రాబోయేది జగన్ 2.0 పాలన.. చీకటి తర్వాత వెలుగు రావడం ఖాయం
మన క్యారెక్టర్, విలువలు కాపాడుకుందాం
రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తా
సాక్షి, అమరావతి: ‘ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్త తరపున చంద్రబాబుకు చెబుతున్నా... మళ్లీ వచ్చేది జగన్ 2.0 పాలన. అన్యాయాలు చేసే వారెవరినీ వదిలిపెట్టేది లేదు. తప్పు చేసిన వారిని చట్టం ముుందు నిలబెడతాం. కార్యకర్తలకు అన్నలా ఉంటా..’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) భరోసానిచ్చారు. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశం సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
ప్రజలకు తోడుగా.. కార్యకర్తలకు అండగా
జగన్ 1.0 పాలనలో అధికారంలోకి వచ్చిన 9 నెలలు కాకమునుపే ఎప్పుడూ చూడని విధంగా కోవిడ్ పరిస్థితుల మధ్యే కాలం గడిపాం. తర్వాత రెండున్నర సంవత్సరాలు కోవిడ్ మధ్యే ఉన్నాం. ఆ టైంలో ప్రజలకు ఎలా తోడుగా ఉండాలనే తపనతో అడుగులు వేశాం. అందుకే కార్యకర్తలకు చేయదగినంత చేయలేకపోయాం. ఈసారి జగన్ 2.0లో ప్రజలకు తోడుగా ఉంటూ.. కార్యకర్తలకు అండగా, వారి ఇంటికి అన్నలా ఉంటా. మార్చి నాటికి స్థానిక సంస్థలకు నాలుగేళ్ల పదవీ కాలం ముగియబోతుంది.
తమ వాళ్లను పదవుల్లో కూర్చోబెట్టడానికి ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ప్రయత్నిస్తారు. మన వాళ్లను భయపెట్టడానికి, లొంగదీసుకోవడానికి, ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ ఉన్నా మనం ధైర్యంగా ఉండాలి. ఎల్లకాలం ఇలా ఉండదు. చీకటి తర్వాత వెలుతురు రాక మానదు. రానున్న మూడు సంవత్సరాలు మన క్యారెక్టర్‌ను కాపాడుకుందాం. మన విలువలు కాపాడుకుందాం. ఆ తర్వాత రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తాం.
ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ..
ఈ ప్రభుత్వంలో ఏ మాదిరిగా పాలన చేస్తున్నారో చూస్తున్నాం. మొన్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. టీడీపీకి ఏమాత్రం సంఖ్యాబలం లేకపోయినా దాడులు చేసి భయపెట్టారు, ప్రలోభపెట్టారు. అన్యాయాలు చేసి గెలిచామంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. తిరుపతి కార్పొరేషన్‌లో 49 స్థానాలుంటే వైఎస్సార్‌సీపీ 48 గెలిచింది. టీడీపీ ఒకే ఒక్కటి గెలిచింది. ఒక్కటే గెలిచిన చోట డిప్యూటీ మేయర్ వాళ్ల మనిషి అని గొప్పగా చెప్పుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సును పోలీసుల ద్వారా వాళ్లే అడ్డుకుంటారు.
వాళ్లే పోలీసుల ఆధ్వర్యంలో కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తారు. మళ్లీ ఎన్నికల్లో మావాడు గెలిచాడని నిస్సిగ్గుగా చెప్పుకుంటారు. ఇక ఏలూరు కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉంటే అందులో 47 వైఎస్సార్‌సీపీకి రాగా టీడీపీకి వచ్చింది కేవలం 3 మాత్రమే. నెల్లూరు కార్పొరేషన్‌లో 54 డివిజన్లు ఉంటే 54 వైఎస్సార్‌సీపీవే. ఇక హిందూపురం మున్సిపాల్టీలో 38 డివిజన్లు ఉంటే వైఎస్సార్‌సీపీకి 29 వచ్చాయి. టీడీపీకి 6 మాత్రమే వస్తే చంద్రబాబు బావమరిది బాలకృష్ణ అక్కడ తమకు పీఠం దక్కిందని అదో ఘనకార్యంలా చెప్పుకుంటున్నారు.
పాలకొండలో 20 స్థానాలకు 17 వైఎస్సార్‌సీపీవే. టీడీపీకి మూడు మాత్రమే ఉన్నాయి. అక్కడ వైఎస్సార్‌సీపీ వాళ్లను లాక్కోలేక ఎన్నిక వాయిదా వేశారు. తునిలో టీడీపీకి ఒక్కరూ లేరు. అక్కడ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికలు వాయిదా అంటారు. పిడుగురాళ్ల మున్సిపాల్టీలో 33కు 33 వైఎస్సార్‌సీపీవే. దీంతో అక్కడ కూడా ఎన్నికలు వాయిదా అన్నారు. నూజివీడులో 32 ఉంటే 25 వైఎస్సార్‌సీపీ, ఏడు టీడీపీవి. నందిగామ మున్సిపాల్టీలో కూడా వైఎస్సార్‌సీపీదే మెజార్టీ. చివరికి గుంటూరులో కూడా 57లో 46 స్థానాలు వైఎస్సార్‌సీపీవే.
అవిశ్వాసం పెట్టి మేయర్‌ను దించేస్తామని చెబుతున్నారు. ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? మన ప్రభుత్వం ఏర్పడిన మూడు సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ప్రజలు ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారు. ఆ రోజు తాడిపత్రి, దర్శి రెండు మున్సిపాల్టీలే పోయాయి. తాడిపత్రిలో 20 స్థానాలు వాళ్లకు... 18 స్థానాలు మనకు వచ్చాయి. ఆ రోజు నేను గట్టిగా తుమ్మి ఉంటే ఆ రెండూ కూడా వాళ్లకు వచ్చి ఉండేవి కావు.
ప్రజాస్వామం గెలవాలి...
ఈరోజు టీడీపీ చేస్తున్నదేమిటి? ఇదా ప్రజాస్వామ్యం? అని అందరూ ఆలోచన చేయాలి. ఇలాంటి రాజ్యం పోవాలి. ప్రజాస్వామ్యం నిలవాలి. విలువలు, వ్యక్తిత్వంతో కూడిన రాజకీయాలు అవసరం. కార్యకర్తలు ఫలానా వాడు మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకుని తిరగాలి. ప్రజలు గొప్పగా చెప్పుకునేలా నాయకత్వం
ఉండాలి. ఇదే వైఎస్సార్‌సీపీ సిద్ధాంతం.
స్కాములు మినహా పాలన ఏది?
స్కాములు మినహా ఈ ప్రభుత్వంలో ఏమీ జరగడం లేదు. ముఖ్యమంత్రిగా పాలన సాగించేటప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త ఫలానా వ్యక్తి మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకుని చెప్పుకునేలా ఉండాలని అనుకుంటారు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే... చంద్రబాబు, కూటమి నేతలు అధికారంలో ఉంటూ దోచుకోవడం, దోచుకున్నది పంచుకుని తినడం మాత్రమే జరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం స్కామ్, ఇసుక స్కామ్.
ఓ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా, ఫ్యాక్టరీ నడపాలన్నా ఎమ్మెల్యేకు ఇంత ఇవ్వాలి.. ఆయన చంద్రబాబుకి ఇంత ఇవ్వాలి! ప్రతి నియోజకర్గంలోనూ యథేచ్ఛగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తారేమోనని చిన్న పిల్లలని కూడా చూడకుండా 111 సెక్షన్ కేసులు పెడుతున్నారు. తమ తప్పులను సోషల్ మీడియాలో ప్రశ్నించి పోస్టింగులు పెట్టేవారిపై టెర్రరిస్టుల మాదిరిగా వ్యవస్థీకృత నేర చట్టాల కింద కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారు. వివిధ స్టేషన్లు, జిల్లాల చుట్టూ తిప్పుతున్నారు. కానీ చంద్రబాబు మర్చిపోతున్న విషయం ఏమిటంటే... ఇలాంటి అన్యాయాలు చేస్తే ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment