అతడు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు.. రోహిత్‌ రావడం వల్ల..: హార్దిక్‌ | "Tilak Fantastic..Once Rohit Was Back...": Hardik Pandya Blunt Admission After Mumbai Indians Loss Against RCB | Sakshi
Sakshi News home page

Hardik Pandya: అతడు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు.. రోహిత్‌ రావడం వల్ల..

Published Tue, Apr 8 2025 9:30 AM | Last Updated on Tue, Apr 8 2025 10:26 AM

Tilak Fantastic Once Rohit Was Back: Hardik Blunt Admission Loss vs RCB

హార్దిక్‌ పాండ్యా (Photo Courtesy: BCCI/IPL)

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో ముంబై ఇండియన్స్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గత మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో ఓడిన హార్దిక్‌ సేన.. తాజాగా సొంత మైదానం వాంఖడేలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టు ముందు తలవంచింది. ఆఖరి వరకు పోరాడినా పన్నెండు పరుగుల తేడాతో ఓడిపోయి పరాభవాన్ని మూటగట్టుకుంది.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya).. తాము తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపాడు. వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని.. కాబట్టి తాను బౌలర్లను నిందించబోనని స్పష్టం చేశాడు. గత మ్యాచ్‌లో పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డ తిలక్‌ వర్మ ఈరోజు మాత్రం అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడని హర్షం వ్యక్తం చేశాడు.

జస్‌ప్రీత్‌ బుమ్రా రాకతో జట్టు మరింత పటిష్టంగా మారిందని.. అనుకున్న ఫలితాలు రాబట్టేందుకు సానుకూల దృక్పథంతో ముందుకు సాగటం ముఖ్యమని హార్దిక్‌ పాండ్యా పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీతో సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన  ముంబై తొలుత బౌలింగ్‌ చేసింది.

ఆర్సీబీ బ్యాటర్లు ధనాధన్‌
ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి (42 బంతుల్లో 67), దేవదత్‌ పడిక్కల్‌ (22 బంతుల్లో 37), కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (32 బంతుల్లో 64) దంచికొట్టగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌ (19 బంతుల్లో 40 నాటౌట్‌)తో దుమ్ములేపాడు. ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

ముంబై బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌, హార్దిక్‌ పాండ్యా రెండేసి వికెట్లు తీయగా.. విఘ్నేశ్‌ పుతూర్‌కు ఒక వికెట్‌ దక్కింది. అయితే, బుమ్రా నాలుగు ఓవర్ల కోటాలో 29 పరుగులు ఇచ్చి వికెట్‌ తీయలేకపోయాడు. ఇక లక్ష్య ఛేదనలో ముంబై ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్‌ శర్మ (17), రియాన్‌ రికెల్టన్‌ (17) వికెట్లు కోల్పోయింది.

తిలక్‌, హార్దిక్‌ పోరాటం వృథా
విల్‌ జాక్స్‌ (22), సూర్యకుమార్‌ యాదవ్‌ (28) కూడా నిరాశపరచగా.. తిలక్‌ వర్మ (29 బంతుల్లో 56), హార్దిక్‌ పాండ్యా (15 బంతుల్లో 42) అద్భుత ఇన్నింగ్స్‌తో గెలుపు ఆశలు రేకెత్తించారు. అయితే, బెంగళూరు బౌలర్ల ప్రతాపం ముందు వీరు తలవంచకతప్పలేదు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన ముంబై.. 209 పరుగుల వద్ద నిలిచిపోయి.. పరాజయాన్ని ఆహ్వానించింది.

రోహిత్‌ రావడం వల్ల అతడు లోయర్‌ ఆర్డర్‌లో
ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా స్పందిస్తూ.. ‘‘పరుగుల వరద పారింది. వికెట్‌ చాలా బాగుంది. అయితే, మేము ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్‌ చేయాల్సింది. పిచ్‌ను చూసిన తర్వాత బౌలర్లను తప్పుపట్టడానికి ఏమీ లేదనిపించింది.

ఇక బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మూడో స్థానం జట్టుకు వెన్నెముక లాంటిది. గత మ్యాచ్‌కు రోహిత్‌ అందుబాటులో లేడు కాబట్టి నమన్‌ ధీర్‌ టాపార్డర్‌లో ఆడాడు. నమన్‌ బహుముఖ ప్రజ్ఞగల ఆటగాడు. అతడు ఏ స్థానంలోనైనా రాణించగలడు. రోహిత్‌ వచ్చాడు గనుక ఈసారి లోయర్‌ ఆర్డర్‌లో బరిలోకి దిగాడు.

తిలక్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు
తిలక్‌ వర్మ ఈరోజు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. గత మ్యాచ్‌లో అతడిని రిటైర్డ్‌ అవుట్‌గా వెనక్కి పిలిపించాలన్న మా కోచ్‌ నిర్ణయం సరైందేనని ఇప్పటికీ నమ్ముతున్నా. ఏదేమైనా పవర్‌ ప్లేలో పరుగులు రాబట్టడమే అత్యంత ముఖ్యం.

ఈరోజు మధ్య ఓవర్లలోనూ మేము ఒకటి, రెండు సందర్భాల్లో గట్టిగా హిట్టింగ్‌ చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. డెత్‌ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయాం. ఇక బుమ్రా జట్టులోకి రావడం.. మా టీమ్‌ను ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలుపుతుందనడం అతిశయోక్తి కాదు.

ఈరోజు తను బాగానే రాణించాడు. మా జట్టు ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతోనే ఉంటుంది. మా ఆటగాళ్లకు మేము అండగా ఉంటాం. తప్పక అనుకున్న ఫలితాలు రాబడతాం’’ అని చెప్పుకొచ్చాడు.

చదవండి: గిల్‌, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు చెప్పిన కపిల్‌ దేవ్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement