డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ తిని బతికాడు.. ఇప్పుడు అతడే..: నీతా అంబానీ | For 3 Years They Ate Only Maggi No Money: Nita Ambani On Pandya Brothers | Sakshi
Sakshi News home page

డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ మాత్రమే.. మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్ర: నీతా అంబానీ

Published Mon, Feb 17 2025 12:35 PM | Last Updated on Mon, Feb 17 2025 1:38 PM

For 3 Years They Ate Only Maggi No Money: Nita Ambani On Pandya Brothers

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా స్టార్లుగా ఎదిగారు హార్దిక్‌ పాండ్యా(Hardik Pandya), జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah). క్రికెట్‌ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని సత్తా చాటుతున్నారు. అయితే, ఈ ఇద్దరిలో దాగున్న అద్భుత నైపుణ్యాలను తెరమీదకు తెచ్చింది మాత్రం ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం అని చెప్పవచ్చు.

అంతేకాదు పాండ్యా, బుమ్రా సాధారణ ఆటగాళ్ల నుంచి సూపర్‌స్టార్లుగా ఎదగడంలో ఈ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీదే కీలక పాత్ర. ఇక ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్‌గా వెలుగొందుతుండగా.. హార్దిక్‌ పాండ్యా సైతం టీమిండియా కీలక ప్లేయర్‌గా జట్టులో సుస్థిర స్థానం సంపాదించాడు. అంతేకాదు.. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ స్థాయికీ చేరుకున్నాడు.

ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ యజమాని, భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ(Nita Ambani) పాండ్యా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన హార్దిక్‌ పాండ్యా, అతడి అన్న కృనాల్‌ పాండ్యాలో తాము ఆట పట్ల అంకిత భావాన్ని గుర్తించి అవకాశం ఇచ్చామని.. ఈరోజు వాళ్లు ఉన్నతస్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు.

అరుదైన గౌరవం
కాగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. దార్శనిక నాయకత్వం, సమాజానికి చేసిన అసాధారణ సేవకు గుర్తింపుగా మసాచుసెట్స్ విశిష్ట గవర్నర్ ప్రశంసాపత్రాన్ని ఆమెకు ప్రదానం చేసింది. ఈ సందర్భంగా బోస్టన్‌లో మాట్లాడిన నీతా అంబానీ హార్దిక్‌ పాండ్యా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘‘ఐపీఎల్‌లో మాకు ఫిక్స్‌డ్‌ బడ్జెట్‌ ఉంటుంది. ఒక్కో ఫ్రాంఛైజీ ఇంతే ఖర్చు పెట్టాలనే నిబంధన ఉంటుంది. అయితే, మేము ఆ డబ్బును కొత్త మార్గాల్లో ఖర్చుచేయాలనుకున్నాం. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను వెలికితీయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్లాం.

బక్కపల్చగా, పొడుగ్గా ఉన్న ఇద్దరు యువకులు
ముఖ్యంగా రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు జరిగినప్పుడు నేను ప్రత్యేకంగా అక్కడికి వెళ్లేదాన్ని. నాతో పాటు మా స్కౌట్‌ బృందం కూడా ఉండేది. ప్రతి దేశవాళీ మ్యాచ్‌ను నిశితంగా గమనించేవాళ్లం. మా స్కౌట్‌ క్యాంపులో భాగంగా బక్కపల్చగా, పొడుగ్గా ఉన్న ఇద్దరు యువ ఆటగాళ్లను చూశాం.

మ్యాగీ మాత్రమే తిని బతికారు
నేను వెళ్లి వాళ్లతో మాట్లాడాను. తాము గత మూడేళ్లుగా కేవలం మ్యాగీ మాత్రమే తిని బతుకుతున్నామని అప్పుడు వాళ్లు చెప్పారు. తమ దగ్గర డబ్బు లేదని అందుకే నూడుల్స్‌తో కడుపు నింపుకొంటున్నామని అన్నారు. అయితే, అప్పుడు నాకు వారిలో ఆట పట్ల ఉన్న నిబద్ధత.. ఏదో సాధించాలన్న బలమైన తపన కనిపించాయి.

ఆ ఇద్దరు.. సోదరులు.. వారు మరెవరో కాదు.. హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా. 2015లో నేను హార్దిక్‌ పాండ్యా కోసం రూ. 10 లక్షలు ఖర్చుచేసి వేలంలో అతడిని కొనుక్కున్నా. ఇప్పుడు అతడు ముంబై ఇండియన్స్‌కు గర్వకారణమైన కెప్టెన్‌’’ అని నీతా అంబానీ హార్దిక్‌ పాండ్యా నైపుణ్యాలపై ప్రశంసలు కురిపించారు.

మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్ర
ఇక ఆ మరుసటి ఏడాది.. తమకు మరో ఆణిముత్యం దొరికిందన్న నీతా అంబానీ.. ‘‘ఓ యువ క్రికెటర్‌. అతడి బాడీ లాంగ్వేజ్‌ భిన్నంగా ఉంది. అతడు బౌలింగ్‌ చేస్తే చూడాలని అక్కడ కూర్చున్నాం. తానేంటో అతడు బంతితోనే నిరూపించుకున్నాడు. అతడు బుమ్రా. ఇక ఆ తర్వాత జరిగిందంతా ఓ చరిత్ర’’ అంటూ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఆకాశానికెత్తారు. 

ఇక తిలక్‌ వర్మను కూడా తాము ఏరికోరి ఎంచుకున్నామన్న నీతా అంబానీ.. టీమిండియాకు ముంబై ఇండియన్స్‌ ఓ నర్సరీ లాంటిదంటూ తమ ఫ్రాంఛైజీపై ప్రశంసలు కురిపించారు.

ఐపీఎల్‌ 2025లో పాల్గొనే ముంబై ఇండియన్స్‌ జట్టు
హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, నమన్‌ ధిర్‌, బెవాన్‌ జాకబ్స్‌, రాజ్‌ బవా, విల్‌ జాక్స్‌, విజ్ఞేశ్‌ పుతుర్‌, సత్యనారాయణ రాజు, మిచెల్‌ సాంట్నర్‌, అర్జున్‌ టెండూల్కర్‌, ర్యాన్‌ రికెల్టన్‌, రాబిన్‌ మింజ్‌, కృష్ణణ్‌ శ్రీజిత్‌, జస్ప్రీత్‌ బుమ్రా, అశ్వని కుమార్‌, రీస్‌ టాప్లే, లిజాడ్‌ విలియమ్స్‌, కర్ణ్‌ శర్మ, ట్రెంట్‌ బౌల్ట్‌, దీపక్‌ చాహర్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement