
‘సాక్షి’ ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డిపై కేసు నమోదు
రాష్ట్రంలో అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు కక్ష కట్టిన ప్రభుత్వం
వైఎస్సార్‌సీపీ కార్యకర్తను హత్య చేసిన టీడీపీ గూండాలు.. వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చినందుకే అక్రమ కేసు
హత్య కేసును పక్కదారి పట్టించే కుతంత్రం
ప్రాంతానికో రకంగా వార్తలు రాసింది ‘పచ్చ’ పత్రికలే..
సాక్షి, అమరావతి: చంద్రబాబు రెడ్‌బుక్ అరాచకాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోంది. నిజాన్ని నిర్భయంగా ఎత్తి చూపడంతో భరించలేక తప్పుడు కేసులకు ఒడిగడుతూ కుట్ర రాజకీయాలు చేస్తోంది. పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తను టీడీపీ గూండాలు హత్య చేసిన ఉదంతాన్ని వెల్లడించడంపై అక్రమ కేసు నమోదు చేయించడమే ఇందుకు నిదర్శనం. సాక్షి పత్రికపై మాచర్ల టీడీపీ మండలాధ్యక్షుడు ఎన్.వీరస్వామి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే ఆనంద్‌బాబు, ఇతర టీడీపీ నేతలు మంగళవారం సాయంత్రం ఇక్కడ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే డీజీపీ స్పందించి పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించడం.. వెనువెంటనే రాత్రికి రాత్రే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం అంతా పక్కా పన్నాగంతో చకచకా సాగిపోయింది. దీంతో సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయ్‌రెడ్డితోపాటు ఇదే పత్రికకు చెందిన ఆరుగురు పాత్రికేయులపై బీఎన్‌ఎస్ సెక్షన్లు 196(1), 352, 353,(2), 61(1) రెడ్‌విత్ 3(5) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ అక్రమ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పింఛన్ కోసం వస్తే కడతేర్చారన్నది వాస్తవం
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పశువేములకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త హరిశ్చంద్ర టీడీపీ గుండాలకు భయపడి కుటుంబంతో సహా పొరుగున తెలంగాణలోని నల్కొండ జిల్లా కనగల్‌లో పది నెలలుగా తల దాచుకుంటున్నారు. ప్రతి నెల పింఛన్ తీసుకునేందుకు వచ్చి వెంటనే వెళ్లిపోతున్నారు.
ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ వర్గీయులు పక్కా పన్నాగంతో ఆయన్ను హత్య చేశారు. ఏప్రిల్ నెల ఫించన్ తీసుకునేందుకు ఈ నెల 3న రాష్ట్ర సరిహద్దుల్లోని నాగార్జునసాగర్ హిల్ కాలనీ వద్దకు వచ్చి.. తమ గ్రామం పశువేములకు చెందిన ఒకరికి ఫోన్ చేశారు. సామాజిక పింఛన్లు ఇస్తున్నారా.. లేదా.. అని అడిగారు. అతను ఆ విషయాన్ని టీడీపీ వర్గీయులకు చేరవేశాడు.
వెంటనే టీడీపీ గూండాలు వచ్చి హిల్ కాలనీలో ఉన్న హరిశ్చంద్రను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అనంతరం ఆయనపై దాడి చేసి, హత్య చేసి.. మృతదేహాన్ని పశువేములలోని ఆయన పొలంలోనే పడేశారు. హరిశ్చంద్ర భార్య నిర్మల తన భర్తను కిడ్నాప్ చేశారని తెలంగాణలోని విజయపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. పశువేములలో దారుణ హత్యకు గురైన హరిశ్చంద్ర మృతదేహాన్ని ఈనెల 4న గుర్తించారు.
కర్రలతో కొట్టి.. గొంతుకోసి.. ముఖంపై యాసిడ్ పోసి మరీ దారుణంగా హత మార్చినట్టు నాగార్జున సాగర్ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హిల్ కాలనీలోని ఓ దుకాణం వద్ద ఉన్న సీసీ టీవీ కెమెరాల నుంచి పుటేజీ సేకరించారు. హరిశ్చంద్రను కిడ్నాప్ చేసి తీసుకువెళుతున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపించాయి.

పూర్తి అవగాహనతోనే వార్త ప్రచురితం
హరిశ్చంద్ర హత్య సమాచారం తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. తమపై టీడీపీ గూండాలు కక్ష కట్టిన తీరును హరిశ్చంద్ర భార్య నిర్మల, కుమారుడు మురళి వివరించారు. ఇది టీడీపీ గూండాల పనేనని కన్నీటి పర్యంతమయ్యారు. పల్నాడు జిల్లాలో నెలకొన్న పరిస్థితులు క్షణ్ణంగా తెలుసుకుని పూర్తి వివరాలతో సాక్షి పత్రిక ఏపీ ఎడిషన్‌లో వార్తను ప్రచురించింది.
తెలంగాణలోని విజయపురి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలతోపాటు మృతుని కుటుంబ సభ్యుల ఆవేదన, పశువేములలోని నెలకొన్న వాస్తవ పరిస్థితులను సమగ్రంగా వివరించింది. కాగా, తెలంగాణలో పాత్రికేయులు కేవలం అక్కడి పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే వార్తగా ఇచ్చారు.
హరిశ్చంద్రను సమీప బంధువులే హత్య చేశారని సాక్షి పత్రిక ఏపీ ఎడిషన్‌లోనూ, తెలంగాణ ఎడిషన్‌లోనూ ప్రచురించింది. కాగా, ఆ సమీప బంధువులు టీడీపీ గూండాలేనన్నది ఏపీలోని పాత్రికేయులకు పూర్తి సమాచారం, అవగాహన ఉంది కాబట్టి మరింత సమగ్రంగా వార్తను ప్రచురించారు. అంతేతప్ప సాక్షి పత్రిక ఏపీ, తెలంగాణ ఎడిషన్లలో ప్రచురితమైన వార్తలోని అంశాల మధ్య వ్యత్యాసం లేదు. ఈ హత్యపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏ ఎండకాగొడుకు పచ్చ ముఠా నిర్వాకమే
ప్రజల్ని మోసగించేందుకు పరస్పర విరుద్ధ వాదనలు, కథనాలు, పత్రికా ప్రకటనలు ఇవ్వడం పచ్చ ముఠా పన్నాగం. ఏపీ, తెలంగాణ ఎడిషన్లలో పరస్పర విరుద్ధంగా ఈనాడుతోపాటు ఎల్లో మీడియా లెక్కకు మించి కథనాలు ప్రచురించిన విషయాన్ని పాత్రికేయ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. టీడీపీ.. ప్రజల్ని మోసగించేందుకు ఏపీలోనే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పరస్పర విరుద్ధంగా పత్రికా ప్రకటనలు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఎన్నికల ముందు టీడీపీ, ఈనాడుతోపాటు ఇతరత్రా ఎల్లో మీడియాలో ఇచ్చిన ప్రకటనలే అందుకు నిదర్శనం. ‘కలల రాజధాని అమరావతి’అని విజయవాడ ఎడిషన్‌లో ప్రకటనలు ఇచ్చిన టీడీపీ.. అదే రోజు విశాఖపట్నం ఎడిషన్‌లో మాత్రం ‘ఆంధ్రప్రదేశ్ వికాసానికి గ్యారంటీ’ అని ప్రకటనలు జారీ చేయడం గమనార్హం. టీడీపీ, ఎల్లో మీడియా కుయుక్తులకు ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి.