మీడియాపైనా ‘రెడ్‌బుక్‌’ రాజ్యాంగం | Chandrababu Naidu govt Red Book Rule On Media TV channels | Sakshi
Sakshi News home page

మీడియాపైనా ‘రెడ్‌బుక్‌’ రాజ్యాంగం

Published Tue, Feb 25 2025 4:19 AM | Last Updated on Tue, Feb 25 2025 4:19 AM

Chandrababu Naidu govt Red Book Rule On Media TV channels

ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న కూటమి ప్రభుత్వం

ప్రధాన టీవీ చానల్స్‌కు నోటీసులివ్వకుండా బహిష్కరణ

తమ లోపాలను ఎత్తిచూపుతారనే భయంతో ఆంక్షలు

ఇలాంటి వైఖరి సరికాదంటున్న జర్నలిస్ట్‌ సంఘాలు

సాక్షి, అమరావతి: అధికారంలోకి రాకముందే రాసుకున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని 9 నెలలుగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోంది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ, తప్పులను ప్రశ్నించే గొంతులను నిరంకుశంగా నొక్కేస్తోంది. ఇప్పటికే సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు బనాయించి, అరెస్టులు చేయించి, జైళ్లకు పంపించి దుర్మార్గంగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం తన పైశాచికత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా మరోసారి బయటపెట్టింది. 

రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా నాలుగు ప్రధాన టెలివిజన్‌ చానళ్లతో పాటు పలు మీడియా సంస్థలను అసెంబ్లీ సమావేశాల కవరేజీకి రాకుండా చేసింది. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల విశేషాలను ప్రజలకు అందించేందుకు టీవీ9, సాక్షి టీవీ, 10 టీవీ, ఎన్‌టీవీ రిపోర్టర్లను, కెమెరామెన్లను ప్రభుత్వం అనుమతించలేదు. ఎంట్రీ పాసులు ఇవ్వకుండా ఇలా ఎందుకు బహిష్కరించారనేది కూడా చెప్పలేదు. 

అసెంబ్లీ సమావేశాల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా చానళ్లుగానీ, పత్రికలుగానీ వ్యవహరిస్తే వివరణ కోరుతూ ముందస్తు నోటీసులు ఇవ్వడం పరిపాటి. ఆ తరువాతే ఏవైనా చర్యలు తీసుకోవడం అనేది నిబంధనల ప్రకారం జరగాలి. కానీ.. అలాంటిదేమీ లేకుండా కేవలం రాజకీయ కారణాలతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. 

అంతేకాకుండా గతంలో మీడియాకు ప్రవేశం ఉన్న మార్గాల్లోనూ అనేక ఆంక్షలు విధించింది. అసెంబ్లీ గేటు నుంచి మీడియాను అనుమతించలేదు. పాసులు ఉన్నప్పటికీ వెనుక నుంచే రావాలని చెప్పి అధికారులు పంపించేశారు. దీంతో అసెంబ్లీ బయట మండుటెండలోనే మీడియా ప్రతినిధులు తమ విధులను నిర్వర్తించాల్సి వచ్చింది. 

వారికి కనీసం తాగునీరు కూడా లభించకపోవడంతో కొంతమంది సీనియర్‌ జర్నలిస్టులు అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీ చరిత్రలోనే ఇంత దారుణమైన పరిస్థితులను మీడియా గతంలో ఏనాడూ ఎదుర్కోలేదని, తమ విధులను మాత్రమే తాము నిర్వర్తిస్తున్నామని, తమపైనా రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పక్షపాత ధోరణి తగదు: ఏపీయూడబ్ల్యూజే
రాష్ట్ర శాసనసభ సమావేశాల కవరేజీ కోసం కొందరికి పాసులు ఇచ్చి, కొన్ని పత్రికలు, చానళ్ల రిపోర్టర్లను అనుమతించకపోవడం సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (ఏపీయూడబ్ల్యూజే) అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివ ఏచూరి, ‘సామ్నా’ అధ్యక్షుడు నల్లి ధర్మారావు, విజయవాడ అర్బన్‌ యూనిట్‌ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు తప్పుపట్టారు. 

ఈ మేరకు సోమవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. మీడియా పట్ల పక్షపాత ధోరణులు కొనసాగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని యూనియన్‌ నాయకులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధికారిక సమావేశాలకు కూడా కొన్ని పత్రికలు, చానల్స్‌ను పిలవకపోవడం తగదన్నారు. శాసనసభ స్పీకర్, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించి, ప్రభుత్వ కార్యక్రమాలకు, అసెంబ్లీ సమావేశాలకు టీవీ9, ఎన్టీవీ, 10టీవీ, సాక్షి టీవీతో పాటు మిగిలిన అన్ని చానల్స్, పత్రికలకు అనుమతి ఇచ్చి, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని యూనియన్‌ నాయకులు కోరారు.

ఈ వైఖరి మంచిదికాదు: ఏపీడబ్ల్యూజేఎఫ్‌
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు కొన్ని మీడియా సంస్థలకు పాసులు నిరాకరించడంపై ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (ఏపీడబ్ల్యూజేఎఫ్‌), ఏపీ బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఏపిడబ్ల్యూజేఎఫ్‌ అధ్యక్షుడు ఎస్‌.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ కన్వీనర్లు వీసం శ్రీనివాసరావు, కె.మునిరాజు ఓ ప్రకటన విడుదల చేశారు. 

చట్టసభల్లో జరిగే కార్యకలాపాలను మీడియా సంస్థల ద్వారా ప్రజలకు చేరవేయాల్సిన ప్రభుత్వం, అసెంబ్లీ అధికారులు  మీడియా విషయంలో అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ, సాక్షి మీడియా సంస్థలకు మీడియా పాసులు నిరాకరించడం సరైన విధానం కాదన్నారు. ఈ విషయంపై స్పీకర్‌ జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కరించి మీడియా సంస్థలన్నిటికీ పాసులు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement