యం చేసేవారు. గతంలో 4,988 లీజుల్లో 2,826కు మాత్రమే వర్కింగ్‌ లీజులుండేవి. 

ఆ విధానాన్ని రద్దు చేసి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవకాశం కల్పించడంతో అదనంగా 1,700 లీజులు వర్కింగ్‌లోకి వచ్చాయి. దీంతో మైనింగ్‌ ఆదాయం బాగా పెరిగింది. కానీ కూటమి ప్రభుత్వం రాగానే అన్ని లీజులను అనధికారికంగా నిలిపి వేయడంతోపాటు మళ్లీ పాత విధానాన్ని తీసుకు రావడానికి ప్రయత్నిస్తుండడంతో మైనింగ్‌ రంగం కుదేలైంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మైనింగ్‌ ఆదాయం రూ.1,950 కోట్లు ఉండగా, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సంస్కరణల వల్ల 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆది రూ.4,800 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.3 వేల కోట్లు రావడమే గగనంగా మారింది.

టెక్కలిలో కక్ష సాధింపుగా అడ్డగోలు దాడులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ నాయకుడి సోదరుడు గ్రానైట్‌ క్వారీలపై లేని పోని ఆంక్షలు విధించాడు. అది తట్టుకోలేక టెక్కలి సమీపంలో ఓ గ్రానైట్‌ క్వారీని మూసి వేశారు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా ఇదే క్వారీని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులతో పాటు యజమాని సైతం రోడ్డున పడ్డాడు. ఇప్పటికీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతుండడంతో క్వారీ నిర్వహణ పూర్తిగా నిలిపివేశారు. 

మంత్రితో పాటు ఆయన సోదరుడు అధికారులను ఉసిగొలిపి అడ్డగోలుగా విజిలెన్స్‌ దాడులు చేయిస్తున్నారు. దీంతో టెక్కలి, కోటబొమ్మాళి మండలాల్లో గ్రానైట్‌ క్రషర్లను నిలిపివేశారు. ఆరు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అది తట్టుకోలేక పలువురు క్రషర్లను నిలిపివేశారు. అయితే టీడీపీకి చెందిన కొన్ని క్రషర్లు ఎలాంటి నిబంధనలు పాటించక పోయినప్పటికీ వాటి గురించి పట్టించుకోవడం లేదు. 

ఇది చాలా అన్యాయం.. 
రాష్ట్రంలో ఎనిమిది నెలలుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల గనుల యజమానులు, కార్మికులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అన్ని అనుమతులు ఉన్నా కూడా వేధిస్తున్నారు. ఒకరిద్దరు కూటమి నేతల కన్నుసన్నల్లోనే అనధికారికంగా గనుల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల తీరువల్ల అందరికీ ఇబ్బందులెదురవుతున్నాయి. ఇది చాలా అన్యాయం.
– ప్రవీణ్‌ కుమార్, గని యజమాని, సైదాపురం, తిరుపతి జిల్లా

పర్మిట్లు బ్లాక్‌ చేశారు
మైకా గనులను దక్కించుకునేందుకు ఎనిమిది నెలలుగా కూటమి నేతలు పడారని పాట్లు పడుతున్నారు. ఇందులో భాగంగా కొన్ని గనులకు అనుమతులను మంజూరు చేసినప్పటికీ, నేటికీ పర్మిట్లు ఇవ్వలేదు. దీంతో రోజు రోజుకూ మైనింగ్‌ పరిశ్రమ కుదేలవుతోంది. కార్మికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
– నాగార్జున, గని యజమాని, సైదాపురం, తిరుపతి జిల్లా

ఎంతగా సర్దుకుపోతున్నా.. 
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేసినందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రచారం చేసిన వ్యక్తి క్వారీని నిలిపివేశారు. క్వారీలో ఎలాంటి అవకతవకలు లేకపోయినా ఎందుకు నిలిపివేశారని మైన్స్‌ అధికారులను అడిగితే దయచేసి తమను ఏమీ అడగొద్దని, పైనుంచి ఒత్తిడి ఉందని చెబుతున్నారు. దీంతో గ్రానైట్‌ క్వారీలకు సంబంధించిన డంపింగ్‌లను అధికార పార్టీ నాయకులు బలవంతంగా లాక్కున్నారు. ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. ఎంతగా సర్దుకుపోతున్నా ఇక్కట్లు తప్పడం లేదు.  
– క్వారీ యజమానులు, ప్రకాశం జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement