మీ నిబద్ధతకు హ్యాట్సాఫ్‌! : వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy with local body YSRCP Party representatives | Sakshi
Sakshi News home page

మీ నిబద్ధతకు హ్యాట్సాఫ్‌! : వైఎస్‌ జగన్‌

Published Thu, Apr 3 2025 4:47 AM | Last Updated on Thu, Apr 3 2025 8:06 AM

YS Jagan Mohan Reddy with local body YSRCP Party representatives

స్థానిక సంస్థల పార్టీ ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్‌

మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది.. ఎప్పటికీ రుణపడి ఉంటా 

రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత ఉండాలని గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను.. పార్టీలో కూడా అలాగే ఉండాలని ఆశించా 

స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అడుగడుగునా అధికార పార్టీ అరాచకాలు 

పోలీసుల అండతో అక్రమాలు.. ప్రమాదంలో ప్రజాస్వామ్యం 

హామీల గురించి ప్రశ్నిస్తే అప్పులంటూ అబద్ధాలు చెబుతున్నారు 

సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ గాలికెగిరిపోయాయి 

బాబు మోసాలు క్లైమాక్స్‌కి చేరాయి.. ప్రజలు అన్నీ గ్రహిస్తున్నారు 

మాట మీద నిలబడే పాలన కోసం.. తమ కోసం తపించే గుండె రావాలని ఎదురు చూస్తున్నారు 

జగన్‌ 2.0లో కార్యకర్తలకు తోడుగా ఉంటా.. మీకు మాట ఇస్తున్నా

స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించిన 50 స్థానాలకు గానూ 39 చోట్ల వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గొప్ప తెగింపు చూపించి గెలిచారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం లేనప్పుడు పోటీ చేయకుండా హుందాగా వదిలేయాలి. కానీ చంద్రబాబు అలా కాకుండా నేను సీఎంను, నా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నాకు బలం ఉన్నా లేకపోయినా ప్రతి పదవీ నాకే కావాలి.. ఎవరినైనా నేను భయపెడతా.. కొడతా.. చంపుతా.. ప్రలోభపెడతా..! అనే రీతిలో అహంకారంతో వ్యవహరిస్తున్న తీరును మనం అంతా చూస్తున్నాం. ఇది ధర్మమేనా? న్యాయమేనా? రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. 

నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే.. తాను చేసిన మంచి పనిని చూపించి, నేను ఈ మంచి పని చేశానని ప్రజల దగ్గరకు ధైర్యంగా వచ్చి చిరునవ్వుతో వారి ఆశీర్వాదం తీసుకునేలా ఉండాలి. కానీ చంద్రబాబు పాలనలో సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ సెవెన్‌ గాలికి ఎగిరిపోయాయి. అవి మోసాలుగా మిగిలాయి మీ జగన్‌ పాలనలో ప్రతి నెలా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక మేలు జరిగింది. నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేవి.  చంద్రబాబు వచ్చిన తర్వాత నాలుగు వేళ్లు నోట్లోకి పోవడం మాట అటుంచి.. ఉన్న ప్లేటును కూడా తీసేశారు. ఇలాంటి పరిస్థితులలో ఆయన ప్రజల్లోకి వెళ్లలేడు. తన కార్యకర్తలను పంపించి ప్రజలకు ఫలానా మంచి చేశామని చెప్పే పరిస్థితి కూడా లేదు
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘మీ అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. రాజకీయాలలో ఎప్పుడూ విలు­వ­లు, విశ్వసనీయత ఉండాలని నేను చాలా గట్టిగా నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటా.. పార్టీ కూడా అలా­గే ఉండాలని మొట్టమొదటి నుంచి ఆశించా. కష్టకాలంలో మీ అందరూ చూపించిన తెగువ, స్ఫూ­ర్తి­కి హ్యాట్సాఫ్‌..’ అని స్థానిక సంస్థల వైఎస్సార్‌సీపీ(YSRCP) ప్రజాప్రతినిధులను పార్టీ అధ్య­క్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి(YS Jagan Mohan Reddy) ప్రశంసించారు. 

రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలో­భా­లకు లొంగకుండా.. బెదిరింపులు, అక్రమ కేసులు, దాడులకు వెరవకుండా పార్టీ కోసం గట్టిగా నిల­బడిన వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతి­నిధులను అభినందించారు. బుధవారం తాడేపల్లి­లోని పార్టీ కేంద్ర కార్యా­లయంలో వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజా­ప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ సమావేశమ­య్యా­రు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరాయని వ్యాఖ్యానించారు. 

‘రాబోయే రోజులు మనవే.. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపో­తా­యి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ మెజా­ర్టీతో అధికా­రంలోకి వస్తుంది. జగన్‌ 1.0 పాలనలో కోవిడ్‌ వల్ల కార్యకర్తలకు చేయాల్సినంత చేయకపోయి ఉండ­వచ్చు. కానీ.. జగన్‌ 2.0లో అలా జరగదు. అందరికీ మాట ఇస్తున్నా. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటా. కార్యకర్తల కోసం జగన్‌ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత మీ జగన్‌ చేసి చూపిస్తాడు’ అని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

సంఖ్యాబలం లేనప్పుడు పోటీ చేయకూడదు
మొన్న జెడ్పీ, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో–ఆప్షన్‌ సభ్యు­లు, ఉప సర్పంచ్‌ స్థానాలు కలిపి దాదాపు 57 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే.. ఏడు చోట్ల అధి­కార పార్టీ గెలిచే పరిస్థితి లేకపో­వడంతో ఎన్ని­కలు వాయిదా వేశారు. మరో 50 చోట్ల  వాయి­దా వేసే పరిస్థితి లేకపోవడంతో అని­వా­ర్యంగా ఎన్ని­క­లు జరిపారు. అలా ఎన్నికలు నిర్వహించిన 50 స్థానా­­లకు గానూ 39 చోట్ల వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గొప్ప తెగింపు చూపించి గెలిచారు. 

ఆశ్చర్యం కలిగించే విష­యం ఏమిటంటే.. అసలు టీడీపీకి ఎక్కడా కనీ­సం గెలవడానికి కావాల్సిన సంఖ్యాబలం లేదు. అయినా సరే.. మ­భ్య­­పెట్టి, భయపెట్టి, ప్రలోభ పెట్టి.. ఏకంగా పోలీ­సు­లను వాడుకుని దౌర్జన్యాలు చేస్తూ ఎన్నికలు నిర్వ­హించారు. ఇన్నేళ్లు సీఎంగా చేశానని చెప్పు­కునే చంద్ర­బాబుకు నిజంగా బుద్ధీ, జ్ఞానం రెండూ లేవు! 

సూపర్‌ సిక్స్‌లు.. మోసాలుగా మిగిలాయి
ఎన్నికల మేనిఫెస్టోలో 143 హామీలతో కూటమి పార్టీలు ప్రజలను మభ్యపెట్టి, ప్రతి ఇంటికి వారి కార్యకర్తలను పంపించి పాంప్లెట్లు పంచాయి. చంద్ర­బాబు బాండ్లు పంపించారని ప్రతి ఒక్కరికీ చెప్పి ఎన్నికల్లో గెలిచాయి. చంద్రబాబు పాలన చేపట్టి దాదాపు 11 నెలలు అవుతుంది. మరి ఆయన చెప్పిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్లు ఏమయ్యాయని ఎవ­రైనా అడగడానికి ధైర్యం చేస్తే.. ఆ స్వరం కూడా వినిపించకుండా చేయాలని తాపత్రయపడుతు­న్నా­రు. ఆ హామీలను నెరవేర్చాలనిగానీ, ప్రజల­కి­చ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంగానీ చంద్రబా­బులో కనిపించడం లేదు. ప్రతి అడుగులోనూ మోసం.. పాలనలో అబద్ధాలే కనిపిస్తున్నాయి. సూపర్‌ సిక్స్‌లు, సెవెన్లు గాలికెగిరిపోయి మోసా­లుగా కనిపిస్తున్నాయి. 
 

మాట మీద నిలబడే పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారు..
సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ ఎందుకు అమలు చేయ­డం లేదు అని అడుగుతుంటే రాష్ట్రం అప్పులు రూ.10 లక్షల కోట్లు అని చంద్రబాబు అంటారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ డాక్యుమెంట్లలోనే రాష్ట్రం అప్పు రూ.6.50 లక్షల కోట్లు అని చూపించారు. అందులో రూ.3.13 లక్షల కోట్లు ఆయన ప్రభు­త్వం దిగిపోయే నాటికి, ఆయన చేసిన అప్పులే అని తెలుసు. కానీ రాష్ట్రాన్ని భయంకరంగా చూపించాలని రూ.10 లక్షల కోట్లు అని చెబుతున్నారు. మరో రెండు రోజు­లు పోతే రూ.12 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు అని చెబు­తాడు. 

సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీ­లను ఎగ్గొట్ట­డానికే ఈ దిక్కుమాలిన అబద్ధాలు చెబు­తు­న్నారు. ఇలాంటి దిక్కు­మాలిన అబద్ధాలు, మోసా­లతో రాష్ట్రంలో పాలన చేస్తున్నాడు. ఇలాంటి పాలన పోయి మళ్లీ మాట చెబితే ఆ మాట మీద నిలబడే పాలన రావాలని, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యలను పరిష్క­రి­ంచాలని తపించే గుండె ఉండే మంచి పాలన రావా­లని ప్రజలందరూ ఇవాళ మన­స్ఫూర్తిగా కోరుకుంటున్నారు. 



ఉన్నదల్లా రెడ్‌బుక్‌ రాజ్యాంగమే..
మరోవైపు ఇవాళ వలంటీర్‌ వ్యవస్థ లేదు. పార­దర్శకత లేదు. స్కీములూ లేవు. ఉన్నదల్లా రెడ్‌ బుక్‌ రాజ్యాంగమే. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. పోలీసులను అధికార పార్టీ కాపలాదారులుగా వాడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

దారుణ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం..
తిరుపతి కార్పొరేషన్‌లో మనం 48 స్థానాలు గెలిస్తే వాళ్లు కేవలం ఒక్కటే గెలిచారు. అక్కడ ఇటీవల డిప్యూటీ మేయర్‌ ఎన్నికల సందర్భంగా మన కా­ర్పొ­­రేటర్లు ప్రయాణిస్తున్న బస్సును అడ్డుగుతున్నారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్సీని పోలీసుల ఆధ్వ­ర్యంలోనే కిడ్నాప్‌ చేశారు. ఇలా చేయడానికి సిగ్గు ఉండాలి. 

⇒ విశాఖ కార్పొరేషన్‌లో 98 స్థానాలకు వైఎస్సార్‌­సీపీ 56 స్థానాలకు పైగా గెలిచింది. అక్కడ ప్రజా­స్వామ్యయుతంగా వైఎస్సార్‌సీపీ మేయర్‌ ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టారు. మన కార్పొ­రేటర్లు క్యాంపుల్లో ఉంటే.. పోలీసులు వారి ఇళ్ల వద్దకు వచ్చి మీ భర్తలు ఎక్కడున్నారో చెప్పాలని, లేదంటే మిమ్మల్ని స్టేషన్‌కి తరలిస్తామని బెదిరిస్తు­న్నారు. బుద్ధీ, జ్ఞానం ఉన్నవారు ఎవరైనా పోలీసులను ఈ మాదిరిగా వాడుకుంటారా?

⇒ అనంతపురం జిల్లా రామగిరి మండలంలో పదికి తొమ్మిది స్థానాలు మనవే. వాళ్లు ఒక్కటే గెలిచారు. సంఖ్యాపరంగా చూస్తే ఉప ఎన్నికలో మనమే గెలవాలి. కానీ అక్కడ ఎస్‌ఐ పోలీసు ప్రొటెక్షన్‌ ఇచ్చినట్లు  నమ్మించి తొమ్మిది మంది మన ఎంపీటీసీలను కిడ్నాప్‌ చేశాడు. వీడియో కాల్‌లో లోకల్‌ ఎమ్మెల్యేతో మాట్లాడిస్తున్నాడు. 

అయినా సరే మన ఎంపీటీసీలు మాట వినక­పోవడంతో మండల కేంద్రంలో నిర్బంధించి బైండోవర్‌ కేసులు పెడుతున్నాడు. దీనిపై మన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతటితో ఆగకుండా.. ఆ మండ­లంలో భయం రావాలట..! అందుకోసం లింగమయ్య అనే బీసీ నాయకుడిని హత్య చేశారు. పోలీసుల సమక్షంలో చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి చర్యలు చేయిస్తున్నారు. ఇదా ప్రజాస్వామ్యం?

⇒ స్వయంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని రామకుప్పంలో 16కి మొత్తం 16 ఎంపీటీసీలను మనం గెలిచాం. ఆరుగురిని ప్రలోభ­పెట్టగా..మిగిలిన వాళ్లు మనవాళ్లే. అక్కడ మన­వాళ్లు ప్రయాణిస్తున్న బస్సును పోలీసులతో అడ్డుకుని కౌంటింగ్‌ దగ్గరకు పంపించకుండా చంద్రబాబు ఆపించారు. అక్కడ కోరమ్‌ లేకపో­యినా.. ఆరుగురే ఉన్నా వాళ్ల మనిషే గెలిచినట్లు డిక్లేర్‌ చేశాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని.. ఎంపీపీ స్థానంలో బలం లేకపోయినా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇదీ.

⇒ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం గోప­వరంలో ఉప సర్పంచ్‌ ఎన్నికలు చూస్తే.. మనం 19 గెలిస్తే వాళ్లు నలుగురిని ప్రలోభపెట్టారు. మన­వాళ్లు 15 మందిని పోలీ­సులు బందోబస్తు కల్పి­స్తా­మని చెప్పి తీసుకెళ్లి టీడీపీ సభ్యులున్న చోట విడి­చిపెట్టారు. అంటే టీడీపీ వాళ్లను దౌర్జన్యం చే­య­మని వదిలేశారు. కౌంటింగ్‌ హాల్‌­లోకి మన­వాళ్లను లోపలకి పంపించరు కానీ.. వాళ్లను మాత్రం పంపి­స్తారు. అక్కడ నకిలీ వార్డు మెంబర్లతో ఐడీ కార్డులు తయారు చేశారు. అదే విషయం ఎన్నికల అధికా­రికి చెబితే ఎన్ని­క వాయిదా వేశారు. మళ్లీ రెండో రోజు.. ఎన్నికల అధికారికి గుండెపోటు అని వాయి­దా వే­శారు. బలం లేనప్పుడు ఇలాంటివన్నీ చేస్తు­న్నారు. 

⇒ ఇక తుని మున్సిపాల్టీలో 30కి 30 కౌన్సిలర్లు మనమే గెలిచాం. వాళ్ల దగ్గర ఏమాత్రం సంఖ్యా బలం లేదు. అయినాకూడా వైస్‌ చైర్మన్‌ పోస్టు దక్కించుకునేందుకు కావాలని ఎన్నికలకు అడ్డంకులు సృష్టించి వాయిదాల మీద వాయిదాలు వేశారు. చివరకు మున్సిపల్‌ చైర్మన్‌ మహిళను బెదిరించి రాజీనామా చేయించారు.

⇒ అత్తిలిలో 20 స్థానాలకు మనం 16 గెలిస్తే.. వాళ్లు 4 గెలిచారు. ఒకరు డిస్‌ క్వాలిఫై కాగా మన బలం 15 ఉంది. అంటే అక్కడ ఎన్నికల్లో మనం గెలవాలి. వాళ్లకు సంఖ్యా బలం లేదు కాబట్టి ఎన్నిక జరపకుండా వాయిదా మీద వాయిదా వేస్తున్నారు. ఇదీ రాష్ట్రంలో జరుగుతోంది!!

⇒ ఇంతటి దారుణమైన రాజకీయ వ్యవస్థల మధ్య.. మీ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగు­తున్నా.. మీరంతా గట్టిగా నిలబడ్డారు. నా అక్కచెల్లెమ్మలు చాలా గట్టిగా నిలబడ్డారు. దీన్ని విన్నప్పుడు  చాలా సంతోషం అనిపించిన సందర్భాలున్నాయి. ఈ ఎన్నికల్లో మీరు చూపించిన గొప్ప స్ఫూర్తితో... చంద్రబాబు అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు అనే సందేశం మీ ద్వారా  వెళ్లింది. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో మీరు చూపించిన ఈ స్ఫూర్తి చిరస్ధాయిగా నిలబడుతుంది.
సమావేశానికి హాజరైన వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 

కార్యకర్తల కోసం ఎంత గట్టిగా నిలబడతానో చూపిస్తా..
‘కష్ట సమయంలో ఉన్న మన కార్యకర్తలకు ఒక్కటే చెబుతున్నా. ఈ కష్ట కాలంలో మీరు చూపించిన ఈ స్ఫూర్తి, నిబద్ధతకు మీ జగన్‌ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడు. రాబోయే రోజులు మనవే. ఈసారి కచ్చితంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. ఈ సారి వచ్చినప్పుడు మీ జగన్‌ కార్యకర్తల కోసం కచ్చితంగా ఉంటాడు. జగన్‌ 1.0 పాలనలో కార్యకర్తల కోసం చేయాల్సినంత చేయలేకపోయి ఉండవచ్చు. 

మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్‌ వచ్చింది. కోవిడ్‌ సమయంలో రెండేళ్లు ప్రజల గురించి, వాళ్ల ఆరోగ్యం గురించే మొత్తం ఎఫర్ట్‌ పెట్టాం. కాబట్టి కార్యకర్తలకు ఉండాల్సి­నంత తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కానీ జగన్‌ 2.0 లో అలా జరగదు. అందరికీ మాట ఇస్తున్నా. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటా. కార్యకర్తల కోసం జగన్‌ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత మీ జగన్‌ చేసి చూపిస్తాడు’     
– వైఎస్‌ జగన్‌

విద్య, వైద్యం, వ్యవసాయం అధోగతి..
ఇవాళ స్కూళ్లు నాశనం అయిపోయాయి. ఇంగ్లీషు మీడియం గాలికెగిరిపోయింది. నాడు ృ నేడు పనులు ఆగిపోయాయి. టోఫెల్‌ తీసేశారు. మూడో తరగతి నుంచి టోఫెల్‌ శిక్షణ తరగతులు నిర్వహించి పిల్లలను గొప్పగా చదివించాలని ఆరాటపడే ఆలోచనలు గాలికెగిరి­పోయాయి. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్‌ లేదు. ఎనిమిదో తరగతి పిల్లలకు ఏటా ట్యాబ్‌ల పంపిణీ ఆగిపోయింది.

మరోవైపు వైద్యం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. 11 నెలలకు నెట్‌ వర్క్‌ ఆసుపత్రులకు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో పేషెంట్లకు వైద్యం చేయడానికి సుముఖంగా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. 104, 108 ఆంబులెన్సుల గురించి చెప్పాల్సిన పనిలేదు.

ఈ రోజు వ్యవసాయం గురించి అందరికీ తెలిసిందే. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతన్న పూర్తిగా దళారుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన దుస్థితి నెలకొంది. పెట్టుబడి సహాయం కింద జగన్‌ పీఎం కిసాన్‌తో కలిపి రూ.13,500 ఇస్తున్నాడు... మేం వస్తే పీఏం కిసాన్‌ కాకుండా సొంతంగా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ ఇచ్చిన అమౌంట్‌ లేదు... బాబు ఇస్తామన్నది కూడా ఇవ్వలేదు. మరోవైపు ఆర్బీకేలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా పూర్తిగా ఎత్తివేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది.

పీ4 పేరుతో బాబు కొత్త మోసం..
చంద్రబాబునాయుడు మోసాలు క్లైమాక్స్‌కి చేరాయి. చాలామంది చంద్రబాబు మారిపోయి ఉంటారని అనుకున్నారు. కానీ ఆయన మారలేదని నిరూపిస్తూ ఈమధ్య పీ4 అని కొత్త మోసం తీసుకొచ్చాడు. పీ4 విధానం ద్వారా సమాజంలో 20 శాతం పేదవారి బాగోగులు అన్నింటినీ 10 శాతం సంపన్నులకు అప్పగిస్తాడట. ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. 

అసలు చంద్రబాబుకు రాష్ట్రంలో ఎన్ని తెల్లరేషన్‌ కార్డులు ఉన్నాయో తెలుసా? రాష్ట్రంలో 1.61 కోట్ల ఇళ్లు ఉంటే 1.48 కోట్ల వైట్‌ (తెల్ల) రేషన్‌ కార్డులున్నాయి. అంటే 90 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో కేవలం 8.60 లక్షల మంది మాత్రమే ఆదాయపన్ను కడుతున్నారు. 25 లక్షల మంది ఐటీ ఫైల్‌ చేస్తున్నారు. అంటే 8.60 లక్షల మందికి.. 1.48 కోట్ల తెల్ల రేషన్‌ కార్డు దారులను అప్పగించాలి. 

అక్కడ కూడా మోసం చేస్తున్నాడు. పేదలు కేవలం 20 శాతం అంటున్నాడు. చంద్రబాబు చెప్పిన దానికి కనీసం వెయ్యి మంది కూడా ముందుకు రారు. చంద్రబాబు చెప్పింది అవాస్తవమని, జరగదని అందరికీ తెలుసు. ఆయన డ్రామాలు ఆడుతున్నాడని ప్రజలకు తెలుసు. జనం నవ్వుకుంటున్నారు. ఆయన మాట్లాడినప్పుడు మీటింగ్‌ల నుంచి వెళ్లిపోతున్నారు. అయినాసరే నేను చెప్పేది ప్రజలు నమ్మాల్సిందే అన్నట్లు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement