![YS Jagan Fires On Chandrababu Coalition Govt financial destroy](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/jagan1.jpg.webp?itok=uCoQhbWr)
జేబులు నింపుకోవడమే బాబు దృష్టిలో సంపద సృష్టి
మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు
మేం సంపద సృష్టిస్తే.. బాబు ప్రైవేట్‌కు అమ్మకాలు.. ఆర్థిక అరాచకాలు
4 పోర్టులు.. 10 ఫిషింగ్ హార్బర్లు.. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన నేను సంపద సృష్టించినట్లా? లేక వాటిని ప్రైవేట్‌కు కట్టబెడుతూ జేబులు నింపుకుంటున్న చంద్రబాబు సంపద సృష్టించినట్లా?
పారదర్శకంగా ఇసుక, మద్యం విక్రయాలతో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చిన నేను సంపద సృష్టించినట్లా?
లేక ఖజానాకు గండి కొడుతున్న చంద్రబాబు సంపద సృష్టికర్తా?
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను మౌలిక వసతులతో బలోపేతం చేసి కోవిడ్‌లోనూ వృద్ధిని పరుగులు తీయించిన నేను విధ్వంసం సృష్టించినట్లా?
లేక ఒక్క హామీని నెరవేర్చకుండా తొమ్మిది నెలల్లోనే రూ.1.45 లక్షల కోట్ల రికార్డు అప్పులు చేసిన చంద్రబాబు ఆర్థిక విధ్వంసం సృష్టించినట్లా?
నిజంగా సంపద సృష్టించిందెవరు?
ఆర్థిక విధ్వంసకారుడెవరు?
చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి, ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలన్న ఆరాటం ఉంది కాబట్టి రూ.2.73 లక్షల కోట్లు బటన్ నొక్కి డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం. లంచం లేని పాలన ఎక్కడైనా జరిగిందంటే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే అని గర్వంగా చెప్పగలుగుతున్నా. దేశ చరిత్రలో ఇదో రికార్డు. కమీషన్లు రావు కాబట్టి చంద్రబాబు బటన్ నొక్కడం లేదు.
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: నవరత్నాలతో ప్రజలకు మేలు చేయడంతోపాటు ఆర్ధిక క్రమశిక్షణతో తమ ప్రభుత్వం పాలన సాగిస్తే.. తొమ్మిది నెలల్లోనే కూటమి సర్కారు ఆర్ధిక విధ్వంసం, స్కామ్‌ల కోసం సంపదను తెగనమ్ముతోందని వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS JaganMohanReddy) విరుచుకుపడ్డారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే తన ఆస్తులు, తమ వారి ఆస్తులు పెంచుకుని జేబులు నింపుకోవటమేనని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో జరగని స్కామ్ అంటూ లేదని దుయ్యబట్టారు.
తొమ్మిది నెలల పాలనలో రూ.1.45 లక్షల కోట్ల అప్పులతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన చంద్రబాబు ఆర్థిక విధ్వంసకారుడా? లేక కోవిడ్‌లోనూ వృద్ధి రేటులో దేశంతో పోటీ పడి ఉత్తమ పని తీరు, మెరుగైన వృద్ధి రేటు, తలసరి ఆదాయంలో పెరుగుదల, సామాజిక సేవలపై వ్యయం, మూలధన వ్యయంలో పెరుగుదల నమోదు చేసిన తాము విధ్వంసం సృష్టించినట్లా? అని ప్రశ్నించారు.
పారదర్శకంగా ఇసుక విక్రయాల ద్వారా ఖజానాకు ఏటా రూ.750 కోట్ల ఆదాయం సమకూర్చిన తమ ప్రభుత్వం సంపద సృష్టించినట్లా? లేక ఇసుక నుంచి మద్యం దాకా పచ్చముఠాల దోపిడీకి పచ్చజెండా ఊపిన టీడీపీ సర్కారు సంపద సృష్టించినట్లా? అని నిలదీశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన తాము సంపద సృష్టించినట్లా? లేక వాటికి అడ్డుపడి ప్రైవేట్‌కు అప్పగించి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమైన చంద్రబాబు సంపద సృష్టికర్తా? అని ప్రశ్నించారు.
మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని తొలగించి జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండర్లతో పారదర్శక విధానాన్ని ప్రవేశపెట్టిన తాము ఆర్థిక విధ్వంసకారులమా? తిరిగి మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ కమీషన్లు వసూలు చేసుకుంటున్న చంద్రబాబు ఆర్ధిక విధ్వంసకారుడా? అని ప్రశ్నించారు.
గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. గత తొమ్మిది నెలలుగా టీడీపీ కూటమి సర్కారు అరాచకాలు, హామీల ఎగవేత, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై దుష్ఫ్రచారాలను కాగ్, కేంద్ర ఆర్ధిక సంఘం, కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ నివేదికల ఆధారంగా ఎండగట్టి కడిగి పారేశారు.
అప్పుల్లో ఆల్‌టైమ్ రికార్డు
⇒ తొమ్మిది నెలల పాలనలో అప్పుల విషయంలో మాత్రం చంద్రబాబు రికార్డులు బద్ధలు కొట్టారు. బహుశ ఏ ప్రభుత్వ హయాంలోనూ ఈ స్థాయిలో అప్పులు చేసిన దాఖలాలు లేవు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.80,827 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు, తెచ్చే అప్పులు కలిపి మరో రూ.52 వేల కోట్లు ఉంటాయి.
ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.5వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, సీఆర్‌డీఏ ద్వారా చేయాలని నిర్ణయించిన అప్పులు మరో రూ.21 వేల కోట్లు ఉంటాయి. మార్క్‌ఫెడ్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ద్వారా మరో రూ.8 వేల కోట్లు, ఏపీఎండీసీ ద్వారా తేనున్న అప్పులు మరో రూ.5 వేల కోట్లు..! తీసుకొచ్చిన అప్పులు, తేనున్న అప్పులు కలిపితే రూ.1.45 లక్షల కోట్ల పైమాటే. ఇదొక రికార్డు. దీన్ని ఎవరూ బద్ధలు కొట్టలేరు.
⇒ ఈ మధ్య నీతి ఆయోగ్ పేరుతో చంద్రబాబు ఆడిన కొత్త డ్రామాలు మీరు చూసే ఉంటారు. ఏదైనా పోల్చినప్పుడు తన ఐదేళ్ల పాలనను, మన ఐదేళ్ల పాలనతో పోల్చి వాస్తవాలివీ అని చెప్పేలా ఉండాలి. కానీ ఈ పెద్ద మనిషి ఏం చేశాడంటే.. తన పాలనలో బెస్ట్ ఇయర్ (2018–19)లో వచ్చిన ఫలితాలను మన హయాంలో వరస్ట్ ఇయర్ (2022–23)తో కంపేర్ చేస్తూ రాష్ట్రం చాలా అన్యాయమైన పరిస్థితుల్లో ఉన్నట్టు చూపించారు. చంద్రబాబు ఐదేళ్ల డేటా.. మన హయాంలో ఐదేళ్ల డేటాను పరిశీలించి ఎవరు ఆర్ధిక విధ్వంసం చేశారో మీరే చూడండి. మా హయాంలో రెండున్నరేళ్లు కోవిడ్ ఉందన్న విషయాన్ని మర్చిపోకండి. కానీ చంద్రబాబు హయాంలో ఎలాంటి కోవిడ్‌లు లేవు.. మహమ్మారులూ లేవు.
⇒ ఏపీ ఎవరి హయాంలో వేగంగా అడుగులు వేసిందో చెప్పేందుకు జీడీపీ (దేశీయ స్థూల ఉత్పత్తి)లో రాష్ట్ర వాటా ఎంత అన్నది కూడా ప్రామాణికం. దేశ జీడీపీలో రాష్ట్ర వాటా చంద్రబాబు హయాంలో 2014–19లో కేవలం 4.47 శాతం కాగా వైఎస్సార్‌సీపీ హయాంలో 2019–24లో ఆ వాటా 4.80 శాతానికి పెరిగింది. ఎవరి హయాంలో రాష్ట్రం విధ్వంసమైంది? ఎవరి హయాంలో వృద్ధి పరుగులు తీసింది? అనేది చెప్పేందుకు ఇదొక నిదర్శనం.
⇒ కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ఇచ్చిన నివేదికతో మరో ఆధారాన్ని చూపిస్తా. చంద్రబాబు దిగిపోయే నాటికి 2018–19లో తలసరి ఆదాయంలో మన రాష్ట్రం దేశంలో 18వ స్థానంలో ఉంది. అదే వైఎస్సార్‌సీపీ హయాంలో తలసరి ఆదాయంలో మన రాష్ట్రం 2022–23లో 15వ స్థానానికి ఎగబాకింది. మరి ఎవరి హయాంలో ఆరి్ధక విధ్వంసం జరిగింది? ఎవరి హయాంలో ప్రజలు బాగుపడ్డారో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
⇒ వృద్ధి రేటులో మా ప్రభుత్వ హయాంలో 2019–24లో దేశంతో పోటీ పడ్డాం. ప్రతి రంగంలో దేశం కంటే రాష్ట్రం ఉత్తమ ఫలితాలు సాధించింది. దేశ జీడీపీ 2019–24లో 9.34 శాతం కాగా రాష్ట్రం ఏకంగా 10.23 శాతంతో మెరుగైన పనితీరు కనబరిచింది.
⇒ పారిశ్రామిక రంగం జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్) ర్యాంకింగ్ పరిశీలిస్తే చంద్రబాబు దిగిపోయేనాటికి మన రాష్ట్రం 11 స్థానంలో ఉంటే.. 2023–24లో మా ప్రభుత్వం వైదొలిగే నాటికి 9 స్థానానికి ఎగబాకాం. రెండున్నరేళ్లు కోవిడ్ ఉన్నా సరే.. మంచి పనితీరు కనబరిచాం. మరి ఎవరిది ఆర్థిక విధ్వంసం?
టీడీపీ హయాంలో 2014–19 మధ్య ఆస్తుల కల్పనలో భాగంగా సగటు మూలధన వ్యయం రూ.13,860 కోట్లు ఖర్చు చేస్తే.. మా హయాంలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మూలధన వ్యయం కింద రూ.15,632 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు చెప్పండి. ఎవరి హయాంలో ఆర్ధిక విధ్వంసం జరిగింది? ఇక చంద్రబాబు సామాజిక సేవల కింద ఒకే ఒక్క సంవత్సరాన్ని చూపించారు.
2018–19లో సోషల్ సర్వీస్ కింద ఆయన రూ.2,866.11 కోట్లు ఖర్చు చేస్తే.. 2022–23లో రూ.447.78 కోట్లు మాత్రమే వ్యయం చేశారని చెప్పుకొచ్చారు. కానీ 2014–19 మధ్య ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం రూ.2,437 కోట్లు ఖర్చు చేస్తే.. వైఎస్సార్‌సీపీ హయాంలో దానికి రెట్టింపు.. రూ.5,224 కోట్లు వ్యయం చేశాం. ఇవన్నీ మూలధన వ్యయంలో సోషల్ సర్వీస్ కింద ఖర్చులపై కాగ్ నివేదిక తేల్చిన లెక్కలు. ఒక్క ఏడాదిని మాత్రమే తీసుకుని పోల్చుకోవడం చంద్రబాబు మనస్థత్వానికి, వక్రీకరణలకు అద్దం పడుతోంది. ఏ రకంగా చూసుకున్నా సరే.. మా హయాంలో రాష్ట్రం అన్ని రకాలుగా ముందడుగు వేసింది.
ఆర్ధిక అరాచకం..
⇒ 2014–19లో టీడీపీ హయాంలో రాష్ట్రం కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు 15.43 శాతం ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వ జీఎస్‌డీపీ పెరుగుదల 13.46 శాతం. అంటే చంద్రబాబు చెప్పిన సిద్ధాంతం ప్రకారమే డెట్ సస్టెయినబులిటీ ఎక్కువగా ఉంది.
⇒ 2019–24లో దేశం పరిస్థితిని గమనిస్తే వడ్డీలకు సంబంధించి వృద్ధిరేటు సీఏజీఆర్ 12.80 శాతమైతే.. జీడీపీలో సీఏజీఆర్ 9.34 శాతం ఉంది. దేశం జీరో డెట్ సస్టయినబులిటికీ వెళ్లిపోయింది. రాష్ట్రంలో వడ్డీల వృద్ధి రేటు చంద్రబాబు హయాంలో 15.43 శాతం ఉంటే దాన్ని 13.92 శాతానికి తగ్గించగలిగాం. కానీ ఆ విషయాన్ని మాత్రం చెప్పడు. ఇక జీడీపీ వృద్ధి రేటు 9.34 శాతం ఉంటే మా హయాంలో మన రాష్ట్రం దేశం కంటే మెరుగ్గా 10.23 శాతం గ్రోత్ నమోదు చేసింది. అక్కడ కూడా మనం ప్లస్‌లోనే ఉన్నాం.
ఇవన్నీ దాచిపెట్టి వడ్డీల పెరుగుదల రేటు 13.92 శాతం.. ఏపీ జీఎస్డీపీ 10.23 శాతం అని చెబుతూ రాష్ట్రం విధ్వంసమైందని చంద్రబాబు చెప్పడం ధర్మమేనా? మొత్తం పిక్చర్ గమనిస్తే చంద్రబాబు హయాంలో రాష్ట్రం ఏ స్థాయిలో విధ్వంసమైందన్నది స్పష్టంగా తెలుస్తోంది. జగన్ హయాంలో రాష్ట్రాన్ని చేయిపట్టుకొని నడిపించే కార్యక్రమం జరిగినట్లు విస్పష్టంగా కనిపిస్తోంది.
⇒ ఇక ఎవరి హయాంలో అప్పులు ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనిస్తే.. రాష్ట్రం అప్పులు రూ.14 లక్షల కోట్లు అని చంద్రబాబు ఊదరగొట్టారు. రాష్ట్రం శ్రీలంకలా అయిపోతోందని బండలు వేశాడు. ఇప్పుడు గవర్నర్ ప్రసంగానికి వచ్చేసరికి రాష్ట్రం అప్పులు రూ.10 లక్షలు కోట్లు అని చెప్పారు. శ్వేత పత్రాలు విడుదల చేసే సమయంలో రూ.12.93 లక్షల కోట్లన్నారు.
బడ్జెట్ ప్రవేశపెడితే అప్పులు చెప్పాల్సి వస్తుందని వాయిదా వేస్తూ వచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో నవంబర్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్రం అప్పులు రూ.6,46,531 కోట్లు మాత్రమే అని తనంతట తానే ఒప్పుకోక తప్పలేదు. ఇంత దారుణమైన మనిషి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు. ఈ పెద్దమనిషి చంద్రబాబు ఇలాంటి మోసాలు చేస్తా ఉంటారు. వీటిని ప్రజలు గమనించాలి.
⇒ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడి రాష్ట్ర జీఎస్‌డీపీలో 3 నుంచి 3.5 శాతం అప్పులు చేయవచ్చని కేంద్రం నిర్దేశిస్తోంది. ఆ ప్రకారమే ఎవరైనా తీసుకోగలుగుతారు. అంతకంటే ఎక్కువ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. చంద్రబాబు పాలనలో 2014–19లో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటి రూ.31,082 కోట్లు అదనంగా అప్పులు చేశారు. ఆయన తీసుకున్న అదనపు అప్పులతో రూ.17 వేల కోట్లు మా ప్రభుత్వ హయాంలో కోత పెట్టారు.
⇒ చంద్రబాబు హయాంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కూడా తగ్గింది. 2023–24లో జూన్–డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ.50,804 కోట్లు అయితే.. 2024 జూన్ నుంచి డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.50,544 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 10 శాతం ఆదాయం పెరగడం సాధారణం. అలాంటిది చంద్రబాబు హయాంలో 0.5 శాతం తగ్గింది. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు చంద్రబాబు, వారి మనుషులు జేబుల్లోకి పోతున్నాయి!
⇒ వృద్ధి రేటు తిరోగమనంలో (నెగిటివ్ గ్రోత్) ఉన్నప్పుడు జీఎస్‌డీపీలో పెరుగుదల ఉంటుందా? రెవెన్యూ గ్రోత్ తగ్గినప్పుడు జీఎస్‌డీపీ తగ్గాలి కదా! కానీ చంద్రబాబు తన హయాంలో 13 శాతం పెరిగినట్టు రిపోర్టు ఇచ్చారు. ఆయన ఏ స్థాయిలో అబద్ధాలాడుతున్నారో దీన్నిబట్టి తేటతెల్లమవుతోంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చంద్రబాబుకు కొత్తేమి కాదు.
⇒ 2016లో చంద్రబాబు దావోస్ వెళ్లినప్పుడు ఏపీకి రక్షణ పరికరాల ప్లాంట్ వస్తుందన్నారు. 2017లో వెళ్లినప్పుడు విశాఖపటా్ననికి హైస్పీడ్ రైళ్ల కర్మాగారం, హైబ్రీడ్ క్లౌడ్ వస్తుందన్నారు. సౌదీ ఆరాంకో వచ్చేస్తుందన్నారు. 2018 పర్యటనలో రాష్ట్రానికి 150 సంస్థలు వచ్చేస్తున్నాయన్నారు. ఇంకా ఎయిర్ బస్, అలీబాబా ఏపీకి వస్తున్నాయన్నారు. 2019 జనవరిలో వెళ్లినప్పుడు ఏపీకి జెన్ ప్యాక్ వస్తుందని ప్రచారం చేసుకున్నారు(ఈనాడు కథనాల క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు). ఇదంతా దొంగల ముఠా.. దోచుకో పంచుకో తినుకో విధానం. ఇలా బిల్డప్‌లు, అబద్ధాలు చెప్పడం.. మోసాలు చేయడం చంద్రబాబుకు కొత్త కాదు.
⇒ చంద్రబాబు దావోస్ వెళ్లినప్పుడు ఒక్క ఎంవోయూ కూడా చేసుకోలేకపోయారంటే ఇప్పుడు రాష్ట్రానికి ఉన్న పలుకుబడి.. చంద్రబాబు పట్ల పారిశ్రామికవేత్తల్లో ఎలాంటి అభిప్రాయం నెలకొందో చెప్పేందుకు నిదర్శనం. పెట్టుబడులు పెట్టేందుకు జిందాల్ లాంటి సంస్థ వస్తే ఎవరైనా రెడ్ కార్పెట్ పరిచి స్వాగతిస్తారు. కానీ చంద్రబాబు ఏం చేశారంటే.. వాళ్లపై కేసులు పెట్టి, వాళ్ల ప్రతిష్టను నాశనం చేసి భయపెట్టి వెళ్లగొట్టాడు. దీంతో అదే దావోస్‌లో వాళ్లు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నాడు.
సంపద సృష్టించిందెవరు?
⇒ రాష్ట్రం ఆదాయాలు పెరిగేలా వైఎస్సార్‌సీపీ హయాంలో నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపట్టాం. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు ప్రభుత్వ రంగంలో చేపట్టాం. రామాయపట్నం 75–80 శాతం పూర్తయింది. మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో 35–40 శాతం పనులు వేగంగా పూర్తయ్యాయి. 10 ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మా హయాంలో కొన్ని ప్రారంభోత్సవం కూడా చేశాం.
వీటి ద్వారా కొన్ని లక్షల కోట్ల ప్రభుత్వ సంపద సృష్టించబడుతుంది. రాష్ట్రానికి సొంత రాబడి పెరగాలంటే ఇలాంటిæ ఆస్తులు ప్రభుత్వం చేతిలో ఉండాలి. ఇవన్నీ ఫైనాన్షియల్ టైఅప్ అయిన ప్రాజెక్టులు వీటి నిర్మాణానికి నిధుల కోసం వెతుక్కోవాల్సిన పని లేదు. డబ్బులొచ్చి మేరిటైం బోర్డు అకౌంట్‌లో ఉన్నాయి. డబ్బులు డ్రా చేస్తూ కంప్లీట్ చేస్తే చాలు. ఈపాటికే రామాయపట్నానికి ప్రారంభోత్సవం చేయవచ్చు. మిగిలినవి ఒకటి రెండేళ్లలో పూర్తి చేయొచ్చు. అలాంటిది వీటిని అడ్డం పెట్టుకొని స్కామ్‌లు చేస్తూ అమ్మకానికి పెట్టారు.
⇒ మా హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వీటిలో ఐదు కాలేజీలను మా హయాంలోనే ప్రారంభిస్తే ఈ విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మరో 5 కొత్త కళాశాలలను అడ్డుకుని తమవారికి ప్రైవేట్‌కు విక్రయించేందుకు సిద్ధపడుతున్నారు.
⇒ వచ్చే ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లు ఇస్తామని ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ ఏడాది 10 వేల సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఇలాంటప్పుడు ఎవరైనా సాధ్యమైనన్ని సీట్లు తమ రాష్ట్రానికి రావాలని ఆరాటపడతారు. కానీ మన రాష్ట్రానికి ఇస్తామన్న మెడికల్ సీట్లను సైతం వద్దంటూ కేంద్రానికి లేఖ రాసిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రమే. ఇలా స్కామ్‌ల కోసం ఉన్న ఆస్తులను అమ్ముతున్నారు.
సంపద సృష్టి అంటే బాబు జేబు నింపుకోవడమా?
చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే.. తన ఆస్తులు, తమ వారి ఆస్తులు పెంచుకోవడం! ఈ ప్రభుత్వ హయాంలో జరగని స్కామ్ అంటూ లేదు. గతంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది. ఈరోజు ఒక్క రూపాయి రావడం లేదు పైగా గతంలో కంటే రెట్టింపు ధర వసూలు చేస్తున్నారు. సంపద సృష్టి చంద్రబాబు జేబులోనే జరుగుతోంది! రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఆవిరవుతోంది.
⇒ ఇక లిక్కర్ స్కామ్.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులను ప్రైవేటు పరం చేసారు. ఇవే ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారు. చంద్రబాబు తమ ప్రభుత్వంలో స్కామ్‌లు చేస్తూ అక్కడకు వెళ్లి అరవింద్ కేజ్రీవాల్‌ను తిట్టి వస్తాడు. మద్యం షాపులను ప్రైవేౖటుపరం చేసాడు. తనవారికి షాపులు ఇప్పించుకునేందుకు తమ ఎమ్మెల్యేలతో ఎలా కిడ్నాప్‌లు చేయించారో చూశాం. తన పార్టీకి సంబంధించిన వాళ్లు మాత్రమే టెండర్లలో పాల్గొనేలా చేశారు.
లాటరీలో కూడా తమ వాళ్లకే షాపులు దక్కేలా చేసుకున్నారు. వేరే వాళ్లు పాల్గొనకుండా పోలీసులు సమక్షంలో చేసారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బెల్టుషాపులకు వేలం పాటలు నిర్వహించారు. ప్రతి గ్రామంలో రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు తమ కార్యకర్తలకు కట్టబెట్టారు. వీటిని పాడుకున్న వారికి పోలీసుల ద్వారా సహకారం అందిస్తున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నా పట్టించుకునే వారే లేరు. అదే ప్రభుత్వ రంగంలో షాపులుంటే ఆ ఆదాయం అంతా ప్రభుత్వానికి వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గుతుంటే చంద్రబాబు ఆదాయం మాత్రం పెరుగుతోంది.
