
Photo Courtesy: MI
ఐపీఎల్-2025 (IPL 2025)లోనూ ముంబై ఇండియన్స్ పరాజయ పరంపర కొనసాగుతోంది. గతేడాది పద్నాలుగింట.. నాలుగు మ్యాచ్‌లే గెలిచిన హార్దిక్ సేన.. ఈసారి ఓటమితో సీజన్‌ను ఆరంభించింది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు ఓడిపోయి విమర్శలు మూటగట్టుకుంటోంది.
బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యం ముంబైపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి తరుణంలో ముంబై ఇండియన్స్‌కు అదిరిపోయే శుభవార్త అందింది. ఆ జట్టు ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. వాంఖడేలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం నాటి మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు.
యార్కర్‌తో దడ పుట్టించిన బుమ్రా..
ఇక ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఈ పేస్ గుర్రం.. నెట్ సెషన్‌లో తన బౌలింగ్ మాయాజాలంతో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. బుమ్రా వేసిన పదునైన యార్కర్ దెబ్బకు స్టంప్స్ ఎగిరిపోగా.. ఆ బంతిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించిన బ్యాటర్ బ్యాలెన్స్ చేసుకోలేక కిందపడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రెండు నెలల విరామం తర్వాత
కాగా బుమ్రా రాకతోనైనా తమ తలరాత మారుతుందని ముంబై జట్టు వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఇక ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అదరగొట్టిన జస్‌ప్రీత్ బుమ్రా.. సిడ్నీలో జరిగిన ఆఖరి టెస్టు సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. వెన్నునొప్పితో విలవిల్లాడిన అతడు .. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత చాలా రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు.
అయితే, ఫిట్‌నెస్ సాధించని కారణంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్‌కు కూడా బుమ్రా దూరమయ్యాడు. అదే విధంగా.. ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లకు కూడా దూరమైన ఈ రైటార్మ్ పేసర్.. రీఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధమయ్యాడు. కాగా జనవరి తర్వాత బుమ్రా కాంపిటేటివ్ క్రికెట్ బరిలోకి దిగనుండటం ఇదే తొలిసారి.
రోహిత్ కూడా
మరోవైపు.. గాయం వల్ల గత మ్యాచ్‌కు దూరమైన ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్, మాజీ సారథి రోహిత్ శర్మ కూడా తిరిగి జట్టుతో చేరాడు. వీరిద్దరి రాకతో ముంబై ఇండియన్స్ శిబిరంలో సరికొత్త ఉత్సాహం నిండింది. కాగా ఆర్సీబీపై బుమ్రాకు అద్భుతమైన రికార్డు ఉంది.
ఇది బుమ్రా వర్సెస్ ఆర్సీబీ
ఇప్పటి వరకు బెంగళూరు జట్టుతో తాను ఆడిన 19 మ్యాచ్‌లలో కలిపి బుమ్రా 29 వికెట్లు తీయడం గమనార్హం. అందుకే సోమవారం నాటి పోరును బుమ్రా వర్సెస్ ఆర్సీబీగా అభివర్ణిస్తూ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుమ్రా ఆర్సీబీ బ్యాటర్లకు చుక్కలు చూపించడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ముంబై ఇండియన్స్.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలోనూ పరాజయం పాలైంది. అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం సాధించిన హార్దిక్ సేన.. ఆఖరిగా లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడి మరో ఓటమిని మూటగట్టుకుంది. ప్రస్తుతం కేవలం రెండు పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
చదవండి: ఇలా వచ్చి.. అలా వెళ్లారు.. అసలేం చేస్తున్నారు? కావ్యా మారన్ రియాక్షన్ వైరల్
Goodnight Paltan! 😊#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/UYghtBvYMN
— Mumbai Indians (@mipaltan) April 6, 2025