
Photo Courtesy: BCCI/IPL
గెలుపు జోష్‌లో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్-2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా పాల్పడిన తప్పిదానికి గానూ ఐపీఎల్ పాలక మండలి అతడికి భారీ జరిమానా విధించింది.
కాగా పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ వాంఖడేలో తొలి విజయం నమోదు చేసి విషయం తెలిసిందే. పాటిదార్ కెప్టెన్సీలో సోమవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆర్సీబీ.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో ఫిల్ సాల్ట్ (4) విఫలం కాగా.. విరాట్ కోహ్లి (42 బంతుల్లో 67) మాత్రం రాణించాడు.
ఆకాశమే హద్దుగా
ఇక వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 22 బంతుల్లో 37 పరుగులు చేయగా.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కేవలం 32 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో పాటిదార్ 64 పరుగులు సాధించాడు.
ఇక వికెట్ కీపర్ జితేశ్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.
ముంబై బౌలర్లలో పేసర్లు ట్రెంట్ బౌల్ట్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీయగా.. స్పిన్నర్ విఘ్నేశ్ పుతూర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో ముంబై ఆరంభంలోనే తడబడింది. టాపార్డర్ రోహిత్ శర్మ (17), రియాన్ రికెల్టన్ (17), విల్ జాక్స్ (22)విఫలం కాగా.. సూర్యకుమార్ యాదవ్(28) కూడా నిరాశపరిచాడు.
తిలక్, హార్దిక్ రాణించినా..
ఈ క్రమంలో తిలక్ వర్మ (29 బంతుల్లో 56), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లోనే 42) ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టినా.. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన ముంబై 209 పరుగుల వద్ద నిలిచింది. దీంతో పన్నెండు పరుగుల తేడాతో ఆర్సీబీ ముంబైపై విజయం సాధించింది.
రూ. 12 లక్షల జరిమానా
అయితే, రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఆర్సీబీ స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయలేకపోయింది. దీంతో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు ఐపీఎల్ పాలక మండలి రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. తొలి తప్పిదం కాబట్టి ఈసారి రూ. 12 లక్షల ఫైన్‌తో సరిపెట్టింది.
కాగా ఐపీఎల్-2025 సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్‌గా తొలిసారి పగ్గాలు చేపట్టిన రజత్ పాటిదార్ ఊహించని రీతిలో అదరగొడుతున్నాడు. ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా దుమ్ములేపుతున్నాడు. ఇప్పటి వరకు అతడి సారథ్యంలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచి ఆరు పాయింట్లతో కొనసాగుతోంది. టోర్నీ ఆసాంతం ఇదే జోరు కనబరిస్తే ఈసారి కప్ కొట్టాలన్న ఆర్సీబీ చిరకాల కల నెరవేరే అవకాశాలు లేకపోలేదు.
చదవండి: Hardik Pandya: అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..
A #TATAIPL Classic in every sense 🔥#RCB hold their nerves to seal a win after 1️⃣0️⃣ years against #MI at Wankhede!
Scorecard ▶️ https://t.co/ArsodkwOfO#TATAIPL | #MIvRCB | @RCBTweets pic.twitter.com/uu98T8NtWE— IndianPremierLeague (@IPL) April 7, 2025