ఆకట్టుకున్న రఘుపాత్రుని శ్రీకాంత్ బృందం నృత్య ప్రదర్శన
ఎన్ని యుద్ధాలు.. ఇంకెన్ని ఉద్యమాలు.. మరెన్నో వేడుకలు. అన్నిటికీ సాక్షి సిక్కోలు. అశోకుడి మనసు మార్చిన నేల ఇది. బౌద్ధానికి గుండె పరిచి స్వాగతించిన గడ్డ ఇది. అణచివేతకు గురైన ప్రతిసారీ ప్రజా ఉద్యమాలకు పురుడు పోసిన ప్రాంతమిది. లోకానికి వెలుగు పంచే సూర్యనారాయణుడికి నీడనిచ్చిన పవిత్ర స్థలమిది. ఓ వైపు శాంతి, మరోవైపు యుద్ధం.. అవసరమైన సందర్భంలో ఏ దారినైనా పయనించగల సత్తా ఉన్న కర్మభూమి. ఆ గురుతులన్నీ జిల్లాకేంద్రంలో కొలువుదీరాయి. ఆ జ్ఞాపకాలు బొమ్మల రూపంలో మరోమారు గుండెలకు హత్తుకుంటున్నాయి. శ్రీకాకుళంలో శుక్రవారం ప్రారంభమైన కళింగాంధ్ర ఉత్సవాలు సిక్కోలు ఘన చరితను చాటిచెప్పాయి.
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు చారిత్రకతను భవిష్యత్ తరాలవారికి తెలియజేయాల్సిన అవసరం జిల్లా ప్రజల అందిరిపైనా ఉందని కలెక్టర్ కె.ధనంజయరెడ్డి అన్నా రు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో కళింగాంధ్ర ఉత్సవాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... క్రీస్తుపూర్వం 3వ శతాబ్ధంలో ఈ ప్రాంతం చారిత్రక ఘట్టాలను నేటి యువతకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. స్థానిక జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన తరువాత కళింగపట్నం సాగర తీరాన బీచ్ ఫెస్టివల్ నిర్వహించినట్లు గుర్తుచేశారు. దీనికి జిల్లా ప్రజలు విశేషంగా ఆధరించి విజయంతం చేశారన్నారు. ఈసారి భిన్నంగా చేయాలనే ఉద్దేశంతో కళింగాంధ్ర ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. శ్రీకాకుళం వైభవం, సాంస్కృతిక కళారూపాలు, జిల్లా ప్రత్యేకతను ఇందులో ఇనుమడింప జేశామని, దీనిని అంతా ఆస్వాదించాలని కోరారు. అన్ని విభాగాల అధికారులతో సమన్వంతో ఐటీడీఏ పీఓ శివశంకర్ అత్యద్భుతంగా కార్యక్రమాన్ని డిజైన్ చేశారని కొనియాడారు. 21 నెలల పాటు జిల్లాలో పనిచేసి ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లడం బాధగా ఉందన్నారు. పని చేసిన కొద్ది రోజులైనా ఎంతో తృప్తినిచ్చిందన్నారు.
ప్రజంతా ఆస్వాదించాలి
ఐటీడీఏ పీఓ, ఇన్‌చార్జ్ జాయింట్ కలెక్టర్ లోతేటి శివశంకర్ మాట్లాడుతూ జిల్లాలో జరిగే చారిత్రక సంఘటనలు గురించి కోడిరామ్మూర్తి స్టేడియంలో ఏర్పాటు చేశామని తెలిపారు. జాయింట్ కలెక్టర్–2 పి.రజనీకాంతారావు మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే ప్రదర్శనశాల ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు కలెక్టర్ జ్యోతి వెలిగించి, నింగిలోకి బెలూన్లను విడిచిపెట్టి, లాంఛనంగా వేడుకలను ప్రాంభించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కె.నరేంద్రప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ ఎ.కల్యాణచక్రవర్తి, మున్సిపల్ కమిషనర్ ఆర్.శ్రీరాములునాయుడు, మెప్మా అధికారి కిరణ్‌కుమార్, సెట్‌శ్రీ సీఈఓ బీవీ ప్రసాధరావు, పర్యాటక శాఖాధికారి నారాయణరావు, డీఎస్‌డీఓ శ్రీనివాస్‌కుమార్, ఏపీఐఐసీ అధికారి బడగల హరిధర్రావు తదితరులు పాల్గొన్నారు.
ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కలెక్టర్
అలాగే కోడిరామ్మూర్తి స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘కాల గమనంలో శ్రీకాకుళం’ ఎగ్జిబిషన్‌ను జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి ప్రారంభించారు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్ధం నాటి జిల్లా చరిత్ర, ప్రాచీన గ్రంథాలలో కళింగప్రాంత ప్రస్తావన, క్రీస్తుపూర్వం 261 నాటి కళింగయుద్ధం, శ్రీకూర్మ దేవాలయం, శాలిహుండం ఇలా.. జిల్లా చరిత్రతోపాటు ఏర్పాటైన, రూపుదిద్దుకున్న కట్టడాలు, నిర్మాణాలు, ప్రఖ్యాత ప్రదేశాలు, గుర్తింపు పొందిన స్థలాలు, ప్రఖ్యాతిగాంచిన వస్తువులు, తయారీ, నిర్మాణ, కళలు, సాంప్రదాయాలు, క్రీడాకారులు ఇలా ప్రతీ అంశాన్ని సమ్మేళనం చేస్తు ప్రత్యేకంగా ప్రదర్శనలు చేశారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో నిర్మితమైన, నిర్మితంకానున్న పలు ప్రాజెక్టులను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ప్రజలు వీటిని సందర్శంచేందుకు ఎగబడుతున్నారు. అలాగే స్టాల్స్‌ల వద్ద వివిధ జిల్లాస్థాయి అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. వీరితోపాటు ఉపాధ్యాయులు, పీఈటీలు, వివిధ శాఖల ఉద్యోగులు విధుల్లో పాల్గొన్నారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు కల్పిస్తున్నారు. అయితే ఉదయం ప్రారంభంకావాల్సిన ఎగ్జిబిషన్ సాయంత్రం 7 గంటల వరకు ప్రారంభం కాకపోవడంతో కళాభిమానులు, ప్రజలు ఒకింత అసహనానికి గురయ్యారు. మరోవైపు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పలు ఆకృతులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రముఖ గాయని కల్పన, జిల్లాకు చెందిన ధనుంజయ్ పాడిన పాటలకు ఆహుతులు ఉర్రూతలూగారు. మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి, యాంకర్ హరితేజతో కలిసి నవ్వులు పూయించారు. వీటితో పాటు భామిని మండలం ఘనసరకు చెందిన శివ భాగవతం బృందం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంది.
నేటి సాంస్కృతిక కార్యక్రమాలు
♦ సాయంత్రం 4 గంటల నుంచి
♦ తప్పిడగుళ్లు–అల్లినగరం అప్పన్న ఎస్‌ఎం పురం, సత్తిబాబు
♦ నాదస్వరం–మల్లేశ్వర్రావు
♦ బుర్రకథ, ఆరంగి వెంకటరావు
♦ కర్నాటక వీణా వాయిధ్యం–యేళ్ల శ్రావణి
♦ అన్నమయ్య సంకీర్తన–రఘురాం
♦ క్లాసీకల్ మ్యూజిక్–లక్ష్మీగణపతి శర్మ
♦ భరతనాట్యం–మంగళంపల్లి పూజ
♦ కూచిపూడి, భరతనాట్యం నత్య ప్రదర్శన–అనూరాధ, కీర్తి ప్రియ
సాయంత్రం 7 గంటల నుంచి..
♦ కళింగ వైభవముపై చారిత్రక నాటకం
♦ ఫోక్ సింగర్, పంజాబీ, పైకా ఒడిశా అక్రోబేట్స్ కార్యక్రమం
♦ టీవి యాంకర్, ఈటీవి జబర్ధస్త్ ఫేమ్ రెష్మీ, టీవీ కొరియోగ్రాఫర్ పొట్టి రమేష్‌ల డాన్స్, రష్యన్ అమ్మాయిల ప్రత్యేక అభినయ కార్యక్రమాలు
♦ కళింగాంధ్ర సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా బిగ్‌బాస్ విన్నర్ కౌషల్ పర్యవేక్షణలో కోల్‌కత్తా మోడల్స్‌తో డిజైనర్ ఫ్యాషన్ షో
♦ ప్రముఖ గాయనీ గాయకులు శ్రీకృష్ణ, మల్లిఖార్జున, గోపికా పూర్ణిమల ఆర్కెస్ట్రా
♦ మంగ్లీ, గాలిపటాల సుధాకర్ యాంకరింగ్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment