‘కూటమి సర్కార్‌ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తోంది?’ | Vaddi Raghuram Slams Chandrababu Govt Over Aqua Farmers | Sakshi
Sakshi News home page

‘కూటమి సర్కార్‌ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తోంది?’

Published Sun, Apr 13 2025 2:40 PM | Last Updated on Sun, Apr 13 2025 4:38 PM

Vaddi Raghuram Slams Chandrababu Govt Over Aqua Farmers

సాక్షి, తాడేప‌ల్లి: రాష్ట్రంలో కూటమి పార్టీల పెద్దలకు చెందిన ఆక్వా ఫీడ్ కంపెనీలకు ఈ సర్కార్ కొమ్ముకాస్తోందని అప్సడా వైస్‌ చైర్మన్, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆక్వాఫీడ్‌లో అధిక శాతం వినియోగించే సోయా కేజీ రూ.100 నుంచి రూ.25కి తగ్గితే, కూటమి ప్రభుత్వం ఫీడ్‌ రేటులో కేజీకి తగ్గించింది కేవలం రూ.4 మాత్రమేనని మండిపడ్డారు.

ముడిసరుకు రేట్లు నాలుగు వంతులు తగ్గితే, ఫీడ్ రేటులో తగ్గించింది నామమాత్రమేనని, ఆక్వా రైతుల కన్నా, తమ పార్టీకి చెందిన ఫీడ్ కంపెనీల ప్రయోజనాలకే మిన్నగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...

రాష్ట్రంలో సీడ్, ఫీడ్ తయారీ సంస్థలన్నీ కూటమి పార్టీలకు చెందిన నేతల చేతుల్లోనే ఉన్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మార్కెట్‌లో సోయా కేజీ వంద రూపాయలు ఉండేది. ఇప్పుడు అది పాతిక రూపాయలకు తగ్గింది. ఈ ప్రకారం ఫీడ్ రేట్లు కూడా దాదాపు నాలుగోవంతు వరకు తగ్గాల్సి ఉంది. అయితే కేంద్ర ప్ర‌భుత్వం సుంకం పెంచిందనే కార‌ణం చూపించి ఫీడు ధ‌ర‌లు కేజీ రూ.6.50లు అదనంగా పెంచారు.

దీనిపై వైఎస్‌ జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడంతో హడావుడిగా కేజీ ఫీడ్ రూ.4 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తగ్గిన ముడిసరుకు రేటుతో పోలిస్తే కనీసం రూ.15 రూపాయలు అయినా ఫీడ్ రేట్లు తగ్గాల్సి ఉంది. ఒకవైపు ముడిసరుకు ధరలు తగ్గిపోయినా ఫీడ్ రేటును నామమాత్రంగా తగ్గించి చేతులు దులుపుకుంటున్న ఈ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తోంది?

ఆక్వా సాధికారిత కమిటీని అటకెక్కించేశారు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆక్వా సాధికారిత కమిటీని ఏర్పాటు చేసి ప్రతివారం సీడ్, ఫీడ్ రేట్లు, ఆక్వా ఉత్పత్తుల ధరలపై మంత్రుల కమిటీ సమీక్షించేది. వీటిల్లో స్థిరీకరణ కోసం చర్యలు తీసుకుంది. దీని ఫలితంగా ఆక్వా రైతులకు మంచి రేట్లు రావడంతో పాటు సీడ్, ఫీడ్ రేట్లను ఇష్టం వచ్చినట్లు పెంచే ఆస్కారం లేకుండా కట్టడి చేసింది. ఎప్పుడైతే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయో, వెంటనే సాధికారిత కమిటీని పక్కకుపెట్టేశారు. కూటమి ప్ర‌భుత్వం తమకు అనుకూలంగా ఒక ఆక్వా క‌మిటీని ఏర్పాటు చేసింది.

దీనిలో తమ పార్టీలకు చెందిన ప్రాసెసింగ్ ప్లాంట్‌, హేచ‌రీ, ఫీడు కంపెనీల నుంచి ప్ర‌తినిధుల‌కు స్థానం కల్పించారు. ఈ కమిటీ ఆక్వారైతుల గురించి ఏ రకంగా ఆలోచిస్తుంది? మరోవైపు తమ ప్రభుత్వం వచ్చిందన్న భరోసాతో కూటమి పెద్దలు సీడ్, ఫీడ్ రేట్లను ఎడాపెడా పెంచుకుంటూ పోయారు. దీనితో ఆక్వా రైతులు పూర్తిగా అప్పుల పాలయ్యారు. తాజాగా అంతర్జాతీయ మార్కెట్‌లో టారీఫ్‌లను చూపించి మధ్య దళారీలు ఇష్టారాజ్యంగా రొయ్య రేట్లను తగ్గించుకుంటూ పోతున్నారు. దీనితో వంద కౌంట్ రొయ్యకు కనీస ధర కూడా లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

సుంకాల పేరుతో రైతులను దోచుకుంటున్నారు
ఆక్వా రైతులు ప‌డుతున్న క‌ష్టాలపై మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఇప్ప‌టికే రెండుసార్లు ప్ర‌భుత్వాన్ని సూటిగా ప్ర‌శ్నించారు. ఫీడు ధ‌ర‌లు త‌గ్గించాల‌ని, రొయ్య‌ల ధ‌ర‌లు పెంచాల‌ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆక్వా రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని హెచ్చరించారు. దీనితో ప్రభుత్వంలో కలవరం ప్రారంభమైంది. రైతుల పక్షాన పనిచేస్తున్నట్లుగా కనిపించేందుకు కూటమి ప్రభుత్వం ష‌రామామూలుగానే కేంద్రానికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకుంది.

ఆక్వా ఫీడు ధ‌ర కేవ‌లం రూ.4 త‌గ్గించి రైతులను ఆదుకుంటున్నట్లుగా ప్రచారం చేసుకుంది. అమెరికా ప్ర‌భుత్వం సుంకం పెంచార‌నే సాకు చూపించి వందకౌంట్ రొయ్య‌ల‌ను కేజీ రూ.220 కన్నా తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. అయితే అమెరికా పెంచిన సుంకం అమలుకు 90 రోజుల‌ పాటు సడలింపు ఇచ్చింది. అయినా కూడా రొయ్య రేట్లలో మాత్రం పెరుగుదల కనిపించడం లేదు. దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. రైతులను ఆదుకునేందుకు 100 కౌంట్ రొయ్య‌ల ధ‌ర‌ల‌ను క‌నీసం రూ. 270 ల‌కు పెంచాలి.  

ధాన్యం కొనుగోళ్ళలో తీవ్ర నిర్లక్ష్యం
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ళ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రతి జిల్లాలో ఒక ఐఏఎస్ అధికారిని నియమించి వారి నేతృత్వంలోనే ధాన్యం కొనుగోలు జ‌ర‌పాలి. రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర చెల్లించాలి. రైతు పండించిన ప్ర‌తి గింజ‌ను కొనుగోలు చేయాలి. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రైతుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా త‌యారైంది. దేవుడే న్యాయం చేయాల‌నే ఆకాశంలోకి దీనంగా చూసే దుస్థితికి ప్ర‌భుత్వం రైతులను తీసుకెళ్లింది. క‌ష్ట‌న‌ష్టాల్లో తోడుండి రైతుల‌ను ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం అప్పుల‌పాల‌వుతున్న రైతుల‌ను క‌నీసం ప‌ట్టించుకోకుండా గాలికొదిలేసింది.

వ‌ర్షాల కార‌ణంగా రాయ‌ల‌సీమ ప్రాంతంలో అర‌టి రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని, ప్ర‌భుత్వ‌మే వారిని ఆదుకోవాల‌ని వైఎస్‌ జ‌గ‌న్ ఈ కూటమి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై ఇంత‌వ‌ర‌కు వారికి న్యాయం జ‌ర‌గ‌లేదు. మిర్చి రైతుల‌కు మ‌ద్ధ‌తు ధ‌ర క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ గుంటూరు మిర్చి  యార్డును సంద‌ర్శించి రైతుల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికెళితే కేంద్రానికి తూతుమంత్రంగా లేఖ రాసి వ‌దిలేశారు.

అకాల వ‌ర్షాల కార‌ణంగా ధాన్యం త‌డిసిపోయి రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతే వారి గురించి కూడా ఈ కూట‌మి ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌డం లేదు. గ‌త వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో ప్ర‌తి జిల్లాలో ఒక ఐఏఎస్ అధికారిని ఇన్ చార్జిగా నియ‌మించి ఆర్బీకే సెంట‌ర్ల ద్వారా త‌డిసిన ధాన్యాన్ని కూడా మ‌ద్ద‌తు ధ‌ర‌కు కొనుగోలు చేస్తే ఇప్పుడు తేమ శాతం పేరుతొ మంచి ధాన్యాన్ని కూడా మ‌ద్ద‌తు ధ‌ర‌కు కొనుగోలు చేయ‌డం లేదు. ఎక్క‌డ చూసినా ద‌ళారుల రాజ్యంతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. రైతు స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వం ఇలాగే ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తే రానున్న రోజుల్లో రైతుల ప‌క్షాన‌ వైఎస్సార్‌సీపీ త‌ర‌ఫున భారీ ఎత్తున ఉద్య‌మం చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement