Data theft
-
రెచ్చిపోయిన కేటుగాళ్లు.. తెలంగాణ పోలీస్ యాప్స్ హ్యాక్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు.. టీఎస్ ఇప్పుడు ఏకంగా పోలీస్ యాప్స్‌నే హ్యాక్ చేసేశారు. కొన్ని రోజుల క్రితం ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు రూపొందించిన ‘హ్యాక్ ఐ యాప్’ను కూడా హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. యాప్‌లను హ్యాక్ చేసి డేటాను చోరీ చేస్తున్నారు.చోరీచేసిన డేటాను ఆన్లైన్లో అమ్ముతున్నారు 120 డాలర్లకు తెలంగాణ పోలీసుల డేటా అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. 12 లక్షల మంది డేటా బహిరంగ మార్కెట్లో విక్రయానికి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ హ్యాకింగ్‌కు పాల్పడిన ముఠాను పట్టుకునే పనిలో పోలీసులు పడ్డారు. చోరీ చేసిన సమాచారంతో బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
ట్యాపింగ్ వీరుడు.. డేటా చోరుడు.. బాబే
సాక్షి, అమరావతి : ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఈనాడు రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. అందుకే టీడీపీ ఓటమికి ఇప్పటి నుంచే కుంటిసాకులు వెతికే పనిలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందంటూ చిత్తకార్తి రాతలు రాస్తూ వైఎస్సార్సీపీపై దుష్ప్రచార కుట్రకు తెరతీశారు. పచ్చ పైత్యం సోకి రామోజీరావుకు ఉద్దేశపూర్వక మతిమరుపు వచ్చిందేమోగానీ... రాష్ట్ర ప్రజలకు మాత్రం అన్నీ గుర్తున్నాయి. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడటం, ఓటర్ల వ్యక్తిగత డేటా చౌర్యానికి బరితెగించడం అంతా ప్రజలకు గుర్తుంది. ఫోన్ల ట్యాపింగ్ కోసం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఇజ్రాయెల్ వెళ్లి మరీ అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్‌ను కొన్నారన్నది బహిరంగ రహస్యమే. చంద్రబాబు బాగోతాన్ని శాసన సభ ఉప సంఘం కూడా నిగ్గు తేల్చింది. మరోవైపు చంద్రబాబు పెగసస్ కంపెనీ నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే స్వయంగా ఆ రాష్ట్ర శాసన సభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ పోలీసు అధికారీ ఇజ్రాయెల్ వెళ్లలేదు. ఎలాంటి సాఫ్ట్వేర్ కొనలేదు. వీటన్నింటినీ మరుగున పరుస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే ధ్యేయంగా ఈనాడులో ఓ కట్టుకథ రాశారు. అసలు వాస్తవాలేమిటంటే... ట్యాపింగ్ చరిత్ర బాబుదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్ ట్యాపింగ్ అనే జాడ్యానికి ఆద్యుడు చంద్రబాబే. 2004 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి ఇంటెలిజెన్స్ విభాగంలో ఓ కీలక అధికారిని, మరో పోలీసు ఉన్నతాధికారిని అందుకోసం ప్రత్యేకంగా నియమించారు. ప్రతిపక్ష నేత నుంచి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల వరకూ అందరి ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. ఆ కుట్రలో భాగస్వామి అయిన ఆ పోలీసు ఉన్నతాధికారికి 2014లో చంద్రబాబు మళ్లీ సీఎం అయిన తరువాత రాష్ట్ర పోలీస్ బాస్‌గా పోస్టింగ్ ఇచ్చారు కూడా. భద్రతా చట్టాలను ఉల్లంఘించి మరీ పెగసస్ సాఫ్ట్వేర్ కొన్న చంద్రబాబు రాష్ట్ర విభజన తరువాత 2014లో ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయిన చంద్రబాబు మరోసారి ఫోన్ ట్యాపింగ్ అక్రమాలకు పాల్పడ్డారు. ప్రధానంగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు వ్యవహారంలో ‘మా వాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూచంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. రాత్రికి రాత్రే విజయవాడకు మకాం మార్చేశారు. ఇక్కడ ఆయన మరోసారి ఫోన్ ట్యాపింగ్‌పై దృష్టి సారించారు. అందుకోసం అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంతో ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్‌తోపాటు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడటం ఆ వ్యవస్థ లక్ష్యం. ఐటీ గ్రిడ్స్ అనే ప్రైవేటు కంపెనీ, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు కూడా భాగస్వామిగా ఉన్న ఆకాశ్ ఎంటర్‌ప్రైజస్ కంపెనీల ద్వారా ఏరోస్టాట్ బెలూన్లు, ఇతర ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలుకు పెగసస్‌తో సంప్రదింపులు జరిపారు. అందుకోసం ఏబీ వెంకటేశ్వరరావు బృందం ఇజ్రాయెల్‌లో పర్యటించింది. పెగసస్ సంస్థతో సంప్రదింపులు జరిపింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీ కంపెనీల నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనాలంటే రక్షణ శాఖ అనుమతి తప్పనిసరి. ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఉగ్రవాద సంస్థలకు చిక్కితే దేశంలో విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్నందువల్ల దేశ భద్రత దృష్ట్యా ఈ నిబంధన విధించారు. కానీ, జాతీయ భద్రత చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించింది. రక్షణ శాఖకు సమాచారం ఇవ్వకుండానే పెగసస్ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. ఐటీ గ్రిడ్స్ కంపెనీ ద్వారా ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంది. అందుకోసం నిధులు కూడా చెల్లించింది. రూ.25 కోట్లతోచంద్రబాబు పెగసస్ సాఫ్ట్వేర్ కొన్నారు: మమత ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రూ.25 కోట్లు వెచ్చించి పెగసస్ నుంచి అక్రమంగా ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. 2022లో పశ్చిమ బెంగాల్ శాసనసభలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొనాలని పెగసస్ కంపెనీ ప్రతినిధులు తనను సంప్రదించారని వెల్లడించారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఆ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందని, మీరు కూడా కొనాలంటూ ఆ సంస్థ ప్రతిపాదించిందని తెలిపారు. చట్ట విరుద్ధమైన ఆ పనిని తాను చేయలేనని తిరస్కరించానని మమతా బెనర్జీ చెప్పారు. ఇవన్నీ చంద్రబాబు కుతంత్రాలను బయటపెట్టే వాస్తవాలు. వీటిని ఏనాడూ ప్రశ్నించని రామోజీరావు.. ఇప్పుడు మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడకపోయినా, ఓ అసత్య కథనాన్ని ప్రజల్లోకి వదిలి, టీడీపీ ఓటమికి ఓ కుంటిసాకును సిద్ధం చేసుకున్నారు. యథేచ్ఛగా ఫోన్ ట్యాపింగ్..35 లక్షల మందిడేటా చౌర్యం అక్రమంగా కొన్న ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌తో చంద్రబాబు ప్రభుత్వం బరితెగించింది. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తోపాటు వైఎస్సార్సీపీకి చెందిన 65 మంది నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడింది. దీనిపై పూర్తి ఆధారాలతో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019 ఎన్నికలకు ముందు వివిధ కేసుల దర్యాప్తు ముసుగులో ఏకంగా వైఎస్సార్సీపీకి చెందిన 150 మంది ఫోన్లను ట్యాప్ చేయడం చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలకు నిదర్శనం. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన ఓటర్ల డేటా (సమాచారం) మొత్తాన్ని టీడీపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన ‘సేవా మిత్ర’ యాప్‌కు అనుసంధానించారు. రాష్ట్రంలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారం చౌర్యానికి పాల్పడ్డారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్న 35 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ కుట్రకు వ్యతిరేకంగా అప్పట్లోనే వైఎస్సార్సీపీ ఆందోళనలు చేసింది. పోలీసులు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదులు చేసింది. నిగ్గు తేల్చిన శాసనసభ ఉప సంఘం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ప్రభుత్వ డేటా చౌర్యంపై విచారణకు సభా సంఘాన్ని నియమించింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ హోం, ఆర్థిక, సమాచార–పౌర సంబంధాల శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులను విచారించింది. అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే తాము ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ సేవామిత్ర యాప్‌నకు బదిలీ చేశామని ఆ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌ను అక్రమంగా కొన్న మాట వాస్తవమేనని, అందుకే ఆ దేశంలో పర్యటించామని తెలిపారు. ఈ వ్యవహారంపై ఉప సంఘం మధ్యంతర నివేదికను కూడా శాసనసభకు సమర్పించింది. -
నిన్న రాజంపేట.. నేడు నెల్లూరు 'పచ్చ' మూకల డేటా చౌర్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటమే లక్ష్యంగా ఇప్పటి నుంచే టీడీపీ బరితెగిస్తోంది. ‘బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతోనూ, ఓటర్ల జాబితాలో ఓటు ఉందో, లేదో తెలుసుకునే పేరుతోనూ ప్రతి ఇంటికీ వెళ్తున్న టీడీపీ డేటా దొంగల ముఠా ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తోంది. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు వివరాలు, ఓటీపీ వంటి అత్యంత సున్నిత సమాచారాన్ని ఈ ముఠా సేకరిస్తోంది. కొద్ది రోజుల క్రితం అన్నమయ్య జిల్లా రాజంపేటలోనూ ఈ పచ్చ మూకల దండు ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపైన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన పచ్చ దొంగల ముఠా ఊళ్ల మీదకొచ్చి పడుతోందని.. పట్టపగలే ఇళ్లలోకి చొరబడుతోందని.. ఆ ముఠా చేసే తప్పుడు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఇంతలోనే రాజంపేట కోవలోనే తాజాగా నెల్లూరులోనూ టీడీపీ దొంగల ముఠా ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించింది. నెల్లూరులో నారాయణ గ్యాంగ్ బరితెగింపు.. నెల్లూరులో టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణ గ్యాంగ్ శనివారం పట్టపగలే ప్రజల ఇళ్లలోకి చొరబడింది. ఇంటింటికీ తిరిగి ఓటర్ల వ్యక్తిగత సమాచారం సేకరించింది. ఓట్ల తనిఖీ కోసం వచ్చామంటూ సున్నిత వ్యక్తిగత సమాచారం రాబట్టింది. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు నంబర్లు, మొబైల్ ఫోన్ నంబర్, దానికి వచ్చిన ఓటీపీ వివరాలు చెప్పాలని అడగడంతో నెల్లూరులో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. నెల్లూరు నగరంలోని మూలాపేట డివిజన్లో ఓ ఇంటికి వెళ్లి వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న టీడీపీ ముఠా సభ్యుడ్ని స్థానికులు అడ్డుకున్నారు. తమ సున్నిత వ్యక్తిగత సమాచారం మీకెందుకంటూ నిలదీశారు. దీంతో ఆ డేటా దొంగ పరార్ కావడానికి ప్రయత్నించాడు. దీంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తన విద్యాసంస్థల్లో పనిచేసే చిరుద్యోగులను ముఠాగా ఏర్పాటు చేసి నారాయణ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. నెల్లూరు నగర నియోజకర్గంలో దాదాపు 75 వేల కుటుంబాలు ఉన్నాయి. 2.35 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరందరి సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు నారాయణ తన ముఠాను రంగంలోకి దింపినట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నారాయణకు రూ.కోట్లు కుమ్మరించినా ఓటమి తప్పలేదు. తన విద్యాసంస్థల ఉద్యోగులు, అధ్యాపకులను రంగంలోకి దింపి విచ్చలవిడిగా కోట్ల రూపాయలు వెదజల్లినా ఓటర్లు వైఎస్సార్సీపీకే పట్టం కట్టారు. గత ఎన్నికల్లో తాను నమ్మిన వాళ్లే ఓటుకు నోటు సక్రమంగా చేర్చలేదన్న అభిప్రాయంతో ఉన్న నారాయణ ఈ ధపా వారిని నమ్మకుండా ఓటర్ల బ్యాంకు ఖాతాలను సేకరించి వారి బ్యాంకు ఖాతాల్లోకే డబ్బు జమ చేయడానికి కుట్ర పన్నారని చెబుతున్నారు. పచ్చ దొంగల డేటా తస్కరణ ఇలా.. టీడీపీ పచ్చ దొంగల ముఠా ప్రతి ఇంటికి వెళ్లి ఓట్ల తనిఖీ కోసం వచ్చామంటూ చెబుతున్నారు. ఆ ఇంటి ఓటర్ల పేర్లు చదువుతున్నారు. ఆపై వారిని మాటల్లో పెట్టి సున్నిత వ్యక్తిగత సమాచారం దొంగిలిస్తున్నారు. ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు. ఒకవేళ ఆ కుటుంబం వైఎస్సార్సీపీ మద్దతుదారులైతే వారి ఓట్లు తొలగింపు ఫారం–7 నమోదు చేసి మీ ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వచ్చిందని.. దాన్ని చెప్పాలని దబాయిస్తున్నారు. కొందరు అమాయకులు ఓటీపీ చెబుతుండటంతో వారి ఓట్లు తొలగింపునకు ఫారం–7 నమోదవుతుంది. దాంతో పాటు ఓటర్ల బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే మాత్రం టీడీపీ నేత నారాయణ మీ ఖాతాలో నగదు జమ చేస్తాడని చెబుతూ మాయ చేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన పథకాల నగదు కూడా జమ అవుతుందని పచ్చి అబద్ధాలకు దిగుతున్నారు. ఓటీపీ క్లిక్ చేస్తే అంతే సంగతులు పట్టపగలే దొంగల్లా ప్రజల ఇళ్లల్లోకి చొరబడుతున్న టీడీపీ దొంగల ముఠా ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుని తమ దగ్గర ఉన్న ఒక యాప్‌లో నమోదు చేస్తున్నారు. మొబైల్ నంబర్‌కు ఓటీపీ, మేసేజ్ వస్తే దాన్ని క్లిక్ చేయమంటున్నారు. క్లిక్ చేస్తే ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ అంటూ కార్డు వస్తోంది. ఆ కార్టులో.. ‘ఐదేళ్లలో రూ.2.40 లక్షలు పొందేందుకు మీరు అర్హత సాధించారు.. మీకు అభినందనలు.. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభమవుతుంది’ అంటూ కనిపిస్తోంది. ఇటీవల అన్నమయ్య జిల్లా రాజంపేటలో మర్రి మౌనిక అనే మహిళను ఇలాగే టీడీపీ దొంగల ముఠా బురిడీ కొట్టించింది. అంతటితో ఆగటంలేదు.. చంద్రబాబు సంతకం చేశారంటూ ఒక గ్యారెంటీ పత్రాన్ని సైతం ఇస్తుండటం ఈ ముఠా బరితెగింపుకు నిదర్శనం. ఆలూ లేదు.. సూలూ లేదు.. అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు చంద్రబాబే అధికారంలోకి వచ్చేసినట్లు ప్రతిజ్ఞ చేస్తూ సంతకం చేసి మరీ ఇస్తుండటం వీరి పైత్యానికి పరాకాష్ట. ఎల్లో మీడియా తీరు మారదా? రాష్ట్రంలో పచ్చ ముఠా ఇళ్లలోకి చొరబడి ఓటర్ల వ్యక్తిగత సమాచారం తస్కరిస్తూ అడ్డంగా దొరికిపోతున్నా.. ఎల్లో మీడియా మాత్రం ఓటర్ల సవరణలు, చేర్పులు, తొలగింపుల్లో వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తప్పుడు రాతలు రాస్తోంది. ఇటీవల సర్వేపల్లిలో టీడీపీ ముఠా వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు ఫారం–7 నమోదు చేసి అడ్డంగా దొరికినా ఎల్లో మీడియా పచ్చ కళ్లకు కనిపించడం లేదు. -
డేటా భారతంలో లీకుల భాగోతం
రకరకాల సందర్భాల్లో, డిజిటల్ వేదికల్లో మనం అందజేస్తున్న వ్యక్తిగత సమాచారం ఏ మేరకు సురక్షితం? చాలాకాలంగా వేధిస్తున్న ఈ ప్రశ్న సోమవారం మరోసారి ముందుకొచ్చింది. కోవిడ్ టీకాకరణకు డిజిటల్ బుకింగ్ సర్వీస్ వేదికైన ప్రభుత్వ పోర్టల్ ‘కోవిన్’ డేటాబేస్ నుంచి ప్రముఖుల వ్యక్తిగత డేటా సైతం టెలిగ్రామ్ యాప్‌లో దర్శనమిచ్చి, మనవాళ్ళ సమర్థతను వెక్కిరించింది. మలయాళ మీడియా ‘ది ఫోర్త్’ తన యూట్యూబ్ వీడియోలో చూపిన డేటా చోరీ వైనం దిగ్భ్రాంతికరం. అనేక వార్తాసంస్థలూ సదరు టెలిగ్రామ్ బాట్‌ను పరీక్షించి, లీక్ నిజమేనని నిర్ధారించాయి. ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ దీనిపై విచారణ చేపట్టిందే తప్ప, కనీసం అప్రమత్తత జారీ చేయకపోవడం విచారకరం. ప్రభుత్వం అసలీ వార్తల్నే కొట్టిపారే యడం మరీ విడ్డూరం. కానీ, కోవిన్లోనే లభించే మైనర్లు, మేజర్ల సమాచారం ఈ లీకుల్లో ఉంది. ఇది అనుమానాల్ని పెంచుతోంది. సైబర్ సెక్యూరిటీ, డేటా చట్టాల తక్షణావసరాన్ని గుర్తు చేస్తోంది. గతంలో 2018లోనే మన ఆధార్ డేటాబేస్ నుంచి భారీగా లీక్ జరిగినట్టు వార్తలొచ్చాయి. ఆ హ్యాకింగ్‌ను ప్రభుత్వం ఇప్పటి దాకా బాహాటంగా ప్రస్తావించ లేదు. ‘కోవిన్’ సంగతికే వస్తే, 2021 జూన్‌లోనూ ‘కోవిన్’ పోర్టల్ హ్యాకైంది. 15 కోట్ల మంది భారతీయుల డేటా అంగట్లో అమ్ముడైంది. అప్పుడూ మన సర్కార్ అదేమీ లేదంది. ఇక గత ఏడాది జనవరిలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయి. అప్పుడూ డేటాబేస్ ‘సురక్షితంగా ఉంద’ని నేషనల్ హెల్త్ అథారిటీ వాదించింది. కానీ, అసలు గోప్యతా విధానమంటూ ఏదీ లేకుండానే ‘కోవిన్’ జనంలోకి వచ్చింది. చివరకు 2021లో ఢిల్లీ హైకోర్ట్ ఆదేశించాక, తప్పక విధాన ప్రకటన చేసింది. తాజా ఉదంతంలో ‘కోవిన్’ వేదిక నుంచి ‘నేరుగా ఉల్లంఘన’ జరగలేదని ప్రభుత్వం తెలివిగా జవాబిచ్చింది. గతంలో కోవిన్‌లో కాక వేరెక్కడో చోరీ అయిన సమాచారమే ఇదంటోంది. మరి ఒకప్పుడు ఇలాంటి చోరీలే జరగలేదన్న సర్కార్... ఇప్పుడు తాజా చోరీ సమాచారం పాతదే అంటోందంటే ఏది నిజం? ఏది అబద్ధం? అసలీ వార్తలన్నీ ‘ఆధారరహితం, తుంటరి చేష్టలు’ అన్నది ఎప్పటి లానే సర్కారు వారి పాత పాట. ఒకవేళ అదే నిజమనుకున్నా, ప్రభుత్వ సంస్థల చేతుల్లోని డిజిటల్ డేటా భద్రత, సత్వరమే వ్యక్తిగత డేటా రక్షణ చట్టం అవసరమైతే ఉంది. తాజా రచ్చ మరోసారి మనకు చెబుతున్న పాఠం అదే. ఢిల్లీలోని వైద్యసంస్థ ఎయిమ్స్ గత 8 నెలల్లో రెండుసార్లు సైబర్ దాడులకు గురైన సంగతి అంత తేలిగ్గా మర్చిపోలేం. వ్యక్తిగత ఆరోగ్య వివరాలు, అలాగే ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ సమాచారం ఉన్న ఇతర పత్రాలకు మరింత భద్రత అవసరమని తాజా ఘటన అప్రమత్తం చేసింది. ‘వందకోట్ల సార్లు యత్నించినా ఆధార్ భద్రతను ఛేదించడం అసాధ్యమంటూ 2018లో అప్పటి ఐటీ మంత్రి పార్లమెంట్ సాక్షిగా బల్లగుద్దారు. కానీ, మరిప్పుడు తాజా డేటా ఉల్లంఘనలో మొబైల్ నంబర్‌ను బట్టి ఆధార్ వివరాలు అంత కచ్చితంగా టెలిగ్రామ్ బాట్లో ఎలా వస్తున్నాయి? నిజానికి శరవేగంతో అన్నీ డిజిటలీకృతమవుతున్న ప్రపంచంలో కొత్త ముప్పు – వ్యక్తిగత డేటా లీకులు. అది ఇప్పుడు ప్రపంచమంతా ఉన్నదే. లక్షలాది రిటైల్ కస్టమర్లతో లావాదేవీలు నడిపే డొమినో ఇండియా నుంచి 18 కోట్ల మంది సమాచారం లీకు సహా అనేక పోర్టల్స్ నుంచి వ్యక్తిగత డేటా అంగట్లో సరుకు కావడం కొన్నేళ్ళుగా మన దేశంలో ఆనవాయితీ అయింది. 2020 నుంచి చూస్తే, అమెరికా, రష్యా, ఇరాన్‌ల తర్వాత ప్రపంచంలోనే అధికంగా 14 కోట్ల డేటా గోప్యత ఉల్లంఘనలు జరిగిన దేశం మనదే. ఇంత జరుగుతున్నా వ్యక్తిగత డేటా రక్షణపై దేశంలో ఇప్పటికీ సరైన చట్టం లేదు. భారత్‌లో 2017లో డేటా గోప్యత బిల్లు తొలిసారిగా రూపుదిద్దుకున్నప్పటి నుంచి ఇప్పటికీ కొత్త చట్టం పనులు నత్తనడక నడుస్తున్నాయి. గడచిన వర్షాకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని అనుకున్నా, చివరకు దాన్ని పక్కన పడేసి, 2022 డిసెంబర్లో కొత్త ముసాయిదాను తెచ్చారు. అనేక విడతల సలహా సంప్రతింపులు జరిపినా, కొత్త బిల్లు ఇంకా పార్లమెంట్ మెట్లెక్కనే లేదు. కాగా, కేంద్రం త్వరలోనే ప్రతిపాదిత ‘డిజిటల్ ఇండియా’ చట్టాన్నీ, అలాగే సవరించిన ‘డిజి టల్ డేటా పరిరక్షణ బిల్లు 2022’నూ పార్లమెంట్లో పెడుతుందని సమాచారం. అలాగే అన్ని రకాల ప్రభుత్వ డేటా నిల్వ, అందుబాటు, భద్రతా ప్రమాణాలకు ఉమ్మడి చట్రాన్నిచ్చే ‘నేషనల్ డేటా గవ ర్నెన్స్ పాలసీ’ని ఖరారు చేస్తున్నామని అమాత్యుల మాట. భవిష్యత్తులో అవి ఊరట కావచ్చేమో. అయితే, ఇకనైనా సంస్థలు తాము సేకరించిన వ్యక్తిగత డేటాను ఒక్కసారికే, సదరు నిర్ణీత ప్రయోజనానికే వాడుకొనేలా చట్టంలో కట్టుదిట్టాలు చేయడం కీలకం. సంస్థలపైనే బాధ్యత మోపాలి. అలాగే, డేటా చోరీ అనుమానం రాగానే సంభావ్య బాధితులందరికీ సదరు సంస్థలు సమాచారమివ్వడం తప్పనిసరి చేయాలి. దానివల్ల వారు వెంటనే పాస్వర్డ్లు మార్చుకొని, సురక్షితులయ్యే వీలుంటుంది. అయినా, ప్రభుత్వం చేతిలోని ‘కోవిన్’ లాంటి వాటి నుంచే డేటా లీకవుతూ పోతే పౌరులకిక ఏం నమ్మకం మిగులుతుంది? సమస్తం డిజిటలైన వేళ ఉల్లంఘనలు తప్పవనుకున్నా, నష్టాన్ని తగ్గించడం, డేటా గోప్యతకు చట్టబద్ధ రక్షణ కల్పించడం ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వ కనీస కర్తవ్యం. లీకైన కోట్లాది ప్రజల డేటా నేరగాళ్ళ చేతిలో పడితే ఆర్థికంగా, సామాజికంగా చెలరేగే సంక్షోభం అనూహ్యం. అందుకే, ఈ లీకుల్ని కొట్టిపారేసే వైఖరి వదిలి, సర్కార్ కఠిన చర్యలకు దిగాలి. ప్రతిదానికీ పుట్టుపూర్వోత్తరాలన్నీ సేకరించే ధోరణి మాని, వీలైనంత వరకు అతి తక్కువ డేటానే సేకరించే పద్ధతి మేలంటున్న పౌరసమాజం మాటల్నీ పట్టించుకోవాలి. -
డేటా లీకుపై పోలీసుల దూకుడు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన డేటా చౌర్యం కేసులో సైబరాబాద్ పోలీసులు దూకుడు పెంచారు. గత నెల రోజుల వ్యవధిలో సైబరాబాద్ పోలీసులు నాలుగు డేటా చౌర్యం, విక్రయం, నకిలీ కాల్ సెంటర్ నిర్వహణ కేసులను ఛేదించారు. వీటిల్లో 30 మంది నిందితులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయా కేసులలో నిందితులు విక్రయానికి పెట్టిన వ్యక్తిగత సమాచారం థర్డ్ పార్టీ ఏజెన్సీలు, ఈ–కామర్స్ సంస్థల నుంచి లీకైనట్లు గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆయా కంపెనీలను విచారించాలని నిర్ణయించింది. ఇప్పటికే బిగ్ బాస్కెట్, ఫోన్‌పే, ఫేస్బుక్, క్లబ్ మహీంద్రా, పాలసీ బజార్, యాక్సిస్ బ్యాంక్, అస్ట్యూట్ గ్రూప్, మ్యాట్రిక్స్, టెక్ మహీంద్రా, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు నోటీసులు జారీ చేసింది. తాజాగా మరో పది కంపెనీలకూ తాఖీదులు జారీ చేసింది. ఇప్పటికే సిట్ ముందు హాజరైన కంపెనీలు.. కస్టమర్ల డేటా, సమీకరణ, భద్రతా విధానాలు, థర్డ్ పార్టీ ఏజెన్సీలు తదితరాలపై సమగ్ర సమాచారాన్ని సమర్పించాయి. ఆయా సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు మరికొంత అదనపు సమాచారం కోసం మరోసారి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. నాలుగు రాష్ట్రాల్లో గాలింపు.. ప్రధానంగా హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్ దేశంలోని 70 కోట్ల మంది వ్యక్తులు, సంస్థలకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి, విక్రయానికి పెట్టడం సంచలనం సృష్టించింది. ఇందులో 2.60 లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగుల సమాచారంతో పాటు విద్యుత్, ఇంధనం వంటి ప్రభుత్వ శాఖలు, విద్యార్థులు, ప్రవాసులు, గృహిణులు, బ్యాంకు ఖాతాదారుల సమాచారం ఉండటం గమనార్హం. ఈ కేసులో నిందితుడు వినయ్ భరద్వాజ్ ఈ డేటాను గుజరాత్‌కు చెందిన అమీర్ సోహైల్, మదన్ గోపాల్ అనే వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. దీంతో వారి కోసం సిట్ బృందాలు గాలిస్తున్నాయి. ఢిల్లీ, రాజస్తాన్, హరియాణా, పశ్చిమ బెంగాల్లో నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నట్లు తెలిసింది. -
Pinduoduo: దగాకోరు యాప్
వినియోగదారుల సమాచారాన్ని దొంగిలిస్తాయన్న ఆరోపణలు చైనా మొబైల్ అప్లికేషన్ల(యాప్‌లు)పై ఎప్పటినుంచో ఉన్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇలాంటి యాప్‌లపై నిషేధం విధించాయి. చైనాలో బాగా జనాదరణ ఉన్న షాపింగ్ యాప్ ‘పిండువొడువో’ తమ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నట్లు ఇటీవలే వెల్లడయ్యింది. 75 కోట్ల మంది డేటాను సేకరించి, వ్యాపార అభివృద్ధి కోసం వాడుకున్నట్లు బయటపడడం సంచలనం సృష్టిస్తోంది. ఈ యాప్‌ను ఫోన్లలో ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే తొలగించడం చాలా కష్టమని సైబర్ సెక్యూరిటీ నిపుణు లు చెబుతుండడం గమనార్హం. చైనా ప్రభుత్వం ఇప్పటికీ పిండువొడువో యాప్‌పై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ► 75 కోట్ల మంది వినియోగదారుల విస్తృత డేటాను పిండువొడువో యాజమాన్యం వారికి తెలియకుండానే సేకరించింది. వారి ఆసక్తులు, అభిరుచులు, ప్రాధాన్యతలు ఏమిటో తెలుసుకుంది. ► వాటికి అనుగుణంగా నోటిఫికేషన్లు, ప్రక టనలు పంపించడానికి తన మెíషీన్ లెర్నింగ్ మోడల్‌ను మెరుగు పర్చు కుంది. అనుమతి లేకుండానే.. ► మన ఫోన్లలోని డేటాను ఇతరులు చూడాలంటే మన అనుమతి తప్పనిసరి. పిండువొడువో మాత్రం ఇలాంటి అనుమతుల జోలికి వెళ్లలేదు. ► యూజర్ల ఫోన్లలోకి పిండువొడువో యాజమాన్యం తమ యాప్ ద్వారా మోసపూరిత సాఫ్ట్వేర్(మాల్వేర్)ను జొప్పించింది. దాని సాయంతో ఫోన్లలోని లొకేషన్లు, కాంటాక్ట్‌లు, క్యాలెండర్లు, నోటిఫికేషన్లు, ఫొటో ఆల్బమ్స్ యాక్సెస్ చేసుకుంది. ► ఫోన్లలోని సిస్టమ్ సెట్టింగ్స్ మార్చే వెసులుబాటు సైతం సొంతం చేసుకుంది. ఫోన్లలో ఉండే ఇతర యాప్‌లపైనా నిఘా పెట్టింది. ► ఒక్కమాటలో చెప్పాలంటే యూజర్లకు తెలియకుండానే వారి ఫోన్లను స్వేచ్ఛగా వాడుకుంది. ► గూగుల్ సంస్థ మార్చి నెలలో తన ప్లేస్టోర్ నుంచి పిండువొడువోను తొలగించింది. ► తమ యాప్‌పై వచ్చిన ఆరోపణలను యాజమాన్యం ఖండించింది. ఏమిటీ పిండువొడువో? ► చైనాలో ఇంటర్నెట్ వినియోగించే ప్రజల్లో నాలుగింట మూడొంతుల మంది పిండువొడువో యాప్ ఖాతాదారులే. మార్కెట్ విలువ ప్రఖ్యాత షాపింగ్ యాప్ ‘ఈబే’ కంటే మూడు రెట్లు ఎక్కువ. ► గూగుల్ మాజీ ఉద్యోగి కోలిన్ హువాంగ్ 2015లో షాంఘైలో స్టార్టప్ కంపెనీగా పిండువొడువో యాప్‌ను 6.49.0 అనే వెర్షన్‌తో ప్రారంభించాడు. ఈ–కామర్స్ దిగ్గజాలైన అలీబాబా, జేడీ డాట్ కామ్‌కు పోటీగా ఈ కంపెనీ ప్రస్థానం ఆరంభమైంది. గూగుల్ ప్లేస్టోర్తోపాటు చైనా యాప్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది. ► పిండువొడువో నగరాలను కాకుండా తొలుత చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలనే తన లక్ష్యంగా చేసుకుంది. తక్కువ ఆదాయం కలిగిన ప్రజలకు చౌక ధరలకే వారు కోరుకున్న వస్తువులు చేరవేసింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూప్‌లకు భారీగా డిస్కౌంట్లు ఇచ్చింది. దాంతో అనతి కాలంలోనే పిండువొడువో జనంలోకి బాగా చొచ్చుకెళ్లింది. ► 2018 ఆఖరు నాటికి నెలవారీ యూజర్లలో మూడంకెల వృద్ధిని సాధించింది. అదే సంవత్సరం న్యూయార్క్ స్టాక్ మార్కెట్లో లిస్టయ్యింది. ► ఈ యాప్ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటుంది. అందుకే ఫోన్ల నుంచి సులభంగా తొలగించలేమని నిపుణులు వెల్లడించారు. ఎప్పుడు బయటపడింది? ► పిండువొడువో యాప్‌లో మాల్వేర్ ఉన్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి మాసాంతంలో అనుమానాలు బలపడ్డాయి. ► చైనా సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘డార్క్ నేవీ’ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. కానీ, ఆ యాప్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. ► యాప్ నిర్వాకంపై ఇతర పరిశోధకులు దృష్టి పెట్టారు. మాల్వేర్తో డేటాను దొంగిలిస్తున్న సంగతి నిజమేనని తేల్చారు. పిండువొడువో అనేది ఒక దొంగ యాప్ అని స్పష్టం చేశారు. ► ఆరోపణలు వెల్లువెత్తడంతో యాప్ యాజమాన్యం అప్రమత్తమైంది. మార్చి 5న వెర్షన్ 6.50.0 పేరిట కొత్త అప్డేట్ను విడుదల చేసింది. చాలామంది ఇంజనీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లను తమ అనుబంధ సంస్థ అయిన ‘టెమూ’కు తరలించింది. ► 20 మందితో కూడిన సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ల బృందం ఇప్పటికీ పిండువొడువోలో కొనసాగుతోంది. చైనా ప్రభుత్వం మౌనమెందుకో? ► కొత్త వెర్షన్ కూడా సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. అందులో అండర్లైయింగ్ కోడ్ ఉందని, డేటా చౌర్యం కోసం దాన్ని ఎప్పుడైనా రీయాక్టివేట్ చేయొచ్చని హెచ్చరిస్తున్నారు. ► చట్ట ప్రకారం చూస్తే పిండువొడువోను నిషేధించాల్సిందేనని నిపుణులు తేల్చిచెబుతున్నారు. కానీ, ఆ యాప్‌పై ఇప్పటికీ చర్యల్లేవు. యాప్ కార్యకలాపాలపై బహిరంగంగా ఏనాడూ స్పందించలేదు. ► చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న యాప్‌ల పేర్లతో కూడిన జాబితాను చైనా సమాచార సాంకేతిక శాఖ తరచుగా విడుదల చేస్తోంది. ఈ జాబితాల్లో పిండువొడువో పేరును ఒక్కసారి కూడా చేర్చలేదు. ► పిండువొడువో అనుబంధ యాప్ అయిన ‘టెమూ’ అమెరికాలో డౌన్లోడ్లలో అగ్రస్థానంలో ఉంది. పశ్చిమ దేశాల్లోనూ విస్తరిస్తోంది. ఇప్పుడు దీనిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
డేటా చోరీ సూత్రధారి దొరికాడు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద డేటా చౌర్యం కేసులో కీలక సూత్రధారిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశ జనాభాలో 50 శాతం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి విక్రయిస్తున్న ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 24 రాష్ట్రాలు, 8 మెట్రో నగరాలకు చెందిన సుమారు 70 కోట్ల మంది రహస్య సమాచారాన్ని తస్కరించినట్లు పోలీసులు గుర్తించారు. రక్షణ, విద్యుత్, ఇంధన శాఖ, జీఎస్టీ, ఆర్టీవోలతోపాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రవాసులు, టీచర్లు, వైద్యులు, లాయర్లు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు.. ఇలా 104 కేటగిరీలకు చెందిన ప్రజలు, సంస్థల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని నిందితుడు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాలివే.. వెబ్ డిజైనర్ నుంచి... హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్ వెబ్ డిజైనర్‌గా పనిచేసేవాడు. ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయంతో డేటా సమీకరణ, విక్రయం గురించి తెలుసుకున్నాడు. వెబ్ డిజైనింగ్ కోసం తన వద్దకు వచ్చే కస్టమర్ల వివరాలను మార్కెటింగ్ ఏజెంట్లకు, సైబర్ నేరస్తులకు విక్రయించి సొమ్ము చేసుకొనేవాడు. అప్పనంగా డబ్బు వస్తుండటంతో ప్రజలు, సంస్థల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని సైతం తస్కరించాలని నిర్ణయించుకున్నాడు. డేటా సమీకరణ కోసం ఏకంగా 4.5 లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. ఇందులో అమీర్ సొహైల్, మదన్ గోపాల్‌లు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. విక్రయం కోసం వెబ్సైట్.. తస్కరించిన డేటాను విక్రయించేందుకు ఇన్స్పైర్ వెబ్జ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. కస్టమర్లను ఆకర్షించేందుకు సోషల్ మీడియాలో ప్రచారం చేసేవాడు. క్లౌడ్ డ్రైవ్ లింక్‌ల ద్వారా మాత్రమే డేటాను విక్రయించేవాడు. ఇలా గత 8–12 నెలలుగా నిందితుడు డేటా తస్కరణ, విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు వినయ్ నుంచి రెండు సెల్ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న అమీర్, మదన్‌ల కోసం సైబరాబాద్ పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. నగరానికి చెందిన ఓ వ్యక్తి నెల క్రితం ఓపెన్ సోర్స్ వెబ్సైట్లో తన వ్యక్తిగత సమాచారం చూసి కంగుతిన్నాడు. వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సమాచారం ఎలా బహిర్గతమైందో కూపీ లాగారు. 10 రోజుల క్రితం రెండు కేసులలో 16 మంది డేటా చోరీ నిందితులను పట్టుకున్నారు. వారిని కస్టడీలోకి తీసుకొని విచారించగా.. వినయ్ భరద్వాజ్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అతనికి నోటీసులు జారీ చేసి అరెస్టు చేశారు. ఈ డేటాతో ఏం చేసేవారంటే.. మార్కెటింగ్ బృందాలు, ఏజెన్సీలు, సైబర్ నేరస్తులు నిందితుడి నుంచి డేటాను కొనుగోలు చేసేవారు. ఉత్పత్తుల ప్రచారం, మార్కెటింగ్ కోసం బల్క్ మెసేజ్‌లు పంపించడం కోసం ఏజెన్సీలు డేటాను కొనుగోలు చేశాయి. సైబర్ నేరస్తులు కొనుగోలు చేసిన డేటాతో ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడేవారు. ఎవరెవరి డేటా లీకైంది? ఏ సంస్థ, వ్యక్తులు లీకు చేశారు? వంటి సమస్త సమాచారాన్ని ప్రజలకు ఎలా చేరవేయాలనే అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నామని సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్) కల్మేశ్వర్ శింగేన్వర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజల డేటా కూడా.. నిందితుడు విక్రయించిన డేటాలో తెలంగాణ, ఏపీ ప్రజల డేటా కూడా ఉంది. హైదరాబాద్‌కు చెందిన 56 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 2.10 కోట్ల మంది వ్యక్తిగత వివరాలను నేరస్తుడు విక్రయానికి పెట్టాడు. పన్ను చెల్లింపుదారులు, కంపెనీ సెక్రటరీలు, ఆడిటర్లు, ఉద్యోగస్తుల డేటా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో వ్యక్తుల పేరు, ఫోన్ నంబరు, చిరునామా, ఈ–మెయిల్ ఐడీలు తదితర వివరాలున్నాయి. రక్షణ శాఖ ఉద్యోగుల సమాచారం లీక్.. ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన 2.55 లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగుల రహస్య సమాచారాన్ని నేరస్తుడు తస్కరించి విక్రయానికి పెట్టాడు. ఇందులో ఉద్యోగుల వ్యక్తిగత వివరాలతోపాటు ర్యాంకు, పనిచేస్తున్న చోటు, విభాగం వంటి వివరాలున్నాయి. దీంతోపాటు ఎల్ఐసీ, విద్యుత్, ఇంధన శాఖ వంటి ప్రభుత్వ సంస్థల సమాచారం కూడా ఉంది. అలాగే 1.26 లక్షల మంది ప్రవాసులు, 5 లక్షల మంది హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ)ల డేటా కూడా అంగట్లో విక్రయానికి పెట్టేశాడు. విద్యార్థుల డేటా నేరస్తుల చేతుల్లో.. విద్యాసంస్థలతోపాటు విద్యార్థుల డేటా కూడా నేరస్తుల చేతుల్లోకి చేరింది. బైజూస్, వేదాంతు వంటి ఆన్లైన్ విద్యాసంస్థలకు చెందిన 18 లక్షలు మంది విద్యార్థులు, 1.8 లక్షల మంది నీట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు, 30 లక్షల మంది సీబీఎస్ఈ (10, 12వ తరగతి), 3.5 కోట్ల మంది ఇతర విద్యార్థుల డేటాను నేరస్తులు విక్రయానికి పెట్టారు. -
16.8 కోట్ల మంది డేటా చోరీ!
గచ్చిబౌలి: వందలు.. వేలు.. లక్షలు కాదు.. ఏకంగా కోట్లాది మందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం చోరీకి గురైంది. రక్షణ శాఖ సహా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన లక్షలాది మంది ప్రభుత్వాధికారులు, ఉద్యోగుల డేటా అంగడి సరుకుగా మారింది. మహిళలు, వృద్ధులు, విద్యార్థుల వివరాలూ కేటుగాళ్లకు చేరాయి. పాన్, ఫోన్ నంబర్లు, వాట్సాప్, ఫేస్బుక్ యూజర్ల వివరాలు క్రిమినల్స్ పరమయ్యాయి. దేశ భద్రతకు ముప్పు కలిగించే స్థాయిలో డేటా చోరీకి పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును సైబర్‌క్రైం పోలీసులు రట్టు చేశారు. దేశవ్యాప్తంగా 16.80 కోట్ల మందికి చెందిన వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని దొంగిలించి విక్రయిస్తున్న కేటుగాళ్ల ఆటకట్టించారు. ఢిల్లీ శివార్లలోని నోయిడా కేంద్రంగా ఈ దందా సాగిస్తున్న ముఠాలోని ఏడుగురు సభ్యులను అరెస్టు చేశారు. గురువారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ కేసు వివరాలను వెల్లడించారు. రక్షణ శాఖలోని వివిధ హోదాల్లో పనిచేసే అధికారులు, నీట్ విద్యార్థులు, డీమ్యాట్ ఖాతాదారులు, ఐటీ సంస్థల ఉద్యోగులు, వాట్సాప్, ఫేస్బుక్ వినియోగదారులు, టెలికం, ఫార్మా కంపెనీలు, సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల డేటా సహా మొత్తం 140 కేటగిరీలకు చెందిన సమాచారాన్ని నిందితులు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. రక్షణ శాఖకు చెందిన (డిఫెన్స్ ఫోర్స్ ఢిల్లీ ఎన్సీఆర్ డేటాబేస్)కు చెందిన 2.55 లక్షల మంది డేటా సైతం చోరీకి గురికావడంతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డేటా చోరీలో జస్ట్ డయల్ అనే సెర్చ్ ఇంజన్ పాత్ర ఉందని, ఈ కేసులో ఆ సంస్థ వారినీ విచారిస్తామని ఆయన పేర్కొన్నారు. నిందితులు వీరే... యూపీ పరిధిలోకి వచ్చే నోయిడాలో డేటా మార్ట్ ఇన్ఫోటెక్, గోబల్ డేటా ఆర్ట్స్, ఎంఎస్ డిజిటల్ గ్రో అనే కంపెనీల (కాల్‌సెంటర్లు) ద్వారా నిందితులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రధాన నిందితుడు ఏ1 కుమార్ నితీష్ భూషణ్‌తోపాటు టెలికాలర్ కుమారి పూజ, డేటా ఎంట్రీ ఆపరేటర్ సుశీల్ తోమర్, క్రెడిట్ కార్డుల డేటా విక్రయించే అతుల్ సింగ్, ఎంఎస్ గ్రో కంపెనీలో సేకరించిన డేటాను విక్రయించే ముస్కాన్ హసన్, గ్లోబల్ డేటాఆర్ట్స్‌లో జస్ట్ డయల్ ద్వారా డేటాను విక్రయించే సందీప్ పాల్, బల్క్ మెసేజ్‌లు పంపే జియా ఉర్ రెహమాన్లను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 సెల్ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, 2 సీపీయూలు, 140 కేటగిరీలలో డేటా చోరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయా కార్యాలయాల్లో ప్రజల పాన్, మొబైల్, టెలికం, ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ, పెట్రోలియం కంపెనీలు, బ్యాంకుల డేటా, వాట్సాప్, ఫేస్బుక్ యూజర్ల డేటాను పోలీసులు కనుగోన్నారు. నిందితులు ఇప్పటివరకు సుమారు 100 మంది సైబర్ క్రిమినల్స్‌కు డేటాను విక్రయించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అలాగే 50 వేల మంది పౌరులకు చెందిన సమాచారాన్ని కేవలం రూ. 2 వేలకు విక్రయించినట్లు గుర్తించామన్నారు. డేటా చోరీపై సైబర్‌క్రైం పోలీసులకు అందిన పలు ఫిర్యాదుల ఆధారంగానే దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నామన్నారు. భారీగా డేటా చోరీ... నిందితులు చోరీ చేసిన డేటాలో 1.47 కోట్ల కార్ల యజమానుల, డొమైన్ వాయిస్ డేటాబేస్ 3.47 కోట్లు, మొబైల్ నంబర్ల డేటాబేస్ 3 కోట్లు, స్టూడెంట్ డేటాబేస్ 2 కోట్లు, వాట్సాప్ యూజర్లు 1.2 కోట్ల మంది డేటా చోరీ గురైంది. అలాగే జాబ్ సీకర్స్ డేటాబేస్ 40 లక్షలు, సీబీఎస్ఈ 12వ తరగతికి చెందిన 12 లక్షల మంది విదార్థులు, సివిల్ ఇంజనీర్ల వివరాలు 2.3 లక్షలు, డెబిట్ కార్డుల సమాచారం 8.1 లక్షలు, సీనియర్ సిటిజన్స్ 10.6 లక్షలు, వెబ్సైట్ ఓనర్స్ 17.4 లక్షలు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ డేటా చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. గుర్తించిన అంశాలు... ► పలు ఆర్థిక సంస్థలు, సోషల్ మీడియా, జస్ట్ డయల్ వంటి సంస్థలు ప్రజల అనుమతి లేకుండానే డేటాను సేకరిస్తున్నాయి. ► ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో సేవలందించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు, వ్యక్తుల ద్వారా డేటా చోరీకి గురవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ► గోప్యంగా ఉంచాల్సిన డేటా భద్రంగా ఉందోలేదో సర్వీసు ప్రొవైడర్లు తనిఖీ చేయట్లేదని తేలింది. ► జస్ట్ డయల్ లాంటి సంస్థల్లో డేటా విక్రయానికి అందుబాటులో ఉంది. పోలీసుల సూచనలు... ► మీ డేటాను ప్రైవేటు కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నట్లు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయండి. ► క్రెడిట్ కార్డులు, బ్యాంకింగ్ వివరాలను అపరిచితులకు, సంస్థలకు చెప్పొద్దు. ► మొబైల్, కంప్యూటర్, యాప్‌లు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కేసు దర్యాప్తు సిట్‌కు బదిలీ దేశ భద్రతకు సంబంధించిన సమాచారం ముడిపడి ఉన్నందున డేటా చోరీ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్లు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇందుకోసం డీసీపీ (క్రైమ్స్) కల్మేశ్వర్ నేతృత్వంలో ‘సిట్’ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆ టీమ్‌లో సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ రితిరాజ్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఇతర అధికారులు ఉంటారని తెలిపారు. క్రెడిట్ కార్డుదారుల డేటా చోరీ ముఠా అరెస్ట్ గచ్చిబౌలి: బ్యాంకుల్లో డేటా చోరీ చేసే ముఠాను సైబర్‌క్రైం పోలీసులు అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. క్రెడిట్ కార్డుల వెరిఫికేషన్ చేస్తున్న థర్డ్ పార్టీకి చెందిన సిబ్బంది డేటాను చోరీ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన 1,780 మంది కస్టమర్ల డేటాతోపాటు ఎస్బీఐకి చెందిన 140 మంది కస్టమర్ల డేటా చోరీకి గురైందన్నారు. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఈ దందాలో ప్రధాన నిందితుడు కఫిన్ అహ్మద్, మహ్మద్ సమాల్, మహ్మద్ అసీఫ్, చిరాగ్, విరేంద్ర సింగ్, ప్రదీప్ వాలియా, ఆకాశ్‌నిర్వాన్, విరాట్ పురి, అతీత్ దాస్‌లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 13 సెల్పోన్లు, ల్యాప్‌టాప్, క్రెడిట్ కార్డుల డేటా స్వాధీనం చేసుకున్నారు. -
హైదరాబాద్: డేటా చోరీ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ వ్యవహారంగా సైబరాబాద్ పోలీసులు భావిస్తున్న కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా ఈ కేసును సిట్‌కు బదిలీ చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. ఐపీఎస్ అధికారి పర్యవేక్షణతో సిట్ దర్యాప్తు ముందుకు సాగనున్నట్లు తెలిపారాయన. ఇక కేసులో కీలకంగా ఉన్న జస్ట్ డయల్‌కు నోటీసులు జారీ చేయడంతో పాటు విచారించనున్నట్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు బయటపెట్టారు. సుమారు 16 కోట్ల 80 లక్షల మంది డేటా చోరీ జరిగిందని చెబుతోంది సైబరాబాద్ పోలీస్ విభాగం. మరో పది కోట్ల మంది డేటా కొట్టేసినట్లు కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. వక్తిగత వివరాలతో పాటు అంత్యంత గోప్యంగా ఉండాల్సిన వివరాలు, సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లాయని, కేసులో లీడ్స్ ఉన్నాయని, ఎక్కడి నుంచి లీక్ అయ్యిందనే దర్యాప్తులో తేలాల్సి ఉందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చెబుతున్నారు. అలాగే.. ఆర్మీకి సంబంధించిన డేటా(సిబ్బంది పేర్లు, ర్యాంకులు, పోస్టింగ్ ఇతర వివరాలు) సైతం లీక్ అయ్యిందని చెప్పారాయన. సాధారణ పౌరుల నుంచి ఎవరైనా కానీ.. డేటా తీసుకున్నప్పుడు సేఫ్‌గా, సెక్యూర్‌గా ఉంచాల్సిన బాధ్యత ఉందని సీపీ స్టీఫెన్ రవీంద్ర చెబుతున్నారు. -
30 లక్షల ఓట్లపై డేటా దొంగల గురి!
సాక్షి, అమరావతి: కంచే చేను మేసింది! ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచి కస్టోడియన్‌గా వ్యవహరించాల్సిన వారే సున్నితమైన డేటాను ఆగంతకులు, సంస్థలకు చేరవేశారు. 2019 ఎన్నికల సందర్భంగా 30 లక్షల ఓట్లను తొలగించేందుకు టీడీపీ ప్రభుత్వ పెద్దలు పన్నిన పన్నాగం, అక్రమాల వ్యవహారం బట్టబయలైంది. స్టేట్ డేటా సెంటర్ కేంద్రంగా గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలకు సమాచారాన్ని చేరవేసినట్లు నిర్ధారణ అయింది. డేటా చౌర్యంపై విచారించేందుకు శాసనసభ నియమించిన సభాసంఘం విచారణలో చంద్రబాబు సర్కారు బరితెగింపు బట్టబయలైంది. టీడీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పన్నాగంతోనే డేటా చోరీకి తెగబడినట్లు తేలింది. సభా సంఘం విచారణలో వెల్లడైన అంశాలు సంగ్రహంగా... స్టేట్ డేటా సెంటర్ కేంద్రంగా.. చంద్రబాబు సర్కారు ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించిన ప్రజల కీలక సమాచారం పెద్ద ఎత్తున ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు చేరింది. ఏకంగా స్టేట్ డేటా సెంటర్ నుంచే సున్నితమైన ఈ సమాచారాన్ని అక్రమంగా చేరవేశారు. స్టేట్ డేటా సెంటర్లో 264 కంప్యూటర్లు / సర్వర్లు ఉండగా 18 సర్వర్లను ప్రజా సాధికారిక సర్వే కోసం వినియోగించారు. ఆ సర్వర్ల నుంచే గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలకు భారీగా డేటాను చేరవేశారు. 18 సర్వర్లలో నాలుగు సర్వర్ల నుంచి ఏకంగా 24.3 టెరా బైట్ల సమాచారాన్ని చేరవేసినట్లు సభా సంఘం విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో మొత్తం 18 సర్వర్ల నుంచి ఇంకెంతో సమాచారాన్ని అక్రమంగా బదలాయించారో అంతుబట్టడం లేదు. 2018 నవంబర్ 30 నుంచి 2019 మార్చి 31 మధ్య ఈ తతంగాన్ని నడిపారు. ► టీడీపీ సర్కారు స్టేట్ డేటా సెంటర్‌కే పరిమితమవ్వాల్సిన సమాచారాన్ని ఇతర శాఖల కార్యాలయాలకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆ శాఖలు వాటి సర్వర్లను స్టేట్ డేటా సెంటర్లో కాకుండా బయట నిర్వహించాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ఉన్నతాధికారులు సభా సంఘానికి నివేదించారు. అంటే ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించి స్టేట్ డేటా సెంటర్లో ఉంచాల్సిన సమాచారాన్ని ముందస్తు వ్యూహం ప్రకారమే బయటకు కార్యాలయాలకు కూడా అందుబాటులోకి తెచ్చారన్నది స్పష్టమైంది. అక్కడి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలకు ఆ సమాచారాన్ని తరలించారు. ► సర్వర్ల నుంచి డేటాను ఎక్కడికి తరలించారన్నది కీలకంగా మారింది. అనుమతి లేకుండా గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలకు చెందిన ఐపీ అడ్రస్‌లకు డేటాను బదిలీ చేశారని విచారణలో వెల్లడైంది. వాటి ఐపీ అడ్రస్‌లను ఎవరు నిర్వహిస్తున్నారో గూగుల్ సంస్థ కూడా గుర్తించలేకపోవడం గమనార్హం. పక్కాగా తప్పుడు చిరునామాలు, వివరాలతో నకిలీ ఐపీ అడ్రస్‌లతో ఉన్న గూగుల్ ఖాతాల్లోకి డేటాను చేరవేశారన్నది స్పష్టమైంది. ► ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించిన ప్రజల సమాచారానికి స్టేట్ డేటా సెంటర్, ఆర్టీజీఎస్ కస్టోడియన్‌గా ఉన్నాయి. అంటే ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత వాటిదే. కానీ ఆ శాఖల నుంచే సమాచారం బయటకు వెళ్లిందంటే కచ్చితంగా అత్యున్నత స్థాయి వ్యక్తుల అనుమతితోనే చేసి ఉంటారని సభా సంఘం నిర్ధారించింది. అత్యున్నత స్థాయి వ్యక్తుల అనుమతి లేకుండా ఆ సమాచారాన్ని బయటకు తరలించడం సాధ్యపడదని స్టేట్ డేటా సెంటర్ ఉన్నతాధికారులు సభా సంఘానికి స్పష్టం చేయడం గమనార్హం. అంటే డేటా చోరీ పన్నాగం టీడీపీ ముఖ్య నేతల కనుసన్నల్లోనే సాగిందన్నది సుస్పష్టమైంది. క్రిమినల్ కేసులకు సిద్ధం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని శాసనసభా సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది. గత సర్కారు హయాంలో డేటా చోరీకి పాల్పడ్డారని శాసనసభకు మధ్యంతర నివేదిక సమర్పించిన సభా సంఘం రెండో దశ విచారణ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఫోన్ కాల్స్ ట్యాపింగ్, డేటా చోరీ కోసం నిఘా పరికరాల కొనుగోలుపై ప్రధానంగా దృష్టి సారించనుంది. అప్పటి ఐటీ శాఖ బాధ్యులు, పోలీస్ ఉన్నతాధికారులు, ఆర్టీజీఎస్, స్టేట్ డేటా సెంటర్ ఉన్నతాధికారులతో పాటు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలను కూడా సభా సంఘం విచారించనుందని తెలుస్తోంది. అత్యున్నతస్థాయి వ్యక్తుల ప్రమేయంతోనే డేటాను అనధికారిక వ్యక్తులు, సంస్థలకు తరలించినట్లు ఇప్పటికే సభా సంఘం విచారణలో వెల్లడైంది. దీంతో వారిని విచారణకు పిలవనుంది. మరోవైపు ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసుల నమోదుకు కూడా రంగం సిద్ధమవుతోంది. గోప్యంగా ఉంచాల్సిన ప్రభుత్వ అధికారిక సమాచారం, ప్రజల వ్యక్తిగత వివరాలను అక్రమంగా గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలకు చేరవేయడం రాజ్యాంగ విరుద్ధం. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగకరమైన అంశం. దీన్ని సభా సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది. 30 లక్షల ఓట్ల తొలగింపు కుట్ర – టీడీపీ సేవామిత్ర యాప్ చేతికి డేటా సెంటర్ సమాచారం: భూమన – డేటా చౌర్యంపై శాసనసభకు ఉపసంఘం మధ్యంతర నివేదిక రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా బయటకు తరలించి 2016–19 మధ్య కాలంలో టీడీపీ సర్కారు డేటా చౌర్యానికి పాల్పడినట్లు విచారణలో నిర్ధారణ అయిందని శాసనసభ ఉపసంఘం అధ్యక్షుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న 30 లక్షల మందికిపైగా ఓటర్లను తొలగించేందుకు యత్నించారని నిగ్గు తేలిందన్నారు. ఉపసంఘం మధ్యంతర నివేదికను మంగళవారం శాసనసభకు సమర్పించిన అనంతరం ఆయన సభలో మాట్లాడారు. వివిధ శాఖల అధిపతులు, ఇతర అధికారులతో నాలుగుసార్లు సమావేశమై ఈ వ్యవహారం లోతుల్లోకి వెళ్లి విచారించినట్లు తెలిపారు. స్టేట్ డేటా సెంటర్లో ఉండాల్సిన ప్రజల సమాచారాన్ని టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్ ద్వారా దుర్వినియోగం చేసి ఇతరులను అందజేశారని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. టీడీపీకి ఓట్లు వేయని వారి సమాచారాన్ని స్టేట్ డేటా సెంటర్ల ద్వారా సేకరించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై మరికొంత మందిని విచారించి సమాచారాన్ని సేకరిస్తామన్నారు. ప్రస్తుతానికి మధ్యంతర నివేదికను శాసనసభకు సమర్పిస్తున్నట్లు తెలిపారు. -
డేటాదొంగ బాబు.. డేరాబాబా కన్నా డేంజర్: మంత్రి రోజా
సాక్షి, అమరావతి: డేటా చోరీపై హౌజింగ్ కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికతో టీడీపీ నేతల గుండెలు జారిపోయాయని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజల డేటాను ప్రజాసాధికారత సర్వే పేరుతో.. సేవా మిత్ర యాప్ ద్వారా తెలుగు దేశం నాయకులకు అందించిందని, తద్వారా దుష్టరాజకీయానికి తెర తీసిందని ఆమె మండిపడ్డారు. సభాసంఘం కమిటీ ఇవాళ అసెంబ్లీకి సమర్పించిన మధ్యంతర నివేదికలో.. టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ నిర్ధారణ కావడంపై ఆమె స్పందించారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. ‘హౌజ్ కమిటీ నివేదికపై స్టే తెచ్చుకోకుండా కోర్టుకు వెళ్తే గనుక చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి రోజా జోస్యం పలికారు. ఈ డేటా దొంగ.. డేరాబాబా కన్నా డేంజర్ అనే విషయం అందరికీ స్పష్టం అవుతోందని ఆమె అన్నారు. ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్‌ను చంద్రబాబు కొనుగోలు చేశారనే విషయాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ధృవీకరించిన విషయాన్ని మంత్రి రోజా గుర్తు చేశారు. ఓటర్లను తొలగించడమే కాకుండా.. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్ష సభ్యులను బ్లాక్మెయిల్ చేసి రాజకీయంగా లొంగదీసుకునే ప్రయత్నం కూడా జరిగిందని మంత్రి రోజా ఆరోపించారు. నారా లోకేష్‌ను చూస్తే జాలేస్తోందని, ఎన్టీఆర్‌గారి మీద లేనిపోని అభిమానం కురిపిస్తూ అన్నాక్యాంటీన్ల మీద రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. గత ప్రభుత్వం పథకాల పేరుతో దోచుకుందని.. ఇప్పుడు సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాసంక్షేమం గురించి ఆలోచిస్తుందని, లేనిపోని విమర్శలు మాని ఆ పథకాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయమని ఆమె టీడీపీకి హితవు పలికారు. ఇదీ చదవండి: ఇది టీడీపీ భారీ కుట్రే: ఏపీ అసెంబ్లీ హౌజ్ కమిటీ -
డేటా చోరీ బాధ్యులను విచారణకు పిలిపిస్తాం
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016–19 మధ్య ప్రజల వ్యక్తిగత డేటా చోరీకి బాధ్యులైనవారిని విచారణకు పిలిపిస్తామని శాసససభ ఉపసంఘం చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. డేటా చోరీ, పెగసస్, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై విచారణ కోసం ఏర్పాటుచేసిన శాసనసభ ఉపసంఘం హోం, ఐటీ శాఖలతోపాటు ఇతర అధికారులతో వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం సమావేశమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల వ్యక్తిగత డేటా, ప్రభుత్వ లబ్ధిదారుల వివరాలు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వడంపై వివరాలు సేకరించింది. గత సమావేశంలో ఉపసంఘం అడిగిన వివరాలను హోం, ఐటీ శాఖల ఉన్నతాధికారులు సమర్పించినట్టు తెలుస్తోంది. అనంతరం ఉపసంఘం చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగంలోని వ్యక్తిగత గోప్యత హక్కుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. దీంతో ప్రజల భద్రతకు కూడా ప్రమాదకరంగా పరిణమించిందన్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లే ఉంచి వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లను తొలగించేందుకు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా యత్నించారని చెప్పారు. గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. ప్రజల వ్యక్తిగత డేటా దొంగిలించి అడ్డదారుల్లో రాజకీయ లబ్ధిపొందేందుకు కుట్రపన్నారని చెప్పారు. ఈ అంశంపై శాసనసభ ఉపసంఘం సమగ్రంగా విచారిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు కోటారు అబ్బయ్యచౌదరి, మొండితోక జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
డేటా చోరీ జరిగింది.. అవసరమైతే కొందరిని హౌజ్ కమిటీ ముందుకు పిలుస్తాం: భూమన
సాక్షి, అమరావతి: పెగాసెస్, ఫోన్ ట్యాపింగ్‌పై హౌజ్ కమిటీ మంగళవారం భేటీ అయ్యింది. చైర్మన్ భూమన కరుణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హౌస్ కమిటీ సభ్యులు కోటారు అబ్బయ్య చౌదరి, మొండితోక జగన్మోహన్ రావు పాల్గొన్నారు. హోం, ఐటీశాఖల నుంచి హౌజ్ కమిటీ సమాచారం సేకరించింది. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. 2016-2019 మధ్య అప్పటి ప్రభుత్వం వ్యక్తుల ప్రైవేటు భద్రతకు ముప్పు వాటిల్లే చర్యలు తీసుకుందని ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్నవారి ఓట్లను ఉంచి ఇతరుల ఓట్లు తొలగించిందనే ఆరోపణలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం దుర్మార్గపు చర్చలు తీసుకుందని మండిపడ్డారు. కావాలనే డేటా దొంగిలించి రాజకీయ లబ్ధి పొందినట్లు స్పష్టత వచ్చిందన్నారు. ఏపీ, తెలంగాణలో డేటా చోరీ జరిగిందని తెలంగాణ ప్రభుత్వం కూడా దర్యాప్తు చేసిందన్నారు. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటాను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చిందని విమర్శించారు. డేటా చోరీ జరిగిందన్న భూమన కరుణాకర్‌రెడ్డి అవసరమైతే కొందరిని హౌస్ కమిటీ ముందుకు పిలుస్తామన్నారు. చదవండి: వైఎస్సార్సీపీ ప్లీనరీలో పార్టీ నియమావళికి సవరణలు -
ఫేస్బుక్ డేటా చోరీపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: దాదాపు 18 నెలల ప్రాథమిక విచారణ అనంతరం సుమారు 5.62 లక్షల మంది భారతీయ ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని అక్రమంగా వాడుకోవడంపై కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ), గ్లోబల్ సైన్స్ రీసెర్చ్(జీఎస్ఆర్) సంస్థలపై సీబీఐ శుక్రవారం కేసు నమోదు చేసింది. ఐపీసీ, ఐటీ చట్టాల్లోని సంబంధిత సెక్షన్ల కింద బ్రిటన్‌కు చెందిన ఆ రెండు సంస్థలపై కేసు నమోదు చేశామని సీబీఐ వెల్లడించింది. ఫేస్బుక్ వినియోగదారుల డేటాను ఆయా సంస్థలు అక్రమంగా వినియోగించాయన్న వార్తలపై 2018 జులైలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరపి, సీబీఐ కేసు నమోదు చేసింది. పరిశోధన అవసరాల కోసం కొన్ని వర్గాల వినియోగదారుల సమాచారం ఇవ్వాలని కోరుతూ గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ సంస్థ తరఫున అలెక్జాండర్ కోగన్ ఫేస్‌బుక్‌ను అభ్యర్థించారు. ఆ ఆనుమతితో ‘దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్’ పేరుతో ఒక యాప్‌ను రూపొందించి, ఫేస్బుక్ అనుమతించిన 335 మంది వినియోగదారులతో పాటు అక్రమంగా, వారి స్నేహితుల జాబితాలోని వ్యక్తుల సమాచారం కూడా సేకరించారు. ఆ సమాచారాన్ని ‘కేంబ్రిడ్స్ అనలిటికా’కు అమ్మేశారు. భారత్‌లో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపేలా ఆ సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా ప్రొఫైలింగ్ చేసిందని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. అమెరికాలోని వినియోగదారుల సమాచారం మాత్రమే జీఎస్ఆర్ నుంచి తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వానికి కేంబ్రిడ్జ్ ఎనలిటికా తెలిపింది. -
చైనా హ్యాకర్లపై కేసు
వాషింగ్టన్: అమెరికాలోని, పలు ఇతర దేశాల్లోని 100కి పైగా కంపెనీలు, సంస్థల వెబ్‌సైట్స్‌ను హ్యాక్ చేసి, సున్నితమైన, విలువైన సమాచారం తస్కరించారని ఆరోపిస్తూ ఐదుగురు చైనా పౌరులపై అమెరికా కేసు నమోదు చేసింది. వారు హ్యాక్ చేసిన వాటిలో భారత ప్రభుత్వ విభాగాలకు చెందిన పలు వెబ్సైట్లు ఉన్నాయి. బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో ఆ చైనా పౌరులకు ఇద్దరు మలేసియన్లు సహకరించారని అమెరికా డెప్యూటీ అటార్నీ జనరల్ జెఫ్రీ రోజెన్ బుధవారం వెల్లడించారు. ‘భారత ప్రభుత్వానికి చెందిన ఓపెన్ వీపీఎన్ నెట్‌వర్క్‌తో అనుసంధానమయ్యేందుకు వారు వీపీఎస్ ప్రొవైడర్ సర్వర్లను ఉపయోగించుకున్నారు. భారత ప్రభుత్వ కంప్యూటర్లలో కోబాల్ట్ స్ట్రైక్ మాల్వేర్ను ఇన్స్టాల్ చేశారు’ అని డెప్యూటీ అటార్నీ జనరల్ జెఫ్రీ వివరించారు. -
చైనా నుంచి చొరబాట్లు లేవు
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల నుంచి గత ఆరునెలల్లో ఎలాంటి చొరబాట్లు లేవని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో పాక్ సరిహద్దుల నుంచి 47 చొరబాటు యత్నాలు చోటు చేసుకున్నాయని బుధవారం రాజ్యసభకు తెలిపింది. గత మూడేళ్లలో పాక్ నుంచి కశ్మీర్లోకి జరిగిన చొరబాటు యత్నాల సంఖ్య 594 అని, వాటిలో 312 విజయవంతమయ్యాయని వెల్లడించింది. మూడేళ్లలో అక్కడ 582 మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయని హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆరు నెలలుగా చైనా సరిహద్దుల్లో ఎలాంటి చొరబాట్లు లేవని ప్రభుత్వం ప్రకటించడంపై కాంగ్రెస్ మండిపడింది. ఆ ప్రకటన గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో ప్రాణాలర్పించిన వీర జవాన్లను అవమానించడమేనని పేర్కొంది. చైనా దురాక్రమణపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి చేసిన వేర్వేరు ప్రకటనలను వరుసగా ప్రస్తావిస్తూ.. ‘మోదీ ప్రభుత్వం మన సైనికుల పక్షాన ఉందా? లేక చైనా వైపు ఉందా?’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నేడు రాజ్‌నాథ్ ప్రకటన తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై నేడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ రాజ్యసభలో ప్రకటన చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజ్‌నాథ్ ప్రకటన అనంతరం, విపక్ష సభ్యులను మాట్లాడే అవకాశం ఇస్తారని, ఆ తరువాత అవసరమైతే, రాజ్‌నాథ్ సభ్యుల అనుమానాలకు వివరణ ఇస్తారని వెల్లడించాయి. రాష్ట్రపతి, ప్రధాని కూడా.. చైనా టెక్నాలజీ కంపెనీ డేటా చౌర్యం అంశాన్ని బుధవారం కాంగ్రెస్ పార్లమెంట్ ఉభయసభల్లో లేవనెత్తింది. దాదాపు 10 వేల మంది ప్రముఖుల సమాచారంపై నిఘా వేశారన్న వార్త ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో, చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న షెంజెన్ కేంద్రంగా ఉన్న ఒక టెక్నాలజీ కంపెనీ 10 వేల మంది భారతీయ ప్రముఖుల డిజిటల్ డేటాను ట్రాక్ చేస్తోందని పత్రికల్లో కథనం వచ్చిందని కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ వివరించారు. ఆ ప్రముఖుల్లో భారత రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, ఆర్మీ చీఫ్, ముఖ్యమంత్రులు ఉండడం షాక్‌కు గురిచేస్తోందన్నారు. డేటా చౌర్యంపై నిపుణుల కమిటీ భారత్‌లోని దాదాపు 10 వేల మంది ప్రముఖులపై చైనా టెక్నాలజీ సంస్థ నిఘాపెట్టి డేటా చౌర్యం చేస్తోందన్న ఆరోపణలపై కేంద్రం ఒక నిపుణుల కమిటీని నియమించింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్ నేతృత్వంలో ఈ కమిటీ ఈ ఆరోపణల్లోని నిజానిజాలను నిర్ధారిస్తుంది. -
చైనా వక్రబుద్ధి; భారత ప్రముఖులపై నిఘా!
సాక్షి, న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతలు రోజురోజుకు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌పై గూఢచర్య కుట్రలకు చైనా పాల్పడుతున్నట్టు వెల్లడైంది. షెన్జెన్ ఆధారిత టెక్నాలజీ సంస్థ ‘జెన్హువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కో లిమిటెడ్ సంస్థ’ చైనా ప్రభుత్వం, కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు కలిగి ఉంది. ఈ సంస్థ భారతదేశంలోని 10,000 మందికి పైగా సంస్థలపై ఒక కన్నేసి వుంచిన్నట్లు తెలుస్తోంది. 'హైబ్రిడ్ వార్ఫేర్', 'చైనా దేశ గొప్ప పునరుజ్జీవనం' కోసం పెద్ద డేటాను ఉపయోగిస్తున్నట్లు తనని తాను అభివర్ణించుకుంది. 1400 భారతీయ కంపెనీలు జెన్హువా డేటాబేస్‌లో ఉన్నాయి. ఈ సంస్థ ట్రాక్ చేస్తున్న వారిలో ప్రముఖ కంపెనీలు నైకా, ఉబెర్ ఇండియా, పేయు, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, స్విగ్గి సంస్థల అధినేతలు, వ్యవస్థాపకులు ఉన్నారు. భారతదేశంలో జరుగుతున్న అనేక చెల్లింపు, విద్య, డెలివరీ అనువర్తనాలు కూడా చైనా పర్యవేక్షణలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అనేక మంచి స్టార్టప్‌లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలు కూడా చైనా పరిశీలనలో ఉన్నట్టు వెల్లడైంది. డెలివరీ యాప్‌లు బిగ్‌బాస్కెట్, డైలీ బజార్, జాప్‌ఫ్రెష్, ఫ్రెష్ మీట్ మార్కెట్, జోమాటో, స్విగ్గి, ఫుడ్‌పాండా, ఆన్లైన్ మాంసం డెలివరీ ప్లాట్‌ఫాంలను కూడా చైనా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఇతర కేంద్రమంత్రులు, ప్రముఖ సంస్థల సీఈఓలు, సీఎఫ్ఓల కదలికలపై చైనా కంపెనీ కన్నేసినట్టు అర్థమవుతోంది. చదవండి: నవంబర్ నాటికి చైనా వ్యాక్సిన్ -
భారత్‌పై చైనా మరో మహా కుట్ర
-
చైనా దొంగదెబ్బ : భారత్‌పై మరో కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ : గత రెండు నెలలుగా భారత్ సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న పొరుగు దేశం చైనా తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది. సరిహద్దుల్లో భారత సైనిక శౌర్యాన్ని ఎదిరించలేని డ్రాగాన్ దొంగదెబ్బ తీసేందుకు కుట్రపన్నింది. ఓ వైపు ఇరుదేశాల సరిహద్దుల నడుమ ఉద్రిక్త పరిస్ధితులు ఉన్న తరుణంలోనే దేశంలోని ప్రముఖ నేతలపై రహస్యంగా నిఘా పెట్టి సాంకేతిక యుద్ధానికి తెరరేపింది. దేశంలోని 10వేల మంది ప్రముఖలు, భారత్‌కు చెందిన కీలక సంస్థలపై చైనా గూడాచార విభాగం నిఘా పెట్టింది. ఈ మేరకు ఓ జాతీయ పత్రిక సోమవారం సంచలన కథనాన్ని ప్రచురించింది. (చైనా చిత్తశుద్ధి ప్రదర్శించాలి) నిఘా సంస్థలతో చైనా ఒప్పందం వివరాల ప్రకారం.. భారత్‌ను దొంగ దెబ్బ తీసేందుకు జిత్తుల మారి చైనా మరోసారి బరితెగించింది. సరిహద్దుల్లో తన కుట్రలు విచ్చిన్నం కావడంతో ఏకంగా దేశ నేతలు, ప్రముఖలపై నిఘా పెట్టింది. చైనా నిఘా నీడలో భారత రాష్ట్రపతి, ప్రధాని, అన్ని రాష్ట్రాల సీఎంలతో పాటు అన్ని రాష్ట్రాల మంత్రులు, మాజీ సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు ఉన్నట్లు జాతీయ పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. చైనాకు చెందిన షేక్‌జేన్ అనే గూఢాచర సంస్థతో ఆ దేశ నిఘా విభాగం ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా భారత్‌కు చెందిన ప్రముఖుల సమాచారాన్ని తస్కరించేందుకు మరికొన్ని రహస్య కంపెనీలతో చైనా నిఘా సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. (భారత్‌తో కయ్యం చైనా పన్నాగమే) మోదీ.. సోనియాలపై నిఘా భారత్‌లోని ప్రముఖ రాజకీయ, సినీ, వ్యాపార, పారిశ్రామిక, మీడియా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సాంకేతికరంగంలోని ముఖ్యల వివరాలను సేకరించే పనిలో రసహ్య కంపెనీలు ఇప్పటికే బిజీగా ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు ఆర్మీ అధికారుల సమాచారాన్ని సైతం తెలుసుకునే విధంగా చైనా ఓ ప్రత్యేక విభాగాన్ని తయారుచేసిందని ఆ పత్రిక స్పష్టం చేసింది. సరిహద్దుల్లో సైనిక కార్యకలాపాలతో మొదలు దేశ రహస్యాలనే చేరవేసేందుకు కుట్రలు పన్నినట్లు పేర్కొంది. ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సోనియా, రాహుల్ గాంధీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జై శంకర్ల డేటాను చోరీ చేయాలని డ్రాగన్ వ్యూహరచన చేసినట్లు వెల్లడించింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన కథనం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తరుణంలోనే చైనా కుట్ర బయటపడటం కలకలం రేపుతోంది. చైనా దురాగతాలు, సరిహద్దుల్లో ఆక్రమణలపై పార్లమెంట్లో చర్చించాలని ఇదివరకే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ చైనా తీరు మార్చుకోకపోవడంతో భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిఘా ఎలా? చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని షెన్జెన్లోని టెక్నాలజీ కంపెనీ షెన్హువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ ద్వారా భారత ప్రముఖులపై రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తోందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది. ప్రముఖుల డేటాపై నిఘా ఉంచడానికి ప్రత్యేకంగా ఓవర్సీస్ కీ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ (ఓకేఐడీబీ) ఆ సంస్థ అభివృద్ధి చేసినట్లు తెలిపింది. షెన్హువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీకు చైనా కమ్యూనిస్టు పార్టీ, ఆ దేశ ప్రభుత్వంతో నేరుగా సత్ససంబంధాలు ఉన్నట్లు వెల్లడించింది. దీనిపై ఆరా తీయడానికి బిగ్ డేటా టూల్స్‌ను వినియోగించి రెండు నెలల పాటు ఇన్వెస్టిగేట్ చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. -
యాప్స్ బ్యాన్: డేటా చోరి ఆగుతుందా?
సాక్షి, న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చెలరేగిన అలజడి, భారతీయ యూజర్ల ప్రైవసీ, భద్రతను దృష్టిలో పెట్టుకుని భారత్, చైనాకు చెందిన 59 యాప్స్‌పై నిషేధం విధించింది. ఈ యాప్స్‌ను తయారుచేసిన డెవలపర్స్‌కు అందరికీ చైనా ప్రభుత్వంతో సంబంధాలున్నాయి. కానీ, ఇక్కడితో చైనా ముప్పు తొలగిపోలేదు. అనుమానిత లిస్టులో లేని వాటి నుంచి భద్రతాపరమైన ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ‘బ్లోట్‌వేర్’ప్రథమ స్థానంలో నిలుస్తుంది.(వెనుదిరిగేందుకు ఇంకొంతకాలం) బ్లోట్‌వేర్ కొన్ని మొబైల్ ఫోన్లలో ముందుగానే ఇన్స్టాల్ చేసి ఇచ్చే యాప్స్ సిస్టంను బ్లోట్‌వేర్ అంటారు. వీటిని తీసేయడం కానీ, అన్ఇన్స్టాల్ కానీ, డిజేబుల్ కానీ చేయలేం. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. ఈ యాప్స్‌ను రెవెన్యూ కోసం మొబైల్ తయారుచేసే సంస్థలు ఇన్స్టాల్ చేస్తాయి. కొన్ని కంపెనీలు తక్కువ ధరకే ఫోన్లు అమ్ముతూ, థర్డ్ పార్టీ యాప్స్‌ను వాటిలో ఇన్స్టాల్ చేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. చాలా చైనా కంపెనీలు మొబైల్స్ ఇలానే చేస్తున్నాయి. షావోమి ఇందుకు ఓ చక్కని ఉదాహరణ. 2018లో ఈ కంపెనీ తన ఆదాయంలో 9.1 శాతాన్ని మొబైల్స్‌లో ప్రీ ఇన్స్టాల్ చేసిన యాప్స్, సర్వీసుల ద్వారా రాబట్టింది. శాంసంగ్ తదితర కంపెనీలు కూడా ఇలాంటి బిజినెస్ మోడల్‌ను అనుసరించాయి. అయితే, తక్కువ ధర కలిగిన మొబైల్స్‌లో మాత్రమే ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్‌ను ఉంచుతున్నాయి. కొంపముంచుతున్న తక్కువ ధర! అతి తక్కువ ధరకే ఫోన్లు వస్తున్నాయని కొనేస్తున్న వినియోగదారులు మరో రూపంలో మూల్యం చెల్లించుకుంటున్నారు. ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఫోన్లోని స్పేస్‌ను, బ్యాటరీని తినేయడం ఒక ఎత్తైతే, సెక్యూరిటీ పరంగా ఈ యాప్స్ చాలా డేంజర్. ఇవి నిరంతరం యూజర్ డేటాను ఊహించని రీతిలో కలెక్ట్ చేస్తున్నాయి. ఫలితంగా వినియోగదారుడి సమాచారాన్ని మిస్ యూజ్ చేసేందుకు ఆస్కారం ఏర్పడుతోంది.(వాణజ్య శాఖతో పీఎంఓ సంప్రదింపులు) ఈ సమస్యపై పాలసీల్లోగానీ, అకడమిక్ సర్కిల్స్‌లో గానీ పెద్దగా పట్టింపులేకపోవడం ఆశ్చర్యం. ఐఎమ్డీఈఏ నెట్వర్క్స్ ఇనిస్టిట్యూట్‌లో‘ప్రీ ఇన్స్టాల్డ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్’పై పబ్లిష్ అయిన ఓ రీసెర్చ్ పేపర్ ప్రీ ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్లతో వచ్చే పెద్ద చిక్కులను వెలుగులోకి తెచ్చింది. ఏ డేటాను సేకరిస్తున్నాయి? ప్రీఇన్స్టాల్డ్ యాప్స్‌కు మరే ఇతర యాప్స్‌కు లేని ఫీచర్స్‌ను యాక్సెస్ చేసే అనుమతి ఉంటుంది. దీనివల్ల యాప్స్‌ను ఇన్స్టాల్ చేసి ఇచ్చిన వారు ఎప్పుడైనా వీటి ద్వారా యూజర్లకు చెందిన సున్నితమైన సమాచారాన్ని చూడగలిగే అవకాశం ఉంటుందని రీసెర్చ్ పేపర్ వెల్లడించింది. వీటిలో లొకేషన్, మిగతా యాప్స్ సమాచారం, పర్సనల్ విషయాలు తదితరాలు ఉంటాయని తెలిపింది. కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్‌ను రూట్నిక్ అనే థర్డ్ పార్టీ లైబ్రరీతో జతపరిచి ఉంచుతున్నారని, ఫలితంగా యూజర్ల సమాచారం తస్కరణకు గురవుతుందని చెప్పింది. ప్రీ–ఇన్స్టాల్డ్ యాప్స్‌ను ఆపేదెలా? సరైన డేటా ప్రొటెక్షన్ చట్టం లేకపోవడం వల్లే యాప్స్‌ను రెగ్యులేట్ చేయలేకపోతున్నామని రీసెర్చ్ పేపర్ తెలిపింది. మొబైల్ తయారీ కంపెనీలు రకరకాల చిన్న సంస్థలతో కూడి పని చేస్తుండటం వల్ల ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్‌ను ఎవరు తయారు చేస్తున్నారన్న విషయాన్ని కనిపెట్టడం కష్టతరం అవుతోందని చెప్పింది. దక్షిణ కొరియా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్‌ను నిషేధించినట్లు వివరించింది. ఈ మేరకు తయారీదారులకు ఆంక్షలు పెట్టిందని వెల్లడించింది. దీని వల్ల ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్‌ను డిలీట్ చేసుకునే వెసులుబాటు వినియోగదారుడికి కలుగుతుంది. వైఫై కనెక్టవిటీ, ఎన్ఎఫ్సీ, కస్టమర్ సర్వీసు యాప్, ప్లే స్టోర్లను మాత్రమే డిలీట్ ఆప్షన్ లేకుండా రిలీజ్ చేసేందుకు అంగీకారం తెలిపింది. చైనా కూడా దక్షిణ కొరియా బాటలోనే నడుస్తోంది. అమెరికా, యూరప్‌లలో మాత్రం ఇలాంటి రూల్స్ ఏవీ లేవు. కానీ వాటికి బలమైన డేటా ప్రొటెక్షన్ చట్టాలు ఉన్నాయి. ఇండియా ఏం చేయాలి? ఇండియాలో ప్రస్తుతం ఎలాంటి డేటా ప్రొటెక్షన్ చట్టాలు లేవు. ఫలితంగా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ వల్ల భారతీయులకు పెనుప్రమాదం పొంచి ఉంది. దక్షిణ కొరియాను పోలిన చర్యలు మన దేశంలోనూ అమల్లోకి తేవాలి. మొబైల్ యాప్స్ పనితీరుపై అవగాహన తక్కువగా ఉన్న సగటు భారతీయుడికి డిలీట్ ఆప్షన్ సరిపోదు. అందుకే యూజర్ల నుంచి ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తున్నారు, దాన్ని ఎవరెవరితో పంచుకుంటున్నారన్న దానిపై మొబైల్ తయారీదారుల నుంచి సమాచారం రాబట్టాలి. దీని వల్ల ఏయే యాప్స్‌ను వాడాలన్న దానిపై వినియోగదారులకు అవగాహన కలుగుతుంది. -
వ్యక్తిగత గోప్యతకు గట్టి చర్యలు
న్యూఢిల్లీ: పౌరుల వ్యక్తిగత గోప్యతను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్న భారత్ ప్రభుత్వ వైఖరికి కట్టుబడి ఉన్నట్లు సామాజిక మాధ్యమం వాట్సాప్ తెలిపింది. ఈ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వివరించింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ ఎన్‌ఎన్‌వో గ్రూప్ తయారు చేసిన పెగాసస్ స్పైవేర్‌తో భారత్‌లోని జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల సమాచారాన్ని గుర్తు తెలియని సంస్థలు తస్కరించాయంటూ వాట్సాప్ చేసిన ప్రకటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్రం.. ఈ వ్యవహారంతోపాటు, పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతకు తీసుకున్న చర్యలపై 4లోగా వివరణ ఇవ్వాలని వాట్సాప్‌ను ఆదేశించింది. దీనిపై వాట్సాప్ ప్రతినిధి స్పందిస్తూ...‘పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతను పరిరక్షించాల్సి ఉందన్న భారత ప్రభుత్వ ప్రకటనతో ఏకీభవిస్తున్నాం. సైబర్ దాడులపై గట్టి చర్యలు తీసుకుంటున్నాం. యూజర్ల సమాచార పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం’అని తెలిపారు. అయితే, ఇటీవల పలుమార్లు జరిగిన చర్చల సందర్భంగా ఫోన్ హ్యాకింగ్ విషయాన్ని వాట్సాప్ వెల్లడించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకుంటున్న చర్యలను మూడు నెలల్లోగా వివరించాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరిన నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హమన్నారు. -
‘వాట్సాప్’లో ‘గూఢాచోరులు’ ఎవరు?
న్యూఢిల్లీ : దేశంలోని 17 మంది మానవ హక్కుల కార్యకర్తలు, దళిత కార్యకర్తలు, జర్నలిస్టుల ‘వాట్సాప్’ ఖాతాలపై ఇజ్రాయెల్‌లోని ‘ఎన్ఎస్ఓ’ టెక్నాలజీ సంస్థ నుంచి కొనుగోలు చేసిన ‘పెగాసస్’ సాఫ్ట్‌వేర్‌తో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిఘా కొనసాగిస్తున్నారనే విషయం గురువారం వెలుగులోకి రావడం అన్ని వర్గాల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒక్క వాట్సాప్ సందేశాలను మాత్రమే తస్కరించడం లేదు. వాట్సాప్ ఫోన్ కాల్స్‌ను వింటున్నారు. రికార్డు చేస్తున్నారు. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌కున్న శక్తి సామర్థ్యాల ప్రకారం ఫోన్లోని పాస్‌వర్డ్‌లను, ఫొటోలను, వీడియోలను కూడా తస్కరించవచ్చు. కేవలం పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే కాకుండా, డిజిటల్ చెల్లింపుల యుగంలో పౌరులను ఆర్థికంగా కొల్లగొట్టేందుకు, ఇతర విపరీత పరిణామాలకు దారితీయగల ఈ ‘గూఢచర్య’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్న ముసుగు దొంగలు ఎవరు? డేటా భద్రత వైఫల్యంపై ఆందోళన చెందుతున్నామని, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కేంద్రానికి అందజేయాల్సిందిగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ‘వాట్సాప్’ యాజమాన్యాన్ని కోరారు. ఆయన మాటలకు అర్థం కేంద్ర ప్రభుత్వానికిగానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలకుగానీ సంబంధం లేదని చెప్పడం. మరి పౌరులపై నిఘా కొనసాగించాల్సిన అవసరం ఎవరికుంది? ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరానికి సమీపంలో 2010లో ఏర్పాటయిన ఈ ఎన్ఎస్ఓ సంస్థ పెగాసస్ అనే ‘స్పైవేర్’ను తానే విక్రయించినట్లు ఒప్పుకుంది. అయితే ఎవరికన్నది స్పష్టంగా చెప్పకపోయినా తాను ప్రభుత్వ సంస్థలకు తప్ప మరెవరికీ ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ను విక్రయించడం లేదని చెప్పింది. ఆ సంస్థ 2016 నిర్ణయించిన ధరల పట్టిక ప్రకారం పది మంది యూజర్ల డేటాపై నిఘా కోసం పెగాసస్ సాఫ్ట్వేర్ ధరను ఒక మిలియన్ డాలర్లు. ఆ నిఘాను మరో పది మందికి పెంచాలంటే మరో రేటును చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వైరస్లాగా ఇది నెట్వర్క్ అంతటికి వ్యాపించకుండా కంపెనీ జాగ్రత్తలు తీసుకుంది. మిస్సిడ్ కాల్ ద్వారా వాట్సాప్‌లోకి స్పైవేర్ ప్రవేశిస్తుంది. పది మందిపై నిఘాకే దాదాపు ఏడు కోట్ల రూపాయలను వెచ్చించి ప్రైవేటు వ్యక్తులు ఎవరు కొనుగోలు చేస్తారు? ఎన్ఎస్ఓ ప్రకారం ప్రభుత్వ సంస్థ అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలోని సీబీఐ, లేదా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని నేర పరిశోధనా సంస్థనో అయ్యి ఉండాలి. నిఘా నీడలో మానవ హక్కుల కార్యకర్త బేలా బాటియా, బీబీసీ మాజీ జర్నలిస్ట్ సుభ్రాన్షు చౌధరి తదితరులు సామాజిక నేపథ్యం చూస్తే ఎవరు నిఘా వహించారో, ఆ గూఢాచోరులు ఎవరు ఇట్టే తెలిసిపోతుంది. (చదవండి: వాట్సాప్ డేటాపై ‘పెగాసస్’ గురి) -
వాట్సాప్ డేటాపై ‘పెగాసస్’ గురి
న్యూఢిల్లీ: వాట్సాప్‌లో భారత్‌కు చెందిన జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని ‘పెగాసస్’అనే స్పైవేర్ సాయంతో గుర్తు తెలియని సంస్థలు దొంగిలించాయంటూ గురువారం వాట్సాప్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 1,400 మందిని లక్ష్యంగా చేసుకుని సమాచార చోరీ జరిగినట్లు గుర్తించింది. ఇందుకు సంబంధించి ఎన్ఎస్వో కంపెనీపై అమెరికాలో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంతోపాటు, భారతీయ యూజర్ల వ్యక్తిగత సమాచార గోప్యతకు తీసుకుంటున్న చర్యలను ఈ నెల 4లోగా వివరణ ఇవ్వాలని వాట్సాప్‌ను కేంద్రం ఆదేశించింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో అనే నిఘా సంస్థ ‘పెగాసస్’ స్పైవేర్‌ను గుర్తు తెలియని సంస్థలకు అప్పగించిందని, దీని సాయంతో నాలుగు ఖండాల్లోని సుమారు 1,400 మంది దౌత్యాధికారులు, రాజకీయ అసమ్మతివాదులు, జర్నలిస్టులు ప్రభుత్వ ఉన్నతాధికారులకు చెందిన ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం చోరీ అయిందని వాట్సాప్ తెలిపింది. భారత్‌లో బాధితుల వివరాలు తెలిపేందుకు నిరాకరించింది. దీనిపై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఎన్ఎస్వో గ్రూప్‌పై వాట్సప్ కేసు వేసింది. హక్కుల లాయర్ నిహాల్ సింగ్ రాథోడ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్యకర్త షాలిని గెరా, బీబీసీ మాజీ జర్నలిస్టు సుభ్రాన్షు చౌధరి తదితరులు బాధితులమంటూ ప్రకటించారు. ఉగ్రవాదం నేరాలపై పోరాడేందుకు గుర్తింపు పొందిన ప్రభుత్వ నిఘా సంస్థలకే ఈ సాంకేతికతను అందజేస్తున్నట్లు ఎన్ఎస్వో సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల వాట్సాప్ వినియోగదారుల్లో భారత్‌లో 40 కోట్ల మంది ఉన్నారు. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలను నేరస్తులుగా అనుమానిస్తూ మోదీ ప్రభుత్వం చేపట్టిన గూఢచర్యం తేటతెల్లమయిందని, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్నే బాధ్యునిగా చేయాలని కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును కోరింది. -
సైబర్ మోసాలపై టెకీల పోరు
బెంగళూరు: సైబర్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టెక్నాలజీ సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ట్రావెల్ సేవల సంస్థలు మేక్మైట్రిప్ గ్రూప్, ఓయో హోటల్స్ అండ్ హోమ్స్.. మొబైల్ చెల్లింపుల సంస్థ పేటీఎం, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటోలతో పాటు ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ మొదలైనవి ఇందుకోసం జట్టు కట్టాయి. సైబర్ మోసాల తీరుతెన్నులు, నివారణ తీసుకోతగిన చర్యలపై చర్చించేందుకు ఈ సంస్థలు గతవారం రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కూడా సమావేశమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోసపూరిత టోల్ ఫ్రీ నంబర్లు మొదలైన మార్గాల్లో మోసాలు జరుగుతున్న తీరును అవి వివరించినట్లు పేర్కొన్నాయి. అమాయక కస్టమర్లను మోసగించేందుకు ఉపయోగిస్తున్న 4,000 పైచిలుకు సిమ్ కార్డు నంబర్లు, 350–400 దాకా బ్యాంకు ఖాతాల వివరాలను రిజర్వ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో పాటు టెలికం కంపెనీలకు కూడా అందించినట్లు వివరించాయి. అటు నకిలీ టోల్ ఫ్రీ నంబర్లు పేజీలో ప్రముఖంగా పైన కనిపించే విధంగా నేరగాళ్లు ఏ విధంగా సెర్చి ఇంజిన్‌ను దుర్వినియోగం చేస్తున్నదీ టెక్ దిగ్గజం గూగుల్‌కు కూడా ఆయా టెక్ దిగ్గజాలు తెలియజేశాయి. సాధారణంగా ఇలా సెర్చి ఇంజిన్ పేజీలో పైన ప్రముఖంగా కనిపించే నకిలీ టోల్ ఫ్రీ నంబర్లను వినియోగదారులు అసలైనవిగా భావించి.. మోసాల బారిన పడుతున్న ఉదంతాలు అనేకం నమోదవుతున్నాయి. ఎస్బీఐకు లేఖ.. గత కొద్ది వారాలుగా ఈ ఇంటర్నెట్ కంపెనీలు.. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో పాటు టెలికం రంగానికి చెందిన ఎయిర్టెల్ తదితర సంస్థలతో కూడా సమావేశాలు జరుపుతున్నాయి. ప్రభుత్వ రంగంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా ఆన్లైన్ కంపెనీలు లేఖ రాశాయి. ఎస్బీఐ ఖాతాలను ఉపయోగించి భారీ స్థాయిలో జరుగుతున్న సైబర్ మోసాల గురించి తెలియజేశాయి. అమాయక ఖాతాదారులను మోసగించేందుకు.. కీలకమైన వారి అకౌంట్ల వివరాలను తెలుసుకునే నేరగాళ్లు చాలామటుకు ఎస్బీఐ ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు వివరిం చాయి. ఎస్బీఐ భారీ బ్యాంకు కావడంతో ఇలాంటి వారిని పట్టుకోవడం కష్టతరం కావొచ్చని టెక్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ మోసాలను అరికట్టడానికి తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చాయి. రాబోయే రోజుల్లో మరిన్ని టెక్ కంపెనీలు ఈ సంస్థలతో జట్టు కట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోసాలు ఇలా.. ఎక్కువగా పట్టణేతర ప్రాంతాల వారు, సీనియర్ సిటిజన్లు ఇలాంటి సైబర్ నేరాల బారిన పడుతున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఖాతాగా భ్రమింపచేసే అకౌంటు నుంచి ఎస్ఎంఎస్లు పంపించడం ద్వారా నేరగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. సిసలైన కంపెనీగా కనిపించినప్పటికీ.. ఇలాంటి పోర్టల్ పేర్లలో ఎక్కడో ఒకటో అరా తేడాలుంటున్నాయి. ఉదాహరణకు.. మేక్‌మై ట్రిప్ పోర్టల్ వంటి పోర్టల్స్ పేర్లలో నకిలీ సైట్లు అదనంగా మరో అక్షరం చేరుస్తున్నాయి. ఆకర్షణీయ బహుమతుల ఆఫర్లతో తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇలాంటి మెసేజ్‌లను వినియోగదారులు పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో ఆయా లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా మోసాల బారిన పడుతున్నారు. -
యాపిల్ ఛార్జింగ్ కేబుల్‌తో డాటా చోరీ..!
సాన్‌ఫ్రాన్సిస్కో: ఈ వార్త చదివాక ఇక మీదట వేరే వారికి డాటా కేబుల్ ఇవ్వాలన్నా.. తీసుకోవాలన్నా కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే.. చార్జింగ్ కేబుల్స్ కూడా డాటాను చోరీ చేస్తున్నాయట. నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం అంటున్నాడో హ్యాకర్. ఇప్పటికే అవసరం నిమిత్తం కొన్ని.. అలవాటుగా కొన్ని యాప్స్‌ని మొబైల్స్‌లో ఇన్స్టాల్ చేసుకుని.. మన వ్యక్తిగత సమాచారాన్ని మూడో వ్యక్తికి అందజేస్తున్నాం. చార్జింగ్ కేబుల్ కూడా ఇదే పని చేస్తుందంటున్నాడు సదరు హ్యాకర్. చెప్పడమే కాక స్వయంగా నిరూపించాడు కూడా. యాపిల్ యూఎస్బీ కేబుల్‌తో ఇలాంటి ప్రమాదం ఉందని హెచ్చరించాడు. దీని గురించి సదరు హ్యాకర్ వివరిస్తూ.. ‘ఈ కాలంలో చాలా మంది ఫ్లాష్ డ్రైవర్స్‌ని వారి డివైజ్‌కి కనెక్ట్ చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. అదే చార్జింగ్ కేబుల్ దగ్గరకు వచ్చే సరికి ఇలాంటి అనుమానాలేవి కలగవు. కానీ చార్జింగ్ కేబుల్ కూడా మీ డాటాను చోరీ చేస్తుంది. ఓ.ఎంజీ కేబుల్‌గా పిలవబడే యాపిల్ యూఎస్బీ లైటెనింగ్ కేబుల్ చూడ్డానికి సాధరణ చార్జింగ్ కేబుల్‌లానే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఈ కేబుల్‌ని మీ డివైజ్‌కు కనెక్ట్ చేశారనుకోండి. వితిన్ వైఫై రేంజ్లో హ్యాకర్ మీకు తెలియకుండా మీ డివైస్‌లోకి హానికరమైన పేలోడ్స్‌ని వైర్‌లెస్‌గా పంపించగల్గుతాడు’ అని వివరించాడు. ‘ఈ చార్జింగ్ కేబుల్‌లో ఉండే కమాండ్స్, స్క్రిప్ట్స్, పేలోడ్స్‌ను ఉపయోగిస్తూ.. హ్యాకర్ మీ వ్యక్తిగత డాటాను చోరీ చేస్తాడు. అంతేకాదు ఒకసారి ఈ కేబుల్‌ను మీ సిస్టంకు కనెక్ట్ చేశారంటే.. అటాకర్ ఆటోమెటిగ్గా మీ కంప్యూటర్ను లాగాఫ్ చేయడం.. ఆ తర్వాత మీరు ఎంటర్ చేసే పాస్‌వర్డ్‌ను కూడా తస్కరించడానికి అవకాశం ఉంది’ అంటున్నాడు సదరు హ్యాకర్. మరి దీనిపై యాపిల్ సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.