సీఐడీ కుట్ర విఫలం.. ఇక సిట్‌ కుతంత్రం | Chandrababu TDP Govt Special team formed to investigate liquor smuggling case | Sakshi
Sakshi News home page

సీఐడీ కుట్ర విఫలం.. ఇక సిట్‌ కుతంత్రం

Published Thu, Feb 6 2025 4:29 AM | Last Updated on Thu, Feb 6 2025 8:54 AM

Chandrababu TDP Govt Special team formed to investigate liquor smuggling case

మద్యం అక్రమ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందం ఏర్పాటు

ఇప్పటికే దర్యాప్తు పేరిట హడావుడి చేసి చతికిలపడిన సీఐడీ

ఎన్ని పాట్లు పడినా ఒక్క ఆధారం సాధించలేని వైనం

దాంతో అక్రమ కేసులతో వేధించేందుకే సిట్‌ అస్త్రం

బాబు వీరవిధేయ అధికారి రాజశేఖర్‌బాబుకు బాధ్యతలు

తెర వెనుక నుంచి నడిపించనున్న రిటైర్డ్‌ డీఐజీ ఘట్టమనేని

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్‌ రాజ్యాంగ వేధింపులు రోజు రోజుకూ వెర్రి తలలు వేస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వంలో పారదర్శకంగా నిర్వహించిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానంపై అవాస్తవ ఆరో­పణలతో, అక్రమ కేసులతో వేధించేందుకు అడ్డ­దా­రులు తొక్కుతోంది. ఈ వ్యవహారంపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే సీఐడీ అక్రమ కేసుతో పన్నిన పన్నాగం బెడిసి కొట్టింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో అవినీతిపై ఎలాంటి ఆధారాలు సేక­రిం­చలేకపోయింది. దాంతో బాబు ప్రభుత్వం కొత్త కుట్రకు తెరతీసింది. 

తాము చెప్పింది చెప్పినట్టు చేసే విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేసింది. తెర వెనుక ఉంటూ పోలీసు వ్యవస్థను నడిపిస్తున్న రిటైర్డ్‌ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ ద్వారా ఈ కుట్రను అమలు చేయాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. కాగా సిట్‌కు నేతృత్వం వహించనున్న రాజశేఖర్‌ బాబుపైనే తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉండటం గమనార్హం.

కొండను తవ్వి.. ఎలుకను కూడా పట్టలేని సీఐడీ
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అవాస్తవ ఆరోపణలతో సీఐడీ అక్రమ కేసు కుట్ర బెడిసికొట్టింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవహారంపై సీఐడీ ద్వారా కేసు నమోదు చేసింది. వైఎస్సార్‌సీపీ నేతలకు వ్యతిరేకంగా అవాస్తవ ఆధారాలను సృష్టించాలని, అక్రమ కేసులు బిగుసుకునేలా చేయాలని సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. అక్రమ కేసుల బనాయింపులో తాము చెప్పిన లక్ష్యాలు సాధిస్తే ఆయనకు డీజీపీ పోస్టు ఇస్తామని కూడా ప్రలోభ పెట్టింది. 

ఈ నేపథ్యంలోనే సీఐడీ ఆరు నెలలుగా చేయని హడావుడి లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీగా వ్యవహరించిన వాసుదేవరెడ్డితోసహా పలువురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. వాసుదేవరెడ్డిని పలుసార్లు విచారణ పేరిట వేధించారు. ఆయన్ను అక్రమంగా రోజుల తరబడి నిర్బంధించి తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించారు. 

తాము చెప్పినట్టు చేస్తే ఢిల్లీలో కీలక పోస్టింగు ఇస్తామని, లేకపోతే అంతు చూస్తామన్న హెచ్చరికలతో సీఐడీ అధికారులు బరితెగించారు. డిస్టిలరీల్లో తనిఖీల పేరిట హడావుడి చేశారు. ఇంత చేసినప్పటికీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో అక్రమాలపై ప్రాథమిక ఆధారాలను కూడా సేకరించ లేకపోయారు. అవాస్తవ ఆధారాలతో కనికట్టు చేసేందుకు చేసిన యత్నాలు ఫలించ లేదు.

సీఐడీ చీఫ్‌పై చినబాబు ఆగ్రహం 
రెడ్‌బుక్‌ రాజ్యాంగ వేధింపుల కేసులను తాము చెప్పినట్టు చేయడం లేదని సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌పై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించారు. చినబాబే అందరి ముందు ఆయనపై పరుష పద జాలంతో విరుచుకు పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకానొక దశలో సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ను బదిలీ చేయాలని కూడా ప్రభుత్వం భావించింది. 

కుట్రకు పదునుపెట్టేందుకే సిట్‌
మద్యం అక్రమ కేసు పేరిట వైఎస్సార్‌సీపీ నేతలను వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్తకుట్రకు తెరతీసింది. సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యాన్నార్‌ విఫలమయ్యారని భావించిన ప్రభుత్వ పెద్దలు తమ అస్మదీయ అధికారి రాజశేఖర్‌ బాబును తెరపైకి తెచ్చారు. ఆయన నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. వాస్తవానికి సిట్‌ వంటి ప్రత్యేక దర్యాప్తు బృందానికి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారి నేతృత్వం వహిస్తారు. అంటే డీజీపీ, సీఐడీ, ఏసీబీ తదితర విభాగాల్లోని ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. 



కానీ జిల్లా పోలీసు యంత్రాంగాల బాధ్యతలు నిర్వర్తించే పోలీస్‌ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు సిట్‌ బాధ్యతలు అప్పగించరు. ఎందుకంటే వారికి వారి జిల్లా శాంతి భద్రతల పర్యవేక్షణ బాధ్యతలు చాలా ముఖ్యం. అయితే అందుకు విరుద్ధంగా ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న రాజశేఖర్‌బాబును సిట్‌ చీఫ్‌గా నియమించడం గమనార్హం. అంటే తాము చెప్పినట్టు చేసే అధికారి, ఎంతటి అక్రమ కేసునైనా పెట్టి వేధించే అధికారికే బాధ్యతలు అప్పగించాలన్నదే ప్రభుత్వ పెద్దల ఉద్దేశమని స్పష్టమవుతోంది. 

రిటైర్డ్‌ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ సిట్‌ తెరవెనుక పాత్ర పోషించనున్నారు. ఆయన చెప్పినట్టుగా రాజశేఖర్‌బాబు దర్యాప్తు పేరిట వేధింపులకు పాల్పడుతారన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలోనే అసలు రాజశేఖర్‌బాబు ట్రాక్‌ రికార్డు చర్చనీయాంశంగా మారింది. ఆయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్న విషయాన్ని పోలీసు వర్గాలే ప్రస్తావిస్తున్నాయి. 

మద్యం దందాతోపాటు పలు వ్యవహారాల్లో ఆయన అవినీతి బాగోతాన్ని కేస్‌ స్టడీలతోసహా ఉటంకిస్తున్నాయి. అసలు మద్యం వ్యవహారంపై సిట్‌ సంగతి తర్వాత.. అసలు సిట్‌కు నేతృత్వం వహిస్తున్న పోలీస్‌ అధికారుల అవినీతి బాగోతం మరోసారి బట్టబయలవుతోందని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.  

సిట్‌ సభ్యులు వీరే.. 
సిట్‌ చీఫ్‌: ఎస్వీ రాజశేఖర బాబు, ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌
సభ్యులు: ఎల్‌. సుబ్బారాయుడు, ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధక టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ (చంద్రబాబుకు వీర విధేయ అధికారి. అందుకే తెలంగాణ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చి తిరుపతి ఎస్పీగా నియమించారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో ప్రభుత్వ వైఫల్యం.. భక్తుల తొక్కిసలాట.. ఆరుగురు భక్తుల దుర్మరణానికి ప్రధాన బాధ్యుడు. అయినా సరే ప్రభుత్వం సస్పెండ్‌ చేయకుండా ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధక టాస్క్‌ ఫోర్స్‌ ఎస్పీగా చిత్తూరు జిల్లాలోనే పోస్టింగు ఇచ్చింది. ప్రస్తుతం సిట్‌లో సభ్యునిగా నియమించింది.)
– కొల్లి శ్రీనివాస్, అదనపు ఎస్పీ, విజిలెన్స్‌– ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం
– ఆర్‌.శ్రీహరి బాబు, అదనపు ఎస్పీ, సీఐడీ
– పి.శ్రీనివాస్, డీఎస్పీ, డోన్‌
– కె.శివాజీ, సీఐ
– సీహెచ్‌.నాగ శ్రీనివాస్, సీఐ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement