‘మన మిత్ర’.. మరో మారీచుడే! | Chandrababu political scam in name of WhatsApp governance in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘మన మిత్ర’.. మరో మారీచుడే!

Published Mon, Feb 3 2025 4:49 AM | Last Updated on Mon, Feb 3 2025 7:23 AM

Chandrababu political scam in name of WhatsApp governance in Andhra Pradesh

నాడు ‘సేవా మిత్ర’... నేడు ‘మన మిత్ర’.. పేర్లు మారినా కుట్రలు మాత్రం అవే

520 రకాల సేవలా?.. 420 మోసాలా?

వాట్సాప్‌ గవర్నెన్స్‌ ముసుగులో చంద్రబాబు సర్కారు రాజకీయ కుతంత్రం

ఆధార్‌ నంబర్‌తో కుటుంబ వివరాలు మొత్తం బహిర్గతం

గిట్టని వారికి సంక్షేమ పథకాలు నిలిపివేత.. ప్రత్యర్థి పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు.. ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యం 

పౌరుల వ్యక్తిగత డేటా ప్రైవేట్‌ సంస్థ గుప్పిట్లోకి అసలు ప్రజల డేటా మూడో వ్యక్తి వద్దకు ఎలా వెళ్లింది?

మా వ్యక్తిగత వివరాలు ఇంకా ఎన్ని చోట్లకు చేరిపోతాయో...! ఎన్ని చేతులు మారతాయో?

టీడీపీ కూటమి సర్కారు తీరుపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన..

ఈ ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ‘‘దిశ’’ యాప్‌ తరహాలో సర్కారే స్వయంగా రూపొందించి ఎందుకు నిర్వహించడం లేదని మండిపాటు

2019 ఎన్నికల ముందు కూడా టీడీపీ ఇవే కుట్రలు

టీడీపీ సేవా మిత్ర యాప్‌ ద్వారా డేటా చోరీ

35 లక్షల ఓట్ల తొలగింపు పన్నాగం.. ఈసారి ‘మన మిత్ర’ పేరిట కుట్రలకు మరింత పదును.. ఆధార్, ఐటీ చట్టాల ఉల్లంఘన

సుప్రీంకోర్టు తీర్పు బేఖాతర్‌.. బరి తెగించిన బాబు ప్రభుత్వం  

సాక్షి, అమరావతి: మొన్న ‘‘సేవా మిత్ర..!’’.. నేడు ‘‘మన మిత్ర..!’’ పేర్లు మారినా కుతంత్రాలు మాత్రం మారలేదు!!
రామాయణంలో మారీచుడు ఎలా రూపాలు మార్చు­కుని దారుణాలకు ఒడిగట్టేవాడో... రాష్ట్ర రాజకీయా­ల్లోనూ చంద్రబాబు ఎప్పటికప్పుడు మాయ వేషాలతో కుట్రలకు పదును పెడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌ ముసుగులో సర్కారు రాజకీయ కుతంత్రాలపై సర్వత్రా మండిపడుతున్నారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌లో నమోదు చేసే ఆధార్‌ నంబర్‌తో ఆయా కుటుంబాల వివరాలు మొత్తం బహిర్గతం కావడంతో గిట్టని వారికి సంక్షేమ పథకాలను నిలిపి వేయడంతోపాటు ప్రత్యర్థి పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్ర దాగి ఉన్నట్లు పేర్కొంటున్నారు. 

ఎన్నికల్లో అక్రమాలే అసలు లక్ష్యంగా పౌరుల వ్యక్తిగత డేటా మొత్తం ప్రైవేట్‌ సంస్థ గుప్పిట్లో పెట్టారని.. అసలు ప్రజల వ్యక్తిగత డేటా మూడో వ్యక్తి వద్దకు ఎలా వెళ్లిందని ప్రశ్నిస్తున్నారు. తమ వ్యక్తిగత వివరాలు ఇంకా ఎన్ని చోట్లకు చేరిపోతాయో...! ఎన్ని చేతులు మారుతాయో? అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఈ ప్రభుత్వానికి పౌర సేవలపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ‘‘దిశ’’ యాప్‌ తరహాలో ప్రభుత్వమే స్వయంగా రూపొందించి ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు టీడీపీ సేవా మిత్ర మొబైల్‌ యాప్‌తో లక్షలాది మంది ఓట్లు తొలగించే కుట్రకు పాల్పడిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తన కుతంత్రానికి సరికొత్త రూపాన్నిచ్చారు. 

అదే.. ‘మన మిత్ర’ మొబైల్‌ యాప్‌. మీ ఆధార్‌ నంబర్‌ వాట్సాప్‌ చేస్తే చాలు.. ప్రభుత్వ సేవలు ఇట్టే అందిస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఈ అందమైన మాయాజాలం వెనుక భారీ కుట్ర దాగి ఉంది. బాలనాగమ్మను మాయల ఫకీరు చిలుకలో బంధించి ఎత్తుకుపోయినట్టు... యావత్‌ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత డేటా అంతా నిక్షిప్తం చేసి అక్రమాలకు పాల్పడేందుకు రాజకీయ మాయల ఫకీరు వేసిన ఎత్తుగడే మన మిత్ర యాప్‌. ఒక్క ఆధార్‌ నంబరుతో మొత్తం కుటుంబ సభ్యుల ఆధార్‌ నంబర్లు, చిరునామాలు, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు, ఓటరు నంబర్లు, సోషల్‌ మీడియా ఖాతాలు... సర్వం మాయల ఫకీరు గుప్పిట్లోకి వెళుతుంది. ఆ తరువాత ఏడు సముద్రాలు దాటి విదేశాలకు చేరుతుంది. 

అక్కడ నుంచి సైబర్‌ నేరస్తులు ప్రజల బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టొచ్చు...! ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వేధించవచ్చు...! అర్హులైనప్పటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను తొలగించవచ్చు...! ప్రభుత్వ పెద్దలే ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరుల ఓట్లను గంపగుత్తగా తొలగించవచ్చు...! చంద్రబాబు సర్కారు వాట్సాప్‌ గవర్నెన్స్‌ ఎత్తుగడ వెనుక ఇంత దారుణ పన్నాగం దాగి ఉంది. రాజ్యాంగం కల్పించిన ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించే కుతంత్రం ఇది. 

ఆధార్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న అరాచక పర్వం ఇది. వ్యక్తిగత గోప్యతను పరిరక్షించాల్సిందేనన్న సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతర్‌ చేస్తున్న బరితెగింపు ఇది. ఎన్నికల్లో అక్రమాలకు బరి తెగించాలనే టీడీపీ దీర్ఘకాలిక దురాలోచన దీని వెనుక ఉన్నట్లు సాంకేతిక నిపుణులు, రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. యావత్‌ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

గవర్నెన్స్‌ ముసుగు.. డేటా చోరీ కుట్ర!
వాట్సాప్‌లో మీ ఆధార్‌ నంబర్‌ మెసేజ్‌ చేస్తే చాలు.. 520 రకాల పౌర సేవలు అందిస్తామని మంత్రి నారా లోకేశ్‌ ఆర్భాటంగా ప్రకటించారు. ప్రస్తుతం 161 సేవలను అందుబాటులోకి తెచ్చామని, త్వరలో మిగిలినవి కూడా అందిస్తామంటూ దీనికి ‘మన మిత్ర’ అనే పేరు ప్రకటించారు. కానీ ఇక్కడే అసలు మతలబు ఉంది. ఆ పౌర సేవలను ప్రభుత్వ సాంకేతిక వ్యవస్థ ద్వారా కాకుండా ప్రైవేట్‌ సంస్థ భాగస్వామ్యంతో అందిస్తామని తెలిపారు. ‘వాట్సాప్‌ గవర్నెన్స్‌’ ద్వారా పౌర సేవలు పొందాలంటే 95523 00009 నంబర్‌కు ప్రజలు తమ ఆధార్‌ను వాట్సాప్‌ చేయాలి. 

అలా చేయగానే ప్రజల వ్యక్తిగత వివరాలు బహిర్గతమవుతున్నాయి. ఇక పౌర సేవలు పొందేందుకు ఆ వాట్సాప్‌ నంబరులో సూచించే ఫారాన్ని ఆన్‌లైన్‌లో పూరించాలి. దాంతో ఆయా వ్యక్తుల అదనపు వివరాలన్నీ వెల్లడవుతున్నాయి. పేరు, ఇంటి నంబరు, ఓటరు కార్డు నంబర్, కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డు నంబర్లు, మొబైల్‌ నంబర్లు, ఈ మెయిల్‌ ఐడీ... ఇలా సమస్త వివరాలు సంబంధిత వ్యక్తుల ప్రమేయం లేకుండానే బహిర్గతమవుతున్నాయి.అంటే ప్రజల వ్యక్తిగత గోప్యత అన్నది పూర్తిగా ప్రశ్నార్థకంగా మారినట్లు నిర్ధారణ అవుతోంది.

పౌరుల డేటా ప్రైవేట్‌ సంస్థ గుప్పిట్లోకి...
వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా ప్రజల వ్యక్తిగత డేటా ఎక్కడికి చేరుతోందన్నది అత్యంత కీలకంగా మారింది. వాట్సాప్‌ గవర్నెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ప్రవేశ పెట్టలేదు. ప్రభుత్వ విభాగం ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ ద్వారా సొంతంగా ఎలాంటి మొబైల్‌ యాప్‌ను రూపొందించలేదు. ఓ ప్రైవేట్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది. నిజంగా చిత్తశుద్ధి, పారదర్శకత ఉంటే ప్రభుత్వమే సొంతగా మొబైల్‌ యాప్‌ను రూపొందించవచ్చు. వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళల భద్రత కోసం ‘దిశ’ మొబైల్‌ యాప్‌ను పోలీసు శాఖే స్వయంగా రూపొందించింది.

ప్రజలు అన్ని రకాల పోలీసు సేవలు పొందేందుకు ‘పోలీసు సేవా యాప్‌’ను ప్రవేశపెట్టింది. ప్రపంచంలో పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఆయా ప్రభుత్వాలే సొంతంగా మొబైల్‌ యాప్‌లు రూపొందించి పౌర సేవలు అందిస్తున్నాయి. అంతేగానీ సున్నితమైన ప్రజల వ్యక్తిగత సమాచారంతో ముడిపడిన అంశాలపై ప్రైవేట్‌ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోలేదు. మరి పౌర సేవల కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం సొంతంగా యాప్‌ ఎందుకు రూపొందించలేదన్నది సందేహాలకు తావిస్తోంది. అంటే ప్రజల వ్యక్తిగత వివరాలన్నీ ప్రైవేట్‌ సంస్థకు అందుబాటులోకి వచ్చినట్లేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

పథకాల్లో కోత... ఓట్ల తొలగింపు 
– ఎన్నికల్లో అక్రమాలే అసలు లక్ష్యం..
వాట్సాప్‌ గవర్నెన్స్‌ ముసుగులో సేకరించే ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలన్నదే టీడీపీ సర్కారు అసలు కుట్ర. వైఎస్సార్‌సీపీ, ఇతర ప్రతిపక్ష  పార్టీల సానుభూతిపరులను వేధించడం.. వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడం.. టీడీపీకి ఓట్లు వేయరని భావించే వారి ఓట్లను తొలగించే పన్నాగం దాగి ఉంది. 2029 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలన్న దీర్ఘకాలిక దురాలోచన ఉందన్నది స్పష్టమవుతోంది. అందుకోసం ఎంత పకడ్బందీగా కుట్ర పన్నారంటే.. ఒకరి ఆధార్‌ నంబరు టైప్‌ చేస్తే చాలు ఆ కుటుంబంలోని ఇతర సభ్యుల ఆధార్‌ నంబర్లు, వారి వ్యక్తిగత డేటా కూడా మొత్తం బట్టబయలవుతోంది. 

సాధారణంగా ఎక్కడైనా ఆధార్‌ నంబరు నమోదు చేస్తే సంబంధిత వ్యక్తి మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేశాకే మిగతా ప్రక్రియను కొనసాగించేందుకు వీలుంటుంది. కానీ టీడీపీ ప్రభుత్వం తెచ్చిన వాట్సాప్‌ గవర్నెన్స్‌లో ఇలాంటిదేమీ లేదు. ఒకరి ఆధార్‌ నంబరు వెల్లడిస్తే ఆ కుటుంబ సభ్యుల ఆధార్‌ నంబర్లు, వ్యక్తిగత డేటా సైబర్‌ నేరస్తులకు కూడా అందుబాటులోకి వచ్చేస్తోంది. వాట్సాప్‌ గవర్నెన్స్‌ అన్ని రకాల సైబర్‌ నేరాలు, మోసాలకు తలుపులు బార్లా తెరుస్తోంది.

ఆధార్‌ చట్టం ఉల్లంఘన...
ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఆధార్‌ చట్టాన్ని నిర్భీతిగా ఉల్లంఘిస్తోంది. ఆధార్‌ సంబంధిత డేటా పరిరక్షణ కోసం కేంద్రం రూపొందించిన యూఐడీఏఐ చట్టం పటిష్ట మార్గదర్శకాలను నిర్దేశించింది. వాటి ప్రకారం..
– ఆధార్‌ డేటాను భారత్‌లోనే భద్రపరచాలి. దేశ సరిహద్దులు దాటించి విదేశీ సర్వర్ల ద్వారా డేటా ప్రాసెసింగ్‌ అన్నది పూర్తిగా నిషిద్ధం. కానీ చంద్రబాబు ప్రభుత్వం విదేశీ 
ప్రైవేట్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది. తద్వారా ప్రజల ఆధార్‌ డేటా దేశ సరిహద్దులు దాటేందుకు ఆస్కారం ఇచ్చింది. 

– ఆధార్‌ నంబరు, డేటాను ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అంశాల్లో కూడా ప్రచురించకూడదని చట్టం చెబుతోంది. రేషన్‌ కార్డు, జనన ధ్రువపత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఇతర సర్టిఫికెట్లలో ఆధార్‌ పూర్తి నంబరు ప్రచురించకూడదు. కేవలం ఆధార్‌లోని చివరి నాలుగు అంకెలే ప్రచురించాలి. అందుకు విరుద్ధంగా వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా ఆధార్‌ నంబరును పూర్తిగా అంటే మొత్తం పది అంకెలను బహిర్గతం చేస్తున్నారు.

ఐటీ, డేటా భద్రతా చట్టాలకు విరుద్ధంగా..
పార్లమెంట్‌ ఆమోదించిన ఐటీ చట్టం–2000, ‘డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌–2023’ను చంద్రబాబు ప్రభుత్వం యథేచ్చగా ఉల్లంఘిస్తోంది.  ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తే ఐటీ చట్టం మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కల్పించింది. ప్రజల వ్యక్తిగత డేటా పరిరక్షణలో విఫలమైతే ఒక్కో ఉల్లంఘనకు ఏకంగా రూ.250 కోట్ల వరకు జరిమానా విధించేందుకు కేంద్ర డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌ అవకాశం కల్పించింది. వీటిని టీడీపీ సర్కారు ఏమాత్రం లెక్క చేయడం లేదు.

సుప్రీం తీర్పు బేఖాతర్‌...
వ్యక్తిగత డేటా పరిరక్షణ ప్రజల ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. తమ వ్యక్తిగత వివరాలను ఎలా ఉపయోగించాలన్నది పూర్తిగా ప్రజలే నిర్ణయించుకోవాలి. ఇతరులు ఎవరికీ ప్రజల వ్యక్తిగత డేటా మీద నియంత్రణ ఉండకూడదని 2017లో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీనికి విరుద్ధంగా ప్రజల వ్యక్తిగత డేటాను వారి అనుమతితో నిమిత్తం లేకుండానే ఇతర విభాగాలు, ప్రైవేట్‌  సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం అందుబాటులోకి తేవడం విస్మయపరుస్తోంది.

2019లో ‘సేవా మిత్ర’ యాప్‌తో అక్రమాలు
2014–19 మధ్య కూడా టీడీపీ ప్రభుత్వం ఇదే తరహాలో ప్రైవేట్‌ సంస్థ ద్వారా ప్రజల వ్యక్తిగత డేటా చోరీకి పాల్పడింది. 2016లో నిర్వహించిన ప్రజాసాధికార సర్వే ద్వారా సేకరించిన ప్రజల వ్యక్తిగత వివరాలను హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్‌ అనే ప్రైవేట్‌ సంస్థ ద్వారా టీడీపీ ప్రధాన కార్యాలయానికి అనుసంధానించారు. టీడీపీ ఎన్నికల వ్యూహం కోసం రూపొందించిన ‘సేవా మిత్ర’ యాప్‌లోకి ప్రజల వ్యక్తిగత డేటాను చేరవేశారు. 

పేరు, చిరునామా, కులం, మతం, ఆధార్‌ నంబరు, ఓటరు కార్డు నంబరు, పోలింగ్‌ బూత్‌ నంబరు, బ్యాంకు ఖాతా నంబరు... ఇలా పూర్తి వివరాలు టీడీపీ సేవా మిత్ర యాప్‌లో అనుసంధానమయ్యాయి. అనంతరం వాటిని దుర్వినియోగం చేస్తూ టీడీపీ ఎన్నికల అక్రమాలకు పాల్పడింది. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులని భావించిన దాదాపు 35 లక్షల మంది ఓట్లను తొలగించేందుకు బరి తెగించింది. దానిపై అప్పట్లోనే వైఎస్సార్‌సీపీ పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement