dhanunjay reddy
-
సీఎంవో అధికారులకు శాఖల కేటాయింపు
సాక్షి, అమరావతి: సీఎం కార్యాలయం(సీఎంవో)లో పనిచేసే అధికారులకు శాఖలను కేటాయిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు. కేఎస్ జవహర్‌రెడ్డి(స్పెషల్ సీఎస్): జీఏడీ, హోం శాఖ, రెవెన్యూ, అటవీ పర్యావరణ, వైద్య ఆరోగ్య శాఖ, శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ అంశాలు, సీఎంవో ఎస్టాబ్లిష్మెంట్, రాష్ట్ర విభజన సమస్యలు సాల్మన్ ఆరోఖ్యరాజ్(కార్యదర్శి): పౌర సరఫరాలు, విద్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, అన్ని సంక్షేమ శాఖలు ధనుంజయ్‌రెడ్డి(కార్యదర్శి): ఆర్థిక, ప్రణాళిక శాఖ, జల వనరులు, వ్యవసాయ అనుబంధ రంగాలు, మునిసిపల్ పరిపాలన, ఇంధన శాఖ, పర్యాటక, యువజన సర్వీసులు, మార్కెటింగ్ అండ్ సహకార శాఖలు ముత్యాలరాజు(అదనపు కార్యదర్శి): ప్రజాప్రతినిధుల వినతులు, రెవెన్యూ(ల్యాండ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్), గృహ నిర్మాణం, రవాణా, రోడ్లు, భవనాల శాఖలు, కార్మిక, నైపుణ్యాభివృద్ధి శాఖలు -
33 లక్షల వినతుల పరిష్కారం
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇప్పటివరకు 33 లక్షల వినతులను పరిష్కరించారని గ్రామ, వార్డు సచివాలయాలు, స్పందన వ్యవహారాలలో ముఖ్యమంత్రి సలహాదారు ఆర్.ధనుంజయ్‌రెడ్డి తెలిపారు. సచివాలయాల వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, కమిషనర్ అండ్ డైరెక్టర్ జీఎస్ నవీన్‌కుమార్‌తో కలిసి శుక్రవారం ఆయన రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ధనుంజయ్‌రెడ్డి ఏమన్నారంటే.. ► స్థానిక సచివాలయాల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న 540 రకాల సేవలపై ప్రజలందరికీ అవగాహన కల్పించి మరింత మంది ఈ సేవలను వినియోగించుకునేందుకు తోడ్పడాలి. ► ప్రజల నుంచి నేరుగా అందే వినతులతో పాటు వలంటీర్ల ద్వారా అందే వినతుల పరిష్కారం విషయంలో సచివాలయాల సిబ్బంది అలసత్వం చూపవద్దు. ► సీఎం వైఎస్ జగన్ సూచించిన విధంగా నిర్ణీత గడువులోగానే వినతుల పరిష్కారం పూర్తవ్వాలి. సేవల్లో ఆలస్యమైతే సంబంధీకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకు పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ► సీఎం జగన్మోహన్రెడ్డి గ్రామాల పర్యటనకు వచ్చినప్పుడు సచివాలయాల ద్వారా అందజేసే సేవల విషయంలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చే పరిస్థితి రాకూడదు. ► ప్రతి వార్డు, గ్రామ సచివాలయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలు, వాటికి అర్హత, దరఖాస్తు చేసుకునే విధానం వంటి సమాచారం తెలియజేస్తూ నోటీసు బోర్డులు తప్పనిసరిగా ఉండాలి. ► ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు ఉపయోగపడే అన్ని ముఖ్యమైన ఫోన్ నంబర్ల జాబితా, సంక్షేమ కార్యక్రమాల అమలు క్యాలెండర్, సచివాలయాల ద్వారా అందుబాటులో ఉన్న సేవల వివరాలతో కూడిన డిస్ప్లే బోర్డులు ఉంచాలి. -
సీఎం కార్యాలయంలో అధికారుల శాఖలు ఇవే
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారులకు శాఖలు కేటాయించారు. సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఇతర అధికారులు అందరికీ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం ఈ కేటాయింపులు చేశారు. అజేయ కల్లం, సీఎం ముఖ్య సలహాదారు: సాధారణ పరిపాలన, హోంశాఖ, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ, శాంతిభద్రతల అంశాలు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యకలాపాలు. పీవీ రమేష్, సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ: వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, విద్యాశాఖ(పాఠశాల, ఇంటర్, ఉన్నత, సాంకేతిక విద్య), పరిశ్రమలు,వాణిజ్యం, మౌళిక వసతులు, పెట్టుబడులు,ప్రభుత్వ రంగ సంస్థలు, ఐటీ, ఇన్ఫ్రా, ఇంధన శాఖ. సొల్మన్ ఆరోక్య రాజ్, సీఎం కార్యదర్శి: ట్రాన్స్పోర్ట్ రహదారులు, భవనాల శాఖ, ఏపీఎస్ఆర్టీసీ, గృహ నిర్మాణం, ఆహార,పౌరసరఫరాల, వినియోగదారుల సమస్యలు, పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి, సెర్ప్, అన్ని సంక్షేమ శాఖలు, యువజన వ్యవహారాలు, క్రీడలు. కె.ధనుంజయరెడ్డి, సీఎం అదనపు కార్యదర్శి: నీటి వనరులు, పర్యావరణం, అటవీ,సాంకేతిక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, సీఆర్డీఏ, వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్, పర్యాటకం. జె.మురళి, సీఎం అదనపు కార్యదర్శి: పశుసంవర్థక, పాడి పరిశ్రమ,మత్స్యశాఖ, సహకారం, సంస్కృతి. డాక్టర్ ముక్తాపురం హరికృష్ణ, సీఎం ప్రత్యేక అధికారి: ఆరోగ్య శ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్), విజ్ఞాపనలు(ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజల విజ్ఞప్తులు). పి.కృష్ణమోహన్‌రెడ్డి, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ): ముఖ్యమంత్రికి సంబంధించిన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్, అపాయింట్మెంట్స్, విజిటర్స్ అపాయింట్మెంట్స్. -
నోటీసులపై న్యాయ పోరాటం
సాక్షి , నెల్లూరు: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో నిధులు దుర్వినియోగం అయ్యాయని వాటిపై వివరణ ఇవ్వాలని కలెక్టర్ ముత్యాలరాజు జారీ చేసిన నోటీసులు రాజకీయ దుమారం రేపాయి. వీటిపై కోర్టులో న్యాయపోరాటం చేయాలని పాలకమండలి నిర్ణయించింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి నివాసంలో పాలకమండలి సభ్యులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ క్రమంలో నోటీసులు జారీవెనుక జరుగుతున్న పరిణామాలు, దీని వెనుక ఉన్న సహకార శాఖ అధికారుల పాత్ర చర్చించారు. అనంతరం అందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకమై న్యాయపోరాటం ద్వారానే దీనిని తేల్చుకోవాలని నిర్ణయించి న్యాయవాదితో చర్చలు జరిపారు. నోటీసులకు తిరిగి వివరణ ఇవ్వడంతో పాటు కోర్టులో దీనిని సవాలు చేయాలని నిర్ణయించారు. రాజధాని నిర్మాణానికి విరాళం ఇవ్వడం. అలాగే బ్యాంక్ శత జయంతి వేడుకులను అట్టహాసంగా నిర్వహించడం కూడా నిధుల దుర్వినియోగంలో భాగం అయ్యాయని నోటీసుల్లో సారాంశం. ఇవన్నీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చేసినవే. అవి కూడా పాలకమండలి తీర్మానంతో పాటు సబ్ కమిటీ అనుమతితో చేసిన కార్యక్రమాలు ఇప్పుడు డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న మెట్టుకూరు ధనుంజయరెడ్డి సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడడంతో నోటీసులు జారీ చేసి వేధింపుల పర్వం మొదలుపెడుతున్నారనే ఆరోపణలున్నాయి. పార్టీ మారగానే నోటీసుల హడావుడి ఇదిలా ఉంటే మెట్టుకూరు ధనుంజయరెడ్డికి నోటీసులు జారీ చేయడం అటు రాజకీయ వర్గాలతో పాటు సహకారశాఖలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ మారడంతో అధికారులపై అధికారపార్టీ నేతలు ఒత్తిడి తీసుకురావడంతో వారికి ఒక అధికారి సహకారం తోడైంది. దీంతో హడావుడిగా బ్యాంక్ అధికారులను 14,15 తేదీలు పిలిచి మాట్లాడి అప్పటికప్పుడు వారితో నివేదికలు సిద్ధం చేసి 16వ తేదీతో నోటీసులు జారీ చేశారు. గతంలో సహకార శాఖలో పనిచేసిన ఒక మహిళా అధికారి డైరెక్షన్‌తోనే ఈ తతంగం అంతా నడిచినట్లు తెలుస్తుంది. సదరు మహిళా అధికారి గతంలో బ్యాంక్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈమెపై కొన్ని ఆరోపణలు రావడంతో ఆమెను తప్పించారు. ఈ క్రమంలో అప్పట్లో ఆమె అధికారులను తప్పుదోవ పట్టించేలా నివేదికలు ఇచ్చిందని దానిలో భాగంగానే తాజాగా జారీ అయిన నోటీసులు అని పాలకవర్గ సభ్యులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు పిలుపుతోనే రాజధాని నిర్మాణానికి 2014లో రూ.6 లక్షలు విరాళం బ్యాంక్ ప్రకటించారు. దాదాపు ఐదేళ్ల క్రితం ప్రకటించిన విరాళం ఇది. అది కూడా బ్యాంక్ పాలకవర్గం అనుమతితో జరిగిన విషయం. అలాగే సీఎంను ఆహ్వానించిన శతజయంతి వేడుకలకు రూ.35 లక్షలు ఖర్చు చేశారు. దీనికి కలెక్టర్ కూడా హాజరయ్యారు. అలాగే బ్యాంక్ కాంప్లెక్స్‌లోని షాపుల అద్దెలు బాగా తక్కువగా ఉండటం, పాలక మండలి తీర్మానంతో బిడ్లు ఆహ్వానించి షాపులను కేటాయించారు. ఈ క్రమంలో అద్దెలు తగ్గించడం వల్ల, అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని వల్ల రూ.42.30 లక్షలు నష్టం వాటిల్లిందని దీనిని దుర్వినియోగంగా చూపారు. ఈ మూడు అంశాలపై ఈ నెల 25న పాలకవర్గం తరుపున న్యాయవాది హాజరుకావాలని పాలకమండలి నిర్ణయించింది. -
చరిత్ర కళావైభవం
-
చరిత్ర కళావైభవం
ఎన్ని యుద్ధాలు.. ఇంకెన్ని ఉద్యమాలు.. మరెన్నో వేడుకలు. అన్నిటికీ సాక్షి సిక్కోలు. అశోకుడి మనసు మార్చిన నేల ఇది. బౌద్ధానికి గుండె పరిచి స్వాగతించిన గడ్డ ఇది. అణచివేతకు గురైన ప్రతిసారీ ప్రజా ఉద్యమాలకు పురుడు పోసిన ప్రాంతమిది. లోకానికి వెలుగు పంచే సూర్యనారాయణుడికి నీడనిచ్చిన పవిత్ర స్థలమిది. ఓ వైపు శాంతి, మరోవైపు యుద్ధం.. అవసరమైన సందర్భంలో ఏ దారినైనా పయనించగల సత్తా ఉన్న కర్మభూమి. ఆ గురుతులన్నీ జిల్లాకేంద్రంలో కొలువుదీరాయి. ఆ జ్ఞాపకాలు బొమ్మల రూపంలో మరోమారు గుండెలకు హత్తుకుంటున్నాయి. శ్రీకాకుళంలో శుక్రవారం ప్రారంభమైన కళింగాంధ్ర ఉత్సవాలు సిక్కోలు ఘన చరితను చాటిచెప్పాయి. శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు చారిత్రకతను భవిష్యత్ తరాలవారికి తెలియజేయాల్సిన అవసరం జిల్లా ప్రజల అందిరిపైనా ఉందని కలెక్టర్ కె.ధనంజయరెడ్డి అన్నా రు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో కళింగాంధ్ర ఉత్సవాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... క్రీస్తుపూర్వం 3వ శతాబ్ధంలో ఈ ప్రాంతం చారిత్రక ఘట్టాలను నేటి యువతకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. స్థానిక జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన తరువాత కళింగపట్నం సాగర తీరాన బీచ్ ఫెస్టివల్ నిర్వహించినట్లు గుర్తుచేశారు. దీనికి జిల్లా ప్రజలు విశేషంగా ఆధరించి విజయంతం చేశారన్నారు. ఈసారి భిన్నంగా చేయాలనే ఉద్దేశంతో కళింగాంధ్ర ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. శ్రీకాకుళం వైభవం, సాంస్కృతిక కళారూపాలు, జిల్లా ప్రత్యేకతను ఇందులో ఇనుమడింప జేశామని, దీనిని అంతా ఆస్వాదించాలని కోరారు. అన్ని విభాగాల అధికారులతో సమన్వంతో ఐటీడీఏ పీఓ శివశంకర్ అత్యద్భుతంగా కార్యక్రమాన్ని డిజైన్ చేశారని కొనియాడారు. 21 నెలల పాటు జిల్లాలో పనిచేసి ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లడం బాధగా ఉందన్నారు. పని చేసిన కొద్ది రోజులైనా ఎంతో తృప్తినిచ్చిందన్నారు. ప్రజంతా ఆస్వాదించాలి ఐటీడీఏ పీఓ, ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ లోతేటి శివశంకర్ మాట్లాడుతూ జిల్లాలో జరిగే చారిత్రక సంఘటనలు గురించి కోడిరామ్మూర్తి స్టేడియంలో ఏర్పాటు చేశామని తెలిపారు. జాయింట్ కలెక్టర్–2 పి.రజనీకాంతారావు మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే ప్రదర్శనశాల ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు కలెక్టర్ జ్యోతి వెలిగించి, నింగిలోకి బెలూన్లను విడిచిపెట్టి, లాంఛనంగా వేడుకలను ప్రాంభించారు. కార్యక్రమంలో డీఆర్ఓ కె.నరేంద్రప్రసాద్, డీఆర్డీఏ పీడీ ఎ.కల్యాణచక్రవర్తి, మున్సిపల్ కమిషనర్ ఆర్.శ్రీరాములునాయుడు, మెప్మా అధికారి కిరణ్‌కుమార్, సెట్‌శ్రీ సీఈఓ బీవీ ప్రసాధరావు, పర్యాటక శాఖాధికారి నారాయణరావు, డీఎస్డీఓ శ్రీనివాస్‌కుమార్, ఏపీఐఐసీ అధికారి బడగల హరిధర్రావు తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కలెక్టర్ అలాగే కోడిరామ్మూర్తి స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘కాల గమనంలో శ్రీకాకుళం’ ఎగ్జిబిషన్‌ను జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి ప్రారంభించారు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్ధం నాటి జిల్లా చరిత్ర, ప్రాచీన గ్రంథాలలో కళింగప్రాంత ప్రస్తావన, క్రీస్తుపూర్వం 261 నాటి కళింగయుద్ధం, శ్రీకూర్మ దేవాలయం, శాలిహుండం ఇలా.. జిల్లా చరిత్రతోపాటు ఏర్పాటైన, రూపుదిద్దుకున్న కట్టడాలు, నిర్మాణాలు, ప్రఖ్యాత ప్రదేశాలు, గుర్తింపు పొందిన స్థలాలు, ప్రఖ్యాతిగాంచిన వస్తువులు, తయారీ, నిర్మాణ, కళలు, సాంప్రదాయాలు, క్రీడాకారులు ఇలా ప్రతీ అంశాన్ని సమ్మేళనం చేస్తు ప్రత్యేకంగా ప్రదర్శనలు చేశారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో నిర్మితమైన, నిర్మితంకానున్న పలు ప్రాజెక్టులను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ప్రజలు వీటిని సందర్శంచేందుకు ఎగబడుతున్నారు. అలాగే స్టాల్స్‌ల వద్ద వివిధ జిల్లాస్థాయి అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. వీరితోపాటు ఉపాధ్యాయులు, పీఈటీలు, వివిధ శాఖల ఉద్యోగులు విధుల్లో పాల్గొన్నారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు కల్పిస్తున్నారు. అయితే ఉదయం ప్రారంభంకావాల్సిన ఎగ్జిబిషన్ సాయంత్రం 7 గంటల వరకు ప్రారంభం కాకపోవడంతో కళాభిమానులు, ప్రజలు ఒకింత అసహనానికి గురయ్యారు. మరోవైపు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పలు ఆకృతులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రముఖ గాయని కల్పన, జిల్లాకు చెందిన ధనుంజయ్ పాడిన పాటలకు ఆహుతులు ఉర్రూతలూగారు. మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి, యాంకర్ హరితేజతో కలిసి నవ్వులు పూయించారు. వీటితో పాటు భామిని మండలం ఘనసరకు చెందిన శివ భాగవతం బృందం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంది. నేటి సాంస్కృతిక కార్యక్రమాలు ♦ సాయంత్రం 4 గంటల నుంచి ♦ తప్పిడగుళ్లు–అల్లినగరం అప్పన్న ఎస్ఎం పురం, సత్తిబాబు ♦ నాదస్వరం–మల్లేశ్వర్రావు ♦ బుర్రకథ, ఆరంగి వెంకటరావు ♦ కర్నాటక వీణా వాయిధ్యం–యేళ్ల శ్రావణి ♦ అన్నమయ్య సంకీర్తన–రఘురాం ♦ క్లాసీకల్ మ్యూజిక్–లక్ష్మీగణపతి శర్మ ♦ భరతనాట్యం–మంగళంపల్లి పూజ ♦ కూచిపూడి, భరతనాట్యం నత్య ప్రదర్శన–అనూరాధ, కీర్తి ప్రియ సాయంత్రం 7 గంటల నుంచి.. ♦ కళింగ వైభవముపై చారిత్రక నాటకం ♦ ఫోక్ సింగర్, పంజాబీ, పైకా ఒడిశా అక్రోబేట్స్ కార్యక్రమం ♦ టీవి యాంకర్, ఈటీవి జబర్ధస్త్ ఫేమ్ రెష్మీ, టీవీ కొరియోగ్రాఫర్ పొట్టి రమేష్‌ల డాన్స్, రష్యన్ అమ్మాయిల ప్రత్యేక అభినయ కార్యక్రమాలు ♦ కళింగాంధ్ర సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా బిగ్‌బాస్ విన్నర్ కౌషల్ పర్యవేక్షణలో కోల్కత్తా మోడల్స్‌తో డిజైనర్ ఫ్యాషన్ షో ♦ ప్రముఖ గాయనీ గాయకులు శ్రీకృష్ణ, మల్లిఖార్జున, గోపికా పూర్ణిమల ఆర్కెస్ట్రా ♦ మంగ్లీ, గాలిపటాల సుధాకర్ యాంకరింగ్ చేయనున్నారు. -
పని చేయకపోతే సెలవుపై వెళ్లండి!
శ్రీకాకుళం పాతబస్టాండ్:కాలం గడుస్తున్నా ప్రగతి కనిపించడం లేదు.. సమావేశాలకు సైతం ఆలస్యంగా వస్తున్నారు.. పని చేయాలని ఇష్టంలేకపోతే సెలవుపై వెళ్లిపోండి.. కొత్తగా వచ్చేవారైనా పనులను పూర్తి చేస్తారని కలెక్టర్ కె.ధనంజయరెడ్డి పలు శాఖల అధికారులనుద్దేశించి వ్యాఖ్యానించారు. జిల్లాలోని పలు విభాగాల్లో పనుల ప్రగతి లేదని, గత నెలకు ఈ నెలకు ఏమాత్రం మెరుగుదల కనిపించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు ప్రగతిపై సరైన సమాధానం చెప్పకపోవడంతో కథలు చెప్పవద్దని, ఇప్పటికే పలుమార్లు కథలు వింటూ వస్తున్నానని.. ఇక నుంచి వినేది లేదన్నారు. ప్రధానంగా పీఆర్ ఇంజినీరింగ్, డీఆర్డీఏ, ఆర్డబ్ల్యూఎస్, ఐటీడీఎస్, విద్యాశాఖ, ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈనెల 29న అమరావతిలో కలెక్టర్ల సమావేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని శాఖల వారీగా ప్రగతిపై సంబంధిత శాఖాధికారులతో సమీక్షా సమావేశం బుధవారం తన కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి కొంతమంది అధికారులు ఆలస్యంగా రావడాన్ని గమనించిన కలెక్టర్ సమావేశానికి బొట్టుపెట్టి పిలవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శ్రీకాకుళం, అనంతపురం, విశాఖపట్నంవెనుకబడి ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాత్రి.. పగలు కష్టపడి, పనులకు కావాల్సిన అనుమతులు ఇస్తుంటే ఎందుకు పని చేయడంలేదని అధికారులను ప్రశ్నించారు. చాల శాఖలకు పనులు సజావుగా జరిగేందుకు వీలుగా అడ్వాన్సు కూడా ఇచ్చామని, అయినా పనులు ఎందుకు జరగడం లేదని నిలదీశారు. అధికారులు సమావేశాలకు సమాచారం లేకండా వస్తున్నారని, ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తిత్లీ తుపానుకు సంబంధించిన బిల్లులు సైతం కొంతమంది అధికారులు దొంగ బిల్లులు కొన్ని మండలాల్లో పెడుతున్నారన్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీలో ఏడాదిగా జిల్లా వెనుకబడి ఉందని, ప్రతి నెలా వెనుకబాటు తనానికి కారణమేమిటని ఆయన డీఆర్డీఏ పీడీని ప్రశ్నించారు. ఇక నుంచి సకాలంలో పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా విభా గం ఇంజినీరు తీరుపై మండి పడ్డారు. రన్నింగ్ వాటర్ సప్లై, మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతి నెలరోజులుగా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదన్నారు. అడ్వాన్సులు ఇచ్చినా పనులు చేయడం లేదన్నారు. పాఠశాలలకు, అంగన్వాడీ భవనాలకు ఇంతవరకు ఎందుకు రన్నింగ్వాటర్ను సరఫరా చేయలేదని సంబంధితశాఖ ఈఈని కలెక్టర్ నిలదీశారు. అంగన్వాడీ భవనాల్లో సమస్యలుంటే తనకు ఎందుకు చెప్పడం లేదని, పర్యవేక్షణ ఎందుకు చేయడం లేదని ఐటీడీఎస్ అధికారులను ప్రశ్నించారు. అన్ని శాఖల్లోనూ ఇంజినీరింగ్ విభాగాలు అధ్వానంగా ఉన్నాయని, ప్రగతి ఏమాత్రం కనిపించడం లేదన్నారు. తీరు మారాలని సంబంధిత అధికారులను హెచ్చరించారు. ఒకే పనిని పదేపదే చెప్పించుకోవడం సరికాదన్నారు. ఆదరణ పథకానికి సంబంధించిన అనుమతులు త్వరితగతిన ఇవ్వాలని, మండలాభివృద్ధి అధికారులు, ప్రత్యేకాధికారుల దగ్గర జాప్యం జరుగుతోందన్నార. మీ లాగెన్లో ఎందుకు అన్ని రోజులు ఉంచుకుంటున్నారని ప్రశ్నించారు. ఎప్పు డు వచ్చిన దరఖాస్తులను అప్పుడే పంపించాలన్నారు. మేదరి, రజక, కల్లుగీత తదితర వర్గాలకు నేరుగా రూ. పది వేలు వంతున చెక్కులు చెల్లించాల్సి ఉండగా.. ఇందులో ఎంపీడీవోల జాప్యం ఉందన్నారు. ఉపాధి హమీ నిధులతో సంబంధం ఉన్న వివిధ శాఖల పనులు వేగవంతం చేయాలని, నిధులు సకాలంలో ఖర్చు చేయకపోతే నష్టం జరుగుతోందని కలెక్టర్ ధనంజయరె డ్డి అన్నారు. సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి పనులు వేగవంతం చేయాలని డ్వామా పీడీని ఆదేశించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు, జేసీ–2 పి రజనీకాంతరావు, డీఆర్డీఏ పీడీ జి.సి.కిశోర్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి కె నాగేంద్ర ప్రసాద్, డ్వామా పీడీ హెచ్.కూర్మారావు, జెడ్పీ సీఈవో బి. నగేష్, ఆర్డీవోలు ఎం.వి.రమణ, ఎస్.వెంకటేశ్వర్లు, ఆర్. గున్నయ్య పాల్గొన్నారు. -
వ్యవసాయానికే ప్రాధాన్యం!
కె.ధనంజయరెడ్డి.. కలెక్టర్‌గా అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసిన అధికారి. పదవి చేపట్టి ఏడాదే అయినా సిక్కోలు భౌగోళిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులపై ఒక స్పష్టమైన అవగాహనతో పనుల్లో తన మార్క్ చూపించారు. వంశధార రెండో దశ ప్రాజెక్టు పనుల్లో కనిపిస్తున్న వేగం ఆయన తీసుకున్న చొరవే. జిల్లాలో ఏడాది పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఆదివారం ‘సాక్షి’ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు. ప్రజా సంక్షేమంపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు వివరించారు. – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం సాక్షి: జిల్లాలో వ్యవసాయమే ప్రజల ప్రధాన వ్యాపకం. ఈ రంగంలో అభివృద్ధికి మీరు తీసుకుంటున్న చర్యలేమిటి? కలెక్టరు: ఖరీఫ్ పంటకాలం నవంబరు నాటికి పూర్తయితే తర్వాత రబీలోనూ సాగు విస్తీర్ణం పెంచేందుకు వీలవుతుంది. అంతేకాదు ఇది రైతుకు లాభదాయకం కూడా. రబీలో ఆరుతడి పంటల ను ప్రోత్సహించే విషయంలో సఫలమయ్యాం. మొక్కజొన్న, రాగి (చోడి) పంటల విస్తీర్ణం పెరి గింది. వాణిజ్య, ఉద్యాన, కూరగాయల సాగు పెంచేందుకు దృష్టి సారిస్తాం. జీడిమామిడి, కొబ్బరి తోటల్లో పసుపు, అల్లం తదితర అంతర పంటల సాగును ప్రోత్సహిస్తాం. అలాగే జిల్లాలో ని నీటి వనరుల్లో చేపలు పెంచేందుకు సీడ్‌ను మ త్స్యశాఖ ఇప్పటివరకూ బయటి నుంచే తెప్పించే ది. ఈ ఏడాది రూ.5 కోట్లతో జిల్లాలోనే సీడ్‌ను తయారయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. సాక్షి: వచ్చే ఖరీఫ్ ప్రణాళిక ఏమిటి? కలెక్టరు: ఖరీఫ్‌కు సంబంధించి మే 15వ తేదీ నాటికి విత్తనాలు, ఎరువులు సిద్ధం చేస్తాం. ఖరీఫ్ కాలాన్ని ముందుకు తెచ్చేవిధంగా రైతులను సన్నద్ధం చేస్తున్నాం. తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు గతంలో జూన్ ఆఖర్లో లేదా జూలై నెలలో సాగునీరు విడుదల చేసేవారు. ఈ సారి జూన్ 7వ తేదీనే ముహూర్తం నిర్ణయించాం. గొట్టా బ్యారేజీ నుంచి వంశధార నీటిని అదే నెల 21వ తేదీన విడుదల చేస్తాం. దీనివల్ల రబీ సీజన్ ముందుకు జరుగుతుంది. నవంబరు 16వ తేదీ నుంచి మార్చి వరకూ ఆ సీజన్లో సాగునీరు అందించాలనేది మా ప్రయత్నం. గోదావరి జిల్లాల్లో మాదిరిగా రొటేషన్ విధానాన్ని తీసుకొస్తాం. సాక్షి: పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితి, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల ఆధునికీకరణ ఎంతవరకూ వచ్చింది? కలెక్టరు: వంశధార రెండో దశ ప్రాజెక్టులో భాగమైన హిరమండలం జలాశయంలో జూలై నాటికి 8 టీఎంసీల నీరు నింపాలనే లక్ష్యం మేరకు చు రుగ్గా పనులు చేయిస్తున్నాం. నిర్మాణ పనులు గతం కన్నా త్వరితగతిన సాగుతున్నాయి. అలాగే హైలెవల్ కెనాల్‌పై కొత్తగా ఐదు ఎత్తిపోతల పథకాలు నిర్మించేందుకు ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)లు సిద్ధం చేస్తున్నాం. ఇవి సాకారమైతే మరో నాలుగైదు వేల ఎకరాల భూమికి నీరు అందుతుంది. జిల్లాలో అంతకుముందు 15 ఎత్తిపోతల పథకాలకు ప్రతిపాదనలు చేస్తే వాటిలో నాలుగు ప్రారంభమయ్యాయి. మరో ఆరు ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. తోటపల్లి పాత ఆయకట్టు, నారాయణపురం ఆయకట్టు ఆధునికీకరణకు ప్రభుత్వ అనుమతి కోసం చూస్తున్నాం. మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ ప్రాజెక్టు పనులు కూడా ఇటీవల కాలంలో పుంజుకున్నాయి. సాక్షి: జలసిరి పథకం అమలులో ఎదురవుతున్న ఇబ్బందుల మాటేమిటి? కలెక్టరు: జలసిరి పథకం కింద 9 వేల బోర్లు వేయాలనేది లక్ష్యం. ఇప్పటికే 1100 పూర్తి చేశాం. వాటిలో 300 పంపుసెట్లకు సోలార్ విద్యుత్తు వ్యవస్థను అనుసంధానం పూర్తికావడంతో అవి రైతులకు అందుబాటులోకి వచ్చాయి. వాటిని మిగతా రైతులు చూసి దరఖాస్తు చేయడానికి ముందుకొస్తున్నారు. అయితే బోరురిగ్లు వీలైనన్ని అందుబాటులో లేకపోవడం వల్ల తవ్వకం ఆలస్యమవుతోంది. తెలంగాణ ప్రాంతం నుంచి అదనపు రిగ్‌లను రప్పించే ఏర్పాట్లు చేస్తున్నాం. సాక్షి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎన్ఆర్ఈజీఏ) అమలు జిల్లాలో ఎలా ఉంది? కలెక్టరు: జిల్లాలో 84 శాతం మంది గ్రామాల్లోనే ఉన్నారు. వారి కుటుంబాలకు ఉన్నచోటే పని కల్పించడం ద్వారా వలసలు నివారించవచ్చు. మెటీరియల్ కాంపొనెంట్ పెంచడం వల్ల ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అందుబాటులో ఉంటున్నాయి. అన్ని కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు కల్పించడానికి కృషి చేస్తున్నాం. సాక్షి: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొవ్వాడ న్యూక్లియర్ పార్కు పనులు ఎంతవరకూ వచ్చాయి? కలెక్టరు: భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పనకు సంబంధించిన జాతీయ అణుసంస్థ (ఎన్పీసీఐఎల్) ఇప్పటికే రూ.500 కోట్ల నిధులు కేటాయించింది. భూసేకరణ దాదాపు కొలిక్కి వచ్చింది. మే 15వ తేదీనాటికి పూర్తవుతుంది. సుమారు రూ.19 కోట్ల వ్యయంతో 1878 నిర్వాసిత కుటుంబాలకు మోడ్రన్ కాలనీ నిర్మాణ పనులు, మౌలిక వసతుల కల్పన చర్యలు వేగవంతమయ్యాయి. అలాగే ఉద్యోగులకు టౌన్షిప్ నిర్మాణం కోసం 390 ఎకరాల అటవీ భూమి గుర్తించాం. సాక్షి: జిల్లాలో మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం సమస్య ఎక్కువగా ఉంది. దీని పరిష్కారానికి మీ ప్రణాళిక? కలెక్టరు: జిల్లాలో ప్రస్తుతం 40 వేల మంది గర్భిణుల్లో 10,800 మందికి రక్తహీనత సమస్య ఉంది. దీన్ని అశ్రద్ధ చేస్తే ప్రసూతి సమయంలో తల్లీబిడ్డలిద్దరికీ ప్రమాదం. ఐసీడీఎస్ ద్వారా గర్భిణులకు, పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ జరుగుతోంది. దీంతోపాటు చిరుధాన్యాలతో తయారైన బిస్కెట్లు, ఉండలు, వేరుశనగ ఉండలు వంటి బలవర్థకమైన ఆహారం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి ఏటా రూ.2 కోట్ల వరకూ ఖర్చవుతుంది. ఆ ఆహారం తయారీ బాధ్యత స్వయంశక్తి సంఘాలకు అప్పగిస్తాం. వచ్చే నెల నుంచే ఇది ప్రారంభిస్తున్నాం. సాక్షి: జిల్లాలో మరో ప్రధాన సమస్య కిడ్నీ వ్యాధులు. రోగులకు ఉపశమన చర్యలేమిటి? కలెక్టరు: ఉద్దానంలో గత ఏడాది లక్ష మందికి నిర్వహించిన ప్రాథమిక వైద్య పరీక్షల్లో సీరమ్ క్రియాటిన్ 1.2 దాటినవారు 13 వేల మంది ఉన్నట్లు తేలింది. సామాజిక పరిస్థితుల వల్ల ఈ వైద్య పరీక్షలకు ముందుకురానివారు మరో 75 వేల మంది వరకూ ఉన్నారని అంచనా. వ్యాధి ప్రారంభంలో గుర్తించిన వెంటనే వారికి అవసరమైన మందులు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో రూ.6.7 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించా. అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాం. సాక్షి: బాల్య వివాహాల వంటి సామాజిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వాటిపై దృష్టి పెడుతున్నారా? కలెక్టరు: బాల్య వివాహాల అరికట్టడంతో పాటు గర్భస్థ దశ నుంచి ఆడశిశువుల పరిరక్షణకు ప్రత్యే క చర్యలు తీసుకుంటున్నాం. వెలుగు సిబ్బంది ద్వారా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే జిల్లాలోని అన్ని పాఠశాలల్లో జూన్ 12 నాటికి రూ.14 కోట్లతో తాగునీరు, మరుగుదొడ్లలో నీటి (రన్నింగ్ వాటర్) సదుపాయం కల్పించే పనులు ప్రారంభించాం. విద్యార్థులకు దృష్టి పరీక్షలు చేయిస్తాం. జిల్లాలో దృష్టి సమస్య ఉన్న పిల్లలు 10 వేల మంది వరకూ ఉం టారని అంచనా. వారికి రూ.40 లక్షల వ్యయంతో కళ్లద్దాలు కూడా జూలై నెలాఖరు నాటికి అందజేయాలనేది నా ప్రయత్నం. సాక్షి: సేవల రంగంలో జిల్లా అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలేమిటి? కలెక్టరు: జిల్లాకు టెంపుల్ టూరిజమే ప్రధానం. అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం ఆలయాలను మాస్టర్ప్లాన్లతో అభివృద్ధి చేస్తున్నాం. శాలిహుండం బౌద్ధారామం, కళింగపట్నం బీజ్, ఏజెన్సీలోని జగతిపల్లి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జూన్ నెలాఖరు నాటికల్లా అన్ని గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించాలనేది నా లక్ష్యం. -
ఇరు వర్గాల మధ్య ఘర్షణ...
మంత్రాలయం(కర్నూలు): కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదురు గ్రామంలో వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఆదివారం ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు దాడులు చేసుకోవడంతో కాంగ్రెస్ నేత ధనంజయ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో వైఎస్సార్ సీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు కూడా గాయపడ్డారు. ధనంజయరెడ్డిని కర్నూలులోనిఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.