డబ్బు సంచులు తెచ్చిన వారికి, పక్క పార్టీలు వద్దన్న చెత్తకు టికెట్లిస్తారా?
రాష్ట్రవ్యాప్తంగా రగిలిపోతున్న టికెట్లు దక్కని టీడీపీ సీనియర్లు
రెబల్‌గా పోటీకి సిద్ధం
చంద్రబాబు నచ్చజెప్పినా ఒప్పుకోని అసమ్మతి నేతలు
బీఫాం ఇవ్వకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తానన్న బోడె ప్రసాద్
ఉండవల్లి రావాలన్నా పట్టించుకోని టీడీపీ పిఠాపురం ఇన్‌చార్జి వర్మ
కోనేటి ఆదిమూలాన్ని ఓడించి తీరుతా: జేడీ రాజశేఖర్ రెడ్డి
దళితులకు టికెట్ లేదని పీతల సుజాత ఆవేదన
పైరవీలకే ప్రాధాన్యం: జవహర్
సాక్షి నెట్‌వర్క్: పొత్తుల కత్తులు తెలుగుదేశం పార్టీని రోడ్డున పడేసింది. చంద్రబాబు, లోకేశ్ డబ్బుకు అమ్ముడు పోయారని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నమ్మకంగా పనిచేసిన వారికి వెన్నుపోటు పొడిచారని చంద్రబాబు, లోకేశ్‌పై తమ్ముళ్లు నిప్పులు చెరిగారు. తన స్వలాభం కోసం పొత్తు అంటూ తమను నట్టేట ముంచారని, డబ్బు సంచులతో వచ్చిన వారికి, పక్క పార్టీలు చెత్త అని పక్కన పెట్టిన వారిని తీసుకొచ్చి టికెట్లు కట్టబెడతారా? అంటూ ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేశారు. దీనికి ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.
నమ్మించి గొంతుకోసిన బాబుకు బుద్ధి చెబుతామని, రెబల్‌గా పోటీ చేసి తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కి పార్టీ జెండాలు పీకేసి నిరసన తెలిపారు. దీంతో చంద్రబాబు పరిస్థితి కొరివితో తలగొక్కున్నట్లయ్యింది. బుజ్జగింపుల పర్వానికి పిలుపునిచ్చినా.. అసమ్మతి నాయకులు వెనక్కి తగ్గేది లేదనడంతో బాబుకు గుబులు పట్టుకుంది. స్వయంగా చంద్రబాబు రమ్మని పిలిచినా చాలా మంది ముఖం చాటేశారు. వచ్చినవారు ఎంత బతిమిలాడినా తగ్గేదే లేదని.. తాడేపేడో తేల్చుకుంటామని తెగేసి చెప్పారు.
నేను పోటీ చేయడం ఖాయం!
తాను కచ్చితంగా పోటీలో ఉంటానని టీడీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్ ప్రకటించారు. కొవ్వూరులో శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. కొంతమంది మాటలు విని చంద్రబాబు తనను పక్కన పెట్టారని, పైరవీలు చేసిన వారికి ప్రాధాన్యం కల్పించారని ఆరోపించారు. ప్రజలను, నాయకులను నమ్ముకున్నానని, క్యాడర్‌తో మాట్లాడిన తర్వాత నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు.
రాజకీయాల్లోకి వచ్చాక ఇల్లు అమ్ముకున్నానని, పౌల్ట్రీ వేలానికి వెళ్లిందని, అన్ని రకాలుగా ఆర్థికంగా దెబ్బతిన్నానని చెప్పారు. టీడీపీలో పెత్తందారులదే రాజ్యమని.. జిల్లా నాయకులు కుట్రలు చేసి తప్పు చేయకపోయినా తనను మంత్రి పదవి నుంచి తొలగించారని టీడీపీ నాయకురాలు పీతల సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోవడం చాలా బాధగా ఉందంటూ శుక్రవారం వీడియో విడుదల చేశారు. ఎన్నారైలు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎన్నికలయ్యాక వెళ్లిపోతారని చెప్పారు.
చంద్రబాబు చుట్టూ బ్రోకర్లే..
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఎన్.రాఘవేంద్రరెడ్డిని ప్రకటించడంతో నియోజకవర్గ ఇన్‌చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అనుచరులు ఆందోళన బాట పట్టారు. శుక్రవారం మంత్రాలయంలో అనుచరులతో భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించి టైర్లను తగలబెట్టారు. ఈ సందర్భంగా పాలకుర్తి మాట్లాడుతూ చంద్రబాబు చుట్టూ బ్రోకర్లు ఉన్నారని.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానన్నారు.
కృష్ణాలో ఆరని మంటలు
విజయవాడ వెస్ట్ సీటు తనకే ఖరారయ్యిందని జనసేన నేత పోతిన మహేష్ ఇంటింటికి ప్రచారం చేశారు. పోతినకు టికెట్ ఇవ్వలేకపోతున్నట్లు ప్రకటించి పవన్ హైదారాబాద్ వెళ్లిపోయారు. దీంతో మహేష్ డివిజన్ ఇన్‌చార్జిలు, కార్యకర్తలతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు బోరున విలపించారు. పవన్ తీరుపై పోతిన మహేష్, జనసేన కార్యకర్తలు మండిపడ్డారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని మహేష్ హెచ్చరించారు.
పెనమలూరు టికెట్ ఇవ్వడం లేదని బోడే ప్రసాద్‌కు అధిష్టానం చెప్పగా.. చంద్రబాబు పిలుపు మేరకు ఆయన శుక్రవారం మధ్యాహ్నం వెళ్లి కలిశారు. బాబు ఆయనకు సృష్టమైన హామీ ఇవ్వలేదు. చంద్రబాబు ఎంత నచ్చజెప్పినా బోడె ప్రసాద్ వెనక్కితగ్గలేదు. నమ్మకున్న వారికి ద్రోహం చేసి పార్టీని ఎలా గెలిపించుకుంటారని చంద్రబాబును ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం.
సీటు లేదు.. ఓటు వేయండంటూ యనమలకుదురు నుంచి ఆయన పాదయాత్ర చేపట్టారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మైలవరం టీడీపీ ఇన్‌చార్జి దేవినేని ఉమాను గురువారం రాత్రి కూడ బాబు పిలిపించినట్లు సమాచారం. వసంతకు సహకరించాలని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆయన రగిలిపోతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాబు పిలుపునకు పలకని వర్మ
పిఠాపురం సీటులో పవన్ కళ్యాణ్ పోటీకి సిద్ధమయ్యారు. దీంతో అక్కడి టీడీపీ ఇన్‌చార్జి ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి తన నివాసానికి రావాలని పిలిచినా ముఖం చాటేశారు. తనను బుజ్జగించే కంటే సీటు ఇస్తేనే పరిస్థితి సద్దుమణుగుతుందని వర్మ గట్టిగా చెప్పారు. సీటు దక్కక పోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి తన సత్తా చూపిస్తానని సవాల్ విసిరారు.
పెదకూరపాడులో గెలుపు ఎలా సాధ్యం?
పెదకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌కు కేటాయించగా.. అక్కడ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను ఎలాగైన ఒప్పించి, ప్రవీణ్‌కు సహకరించేలా ఆయనను చంద్రబాబు దగ్గర తీసుకొచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే తగిన ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు చెప్పినా.. అసలు గెలుపు ఎలా సాధ్యమని శ్రీధర్ ప్రశ్నించినట్లు సమాచారం. ఎచ్చెర్ల టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న కళా వెంకట్రావు పేరుకూడా రెండో జాబితాలో లేకపోవడంతో ఆయన వర్గం ఆందోళనకు దిగింది. చంద్రబాబు బుజ్జగించి..చీపురుపల్లి వెళ్లాలని సూచించినప్పటికీ అంగీకరించలేదని సమాచారం.
నమ్మించి గొంతు కోశారు
కష్టకాలంలో పార్టీని, కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చానని, అయినా తనకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని కోవూరు నియోజకవర్గ టీడీపీ నేత పోలంరెడ్డి దినేష్‌రెడ్డి అన్నారు. కొడవలూరులో ఆత్మీయులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. పలుమార్లు ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రకటించి చివరికి నడిబజారులో గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. దినేష్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీచేయాలని కార్యకర్తలు కోరారు.
యాదవులపై చిన్నచూపు
పుంగనూరు నుంచి తానే పోటీలో ఉంటానని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ఆశించగా.. టీడీపీ నాయకుడు చల్లా రామచంద్రారెడ్డినే ఖరారు చేయటంతో యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటగిరి టికెట్ ఈ సారి బీసీలకు కేటాయించాలని మస్తాన్ యాదవ్, మరి కొందరు చేనేత కార్మికులు గట్టిగా ప్రయత్నాలు చేశారు.
చివరకు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రెండో భార్య కుమార్తె లక్ష్మీసాయి ప్రియ పేరును ప్రకటించటంతో బీసీ సామాజికవర్గానికి చెందిన వారంతా రగిలిపోతున్నారు. డాలర్ దివాకర్‌రెడ్డి చంద్రగిరి నుంచి పోటీ చేయాలని కొంత కాలంగా బ్యానర్లు, ఫ్లెక్సీలతో హంగామా చేస్తూ వచ్చారు. చివరకు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన పులివర్తి నానికి కేటాయించటంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఏలూరు బీజేపీలో ముసలం
ఏలూరు ఎంపీ సీటు ఆశిస్తున్న గారపాటి సీతారామాంజనేయ చౌదరికి షాకివ్వడంతో ఆయన అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ నుంచి సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. శుక్రవారం ఏలూరు మినీ బైపాస్‌లోని క్రాంతి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం పేరుతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో వలస పక్షుల మాదిరిగా రాబందులు డబ్బు సంచులతో వాలిపోతారని, గెలిస్తే ఢిల్లీలో ఉంటారని, లేకపోతే అడ్రస్ ఉండరని ఘాటుగా విమర్శించారు. ఆరు నూరైనా పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు.
చోడవరంలో జనసేన ఆగ్రహ జ్వాల
చోడవరం టికెట్ టీడీపీకి ఇవ్వడంపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. జనసేన సమన్వయకర్త పీవీఎస్‌ఎన్ రాజు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఐదేళ్లుగా అనేక ఉద్యమాలు చేశామని, తమకు కాకుండా టీడీపీకి ఎలా కేటాయిస్తారని సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ సరైన నిర్ణయం తీసుకోకపోతే టీడీపీ అభ్యర్థికి పనిచేయడానికి జనసేన సిద్ధంగా లేదని స్పష్టం చేశారు.
జనసేన నేతలకు అవమానం
చిత్తూరుకు చెందిన ఆరణి శ్రీనివాసులు అనుచరులు తిరుపతి జనసేన నేతలను తీవ్రంగా అవమానించారు. జనసేనకు తిరుపతి అసెంబ్లీని కేటాయించినా.. పోటీ చేసేందుకు బలమైన నాయకులు లేరని, అందుకే చిత్తూరు నుంచి చీరలు, గాజులు పంపిస్తున్నామంటూ అవమానించారని జనసేన నేత కిరణ్‌రాయల్ పార్టీ అంతర్గత సమావేశంలో వెల్లడించారు. ఆరణికి టికెట్ ఇస్తే పనిచేసేది లేదంటూ తీర్మానం చేసి ఆ లేఖను అమరావతికి పంపారు.
పార్టీ పదవులకు పరుచూరి రాజీనామా
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు పరుచూరి భాస్కరరావు చెప్పారు. ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడితే పవన్‌కళ్యాణ్ కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. కొత్తగా వచ్చిన కొణతాలకు టికెట్ ఇవ్వడం అన్యాయమన్నారు.
వంతలకు భంగపాటు
రంపచోడవరం టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ వంతల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. వారికి భంగపాటు ఎదురైంది. బాబును కలిసేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో మధ్యాహ్నం వరకు ఆందోళన చేశారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదని ధ్వజమెత్తారు. నలుగురికి చంద్రబాబును కలిసే అవకాశం రాగా.. శిరీష భర్త మఠం భాస్కర్‌పై వారు ఫిర్యాదు చేశారు.
రెబల్‌గా పోటీ చేస్తా!
‘చంద్రబాబు గారు.. మేం చేసిన పాపం ఏమిటి? భార్య బిడ్డలను వదిలి పార్టీ కోసం కష్టపడి పనిచేశా. సత్యవేడు సీటు ఎందుకు ఇవ్వలేదు. ఆదిమూలం చెత్త అని వైఎస్సార్‌సీపీ టికెట్ ఇవ్వలేదు. ఆ చెత్తను మనం ఎందుకు నెత్తిన వేసుకోవాలి. నేను రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తాను. కోనేటి ఆదిమూలాన్ని ఓడించి తీరుతాను’ అని సత్యవేడు టీడీపీ మాజీ ఇన్‌చార్జి జేడీ రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు.
జేడీ రాజశేఖరరెడ్డి గురువారం కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 2019 నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, ఆదిమూలం ఎమ్మెల్యేగా గెలుపొందాక.. కేసులు పెట్టి వేధించారని గుర్తుచేశారు. తాను వ్యాపారం చేసుకునేదానిని, టీడీపీ గెలుపు కోసం అన్నీ వదిలేసి కష్టపడి పనిచేశాని జేడీఆర్ కుమార్తె మౌనిక కన్నీరు మున్నీరైంది. సత్యవేడు సీటు కోసం నాలుగేళ్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్ హెలెన్ మనస్తాపంతో నివాసానికే పరిమితమయ్యారు.
ఎంపీ ఇంటి ముందు అర్ధనగ్న ప్రదర్శన
శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి ఇవ్వాలంటూ టీడీపీ నాయకులు ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఇంటి ముందు శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీ ఇంటి గేటు ముందు బైఠాయించడంతో పాటు కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. లక్ష్మీదేవి అభ్యర్థిత్వం ఖరారు కాకపోతే ఎంపీ రామ్మోహన్‌నాయుడు గెలవరంటూ నినాదాలు చేశారు. విజయవాడ వెళ్లి పరిస్థితులను చంద్రబాబుకు వివరిస్తానని రామ్మోహన్‌నాయుడు తెలిపారు.
అమలాపురంలో నువ్వా.. నేనా
అమలాపురం అసెంబ్లీ స్థానంపై సర్వేలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అభ్యర్థిత్వంపై అభిప్రాయ సేకరణ చేశారు. మధ్యాహ్నం నుంచి సీన్ మారింది. మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరావు కుమార్తె పాము సత్యశ్రీ అభ్యర్థిత్వంపై ఐవీఆర్‌ఎస్ సర్వే మొదలైంది. ఒకే రోజు ఇద్దరి పేర్లపై సర్వేతో పార్టీ క్యాడర్‌లో గందరగోళం నెలకొంది.
మరోవైపు జనసేన పార్టీ ఇన్‌చార్జి శెట్టిబత్తుల రాజబాబు, పార్లమెంటరీ ఇన్‌చార్జి డీఎంఆర్ శేఖర్‌లు తమకే టికెట్ దక్కుతుందనే ఆశతో ఉన్నారు. ఈ సమయంలో టీడీపీ ఐవీఆర్‌ఎస్ సర్వే చేపట్టడం జనసేనలో ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో వారు అమలాపురం గడియారస్తంభం సెంటర్‌లో ఆందోళనకు దిగారు. అమలాపురం సీటు జనసేనకు కేటాయించాల్సిందేనని, లేకుంటే పొత్తు పక్కన పెట్టి టీడీపీని ఓడిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment