
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశంలో వైఎస్ జగన్ పునరుద్ఘాటన
క్షేత్ర స్థాయిలో ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలాయి
మనం యుద్ధ రంగంలో ఉన్నాం
విజయం దిశగా అడుగులు వేయాలి.. ప్రజలకు తోడుగా, వారితో ఉంటే గెలుపు సాధించినట్లే
వారి తరపున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు
పార్టీ కోసం, ప్రజల కోసం పని చేస్తే ఉజ్వల భవిష్యత్తు.. నాదీ భరోసా
శాసన సభలో మనం ఒక్కరమే ప్రతిపక్షం.. అందుకే విపక్ష హోదా అడుగుతున్నాం
సభలో సమయం ఇవ్వాల్సి వస్తుందనే హోదా ఇవ్వడం లేదు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
శాసన సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీనే. మరో విపక్ష పార్టీ అంటూ లేదు. మిగతావన్నీ అధికారంలో కొనసాగుతున్న పార్టీలే. మరి ప్రతిపక్ష హోదా ఎవరికి ఇస్తారు? సహజంగానే వైఎస్సార్‌సీపీకే ఇవ్వాలి కదా! హోదా ఇవ్వకపోతే ఎందుకు నడుపుతున్నారు? అవతలి వారు చెప్పేది మనం వినకూడదనుకుంటే ఇక అసెంబ్లీ ఎందుకు? ప్రతిపక్షం చెప్పేది ఆలకించాలి. తద్వారా లోపాలను సరిదిద్ది ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. ఎంతసేపూ పరనింద.. ఆత్మస్తుతేనా? అలాంటప్పుడు ఇక ప్రజాస్వామ్యానికి అర్థం లేదు.
– వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటాన్ని కొనసాగిస్తామని వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) పునరుద్ఘాటించారు. కూటమి ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో తీవ్ర వ్యతిరేకత నెలకొందని.. టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలిపోయాయని ధ్వజమెత్తారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ‘మనం యుద్ధరంగంలో ఉన్నాం.. విజయం దిశగా అడుగులు వేయాలి..
ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలి.. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయాలి.. ప్రజలకు తోడుగా ఉంటూ వారితో మమేకమైతే గెలుపు సాధించినట్లే. ప్రజా సమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయవద్దు. మనం వేసే ప్రతి అడుగూ పార్టీ ప్రతిష్టను పెంచేదిలా ఉండాలి. ఎక్కడా రాజీ పడకూడదు’ అని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
మీ భవిష్యత్తుకు నాది భరోసా..
ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంలో మన సమర్ధతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నా. మీ భవిష్యత్తుకు నాది భరోసా. నేను మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తా. పార్టీ కోసం, ప్రజల కోసం గట్టిగా పని చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కళ్లు మూసుకుని తెరిచేలోగా ఏడాది గడిచిపోతోంది. జమిలి ఎన్నికలు అంటున్నారు.
అదే జరిగితే ఎన్నికలు మరింత మందుగా వస్తాయి. అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దు. ప్రజల తరపున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మనం విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టే ఎన్నో క్లిష్ట పరిస్థితులు అధిగమించాం. ఇంత దూరం ప్రయాణం చేశాం. దేవుడు మనల్ని అందరినీ తప్పకుండా ఆశీర్వదిస్తాడు.
అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు..
అసెంబ్లీలో మనం మినహా వేరే ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే.. హక్కుగా మనకు సమయం ఇవ్వాల్సి వస్తుంది. సభా నాయకుడితో దాదాపు సమాన స్థాయిలో సమయం ఇవ్వాల్సి ఉంటుంది.
ఆ భయంతోనే ప్రతిపక్ష హోదాను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లాం. శాసన సభలో మనం ఒక్కరమే ప్రతిపక్షం. అందుకే విపక్ష హోదా అడుగుతున్నాం. సభలో ప్రతిపక్షం స్వరాన్ని వినాలి. తప్పులుంటే సరిదిద్దుకోవాలి.
నేను ఏ అంశంపై మాట్లాడినా నిందలకు, దూషణలకు దూరం. ప్రతి అంశాన్నీ ఆధారాలు, రుజువులతో మాట్లాడతా. నా ప్రసంగాల్లో కూడా చాలా సార్లు సభలో చంద్రబాబునాయుడు ఉంటే బాగుండేదని చెప్పా. అయితే ప్రభుత్వ స్వరం మినహా వేరే స్వరం వినపడకూడదన్నట్లు అసెంబ్లీని తయారు చేశారు.
ప్రజలకు అన్నీ తెలుసు..
పేదల ఇళ్ల కాలనీల పేర్లు కూడా మారుస్తున్నారని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశంలో ప్రస్తావించగా.. ‘‘ఎవరు ఇళ్ల స్ధలాలిచ్చారో, ఎవరు కాలనీలు ఏర్పాటు చేశారో ప్రజలకు తెలుసు. విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనాన్ని మనమే నిర్మించాం. కానీ పేరు తీసేయాలన్న దురుద్దేశంతో ఏకంగా అంబేడ్కర్ విగ్రహం మీదే దాడికి దిగారు. ఈ ప్రభుత్వం ఆదేశాలతోనే అదంతా జరిగింది.
అధికారులే స్వయంగా దీనికి ఒడిగట్టారు. మరి స్మృతివనం ఎవరు కట్టారో ప్రజలకు తెలియదా? ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ప్రజలకు నేరుగా రూ.2.73 లక్షల కోట్లు అందించి మనం మంచి చేశాం. ఇవాళ మనమిచ్చిన పథకాలన్నీ రద్దు చేశారు. నోటి దాకా వచ్చిన కూడును తీసేశారు. టీడీపీ వాళ్లు ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలాయి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఇళ్ల పట్టాలు రద్దు చేస్తే కోర్టుకెళ్తాం..
టీడీపీ కూటమి ప్రభుత్వం అన్యాయంగా ఇళ్ల పట్టాలను రద్దు చేస్తోందని సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘‘మన హయాంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం.
ఏ పార్టీ అని చూడకుండా, పక్షపాతం లేకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఎవరైనా ఇల్లు కట్టుకోకపోతే ప్రభుత్వమే వారికి ఇల్లు మంజూరు చేసి ఇవ్వాలి. అంతేకానీ పేదలపై కక్షగట్టి పట్టాలు రద్దు చేయడం ఏమిటి? పట్టాలు రద్దు చేస్తే తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం’’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment