మా మకుటం... సత్యమేవ జయతే!
మీరు గుడ్లురిమితే గుండెలు జారిపోవడానికి ఇక్కడ భీరువులెవరూ లేరు. మీరంతటి వీర వరేణ్యులు కూడా కారు! మీరు కళ్లెర్రజేస్తే కాలి బూడిదయ్యే కొంగలేమీ ఇక్కడ లేవు. తమరు తపోధనులైన కౌశికులు ఎంతమాత్రం కారు. మీ అధికారం సర్వంసహాధికారం కాదు. మీరు థామస్ హాబ్స్ ప్రతిపాదించిన ‘లెవయధాన్’ వంటివారు కారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన పరిమితులతో కూడిన అధికారం మాత్రమే మీ చేతిలో ఉన్నది. అదే రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు మాకు అండగా ఉన్నవి. ఆ హక్కుల్ని రక్షించడానికి న్యాయస్థానాలు దన్నుగా ఉన్నవి.రెండు వారాల కిందనే సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పిందో ఒకసారి గమనించండి. అచ్చం మీ సర్కారుకు మల్లేనే యూపీలోని యోగీబాబా సర్కార్ కూడా ఓ జర్నలిస్టుపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించింది. కేసు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం చేసిన వ్యాఖ్యానమేమిటో మళ్లీ ఒకసారి పరిశీలించండి. ‘‘ప్రజల భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని ప్రజాస్వామ్య దేశాలు గౌరవించాలి. భారత రాజ్యాంగంలోని 19 (1) (ఏ) అధికరణం పాత్రికేయుల హక్కులకు రక్షణ కల్పి స్తున్నది. పాత్రికేయుడు రాసిన వార్తా కథనం విమర్శనాత్మకంగా ఉన్నదనే నెపంతో అతడిపై క్రిమినల్ కేసులు పెట్టడానికి వీల్లేదు.’’సర్వోన్నత న్యాయస్థానం ఇంత స్పష్టంగా తేటతెల్లం చేసిన అంశంపై ఏపీ ప్రభుత్వ యంత్రాంగం కళ్లు మూసుకొని వ్యవహరిస్తున్నది. విజయవాడలో వరద సహాయక చర్యల్లో జరిగిన అవకతవకలను ‘సాక్షి’ పత్రిక ఎత్తిచూపింది. బాధ్యత గల ఫోర్త్ ఎస్టేట్‌గా అది దాని విద్యుక్త ధర్మం. ‘ముంపులోనూ మేసేశారు’ అనే శీర్షికతో ఏలినవారి ఆగ్రహానికి గురైన కథనాన్ని ప్రచురించాము. దానికి కట్టుబడి ఉన్నాము. మీ ప్రభుత్వ అధి కార నివేదికల ఆధారంగానే మేమా కథనాన్ని రాశాము. మేము స్వయంగా వండి వార్చిన కథనం కాదు. వరద సహాయ కార్య క్రమాల సమీక్ష పేరుతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశం సందర్భంగా రెవెన్యూ శాఖ ఇచ్చిన ప్రెజెంటేషన్‌లో పేర్కొన్న విషయాల్నే ‘సాక్షి’ ఉటంకించింది.కోటిమంది భోజనాల కోసం 368 కోట్లు ఖర్చు చేశామనీ, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు వగైరాలకు 23 కోట్లు ఖర్చయ్యాయనీ, వాటర్ బాటిల్స్‌కు 26 కోట్లు వెచ్చించామనీ, మొత్తం 534 కోట్లు పునరావాస సహాయ శిబిరం కోసం ఖర్చయినట్టు ఆ ప్రెజెంటేషన్‌లో ఉన్నది. ఈ లెక్కల్లోని అనౌచిత్యాన్ని ప్రజలు ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. సీపీఎం నేత బాబూ రావు ప్రజల సమక్షంలోనే ప్రభుత్వాన్ని నిలదీసిన వీడియో విస్తృతంగా సర్క్యులేషన్లో ఉన్నది. సరిగ్గా ఆ గణాంకాలనే పేర్కొంటూ, అవే ప్రశ్నల్ని ‘సాక్షి’ కూడా వేసింది.రెవెన్యూ శాఖ అధికారులు ప్రజంటేషన్ ఇచ్చినప్పుడు ఇవే అంకెల్ని చూసిన పెద్దలకు కోపం రాలేదు. జనంలో చర్చ జరుగు తున్నప్పుడు కూడా అంత కోపం రాలేదు. కానీ, ‘సాక్షి’లో కథనం రాగానే సుర్రున ప్రకోపించింది. ఆ కథనాన్ని ఖండ ఖండాలుగా ఖండించే బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించారు. ఆ కార్యనిర్వహణ వారి వశం కాలేదు. వెంటనే కూటమిలోని ఒకటో నెంబరు పత్రిక రంగంలోకి దిగింది. అబ్బెబ్బే... సహాయ పునరావాస కార్యక్రమాలకు 139 కోట్లు మాత్రమే ఖర్చయింది. 534 కోట్లు అనే మాట అబద్ధమని ఆ పత్రిక తేల్చేసింది. అదే నిజమైతే కేంద్ర పరిశీలక బృందానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నివేదికలో రిలీఫ్ క్యాంప్ ఖర్చు పేరుతో 534 కోట్లు ఎందుకు చూపెట్టారు? సదరు పత్రిక ఈ నివేదికను చూడలేదా? ప్రజల కళ్లకు గంతలు కట్టడ మనేది వారికి పెన్నుతో పెట్టిన విద్యగా చాలాసార్లు నిరూపణ అయింది.ఏ కొద్దిమందికో పులిహోర పొట్లాలు పంచి, కోటిమందికి పైగా పంచినట్టు లెక్క చూపడమేమిటి? ఆ పులిహోరకు ఒక్కో ప్లేటుకు 370 రూపాయల ఖర్చేమిటి? ఇటువంటి దగుల్బాజీ లెక్కలు చూసిన జనంలో ప్రభుత్వ ప్రతిష్ఠ బాగా పలుచబారింది. ఈ ప్రభుత్వ వ్యతిరేక వరదను ప్రతిపక్షంపైకి మళ్లించాలనే ఉద్దేశంతోనే తిరుపతి లడ్డూ వివా దాన్ని ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో అప్పుడే పొడసూపింది. కానీ, ఈ డైవర్షన్ స్కీమ్ ఫలితమివ్వకపోగా సర్కారుపైకే ఎదురు తిరిగింది.ఐదేళ్లు పరిపాలించడం కోసం గద్దెనెక్కిన ప్రభుత్వం ఐదు మాసాలు కూడా నిండకముందే ఒక ‘విఫల ప్రభుత్వం’గా ముద్ర వేయించుకోవడం ఒక అరుదైన సందర్భం. ఇటువంటి అప్రతిష్ఠను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూటగట్టుకున్నది. ఏ గడ్డి కరిచైనా అధికారంలోకి రావాలనే సంకల్పంతోనే ఎన్డీఏ కూటమి అలవికాని హామీలను ఇచ్చిందనే అభిప్రాయం ఆ రోజుల్లోనే రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. అందువల్లనే మేనిఫెస్టో విడుదల రోజున బీజేపీ ప్రతినిధి దాని ప్రతిని పట్టుకోవడానికి నిరాకరించారనే వార్తలు వచ్చాయి. అటువంటి అంచనాలకు తగి నట్టుగానే ఈ నాలుగు నెలల పైచిలుకు కాలాన్ని కూటమి సర్కార్ నెట్టుకొచ్చింది.మేనిఫెస్టోలో హైలైట్‌గా వారు చెప్పుకున్న ‘సూపర్ సిక్స్’లో ఒక్క పథకం జోలికి ప్రభుత్వం వెళ్లలేకపోయింది. ఖజానాపై పెద్దగా భారం పడని ఉచిత గ్యాస్ సిలిండర్ల (ఏడాదికి మూడు) పంపిణీని ఈ దీపావళి నుంచి ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. మిగిలిన ఐదు పథకాల అమలు సంగతి దేవుడెరుగు. ఫలానా రోజు నుంచి వాటిని ప్రారంభిస్తామనే ఒక కనీస షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది.బుడమేరు వరదల సందర్భంగా ప్రభుత్వ నిష్క్రియా పరత్వం కొట్టొచ్చినట్టు కనబడింది. ముందుచూపు లేకపోవడం, వ్యూహరాహిత్యం వల్ల నలభై నిండు ప్రాణాలను బలి పెట్టవలసి వచ్చింది. మూడు లక్షలమంది తమ సర్వస్వాన్ని కోల్పోయారు. తమ యావజ్జీవిత ఆర్జితాన్ని గంగపాలు చేసు కోవలసి వచ్చింది. వారి జీవిత చక్రాన్ని వెనక్కు తిప్పడం సాధ్యమయ్యే పనేనా? ముందుగా హెచ్చరికలు జారీ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారి విలువైన సామగ్రిని భద్రపరచుకునేందుకు దోహదపడి వుంటే ఇంత దుఃస్థితి ఏర్పడేది కాదు. అందుకే దీన్ని ‘విఫల ప్రభుత్వం’అంటున్నారు. రెగ్యులర్ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేక ఇంత కాలం నెట్టుకొచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఏపీ కూటమి ప్రభుత్వమే! నాలుగున్నర నెలల కాలంలో 32 వేల కోట్లు అప్పు తెచ్చినందుకు, ప్రపంచ బ్యాంకు వాళ్లు నేడో రేపో విడుదల చేస్తారని చకోర పక్షుల్లా 15 వేల కోట్ల అప్పు కోసం ఎదురు చూస్తున్నందుకు ‘అప్పుల సర్కార్’ అని కూడా అనవచ్చు. ఇసుక రీచుల్లో, మద్యం షాపుల వేలాల్లో, ఉద్యోగుల బదిలీల్లో లంచాల దుర్గంధాన్ని వెదజల్లుతున్నందుకు ‘అవినీతి సర్కా ర్’గా పరిగణించాలి. తమ సంఖ్యా బలంపై ఆధారపడిన ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నా, ఆ సర్కార్‌లో తమకూ భాగ మున్నా సొంత రాష్ట్రానికి కించిత్ మేలును కూడా చేసుకోలేక పోయినందుకు ‘అసమర్థ ప్రభుత్వం’గా భావించాలి.సాధారణంగా కొత్త ప్రభుత్వాలపై ఇంత త్వరగా జనంలో వ్యతిరేకత వ్యక్తం కాదు. ఏపీ పరిణామం మాత్రం అసాధా రణమైనదే. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత బహిరంగంగా కనిపి స్తున్నది. కొత్త సర్కార్ తన హామీలు అమలు చేయకపోగా, జగన్ సర్కార్ అందిస్తున్న పథకాలను చేజార్చుకొని మోస పోయామన్న ఆవేదన ప్రజల్లో కనిపిస్తున్నది. హామీలు, స్కీముల సంగతి పక్కనబెట్టినా సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు కూడా దిగజారాయి. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను కొత్త ప్రభుత్వం గాలికొదిలేసింది. గ్రామీణ ఆరోగ్యం పడకేసింది. ప్రభుత్వ స్కూళ్ల నుంచి మళ్లీ ప్రైవేట్ బడులకు విద్యార్థుల వలస మొదలైంది. ఐదేళ్ల తర్వాత ఎరువుల కోసం, విత్తనాల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడవలసి రావడాన్ని చూస్తున్నాము. ఇటువంటి అనేక కారణాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నాయి.క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలన్నీ బయటికొస్తే అసంతృప్తి మరింత పరివ్యాప్తమవుతుంది. అందుకే మాట వినని మీడియాను దండోపాయంతో దారిలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నట్టుంది. ఆ ఉపాయంతోనే ‘సాక్షి’ మీద విజయవాడ పోలీస్ స్టేషన్లో ఒక అక్రమ కేసును బనాయించారు. మీడియాలో వచ్చిన వార్తలపై అభ్యంతరాలు ఉండటంలో తప్పులేదు. దాని మీద వివరణ ఇవ్వవచ్చు. దాన్ని ప్రచురించక పోతే అప్పుడు న్యాయస్థానానికి వెళ్లడం సదరు వ్యక్తులు లేదా వ్యవస్థలు చేయవలసిన పని. కానీ ఎకాయెకిన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం భావ వ్యక్తీకరణ హక్కుపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. రోజులు గడుస్తున్నకొద్దీ పరిణతి సాధించవలసిన ప్రజాస్వామ్యంలో ఇటువంటి దండనాథులు తలెత్తడం ఒక విషాదం.‘‘నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ,నీ అభిప్రాయం వెల్లడించే హక్కు కోసం నా ప్రాణాలైనా ఇస్తా’’ అనేది మూడు శతాబ్దాల కిందటి ఫ్రెంచ్ ప్రజాస్వామిక నినాదం. ఇంత చరిత్ర ఉన్నది కనుకనే ప్రజాస్వామిక ‘హక్కు’ను ఏ పాలకుడూ చిరకాలం అణచిపెట్టి ఉంచలేడు. ‘‘కుటిలాత్ముల కూటమికొక త్రుటికాలపు విజయమొస్తే, విశ్వసృష్టి పరిణామం విచ్ఛిన్నం అవుతుందా?’’ అన్నారు గుంటూరు శేషేంద్రశర్మ. ఏమీ కాదు! ఈ దాదాగిరి త్రుటికాలమే. అక్రమ కేసులకు భయ పడేది లేదు. ప్రజల పక్షాన నిలబడకుండా కాడి వదిలేసేదీ లేదు. నిశ్చయంగా, నిర్భయంగా జనం గుండె గొంతుకై ‘సాక్షి’ ప్రతిధ్వనిస్తుంది. ‘సాక్షి’ పత్రిక మీద కనిపించే మకుటమే ‘సత్యమేవ జయతే’!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com