⇒ ఇసుక, మద్యం, సిలికా, క్వార్జ్, ఫ్లైయాష్.. ప్రతిదీ మాఫియానే. అన్నీ పెదబాబు, చినబాబు ఆధ్వర్యంలో నడిపిస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్‌లు..! మండల, గ్రామ స్థాయిలో కూడా నడుపుతున్నారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యేలకు అడిగినంత ముట్టజెప్పాల్సిందే! ఎమ్మెల్యేలు దండుకున్న సొమ్ములో పెదబాబు, చినబాబు, దత్తపుత్రుడికి వాటాలు పంపితే అంతా సాఫీగా జరుగుతుంది.
⇒ కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు 10 శాతం చెల్లించి 8 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారు. మేం పారదర్శకంగా అమలు చేసిన జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండర్ల విధానాన్ని రద్దు చేశారు. ఫలితంగా సంపద సృష్టి జరగక ప్రభుత్వ ఆదాయం ఆవిరైపోతోంది. తమ అక్రమాలను ఎవరైనా ప్రశ్నిస్తే రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ బెదిరిస్తున్నారు.
నాడు నవరత్నాలు.. నేడు విధ్వంసాలు..
⇒ పిల్లలను బడులకు పంపేలా తల్లులకు చేయూతనిస్తూ మేం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని నిలిపివేశారు. ఇది విధ్వంసం కాదా?
⇒ పాఠశాలల్లో నాడు–నేడు పనులను నిలిపివేశారు. ఇది విధ్వంసం కాదా?
⇒ ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీ, మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణను తొలగించి పిల్లలను ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలకు దూరం చేశారు. ఇది విధ్వంసం కాదా?
⇒ ఎనిమిదో తరగతి పిల్లలకు ఏటా ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆపేశారు. ఇది విధ్వంసం కాదా?
⇒ సబ్జెక్ట్ టీచర్ విధానానికి గ్రహణం పట్టించారు. వసతి దీవెన పథకాన్ని రద్దు చేసి, విద్యా దీవెన పథకాన్ని అరకొరగా విదిలిస్తున్నారు. చదువులతో చెలగాటం ఆడుతున్నారు. ఇది విధ్వంసం కాదా?
⇒ పథకాలు ఇవ్వకపోగా ఉన్న పథకాలను ఎత్తేసి ప్రజల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. ఇది విధ్వంసం కాదా?
⇒ ఆరోగ్యశ్రీ ఊపిరి తీశారు. ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా చేశారు. ఈ రోజు పేదలు అనారోగ్యం బారినపడితే అప్పులపాలు అయ్యే దుస్థితి కల్పించారు. ఇది విధ్వంసం కాదా?
⇒ రైతు భరోసాను నిలిపి వేయడం, ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడం, ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేయడం విధ్వంసం కాదా?
⇒ అక్కచెల్లెమ్మలను చేయి పట్టి నడిపించే ఆసరా, సున్నా వడ్డీ, ఈబీసీ, కాపు నేస్తం లాంటి పథకాలన్నింటినీ రద్దు చేసి వారి జీవితాలను అగమ్యగోచరంగా మార్చారు. ఇది విధ్వంసం కాదా?
⇒ నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, చేదోడు, తోడు లాంటి పథకాలను నిలిపివేసి పేదలకు తీరని ద్రోహం తలపెట్టారు. ఇది విధ్వంసం కాదా?
⇒ ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా.. ఉన్న వాటినే ఊడగొట్టారు. వలంటీర్‌లను రోడ్డుకు ఈడ్చారు. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేయడం విధ్వంసం కాదా?
⇒ రాష్ట్ర ఆదాయాన్ని పెంచకుండా సొంత జేబులో ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ఇసుక, మద్యం, క్వార్ట్‌జ్, సిలికా లాంటి వనరులను దోచేస్తున్నారు.
ఇది విధ్వంసం కాదా?
Comments
Please login to add a commentAdd a comment